14 అక్టోబర్‌ కామ్రేడ్‌ అక్కిరాజు హరగోపాల్‌ రెండేళ్ల క్రితం దండకారణ్యం – బస్తర్‌లో మరణించిన రోజు – అమరత్వం పొందిన రోజు.

 జీవిస్తాం జీవిస్తాం ప్రజల కోసమే జీవిస్తాం..

 మరణిస్తాం మరణిస్తాం ప్రజల కోసమే మరణిస్తాం..

 అని 11 అక్టోబర్‌ 2004లో గుత్తికొండ బిలం అమరుడు చారుమజుందార్‌ స్మారక స్థూపం దగ్గర వేలాది మంది ప్రజల ముందు దేశంలోని కోట్లాది పీడిత ప్రజలకిచ్చిన మాట ఆయన నిలుపుకున్నాడు. అప్పటికొక 25 ఏళ్లుగా సాయుధ విప్లవాచరణలో ఉన్నాడు.  నల్లమల విప్లవోద్యమ నిర్మాణానికి నాయకత్వం వహించాడు. సాయుధ విప్లవ శాంతి స్వాప్నికుడుగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో చర్చలకు వెళ్లే రెండు విప్లవ పార్టీల టీంకు నాయకత్వం వహిస్తూ ఆ బాధ్యత పడ్డాడు.

 మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడుగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో మా కోసం ఏదీ అడగడానికి రాలేదు. మీకేం కావాలని అడగడానికి రాలేదు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన మీరు ప్రజలకు ఏం చేశారని అడగడానికి వచ్చామన్నాడు. శాంతి చర్చలు ముగిసి ఏఓబి ఉద్యమ నిర్మాణానికి వెళ్ళాడు. ఏఓబి  విప్లవోద్యమ నిర్మాణం చేసి బస్తర్‌కు వెళ్లాడు. ఏఓబి ఉద్యమానికి కూడా నిర్దేశకత్వం వహించాడు.

సరిగ్గా ఇదే రోజు 14 అక్టోబర్‌ 2025న మల్లోజుల వేణుగోపాల్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఆత్మహత్య పాపం కనుక ఆయుధంతో పాటు మోషా నయా పీష్వాయీ బ్రాహ్మణీయ ఫాసిస్టు నిరంకుశ దళారీగా కార్పొరేట్‌ దాహాన్ని తీర్చడానికి లొంగిపోయాడు. జీవచ్ఛవంగా బతుకమన్నాడు. సోనుగా 18 ఏళ్లు పొలిట్‌ బ్యూరో సభ్యుడుగా, కేంద్రకమిటీలో 28 ఏళ్లుగా సభ్యుడుగా కొనసాగి ఆజాద్‌ అమరత్వం తర్వాత అభయ్‌గా మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ అధికార ప్రతినిధిగా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్‌ బసవరాజు (నంబళ్ల కేశవరావు బతికుండగానే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు 2025 మార్చ్‌ 28న శాంతి చర్చల ప్రతిపాదన చేసాడు. ఇంక  బతకనున్నది  రెండు మూడేళ్లే అని ఆ వృద్ధ విప్లవ యోధుడు ఎంతో మంది యువ విప్లవకారులను కాపాడుతూ 28 మందితో యుద్ధరంగంలో, కగార్‌ ఆక్రమణ దాడి ఎదుర్కొంటూ ప్రజా యుద్ధంలో అమరుడయ్యాడు.

