ఈ పుస్తకాన్ని వర్తమాన తెలుగు మేధా సంప్రదాయంలో అత్యవసరమైన, ప్రాసంగికమైన, కీలకమైన రచనగా పరిగణించడానికి మూడు కారణాలున్నాయి.
ఒకటి, ఇది ఒక వాదనల సంకలనం. విప్లవోద్యమానికీ ప్రభుత్వానికీ మధ్య చర్చలు జరగాలని, సమాజంలో నెలకొని ఉన్న హింస తగ్గి శాంతి ఏర్పడాలని ఆకాంక్షలు వినిపిస్తున్న సందర్భంలో వ్యక్తమవుతున్న అనేక వాదనలను, అభిప్రాయాలను మదింపు చేసి విప్లవోద్యమం వైపు నుంచి ఒక వాదన వినిపిస్తున్న పుస్తకం ఇది.

రెండు, ఇది ఒక ఆశావాదపు ప్రకటన. ఆపరేషన్‌ కగార్‌ పేరుతో పాలకవర్గాలు, ప్రత్యేకించి సంఫ్‌ు పరివార్‌ ప్రభుత్వం మారణకాండ సాగిస్తున్నప్పుడు, ప్రజాశక్తులకు తీవ్రమైన నష్టాలు జరుగుతున్నప్పుడు, ఆ నేపథ్యంలో అసలు పోరాటం గురించే కొందరు పనిగట్టుకుని వ్యతిరేకత ప్రచారం చేస్తున్నప్పుడు సమాజంలో, ముఖ్యంగా విప్లవ సానుభూతిపరులలో, ఆందోళన, నిరాశ, నిరుత్సాహం, సందేహాలు వ్యాపిస్తున్న సమయంలో ఈ పుస్తకం చదువరులలో చారిత్రక దృక్పథం నుంచి గొప్ప ఆశావాదాన్ని, స్థైర్యాన్ని నింపుతుంది.
మూడు, ఇది ఇటీవల తరిగిపోయిన ఒక మేధా సంప్రదాయపు పునరుద్ధరణ. ఎప్పుడైనా సంభాషణ, చర్చ, వాదవివాదాల క్రమంలోనే, భిన్నాభిప్రాయాల రాపిడిలోనే కొత్త భావాలు, సమాజ పురోగమనానికి అవసరమైన భావాలు రూపు దిద్దుకుంటాయి. కాని తెలుగు మేధా సంప్రదాయంలో అనేక కారణాల వల్ల ఆ వాదవివాదాల, సంభాషణ పద్ధతి దాదాపు కనుమరుగైనంతగా తగ్గిపోయింది. ఈ పుస్తకం ఆ అవసరమైన చర్చా సంప్రదాయాన్ని మరొకసారి వేదిక మీదికి తీసుకువస్తున్నది.
౦ ౦ ౦

తెలుగు సమాజంలో విప్లవోద్యమానికీ ప్రభుత్వానికీ మధ్య చర్చలు జరిగి, కనీసంగానైనా శాంతి ఏర్పడాలని, ఇరువైపులా ప్రాణహాని ఉండగూడదని అభిప్రాయం మూడు దశాబ్దాలకు పైగా ఉంది. ఆ ప్రయత్నాలకు ఒక హైకోర్టు తీర్పుతో బీజం పడి, చాలా ఓపికగా ఒక దశాబ్దం పాటు అటూ ఇటూ సంభాషణ సాగిన తర్వాత, ఒకటి రెండు విఫల ప్రయత్నాల తర్వాత, 2004లో చరిత్రాత్మకమైన చర్చలు జరిగాయి. అది ఒకవైపు నుంచి ఉజ్వల సందర్భం. అలాగే, తదనంతర పరిణామాల వైపు నుంచి చూసినప్పుడు అది ఒక విషాద సందర్భం కూడా. చర్చల విషయంలో ప్రజా పోరాట శక్తులు మరెంత జాగరూకతతో ఉండాలో చరిత్ర పాఠాలు నేర్పిన అనుభవం అది. ఆ తరవాత రెండు దశాబ్దాలు గడిచాయి. భిన్నమైన పాలకవర్గ ముఠాలు అధికారంలోకి వచ్చాయి. సంఫ్‌ు పరివార్‌ పాలకవర్గమే చర్చలకు ప్రతిపాదన చేసింది. మరొకవైపు అదే తేదీలు నిర్ణయించి మరీ విప్లవకారులను, విప్లవోద్యమాన్ని, అసలు విప్లవ భావజాలాన్నే నిర్మూలిస్తానని ప్రకటిస్తున్నది. ఆ సమయంలో ప్రభుత్వమే చేసిన ప్రతిపాదనను ముందుకు తీసుకుపోవాలనే డిమాండ్‌ విప్లవకారుల వైపు నుంచి వచ్చింది. పౌరసమాజం నుంచి వచ్చింది. ముఖ్యంగా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్‌ లో ఆ డిమాండ్‌ విస్తృతంగా ప్రజల మద్దతును కూడగట్టుకున్నది.

