తిరుపతి ఎండలు ఎట్ట ఉంటాయో తెలుసు కదా? నెత్తి మీద గుడ్డు పెడితే ఆమ్లెట్ అయిపోద్ది. ఆ ఎండలో, మనోజ్ గాడు ఆర్టీసీ బస్టాండ్ దగ్గర టీ కొట్టు కాడ నిలబడున్నాడు.

వాడి జేబులో చిల్లిగవ్వ లేదు. అకౌంట్లో చూస్తే రూ. 2700 కూడా లేవు. ఇంటి ఓనర్ ఏమో పొద్దున్నే వచ్చి, “అద్దె కడతావా, సామాన్లు బయట ఇసిరేయమంటావా?” అని దబాయించి పోయినాడు.

మనోజ్ రూమ్లో పాత బీరువా  మీద ఒక చీటీ అంటించున్నాడు. దాని మీద “బతుకుతావా? లేక అడుక్కుతింటావా?” అని రాసుంది.

ఇదంతా ఎవరి పుణ్యం అంటే… మన ‘శ్రీకాంత్ మాస్టర్’ది.

ఈ శ్రీకాంత్ మాస్టర్ తిరుపతిలో మస్తు ఫేమస్. ఒకప్పుడు అలిపిరి మెట్ల దగ్గర కాఫీలు అమ్మేవాడంట. ఇప్పుడు చూస్తే పెద్ద లైఫ్ కోచ్ అయిపోయినాడు. మొన్ననే ఆన్‌లైన్‌లో ఒక ఫ్రీ క్లాస్ పెట్టాడు. “నీలో ఉన్న రాముడిని నిద్ర లేపు” అని.

అది చూసి మనోజ్ గాడు ఫిక్స్ అయిపోయినాడు. ఎలాగైనా లైఫ్ సెట్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు.

అందుకే, తన ఫ్రెండ్ బాబు దగ్గర అప్పు చేసి మరీ రూ. 29,999 కట్టి ఆ కోర్సులో జాయిన్ అయ్యాడు.

బాబు గాడు రాత్రి పూట ఆటో నడుపుతాడు, పగలు వడియాలు అమ్ముతాడు. వాడి దగ్గర అప్పు చేసి తీసుకున్న డబ్బు అది.

మనోజ్ ఏమనుకున్నాడంటే, ఆ క్లాసులో జాయిన్ అయితే శ్రీకాంత్ మాస్టర్ ఏదో బిజినెస్ సీక్రెట్ చెబుతాడు, రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోవచ్చు అని.

కానీ సీన్ కట్ చేస్తే… డబ్బులు కట్టాక ఫోన్లో మెసేజ్ వచ్చింది. “వెల్కమ్ టూ స్పీకర్ ట్రైనింగ్ క్యాంప్ , లెవెల్ 2” అని.

అదేందబ్బా? నేను బిజినెస్ నేర్చుకోవడానికి కడితే, వీళ్ళేంది మైక్ పట్టుకుని మాట్లాడే ట్రైనింగ్ అని మెసేజ్ పెట్టారు? అని మనోజ్ బుర్ర గోక్కున్నాడు.

సరేలే, ఏదో ఒకటి, ఆ శ్రీకాంత్ మాస్టర్ ని చూస్తే చాలు అనుకుని, మంచి చొక్కా, ప్యాంటు వేసుకుని కపిలతీర్థం దగ్గర ఉన్న ఓ ఫంక్షన్ హాల్ కి బయలుదేరాడు.

హాల్ బయట పెద్ద ఫ్లెక్సీ కట్టి ఉన్నది.

“శ్రీకాంత్ మాస్టర్ తర్వాత మీరే! మీ కష్టాలే మీ క్యాష్”

లోపలికి పోతే, అక్కడ ‘సుమతి’ అని ఆవిడ ఉంది. ఆవిడ మొహం చూస్తే రెండు రోజులు నిద్రపోకుండా కాఫీలు తాగి వచ్చినట్టు ఉంది. కళ్ళు పెద్దవి చేసి, పళ్ళు బయటపెట్టి నవ్వుతా ఉంది.

“వచ్చేశావా తమ్ముడూ! స్పీకర్లు ఎడమ పక్కకి, ఊరికే వినేవాళ్ళు కుడి పక్కకి పోవాల!” అని గట్టిగా అరిచింది.

మనోజ్ భయపడి ఎడమ పక్కకే నడిచాడు. లోపల ఏసీ చల్లగా ఉంది కానీ, వాతావరణం మాత్రం తేడాగా ఉంది.

మొదటి రోజు క్లాస్ ఏందంటే… “నీ బాధను బ్రాండ్ చేసుకో”.

అంటే మనకి ఎంత కష్టం ఉంటే, అంత డబ్బు సంపాదించవచ్చు అంట

అక్కడ బ్లూటూత్ హెడ్‌సెట్ పెట్టుకున్న ప్రవీణ్ అనే ఒకడు మనోజ్ పక్కన కూర్చున్నాడు. వాడి బ్యాడ్జ్ మీద ‘గోల్డ్ మెంబర్’ అని ఉంది.

“ఏం తమ్ముడూ… నీ స్టోరీ ఏంది? లవ్ ఫెయిల్యూరా? లేక బిజినెస్ లాసా?” అని అడిగాడు ప్రవీణ్.

“అదేం లేదు అన్న… డిగ్రీ పాస్ కాలేదు, సెక్యూరిటీ గార్డు ఉద్యోగం కూడా ఊడిపోయింది. తినడానికి తిండి లేదు,” అని నిజం చెప్పాడు మనోజ్.