సాయుధ పోరాటానికి తాత్కాలిక విరమణ భాష్యాలు చెప్తూ ఆ తర్వాత మల్లోజుల వేణుగోపాల్‌ ఈ రోజు తా చెడ్డ కోతి వనమల్లా చెరచినట్లు మరో అరవై మందితో గడ్చిరోలీలో లొంగిపోయాడు. ఇప్పటికి ఈ లొంగుబాటు గురించి ఛత్తీస్‌గఢ్‌ ఉప ముఖ్యమంత్రి ఇంక బస్తర్‌ తమ ఆక్రమణలోకి వచ్చినట్లే అని ప్రకటించాడు గానీ బహుశా గడ్చిరోలీలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి  నయీ పీష్వాయి ప్రతినిధి ఫడ్నవీస్‌ ముందు ఆయన ఆత్మార్పణ చూపుతారు.  కగార్‌ ఆక్రమణ దాడిలో కామ్రేడ్‌ బసవరాజు ఆయన సహచర కామ్రేడ్స్‌ అమరులు కాగానే ఫడ్నవీస్‌ ప్రభుత్వం సూరజ్‌గడ్‌ ఖనిజాల తవ్వకానికి లాయిడ్స్‌ కంపెనీకి లక్ష చెట్లు నరకడానికి అనుమతి ఇచ్చి లాయిడ్స్‌ కంపెనీతో ఉన్న ఒప్పందాన్ని 2057 వరకు పొడిగించింది. ఆనాటి నుంచే కాదు అభయ్‌ సహచరి ఆయుధంతోపాటు లొంగిపోయి 25 లక్షల ప్రభుత్వ రివార్డు తీసుకున్న నాటి నుంచీ గడ్చిరోలికి వచ్చినప్పుడల్లా ఇప్పుడు తార మా ప్రభుత్వ పునరావాసంలోనే గడ్చిరోలిలోని పోలీస్‌ లెన్స్‌లో ఉంది త్వరలో మల్లోజుల వేణుగోపాల్‌ కూడా లొంగిపోతాడని ప్రకటిస్తూ వస్తున్నాడు. ఒక చిగురిస్తున్న మొలకగా బస్తర్‌లోకి మొదటి ఏడు దళాలతో ప్రవేశించిన మల్లోజుల వేణుగోపాల్‌ నవయవ్వనం నుంచి 63 ఏళ్ల నాటికి సోను,  అభయ్‌గా దండకారణ్యంలో మావోయిస్టు పార్టీ అభివక్తగా ఒక మహా వృక్షమయ్యాడని భావించాం. కానీ ఈ చెట్టు చెదలు పట్టి, చెదలు అడివంత ఎట్ల పాకుతూ ఇంత నష్టానికి, ఇంత వెన్నుపోటుకు దారి తీసిందీ విప్లవోద్యమ చరిత్రలో ఒక ద్రోహ కాల్‌గా నిలిచిపోతుంది.

ఆర్‌కె విప్లవ ఆదర్శాన్ని చూసాం. ఏ ఆజాద్‌ నుంచి కేంద్ర కమిటీ అభివక్త సంప్రదాయాన్ని చేపట్టాడో ఆయన విప్లవ ఆదర్శ అమరత్వమెక్కడ? అభయ్‌ భయస్తుడుగా పిరికివాడుగా  ఆయుధంతో సహా లొంగిపోవడం ఎక్కడ?

 వైఎస్‌ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాగానే అరవింద రావు ఇంటెలిజెన్స్‌ డిజిపిగా ఉన్న రోజుల్లో కరీంనగర్‌ జిల్లా ఎస్‌పి ప్రవీణ్‌ కుమార్‌ సిపిఐ ఎంఎల్‌ జనశక్తి కరీంనగర్‌ జిల్లా కార్యదర్శి, రాష్ట్ర కమిటీ సభ్యుడు రణధీర్‌ నాయకత్వంలో 40 మంది అజ్ఞాత జనశక్తి దళ సభ్యులను యూనిఫారాలతో, ఆయుధాలతో హైదరాబాద్‌లో సరెండర్‌ చేయించాడు.

