మోడీ ఏలుబడిలో అప్పులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. 2026 మార్చి నాటికి మొత్తం అప్పు రూ. 191 లక్షల కోట్లు దాటనుంది. దేశంలోని ఒక్కొక్కరి నెత్తిపై రూ.1.37 లక్షల అప్పు ఉంది. యేటా చెల్లిస్తున్న వడ్డీ రూ. 12,76,338 కోట్లు. కేంద్ర ప్రభుత్వం చేసే అప్పులే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల అప్పులు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఈ అప్పులను తీర్చడానికి ప్రభుత్వాలు సహజంగానే ఆదాయాలు పెంచుకోవడం తప్ప మరో మార్గం లేదు. ఈ ఆదాయాలు పెంచుకోవడానికి ప్రభుత్వాలు ప్రజల మీద విపరీతమైన భారాలు వేస్తున్నాయి. ఖర్చులు తగ్గించుకోవడం పేరు మీద ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకపోవడం, సంక్షేమ పథకాలలో కోత వంటి చర్యలకు పాల్పడుతున్నాయి. ప్రజలకు ఉచితాలు ఇవ్వడం వల్లనే ప్రభుత్వాలు అప్పుల పాలవుతున్నాయనే వాదనలు పాలకులు ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వ అప్పులు :
ఇవి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి స్వదేశీ (అంతర్గత), రెండోది విదేశీ (బాహ్య) అప్పులు. ఈ రెండింటి ఆధారంగా భారతదేశ రుణ భారాన్ని అంచనా వేయవచ్చు.
దేశీయ అప్పులు … ఎక్కువ భాగం దేశీయ మార్కెట్ నుండి తీసుకుంటారు. ఈ అప్పులు ప్రభుత్వ బాండ్లు, ట్రెజరీ బిల్లులు, ఇతర ఆర్థిక సాధనాల ద్వారా సేకరించబడతాయి. ఇది విదేశీ మారక విలువ ప్రమాదాలను తగ్గిస్తుంది. అంతర్గత అప్పు అనేది దేశం లోపల నుంచి భారతీయ పౌరులు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఇంకా ఇతర సంస్థల నుంచి ప్రభుత్వం తీసుకున్న రుణాలను సూచిస్తుంది. 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రకారం, భారతదేశ అంతర్గత అప్పు దాదాపు 168 లక్షల కోట్ల రూపాయల వరకు ఉందని అంచనా.
విదేశీ అప్పులు… విదేశీ మూలాల నుంచి అంటే అంతర్జాతీయ ఆర్థిక సంస్థలైన ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు, విదేశీ వాణిజ్య బ్యాంకులు వంటి లేదా ఇతర విదేశీ రుణదాతల నుంచి తీసుకునే అప్పులు. వీటిని సాధారణంగా విదేశీ కరెన్సీలలో రుణంగా పొందుతారు, కాబట్టి మారక విలువ మార్పులపై ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు డాలరుతో రూపాయి విలువ తగ్గిపోవడంతో మన విదేశీ రుణ చెల్లింపులు అమాంతంగా పెరిగిపోతున్నాయి. విదేశీ అప్పుల భారం ఉన్నప్పుడు మారక విలువ ప్రమాదాలు, అంతర్జాతీయ ఆర్థిక మార్పులు దేశ ఆర్థిక స్థితిని ప్రభావితం చేస్తాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- ఆర్థిక మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం 2024 డిసెంబర్ నాటికి భారతదేశ విదేశీ అప్పు సుమారు 54 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది.
మొత్తం అప్పులు :
అంతర్గత-బాహ్య అప్పులను కలిపితే భారతదేశ మొత్తం అప్పు 2024-25లో సుమారు 205-210 లక్షల కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. ఇది దేశ జిడిపిలో 55-60 శాతం వరకు ఉంటుంది. దీనిలో విదేశీ అప్పు 2024 చివరి నాటికి సుమారు (650 బిలియన్ డాలర్లు) రూ.54 లక్షల కోట్లు)గా ఉంది. ఈ అప్పులు భవిష్యత్ తరాలపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వాలు చేసే స్వదేశీ, విదేశీ అప్పులకు తోడు కార్పొరేట్లు చేసే అప్పులు, పౌరులు చేసే అప్పులు కూడ ఉంటాయి.