చర్చ అనే ప్రతిపాదనే నిజానికి పాలకులకూ ప్రజలకూ, ప్రభుత్వానికీ ప్రజాపోరాటశక్తుల మధ్య అని మాత్రమే కాదు. అది ప్రజల మధ్య కూడా జరగాలి, భిన్నాభిప్రాయాల మధ్య జరగాలి. ప్రజా పోరాట శక్తులు ఏమి అనుకుంటున్నాయో ప్రజలకు తెలియాలి, ప్రజలు ఏమి అనుకుంటున్నారో పోరాట శక్తులకు తెలియాలి. ఇంకా మన సమాజం స్పష్టమైన వర్గ విభజనతో రెండే ఎదురుబొదురు అభిప్రాయాలు ఉండే స్థితికి చేరలేదు గనుక, ఇప్పటికీ అనేక అంతరాలతో, అనేక దృక్కోణాలతో, అనేక ప్రభావాలతో, అనేక ప్రయోజనాలతో ప్రజలు చీలి ఉన్నారు గనుక, ముఖ్యంగా విద్యావంతులు, ఆలోచనాపరులు, పౌర సమాజ సభ్యులు మరింతగా చీలి ఉన్నారు గనుక తప్పనిసరిగా అటువంటి భిన్నాభిప్రాయాలు, భిన్నాభిప్రాయాల ఛాయలు ఎన్నో వెలికి వస్తాయి. ప్రభుత్వానికీ పోరాటశక్తులకూ చర్చల మాట ఎలా ఉన్నా, ప్రజల మధ్య చర్చ జరుగుతుంది, ప్రజా చైతన్యం ఒక మెట్టు పైకి ఎదుగుతుంది. నిజంగా చర్చలకు ఉండే విస్తృత అర్థం ఇది. చాలా ఆహ్వానించదగిన పరిణామం ఇది.

తెలుగు సమాజంలో కూడా అటువంటి చర్చ జరిగింది. కొన్ని అభిప్రాయాలు చర్చిస్తున్న విషయం పట్ల అరకొర జ్ఞానంతో, సమాచారంతో వెలువడినట్టు కనబడవచ్చు. కాని సమాజంలో, మేధా సాంప్రదాయంలో నెలకొని ఉన్న అస్పష్టతకూ, అన్యవర్గ భావజాలపు ప్రభావాలకూ, గందరగోళానికీ ఒక నిదర్శనం అది. అటువంటి అభిప్రాయాల నుంచీ, అంతకన్నా మెరుగుగా వ్యక్తమైన అభిప్రాయాల నుంచీ సారాంశాన్ని వడకట్టి, సమాజంలో ఒక స్థలంలో, ఒక కాలంలో ఎన్నెన్ని ఎటువంటి అభిప్రాయాలూ, వాదనలూ ఉన్నాయో, ఉండగల అవకాశం ఉందో అర్థం చేసుకుని, ఓపికగా జవాబు చెప్పవలసిన బాధ్యత విప్లవోద్యమానిదే. స్పష్టంగా కొట్టవచ్చినట్టుగా కనబడే పాలకవర్గ వాదనలను ఖండిరచవచ్చు. కాని ఆ పాలకవర్గ వాదనలకు సుదూర, సమీప ప్రతిబింబాలుగా ప్రజల నుంచే, ఆలోచనాపరుల నుంచే వచ్చే వాదనలను అర్థం చేసుకోవాలి, వివరించాలి, విశ్లేషించాలి, జవాబు చెప్పాలి. అది విప్లవోద్యమ బాధ్యత. ఆ బాధ్యతను ఈ పుస్తకం నెరవేరుస్తున్నది.
౦ ౦ ౦

వాదన, ప్రతివాదన, చర్చ, సంభాషణ కేవలం సిద్ధాంత స్థాయివి మాత్రమే కాదు. అవి ఒక నిత్యజీవిత జీవన్మరణ సంఘర్షణ నుంచి, కళ్ల ఎదురుగా రాలిపోతున్న మెరికల్లాంటి వీర యోధుల గురించి అయినప్పుడు, ఆ చర్చకు భావోద్వేగ విస్తరణ ఉంటుంది. కన్నీళ్లూ నెత్తురూ కలిసిన చర్చ అది. ఈ ప్రాణాలు పోకుండా కాపాడడం ఎట్లా అనే మానవీయమైన, సహజమైన, సానుభూతి పూర్వకమైన స్పందనలూ ఉంటాయి. మీ తప్పుల వల్లే మీ ప్రాణాలు పోతున్నాయి అని బాధితుల మీదనే బండలు వేసే స్పందనలూ ఉంటాయి. మారణకాండ జరుపుతున్న పాలకవర్గాలను పల్లెత్తు మాట అనకుండా, ప్రాణాలు పోగొట్టుకుంటున్న వీర యోధుల తప్పులు వెతికే పని జరుగుతుంది. గత నాలుగైదు నెలల్లో ఆ పని కూడా తెలుగులో పెద్ద ఎత్తునే సాగింది.

