రష్యా ఆద్య కవులకే ఆద్య కవిగా సాహిత్య పితామహుడుగా పేర్కొనబడే అలెగ్జాండర్ పుష్కిన్ (1799 – 1837 = 38 ఏండ్లు) అతిచిన్న వయసులోనే ఒక యువతి విషయంలో మరో యువకునితో జరిగిన ద్వంద యుద్ధంలో గాయపడి చిన్నవయసులోనే మరణించినప్పటికీ అతను సృజించిన సాహిత్యం మాత్రం అజరామరమైనిలిచింది.
పుష్కిన్ 189 ఏండ్ల కింద (1836 లో) రష్యన్ భాషలో వ్రాసిన ప్రపంచ ప్రసిద్ధ నవల ‘కెప్టెన్స్ డాటర్’ ఇన్నేండ్ల తరువాత కుమార కూనపరాజు చొరవతో, మోహన్ తలారి ఇంగ్లీష్ నుండి తెలుగులోకి అనువాదం చేశాడు. దాన్ని ‘ఎన్నెలపిట్ట బుక్స్’ వారు జూలై, 2025 లో తెలుగు పాఠకలోకానికి అందించారు.
మోహన్ తలారి ఇప్పటి వరకు రాసిన పుస్తకాల్లో ఇది నాలుగో పుస్తకమే అంటే నమ్మలేము. ఎందుకంటే ఇది తను ఆంగ్లభాష నుండి తెలుగులోకి అనువాదం చేసినప్పటికీ ఓ స్వతంత్ర నవల మాదిరి కొండవాగు పరుగు లాంటి పఠనీయతతోను, ఎంతో సరళంగాను అనువాదం చేశాడు. ఈ పుస్తకం చదివిన తరువాత ఎవరైనా తెలుగు పాఠక లోకానికి ఓ మంచి రచయిత దొరికాడన్న భావానికి లోననవుతారు.
మూల రచయిత పుష్కిన్ నవలను ఉత్తమ పురుష కథన పద్ధతిలో నడిపించాడు. నవల మొత్తాన్ని పద్నాల్గు అధ్యాయాలుగా విభజించి, ప్రతి అధ్యాయానికి ఒక విలక్షణమైన శీర్షికను కూడా పెట్టాడు. అంతటితో ఆగితే అతను పుష్కిన్ ఎందుకవుతాడన్నట్టు ప్రతి శీర్షిక క్రింద పాఠకుడి మనసును మెలితిప్పే ఓ విషాద జానపద గేయాన్నో, కవితనో, సామెతనో పొందు పరిచి ఆ తరువాత కథలోకి ప్రవేస్తుంటాడు. సుమారు రెండు వందల ఏండ్ల కిందట, ముప్పై ఏడు సంవత్సరాల వయసులో ఇంత వినూత్నంగా రాయడమంటే అదోఅద్బుతమనే చెప్పాలి.
నవలా నాయకుడు పెట్రూషా ప్యోటర్ తండ్రి పెట్రోవిచ్ గ్రిన్యోవ్ ఓ రిటైర్డ్ మేజర్. తన కొడుకుకు తోడుగా సవేలిచ్ అనే పనివాడినిచ్చి మారుమూల గ్రామమైన ఒరెన్ బర్గ్ లో పనిచేయడానికి పంపిస్తాడు.
వాళ్ళిద్దరూ ఓ బగ్గి మాట్లాడుకొని వెళుతుండగా దారిలో తీవ్రమైన మంచుతుఫాన్ వస్తుంది. బలిష్టుడైన ఓ బాటసారి సాయంతో ఆ రాత్రి ఓ హోటల్ తలదాచుకుకుంటారు. పొద్దున్నే లేచి వచ్చేటప్పుడు పెట్రూషా ఆ బాటసారికి కొంత డబ్బు, చలి నుండి రక్షణకోసం ఓ మంచి జాకెట్ ఇస్తాడు. వాళ్ళు ఒరెన్ బర్గ్ చేరి, జనరల్ ని కలిసి ఆఫీసర్ ర్యాంక్ హోదాలో ఆర్డర్ తీసుకుని కిర్గిజ్ స్టేప్పీల సరిహద్దులోని బెలోగోర్స్కీ కోటలోని యన్. రెజిమెంట్ కి బయలుదేరుతాడు.