2014 నుంచి 2025 కేంద్రం చేసిన అప్పుల వివరాలు :
ఆర్థిక సంవత్సరం అప్పులు (రూ.కోట్లలో)
2014-15 62,75,553 కోట్లు
2015-16 68,91,913 ,,
2016-17 72,15,439 ,,
2017-18 82,32,653 ,,
2018-19 90,56,725 ,,
2019-20 1,00,18,120 ,,
2020-21 1,21,21,959 ,,
2021-22 1,35,87,893 ,,
2022-23 1,52,61,122 ,,
2023-24 1,69,46,666 ,,
2024-25 1,76,70,510 ,,
2025-26 1,91,52,510 ,,
తెలుగు రాష్ట్రాల అప్పులు :
కేంద్ర ప్రభుత్వంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వాల అప్పులు కూడా గణనీయంగా పెరిగిపోతున్నాయి. 2025 మార్చి నాటికి, దేశంలోని రాష్ట్రాల మొత్తం అప్పు సుమారు 83.3 లక్షల కోట్ల రూపాయలని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఇది జాతీయ జిడిపిలో 25-30 శాతం స్థాయిలో ఉంది. దేశంలో వివిధ రాష్ట్రాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయి. కేంద్రం నుంచి చట్టపర సహాయం సక్రమంగా అందకపోవడంతో అప్పులు చేయడం, ప్రజలపై భారాలు వేయడం, ప్రభుత్వ ఆస్తులు అమ్మడం వంటివి మార్గాలుగా అనుసరిస్తున్నాయి. ఈ అప్పుల్లో కూడా స్వదేశీ, విదేశీ అప్పులు ఉంటున్నాయి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల వంటి విదేశీ సంస్థల నుంచి అప్పులు తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్ రుణాలు :
అప్పుల విశ్లేషణకు ఆంధ్ర రాష్ట్రాన్నే ఉదాహరణగా తీసుకుంటే తాజా సమాచారం ఆధారంగా, వివిధ వనరుల నుంచి అందిన డేటా ప్రకారం రాష్ట్ర అప్పులు గణనీయంగా పెరిగాయి. 2024 జూన్ నాటికి రాష్ట్ర అప్పు సుమారు రూ. 5,19,192 కోట్లుగా ఉన్నట్టు రాష్ట్ర ఆర్థిక మంత్రి శాసనమండలిలో వెల్లడించారు. పదేళ్ళ క్రితం అంటే 2014లో రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ అప్పు 1.18 లక్షల కోట్ల రూపాయలు ఉంది. 2019 నాటికి ఇది 2.64 లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది. 2023 మార్చి నాటికి రాష్ట్రం మొత్తం అప్పు 4.28 లక్షల కోట్లుగా ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదికలో పేర్కొనబడింది. 2025 మార్చి నాటికి, కేంద్ర ప్రభుత్వం పేర్కొన్న లెక్కల ప్రకారం రాష్ట్ర అప్పు 5.62 లక్షల కోట్ల రూపాయలుగా ఉందని తెలిపారు.
తెలంగాణ అప్పుల భారం :
రాష్ట్రంపై అప్పుల భారం పెరిగిపోతోంది. పాత అప్పులు, కొత్త అప్పులు కలిసి తడిసి మోపెడు కానున్నాయి. 2025-26లో తీసుకునే అప్పులతో కలిపి ఎఫ్ఆర్బిఎం పరిధిలో రాష్ట్ర అప్పు రూ. 5,04,814 కోట్లుగా ఉంటుందని బడ్జెట్లో ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు ఉన్న అప్పులకు సంబంధించి 2025-26 ఆర్థిక సంవత్సరంలో చెల్లించాల్సిన వడ్డీలు, కిస్తీలపై ప్రభుత్వం తాజా బడ్జెట్లో వివరణ ఇచ్చింది. పాత అప్పుల అసలు, కొత్త అప్పుల వడ్డీల కింద ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ. 36,396.73 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. బడ్జెట్‌కు ఆవల తీసుకున్న అప్పులు కలిపి మొత్తం రూ.8,06,298 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో కేవలం వడ్డీల కింద రూ.19,369.00 కోట్లు, కిస్తీల కింద రూ. 20,027,71 కోట్లను చెల్లించనున్నట్లు పేర్కొంది. ఈ కిస్తీలో వేస్ అండ్ మీన్స్ కాకుండా ప్రభుత్వ రుణాలకు సంబంధించి రూ. 15,848.20 కోట్లు, కేంద్ర ప్రభుత్వ రుణాలకు రూ. 440.85 కోట్లు, ఇతర రుణాలకు సంబంధించి రూ. 3,738.66 కోట్లను చెల్లించాల్సి ఉంటుందని వివరించింది. ఇదిలా ఉండగా.. రాష్ట్ర ప్రజలపై తలసరి అప్పు భారం పెరిగిపోతోంది. పాత అప్పు, తాజా బడ్జెట్లోని అప్పుతో కలిపితే ఒక్కొక్కరి నెత్తిన రూ. 2,30,346 భారం ఉంటుందని అంచనా. రాష్ట్ర బడ్జెట్ అప్పు, ఇటీవల రాష్ట్ర ప్రణాళిక శాఖ విడుదల చేసిన ‘అట్లాస్’లో రాష్ట్ర జనాభా 3,50,03,674 ఉందని తెలిపింది. దీని ప్రకారం తలసరి అప్పు రూ. 2,30,346 ఉండనుంది.
