ఫిబ్రవరి 20 వ తేదీ వచ్చేసింది. మహాసభ నిర్మాణ ప్రయత్నాలు అనేక దుస్సంఘటనలవల్ల వుత్సాహంగా సాగడంలేదు. కేవలం 24 దినాలు మాత్రమే వుంది. మహాసభ ప్రయత్నాలు గుర్తుకొస్తే ప్రతివాడికి గుండె జలదరిస్తోంది. వ్యవధిలేదు. బ్రహ్మాండమైన ప్రయత్నాలు ముందున్నాయి. మహాసభ జరిగే తారీఖు మారిస్తే మంచిదేమో అని కొందరు కామ్రేడ్సు సలహాయిచ్చారు. 10,000 మంది ప్రజా సైనికులు పూనుకున్నపని సాధ్యంకాకపోతుందా అని పళ్ళ బిగువును సమాధానం చెప్పుకున్నాం. 25 వ తేదీకి కృష్ణానుండి, గుంటూరునుండి 60 మంది ప్రజారక్షణదళ సభ్యులు సహాసభ నిర్మాణానికి హాజరయారు. పని ప్రారంభమైంది.

26 వ తేదీ రాత్రి, 9 గంటలయింది. వలంటీరు మితృలను చూడడానికి మహాసభ స్థలానికివెళ్ళాను. చీకటిగావుంది. సరియయిన దారితెలియక వాసాలకు అడ్డంపడ్డాను. ‘ఎవరండీ అది’ అనే కేకతో బేటరీలైటు నామీద పడింది. కామ్రేడ్ వలంటీరు సెంట్రీ డ్యూటీలో వున్నాడు. ఎంత జాగరూకత! ఆ కామ్రేడ్ దారి చూపించి వెళ్ళాడు. క్రిందటిదినం మైదానం -యీ రాత్రికి అప్పుడే 3 పందిళ్లు తయారైనాయి. నిజంగా ప్రజాసైనికులనిపించారు. “వంతులువేసుకొని పనిచేశాం, కామ్రేడ్!” అంటూ ఒక వాలంటీరు వుత్సాహంతో అన్నాడు. ప్రజాసేవ లక్ష్యంగా లేని వాళ్ళు యింతపని చేయగలరా అనేగర్వం అతని ముఖంలో కన్పించింది. మహాసభ ప్రయత్నాలు పూర్తికావనే భయం కొంచెం తగ్గింది. అంత కార్యదీక్షతో పనిచేస్తున్న ప్రజా సైనికులను చూస్తే పని అసంభవమనుకునేదెట్లా ?

రైతుమహాసభ ఆహ్వానసంఘ సభ్యులచే ఎన్నుకోబడ్డ వలంటీరు కమిటీ సమావేశం జరిపాం. మహాసభ నిర్వహణానికి పూర్తి ప్లాన్ తయారుచేశాం. మొదట్లో నిరుత్సాహంఉన్నా, వలంటీర్ల కృషి అందరినీ ఉత్తేజపరిచింది. మార్చి 5 నిర్మాణ ప్రయత్నం పూర్తి అవుతుంది, తప్పకుండా అన్నాడు కామ్రేడ్ రాజేశ్వరరావు. మార్చి 10 కి 3,500 మందిని, మార్చి 14 కు మరి 3,500 మందిని వాలంటీర్లను తీసుకొని రావాలనీ; ఎక్కువ శిక్షణ యివ్వాల్సిన అవసరం వున్న పనులకు 10 వ తేదీకి వచ్చేవారిని ఉపయోగించాలనీ, మిగిలిన పనులకు 14 వ తేదీకి వచ్చేవారిని ఉపయోగించాలనీ కమిటీ తీర్మానం. తలా ఒక జిల్లాకు బయలుదేరాం!

మార్చి 8 వచ్చింది. నావంతు కార్యక్రమం పూర్తిచేసుకొని బెజవాడ చేరాను. నాకంటే ముందువచ్చిన కామ్రేడ్సంతా రైతునగర్ నిర్మాణాన్ని చూచి మురిసిపోతున్నారు. సాయంత్రం రైతునగర్ కు వెళ్ళాను. ఏం సంరంభం! వలంటీరు కామ్రేడ్సంతా కోలాహలంగా పందాలు వేసుకొని పందిళ్ళు నిర్మిస్తున్నారు. అతివేగంగా పని జరుగుతోంది అనే ధీమాతో ఆఫీసులో జమాఖర్చులు వ్రాస్తున్న కామ్రేడ్ దాసు (రాష్ట్ర యువజన సంఘ ఆర్గనైజరు) “నిముషాల మీద పని జరుగుతోంది చూడు!” అంటూ వుత్సాహంతో కరస్పర్శజేశాడు. ఒక ముఠా టాంకు కట్టడానికి ఇసుక మోస్తోంది. ఒక దళం గేటుకు అవసరమైన యేర్పాట్లు చేస్తోంది. ప్రతి కామ్రేడ్ తన పనిలో నిమగ్నుడై వున్నాడు. బాదులు లేపలేక అవస్థపడుతున్న ఒక యువక వలంటీరుపై నాదృష్టిపడింది. చాలా అలసట జెందాడు. ‘కాసేపు కూర్చో కామ్రేడ్’, అన్నాను. “నేకూర్చుంటే మాదళంవంతు ఎలా పూర్తి అవుతుంది?” అని సమాధానం.