తీరా అక్కడి కెళ్ళి చూసేసరికి అది కోట కాదు శిథిలావస్తలోవున్న ఓ చిన్నపాటి సైనిక శిబిరం మాత్రమే. అక్కడ మొత్తం కలిపినా నూటాయాభై మందికూడా వుండరు. ఆయుధాలూ అంతంత మాత్రమే. ఒక పాతదైన తోపుమాత్రం కన్పిస్తుంది. దేశ సరిహద్దు గ్రామాలు సైనిక శిబిరాలు ఎంత దైన్యంగా వుండడం ఆనాటి పాలక వర్గాల దయనీయతను ఎత్తిచూపుతాయి.
వాళ్ళు వెళ్ళిన సమయంలో కెప్టెన్ కుజ్మీచ్ అక్కడికి కొద్ది దూరంలో వున్న ఓ గ్రామంలోని చర్చ్ ఫాథర్ దగ్గరికి వెళ్ళడంతో అతని భార్య వసీలిసా పెట్రూషా వాళ్ళను ఆహ్వానించి , వుండడానికి ఓ రూమ్ కూడా చూపిస్తుంది.
అక్కడ పెట్రూష వాళ్ళకి మరో ఆఫీసర్ ష్వాబ్రిన్, కెప్టెన్ కూతురు మా షా పరిచయమవుతారు.
అప్పటికే ష్వాబ్రిన్ మా షా పట్ల ఆకర్షితుడై వుంటాడు. మా షా అందాన్ని చూసిన పెట్రూషా కూడా ఆవిడపట్ల ఆసక్తిని కనబరుస్తుంటాడు. మా షాకి కొద్ది రోజుల తరువాత ఆ ఇద్దరూ తనపట్ల ఏ ఉద్దేశంతో వున్నారో అర్ధం చేసుకున్నప్పటికీ స్తబ్దుగావుండిపోతుంది.
ఓ రోజు పెట్రూషా మా షా పైన ఓ కవితా రాసి దాన్ని ష్వాబ్రిన్ రూమ్ కి తీసుకుపోయి అతనికి చదివి విన్పిస్తాడు. ఆ సందర్భంలో ష్వాబ్రిన్ కవుల స్వభావాన్ని గురించి “ఈ కవులున్నారే, వీళ్ళకి మన కెప్టెన్ కూజ్మిచ్ కి భోజనానికి ముందు ఒడ్కా అవసరమైనట్టు, వాళ్ళు రాసేవి వినడానికి ఒక శ్రోత కావాలి” అంటూ వ్యంగ్యంగా మాట్లాడుతాడు.
చిత్రంగా ఆ పరిస్థితి రెండు వందల ఏండ్ల తరువాత కూడా నేటి మన ఆధునిక కవులకు కూడా ఎదురవ్వడం చూస్తుంటే ఆశ్చర్యమేకాదు. అందుకే కవులను, రచయితలను ‘ధ్రష్ట’ లని కూడా అంటారేమో అన్పిస్తుంది.
ఆ కవిత విన్న ష్వాబ్రిన్ పెట్రూషాల మధ్య మా షా విషయమై స్పర్ధ మొదలవుతుంది. మా షా మాత్రం పెట్రూషా పట్ల మౌనంగా అభిమానం ప్రకటిస్తుంది. దాని ఫలితంగా కోట ప్రాంగణంలో ముక్కోణపు ప్రేమకథ మొదలై చివరికి పెట్రూషా, ష్వాబ్రిన్ ల మధ్య ద్వంధ్వ యుద్ధానికి దారితీస్తుంది. దాని పరిణామాలు ఉత్కంఠ పూరితమైన మలుపు తీసుకుంటాయి. కొన్నిరోజుల తరువాత మొదట్లో పెట్రూషా వాళ్ళు బగ్గి మీద కోటకు వస్తూ మంచుతుఫాన్ లో చిక్కుకున్నప్పుడు సాయం చేసిన మొరటు మనిషి పుగచోవ్ కొంతమంది నేరస్తులను, మొరటు వాళ్ళైన కోసక్కులను సైన్యంగా సమకూర్చుకొని కోట మీద దాడికి తెగబడతాడు.