కార్పొరేట్ అప్పులు … భారతదేశంలో వివిధ కంపెనీలు వ్యాపార విస్తరణ, ఆపరేషన్లు- పెట్టుబడులకోసం రుణం తీసుకుంటాయి. భారీ కార్పొరేట్ అప్పులు దేశ ఆర్థిక స్థితిగతులను ప్రభావితం చేస్తాయి. పార్లమెంటులో ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం ఈ పదేళ్ళ కాలంలో కార్పొరేట్ల సంస్థలు 16.35 లక్షల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను మోడీ ప్రభుత్వం మాఫీ చేసింది. దీంతో పాటు గడచిన ఐదేళ్ళలో ఒక్క కార్పొరేట్ పన్ను రాయితీలే 4,53,328 కోట్ల రూపాయల మేరకు ఇచ్చింది. ఇవి కాక 2025 మార్చి నాటికి దేశంలో ఈ కార్పొరేట్ కంపెనీల అప్పులు మొత్తం 87.13 లక్షల కోట్ల రూపాయలని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ డెయిలీ, ఎకనామిక్ టైమ్స్ పత్రికలు పేర్కొన్నాయి. ఇది దేశంలోని అన్ని రాష్ట్రాల మొత్తం అప్పుల కంటే ఎక్కువ. ఈ అప్పుల వల్ల వీరి లాభాలు, ఆస్తులు పెరగడం తప్ప దేశానికి మాత్రం ప్రయోజనమేమీ లేదు, తిరిగి భారాలు మోయడం తప్ప వీరి రుణాలు దేశానికే భారంగా మారాయి.
కుటుంబ (హౌస్‌హోల్డ్) అప్పులు :
భారతదేశంలో కుటుంబ అప్పులు సాధారణంగా గృహ రుణాలు, వాహన రుణాలు, విద్యా రుణాలు, క్రెడిట్ కార్డ్ అప్పులు, వ్యక్తిగత రుణాల రూపంలో ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంకా ఇతర ఆర్థిక సంస్థల డేటా ప్రకారం గత కొన్ని సంవత్సరాలుగా వ్యక్తిగత రుణాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఉదాహరణకు 2023-24లో భారతదేశంలో రిటైల్ రుణాలు సుమారు 30 శాతం వార్షిక వృద్ధి చెందాయి. ముఖ్యంగా గృహ రుణాలు, క్రెడిట్ కార్డ్ వినియోగం వల్లను, గ్రామీణ ప్రాంతాల్లో సూక్ష్మ ఆర్థిక సంస్థల ద్వారా చిన్న రుణాలు తీసుకునే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇవి ఎక్కువగా వ్యవసాయం లేదా చిన్న వ్యాపారాల కోసం ఉపయోగపడుతున్నాయి. కొన్ని తరగతుల ప్రజల్లో ముఖ్యంగా తక్కువ ఆదాయం గల కుటుంబాలలో అప్పులు, వడ్డీల భారం పెరుగుతోంది. 2024 జూన్ నాటికి కుటుంబాల అప్పులు జిడిపిలో 42.9 శాతం ఉన్నాయని ద ఎకనామిక్స్ టైమ్స్ పేర్కొంది. ఇక్కడ కూడా కుటుంబ ఆదాయాలు, ఆస్తులు పెరగడానికి ఈ అప్పులు ఉపయోగపడితే అది సముచితమే. కానీ నేడు అత్యధిక కుటుంబాలు వైద్యం, కుటుంబ రోజువారీ అవసరాలు, పాత అప్పులు తీర్చడం వంటి వాటికే ఖర్చు చేస్తున్నారు. రైతులకు ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి రుణాలు తగ్గిపోవడంతో ఎక్కువగా అధిక వడ్డీలకు ప్రైవేటు అప్పులు తీసుకోవడం వల్ల రైతాంగం రుణాల ఊబిలో కూరుకుపోతోంది. కుటుంబ అప్పుల ప్రభావం ఆర్థిక, సామాజిక రంగాలలో ప్రస్ఫుటంగా కనపడుతుంది.