అసలు విప్లవోద్యమపు పంథానే తప్పు అనే దగ్గరి నుంచి, భారత విప్లవ దశ గురించి విప్లవోద్యమ అంచనానే తప్పు అనే వరకు, పోరాటం వదిలి ఇంటికి రావడం మంచిది అనే దగ్గరి నుంచి, ఎన్నికలలో పాల్గొని తమ లక్ష్యాలేవో సాధించవచ్చు అనేవరకు ఎన్నెన్నో వాదనలు వినిపించాయి. విప్లవోద్యమ సానుభూతిపరులలో, ఆలోచనాపరులలో ఈ వాదనలు రేపిన సైద్ధాంతిక గందరగోళాన్ని మించినది, భావోద్వేగ కల్లోలం. ఈ విపరీతమైన, వ్యతిరేకమైన వాదనలు ఎంతోమందిని మానసిక గందరగోళానికి, నిరాశా నిరుత్సాహాలకు గురి చేశాయి. ఇది పాలకవర్గాలు ఉద్దేశపూర్వకంగా ప్రారంభించిన మానసిక యుద్ధంలో, మంద్రస్థాయి యుద్ధంలో భాగం. ఆ వాదనలు ముందుకు తెచ్చినవారు నేరుగా పాలకవర్గానికి చెందినవారు కానక్కరలేదు. పాలకవర్గ భావజాలానికి, ప్రచారాలకు సుదూరంగానైనా ప్రభావితమైనవారు కావచ్చు. ఆ మానసిక యుద్ధం లక్ష్యం విప్లవోద్యమానికి మద్దతుదార్లుగా, సానుభూతిపరులుగా ఉన్నవారిలో అనుమానాలు, సందేహాలు, భయాలు, నిరాశా నిస్పృహలు రేకెత్తించడం. వారి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడం. తద్వారా విప్లవోద్యమ భావజాల పునాదిని కొంతవరకైనా తగ్గించడం. గత నాలుగైదు నెలల చర్చ ఆ పని కొంత వరకు చేయగలిగింది. చారిత్రక భౌతికవాదం వెలుగులో, వర్గపోరాట నిరంతరాయత పునాదిగా ప్రజల సృజనాత్మకతను, చొరవను, భావోద్వేగాలను, స్థైర్యాన్ని కాపాడడం, నిలబెట్టడం, పురోగమింపజేయడం ఇవాళ్టి చారిత్రక అవసరం. ఈ పుస్తకం ఆ ప్రయత్నంలో భాగం.
౦ ౦ ౦

చరిత్రలో ఒక స్థలమూ ఒక కాలమూ ప్రత్యేకంగా మారుతాయి. నింపాదిగా నిశ్శబ్దంగా నిలిచి ఉన్నట్టు కనబడే స్థలంలో అలలు లేకుండా ప్రవహిస్తున్నట్టు కనబడే కాలంలో హఠాత్తుగా ఒక సంచలనం రేగుతుంది. సంభాషణ తీవ్రమవుతుంది. భిన్నాభిప్రాయాలు, అనేక అభిప్రాయాలూ సంఘర్షిస్తాయి. అప్పటిదాకా తమ మనసులో దాచుకున్న మాటలు చెప్పే వేదిక ఇదే, చెప్పవలసిన సమయం ఇదే అని ఎందరెందరో అనుకునే స్థితి వస్తుంది. అనేకానేక వాదనల, భిన్న ఛాయల అభిప్రాయాల, విశ్లేషణల విస్ఫోటనం ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది. సరిగ్గా అది ఆ వాద వివాదాల మథనం నుంచి ఒక నిజమైన వాదన పెల్లుబికే స్థలమూ కాలమూ కూడా.
అవును, అటువంటి ప్రతి సంక్షోభ కాలమూ ఒక నిజమైన వాదనను కంటుంది. పాలకవర్గాలు ఉద్దేశపూర్వకంగా, ఆలోచనాపరులు ఇతరేతర ప్రభావాలతో, గందరగోళంతో, అస్పష్టతతో, దిక్కుతోచనితనంలో ప్రవచించే అనేకానేక వాదనల రణగొణ ధ్వని మధ్యనే కాలం తనదైన వాదనను, నిజమైన వాదనను వినిపిస్తుంది. గతాన్ని సమీక్షించి, వర్తమానాన్ని కూలంకషంగా అవగాహన చేసుకుని, భవిష్యత్తుకు మార్గం వేస్తుంది. అయితే ఇది కేవలం వాదన ప్రత్యేకతో, ఆ వాదన వినిపించే వ్యక్తి ప్రత్యేకతో కాదు, ఆ వాదన ఆచరణతో, చరిత్రతో, సమాజంతో, భవిష్యత్తు స్వప్నంతో విడదీయరాని బంధంలో ఉన్నప్పుడు మాత్రమే ఒక వాదనకు సరైనదయ్యే శక్తి వస్తుంది. ఒక్కొక్కసారి అది కేవలం ఇతర వాదనలకు జవాబు అనో, స్పందన అనో, ప్రతిచర్య అనో పైకి కనబడుతుంది గాని, ఆ ఇతర వాదనలను పూర్వపక్షం చేసే, తనకు తానే ఒక సిద్ధాంతాన్ని స్థాపించే, ఆ స్థలపు, ఆ కాలపు మేధా కృషికి అసాధారణ చేర్పు అయిన అద్భుత కృషి కూడా అవుతుంది.