9వ తేదీ రాత్రే వలంటీర్ కమిటీ అంతా రైతునగర్ లో మకాం పెట్టాం. 10 వ తేదీ అంతా వలంటీర్లు ప్రవాహంగా వస్తూనే ఉన్నారు. వలంటీర్లకని నియమించిన పందిరి ఒకటి నిండింది. కాని అనుకున్నంతమంది రాలేదు. 1,200 మంది మాత్రమే వచ్చారు. ఎందుకని రాలేదా అనే ఆలోచనలో పడ్డాం. గుంటూరుజిల్లా పొగాకు మార్కెటింగు ఎన్నికలవల్ల అనుకున్నంతమంది వలంటీరు కామ్రేడ్సు ఆజిల్లానుండి రాజాలక పోయారన్నాడు కామ్రేడ్ ప్రసాద్ (రాష్ట్ర యువజన సంఘ ఆఙ్గనైజర్). ఆ ఎన్నికలలో జిల్లా రైతుసంఘ అభ్యర్థులను, రంగాముఠా, కొందరు వర్తకులు, కొంతమంది స్వార్ధపరులు- అంతాగలిసి ఓడించాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తన్నారు. మార్చి 14, 15 రైతుమహాసభ గనుక, దానికి వెళ్ళిన రైతు నేవకులు తిరిగిరావడం సాధ్యంకాకుండా చేయాలనుకున్నాడు ఎన్నికోద్యోగి- ఎన్నికలను 18, 19 తేదీల నుంచి, 16, 17 తేదీలకు మార్చాడు. అంచేత కొంత మంది వాలంటీర్లను నిలిపివేయవలసి వచ్చింది. కామ్రేడ్ రాజేశ్వరరావు ఆలోచనలో పడ్డాడు. నిర్మాణం 5వ తేదీకే పూర్తి అవుతుందనుకున్నాం. కాని అదనంగా ఎన్నో పనులు రావడంమూలంగా పూర్తికాలేదు. “3000 మందైనా రాకుంటే నిర్వహించడం చాల కష్టమే” అంటూ పెదిమలు విరిచాడు కామ్రేడ్ తమ్మారెడ్డి. ఇంతలోనే యేమీ ఫరవాలేదు అని అభయహస్త మిస్తున్నారా అన్నట్లుగా. “రైతుసంఘాలకు జై” అంటూ దిక్కులు మారుమ్రోగే నినాదాలు వినిపించాయి. ఉత్సాహంగా అందరం లేచాం. దారులు దీరి, నినాదాలిచ్చుకుంటూ వస్తున్నారు వలంటీర్లు. అది రేపల్లె దళం, తాలూకా వాలంటీరు కెప్టెన్ ముందు వున్నాడు. ఇంకా ఎంతమంది వస్తున్నారు కామ్రేడ్ అని ప్రశ్నించాను. “నడవలేక చాలమంది రాలేదు. కొంత మంది రేపు రైలుకు వస్తామన్నారు. ఎవరికివారు తేలికమార్గాలు వెదుక్కోవడం తప్పనిసరి అయినందువల్ల ఎక్కువమంది రాజాలకపోయాము. వచ్చినవాళ్ళలో కూడ కొందరు రైళ్ళమీద, కొందరు పడవలమీద, కొందరు నడకను రావడంవల్ల ఒక పూరువారందరూ ఒక దశంగా రావీలులేకపోయింద”న్నాడు. ఆ కామ్రేడ్ మాటలు వింటున్న మరో గుడివాడ తాలుకా కామ్రేడ్ “మా తాలూకాలో మినుము తీతలు ముమ్మరంగా వున్నాయి. అందులో ముసురు కూడా పట్టి హడావిడి చేస్తోంది, లేకుంటే ఇంకా చాలమంది వచ్చేవాళ్ళు కాని, వాళ్ళంతా 14 వ తేదీకి తప్పకవస్తార”న్నాడు. మొత్తంమీద పైకారణాలవల్ల వలంటీర్లు 3,500 మంది రావడం కష్టమేననిపించింది.

మరునాడు ఉదయం వలంటీర్ల సమావేశం జరిగింది వలంటీర్ల విధులు కామ్రేడ్ రాజేశ్వరరావు చదివి, వివరించి చెప్పాడు. వలంటీర్లు వంట, ఆరోగ్యం, కాపలా, ఊరేగింపులు, బహిరంగసభలు వగైరా, స్త్రీలు మొదలైన 5 శాఖలుగా విభజింపబడ్డారు. వివిధశాఖలు, ఆ శాఖల బాధ్యులపేర్లు, వలంటీర్లకు పరిచయం చేశారు. ఆరోజునుంచి వలంటీర్లందరు శాఖలవారీగా విడిపోయి పనిచేశారు. ఈ వివిధశాఖల వలంటీర్లకు వేర్వేరు పందిళ్ళు ప్రత్యేకించబడినాయి. ఆ పందిళ్ళలో ఏగ్రామదళానికి ఆదళం కందారతాడుతో కొంతచోటు అడ్డుగట్టుకొని ఇల్లులా చేసుకున్నారు. స్థలం చాలకపోవడం చేత అలాగే ఇరుక్కొని పండుకొనేవారు. ఈ పందిళ్ళను చూస్తే నాకు బొంబాయిలో కార్మికులుండే ఛాల్సు గుర్తుకువచ్చినాయి. పైశాఖలకు ఆయా పందిళ్ళలో వేర్వేడు ఆఫీసులు పెట్టబడినాయి. ఆఫీసులు తనిఖీ చేయడానికి కేంద్ర వలంటీరు ఆఫీసు పెట్టబడింది.