జిడిపితో అప్పుల నిష్పత్తి :
జిడిపి, అప్పుల నిష్పత్తి దేశ ఆర్థిక శక్తిని బట్టి అప్పుల భారం కొలిచే ఒక ముఖ్యమైన సూచిక. భిన్న పరిస్థితుల వల్ల ఈ నిష్పత్తి మారవచ్చు. 2023 చివరి నాటికి భారతదేశం రుణం జిడిపి నిష్పత్తి 81 శాతం పైగా ఉంది. (ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రుణం రెండూ ఉన్నాయి). వీటిలో కేంద్ర ప్రభుత్వ అప్పు జిడిపిలో 55-60 శాతం మిగిలింది రాష్ట్రాల రుణంగా చెప్పుకోవచ్చు. నేడు మొత్తం కేంద్ర, రాష్ట్రాల అప్పు జిడిపిలో నిష్పత్తి 81 శాతం పైగా ఉండడం ఆందోళనకరమైనది.
ప్రజలపై రుణాల ప్రభావాలు :
ప్రభుత్వాలు చేస్తున్న అప్పులు ప్రజల ఆదాయాలను పెంచేవిగా ఉండాలి. ఉపాధి కల్పన పెంచేవిగా ఉండాలి. మౌలిక వసతుల అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం, సామాజిక కార్యక్రమాలకు మద్దతుగా ఉండాలి. అలాంటి అప్పులు దీర్ఘకాలంలో దేశ వృద్ధిని ప్రేరేపిస్తాయి. దీనికి భిన్నంగా ఉండే అదనపు అప్పులు లేదా తప్పుగా నిర్వహించిన అప్పులు ఆర్థిక ఒత్తిడిని పెంచుతాయి.
సామాజిక ప్రభావాలు … అప్పులు పెరగడం వల్ల పన్నులు పెరిగే అవకాశం ఉంది. ఇది సామాన్య ప్రజల జీవన వ్యయాన్ని పెంచుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో అప్పులు తీర్చలేక రైతులు ఆర్థిక ఒత్తిడికి గురవుతున్నారు. ఇది కొన్ని సందర్భాల్లో తీవ్ర పరిణామాలకు దారితీస్తోంది. వేల సంఖ్యలో రైతుల ఆత్మహత్యలకు అప్పులే ప్రధాన కారణంగా తెలుస్తోంది.
సామాన్యులే సమిధలు … భారతదేశంలో ప్రజల అప్పు గురించి రెండు విధాలుగా చూడవచ్చు. ఒకటి వ్యక్తిగత అప్పులు, రెండోది దేశం మొత్తం మీద ప్రభుత్వ అప్పులు. ఎందుకంటే ప్రభుత్వ అప్పులు కూడా వివిధ రకాలైన భారాల ద్వారా అంతిమంగా ప్రజలపైనే ప్రభావం చూపుతాయి. విచిత్రమేమిటంటే కార్పొరేట్ సంస్థల అప్పుల భారం కూడా అంతిమంగా సామాన్య ప్రజల మీదే పడుతుంది. అదేలాగంటే కార్పొరేట్ బ్యాంకు రుణాలను ప్రభుత్వం మాఫీ చేయడం వల్ల పోయేది ఆ బ్యాంకులలో దాచుకున్న ప్రజల సొమ్మే కదా, కార్పొరేట్ సంస్థలేవీ బ్యాంకులలో సొమ్ము దాచుకోవు కదా.
