వర్తమానసాహిత్యం విమర్శను కోరుకోవడం లేదు. సద్విమర్శను మాత్రమే కోరుకుంటున్నది. అందుకే తెలుగుసాహిత్యం విమర్శలో బలహీనమైందని బలంగా నమ్ముతున్నాను. ఏ పుస్తకమొచ్చినా అందులో వస్తువైఫల్యం, శిల్పవైఫల్యం లేదా ఇతర నిర్మాణపద్దతులు లోపించినపుడు విమర్శకులు ఇలా ఉంటే బాగుండేదని చెబితే సదరు కవులు ఓర్చుకునే స్థితిలోలేరు. ఇది తిరోగమనదిశకు సంకేతం. మన ద్రావిడ భాషలైన తమిళ,కన్నడ, మళయాళ కవులు విమర్శకు అత్యంత ప్రాధాన్యతనిస్తారు. తమ పుస్తకం గూర్చి పొగడటం కంటే నాల్గు విమర్శనాత్మక సూచనలు చేస్తారని ఆశతో ఎదురు చూస్తారు. ఇలాంటి వైఖరి తెలుగు కవులలోనూ, వారు సృష్టించే సాహిత్యంలోనూ వృద్ది చెందాలి. పైన చెప్పినట్లు జ్ఞానవిశ్లేషణ చేసే ప్రక్రియగా ఎందుకు చూడడం లేదనేదే అసలు ప్రశ్న. సమాజానికి అవసరమైన సాహిత్యాన్ని సృష్టించే రచయితల్లో విమర్శకుడు దాగివుంటాడు. అది సాహిత్యరంగంలో ఉన్న ప్రతివొక్కరూ గ్రహించాల్సిందే. ఈ నేపథ్యంలోనే ఒక విలువైన విమర్శగ్రంథం ఇప్పుడు మీ చేతుల్లో వుంది. సమకాలీన సాహిత్యంలో వస్తున్న విభిన్న సాహిత్య ప్రక్రియలపై రాసిన విమర్శవ్యాసాల సంకలనం ఈ అక్షరకాంతులు. సాహిత్యంలో కవిత్వం, కథ, నవల, విమర్శ ఈ నాల్గు ప్రక్రియను తడిమి తడిమి చూసే పుస్తకమిది. మనకిది చిన్నగ్రంథమని అనిపించినా ఇందులోని వ్యాసాల్లో విమర్శకులు జంధ్యాల రఘుబాబు సైద్దాంతిక చర్చచేశారు
ఈపుస్తక రచయిత గూర్చి చెప్పాలంటే కవిగా, కథకులుగా, విమర్శకులుగా, కాలమిస్ట్‌గా, అనువాదకులుగా తెలుగుసాహిత్యంలో విశేషకృషిచేస్తున్న లబ్దప్రతిష్టులు. తెలుగు సాహిత్యానికి వైవిధ్యమైన కవిత్వాన్ని, మానవీయకోణాన్ని స్పృశించే కథల్ని, గుండెలదిరేలా ప్రకంపనాలను కలిగించే ప్రజాచైతన్యానికి పునాదులు వేసే పాటల్ని అందిస్తున్న సాహితీవేత్త. ఆహ్లదపరిచే హాస్యచతురత వ్యాసాలు రాసినా, అంతర్జాతీయస్థాయి ఉద్యమకారుల జీవితాల్ని తెలుగు సాహిత్యానికి అనువాదాలుగా పరిచయం చేసినా, తనకలంతో ఏ సాహిత్య ప్రక్రియ పురుడుబోసినా నిప్పుకణికల్లాంటి వాక్యాల్ని అందించడంలో ఎప్పుడూ విఫలమవ్వలేదు. ఈ పుస్తకంలో సాహిత్య ప్రక్రియలైన కవిత్వం,కథ, నవల, విమర్శకు సంబంధించి లోతైన, పదునైన విమర్శచేయడంలో సఫలమయ్యారు. అనేక నిర్మాణసూత్రాలేకాక, సైద్దాంతిక చర్చనూ చేసే ప్రయత్నం చేశారు. వొకరకంగా ఇది సాహిత్యానికి శస్త్రచికిత్సలాంటి గ్రంథమిది.