వచ్చిన తరువాత ఒక్క పూటకూడ విశ్రాంతి లేకుండా పనిచేశారు. 5,000 మంది భోజనం చేసేందుకు సరిపోయే పందిరి నిర్మించారు. లెక్కలేనన్ని పాయిఖానా దొడ్లు కట్టారు. ఎన్నో మరుగుదొడ్లు తయారుచేశారు. ఇంటివద్దనుండి బయలుదేరిన తర్వాత ఒక్క నిముషం కూడ విశ్రాంతిలేదు. మొట్టమొదట అంచనా లేకపోవడం మూలంగా ఎంత హడావిడిగా చేసినా 13వ తేదీ వరకు కాస్తోకూస్తో నిర్మాణానికి సంబంధించిన పని వుంటూనే వచ్చింది.

12వ తేదీ రాత్రికే ప్రదర్శనశాల తయారైంది. జనం వచ్చేవాళ్ళు పోయే వాళ్లతో రైతునగర్ కళకళలాడుతోంది. 13వ తేదీ ఉదయం ఐదుగంటలకు “టైము అయిందిలెండి” అని కేకవేసింది వెంట్రప్రగడ మిలిటరీ బ్యాండు. అన్ని పందిళ్ళలోని వలంటీర్లు హడావిడిగా లేచి కాలకృత్యాలు తీర్చుకోటానికి పోతున్నారు. ఇంకా చాలా  చీకటివుంది. ఆరుబయట పడుకున్న మనుష్యులు కూడ లేచి హడావిడిగా కాలకృత్యాలు తీర్చుకుంటానికి బయలుదేరి పందిళ్ళ కడ్డంబడ్డారు. ఇది కాదండోయ్ దారి అంటూ సెంట్రీవచ్చి దారిచూపెట్టాడు. బయటికివచ్చి టాంకు వద్దనీళ్ళు ముంచుకోవడానికి వెళ్ళాడు ఒకాయన, ‘దొడ్డికి వెళ్ళేందుకు యీ నీళ్ళు కాదండి’ అంటూ ఒక వలంటీరు ప్రత్యక్షం. దొడ్డికి వెళ్ళివస్తున్నాను. పాయిఖానా దొడ్లవద్దనున్న నీళ్ళ కొళాయిదగ్గర నల్గురు వలంటీర్లు వున్నారు. ఇద్దరు దొడ్లలోకి మార్గం చూపెడుతున్నారు. ఇద్దరు నీళ్ళదగ్గర వున్నారు. “ఈ నీరు క్లోరినేటు చేయలేదండోయ్ – నోట్లో పోసుకోవద్దు.” అని విసుగులేకుండా చెపుతున్నారు. ఈ శ్రద్ధచూచి వుప్పొంగని వారెవరుంటారు? “ఇందుగలడందులేడని సందేహము వలదు” అన్నట్లు ప్రజలను ప్రతి చిన్న విషయంలోను కంటికి రెప్పలా కాచారు.

భోజనాలవద్దగాని, కాపలాలోగాని, మీటింగులో సర్దడంలోగాని, డ్యూటీలో వారికి విశ్రాంతి ఇవ్వడానికి అదనంగా వలంటీర్లు లేకపోయారు. అందువల్ల వలంటీర్లు రెట్టింపుపని చేయాల్సివచ్చింది. అయినా వలంటీర్లు ఓర్పుతో బాధ్యతను నిర్వహించారు.

వలంటీరు ఆఫీసులో కూర్చుండి భవిష్యత్కార్యక్రమంపై ఆలోచన సాగిస్తున్నాం. “నాకేదైనా పనియివ్వండి” అంటూ వచ్చాడు ఒకాయన. 60 ఏండ్లుంటాయి. గడ్డం మాసివుంది. మాసిపోయిన లుంగీ, చిరిగిన చొక్కా. వెనక 14 ఏండ్ల పిల్లలు. ముసలివారుకూడ వస్తున్నారే అనే మందహాసంతో గాబోలు చిరునవ్వుతో, “కాసేపు కూర్చోండి పని యిస్తాం” అన్నాడు కామ్రేడ్ రాజేశ్వర రావు. ఆ వ్యక్తి నరసింహం. రైల్వే కూలీల తరపున ఎం. ఎల్. ఎ; మనమలతో సహా వలంటీర్లుగా పనిచేయడానికి వచ్చాడు. భోజనాలయిపోయినాయి. అన్నంలో వడ్లు వుండటం చూసింది ఒక అవ్వ. యెర్రపట్టీని చూచి నన్ను పిలచింది. “ఏం నాయనా: వందమందిమి ఖాళీగా వున్నాము. ఈరోజుకు బియ్యం చెరిగేపని యివ్వండి, కావలసినన్ని బియ్యం బాగుచేస్తాం” అంది. ఆ అవ్వ చేతిమీదవున్న వలంటీరు బాడ్జి మీదికి పోయింది నా దృష్టి. అవ్వల ఆశీర్వాదాలేగాకుండా సహకారంకూడ లభించినందుకు గర్వించాను.

