పుస్తకాలను చదవకుండా పుస్తకాలను తాకకుండా చాలామందికి ఒక్కరోజు కూడా గడవదు.పగలంతా పనులతో బాధ్యతలతో అటు ఇటు తిరుగుతూ గడిపేసినా, ఎంత రాత్రయినా సరే, కొన్ని పేజీలైనా చదవటం, ఉదయం నిద్ర లేవగానే ముందుగా ఎంపిక చేసుకుని వెతికి పెట్టుకున్న పుస్తకాన్ని చదవటం కొందరికి అలవాటు.
ఈ ప్రపంచంలో పుస్తకాలు చదవడానికి నిర్ణీత సమయం అంటూ లేదు. ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాగైనా పుస్తకాలు చదవడానికి అలవాటు పడిన వాళ్లే. చాలామందికి పుస్తకాలను దాచి పెట్టుకోవడం అలవాటు. కానీ చాలా కొంతమంది మాత్రమే తాము చదివిన తర్వాత పుస్తకాలను ఇతరులకు చదవడానికి ఇచ్చేస్తారు. చదివిన తర్వాత వాళ్లు కూడా అలా.. అలా.. పుస్తకాలను ఇతరులకు అందచేస్తూ ఉంటే చాలా పుస్తకాలు పాఠకుల చేతుల్లోకి వెడుతూ ఉంటాయి. చాలా విలువైన పుస్తకాలను మనం ఎలాగూ ఎవరికీ ఇవ్వలేం కాబట్టి.
*
పుస్తకాల భద్రత గురించి అనేకమందికి అనేక చిత్ర విచిత్రమైన అనుభవాలు ఉంటాయి. ఇక పుస్తకాల దొంగల గురించి, అడిగి కానీ, అడగకుండా గాని పుస్తకాలు తీసుకు వెళ్ళి ,తిరిగి ఇవ్వని వాళ్ళ గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు.
మనం చదవని పుస్తకాలు, మనం పోగొట్టుకున్న పుస్తకాలు మనకు అంతులేని దుఃఖాన్ని ఆవేదనను మిగులుస్తాయి. కొన్ని పుస్తకాలను మనం జీవితాంతం వెతుకుతూనే ఉంటాం. కొన్ని పుస్తకాలు మనల్ని జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి. కొన్ని పుస్తకాలు కలల్లోకి వచ్చి కలవరపెడతాయి కూడా.
*
పిల్లలకు పుస్తకాలు అంటే భయం పోగొట్టాలి.పాఠ్య పుస్తకాలే కాకుండా అందుబాటులో ఉన్న బహుళ ప్రయోజనకరమైన ఎన్నో పుస్తకాలను వాళ్లకు చిన్నప్పటినుండే పరిచయం చేయాలి. ఇంట్లో పెద్దవాళ్లు చదువుతూ ఉంటే పిల్లలకు కూడా పుస్తకాలు చదవడం అలవాటు అవుతుంది.దేనికైనా ఇంట్లో ముందు పుస్తకాలు ఉండాలి కదా. ఎలాగైనా సరే పుస్తక ప్రపంచాన్ని చిన్నప్పటినుండే పిల్లలకు దగ్గర చేయాలి.
*
మరో గ్రంథాలయ ఉద్యమం, పుస్తకాలతో నడక , పుస్తకం కోసం నడక, ఊరూరా గ్రంథాలయాలు…గ్రంథాలయాలను కాపాడుకోవాలనే నినాదాలతో అనేక ఉద్యమాలు ఊపందుకున్నాయి.
కర్ణాటక లాంటి రాష్ట్రాలలో గ్రామపంచాయతీ కార్యాలయాల్లో డిజిటల్ లైబ్రరీల ఏర్పాటు ఒక గొప్ప విప్లవం అని చెప్పాలి. అక్కడ గ్రంథాలయాల నిర్వహణ చాలా ఆసక్తికరంగా కొనసాగుతోంది.