క్షీణిస్తున్న జీవన ప్రమాణాలు :
2014-24 మధ్య పదేళ్ల కాలంలో భారతదేశం, దేశంలోని రాష్ట్రాల అప్పులు భారీగా పెరిగాయని ఎకనామిక్స్ టైమ్స్ పత్రిక పేర్కొంది. భారత దేశ విదేశీ రుణ్ 2014లో 440.06 బిలియన్ డాలర్లు ఉండగా, మార్చి 2024లో 711.8 బిలియన్ డాలర్లకు పెరిగింది. అంటే డాలర్లలో 61 శాతం పెరిగింది. అదే రూపాయలలో అయితే 26.87 లక్షల కోట్ల రూపాయల నుంచి 60.86 లక్షల కోట్ల రూపాయలకు అంటే రెట్టింపుకు పైగా పెరిగిందని తెలుస్తోంది. ఇదే కాలంలో స్వదేశీ రుణం 55.87 లక్షల కోట్ల రూపాయల నుంచి 147 లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది. అంటే సుమారు మూడు రెట్లు పెరిగింది. ఈ సంవత్సరం మరింత పెరిగి 168 లక్షల కోట్లకు చేరింది. పదేళ్లలో మొత్తం రుణాలు 82.74 లక్షల కోట్ల రూపాయల నుంచి 207.86 లక్షల కోట్ల రూపాయలకు పెరిగాయి. అంటే 151 శాతం పెరుగుదల కనిపిస్తోంది.
అప్పుల సొమ్ము ఎటు? :
అప్పులు సరే, ఈ పెరిగిన అప్పులతో ప్రభుత్వం ఏం చేసిందనేది ప్రధాన అంశం. ఈ పదేళ్ళ కాలంలో ఒక్క భారీ ప్రభుత్వ రంగ పరిశ్రమను కూడా స్థాపించలేదు. ఒక్క భారీ నీటి ప్రాజెక్టును కూడా నిర్మించలేదు. మొత్తంగా చూస్తే ఉపాధి కల్పన ఈ కాలంలో ప్రభుత్వ పెట్టుబడి వలన ఏమీ పెరగలేదు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రెండే రెండు పనులు చేస్తోంది. ఒకటి ప్రభుత్వ పెట్టుబడులు ప్రధానంగా జాతీయ రహదారులు, విమానాశ్రయాలు వంటి మౌలిక వసతుల నిర్మాణానికి ఖర్చు చేస్తోంది. విశేషమేమిటంటే వీటిని నిర్మించి, అన్నింటినీ ‘నేషనల్ మోనటైజేషన్ పైప్‌లైన్’ పేరుతో తిరిగి ప్రైవేట్ సంస్థలకు దారాదత్తం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ రెండో పెద్ద ఖర్చు కార్పొరేట్ సంస్థల రుణాల మాఫీ, వారికి రాయితీలు ఇవ్వడం.
ద్రవ్యలోటును పూడ్చేందుకే రుణాలు :
రాబడి, వ్యయాల మధ్య అంతరం పెరిగి భారీ ద్రవ్యలోటుకు దారితీయడంతో దాన్ని పూడ్చేందుకే కొత్తగా రుణాలు తీసుకోబోతున్నట్టు సమాచారం. తాజాగా సమీకరించే రూ.14.82 లక్షల కోట్ల రుణాల్లో డేటెడ్ సెక్యూరిటీ నుంచి రూ.11.54 లక్షల కోట్లు ఉంటాయని అంచనా. అలాగే, చిన్న మొత్తాల పొదుపు, ఇతర మార్గాల నుంచి మరో రూ.3.28 లక్షల కోట్లు ఉండొచ్చని తెలుస్తోంది. 1947 నుంచి 2014 ఏండ్లలో అంటే 67 ఏండ్లలో కేంద్రం చేసిన అప్పు రూ. 55,87,147 కోట్లు కాగా, నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత గడిచిన పదిన్నరేండ్లలో చేసిన అప్పు రూ.1,35,65,363 కోట్లుగా ఉన్నది. అప్పటి ప్రధానులు ఏడాదికి సగటున రూ.83 వేల కోట్లు అప్పులు చేస్తే, ప్రస్తుత ప్రధాని నెలకే రూ.1.07 లక్షల కోట్ల అప్పు చేస్తున్నారు.
