1999లో, మా నాన్నమ్మ ఊరు సిబ్సాగర్ నుండి మా ఊరు తిన్సుకియాకి కారులో తిరిగి వస్తున్నప్పుడు, మా అమ్మ జుబీన్ గార్గ్ ‘పాఖీ’ ఆల్బమ్ కొన్నది. అప్పటికే ఆయన ఒక సంచలనంగా మారినప్పటికీ, అస్సాం అత్యంత ప్రముఖ సాంస్కృతిక చిహ్నాలలో ఒకరుగా ఎదిగిన ఆ వ్యక్తిని నేను వినడం అదే మొదటిసారి. ఆ నాలుగు గంటల ప్రయాణంలో, ‘పాఖీ’, జుబీన్ గార్గ్ స్వరం మాత్రమే మాకు తోడుగా ఉన్నాయి.

‘పాఖీ’ (ఈక) ఆల్బమ్లో జుబీన్ గార్గ్ స్వేచ్ఛ, బందిఖానా  వంటి ఇతివృత్తాలను అన్వేషించారు. ఈకను మానవ స్థితికి ఒక రూపకంగా వాడారు. సంపూర్ణ స్వేచ్ఛ కోసం ఉన్న కోరిక, వివిధ పరిమితుల మధ్య చిక్కుకున్న వాస్తవికతను ఇందులో వివరించారు.  వ్యక్తిగత ప్రామాణికత, సామాజిక అంచనాల మధ్య జరిగే విశ్వవ్యాప్త సంఘర్షణ గురించి మాట్లాడే సాహిత్యానికి తోడుగా  మంత్రముగ్ధులను చేసే శ్రావ్యమైన రాగం పాటలో ఉంటుంది.

 నిరాశ్రయులైన వారి ఉనికిలోని ఆందోళనను, ఒక నిర్లిప్తమైన విశ్వంలో ఒక స్థానం కోసం అన్వేషణను ఈ పాటలోని సాహిత్యం వివరిస్తుంది. అర్ధాన్ని కనుగొనడానికి, ఒక స్థిరమైన ప్రదేశం కోసం జరిగే మానవుల అన్వేషణను ఈక ప్రయాణం ప్రతిబింబిస్తుంది.

ఆ రోజు నుండి, నేను, నా సోదరుడు ఆ గాయకుడికి అభిమానులుగా మారాము.

సెప్టెంబర్ 19న సింగపూర్లో జుబీన్ గార్గ్ మరణవార్త విని అస్సాం మొత్తం నిశ్చలమైంది. వీధుల్లో ఆ విషాదం స్పష్టంగా కనిపించింది. కానీ మరణించిన తర్వాత కూడా, గార్గ్ అస్సాం ప్రజల జీవితాలలో ఒక అర్థాన్ని సృష్టిస్తూనే ఉంటారని నాకు స్పష్టంగా తెలుసు.

జుబీన్ గార్గ్ ఒక సంగీతకారుడు మాత్రమే కాదు: ఒక కళాకారుడు; మానవ ఉనికికి సంబంధించిన ప్రాథమిక ప్రశ్నలను తన కళ ద్వారా ఆవిష్కరించాడు. ఆయన పాటలు కేవలం వినోదాన్ని మాత్రమే అందించలేదు – అవి మనిషిగా ఉండటం, ప్రేమించడం, బాధపడటం, తరచుగా అస్తవ్యస్తంగా ఉండే ఈ ప్రపంచంలో అర్థాన్ని కనుగొనడం అంటే ఏమిటో లోతుగా విశ్లేషించాయి.

52 ఏళ్ళ వయసులో, గార్గ్ ఒక బహుముఖ గాయకుడు, స్వరకర్త, నటుడిగా స్థిరపడ్డారు. ఆయన పని అనేక భారతీయ భాషల్లో విస్తరించింది. 1990ల ప్రారంభంలో ఆయన వెలుగులోకి వచ్చారు; 1992లో ఆయన తొలి ఆల్బమ్ ‘అనామిక’ అస్సాంలో చాలా ప్రాచుర్యం పొందింది. ఆ తర్వాత ‘మాయ’ (1994), ‘ఆక్స్హా’ (1995) ‘ముక్తి’ (1997) వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన ఆల్బమ్లు వచ్చాయి.

గార్గ్ పాటలలో రొమాంటిక్ బాలెడ్లు, జానపద-ప్రేరిత శ్రావ్యాలు, సమకాలీన ఫ్యూజన్ వంటివి ఉన్నాయి. ఇవి ప్రాంతీయ సంప్రదాయాలను, భారతదేశంలో విస్తృతమైన ప్రాచుర్యం పొందిన సంగీత ధోరణులను ప్రతిబింబిస్తాయి.