నిరంతరం కొత్త పాఠకులు తయారవుతూ ఉన్నారు. పుస్తకాలు చదివేవాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది. కార్యాలయాల్లో , పార్కుల్లో , హోటల్స్ లో, ఆసుపత్రుల్లో, కమ్యూనిటీ సెంటర్స్ లో , బస్సుల్లో చాలాచోట్ల పుస్తకాలను అందుబాటులోకి తెస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న అనేక పుస్తకాలను గ్రామీణ ప్రాంతాల పాఠకులకు సైతం చేరువ చేయడం ఆధునిక సాంకేతిక పద్ధతుల ద్వారా సాధ్యం అవుతోంది.
*
మనం చదవాల్సిన పుస్తకాలు, సేకరించుకోవలసిన పుస్తకాలు, తెలుసుకోవాల్సిన పుస్తకాలు కొన్ని లక్షలు ఉంటాయి. మనల్ని మార్చిన పుస్తకాల గురించి మర్చిపోకుండా అందరం ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాం.
పుస్తక ప్రదర్శనలో పెరిగిన పుస్తకాల అమ్మకాలు, పెరిగిన సందర్శకుల సంఖ్య, పెరిగిన యువతరం పాఠకులు రచయితల సంఖ్య- గొప్ప పుస్తక ప్రపంచాన్ని వాగ్దానం చేస్తున్నాయి.
ప్రింట్ ఆన్ డిమాండ్ పద్ధతి వచ్చిన తర్వాత, పుస్తకాల ముద్రణ చాలా సులభతరం అయిపోయింది. కావలసినన్ని పుస్తకాలను ఎప్పటికప్పుడు ప్రచురణకర్తలు, రచయితలు ప్రచురించుకుంటున్నారు. యూనికోడ్ లోనే పుస్తకాలను ముద్రించుకోవడం జరుగుతోంది. రచయితలు ప్రచురణకర్తలు అయ్యారు.ఎన్నో కొత్త ప్రచురణ సంస్థలు ఉత్సాహంగా మొదలయ్యాయి. ఇప్పుడు అద్భుతమైన అనువాద పుస్తకాలు ఎన్నో తెలుగు పాఠకులకు అందుబాటులో ఉంటున్నాయి.
ఆన్ లైన్ లో పుస్తకాల అమ్మకాలు మొదలైన తర్వాత, దుకాణాల వద్దకు వెళ్లి పుస్తకాలు కొనుక్కోవలసిన పరిస్థితి తక్కువయింది. చాలామంది రచయితలు దుకాణదారులకు ఇచ్చే డిస్కౌంట్ ని పాఠకులకే తగ్గించి, నేరుగా పుస్తకాలని పంపుతున్నారు.
మొత్తం మీద అన్ని ప్రాంతాలలో ఇప్పుడు పుస్తకోత్సవం జరుగుతోంది.
పెరిగిన పోస్టల్ కొరియర్ చార్జీలు ఒకటే బాధాకరమైన విషయం.
*
” మాట్లాడే పుస్తకాలు”
పుస్తకాలు మనల్ని మాట్లాడిస్తాయి. ఆలోచింపచేస్తాయి, చైతన్య పరుస్తాయి. మరింత ఉన్నతంగా ప్రవర్తించడాన్ని నేర్పిస్తాయి. కొత్త చూపును కొత్త భాషను కొత్త మాటను కొత్త శక్తిని కొత్త ప్రేరణ ను
అందిస్తాయి. వ్యక్తి పట్ల జీవితం పట్ల సమాజం పట్ల బాధ్యతగా ఉండటాన్ని నేర్పిస్తాయి.
కొందరు సాహితీమిత్రులను పుస్తకాలకు సంబంధించి ఏడు ప్రశ్నల్ని అడగడం జరిగింది.
జి వెంకటకృష్ణ, కె.క్యూబ్ వర్మ, వి. ప్రతిమ, సుంకర గోపాలయ్య , పల్లిపట్టు నాగరాజు పుస్తకాలకు సంబంధించి వాళ్ళ అనుభవాలను, ఎన్నో అద్భుతమైన విషయాలను చెప్పారు. వాళ్లను అడిగిన ప్రశ్నలు ఇవే.