ఇందులో కేంద్రసాహిత్య అకాడమీపురస్కార గ్రహీత మధురాంతకం నరేంద్ర మనోధర్మపరాగం, ఐదుగురు లోఫర్లు, నవలలపై విమర్శ అనడం కంటే లోతైన చర్చ అనవచ్చు. కవిత్వం విషయానికొస్తే చందలూరి నారాయణరావు మనిషి గుర్తుల్ని బతికించుకుందాం, ఆవుల వెంకటేశ్వర్లు మానని గాయం, చిన్ని నారాయణరావు దాహం దాహం, కెంగార మోహన్ సముద్రమంత..,శ్రీరామ కవచం అవస్థ, శాంతి కోరే కవిత స్వరూప్ సిన్హా, బిడ్డా ఎప్పుడొస్తవ్`మహమ్మద్ హుసేన్, చౌశా ఎవరు ద్రోహి, వికసిత దళితం `కల్లూరి ఆనందరావు, మహాకవి గుఱ్ఱం జాషువా తదితరుల కవిత్వం పై వ్యాసాలున్నాయి. నానీల గూర్చి నానీల తీరాన-ఎన్.లహరి, నానీల సింగడి`కసిరెడ్డి నానీల వ్యాసాలున్నాయి. కథాసంపుటాలు స్వరూప్ సిన్హా`కథ, డా.హరికిషన్ టీచర్ కథలు, గాండ్లమిట్ట కథలు`ఆర్సి కృష్ణస్వామి రాజులపై వ్యాసాలున్నాయి. డా.మండి అన్వర్ హుసేన్ మొహరంపై రాసిన పుస్తకంపై డా.తొగటసురేష్ బాబు అల్లూరి సీతారామరాజుపై రాసిన చరిత్రపుస్తకంపై వ్యాసాలున్నాయి .కవి చందలూరి నారాయణరావు బాపట్ల జిల్లా నుంచి రాసే ప్రగతిశీలకవి. ‘మనిషి గుర్తుల్ని బతికించుకుందాం’ అంటూ రాసిన ఆయన కవిత్వాన్ని లోతుగా తడుముతూనే కవి భావజాలాన్ని కూడా చెబుతారు. నిజమే వొకకవిత్వం చదువుతుంటే ఈ కవి ఎవరిపక్షాన నిలబడి కవిత్వాన్ని రాస్తున్నాడో, ఎవరి పక్షాన నిలబడి కవిత్వయుద్దం చేస్తున్నాడో స్పష్టంగా పేర్కొనాలి.
అకాలమరణం పొంది కవులకు కన్నీటిబొట్లను మిగిల్చిన వారు రాయలసీమ కవి ఆవులవెంకటేశులు. ఆయన రాసిన మానని గాయం కవిత్వాన్ని పరామర్శ చేస్తూ గొప్పనిర్వచనం ఇచ్చారు. అదేమిటంటే ‘ఏ కవిత్వంలో ఆవేదన, సంవేదన ఉంటాయో, ఏ కవిత్వంలో అయితే అనుభూతి ఉంటుందో, అందులో మానవీయ కోణం ఉండితీరుతుంది’ అంటారు ఈ రెండు కవితాసంపుటాల్లో మానవీయ కోణాలనే ప్రత్యేకంగా పరామర్శించారు. విమర్శకులు కవిత్వంలో ఏది అన్వేషించాలో స్పష్టంగా మస్తిష్కంలో బంధీ చేసుకున్నప్పుడు మాత్రమే అది చూస్తారు. ఇది విమర్శలో ఒకరకమైన పద్దతి. తను వర్తమాన సమాజానికి కవిని ఎలా పరిచయం చేయాలని సంకల్పిస్తాడో అలానే చేస్తాడు. ఆ అరుదైన ప్రయత్నం కూడా జంధ్యాల రఘుబాబు ఈ పుస్తకంలో చేశారు. అందుకే ప్రముఖవిమర్శకులు వల్లంపాటి వెంకటసుబ్బయ్య విమర్శను మూడు రకాలుగా పేరొంటారు. వర్ణనాత్మక విమర్శ (Descriptive Criticism), సూత్రవిమర్శ Theoritical Criticism), శాసక విమర్శ (Prescriptive Criticism) అని మూడురకాలుగా విభజించారు. రఘుబాబు మొదటివిమర్శను ఎంచుకున్నారు. అయితే కవిత్వాన్ని గాఢతగా రాసే కవిమిత్రులు ఆవుల వెంకటేశులు అర్ధాంతరంగా అనారోగ్యంతో అస్తమించడం కవిమిత్రులకు మానని గాయమే..