ప్రవీణ్ గాడు టేబుల్ మీద గట్టిగా కొట్టి, “అబ్బా! సూపర్ స్టోరీ తమ్ముడూ! ఇదే మనకు కావాల్సింది. ‘మిడిల్ క్లాస్ కష్టాలు’. దీనికి ఈ మధ్య మార్కెట్ బాగా ఉంది. జనాలు సెంటిమెంట్ కి బాగా పడిపోతారు. నువ్వు దీన్ని వాడుకో,” అన్నాడు.

మనోజ్ కి మతిపోయింది. “నా దరిద్రాన్ని కూడా వాడుకోవాలా?” అనుకున్నాడు.

రెండో రోజు పొద్దున్నే లేచి, మనోజ్ మళ్ళీ ఆ ఫంక్షన్ హాల్‌కి చేరుకున్నాడు. మొదటి రోజు జరిగిన తంతు చూసి వాడికి సగం దిమ్మతిరిగింది కానీ, కట్టిన డబ్బులు పోతాయని మళ్ళీ వచ్చాడు.

ఈ రోజు సెషన్ పేరు వింటేనే గుండెల్లో రాయి పడ్డట్టుంది.

“ఎమోషన్స్ పిండండి – జేబులు నింపండి”

స్టేజి మీదకి ఒక ఆవిడ వచ్చింది. పేరు శారద. చూడటానికి ఎలా ఉందంటే, అప్పుడే సీరియల్ షూటింగ్ నుంచి వచ్చిన విలన్ అత్తగారిలా ఉంది. మెడలో రుద్రాక్షలు, చేతికి లెక్కలేనన్ని దారాలు.

ఈమె గురించి శ్రీకాంత్ మాస్టర్ టీమ్ ఒక పెద్ద బిల్డప్ ఇచ్చింది.

 “ఈమె సామాన్యురాలు కాదు… తిరుపతి సబ్-జైలులో ఆరు నెలలు ఉండి, అక్కడి గోడల మధ్యే ‘కటకటాల్లో కాసులు’ అనే పుస్తకం రాసి లక్షల కాపీలు అమ్మిన మహా మేధావి!” అని ఇంట్రడక్షన్ ఇచ్చారు. జనం నోరెళ్లబెట్టి చూస్తున్నారు.

శారద మైక్ అందుకోగానే హాల్ అంతా నిశ్శబ్దం. ఆవిడ గొంతులో ఏదో తెలియని గంభీరత్వం.

“ఏమయ్యా… మీ దగ్గర టాలెంట్ ఉంటే సరిపోదు. దాన్ని ప్యాకెట్ చేసి అమ్మడం తెలియాలి,” అంటూ మొదలుపెట్టింది.

“జనం నవ్వితే మనకేం రాదు. అదే జనం ఏడిస్తే? వాళ్ళ కళ్లలో నీళ్లు తిరిగితే? అప్పుడే మన పంట పండుతుంది. వాళ్ల ఏడుపే మన ఎరువు!”

మనోజ్ కి ఈ మాటలు వింటుంటే తల బొప్పి కట్టినట్టయింది. చేయి ఎత్తి, “మేడం… అంటే ఏం చేయాలి మేడం? అర్థం కాలేదు,” అని అమాయకంగా అడిగాడు.

శారద స్టేజి దిగి, నెమ్మదిగా నడుచుకుంటూ మనోజ్ దగ్గరికి వచ్చింది. ఆవిడ దగ్గరకు వస్తుంటే అగరబత్తుల వాసన, విబూది వాసన గుప్పుమంది. మనోజ్ కళ్ళల్లోకి సూటిగా చూసి చెప్పింది.

“చూడు బాబు, నువ్వు మామూలుగా ‘నేను కష్టపడ్డాను, పైకి వచ్చాను’ అంటే ఎవడు వినడు. అదే… ‘నేను ఆకలితో అలమటించాను, చెత్త కుప్పలో రొట్టెలు ఏరుకుని తిన్నాను, లోకం నన్ను ఛీ కొట్టింది’ అని గట్టిగా అరిచి చెప్పు. నీ గొంతు వణకాలి. కంటిలో గ్లిజరిన్ లేకపోయినా నీళ్లు ఉబికి రావాలి.”

ఆవిడ ఆగి, పక్కన ఉన్న ఇంకొకడిని లేపింది.

“నువ్వు లేవయ్యా… నీకు ఏం కష్టం వచ్చింది?” అని అడిగింది.

వాడు నసిగుతూ, “అదే మేడం… మా నాన్న చిన్నప్పుడే చనిపోయారు,” అన్నాడు.

వెంటనే శారద, “ఛీ… ఇంత చప్పగా చెబితే రూపాయి కూడా రాలదు. ఇలా చెప్పు… ‘మా నాన్న చనిపోయినప్పుడు, శవానికి దహనం చేయడానికి కూడా డబ్బులు లేక, నా చొక్కా అమ్ముకున్నాను!’ అని చెప్పు. అబద్ధం అయినా పర్లేదు, వినేవాడి గుండె బరువు ఎక్కాలి. వాడు ఆ ఎమోషన్లో ఉన్నప్పుడే… ‘ఇదిగో మా కోర్సు తీసుకోండి, మీ బతుకు మారిపోతుంది’ అని మన ప్రోడక్ట్ వాడి మొహాన కొట్టాలి. అప్పుడు వాడు ధర కూడా చూడడు, గూగుల్ పే చేసేస్తాడు. అదే టెక్నిక్!”

మనోజ్ కి మతిపోయింది.

“ఇదేంద్రా సామీ… మన కష్టాలను కూడా బేరం పెట్టి అమ్మేయాలా?” అని మనసులో అనుకున్నాడు.