ఆ సమయంలో అనారోగ్య కారణంగా మా షా పోరుగూరులోని ఫాదర్ దగ్గర వైద్యం కోసం వెళుతుంది. ఆ దాడిలో కోట తిరుగుబాటు దారు పుగచోవ్ చేతికి చిక్కుతుంది. కెప్టెన్ ఇవాన్ కూజ్మీచ్ ని అతని భార్య వసీలీసాలను ఉరితీస్తారు. ష్వాబ్రిన్ తెలివిగా తిరుగుబాటు దారుల గుంపులో చేరిపోతాడు. పెట్రూషా బంధీగా దొరికిపోతాడు.
అయితే, రాయికి కూడా చెమట పడుతుందన్నట్టు తిరుగుబాటు నాయకుడు పుగచోవ్ పెట్రూషాను గుర్తించి, ఆనాడు హోటల్లో తనికి తిండిపెట్టించి, డబ్బులు, జాకెట్ ఇచ్చి పంపించిన విశ్వాసంతో అతన్ని గౌరవించి, అన్నంపెట్టి “ నాతోపాటు చేతులు కలిపితే నీకు మంచి భవిష్యత్తు చూపిస్తాను” అని హామీ ఇచ్చినా పెట్రూషా అందుకు తాను చక్రవర్తి సైన్యంలో బాధ్యతగల అధికారినని చెప్పి, నీచేతిలో చావడానికైనా సిద్ధమేగాని, నీతో చేతులు కలపనంటూ బదులిస్తాడు. అతని నిబద్ధతను గౌరవించిన పుగచోవ్, పెట్రూషాకు తన గుర్రాన్నిచ్చి ఫాదర్ వాళ్ళ ఊరికి తీసుకుపోయి మా షా ను కలుపుతాడు.
మా షా ను గుర్రం మీద ఎక్కించుకుని రాజధానికి బయలుదేరిన పెట్రూషాను మధ్య దారిలో చక్రవర్తి సైనికులు అడ్డుకుని నువ్వు రాజద్రోహానికి పాల్పడ్డవన్న ఆరోపణతో అతన్ని, మా షా ను రాజధానికి తరలిస్తారు. ఆఖరికి మరణ శిక్ష విధించి కారాగారానికి పంపిస్తారు.
విధిలేని పరిస్థితిలో మా షా పెట్రూషా వాళ్ళ ఇంటికి చేరుతుంది. ఆ తరువాత మా షా ఎంత సాహసంతో? ఎక్కడిదాకా వెళ్లిందో? పెట్రూషా జీవితం ఏమైపోయిందో? అన్న విషయాలను పాఠకులచేత ఊపిరిబిగబట్టి చదివించేలా నవలను కొనసాగించిన విధానం అపూర్వంగా తీర్చిదిద్దిన పుష్కిన్ రచనా సామర్ధ్యం అనితరసాధ్యం.
నవల అంతటా ఆనాటి జార్ చక్రవర్తుల ప్రభుత్వంలోని రాజకీయ, సామాజిక పరిణామాలను, పాలనా వైఫల్యాలను, తిరుగుబాటుదారుల చర్యలను సుమారు రెండు వందల ఏండ్ల కిందటే నభూతో నభవిష్యత్ అన్నట్టు తీర్చిదిద్దిన పుష్కిన్ నిస్సందేహంగా కాలం కాటేయని మహారచయితగా పేర్కొనవచ్చు.
ఇంత మంచి పుస్తకాన్ని మొదటి సారిగా వెలుగులోకి తీసుకొచ్చి తెలుగు పాఠకులకు అందించడంలో ప్రధాన భూమిక వహించిన కుమార్ కూనపరాజు, మోహన్ తలారి, ‘ఎన్నెలపిట్ట’ బృందానికి పాఠకుల తరపున అభినందనలు.
‘వెన్నెలపిట్ట’ నుండి మున్ముందు కూడా ఇటువంటి మరిన్ని విలువైన రచనలు వెలువడాలని కోరుకుంటున్నాను.

Leave a Reply