కవి చిన్ని నారాయణరావు రాసిన దాహం..దాహం అనే కవిత్వాన్ని గూర్చి విశ్లేషిస్తూ కవిత్వ పరిచయం ఇందులో ఉంది. ఆధునిక మానవుడి దాహాలను కవి రాస్తే, ఆ తీరని దాహంతో ఎన్ని రాక్షసత్వాలు మనిషి ప్రవర్తిస్తాడో విశ్లేషిస్తూ రాశారు. మారుతున్న ప్రపంచంలో మార్పులకులోనైన మనిషి దాహార్తినంతా వివరిస్తూ రాశారు. ఈ కవిని గూర్చి చెబుతూ ‘ప్రపంచాన్ని దగ్గర్నుంచి గమనిస్తున్నారని రాశారు. నిజమేకదా కవులు దగ్గర్నుంచి గమనించి ప్రపంచమార్పులు, ప్రపంచపరిణామాలు, ప్రపంచఘటనలు, ప్రపంచవిధ్వంసాలు చూడగలుగుతారు. అప్పుడే కవి ప్రపంచపౌరులుగా ఆవిర్భవిస్తారు. ప్రజలపక్షాన పోరాడగలుగుతారు.’ అంటారు. ఇలా ప్రతీ కవికి వొక నిర్ధిష్టమైన నిర్వచనం ఇస్తూ వెళ్ళడం ఈ కవిత్వవిమర్శ అక్షరకాంతులు ప్రత్యేకత.
కర్నూలు నుండి కవి స్వరూప్ సిన్హా హృదయానికి హత్తుకునే కవిత్వం రాస్తారు. సమాజంలోని సంఘర్షణలను కవిత్వంగా రాయడం ఆయన శైలి. ఆయితే ఏ విమర్శకుడైనా కాసింత ఓదార్పునిచ్చే విమర్శవాక్యాలు చెబితే ఆ కవి కవిత్వం మెరుగౌతుంది. మార్పును అనుభవిస్తూనే పాత కొత్త కలయికలనూ చూడమంటారు. కవి మహమ్మద్ హుసేన్ కవిత్వం బిడ్డా ఎప్పుడొస్తవ్..స్మృతి కవిత్వాన్ని, లౌకిక కవిత్వాన్ని విమర్శకులు జంధ్యాల రఘుబాబు కవిత్వ నిర్మాణపద్దతులతో తూచారు. ఇందులోని సాగుతున్న వైవిధ్యతను, కవిత్వంలో మండుతున్న మాటల్ని ఈటెలుగా మార్చేతీరును విశ్లేషించారు. అయితే అందరి కవులకు చెప్పినట్టే వొక నిర్వచననాన్ని సూచనను ఇస్తారు. ఇందులో ఏమంటారంటే ‘వస్తువు రిత్యా ప్రపంచంపై తనకున్న అవగాహన రీత్యా కవితా విషయకంగా నేటి ప్రపంచానికి అవసరవమైన కవిత్వమిది. అయితే ఈ వ్యాససారంశం గ్రహిస్తే కవి మరింత అధ్యయనం చేయాలనే అంతర్లీన విషయాన్ని బహాటంగానే ఈ గ్రంథంలో పలు సందర్భాల్లో చెబుతారు.