శారద మళ్ళీ మైక్ తీసుకుని అరిచింది.

“గుర్తుపెట్టుకోండి! వాళ్ళు ఎంత ఏడిస్తే, అంత వీక్ అవుతారు (బలహీనపడతారు). మనిషి వీక్ గా ఉన్నప్పుడే పర్సు తీస్తాడు. ఇది బిజినెస్ సూత్రం!”

పక్కన ఉన్న జనం పిచ్చోళ్లలాగా చప్పట్లు కొడుతున్నారు. కొంతమంది నోట్ బుక్ లో సీరియస్ గా రాసుకుంటున్నారు.

మనోజ్ కూడా తన నోట్ బుక్ తెరిచి, ఒక విచిత్రమైన ఈక్వేషన్ రాసుకున్నాడు

బాధ = బిజినెస్.

జనం కన్నీళ్లు = మనకు కాసులు.

ఎమోషన్ = ఏటీఎమ్ మెషిన్.

వాడికి అనిపించింది… “అమ్మో! వీళ్ళు మామూలోళ్లు కాదు. మనిషి భావోద్వేగాలను కూడా కిలోల లెక్కన అమ్మేసే రకం. ఇదెక్కడి న్యాయం రా సామీ… తిరుపతి వెంకన్న సాక్షిగా ఇంత మోసమా?” అని వాడికి అక్కడే సగం జ్ఞానోదయం అయిపోయింది.

కానీ ఏం చేస్తాడు? డబ్బు కట్టాడు కదా… మౌనంగా కూర్చుని ఆ ‘ఏడుపు బిజినెస్’ పాఠాలు వినడం తప్ప వేరే దారి లేకపోయింది.

మూడవ రోజు పొద్దున్నే హాల్ లో వాతావరణం మారిపోయింది. స్టేజి వెనుక ఒక పెద్ద డిజిటల్ స్క్రీన్ పెట్టారు.

దాని మీద మంటలు మండుతున్న గ్రాఫిక్స్ వేసి, మధ్యలో నిప్పు లాంటి నిజం” అని రాసుంది. ఈ రోజు టాస్క్ ఏంటంటే… ‘మాక్ స్పీచ్’ (Mock Speech). అంటే నిజంగా జనం ముందు మాట్లాడుతున్నట్టు బిల్డప్ ఇవ్వాలి.

శ్రీకాంత్ మాస్టర్ టీమ్ మనోజ్ ని స్టేజి మీదకి తోశారు. “పో తమ్ముడూ… పోయి స్టేజి బద్దలు కొట్టు!” అని ఎంకరేజ్ చేశారు.

మనోజ్ మైక్ పట్టుకున్నాడు. వాడి కాళ్ళు కొంచెం వణికాయి కానీ, లైట్ల వెలుతురు మొహం మీద పడగానే ఏదో తెలియని పూనకం వచ్చింది.

ఎదురుగా కూర్చున్న వాళ్లంతా తనలాంటి బాధితులే అని మర్చిపోయి, వాళ్లే తన భక్తులు అనుకున్నాడు.

గొంతు సవరించుకుని, నాప్‌కిన్‌ మీద రాసుకున్న డైలాగ్ చెప్పాడు

“ఒకప్పుడు నేను ఎస్.వి ఆర్ట్స్ కాలేజీ గేటు కాడ నిలబడి, వచ్చేపోయే కార్లకి సెల్యూట్ కొట్టేటోడిని. ఆ దుమ్ము, ఆ పొగ నా బతుకు అనుకున్నా. కానీ ఇవాళ… ఆ గేట్లు తోసే చేతులతోనే, నా భవిష్యత్తుకి గేట్లు తెరుస్తున్నా”

అతను ఒక్క క్షణం ఆగాడు. హాల్ అంతా నిశ్శబ్దం.

మళ్ళీ గొంతు పెంచి అరిచాడు

“మీకు పెద్ద పెద్ద డిగ్రీలు అవసరం లేదు. ఆక్స్‌ఫర్డ్ చదువులు అక్కర్లేదు. గుండెలో గట్స్ ఉంటే చాలు… గల్లీలో ఉన్నా ఢిల్లీని ఏలొచ్చు. మీ రాతని బ్రహ్మదేవుడు రాయడు… మీరే రాసుకోవాలి. రాసుకోగలరా?”

అంతే! హాల్ దద్దరిల్లిపోయింది. కార్తీక్ అనే ఒకడు కింద పడిపోయి మరీ ఏడ్చేశాడు.

 “అన్నా… ఏం చెప్పావన్నా, నా కళ్ళు తెరిపించావ్” అని అరిచాడు. (నిజానికి వాడు పెయిడ్ ఆర్టిస్ట్ అని తర్వాత తెలిసింది అనుకోండి).

అందరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. ఆ చప్పట్ల శబ్దం మనోజ్ కి ఒక కిక్ ఇచ్చింది. మందు కొడితే వచ్చే కిక్ కంటే ఇది పది రెట్లు ఎక్కువ ఉంది.

మనోజ్ స్టేజి దిగుతుండగానే, సుమతి (ఆ మేనేజర్ ఆవిడ) పరుగెత్తుకుంటూ వచ్చింది.

ఆవిడ కళ్ళలో ఇప్పుడు కోపం లేదు, వ్యాపారం కనిపిస్తోంది. క్లిప్‌బోర్డ్‌ ని గట్టిగా పట్టుకుని, మనోజ్ ని పక్కన ఉన్న చిన్న గదిలోకి లాక్కెళ్ళింది. అక్కడ ఏసీ చలికి మనోజ్ కి చెమట ఆరిపోయింది.