అస్సాం నుండి వచ్చిన జానపద కళాకారుల లాగా కాకుండా, గార్గ్ విధానం ప్రత్యేకంగా ఆధునికమైనది, తాత్వికమైనది. ఆయన పరాయీకరణ, మృత్యువు, ఉనికి కోసం అన్వేషణ వంటి వాటితో పోరాడారు. ఆయనలో ఈ సున్నితత్వం, ప్రపంచాల మధ్య జీవించే వ్యక్తిగా ఆయన అనుభవం నుండి వచ్చింది – అస్సాం సంప్రదాయంలో వేళ్ళూనుకొని ఉన్నప్పటికీ, ప్రపంచ సంగీత ప్రవాహంతో  ప్రభావితమయ్యారు. ఆయన పాటలు ఆధ్యాత్మికంగా ఉన్నప్పటికీ, వ్యవస్థీకృత మతం, కుల-ఆధారిత వివక్షను ప్రశ్నించాయి. అలాగే, ప్రాంతీయంగా ఉన్నప్పటికీ విశ్వవ్యాప్తంగా ప్రతిధ్వనించాయి.

ఈ ‘మధ్యలో’ ఉనికి’ ఆయనను, ఆయన లాగే సంప్రదాయబద్ధమైన విషయాలను ప్రశ్నించే వారినీ ఒక గొంతుగా నిలబెట్టింది. జీవితంలోని కష్టాలకు సులువైన పరిష్కారాలను లేదా సాంప్రదాయికమైన సౌకర్యాన్ని అందించడానికి నిరాకరించడమే గార్గ్ పనిని భిన్నంగా ఉండేలా చేసింది. బాధ అనేది మానవ ఉనికిలో ఒక అంతర్లీన భాగం అని, అది అధిగమించాల్సిన లేదా వివరించాల్సిన విషయం కాదని ఆయన పాటలు అంగీకరించాయి.

ఆయన పాటలలోని ఇతివృత్తాలు అస్సాంలో ప్రత్యేకంగా ప్రతిధ్వనించాయి. ఎందుకంటే ఆ ప్రాంత ప్రత్యేక చారిత్రక, సాంస్కృతిక స్థానం అలాంటిది: ఆ ప్రాంతం భౌగోళికంగా భారతదేశ ప్రధాన స్రవంతికి దూరంగా ఉన్నప్పటికీ, తనదే అయిన సాంస్కృతిక ప్రపంచాన్ని కలిగి ఉన్నది. అది భాషాపరంగా భిన్నంగా ఉన్నప్పటికీ, దేశం-రాజ్యం అనే భావనతో విలీనం అయింది. ఆర్థికంగా వెనుకబడినప్పటికీ, రాజకీయంగా ఉత్సాహంగా ఉంటుంది.

గార్గ్  ఈ స్థితిని  అసాధారణ స్పష్టతతో వ్యక్తం చేసాడు. ప్రపంచీకరణ జరుగుతున్న ప్రపంచంలో సంస్కృతిని కాపాడుకోవడం ఎంత కష్టమనే దాని గురించి, మారుతున్న కాలంలో పెద్ద ఫెడరల్ నిర్మాణంలో రాజకీయ గుర్తింపు కోసం అస్సాం చేస్తున్న పోరాటం గురించి ఆయన పాటలు ఆందోళన వ్యక్తం చేసాయి.

‘అవర్ గ్రేట్ఫుల్ డెడ్’ అనే తన పుస్తకంలో తత్వవేత్త విన్సియన్ డెస్ప్రెట్ “దెయ్యాలను సీరియసగా తీసుకోవాలి” అని చెప్పింది. చనిపోయినవారు బతికున్నవారితో తమ జ్ఞాపకాలు, ప్రేరణలతోనూ, తాము పూర్వం చేసిన పనుల వల్ల ఏర్పడే పరిణామాల ద్వారానూ తమ సంబంధాలను కొనసాగిస్తూ, విషయాలను ప్రభావితం చేస్తూనే ఉంటారని ఆమె అంటారు.

గార్గ్ మరణం దీన్ని శక్తివంతంగా నిరూపించింది. ఆయన మరణానికి వచ్చిన భారీ ప్రజా స్పందన, మరణం ఒక వ్యక్తి ప్రభావాన్ని తగ్గించడానికి బదులుగా ఎలా పెంచుతుందో చూపిస్తుంది. ఆయన పాటలు నిరంతరం వినిపిస్తూనే ఉంటాయి, ఆయన ఆలోచనలు ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. ఆయన కళాత్మక వ్యక్తీకరణ భావన ప్రేరణనిస్తూనే ఉంటుంది.

అభిమానులు గార్గ్ ను కేవలం గుర్తుంచుకోవడమే కాదు: వారు ఆయన పనిలో కొత్త ఔచిత్యాన్ని, ఆయన ఆలోచనలకు కొత్త అనువర్తనాలను కనుగొంటారు. గార్గ్ పాటలు కొత్త అర్థాలు, సంబంధాలు, అవకాశాలను సృష్టిస్తాయి. ఇది బతికి ఉన్నవారిని, చనిపోయినవారిని కూడా మారుస్తుంది.