కవిచౌశా ఇటీవల కాలంలో పాలకుల దుర్నీతి విధానాల్ని ఎండగడుతూ రాస్తున్న ఫైర్‌బ్రాండ్ యువకవి. ఇప్పటివరకు 11 కవితాసంపుటాల్లో ప్రపంచపరిణామాలను, ఘటనలను రాసి తెలుగు సాహిత్యసమాజానికి సగర్వంగా అందించిన కవి. ఎవరు ద్రోహి పేరుతో అన్నదాత రైతన్నకు జరుగుతున్న మోసాల్ని కవిత్వంగా రాశారు. గ్రామీణ జీవితం ఉన్న ప్రగతిశీల కవి కావడం వల్ల ఈ కవిత్వంలోని కవితావాక్యాలు పాలకులకు బల్లెంలాగా గుచ్చుకుంటాయి. నల్లచట్టాలకు వ్యతిరేకంగా ఢల్లీి రైతుఉద్యమం మనందరికీ తెలిసిందే..ఈ కవిత్వాన్ని రఘుబాబు తనదైన శైలిలో వస్తుప్రధానంగా సాగుతున్న కవితాప్రయాణాన్ని కొలిచారు. రైతు బాధలు, రైతు పోరాటం కేంద్రంగా కవిత్వం నడిచిందంటూ కితాబునిస్తూ సామాన్యులకు అర్థమయ్యేలా కవిత్వం రాయాలన్న కవిదృక్ఫథాన్ని సమర్ధిస్తారు. రష్యన్కవులు కూడా కవిత్వం సామాన్యులకు అర్థమవ్వాలంటారు. కవిత్వం పోరాటమయమవ్వాలన్న రష్యన్ కవులబాటలో కవి చౌశా నడవడాన్ని ఈ వ్యాసంలో విమర్శకులు పసిగట్టారు. డా.కల్లూరి ఆనందరావు దళిత కవిత్వసృజనకారులు. ఆయన ఏది రాసినా అసమానతలు, సామాజిక అంతరాలనే వస్తువులుగా రాసే సీనియర్ కవి. ఇతడి సృజన ఆలోచనాత్మకమే కాదు, ఆచరణాత్మకం కూడా. వికసితం దళితం పేరుతో రాసిన దళిత కవిత్వాన్ని ఈ సమీక్షవ్యాసంలో కవిత్వపు అంతరాలను అన్వేషించి రాశారని ఈ పుస్తకంలో విమర్శకులు రఘుబాబు చెప్పారు.