“ఒరేయ్ తమ్ముడూ… నువ్వు పక్కా నాచురల్‌ రా! నీ వాయిస్ లో ఆ బేస్ ఉంది చూశావా… అది జనాల జేబులు ఖాళీ చేయించేస్తుంది,” అంది ఆవేశంగా.

“నిజమా అక్కా?” అన్నాడు మనోజ్.

“వంద శాతం! అందుకే నీకు ఒక బంపర్ ఆఫర్. మా శ్రీకాంత్ మాస్టర్ కి ‘ఫ్రాంచైజ్ మెంటర్‌షిప్’ ప్రోగ్రామ్ ఉంది. అంటే నిన్ను మాస్టర్ కి అధికారిక శిష్యుడిగా లైసెన్స్ ఇస్తాం. స్క్రిప్ట్ మేమే రాసిస్తాం, ఏ టైంలో ఏడవాలి, ఏ టైంలో నవ్వాలి అనే అల్గారిథమ్ కూడా నేర్పిస్తాం. నీకు మేమే బ్రాండింగ్ చేస్తాం.”

మనోజ్ కళ్ళు మెరిశాయి. “సూపర్ అక్కా! దానికి నేనేం చేయాలి?”

సుమతి చిన్నగా నవ్వి, “ఏం లేదు… ఒక చిన్న సెక్యూరిటీ డిపాజిట్. జస్ట్ రూ. 1,50,000 కడితే చాలు. రేపటి నుంచే నువ్వు ‘జూనియర్ శ్రీకాంత్’ అయిపోతావ్. నువ్వు ఇప్పుడు ఇచ్చిన స్పీచ్ చూస్తే… ఆ డబ్బులు రెండు రోజుల్లో వెనక్కి లాగేయొచ్చు,” అంది.

మనోజ్ గుండె జారిపోయింది.

 “లక్షా యాభై వేలా? నా దగ్గర కిడ్నీలు, లివర్ తప్ప అమ్మడానికి ఇంకేం లేవు అక్కా,” అనుకున్నాడు మనసులో. జేబులో చూస్తే బస్సు ఛార్జీలకి కూడా చిల్లర వెతుక్కోవాలి.

కానీ, అదే సమయంలో వాడి బుర్రలో ఒక వెలుగు వెలిగింది. ఒక ఐడియా వచ్చింది.

“ఒక్క నిమిషం… వీళ్ళు నాకు నేర్పేది ఏముంది? అబద్ధం ఆడటం, గట్టిగా అరవడం, సెంటిమెంట్ పండించడం. ఇవి చేయడానికి నాకు లైసెన్స్ ఎందుకు? ఆ స్క్రిప్ట్ ఏదో నేనే రాసుకోలేనా? ఆ ఏడుపు ఏదో నేనే ఏడవలేనా?”

వాడికి అర్థమైపోయింది… ఇక్కడ సరుకు ముఖ్యం కాదు, ప్యాకింగ్ ముఖ్యం. ఆ ప్యాకింగ్ చేయడం వాడికి వచ్చేసింది.

సుమతి వైపు చూసి, “అక్కా… డబ్బులు రెడీ చేసుకుని వస్తా,” అని అబద్ధం చెప్పాడు.

మనసులో మాత్రం… “మీకు డబ్బులు కట్టేది ఏందిరా పిచ్చోల్లారా? మీ దగ్గర కొన్న టెక్నిక్ తో మీకే పోటీగా షాపు పెట్టకపోతే నా పేరు మనోజ్ కాదు…

ఆ క్షణమే ఆ హాల్ గేటు దాటి బయటికి వచ్చేశాడు. అప్పుడు కనిపించింది వాడికి తిరుపతి కొండ కాదు… కాసుల కొండ!

ఆ శ్రీకాంత్ మాస్టర్ క్యాంపు నుంచి బయటికి రాగానే మనోజ్ గాడికి ఒక క్లారిటీ వచ్చేసింది.

“ఎవడో రాసిన స్క్రిప్ట్ మనం చెబితే కిక్ ఉండదు… మన పిచ్చిని మనమే బ్రాండ్ చేసుకోవాలి,” అని డిసైడ్ అయిపోయాడు.

వెంటనే రూమ్ కి వెళ్లి, అద్దం ముందు నిలబడి, తన పాత పేరు ‘మనోజ్’ని అక్కడే వదిలేశాడు. కొత్తగా ఒక పేరు పెట్టుకున్నాడు. అది మామూలు పేరు కాదు, వింటేనే వైబ్రేషన్ వచ్చే పేరు

“మిరాకిల్ మనోజ్”

ఆ పేరులో ఏదో తెలియని పవర్ ఉంది అనుకున్నాడు. ఇక ఆలస్యం చేయలేదు. తన చిన్న అద్దె గదిలో, వెనకాల గోడకి ఉన్న పెచ్చులు కనిపించకుండా ఒక పాత దుప్పటి కట్టాడు.

చేతిలో ఫోన్ పట్టుకుని, సెల్ఫీ కెమెరా ఆన్ చేశాడు. లైటింగ్ సరిగా లేకపోయినా, కళ్ళలో మాత్రం ఫుల్ లైటింగ్ పెట్టుకున్నాడు.

కెమెరా ఆన్ చేసి, ఊపిరి బిగబట్టి గట్టిగా అరిచాడు

“ఏం తమ్ముడూ… డల్ గా ఉన్నావా? లైఫ్ లో కిక్ లేదా? అప్పుల వాళ్ళు ఇంటి మీద పడుతున్నారా? నువ్వు భయపడితే వాడు భయపెడతాడు! నువ్వు గెలవగలవా? మిరాకిల్ మనోజ్”

ప్రతి వాక్యం చివర, ఫుల్ స్టాప్  బదులు తన పేరే వాడేవాడు. అది వినడానికి ఎంత విడ్డూరంగా ఉందంటే, జనం నవ్వుకుంటూనే చూడటం మొదలుపెట్టారు.