సులభమైన సమాధానాలను అందించడానికి బదులుగా, లోతైన ప్రశ్నలను అడగడానికి ఆయన చేసిన ప్రయత్నమే  బహుశా జుబీన్ గార్గ్ చేసిన గొప్ప సహకారం. మనం ఎలా జీవించాలి? జీవితానికి అర్థం ఏమిటి? ప్రాథమిక ఒంటరితనాన్ని అంగీకరిస్తూనే మనం అనుబంధాన్ని ఎలా కనుగొనగలం?

ఈ ప్రశ్నలు ఆయన వాటిని మొదట అడిగినప్పుడు ఎంత ముఖ్యమో, ఈ రోజు కూడా అంతే ముఖ్యమైనవి. ఈ విధంగా, ప్రతి తరం కొత్తగా జవాబివ్వవలసిన ప్రశ్నలను లేవనెత్తడం ద్వారా, గార్గ్ ఒక రకమైన అమరత్వాన్ని సాధించారు.

నిరంతర ఉనికి:

సంవత్సరాల తరబడి,  జుబీన్ గార్గ్ లేదా 85 ఏళ్ల వయసులో 2011లో మరణించిన గొప్ప సంగీతకారుడు భూపేన్ హజారికాలో ఎవరు అస్సాం ఆత్మను మెరుగ్గా ప్రాతినిధ్యం వహించారని మేం చర్చించుకునేవాళ్ళం. ‘బ్రహ్మపుత్ర కవి’గా ప్రసిద్ధి చెందిన హజారికా, ఒక గొప్ప గాయకుడు, గీత రచయిత, స్వరకర్త, చిత్రనిర్మాత. ఆయన రచనలు అస్సాం జానపద సంప్రదాయాలను ఉపయోగించి మానవత్వం, న్యాయం, సాంస్కృతిక గుర్తింపు వంటి విశ్వవ్యాప్త అంశాలను తెలియజేశాయి.

ఆయన సంగీతం, సినిమాను సామాజిక మార్పు కోసం సాధనాలుగా కళాత్మకంగా ఉపయోగించారు. ఆయన వదిలివెళ్ళిన కళాఖండాలు దక్షిణాసియాలో ప్రాంతీయ ఆత్మగౌరవం, సాంస్కృతిక ఐక్యత, ప్రగతిశీల రాజకీయాలపై చర్చలను ఇప్పటికీ ప్రేరేపిస్తూనే ఉన్నాయి.

 .

హజారికా లాగే, గార్గ్ అస్సాం సాంస్కృతిక జీవితంలో ఒక చారిత్రక వ్యక్తిగా మాత్రమే కాకుండా, సమకాలీన గుర్తింపు, వ్యక్తీకరణను కొనసాగించే ఒక సజీవ శక్తిగా మిగిలిపోతారు.

గార్గ్ మరణం ఒక ముగింపు కాదు, అది శారీరక ఉనికి నుండి “కృతజ్ఞతగల దెయ్యం”గా రూపాంతరం చెందడం అని డెస్ప్రెట్ భావంతో చెప్పవచ్చు. ఆయన పని గురించి తెలిసిన వారికి సవాలుగా, సాంత్వనగా, స్ఫూర్తిగా నిరంతరం నిలుస్తారు.

చివరగా, జుబీన్ గార్గ్ వారసత్వం ఏ ఒక్క పాటలోనో లేదా విజయంలోనో లేదు, కళ ఒక తాత్విక పరిశోధన కాగలదని, వినోదం ఒక అస్తిత్వ అన్వేషణ కాగలదని, ప్రాంతీయ కళాకారులు విశ్వవ్యాప్త మానవ సమస్యలను పరిష్కరించగలరని ఆయన నిరూపించారు.

సిబ్సాగర్ నుండి తిన్సుకియాకు  నాలుగు గంటల ప్రయాణం; ‘పాఖీ’ పాట పదే పదే వినిపిస్తున్న అనుభవం కేవలం ఒక సంగీత అనుభవం మాత్రమే కాదు – అది జీవితం గురించి ఆలోచించడానికి ఒక పరిచయం.

జుబీన్ గార్గ్ మనల్ని మరింత నిజాయితీగా జీవించమని, మరింత లోతుగా, విమర్శనాత్మకంగా ప్రశ్నించమని, మానవ ఉనికిలోని సౌందర్యం, విషాదం రెండింటినీ స్వీకరించమని అడుగుతూనే ఉంటారు కాబట్టి, ఆ పరిచయం ప్రశ్న తర్వాత ప్రశ్నగా, పాట తర్వాత పాటగా కొనసాగుతూనే ఉంటుంది.

తెలుగు: పద్మ కొండిపర్తి

పృథిరాజ్ బోరహా హైదరాబాద్లోని నల్సార్ యూనివర్శిటీ ఆఫ్ లాలో సోషియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్.

https://scroll.in/article/1086949/zubeen-gargs-greatest-contribution-asking-profound-questions-rather-than-offering-easy-answers

Leave a Reply