1. మీకు పుస్తకాలు ఎలా ఎప్పుడు ఎక్కడ ఎవరి ద్వారా పరిచయం అయ్యాయి?
2. మీరు పుస్తకాలను ఎంపిక చేసుకునే పద్ధతి, సేకరించే విధానం గురించి, భద్రపరిచే పద్ధతుల గురించి.
3. మీరు చదవాలనుకుని చదవలేకపోయిన లేదా సేకరించాలనుకుని సేకరించలేకపోయిన పుస్తకాల గురించి
4. ఎంతో ఇష్టమైన, మీరు పోగొట్టుకున్న పుస్తకాల గురించి.
5. మీకు ప్రాణ సమానమైన పుస్తకాల గురించి.
6. ఏ సమయంలో ఎలా ఎక్కడ మీరు పుస్తకాలను చదివే పద్ధతుల గురించి.
7. మీలో,మీ జీవితంలో పుస్తకాలను చదవడం వల్ల వచ్చిన మార్పుల గురించి.
*
కవి, కథకుడు, విమర్శకుడు జి. వెంకటకృష్ణ ఇలా అంటున్నారు.
1.
మా హైస్కూల్ లో చందమామ, బాలమిత్ర కథల పుస్తకాలు మొదట చేతుల్లోకి వచ్చి, చదివే అలవాటును కల్గించాయి. ప్రత్రేకించి ఎవరూ పరిచయమైతే చేయలేదు.చందమామల మీదుగా జానపద కథలు, డిటెక్టివ్ నవలలూ అటునుండి సీరియస్ సాహిత్యం వైపు వచ్చాను.
2. మొదట్లో పుస్తకం కనబడితే తీసేసుకునే వాడ్ని.తర్వత నచ్చిన రచయితలు చేతుల్లోకి వచ్చేవాళ్లు.
ఇక యిప్పుడైతే నా దృక్పథంతో సరిపడేవారినే ఎంచుకుంటాను. అన్ని సాహిత్య ప్రక్రియల పుస్తకాలూ వున్నాయి.కవిత్వానివి ఎక్కువగా వుంటాయి.
మాకు యింట్లో లైబ్రరీకి ఒక గది వుంది. పుస్తకాలతో ర్యాకులు నిండు గర్భిణుల్లా వున్నాయి. మా సుభాషిణి సంవత్సరం సంవత్సరం చాలా లాగి పడేస్తుంది.అయినా కొత్తవి చేరుతూనే వుంటాయి.
3. నేను చదవాలనుకొనేవి చాలా వున్నాయి. పాశ్చాత్య సాహిత్యాన్ని ఇంగ్లీష్ లో లభ్యమయ్యే దాన్ని చాలా చదవాల్సి వుంది. ఇక దేశీయ సాహిత్యం వుండనే వుంది. నేను పుస్తకాలు కేవలం సేకరించాలనుకోను. చదవడానికి మాత్రమే కొంటాను.నా దగ్గరున్న ప్రతి పుస్తకం నేను చదివిందే. చదివాక యిష్టమైతే ర్యాక్ లోకీ లేకుంటే బయట ఎవరికైనా.
4. పోగొట్టుకున్న పుస్తకం అనుకుంటూనే గుర్తుకొచ్చేది , ప్రేంచంద్ రంగభూమి నవల.కొని ర్యాక్ లో పెట్టాను. కొద్ది కాలం తర్వాత చదవాలనుకుంటే కన్పించలేదు. కుప్రిన్ రాళ్లవంకి పుస్తకం కూడా పోగొట్టుకున్నదే.
5. ప్రాణ సమానమైన పుస్తకాల గురించి:
అట్లా ఒక పుస్తకం అని లేదు. ఏదైనా పుస్తకం అనుకున్నప్పుడు కన్పించకపోతే నిజంగా ప్రాణం పోయినట్లే వుంటుంది. ఇంట్లో యుధ్ధాలు కూడా నడుస్తాయ్.