తిరుపతి, రేణిగుంట, చంద్రగిరి, నెల్లూరు… ఇలా ఏరియా ఏదైనా సరే, వాట్సాప్ స్టేటస్ లలో మీరాకిల్ మనోజ్’ వీడియోలే మోగుతున్నాయి.

వాడు చెప్పే దాంట్లో మేటర్  ఉందా లేదా అనేది ఎవరికీ అనవసరం. ఆ అరుపు, ఆ కళ్ళలో ఉన్న కాన్ఫిడెన్స్, ఆ చేతులు తిప్పే స్టైల్ చూసి జనం ఫిదా అయిపోయారు.

“వీడెవడో మనోడే, గట్టిగా చెబుతున్నాడు,” అని నమ్మేశారు.

సోషల్ మీడియాలో రచ్చ మామూలుగా లేదు. ఆ క్రేజ్ చూసి బయట కూడా పిలుపులు వచ్చాయి.

ఒకసారి ఊరి పెద్దలు ఒక పంచాయితీకి పిలిచారు.

అక్కడ అందరూ గంభీరంగా కూర్చుని ఉంటే, మనోజ్ మైక్ అందుకుని, “మీ పిల్లలకి ఆస్తులు ఇవ్వకండి… ఆత్మవిశ్వాసం ఇవ్వండి! భయం వద్దు… బలం ముఖ్యం! మీ వంశం గొప్పదా? మిరాకిల్ మనోజ్!” అని స్పీచ్ దంచికొట్టాడు.

ఆ పెద్దలకి ఏమీ అర్థం కాకపోయినా, చప్పట్లు మాత్రం గట్టిగా కొట్టారు.

ఇంకోసారి చిట్ ఫండ్స్  కట్టి మోసపోయిన బాధితుల మీటింగ్ జరిగింది. అందరూ ఏడుస్తూ కూర్చుని ఉంటే, మనోజ్ స్టేజి ఎక్కి,

 “పోయిన డబ్బు వెనక్కి రాదు… కానీ పోయిన పరువు తేగలవా? పోరాడే గుణం నీ రక్తంలో ఉందా? ఖచ్చితంగా ఉంది!” అని అరిచాడు. పాపం ఆ జనం, తమ డబ్బులు పోయిన బాధని మర్చిపోయి, వీడి అరుపుకి ప్రభావితమై పూల దండలు వేశారు, జేబులో ఉన్న చిల్లర కూడా తీసి ఇసిరేశారు.

కేవలం ఆరు నెలలు… అంతే! ఆర్టీసీ బస్టాండ్ లో టీ తాగడానికి ఆలోచించే మనోజ్, ఇప్పుడు వారానికి రెండు లక్షలు వెనకేస్తున్నాడు.

కార్లు, బంగ్లాలు కొనలేదు కానీ, బ్రాండెడ్ షర్ట్స్, చేతికి బంగారు బ్రేస్లెట్ వచ్చాయి.

వాడి బిజినెస్ మైండ్ ఎలా పనిచేసిందంటే… “బాకీ పడ్డాం రండి” అని ఒక కిట్ తయారు చేశాడు.

అందులో ఏముంటాయో తెలుసా? రెండు రూపాయల రాగి రేకు, ఒక పసుపు దారం,  ఆకాశం వైపు చూస్తున్న ఒక యోగి ఫోటో ఒకటి. ఒక పుస్తకం  ‘దున్నేస్తే పోలా’. వాటి  ఖరీదు రూ. 516/-. జనం అమాయకత్వం ఎంతలా ఉందంటే, ఆ కిట్ కొంటే కష్టాలు తీరిపోతాయని ఎగబడి మరీ కొన్నారు.

మనోజ్ ఇప్పుడు రాత్రిళ్ళు నిద్రపోవడం లేదు. జనం పిచ్చిని క్యాష్ చేసుకోవడంలో బిజీ అయిపోయాడు.

వాడి గది నిండా డబ్బు కట్టలు, మనసు నిండా అహంకారం నిండిపోయింది.

“ప్రపంచాన్ని జయించాలంటే తెలివి అక్కర్లేదు… గట్టిగా అరిచే గొంతు ఉంటే చాలు,” అని నమ్మేశాడు మనోజ్.

మనోజ్ జీవితం జెట్ స్పీడ్ లో దూసుకుపోతోంది. చేతినిండా డబ్బు, చుట్టూ భజన చేసే జనం. అంతా సాఫీగా సాగిపోతున్న టైంలో, ఒక రోజు పోస్ట్ మ్యాన్ ఒక ఎర్ర కవరు తెచ్చిచ్చాడు.

అది ఎవరో పంపలేదు… సాక్షాత్తూ ఆ శ్రీకాంత్ మాస్టర్ ఆఫీస్ నుండి వచ్చిన లీగల్ నోటీసు.

దాని సారాంశం ఏంటంటే

“ఒరేయ్ మనోజ్… నువ్వు వాడుతున్న టెక్నిక్స్, ఆ అరుపులు, ఆ ఎమోషనల్ డ్రామా అంతా మా మాస్టర్ కనిపెట్టిన సరుకు. మా ఫార్ములా నువ్వు వాడుతున్నావు. వెంటనే ఆపేయ్, లేకపోతే కోర్టుకి ఈడ్చి, నీ నిక్కరు కూడా ఊడదీయిస్తాం,” అని ఉంది.

