ప్రజాపక్ష రచయిత్రి, ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక జాతీయ అధ్యక్షురాలు అనిశెట్టి రజితకు జోహార్లు.
వరంగల్లో ఈ నెల 11 తేదీన గుండెపోటుతో ఆమె మరణించారు. సామాజిక ఉద్యమ సందర్భాలకు స్పందిస్తూ, ఊరేగింపుల ముందు కవిత్వాన్ని కవాతులా నడిపించిన సాహిత్య, సామాజిక ఆచరణజీవిగా రజిత గుర్తుండిపోతారు.
ఉద్యమాలతో మమేకమై జీవిస్తూ కళా, సాహిత్య రంగాల్లో పనిచేయాల్సిన అవసరం గతం కంటే ఇప్పుడు మరింత పెరిగింది. భిన్నాభిప్రాయాలను సహించని వాతావరణంలో ప్రజాపక్షం వహిస్తూ చిన్న కామెంట్, పదునైన ఒక వాక్యం సోషల్ మీడియాలో పెట్టీపెట్టగానే ట్రోలింగ్ వేట మొదలయిపోతోంది. సొంత లాభం కొంత మానుకు.. పొరుగువానికి తోడుపడవోయ్.. అన్న గురజాడ అప్పారావు జీవించి ఉంటే అర్బన్ నక్సల్ కింద జమకట్టి జైళ్లో తోసేసే కాలం వచ్చేసింది. కళ్లు ఉన్నందుకు నిజం చూసి, నోరు ఉన్నందుకు ఆ చూసిన నిజం మాట్లాడడాన్నే నేరంగా చేసిన నిరంకుశ అధికారం మన నెత్తి మీద ఎక్కి తొక్కుతోంది. ఈ పరిస్థితుల్లో అనిశెట్టి రజిత వంటి నిబద్ధ ఉద్యమకారులు, అరుదైన మేధావులు, రచయిత్రులు దూరమవడం ఆందోళనకరం. సవాళ్ల మధ్య సాగుతున్న ప్రజాస్వామిక స్వేచ్ఛా, లౌకికవాద ప్రయత్నాలకు రజిత మరణం పెద్దలోటు.
ఉజ్వల పోరాట చరిత్ర కలిగిన వరంగల్ జిల్లా నుంచి వచ్చిన రజిత చిన్ననాటినుంచే ఉద్యమాలతో మమేకమయ్యారు. హైస్కూలులో చదువుతుండగా బద్దలైన 1969 తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఇంటర్
చదువుతుండగా పరిచయమైన ప్రగతిశీల మహిళా సంఘం (pow ) ఆమె సామాజిక, సాహిత్య దృష్టిని విశాలం చేసింది. 1982 లో కాకతీయ అధ్యాపక బృందం , విద్యార్థులు కలిసి ఏర్పాటు చేసిన స్త్రీజనాభ్యుదయ అధ్యయన సంస్థలో భాగస్వామి అయ్యారు. మలి దశ తెలంగాణ ఉద్యమకాలంలో తెలంగాణ రచయితల వేదిక నిర్మాణంలో చురుకైన పాత్ర పోషించారు. సమకాలపు సామాజిక చలనాలకు స్పందిస్తూ కవిత్వం రాయడం కాలేజీ రోజుల్లో
ఆమె మొదలుపెట్టారు. 1984 లో గులాబీలు జ్వలిస్తున్నాయి అనే చిన్న కవితా సంపుటిని ప్రచురించారు. అందులో ఒకటి రెండు మినహాయిస్తే అన్నీ స్త్రీల సమస్య కేంద్రంగా వచ్చిన కవితలే. స్త్రీ సమస్యపై అధ్యయనం, ఆచరణ కార్యక్రమాలు- ఇవే రజిత కవితా వస్తువులు. అంతేకాదు, ఆనాటి మహిళా ఉద్యమ అవసరాల నుండి రజిత జానపద గాయకురాలిగా మారారు. శబ్దలయను గురించిన స్పృహ ఆమె కవిత్వాన్ని మరింతగా ప్రజలకు చేరువ చేసింది. అలాగే, సారా వ్యతిరేక ఉద్యమం, మలిదశ తెలంగాణ ఉద్యమం, పోలవరం ప్రాజెక్ట్ వ్యతిరేక ఉద్యమం, మల్లన్న సాగర్ వ్యతిరేక ఉద్యమం, ముజఫర్ నగర్ మారణకాండ నిరసన ఉద్యమం, ఏదైనా కానీ.. ఒకచేత్తో ఉద్యమ జండా ఒకచేత్తో కవితా పతాక ఎగరేశారు. మరణించేవరకు ఈ ఆచరణ కొనసాగించారు. ‘నేనొకనల్ల మబ్బునవుతా’(1997), చెమట చెట్టు (1998), ఉసురు (2002), అనగా అనగా కాలం (2005) అనేవి ఆమె కవితాసంపుటులు. ఓ లచ్చవ్వ , మార్కెట్ స్మార్ట్ శ్రీమతి దీర్ఘ కవితలు. తన కవిత సంపుటాల నుండి ఏర్చి కూర్చి ’నిర్భయాకాశం కింద’ అనే కవితా సంపుటిని 2016 లో ప్రచురించారు. కొన్ని కథలు రాశారు. అనేక సాహిత్య సంపుటాలకి సంపాదకత్వం వహించారు.
కాకతీయ మెడికల్ కాలేజీకి ఆమె కోరిక మేరకు మరణానంతరం దేహాన్ని అప్పగించడం ఒక శాస్త్రీయ చర్య. అంతిమంగా రజిత భావజాలం ఉన్నతంగా నిలబడింది. తన అక్షరాలతో అణచబడ్డ వర్గాలకు ధిక్కారాన్ని బోధించిన, చివరిదాకా తన ఆచరణతో పోరాటాన్ని రగలించిన అనిశెట్టి రజితకు విప్లవ రచయితల సంఘం జోహార్లు అర్పిస్తోంది.