త్వరలోనే పీపుల్స్‌వార్‌లో గణనీయ సంఖ్యలోనే ఇట్లాగే లొంగిపోతారని మాకు విశ్వసనీయ సమాచారం ఉందన్నాడు వైఎస్‌  రాజశేఖర రెడ్డి. అది కాస్త పీపుల్స్‌వార్‌ ఎంసిసి శాంతి చర్చల కన్నా మూడు వారాల ముందే ఐక్యమై దేశంలో ఒక సాయుధ విప్లవ ఏకైక పార్టీగా అవిర్భవించి చర్చలకు వచ్చి ప్రకటించి పాలకుల గుండెలు జారేలా చేసింది. అది నక్సల్బరీ రైతాంగ సాయుధ పోరాట సంప్రదాయం. వర్గాలు ఉన్నంతకాలం వర్గ పోరాటం ఉంటుంది. వర్గ పోరాట అత్యున్నత రూపమే సాయుధ పోరాటం. ఇది దీర్ఘకాలిక ప్రజా పోరాటంగా నూతన ప్రజాస్వామ్య విప్లవాన్ని సాగిస్తుంది.

ఈ నలభై ఐదేళ్లుగా ఈ మౌలిక సత్యాన్ని ఎందరో శ్రేణులకు వివరించి ఉంటాడు అభయ్‌ కానీ, ఆయన ఆత్మహత్యా సదృశ్యమైన నిర్ణయం తీసుకోవడం దాకా దిగజారాడనుకున్నాం గాని ప్రతిఘాత విప్లవానికి పూనుకునే విప్లవ ద్రోహి అవుతాడనుకోలేదు.

బస్తర్‌లోని ప్రజల, ఆదివాసి ప్రజల, పార్టీ శ్రేణుల ప్రజాయుద్ధ ఆయుధాలను గడ్చిరోలీ శత్రువుకు అప్పగించే అధికారం ఎవరిచ్చారు మల్లోజుల వేణుగోపాల్‌కు? ఆ ఆయుధాలు ప్రజలవి. ప్రజల చెమట, నెత్తురు శ్వాసలతో తయారు చేసుకున్నారో, శత్రువు నుంచి స్వాధీనం చేసుకున్నారో, వాటిని శత్రువుకు అప్పగించే అధికారం కాదు గదా హక్కు కూడ మల్లోజుల వేణుగోపాల్‌కి,  ఆయన వెంట లొంగిపోయిన వారికెక్కడిది?

ఆ మేరకు పార్టీ చేసిన హెచ్చరికను కూడా ఆయన ఖాతరు చేయలేదంటే ఎంత ప్రలోభానికి లోనయ్యాడు, ఎంత కుట్రపూరితమైన వ్యూహంతో బిజెపి ముఖ్యమంత్రి అందులోనూ ఫడ్నవీస్‌  ప్రభుత్వానికి ఆయుధాలు ఇచ్చి లొంగిపోయిన వాళ్లు డిఆర్‌జి, సల్వాజుడుంల కన్నా నైచ్యానికి ఒడిగొట్టినట్లే.

ఎన్ని సాదృశ్యాలు, ఎన్ని దృష్టాంతాలు – ఈరోజు రేణుక (మిడ్కో, దమయంతి, చైతు) జయంతి. ఏభైౖ ఐదేళ్ల రేణుక ఎట్లా విప్లవోద్యమంలోకి తన 18 వ ఏట వచ్చి పూర్తికాలపు వృత్తి విప్లవాన్ని ఎంచుకుని 20 ఏళ్లు ఏవోబి, డీకేలలో విప్లవోద్యమ ప్రచార బాధ్యతలలో సాధన కన్నా ఎంతో చేయి తిరిగిన రచయితగా దేశ వ్యాప్తంగా ప్రసిద్ధమై ఎన్‌కౌంటర్‌లో అమరురాలయింది. అప్పటికామె నెల రోజులుగా జ్వర పీడితురాలై ఒక ఆదివాసి మహిళ ఇంట్లో ఆశ్రయం తీసుకుంటున్నది. ఆమె  మడమ తిప్పని పోరాటాన్ని అమరత్వాన్ని తెలంగాణ అంతటా, దేశమంతటా ప్రజలు గానం చేస్తున్నారు.