ఆఫీసులో పనులు చాల ఎక్కువగావున్నాయి. వలంటీర్లను రిక్రూటు చేసికోవడంలో మునిగిపోయి వున్నాడు కామ్రేడ్ నరసయ్య (రాష్ట్ర విద్యార్థి సంఘ సహాయకార్యవర్శి). నాకుకూడ ఒక బాడ్జి ఇవ్వండి అంటూ వచ్చాడు ఒక యువకుడు. 14 ఏండ్లుంటాయి. సుకుమారి. యెన్నడూ పనిచేసి యెరుగడు అని ముఖం సాక్ష్యం చెపుతోంది. “కామ్రేడ్. నీవు పని చేయలేవు. వద్దులే” అన్నాడు కామ్రేడ్ రాజేశ్వరరావు. పట్టుదలతో బాడ్జి తీసుకున్నాడు. కార్యదీక్షతో చివరివరకు నెగ్గి, విజయగర్వంతో ఆఫీసుకొచ్చాడు. ఆ వలంటీరు కామ్రేడ్ ఎవరో తెలుసా? ఒక జమీందారు పుత్రుడు. ముసలివాళ్ళు, బాలురు అనే విచక్షణే లేకుండా అన్ని వర్గాలనుండి వచ్చారు. వ్యవసాయ కూలీలనుండి దాదాపు 600 మంది వలంటీర్లు హాజరైనారు. మహాసభ చూడలేదు అనే విచారంతో నిస్పృహ చెందకుండా శ్రమకోర్చి పనిచేసి మహాసభను జయప్రద మొనర్చారు. రైతుమహాసభకు కూలీలు వెళ్ళరాదని ప్రచారం చేసిన విచ్ఛిన్నకులకు సమాధానంగా రైతు కూలీ ఐక్యతను చాటడానికై నడుం కట్టారు. వ్యవసాయకూలీ వలంటీరు కామేడ్సు విజయం పొందారు.

ఇది రైతు – కూలీ ఐక్యతా చిహ్నమేకాదు. సంపూర్ణ ఆంధ్రజాతీయ సమీకరణకూడాను. ఇంతవరకు ఆంధ్రరాష్ట్రమంటే నైజాము ఆంధ్రజిల్లాల ప్రసక్తి చాలమంది హృదయాలలో లేదు. ఆంధ్ర జాతీయైక్యతా చిహ్నంగా నైజామునుండి 150 మంది వలంటీర్లు మహాసభకువచ్చి ప్రజాసేవలో పాల్గొన్నారు.

అనుకున్న సంఖ్యలో సగంమందే వచ్చారు. 13వ తేదీవరకు నిర్మాణ కార్యకలాపాల్లో అందరం మునిగిపోయాము. యేశాఖలోనూ ప్రత్యేక శిక్షణ యివ్వడానికి అవకాశంలేదు. అయినాగాని జయప్రదంగా మహాసభను నిర్వహించి ప్రజల మన్ననల పొందాం. ఇదెట్లా సాధ్యమైంది? దీనికి సులభంగా లభించగల సమాధానం ఒక్కటే: ప్రజాసహకారం, ప్రణాదరణ. ఈరెండూ ఉన్నాయి. గనుకనే విజయమొందాం. ఇది ప్రతి వలంటీరు అనుభవంద్వారా గ్రహించాడు. యేదిచెప్పినా ప్రజలు అంగీరించారు. ఇదివరకు యిలాంటి అనుభవం లేకపోయినా, వలంటీర్లు చెప్పినట్లు ప్రవర్తించడంద్వారా వలంటీర్లకు ప్రజలు ఎంతో శ్రమ తగ్గించారు. ఉదాహరణకు, ట్రెంచి లెట్రిన్లలోకి వెళ్ళడం ప్రజలకు అలవాటులేదు. అయినా 4గురు వలంటీర్లు వేలకొలది ప్రజలు లెట్రిన్సుకు వెళ్ళినా గలీజుగాకుండా కాపాడగల్గారు. మహాసభలో పాటించిన ఈ ఆరోగ్యసూత్రాలనే గ్రామాల్లో గూడా పాటించితే గ్రామాలు ఎంత పరిశుభ్రంగా ఉంటాయి! ఎంతమంది మలేరియా, టైఫాయిడు, కలరా, మశూచిక జబ్బులకు బలిగాకుండా ఉంటారు! ఎంత మందు ఖర్చు తప్పుతుంది! ఎక్కడబడితే అక్కడ బయలుకు కూర్చోడం, ఉచ్చపోయడం చెత్తివేయడం వల్లనేగదా తిరునాళ్ళలో కలరాలు పుట్టేది! అంతేగాదు. భోజనాల వద్దకూడ యిష్టము వచ్చినచోట విస్తళ్ళు పారవేసి గలీజు చేయకుండాను, బారులు తీరి వెళ్ళడంద్వారాను, ఎంతో తోడ్పడింది ప్రజానీకం. ఈ సందర్భంలో ఒక ఉదాహరణ గుర్తుకొస్తోంది. 50 యేండ్లు వుంటాయి ఆముసలమ్మకు. పంక్తి అంతటా భోజనాలు పూర్తి అయినాయి. అందరూ లేచారు. కొత్తగా వచ్చిన నలుగురైదుగురు స్త్రీలు ముందుకు తోసుకొస్తున్నారు. అది తప్పని వారించి, లైనుల్లో నడిపించి గలాటా లేకుండా కాపాడింది. ఆమె వలంటీరుగాదు. యీ అనుభవాన్ని ఆమె వుదయం భోజనాల సమయంలో గడించింది. పబ్లికు మీటింగులోకూడ యే లైనులో నడిపితే ఆ లైనులో నడిచారు. ఎక్కడ కూర్చోమంటే అక్కడే కూర్చున్నారు. అందువల్లనే 2000 మంది వలంటీర్లు పబ్లికు మీటింగుకు అవసరమౌతా రనుకుంటే 1000 మందితోనే జరపగల్గాం. ప్రజల సానుభూతి, సహకారం పూర్తిగా వున్నాయిగనుకనే 7000 మంది మోయాల్సిన భారాన్ని 3500 మంది వలంటీర్లు చేయగల్గారు. ఇది దేన్ని రుజువుచేస్తోంది? ప్రజల సహకారంగల సైన్యం తనకు మించిన పనులు సైతం చేయడానికి సాహసిస్తోంది. చైనా సైన్యం యుగోస్లావియా సైన్యం ప్రపంచానికి చాటుతున్న పాఠంకూడా యిదే. వలంటీర్లు ఒక సక్రమమైన కార్యంకొరకు వున్నారనీ, తమ క్షేమంకొరకే వలంటీర్లు కృషిచేస్తారనీ, వారి ఆశయాలు మంచివనీ అంగీకరించారు. కనుకనే ప్రజలందరూ తోడ్పడ్డారు. చూడండి- అక్కడివి అన్నీ తాటాకుల పందిళ్ళు. ఆకులు ఎండి గాలికి గలగల మంటున్నాయి. పరాకున ఏ బీడీరవ్వ వాటిమీదపడినా, చాల ప్రమాదం జరుగుతుందని భయపడ్డాం. మద్రాస్ ఫైర్ సర్విసువారిని ఒక ఫైరింజను ఆరెండు రోజులు ఇమ్మని అడిగాం. గంటకు రు. 12 అడిగారు. అందువల్ల స్టిరపుపంపులతో తంటాలు పడదామనుకున్నాం. సుమారు 20 స్టిరపుపంపు పోస్టులను పందిళ్ల చుట్టూ అక్కడక్కడా పెట్టాం. అయినా ప్రజల సహకారం లేకపోతే ఈ స్టిరప్ పంపులు ఏమి చేయగల్గుతాయి? అందుచే ప్రజలు అవలంబించాలిసిన విధులను పెద్ద కాగితాలమీద అచ్చువేసి, అట్టలమీద అంటించి, అక్కడక్కడ కట్టాం. ప్రజలు చుట్టలు, బీడీలు పందిళ్ళకు దగ్గరగా కాల్చడం చాలావరకు మానివేశారు. ఎవరైనా కాల్చుతుంటే వలంటీర్లు హెచ్చరించేవారు. ప్రజలు కాల్చిన తరువాత వాటిని ఆర్పివేసేవారు. స్త్రీలుగూడ ఈ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నారో చూడండి, పెండాలుకు ఉత్తరపు వైపున మామిడిచెట్ల తోపు ఉంది. దానిలో బళ్ళు విడిచారు. 14 సాయింత్రం సమయం. పైరుగాలి వస్తోంది. స్త్రీలు మహాసభకు హాజరవడానికి త్వరత్వరగా వంటలు చేస్తున్నారు. కొన్నిపొయ్యిలు పెండాలు దడికి 10 గజాలలో వెలుగుతున్నాయి. ఆ ఎండు ఆకులమీద ఒక్క రవ్వపడితే, ఎంతో ప్రమాదం జరుగుతుంది. ఈ విషయం వారితో చెప్పాం. వారు వెంటనే అంగీకరించారు. పురుషులు బళ్ళను పెండాలుకు 50, 60 గజాల దూరంగా తీసుకుపోయారు. అబ్బ! ఏటేటా ఎండాకాలంలో చుట్టా బీడీలు ఆర్పిపారవేయకపోవడం వల్ల, పొయ్యిలవద్ద ఆజాగ్రత్తగా ఉండటంవల్ల, ఎన్ని ఇళ్ళు, వాములు, గొడ్ల చావిళ్ళు అగ్ని దేవుడికి ఆహుతి అవుతున్నాయ! ఈ జాగ్రత్త తీసుకుంటే, ఏటేటా ఎంత ఆస్తినష్టం జరుగకుండా ఉంటుంది!