ప్రజలకు ఆస్తుల కంటే అప్పులే ఎక్కువ :
భారతీయ కుటుంబాలు ఆస్తులు సృష్టించటం కంటే వేగంగా అప్పులు పెంచుకుంటున్నాయి. అంటే… పొదుపు కంటే ఖర్చు, అప్పు ఆధారిత జీవన శైలి పెరుగుతోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) తాజా గణాంకాలు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. 2019-20తో పోలిస్తే 2024-25 నాటికి కుటుంబాల వార్షిక ఆస్తులు దాదాపు 48 శాతం అధికం కాగా ఇదే సమయంలో అప్పులు మాత్రం ఏకంగా 104 శాతం పెరగడం గమనార్హం. భారతీయ కుటుంబాల వార్షిక రుణభారం 2019-20 నుంచి ఇప్పటి వరకు ఆస్తుల కంటే వేగంగా పెరిగింది. రుణాల పెరుగుదల 102 శాతంగా ఉండగా అదే సమయంలో కుటుంబాల ఆస్తులు మాత్రం 48 శాతమే పెరుగుదలను నమోదు చేశాయి. 2019-20లో భారతీయ ఫైనాన్షియల్ జిడిపిలో 12 శాతం మేర ఫైనాన్షియల్ అసెట్స్ (ఆర్థిక ఆస్తులు)ను సృష్టించాయి. అయితే అది 2024-25 నాటికి 10.8 శాతానికి తగ్గటం గమనార్హం. భారతీయ కుటుంబాల పొదుపు పద్ధతులు, పెట్టుబడులు పెట్టే విధానాలు మారుతున్నాయి. ఇప్పటికీ బ్యాంకు డిపాజిట్లు కుటుంబాల పొదుపులో ప్రధానమైనవిగా ఉన్నాయి. వాటి వాటా 32 శాతం నుంచి 33.3 శాతానికి స్వల్పంగా పెరిగింది. అయితే మ్యూచువల్ ఫండ్లు భారీగా పెరిగాయి. వాటి వాటా 2.6 శాతం నుంచి 13.1 శాతానికి ఎగబాకింది. అంటే 2019-20లో భారతీయ కుటుంబాలు రూ. 61,686 కోట్లు పెట్టుబడులుగా పెట్టగా… 2024-25లో అది రూ. 4.7 లక్షల కోట్లకు ఎగబాకింది. అంటే ఏకంగా 655 శాతం వృద్ధి నమోదైంది.
ముగింపు :
భారీ రుణభారం వడ్డీ చెల్లింపులకు దారితీస్తుంది. ఇది ప్రజల ఆర్థిక భారాన్ని పెంచుతుంది. అభివృద్ధి పనులకు నిధుల కొరత ఏర్పడుతుంది. మొత్తంగా ఆర్థిక వ్యవస్థను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఆర్థిక అస్తిరత్వం పెరుగుతుంది. పెరిగిన అసమానత మొత్తం సామాజిక చలన శీలతను తగ్గించడం ద్వారా ప్రజా జీవితాలను ప్రభావితం చేస్తుంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు పెట్టుబడులు తగ్గి ప్రజల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతుంది. అధిక అప్పుల వల్ల ఒక పక్క దేశంలోని అత్యధిక ప్రజానీకం కుదేలవుతుండగా, మరో పక్క కొద్ది మంది కార్పొరేట్లు మాత్రం పెద్ద ఎత్తున లాభపడుతున్నారు. అప్పులు పెరగడం వల్ల ప్రజల జీవన ప్రమాణాలు ఏమైనా పెరిగాయా అంటే అదేమి లేదు, ప్రజల అప్పులు, పేదరికం మాత్రం పెరిగాయి. ఉపాధి కల్పన తగ్గింది. వలసలు పెరిగాయి. అప్పులు తీర్చలేక రైతుల ఆత్మహత్యలు పెరిగాయి. వాస్తవంగా చెప్పాలంటే అప్పుల భారాలు సామాన్య ప్రజలు మోస్తుండగా, శత కోటీశ్వరులు మాత్రం దిలాసాతో కులాసాగా ఉంటున్నారు. ఈ విధానాలు ఇలాగే కొనసాగితే దేశం, ప్రజలు దివాళా అంచుకు చేరడం ఖాయం. ఈ ప్రమాదం నుంచి దేశాన్ని రక్షించుకోవడం అత్యవసరం. అది ప్రజా ఉద్యమాల ద్వారానే సాధ్యం.