 రాజ్యం ప్రమేయం ఎంత లోతుగా లేకపోతే మల్లోజుల ఇంత ద్రోహానికి తలపెడతాడు?  నిన్ననే పూర్వ విప్లవ విద్యార్థులందరూ ముక్తకంఠంగా వర్గ పోరాట ఉన్నత రూపంగా సాయుధ పోరాటాన్ని ఎత్తిపట్టారు.

ఇది గోవిందరెడ్డి ద్రోహం కన్నా మించిన ద్రోహం.  ఆ ద్రోహంలో ముగ్గురు కేంద్ర కమిటీ సభ్యులు అమరులయినా, ఒక కంట కన్నీరు తుడుచుకొని మరొక కంట అగ్ని జ్వాలలు వెదజల్లినట్లుగా ఒక సంవత్సరం తిరిగే వరకు ఆ ముగ్గురి అమరత్వం ప్రజా విముక్తి గెరిల్లా సైన్యం ఏర్పాటుకు దారితీసింది. పార్టీ ప్రధాన కార్యదర్శి అమరత్వం తర్వాత పిఎల్‌జిఎ వారోత్సవంలో కగార్‌ ఆక్రమణ యుద్ధంలో అమరులైన వారిని స్మరించుకొంది.

ప్రజా సైన్యం లేకుండా ప్రజలకు దక్కేదేమి లేదని, పార్టీ, ఐక్యసంఘటన, ప్రజాసైన్యం, విప్లవ పార్టీ చేతిలోని మూడు మంత్రదండాలని ప్రకటించుకున్నారు. అంతెందుకు పార్టీ ఆవిర్భావ వారోత్సవాలు సెప్టెంబర్‌ 21 నుంచి 28 వరకు నిర్వహించాలని పిలుపు ఇచ్చి, అది కూడ సాయుధ ప్రతిజ్ఞలుగా గెరిల్లాల కవాతులతో, సాంస్మృతిక కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. ఈ మొత్తం క్రమంలో 22 పేజీల లేఖతోపాటు ఎందులో కూడ మల్లోజుల వేణుగోపాల్‌ ఈ రాజ్య స్వభావాన్ని అర్ధ భూస్వామ్య, అర్ధవలస, దళారీ నిరంకుశ రాజ్యంగానే నిర్వచిస్తూనే వచ్చాడు గానీ, 2014లో మోడీ ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచి ముఖ్యంగా సూరజ్‌ఖుండ్‌ వ్యూహంగా, కగార్‌ ఆక్రమణ యుద్ధాన్ని ప్రారంభించిన జనవరి 1 2025 దాకా ఇది హిందూబ్రాహ్మణీయ వ్యవస్థ అనే రాజ్య స్వభావాన్ని  ప్రస్తావించడం లేదు. ఇవ్వాళ ఆ బ్రాహ్మణీయ హిందూ ఫాసిస్టు ప్రభుత్వం ముందు ఆయుధంతోపాటు లొంగిపోవడానికి సిద్ధపడ్డాడు. ఈ మహా వృక్షమనుకున్న దానిలో చీడ ఎప్పుడు, ఎట్లా ప్రవేశింది?

తల్లికి రాసిన ఉత్తరంలో మల్లోజుల వేణుగోపాల్‌.. కోటేశ్వర్‌, తాను రెండు వేగుచుక్కల వంటి వాళ్లమని పోల్చుకున్నాడు. మరి ఆయనేమో జగిత్యాల జైత్రయాత్ర నుంచి దండకారణ్యం మీదుగా జంగల్‌ మహల్‌ దాకా ఒక మహాప్రస్థానం చేసి విస్తరించి శాంతి చర్చల ప్రయత్నంలో భాగంగానే ఎన్‌కౌంటర్‌లో అమరుడై నిజంగానే నింగిలో ఒక వేగుచుక్కగా నిలిచాడు.

ఇవ్వాళ మల్లోజుల వేణుగోపాల్‌ ఒక ఉల్కాపాతంగా పాతాళానికి దిగజారిపోయాడు.