6.ప్రయాణాల్లో, రాత్రులలో బాగా పుస్తకాలు చదువుతాను. సెలవు రోజుల్లో మధ్యాహ్నం పూట చదువుతాను.కూర్చొనే చదువుతాను. పడుకొని చదవను.పుస్తకాన్ని చదువుతూ అండర్లైన్ చేసుకోవడం, లేదా నోట్స్ రాసుకోవడం చేస్తాను.
7. పుస్తకాలు లేకుంటే ఏమై పోయుండేవాణ్ణో. నాకు వేరే ఏ అలవాట్లు లేవు. మరీ ఫ్రెండ్స్ లేరు. గాలి కబుర్లు ఆడలేను. ఏర్పడ్డ స్నేహితులు కూడా పుస్తకాల వల్ల పరిచయమైన వాళ్లే. నా ప్రేమ వివాహానికి పునాది పుస్తకమే. పుస్తకాలతోనే మా సుభాషిణి నాకు పరిచయం.మా ఇంట్లో ఫంక్షన్ జరిగితే ఆహుతులకు పుస్తకాలు కానుకగా యిస్తాం. నేనూ మా ఆవిడా రాసిన పుస్తకాలు కాదు, మంచి పుస్తకాలు కొని పంచుతాం..
నేను విద్యార్థిగా ఏ స్టూడెంట్ యూనియన్లలోనూ లేను. ఏదో మేరకు ఆరోగ్య కరమైన ప్రగతిశీల దృక్పథంతో వున్నానంటే దానికి కారణం నాకున్న చదివే అలవాటు. ప్రపంచ సాహిత్యం నన్ను మనిషిని చేసింది.
*
కె. క్యూబ్ వర్మ ఇలా అంటున్నారు.
1. నాకు మా నాన్నగారి ద్వారానే పుస్తకాలు పరిచయం. ఆయన దగ్గర వైద్య గ్రంధాలతో పాటుగా మార్క్సిస్ట్ సాహిత్యం కూడా వుండేది. పదో తరగతి పరీక్షలు అయ్యాక, అందులో మొదట చదివింది తెలంగాణా పోరాటం నా అనుభవాలు జ్ఞాపకాలు. పాఠ్య పుస్తకాలతో పాటు అన్ని చదివే అవకాశం ఇచ్చేవారు. తరువాత లంక సత్యనారాయణ అనే మిత్రుడు ద్వారా సైద్దాంతిక గ్రంధాలు, గోర్కి అమ్మ నవల చదవడం, అప్పుడే ఇంకో మిత్రుని ఇంట్లో పెద్ద గ్రంథాలయం వుండేది.
అందులో కాశీమజిలీ కధలు, భట్టి విక్రమార్క చరిత్ర నుండి రాహుల్ సాంకృత్యాయన్ రచనలన్నీ వుండేవి. అవన్నీ రోజూ తెచ్చుకొని ఏక బిగిన చదవడం. అప్పడు కొంత సెలెక్టీవ్ గా చదవాలని వుండేది కాదు. యండమూరి, మల్లాది నుండి మధుబాబు నాగిరెడ్డి డిటెక్టివ్ నవలలు అన్నీ చదవడం. అదో వ్యసనంలా సాగింది. తరువాత్తరువాత సీరియస్ నెస్ వచ్చి సెలెక్టీవ్ గా సాహిత్యం చదవడం అలవాటైంది.
2. కవిత్వం పట్ల మక్కువ ఏర్పడ్డాక నవలలు కథల పుస్తకాలు చదవడం తగ్గిపోయింది. సాహిత్య విమర్శలో నందిని సిధారెడ్డి గారి పరిశోధనా పుస్తకం, సివి సుబ్బారావు గారిది, త్రిపురనేని గారివి ఇలా కొన్ని ఇష్టంగా చదివాను. నా దగ్గర ఇప్పుడున్న పుస్తకాల కంటే ఎక్కువే పాత ఇంట్లో వున్నప్పుడు ఇల్లు కారి చెదలు పట్టి పోయాయి. ఇప్పుడు కూడా ఈ మధ్య కప్ బోర్డులకు చెదలు వచ్చి పోయాయి. సాహిత్య సమావేశాలకు వెళ్ళినప్పుడు కొత్తవి చాలా వరకూ కొనుక్కుని తెచ్చుకుంటా. నచ్చినవి ఈమధ్య కాలం online లో కూడా తెప్పించుకోవడం జరుగుతోంది. ‘అనేక ‘పుస్తకాల షాపు అరసవిల్లి పెట్టాక తనకు అడిగితే నా అభిరుచికి దగ్గరవి కలిపి పంపుతున్నారు.
