మనిషి బైటా లోపటా వాస్తవ ప్రపంచాలున్నాయి. పదార్థంతో కూడింది బైటిది. భావాలతో కూడింది లోపటిది. వాస్తవికతావాదానికి ఈ రెండు ప్రపంచాలూ నిజమైనవే. నికరంగా మాట్లాడితే, వీటిని రెండుగా పేర్కొనడం సరికాదు. భౌతిక ప్రపంచం లేకుండా భావప్రపంచం వుండదు గనక, వీటిని ఒకే ప్రపంచంలో రెండు విభాగాలని అనవచ్చు. భౌతిక ప్రపంచమే మనిషి జ్ఞానేంద్రియాల ద్వారా నాడీ కేంద్రమైన మెదటి కెక్కి, చైతన్యంగా రూపొందుతుంది. మెదడు చాలా జటిలమైన పదార్థం. భౌతిక పదార్థానికి అది అత్యున్నతమైన రూపం. దాని పనిపాటులనే బుద్ధిగా, అనుభూతిగా – మనస్సుగా – ఎన్నోపేర్లతో పిలవడం జరుగుతూంది. మెదడు నిర్మాణంలో ఒక పార్శ్వంలా మరొక పార్శ్వం లేదు. శాస్త్ర పరిజ్ఞానానికీ తార్కిక చింతనకీ ఒక పార్శ్వంలోని కణాలలో స్థానం ఉంటే మరో పార్శ్వంలోని కణాలలో కళాభిరుచికీ సౌందర్య భావానికీ స్థానం ఉంది.
వాస్తవికతావాదం ప్రపంచాన్ని యథాతథంగా కళలలో ప్రతిబింబించ బూనుకోదు. ప్రపంచానికి నకలు తీయగోరదు. అచ్చుకి మచ్చు కాదు. మీదుమిక్కిలి, సౌందర్య తృష్ణ లేనేలేకుండా, కేవలం ఉపయోగితా దృష్టితోనే కళాసృజనకు గూడా దిగదు. రెండూ అవసరమే. కళకు ఉపయోగిత ఎంత అవసరమో సౌందర్యపరత కూడా అంతే.
యూరపులో 16-17 శతాబ్దాల కాలంలో భూస్వామిక వ్యవస్థ బీటలు పడేలా పెట్టుబడిదారీ వ్యవస్థ వెలువడ సాగినప్పుడు, వాస్తవికతావాదం నిర్దిష్టమైన, బలీయమైన ఒక కళాధోరణిగా వందుకు వచ్చింది. అయితే లోగడే దాని అంశలు లేకపోలేదు. సరిగదా, ఆదిమ మానవుడి గుహా జీవనకాలం నుంచీ మధ్యjయుగాల గోథిక్ కళదాకా దానిదే ప్రముఖమైన స్థానం అనవచ్చు. లోక వాస్తవికతను కాదని ఏ కళాకారుడూ పూర్తిగా స్వతంత్రించడం కష్టం. అయితే ప్రారంభంలో, భౌతిక ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్టుగా చిత్రించడమే ఎక్కువగా జరిగేదిగాని, సామాజిక జీవిత విశ్లేషణకు ప్రాముఖ్యం ఉండేదికాదు. వాస్తవికతా వాదానికి ఇలాంటి విశ్లేషణ ప్రాణతుల్యం.
