ఆకురాలు కాలం,
అడవిలో రాలుతున్న ఆకుల సవ్వడి
ఆ సవ్వడికిసుడిగాలి తోడవుతూ
ఆ సుళ్ల చక్రబంధంలో రాలిన ఆకులు
సుళ్లు తిరుగుతూ దుమ్ము లేపుతూ
గలగల పైకెగురుతున్న శబ్దాల మోత
ఆ మోత మరే శబ్దాలను విననివ్వడమే లేదు
రాలిన ఆకులతో బోసిపోయిన అడవి
వన్నెలుడిగి, గ్రీష్మ తాపానికి తహతహలాడుతోంది.
ఆరు రుతువులలో అడవి
ఆరు రకాలుగా ముస్తాబవుతోంది
కానీ, గ్రీష్మమే దాని వన్నెలన్నీ దోచుకుంటుంది
చిందులన్నీ చెరిపివేస్తుంది.
నిన్నటి వరకు పచ్చదనాన్ని కప్పుకున్న మానులన్నీ
ఆకుల సోయగాలు మటుమాయమైనట్టే,
బోసిపోయిన అడవి పల్చబడిందా అనే సందేహం....
లేదుకదూ!
పచ్చని ఆకులు పండుటాకులై రాలడం సహజం
రాలిన ఆకులు ఎండటం,
ఎండిన ఆకులు ఎలుగడితో కాలడం
అడవిలో అంతకన్నా సహజం
ఆకులు రాలిన చెట్లు వసంతంలో
చిగురిస్తాయి, అడవి వన్నెలన్నీ మళ్లీ మొదలవుతాయి
చిగురించిన ఆకులు, మొగ్గ తొడుగుతాయి,
మొగ్గలు, పూస్తాయి, కాస్తాయి
ఆదివాసీల ఆకలి తీరుస్తాయి,
ఆనందాన్ని పంచుతాయి.
ఇది ప్రకృతి నియమం.
కానీ, ఆ ప్రకృతితోనే కొత్తాట మొదలైంది.
ఆ ఆట పేరు కగారాట.
ఆ ఆట నీతి, నియమాలు లేని ఆట
రోతిరాట, తొండాట
అది తుపాకులతో, డ్రోన్ లతో
హెలీకాప్టర్ గన్ ఫైర్లతో, టాంకులతో
నిర్ధయగా, పాశవికంగా సాగుతున్నాట
అంకురాలను చిదుముతున్న ఆట
పచ్చని ఆకులను బలిగొంటున్నాట
మానులను మొదలుకే మట్టుబెడుతున్నాట
అడవికి నిప్పు పెడుతున్నాట
అమ్మ పేరుతో మొక్కంటూ
మనసులను మళ్లించే మోసపాట
అడవికి అడ్రస్ లేకుండా చేయాలనే పెంపర్లాట
ప్రాణవాయువును మాయం చేస్తారట
ప్రకృతిని, పర్యావరణాన్ని పరిహసిస్తున్నాట
శుభాంషుతో అంతరిక్షానికి చేరిన ఆట
కొత్తాటకు జాగలు వెతుకుతున్న పోటీ
అడవైనా, అంతరిక్షమైనా, రుతువులేవైనా
ఆటలో ఎంత తొండి చేసినా, రోతిరాడినా
ఎల్లకాలం సాగే ఆట కాదది
కగారాటను ఎదుర్కొనే కొత్త
ఆటగాళ్ల జట్టు ముందుకొస్తుంది
మళ్లీ ఆకులు చిగురిస్తాయి,
అడవులు వన్నెలొలుకుతాయి
పట్టణాలు, మైదానాలను మండించే కొత్తాటతో
ఆదివాసులకు, పీడితులకు అధికారం దక్కుతుంది
కొత్తాటలో కొత్త నీతి ముందుకొస్తుంది
ఆ ఆటకు సిద్దమవుదాం మరి.
Related