ఈ పుస్తకంలో ప్రధానమైన వ్యాసం జాషువా కవిత్వం గూర్చి రాయడం. జాషువాను ఇష్టపడని, జాషువా పద్య కవిత్వాన్ని ప్రేమించని కవులు ఎవరూ ఉండకపోవచ్చు. ఈ వ్యాసం ప్రాపంచిక దృక్ఫథంతో రాశారు. జాషువా వర్తమాన సమాజంలో సంప్రదాయ సాహిత్యం రాజ్యమేలుతున్న రోజుల్లో అనేక ప్రతికూలతలనెదుర్కొంటూ సామజిక దృక్పథంతో రచనలు చేసి నిలదొక్కుకోవడం సామాన్య విషయం ఏమీకాదు. అందులోనూ సాంఘికంగా అణిచివేతకు లోనైన దళిత వర్గానికి చెందిన వారు ఆ రోజుల్లో సాహిత్య రంగంలోకి ప్రవేశించడానికే అవకాశం లేని పరిస్థితి ఉండేది.తనకు జీవితం ఎన్నో పాఠాలు నేర్పింది అంటూ నాకు ఇద్దరు గురువులు ఉన్నారని అన్నారు. ఒకరు పేదరికం, మరొకరు కులమతభేధం. నవ్వుతూ చలోక్తులు విసురుతూ తన మీద ఎవరైనా చలోక్తులు విసిరినా ఆయన ఎంతో ఆనందించేవారు. జాషువా కవితా కంఠము విలక్షణమైంది. యావన్మంది ప్రజల సుఖ సంతోషాలకోసం, ఎవరు అవమానం కాకూడదన్న లక్ష్యంకోసం జాషువా కవిత ఆక్రోశించేది. జాషువా అభ్యుదయవాది. వర్గ సంఘర్షణ, ఆర్ధిక వ్యత్యాసాల నిర్మూలన దోపిడి వర్గాల పై తిరుగుబాటు జాషువా కావ్యాలలో నిండుగా ఉన్నాయి. ఈ విషయాలను విమర్శకులు పలు సందర్భాలలో లోతుగా విశ్లేషించడం పాఠకుణ్ణి కట్టిపడేస్తుంది.ఆకలిని, శోకాన్ని నిర్మూలించాలన్న జాషువా ఆలోచనల్ని విమర్శకులు చెప్పడంలో సఫలమయ్యారు. ఆయన కవితకు వస్తువులు మానవత్వం, హేతువాద, కరుణరసం. వాటన్నింటినీ ఈ వ్యాసంలో పేర్కొనడంలో ఈ పుస్తకానికి మరింత బలాన్నిచ్చింది.
కవి మువ్వాశ్రీనివాసరావు ఖమ్మం నుండి బలమైన కవిత్వాన్ని రాస్తున్నవారు. కవిగా సాహిత్యంలో తనదైన ముద్రను వేసుకున్నవారు. ఈ వ్యాసంలో ఆ కవిని గొప్ప భావుకుడుగా చూస్తారు. తన కవిత్వం కవిత్వప్రయోగానికి నిదర్శనమంటూ సాగించడం అరుదైన విషయం. ఈ కవి కవిత్వాన్ని చెబుతూ కవిత్వం రాస్తున్నవాళ్ళు ఏది మిస్సవుతున్నారో తెలుసుకోవచ్చంటారు. కవులకు, విమర్శకులకు, పాఠకులకు ఈ కవిత్వం దగ్గరగా ఉందంటారు.వస్తువైవిధ్యంగా శిల్పసౌందర్యంగా కవిత్వాన్ని రాయడం అరుదైన విషయమంటూ కవిని అంచనా వేశారు. కవిత్వంలో మకుటాన్ని కూడా ప్రవేశపెట్టి ప్రయోగం చేశారని లోతుగా విశ్లేషిస్తారు.
ఈ పుస్తకంలో తెలుగు సాహిత్యంలోకి వైవిధ్యమైన కవిత్వం, వస్తు, శిల్పాలేకాక, ఎత్తుగడలు, రూపం తదితర అన్నీ కవిత్వనిర్మాణ రహస్యాలతో కవిత్వం రాస్తున్న లబ్దప్రతిష్టులు కొమ్మవరపు విల్సన్‌రావు. కవిత్వశీర్షికలతోనే వందశాతం కవిత్వాన్ని సాధించేస్తారు. ఈయన కవిత్వం చదువుతుంటే ఇలాంటి కవిత్వం కదా వర్తమాన సాహిత్యసమాజానికి అని ప్రతివొక్కరికీ అనిపిస్తుంది.కవిత్వం గూర్చి మరింత లోతుగా చెప్పాలంటే రసావేశము(Emotion), భావనాశక్తి (Imagination), విజ్ఞానము(Intellect), రూపము(Form) ఉండాలని ప్రసిద్ద విమర్శకులు శిష్టారామకృష్ణాశాస్త్రి కావ్యవిమర్శన సంప్రదాయములు అనే వ్యాసంలో పేర్కొంటారు. ఆ లక్షణాలు ఈ కవి కవిత్వంలో ప్రధానంగా దర్శనమిస్తాయి. ఈ కవిత్వం గూర్చి విమర్శకులు ‘కవి తన జీవితాన్ని కవిత్వంలోకి వొంపుతాడని’ కితాబిచ్చారు. ఈ వొక్కమాట చాలదా కవిని అంచనా వేయడానికి..నాగలిమాత్రమే కాదు మనిషి కూడా వొక ఆయుధమని విమర్శకులు ఈ కవిత్వం గూర్చి తుదితీర్పు ప్రకటిస్తారు. సమకాలీన వస్తువుల్నే కాక నాగరికత సమాజంలో సాగుతున్న అనాగరికతల్ని, వర్తమాన సమాజం ఎదుర్కొంటున్న ప్రతీ వైరుధ్యాన్ని కవిత్వంగా చెక్కడం ఈ కవికి మాత్రమే సాధ్యమనిపిస్తుంది. ఈ కవి తెలుగుసాహిత్యంలో మాస్టర్‌పీస్ అని బలంగా నమ్ముతున్నాను.