జీవచ్ఛవం అన్నాను గదా .. ఆయన బస్తర్‌ నుంచి గడ్చిరోలికి ఆయుధాలతో పాటు లొంగిపోవడానికి వచ్చిన చోటనే  దండకారణ్య అభివక్త వికల్ప్‌`కాతా రామచంద్రారెడ్డి మృతదేహం`ఒక సామాజిక మానవీయ న్యాయం కోసం బిలాస్‌పూర్‌  హైకోర్టు నుంచి ఢల్లీి సుప్రీం కోర్టు దాకా గౌరవ అంత్యక్రియల కోసం పోరాడుతున్నది. కోసా, వికల్ప్‌లది బూటకపు ఎన్‌కౌంటర్‌ అనే స్పష్టమైన సాక్ష్యంతో పార్టీ లేఖ ఆధారంగానే కాదు మృతదేహాల మీద చిత్రహింసల ఆధారంగా పోరాడుతున్నది. అభయ్‌ పేరుతో తాత్కాలిక సాయుధ పోరాట విరమణ ప్రకటన వచ్చిన మరునాడే వేణుగోపాల్‌కు  ‘అభయ్‌’గా ఆ ప్రకటన ఇచ్చే అర్హతలేదని  అభయ్‌,  వికల్ప్‌ పేరుతో ప్రకటన వచ్చింది. రామచంద్రారెడ్డి తన సహచరితోపాటు విప్లవోద్యమంలో చేసిన ప్రయాణం, ఆయన అజ్ఞాత జీవితం, మాలతి జైలు జీవితం, ఆయన ఒక టీచర్‌గా, లాయర్‌గా ప్రారంభమై విప్లవ కుటుంబంగా ఎట్లా మునుసాగిందో వేణుగోపాల్‌ కళ్లముందు ` కరీంనగర్‌ జిల్లా సరిహద్దుల నుంచే ఉన్నది. జగిత్యాల జైత్రయాత్ర నుంచి, కుక్కల గూడురు భూమయ్య కిష్టాగౌడ్‌ స్థూపావిష్కరణ నుంచి, ఆర్‌వైఎల్‌ కంది లచ్చిరెడ్డి బస్సు ప్రమాదంలో అమరుడైన సందర్భంగా వేలాది మంది సభనుంచి ` వేణుగోపాల్‌ నిజాం వెంకటేశం కన్నుమూసినపుడు రాసిన స్మృతి వ్యాసంలోనే చదువుకుంటే కడారి సత్యనారాయణరెడ్డి ప్రయాణం, అమరత్వం హిమాలయాలకన్నా ఉన్నతమైనది.  ఇపుడిరక రెనగేడ్‌ వేణుగోపాల్‌ విద్రోహాన్ని అమాయకమైన కోడి ఈకతో కూడ పోల్చలేం.   విప్లవ ప్రతీఘాతక సాయుధ ఆత్మహత్యను దేనితోనూ పోల్చడానికి లేదు. విప్లవోద్యమం ఈ ఆటు నుంచి కోలుకొని ఒక పోటుగా లేచి నిలుస్తుంది. బ్రిటిష్‌ సామ్రాజ్యవాదంతో పోరాడిన భూంకాల్‌ యోధుడు గుండాదర్‌ను పరిచయం చేసిన అభయ్‌ ఎంత  అంధకార అగాథంలోకి కూరుకపోయాడో. సరిగ్గా లింపియావో మరణం గురించి మావో ఒక ఉత్తరంలో చియాంగ్‌ చింగ్‌కు రాస్తూ   abysmal depths అనే  మాట ఉపయోగించారు .

చంద్రశేఖర్‌ ఆజాద్‌ తాను శత్రువు బుల్లెట్‌తో చావకూడదని తానే తన ఆయుధంతో కణతకు కాల్చుకొని, ఆయుధాన్ని శత్రువుకు చిక్కకుండా ధ్వంసం చేసాడు. వేణుగోపాల్‌ ఆత్మహత్య చేసుకొని ఆయుధం శత్రువు చేతికిచ్చి లొంగిపోయాడు.

Leave a Reply