అది చదివి మనోజ్ కి నవ్వొచ్చింది. వెంటనే ఒక పేపర్ తీసుకుని, తిరుపతి లోకల్ స్టైల్ లో ఘాటుగా రిప్లై రాశాడు

“ఓరి శ్రీకాంత్… నీ ఏడుపుగొట్టు మొహం, నీ దిక్కుమాలిన మాడ్యూల్ ఎవడికి కావాలి సామీ? నీ దగ్గర జనం ఏడుపు నేర్చుకుంటే, నా దగ్గర జనం గెలవడం నేర్చుకుంటున్నారు. నా స్టైల్ నాది, నా బ్రాండ్ నాది. నీ దిక్కున్నచోట చెప్పుకో.

ఇట్లు, మిరాకిల్ మనోజ్ (కాపీరైట్ కూడా నాదే)”

కవరు అంటించి పంపించేశాడు.

 “ఇక నన్ను ఆపేవాడే లేడు,” అనుకుంటూ మీసం మెలేశాడు.

మనోజ్ గాడికి ఒక విషయం బాగా అర్థమైపోయింది. సామాన్యుడికి మోటివేషన్ ఇస్తే వాడి దగ్గర ఉండేది చిల్లర మాత్రమే.

కానీ అసలైన డబ్బు ఎక్కడ ఉందో వాడికి తట్టింది. తిరుపతి అంటేనే దేవుడు… దేవుడు అంటేనే భక్తి… భక్తి అంటేనే కోట్లు! అందుకే మనోజ్ తన రూటు మార్చాడు.

ఈసారి టార్గెట్ మామూలు జనం కాదు… ఆశ్రమాలు నడిపే స్వామీజీలు, పీఠాధిపతులు, బాబాలు.

ఒక రోజు చిత్తూరు దగ్గర ఉన్న ఒక పెద్ద ఫామ్ హౌస్ లాంటి ఆశ్రమంలో ‘ఆధ్యాత్మిక వ్యాపార సదస్సు’ (Spiritual Business Summit) జరిగింది. లోపల ఏసీలు ఆన్ లో ఉన్నాయి.

వేదిక మీద మనోజ్ నిలబడి ఉన్నాడు. ఎదురుగా కుర్చీల్లో కాషాయ బట్టలు కట్టుకున్న ఒక ఇరవై మంది స్వామీజీలు కూర్చున్నారు. కొంతమంది చేతిలో ఐఫోన్లు ఉన్నాయి, ఇంకొంతమంది చేతిలో రుద్రాక్షలు ఉన్నాయి.

మనోజ్ మైక్ అందుకున్నాడు. వాడి డ్రెస్సింగ్ స్టైల్ కూడా మారింది. కుర్తా, దాని మీద ఒక ఖరీదైన శాలువా.

“దండాలండి స్వాములవార్లూ!” అని గట్టిగా అరిచాడు మనోజ్.

“మీ దగ్గర మహిమలు ఉండొచ్చు, మంత్రాలు ఉండొచ్చు. కానీ ‘మార్కెటింగ్’ లేకపోతే మీ మఠం… మట్టిపాలే! మిరాకిల్ మనోజ్!”

ముందు వరసలో ఉన్న ఒక లావుపాటి స్వామీజీ, “ఏం మాట్లాడుతున్నావ్ నాయనా? మాది సేవా మార్గం,” అన్నాడు నొసలు చిట్లిస్తూ.

మనోజ్ నవ్వి, “స్వామీ… సేవ అంటే ఫ్రీగా చేసేది. కానీ మీరు ప్రసాదం లడ్డు కూడా కవర్ లో పెట్టి అమ్ముతున్నారు కదా? అది బిజినెస్ కాక ఇంకేంది? మనం ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాం,” అన్నాడు.

అందరూ సైలెంట్ అయిపోయారు. మనోజ్ వెనకాల ఉన్న వైట్ బోర్డు మీద ఒక మార్కర్ తో పెద్దగా

“FEAR + HOPE = CASH”

భయం + ఆశ = డబ్బు  అని రాశాడు.

“చూడండి స్వాములవార్లూ… మీ దగ్గరికి వచ్చే భక్తుడు రెండు రకాలు.

ఒకడు,  పాపాలు చేసి భయపడేవాడు. రెండోవాడు,  కష్టాలు వచ్చి ఏదో ఆశించేవాడు.

ఈ ఇద్దరూ మనకి కస్టమర్లే.  వీళ్ళని మనం ఎలా హ్యాండిల్ చేయాలి?”

మనోజ్ స్టేజి దిగి వాళ్ళ మధ్యలోకి వచ్చాడు.

“మొదటి రూల్,  దేవుడిని కాంప్లికేటెడ్ చేయండి (Make God Complicated).

అంటే… దేవుడు అందరికీ దొరకకూడదు. ‘నువ్వు నేరుగా దండం పెట్టుకుంటే దేవుడు వినడు… నా ద్వారా రికమండేషన్ లెటర్ (పూజ) పెడితేనే వింటాడు’ అని చెప్పాలి. సింపుల్ గా నమస్కారం చేస్తే పుణ్యం రాదు… హోమం చేస్తేనే, అదీ మీరు చెప్పిన నెయ్యి వాడితేనే పుణ్యం వస్తుందని భయం పెట్టాలి. భయం ఎంత ఎక్కువ ఉంటే… మీ దక్షిణ అంత పెరుగుతుంది. ఖచ్చితంగా స్వామి”

వెనకాల కూర్చున్న ఒక సన్నటి బాబా, “భలే చెప్పావ్ నాయనా… మా ఆశ్రమంలో అదే ఫాలో అవుతున్నాం,” అని తలాడించాడు.