ఇటువంటి సందర్భాలు ప్రపంచ మేధా చరిత్రలో అనేకసార్లు వచ్చాయి. వాదవివాదాలలోనే, అనేక వాదనల గందరగోళం మధ్యనే అద్భుతమైన వాదనలు ఆవిర్భవించాయి. సోక్రటీస్‌ వాదనల నుంచి మార్క్స్‌ వాదనల దాకా చరిత్రకు ఎక్కినది అందువల్లనే. హెగెల్‌, ఫ్యూర్‌ బా, స్టీర్నర్‌, బావర్‌, ప్రౌధాన్‌, డ్యూరింగ్‌, ఆడమ్‌ స్మిత్‌, రికార్డో, మాల్థస్‌, లాసాల్‌, బకూనిన్‌ వంటి ఎందరో భావవాదులతో, యాంత్రిక భౌతికవాదులతో, ఉదారవాదులతో, యథాస్థితి సమర్థకులతో, ఊహాజనిత సోషలిస్టులతో, అరాచకవాదులతో సంభాషణా క్రమంలో మార్క్స్‌ అటువంటి వాదనలను అభివృద్ధి చేశాడు. ఆ వాదనలను అటు సిద్ధాంతంలోనూ ఇటు ఆచరణలో కూడా అన్వయించి మరింత పరిపుష్టం చేసినవారు పారిస్‌ కమ్యూన్‌ కమ్యూనార్డులు, లెనిన్‌ నాయకత్వంలో బోల్షివిక్కులు, మావో నాయకత్వంలో చైనా కమ్యూనిస్టులు, ప్రపంచ విప్లవాలన్నిటిలో ఎందరో ఆలోచనాచారణ వాదులు.
ఇతర భాషల మేధా సంప్రదాయంలో పాలిమిక్స్‌ అని పిలిచే ఈ అత్యవసరమైన సంభాషణా పద్ధతి తెలుగులో ఒకప్పుడు ఉండినప్పటికీ, ఇటీవలికాలంలో విచారకరంగా చాలా తగ్గిపోయింది. భిన్న వాదనల మధ్య సంభాషణా, చర్చా క్రమంలోనే సరైన వాదనలు నిగ్గు తేలుతాయనే నిరూపిత సత్యాన్ని విస్మరించి, నొప్పింపక, తానొవ్వక తమ భావాలు మాత్రం తాము చెప్పుకుని, తాము మెచ్చే భావాలు మాత్రమే చదువుతూ, వింటూ, చర్చా సంప్రదాయాన్ని మరిచిపోయిన తరం తెలుగు మేధా లోకంలోకి వచ్చింది. వాస్తవంగా భిన్నాభిప్రాయాలున్నప్పటికీ, చర్చించి నిగ్గు తేల్చకుండా తప్పుకుపోయే ధోరణి పెరిగింది. ఈ పుస్తకం మళ్లీ ఒకసారి పాలిమిక్స్‌ ను రంగం మీదికి తెస్తున్నది.

అలా మన సమకాలీన, వర్తమాన ప్రపంచంలో, తెలుగు సమాజంలో జరుగుతున్న చర్చల నేపథ్యంలో ఈ కాలానికి అత్యవసరమైన పుస్తకం ఇది.

One thought on “ఈ కాలపు అవసరం ఈ పుస్తకం

  1. Maa Satyam
    Iam Very deeply
    agreeing with the statement given by Comrade Jagan (CPI Maoist Party)
    There are only two paths before us all.
    There are only two possibilities:
    to fight or to give up, I chose tofight.

Leave a Reply