ఊరేగింపులో 14 తేదీ ఉదయం 5 గంటలయింది. వాలంటీర్లను లేపడానికి బ్యుగిలు వేయబడింది. ఊరేగింపులో పాల్గొందామనే ఉత్సాహంతో, వలంటీర్లు త్వరత్వరగా కాలకృత్యాలు తీర్చుకొని వచ్చి లైనులలో నిలబడ్డారు. వంటశాలకు కాపలాకు వెళ్ళాలిసిన దళాలు వెళ్ళిపోయాయి. మిగతాదళాలు వరుసగా నిలబడినాయి. వెంట్రప్రగడ దళం రైతు ప్రముఖులను తీసుకురావడానికి అలంకరించబడిన బండ్లతో మొగలరాజపురం వెళ్ళింది. ఇంతలో ఈడ్పుగల్లు భజనదశం ముందుకువచ్చి ఫాసిస్టు వ్యతిరేక కీర్తనలను గంతులేస్తూ పాడడం మొదలు పెట్టింది. యలమర్రు వ్యవసాయకూలీ నావికులు మన పురాతనపు వాయ్యిమయిన తప్పెట్ల వాయిద్యాన్ని మొదలుపెట్టారు. ప్రజలు తమను తాము మరిచిపోయి దానిలో మునిగిపోయారు. వాలంటీర్ల వళ్ళు పులకరించింది. రణరంగానికి పోతున్నామా అనిపించింది. ఇంతలో స్వామీజీ, బంకిమ్, పృధ్వీసింగు మొదలయిన రైతునాయకులు ఎడ్లబండ్ల మీద, వాలంటీరుదళం బ్యాండుతో ముందునడుస్తూ, ఊరేగింపు వచ్చింది. ఆ రైతునాయకులు ఆసీనులయివున్న బండ్ల వెనుక వివిధరాష్ట్రాల రైతు ప్రతినిధులు బారులుతీరి నడిచారు. ఆ వెనుక ఒక వాలంటీరుదళం, తరువాత స్త్రీల దళం, ఇతర స్త్రీలు ఊరేగింపులో కలిశారు. పసిపిల్లల తల్లులు, నిండు గర్భిణీ స్త్రీలు వలంటీర్లుగా రాగూడదని ముందే కబురుపంపాం. కాని ఈ మహోత్సవంలో వారిని ఆపడం ఎవరితరం? ఊరేగింపులో పసిపిల్లల తల్లులు గూడ పచ్చి నిలబడ్డారు. 4గంటలసేపు నడవలేరనీ, పిల్లలకు ఎండదెబ్బ కొడుతుండనీ, కొందరికి నచ్చచెప్పి వెనుకకు మరల్చాం. ఇంతలో ఒక నిండు గర్భిణీ స్త్రీ గూడ ఊరేగింపులో కన్పించింది. ఆమెను వెళ్ళవద్దని నిరోధించి, వరుసబయటికి తీసుకు వచ్చేటప్పటికి కంటతడి పెట్టింది. స్త్రీదళం వెనుక మరొక వాలంటీరుదశం. తరువాత ప్రజలు, మరల వాలంటీరుదళం, ఈవిధముగా ఊరేగింపు షుమారు 20,000 మందితో సాగింది. ఇంకా బయట 25,000 మంది ప్రజలు ఉన్నారు. 14 తేదీ ఉదయానికే ఇంతమంది ప్రజలు వస్తారని అనుకోలేదు. అందుచే జండా ప్రతిష్టాపనలో ప్రజలను సర్దడానికి 200 మందినే ఉంచాం. కాని ఉదయానికి షుమారు 50,000 మంది ప్రజలు వచ్చేటప్పటికీ, ఊరేగింపు నుండి 500 మందిని తిప్పి తీసుకువచ్చాం. వారికి ఊరేగింపులో పాల్గొననీయలేదని కష్టంకలిగింది. వారికి – మహాసభను జయప్రదంగా సాగించడానికి వలంటీర్లు త్యాగం చేయాలిసిన అవుసరాన్ని గూర్చి చెప్పాం. వారు అంగీకరించారు.