ఈ సంపుటిలో ప్రస్తావించాల్సి అరుదైన కవి లాడె ధనుంజయ. దళితసాహిత్యానికి ప్రామిస్డ్పోయట్. వొకరకంగా చెప్పాలంటే నల్లమందారపుష్పమీకవి. ఈ కవి విశిష్టతల్ని ప్రారంభంలోనే చెప్పేస్తారు. ముక్కుసూటీతనం మొక్కవోని ధైర్యం, ధృడమైనదీక్ష, ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగి అణగారిన వర్గాలన్నీ నమ్మిన డా.అంబేడ్కర్ కార్మకవర్గ పక్షపాతిగా ఎలాంటి దృక్పథాన్ని కలిగిఉన్నాడో తెలిపే ఈ పుస్తకం ద్వారా కవి ఇంకొందరికి దగ్గరౌతారనే విషయాన్ని విమర్శకులు పేర్కొనడం వల్ల ఈ కవి కవిత్వ సృజన సాహిత్యప్రయాణం మనం అంచనా వేయవచ్చు. అంబేడ్కర్ దృక్ఫథంలో సాగిస్తున్న ఈ కవి ప్రయాణాన్ని గొప్పగా రచయిత విశ్లేషించారు. ఈ పుస్తకం చదవదగ్గది.
ఇదే నేను ఇదే నా జీవితమనుకో...’ అంటూ వొకచోట..ఇంకిపోని ఊట బావిలాంటిదే ఈ దేహం/ఇదికూడా వో సామూహిక కన్నీటి సమీకరణ కేంద్రమే..అంటూ మరొకచోట కవిత్వాన్ని జీవితానికి మిళితం చేసి రాస్తున్న కవి వైష్ణవిశ్రీ. తెలుగు
మానవజీవితంలో కవిత్వం ఒక నిరంతరం అన్వేషణ. సమాకాలీన ప్రపంచంలో నిజం ఎక్కడున్నా వెలుగులోకి తెచ్చే ప్రతిస్పందనా సాధనం. ఏ భాషలోనైనా`ఏ ప్రాంతంలోనైనా అది కొనసాగే సంవాదం. ఆకలి` ఆవేదనలను నిర్మోహమాటంగా గుండెల్లోకి పంపించే అక్షర
సామ్రాజ్యవాదం ఉన్నంతకాలం యుద్దాలు ఉంటాయి-లెనిన్ కాసిన్నినినాదాలు..మరికొన్ని సానుభూతి వాక్యాలు..ఏదో వీలైతే వొక సదస్సో..లేదంటే చర్చావేదికో..ఏం మాట్లాడతారు..? అందరూ అంతకంటే ఏం చేస్తారు..?మళ్ళీ జీవితాలు ఎవరివివారివే. కాని ఆ దేశంలోని వాళ్ళకు జీవితం ఎప్పుడు ముగుస్తుందో