మనోజ్ కంటిన్యూ చేశాడు.

“రెండో రూల్,   సెంటిమెంట్ కి సబ్ స్క్రిప్షన్ (Subscription) పెట్టండి. చూడండి స్వామీ… గుడికి ఒకసారి వచ్చి పోతే మనకేం లాభం? వాడు మళ్ళీ మళ్ళీ రావాలి. అందుకే ‘నలభై రోజుల దీక్ష’, ‘మండలం రోజులు ప్రదక్షిణలు’ అని పెట్టండి. వాడు నలభై రోజులు మీ చుట్టూ తిరిగితే… వాడికి అలవాటు అయిపోద్ది. మీ ఆశ్రమం వాడికి ఒక అడ్డా అయిపోవాలి.

ఇంకో టెక్నిక్ ఏంటంటే… ‘విశిష్ట పూజ’ అని కొత్త స్కీమ్ పెట్టండి.

రూ. 500 టికెట్ కి – మామూలు దండం.

రూ. 5000 టికెట్ కి – స్వామీజీ పాదాల దగ్గర దండం + ఒక కండువా ఫ్రీ.

రూ. 50,000 టికెట్ కి – స్వామీజీతో సెల్ఫీ + స్పెషల్ దర్శనం.

మనుషులకి దేవుడి కంటే… ఆ ‘విఐపి  ఫీలింగ్’ ముఖ్యం. పక్కోడి కంటే నేను ముందు వెళ్తున్నాను అనే అహంకారం ఉంది చూశారా… అదే మీ పెట్టుబడి”

స్వామీజీలు అందరూ నోరెళ్లబెట్టి వింటున్నారు. వాళ్ళు చేస్తున్న పనులే ఇవి, కానీ ఇంత క్లియర్ గా ఎవరూ చెప్పలేదు.

“ఇక మూడోది, చాలా ముఖ్యం,” అని మనోజ్ గొంతు తగ్గించాడు.

“పాపాన్ని కడిగేసే ప్యాకేజీ (Sin Cleaning Package). ఎవడైతే బ్లాక్ మనీ సంపాదిస్తాడో, ఎవడైతే తప్పులు చేస్తాడో… వాడికి నిద్ర పట్టదు. వాడికి మీరు ఏం చెప్పాలి? ‘నాయనా… నువ్వు మా ట్రస్ట్ కి విరాళం ఇస్తే, నీ పాపాలు పోతాయి. మేము అన్నదానం చేస్తాం, నీ అకౌంట్లో పుణ్యం జమ అవుతుంది’ అని చెప్పాలి.

నిజానికి వాడు ఇచ్చేది దేవుడికి కాదు… వాడి ‘గిల్ట్’ (అపరాధ భావం) తగ్గించుకోవడానికి లంచం ఇస్తున్నాడు. ఆ లంచమే మీ ఆశ్రమానికి పిల్లర్లు”

చివరగా మనోజ్ స్టేజి ఎక్కి ముగించాడు.

“గుర్తుపెట్టుకోండి స్వాములవార్లూ…

మీరు అమ్మేది విబూది కాదు… నమ్మకం.

మీరు పంచేది తీర్థం కాదు… తృప్తి.

ఈ రెండూ కరెక్ట్ గా ప్యాక్ చేసి ఇస్తే… భక్తులు మీ కాళ్ళ దగ్గర క్యూ కడతారు. మీ ఆశ్రమాలు కార్పొరేట్ కంపెనీలు అవుతాయి.

ఇదే మోడరన్ భక్తి మార్గం. జై క్యాష్ , జై మిరాకిల్ మనోజ్”

ఆ హాల్ మొత్తం చప్పట్లతో మారుమోగిపోయింది.

స్వామీజీలు లేచి నిలబడి, “అద్భుతం నాయనా… వచ్చే నెల మా ఆశ్రమంలో కుంభాభిషేకం ఉంది, దానికి స్పాన్సర్లని ఎలా పట్టాలో నువ్వే వచ్చి ప్లాన్ ఇవ్వాలి,” అని మనోజ్ ని చుట్టుముట్టారు.

మనోజ్ చిరునవ్వు నవ్వుతూ, “ఖచ్చితంగా స్వామీ… కానీ నా కన్సల్టింగ్ ఫీజు ఇవ్వాలి , జీఎస్టీ ఎక్స్ట్రా!” అన్నాడు.

అక్కడ జరుగుతున్నది చూస్తే… భక్తి ఎప్పుడో పారిపోయింది, కేవలం వ్యాపారం మాత్రమే మిగిలింది అని  గోడలు కూడా నవ్వుకుంటున్నాయి.

మనోజ్ గాడు ఆ శ్రీకాంత్ మాస్టర్ లీగల్ నోటీసు చూసి, ఏ క్షణాన పోలీసులు వచ్చి జీపు ఎక్కిస్తారో అని గజగజ వణుకుతున్నాడు.

ఇంతలో ఇంటి ముందు పెద్ద కారు ఆగింది. అందులో నుంచి పోలీసులు దిగలేదు… ప్రభుత్వ అధికారులు దిగారు. చేతిలో పెద్ద బొకే, మెడలో శాలువా

“కంగ్రాట్స్ మిరాకిల్ గారు! కేంద్ర ప్రభుత్వం మీ సేవలను గుర్తించింది. మీకు    ‘ప్రపంచ శాంతి దూత’ (Global Peace Ambassador) బిరుదు ఇస్తున్నారు” అని చెప్పారు.

మనోజ్ కి ఫ్యూజులు ఎగిరిపోయాయి.