మహాసభ ఆవరణ 10 యకరాలను కొన్ని కొన్ని భాగాలుగా విభజించి, వాటి మధ్యదార్లు ఏర్పరచి, ఆదార్లకు వాసాలు పాతి, తాడుకట్టాం. వలంటీర్లు దార్లుపొడుగునా నిలబడ్డారు. కామ్రేడ్ తమ్మారెడ్డి (ఆంధ్రరాష్ట్ర విద్యార్ధిసంఘ కార్యదర్శి) ప్రతి భాగంలోను 100 మంది ప్రజలకు ఒకకుండ చొప్పున వరుసగా కుండలను పెట్టించి నీరు పోయించాడు. మంచినీళ్ళు ఇయ్యడానికి కుండకొక వాలంటీరును నిలబెట్టాడు. ఇదంతా పూర్తిఅయ్యేటప్పటికి 11 గంటలయింది. ఊరేగింపు తిరిగి వచ్చి నగరంలో ప్రవేశించింది. మొత్తం 51,000 మంది ప్రజలు వచ్చారు. అందరినీ వలంటీర్లు తాళ్ళు కట్టబడిన భాగాలలోకి పంపి కూర్చోబెట్టారు. జండా ప్రతిష్టాపనోత్సవం పూర్తిఅయింది. ఆపూట సక్రమంగానే గడచిపోయింది.

భోజనాలు పూర్తిఅయ్యేసరికి 3 గంటలయింది. వలంటీర్లు భోజనాలు చేసి పందిళ్ళలో కూర్చునేటప్పటికే ప్రజలు సాయింత్రం సభకు రావడం మొదలు పెట్టారు. ఎండ ఎక్కువగా ఉంది. వేళతప్పి అన్నం తినడంతో 3 మంచి నీళ్ళ కుండీలలోని నీరు అంతా మీటింగు ఆరంభం కాకముందే అయిపోయింది. మీటింగు 4.30 గంటలకు ఆరంభమయింది. లక్షమంది ప్రజలు కిటకిటలాడుతున్నారు. మంచినీళ్ళకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎక్కడవచ్చిన నీళ్ల పీపాలు అక్కడే సరిపోతున్నాయి. తమ బిడ్డలైన వలంటీర్లు ఇంత కష్టపడుతుంటే, ప్రజలు నీళ్ళు కావాలని గల్లంతుచేయలేదు. అంతా ఓర్పుతో అలాగే మండుటెండలో కూర్చున్నారు. నీళ్ల యద్దడికితోడు, పడమటివైపున రెండు లౌడు స్పీకర్లు చెడిపోయినాయి. ఆవైపు ప్రజలకు వినపడటంలేదు. ప్రజలు వినపడటంలేదని గొణిగారు, లౌడ్ స్పీకర్ల యింకా అదనంగా తెచ్చిపెడతామని చెప్పితే. విని ఊరుకున్నారు. రెండు గంటలలోనే అదనంగా కొన్ని లౌడు స్పీకర్లు తెచ్చి అమర్చబడినాయి. కాని ఆరోజు సభ సంతృప్తికరంగాలేదు. నీళ్ళు యింకా చాల నిలవ వుంచితేనేగాని పని జరగదనుకున్నాం. కామ్రేడ్సు సుందరం, తమ్మారెడ్డి, ఈ బాధ్యతను తీసుకున్నారు. కుండీలన్నీ పూర్తిగా నింపబడినాయి. మొత్తం 4000 కుండలలో నీరు నింపి, ప్రతి భాగంలోనూ ఉంచబడినాయి. ఈపనిలో హైదరాబాదు దళం చాల ప్రశంశనీయంగా పనిచేసింది. అందులో ఎన్నడూ పని ఎరుగని సుకుమారులు. చాలమంది, బి. ఏ., ఎం. ఏ., చదువుకున్న ముస్లిం సోదరులుకూడ వున్నారు. చేతులు బొబ్బలెక్కినా పట్టుదలతో పనిచేశారు.  లౌడుస్పీకర్లుకూడ చక్కగా వినిపించుకున్నాయి. ప్రజలు గూడ శిక్షణ నేర్చుకున్నారు. 15వ తేదీని సభ జయప్రదంగా ముగిసింది.