ప్రాచీన మహా ఇతిహాసాల, మహాకావ్యాల పద్ధతులను అనుసరిస్తూ మధ్యjగాల లోనేగాక ఆధునిక యుగంలో కూడా కొనసాగిన ‘క్లేసికల్’ కళాధోరణికి నిజంగా కాలం చెల్లింది. విచ్చలవిడిగా చెలరేగిన భూస్వామిక అరాచకాన్ని తుదముట్టించి, రాజులు నిరంకుశాధికారంతోటి, నగరోపజీవులైన వర్తక వ్యాపారుల అండదండలతోటి జాతి-రాజ్యాలను (నేషన్‌స్టేట్స్) రూపొందిస్తూ వచ్చిన కాలంలో ఈ ధోరణికి ప్రాచుర్యం వుండేది. వ్యక్తిగతమైన ప్రయోజనాలను తలదన్నేట్టు రాజధర్మాన్ని ఇది పైకెత్తడం ఇందుచేతనే. ప్రజలు రాజాజ్ఞకు విధేయులుగా వుండాలని ఇది నొక్కిచెప్పేది. రాజ్యాన్ని మించిన సంస్థ మరేదీ లేదన్నట్టు, దాన్ని నిరపేక్షం (ఆబ్‌సొల్యూట్) చేసేది. ఫ్రెంచి మహావిప్లవకాలంలో అనేకులు క్లేసిసిజాన్ని అభిమానించారుకాని, పరిస్థితి అవసరం దృష్ట్యా దానికి విప్లవాత్మకతను జోడించడం జరిగింది. సంకుచితమైన వ్యక్తి స్వార్థప్రయోజనదృష్టిని ఈసడిస్తూ, సమస్త ప్రజానీకానికి చెందిన సామాజిక ప్రయోజనాలకు ఆధిక్యత నిచ్చారు.
ఇదేకాలంలో కాల్పనికవాదం (రొమేంటిసిజమ్) కూడా మొదలైంది. క్లేసిసిజానికీ రొమేంటిసిజానికీ పొత్తుకుదరదు. కళాధోరణులు చాక్రికంగా (సైక్లికల్) పరిభ్రమిస్తూ వుంటారు. ఏ యుగంలోనైనా వివిధ సామాజిక వర్గాల సహజీవనాన్ని ప్రతిబింబిస్తూ అనేక కళాధోరణులు ఏకకాలంలో వాడుక కావడం జరుగుతూ వుంటుందిగాని, ఒకే ఒక్కదానికే ప్రాచుర్యం ఉండదు. ఉదాహరణకు, వాస్తవికతావాదధోరణి ప్రబలంగానే వుండిన గెటే, ష్కిల్లర్ రచనలలో క్లేసిసిస్టు ధోరణులూ ప్రముఖంగానే కనిపిస్తారు.
.కాల్పనికతా ధోరణికి రూసో రచనలు ప్రారంభమని చెప్పవచ్చు. పుట్టుకతోనే మనిషి స్వేచ్ఛావంతుడైనా ప్రతిచోటా సంకెళ్ళకు లోబడి ఉంటున్నాడని రూసో అన్నాడు. నిజానికి, జన్మతః మనిషి స్వేచ్ఛావంతుడేమీ కాదు. సమాజంలో నిర్దిష్టమైన వర్గాలలో పుట్టే మానవ వ్యక్తుల మధ్య ఆజన్మంగానే హెచ్చులొచ్చులు తప్పవు. దాని నటుంచి, పెట్టుబడిదారీ వ్యవస్థలో ‘స్వేచ్ఛ’ ఆస్తిపరులైన భూస్వాములదీ వర్తకులదీ పరిశ్రమాధిపతులదీ మాత్రమేగాని, మిగిలిన వారిది కాదు. అసమానతతో వర్గవైషమ్యాలతోగూడిన ఈ వ్యవస్థను కాల్పనికతావాదం కూడా అంగీకరించదనడానికి వీలులేదు. ఆదిమ మానవజీవితం అకృత్రిమంగానూ, హాయిగానూ వుండేదంటూ కాల్పనికతావాదుల్లో కొందరేమో తమ అభిమానాలను వెనకతెన్ను పట్టిస్తే మరికొందరు ఆనాటి వికారమైన వాస్తవాన్ని నిరాకరిస్తూ ఉజ్జ్వలమైన భవిష్యత్తు గురించి ఊహాగానం చేశారు. కాల్పనికతావాదానికి ముఖాలు ఇలా రెండుగా రూపొందాయి. బూర్జువా వ్యవస్థ మీద కళాకారుల తిరుగుబాటునుంచే ఈ ధోరణి ఉత్పన్నమైందిగాని, ఆ వ్యవస్థను విశ్లేషించి సామాజిక సంబంధాల పరస్పరతనూ సంఘర్షణనూ చిత్రించలేదు. సుదూర గతం గురించో సుదూర భవిష్యత్తు గురించో కలలుగనే చిత్తవృత్తిని అది పెంపొందించింది. వాస్తవాన్ని భ్రమగా ఎంచింది. అందుచేత వాస్తవికతావాదానికి భిన్నమైన పంథా పట్టింది. ఎర్నెస్ట్ ఫిష్చర్ అభిప్రాయాన్నిబట్టి, భూసంపన్న వర్గానికి చెందిన క్లేసిసిజం మీద పెటీబూర్జువావర్గం చేసిన తిరుగుబాటే, ప్రారంభంలో కాల్పనికతావాదం.