3. నాకు వి. చంద్రశేఖర్ గారి రచనలంటే చాలా ఇష్టం. నల్ల మిరియం చెట్టు దొరకలేదు. చదవ లేకపోయానన్న బాధ వుంది. నేను కొంచెం సిటీలకు దూరంగా వుండడం వలన మిస్సవుతున్నా. నాకు ఆశారాజు గారి కవిత్వ శైలి బాగా నచ్చుతుంది. ఇటీవలి ప్రచురణలు కొనుక్కోలేకపోయాను. దూరాభారం వలన బుక్ ఫెయిర్ లకు హాజరు కాలేదెప్పుడు. అదో వెలితి వుంది.
4. కొ. కు. సాహిత్య సంపుటాలు, రష్యన్ సాహిత్యం చెదల వలన పోగొట్టుకున్న. సోవియట్ ప్రచురణలు అలాగే మిస్సయ్యాను.
5. నాకు ఉద్యమ సాహిత్యం అంటే చాలా ఇష్టం. అమరుల చరిత్రలు వారి రచనలంటే ప్రాణం. పతంజలి సాహిత్యం అన్నా చాలా ఇష్టం. అందులోని వ్యంగ్యం మనలోని లోపాన్ని వేలెత్తి చూపినట్లు వుంటుంది. అలాగే గురువుగారు శివారెడ్డి గారి కవిత్వం ఎప్పుడు నాలో ఒంటరితనాన్ని పోగొట్టి మరల మనిషిని చేస్తుంటుంది. ఆ వాక్యాల వెంట సాగిపోతూ వుంటాను. అమరులు కౌముది, సముద్రుడుల కవిత్వం, వరవరరావు సార్ కవిత్వం రేపటిపై ఆశను కల్పిస్తాయి. ఇటీవల అరుంధతి రాయ్ రచనలు దేశం ఎదుర్కొంటున్న కార్పొరేట్ ఫాసిజాన్ని అర్ధం చేసుకోవడానికి బాగా ఉపకరిస్తున్నాయి.
6. చాలా వరకూ రోజు వారి ప్రయాణాలలో ఎక్కువగా చదివాను. మొదట్లో నిరుద్యోగిగా ఇంట్లో కూచుని చదివాను. ఉద్యోగ రీత్యా బస్సులో వెళ్ళినప్పుడు లేదా దూర ప్రయాణాలు చేసినప్పుడు వెంట పుస్తకాలు తీసుకుని చదవడం అలవాటు.
7. సాహిత్యం పరిచయం కాకపోయుంటే మనిషిగా ఇలా మిగిలే వాణ్ణి కాదేమో అనిపిస్తుంది. పుస్తకాలు విశ్వాన్ని మన అరచేతులలో చూపించే సాధనాలు. వాటి ద్వారా ఏర్పడిన పరిచయాలు నన్ను నేను సరిదిద్దుకునేందుకు నా పనిలో ధైర్యంగా ముందుకు పోవడానికి మార్గదర్శకాలు. పుస్తకాలు చాలా వరకు మన ఆలోచనలను నియంత్రిస్తాయి. అంటే సరైన తోవలో ప్రయాణించేటేట్టు చూపునిస్తాయి. చివరిగా మా నాన్నగారెప్పుడు అనే వారు చదువు మూడో నేత్రం అని.





BOOKS READING
VERY GOOD SUBJECT -NICE ONE
==================BUCHIREDDY GANGULA