స్త్రీ వలంటీర్ల కృషి 20 వేలమంది స్త్రీలు మహాసభకు వచ్చారు. పిల్లలతోకూడ వచ్చారు కొంత మంది. వీరందరికీ తగిన వసతులు చూచుటకు వంటలో పాల్గొనుటకు, ముందుకు వచ్చి పనిచేసిన స్త్రీ వలంటీర్ల కృషిని గూర్చి చెప్పాలి. మొత్తం 300 మందిని వలంటీర్లుగా చేర్చుకున్నాం. వారిలో 120 మంది ముసలమ్మలున్నారు. 80 మంది 10, 11 తేదీలలోనే వచ్చారు. ఈ వచ్చిన 300 మంది 3 భాగాలుగా విభజింపబడ్డారు. 1. వంటశాలవద్ద కూరలు తరగడం, పులుసుకాయడం మొదలైన పనులుచేయుటకు. 2. ఆరోగ్యమునకు సంబంధించిన విషయాలు చూచుటకు, చిత్ర ప్రదర్శనశాలలో విషయాలు చెప్పుటకు 3. పబ్లిక్ మీటింగు, కాపలా.

ముందు వంటశాలలో పనిచేసే స్త్రీ వలంటీర్ల కృషిచూద్దాం. అందుకు నియమింపబడినవారు ఎంతో బాధ్యతతో ఆ రెండు రోజులు ముందుగనే తమ పనిని పూర్తిచేసి ఆ తరువాత ఉత్సాహంతో సభాప్రదేశానికి వచ్చేవారు.  ప్రజాసేవ చేయుటకు స్త్రీలు చూపిన ఉత్సాహం ఒక చిన్న ఘటననుబట్టి తెలుసుకోవచ్చు. 14 వ తేదీ ఉదయం బ్రహ్మాండమైన ఊరేగింపు బయలుదేరింది. అందరికీ ఊరేగింపులో పాల్గొనవలెనని ఉత్సాహమున్నది. కాని వంటశాలలో కూరలు తరుగుటకు 70 మంది స్త్రీలు వెంటనే రావాలని విజ్ఞప్తిచేయగనే యిదికూడ ఎంత ప్రధానమైన పనో గుర్తించి, 150 మంది స్త్రీలు ఒక్కసారిగా లేచి మేము వస్తామంటే మేము వస్తామని నిలబడ్డారు. తరువాత ఇంతమంది అవసరంలేదని కూర్చోబెట్టవలసి వచ్చింది. మహాసభ రెండురోజులేగాక, అంతకు ముందునుండి మహాసభకు ఏర్పాట్లు చేస్తున్న వలంటీర్లకు వంటచేసి పెట్టుటకుగాను కొంతమంది స్త్రీ వలంటీర్లు పనిచేశారు.

ఆరోగ్యం విషయంలో ఆరోగ్యం విషయంలో స్త్రీ వలంటీర్లు చేసినకృషి ప్రశంసాపాత్రం. జబ్బు చేసిన వారిని ఎప్పటికపుడు హాస్పిటలుకు చేర్చుట, వారికి సేవలు చేయుట చేశారు. పాయిఖానాదొడ్ల దగ్గరవుండి స్త్రీలకు మార్గం చూపుతూ, ప్రత్యేకించిన స్థలాలలోకి వెళ్ళేటట్లు చూశారు. ఎక్కడబడితే అక్కడ గలీజు చేసినందువల్ల ఏవిధంగా ఆరోగ్యం చెడిపోతుందో స్త్రీలందరికీ నచ్చజెప్పి, శిక్షణను పాటించేటట్లుచేశారు. ఈవిధంగా ఆరోగ్యాన్ని కాపాడుటలో సహాయపడ్డారు. ఈ ఏర్పాటులు, యీ సేవ చూచి అందరూ ఆశ్చర్యచకితులైనారు.

ఆరోగ్యవిధుల్ని గురించి బోధిస్తూవున్న ప్రదర్శనాల్లోను, సోవియట్ బెంగాల్ చిత్రాల ప్రదర్శనాలను ప్రజలందరికీ బోధించుటలోను, కొంతమంది స్త్రీ వలంటీర్లు పాల్గొన్నారు. వీరు ప్రజలందరికీ విసుగుచెందకుండా నేర్పుతో, ఓర్పుతో, అర్ధమయే రీతిని చెప్పారు. వీటిపైన విద్యాధికుల అభిప్రాయాలను చూస్తే స్త్రీ వలంటీర్లు ఎంత నేర్పుతో చెప్పిందీ విశదమౌతుంది. ఒక రెవిన్యూ ఇన్స్పెక్టరుగారు తన మిత్రునితో యీ విధంగా తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. “యింతవరకు మహిళా ఉద్యమమంటే నాకు సదభిప్రాయముండేదికాదు. ఆ స్త్రీలు అంత నేర్పుతో చెప్పడంచూస్తే వారిలో కల్గిన అభివృద్ధిని చూసి నా కాశ్చర్యం వేసింది” అని అన్నాడు. నిజమే! మహిళాసంఘం తన వర్కర్లను ఏవిధంగా అభివృద్ధిచేస్తున్నదీ ప్రజలకు తెలియనంతకాలం కొందరు దుష్టులు, సమాజాభివృద్ధిని కోరినివారు, మహిళా వర్కర్లను గూర్చి దుష్ప్రచారం చేయగల్గారు. మహిళా స్కూల్సులో శిక్షణపొందుటకు వచ్చిన స్త్రీలను గూర్చి దుష్ప్రచారం చేశారు. పత్రికలు సైతం చదవలేనివారికి ఆస్కూల్సులో యిచ్చిన శిక్షణఫలితంగానే ఆ వర్కర్లలో యింత అభివృద్ధి కనబడుతోందనేది గ్రహించారు. తమ పుత్రికల, సోదరీమణుల సేవను చూచి ప్రజలు గర్విస్తున్నారు. దుష్ప్రచారం చేసేవారికి యీ ప్రజలే తగిన సమాధానమిస్తారు.