 “ఏందబ్బా… నేను జనాల్ని బకరాల్ని చేస్తే, సర్కారోళ్ళు నన్ను నెత్తి మీద పెట్టుకుంటున్నారా?” అని షాక్ అయ్యాడు.

ఢిల్లీ నుంచి పెద్ద మినిస్టర్ వచ్చాడు. స్టేజి మీద మనోజ్ పక్కన నిలబడి మైక్ తీసుకున్నాడు.

“మిత్రులారా! ఈ రోజుల్లో యువతరం రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు, రాళ్ళు రువ్వుతున్నారు. ఎందుకు? వాళ్ళలో అసహనం ఉంది. కానీ మన ‘మిరాకిల్ మనోజ్’ గారు ఏం చేశారు? ఆ అసహనాన్ని ‘ఆత్మవిశ్వాసం’ అనే మత్తు మందుతో అణిచివేశారు! మనోజ్ గారి స్పీచ్ విన్న తర్వాత, నిరుద్యోగికి ఉద్యోగం రాకపోయినా పర్లేదు… ‘నా మైండ్ సెట్ మారితే చాలు’ అని సైలెంట్ గా ఇంట్లో కూర్చుంటున్నాడు. ఇది కదా దేశానికి కావాల్సింది! ఇదే నిజమైన దేశభక్తి!” అని దంచికొట్టాడు.

జనం పిచ్చోళ్ళలాగా చప్పట్లు కొట్టారు. మనోజ్ కి అప్పుడు అర్థమైంది అసలు లాజిక్.

సభ అయ్యాక, ఆ పెద్ద మినిస్టర్ మనోజ్ ని పక్కకు పిలిచి, భుజం మీద చేయి వేసి అసలు విషయం చెప్పాడు. ఇది పక్కా పొలిటికల్ బిజినెస్ సీక్రెట్.

“చూడు. మనోజ్… మాకు నీలాంటోళ్లే కావాలి. ఎందుకో చెప్పు?”

మనోజ్ అమాయకంగా చూశాడు.

“ఇప్పుడు దేశంలో పెట్రోల్ రేటు పెరిగింది, టమాట రేటు పెరిగింది, రోడ్లు బాలేవు, కరెంట్ లేదు. జనం మమ్మల్ని ప్రశ్నించాలి. ‘ఏందిరా ఈ బతుకు?’ అని మా చొక్కా పట్టుకోవాలి. కానీ, వాళ్ళు అలా అడగకూడదు అంటే… నీలాంటి వాడు మైక్ పట్టుకోవాలి.

నువ్వు ఏం చెప్తావ్? ‘నీ కష్టానికి కారణం పెట్రోల్ రేటు కాదు…  నీ ఆలోచన’.

అంతే! జనం వెంటనే ప్రభుత్వాన్ని తిట్టడం మానేసి… ‘అయ్యో నా ఖర్మ బాలేదు, నేను పాజిటివ్ గా ఆలోచించడం లేదు’ అని వాళ్ళని వాళ్ళే తిట్టుకుంటారు.

వాడు ఆ గిల్ట్  లో ఉండిపోతాడు. మమ్మల్ని మర్చిపోతాడు.

నువ్వు వాళ్ళకి వేస్తున్నది స్పీచ్ కాదు… అది ఒక

‘అనస్థీషియా’ (మత్తు మందు).

వాడికి ఆపరేషన్ జరుగుతున్నా (మేము పన్నులు వేస్తున్నా), వాడికి నొప్పి తెలియకుండా నువ్వు కథలు చెబుతున్నావ్. అందుకే నువ్వు మాకు ముఖ్యం. నువ్వు ఎంత ఫేమస్ అయితే, మాకు అంత తలనొప్పి తగ్గుతుంది. కీప్ ఇట్ అప్!”

మనోజ్ కి మతిపోయింది.

 “ఓరి నీ యంకమ్మ… ఇంత పెద్ద స్కెచ్ ఉందా దీని వెనుక? నేను ఏదో చిల్లర కోసం మోసం చేస్తున్నాను అనుకున్నా. కానీ ఈ సిస్టమ్ నన్ను అడ్డం పెట్టుకుని జనాల మెదళ్ళను మొద్దుబారేలా చేస్తోందా?” అని భయపడ్డాడు.

బయట జనం మాత్రం, “జై మిరాకిల్ మనోజ్! జై ప్రభుత్వం!” అని అరుస్తున్నారు.

వాళ్ళకి తమ ఊర్లో డ్రైనేజీ పొంగుతున్న వాసన రావడం లేదు… ఎందుకంటే మనోజ్ వేసిన ‘ఆశ అనే అగరుబత్తి’ వాసనలో వాళ్ళు మునిగిపోయారు.

వాళ్ళకి ఆకలి వేయడం లేదు… ఎందుకంటే ‘విజయం మీదే’ అనే గ్యాస్ ని వాళ్ళు కడుపు నిండా మింగేశారు.

మనోజ్ ఆ అవార్డును చేతిలో పట్టుకుని, నవ్వాలో ఏడ్వాలో తెలియక నిలబడ్డాడు.

అక్కడ సమాజం సమస్యలకు పరిష్కారం వెతకడం మానేసి, సమాధుల లాంటి బాబాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ… తమ చావుని తామే సంబరంగా చేసుకుంటోంది.

“ప్రభుత్వానికి కావాల్సింది పౌరులు కాదు… భక్తులు. ఆ భక్తులని తయారు చేసే ఫ్యాక్టరీలే ఈ బాబాలు,” అని మనోజ్ ఆ రోజు రాసుకున్న డైరీలో చివరి పేజీ.

Leave a Reply