బహిరంగసభలోకూడ స్త్రీలు నిశ్శబ్దంగా, శ్రద్ధగా చూచారు; విన్నారు. బిడ్డలు ఏడ్వకుండా వుండుటకుగాను స్త్రీ వలంటీర్లు బిడ్డలకు బిస్కట్లు పంచి పెట్టారు. పసిబిడ్డలకు పాలుపంచారు. ఎప్పటికప్పుడు స్త్రీలందరికీ మంచినీళ్ళు సప్లయిచేయుటలో ఆదర్శవంతమైన కృషిచేశారు. స్త్రీలను సర్దుటలోను, మార్గం చూపుటలోను, వారి యిబ్బందులను తీర్చుటలోను తమ స్థానంలో నిలబడి చక్కని క్రమశిక్షణతో మెలిగారు. వీరిలోనున్న క్రమశిక్షణ స్త్రీ జనసామాన్యమంతటా ప్రతిబింబించింది.

16 వుదయం వలంటీర్ ర్యాలీ జరిగింది. ఏ దళానికాదళం, 3 వరసల్లో బారులుతీరివుంది. ముందు కమాండర్లు, తరువాత స్త్రీలదళం, ఆవెనుక పురుషులు, అన్నిదళాలకు వెనుక అవసర పరికరాలతో డాక్టర్ల దళం. డయాస్ పైన కామ్రేడ్ రాజేశ్వరరావు ఆజ్ఞలు ఇస్తున్నాడు. ప్రతి దళం జండాకు వందనంజేస్తూ ముందుకు పోయింది. 3000 మంది వలంటీర్లు ఎర్రజండాలతో నైన్యంవలె ముందుకు కదులుతూవుంటే ఎవరికి ఉత్సాహం ఉప్పొంగదు? కామ్రేడ్ జోషీ, అధికారి, సుందరయ్య శాల్యూట్ అందుకుంటూ నిలబడ్డారు. “ఆరే. ఆముసలమ్మకూడ కదం తొక్కు తుందే!” అన్నాడు ఆశ్చర్యంగా ప్రక్కనిలబడి చూస్తున్న ప్రజలలోని ఒక వ్యక్తి. “ఆముసలమ్మ ఎంతపని చేసిందో యీమహాసభలో నీకు తెలుసా?” అన్నాడు యింకో వ్యక్తి సమాధానంగా. ర్యాలీ పూర్తి అయింది. ప్రతివలంటీరు విజయగర్వంతో క్యాంపులకు వెళుతున్నాడు. నేను ఆఫీసుకు పోతున్నాను. నా ప్రక్కగానే 10 మంది వలంటీర్లు, యింకా యితరులు కలిసి పందిరిలోకి పోతున్నారు. “మీరు మహాసభను కూడ చూడకుండ చచ్చేంతపని చేయబట్టే మహాసభ నెగ్గింది” అన్నాడు ఒకాయన. ఆయనచేతిమీద బాడ్జి లేదు. “మహాసభను చూడకపోయినా, మా శ్రమవల్లనేగదా యింత మహాసభ జరిగింది! అని అలోచించుకుంటే నాకు బలే గర్వంగావుందిలే!” అంటూ ఒక్కగంతు వేశాడు ఒక వలంటీరు. “ఏ ఇబ్బందీ లేకుండా మూడు రోజులు వుండి ఆనందంగా యింటికి వెళ్ళే ప్రజలను చూస్తూంటే, మనకు ఎంత గర్వంగా వుందో చూచారా?” అంటూ అందుకున్నాడు ఒక వ్యవసాయకూలీ కామ్రేడ్. గడిచి గట్టెక్కా౦ కదా! అని ఆఫీసులో రెండు గంటలు నిద్రపోయాను.

సాయంకాలం కామ్రేడ్ జోషీ ఉపన్యాసం జరిగింది. వలంటీర్లకు ప్రత్యేకంగా సందేశాలివ్వడానికి నాయకులు వచ్చారు. వారిలా చెప్పారు:

“మాస్కో రెడ్ స్క్వేర్ గుర్తుకువచ్చింది.”

– నిధాన్ సింగ్.

“ఇంత కట్టుదిట్టంగా వలంటీరు నిర్మాణం వుండటం యింతవరకు నేచూడలేదు.”

– బంకిం.

“అమెరికాలో కూడ యిలాంటి వలంటీరుదళాన్ని నే చూడలేదు.”

– జగత్సింగ్.

యీ వ్యాఖ్యానాలన్నీ వింటూంటే ప్రతి వలంటీరుకు శరీరం వుప్పొంగింది. తమ శక్తిని తాము యిప్పుడు అర్థం చేసుకుంటున్నారా అన్నట్లు ముఖాలు వికసించాయి; సభ పూర్తయింది.

Leave a Reply