బూర్జువా వ్యవస్థలో ప్రతిదీ ధనానికి అధీనమైపోయింది. ఆచార సంప్రదాయాలు ఎక్కడికక్కడ చెక్కలు ముక్కలయ్యాయి. వ్యక్తి స్వప్రయోజనం పరమార్థమైంది. ప్రతిదీ-మనిషికూడా – సరుకు (కమోడిటీ) అనే భావం పెరిగింది. మొదట్లో కళలకు ‘గిరాకీ’ లభించలేదు. అయితే ఈ సామాజిక విప్లవం వల్ల మనుషుల భావలోకంలో వచ్చిన పెనుసంచలనం ఎన్నో కొత్త కళారూపాలకు దారి తీసింది. నవల అలా ఏర్పడిందే, కథ కూడా అంతే. ఈ రూపాలు అతివేగంగా వృద్ధిపొందడమే గాక, స్థానిక పరిమితులను మీరి యావత్ దేశానికేగాక ప్రపంచానికి సైతం వ్యాపించడానికి భౌతిక అవకాశాలు అనుకూలించారు. జాతీయ విముక్తి ఉద్యమాలకూ రాజ్యాంగబద్ధ పరిపాలనా పోరాటాలకూ భూస్వామ్య వ్యతిరేక పోరాటాలకూ ప్రోత్సాహాన్నిస్తూ వచ్చిన ఈ కొత్త వ్యవస్థ 1848 నాటికి అనేక యూరోపియన్ దేశాలలో అభివృద్ధి నిరోధకమైన భూస్వామ్య శక్తులతో నిరంకుశ రాచరికంతో రాజీపడింది. ఈ మార్పు కళాలోకంలోనూ ప్రతిబింబించింది. పెట్టుబడిదారీ విధానం కడగట్టేసరికి, దోపిడీ పెరిగేసరికి, కార్మిక వర్గం తొలి పోరాటాలను అణచివేసేసరికి, తక్కిన సామాజిక వర్గాలు చితికిపోసాగేసరికి, భావకల్లోలం కూడా వ్యాపించింది. ఈ వ్యవస్థను తీవ్రంగా విమర్శించడం కళాకారులకు విధాయకమయింది. ఈ ధోరణే క్రిటికల్ రియలిజం. ‘కాల్పనికతావాదం’ చేసిన తిరుగుబాటు ఈ ధోరణికి తొలిరూపమే. అయితే మొదటిది ‘అహం’ (ఐ) కేంద్రంగా పోను పోను లోకంనుంచి పలాయనత్వానికి దారితీస్తే, రెండోది సామాజిక వాస్తవాన్ని నిరాకరిస్తూనే దాన్ని విమర్శకు గురిచేస్తూ విశ్లేషించ బూనింది. ఇదీ కళాకారుడి ‘అహం’ను తోసివెయ్యలేదుగాని ఉన్న వాస్తవ స్థితిని వ్యక్తిపరంగా విమర్శించింది. నిర్దిష్టమైన ఒక భావ ప్రకటనా పద్ధతిగా పెంపొందింది. విమర్శాత్మకత ఒక వైఖరి. వాస్తవవాదం ఒక పద్ధతి. ఇందులో ఒక రచయితలా మరో రచయిత రాయడు. ఎన్నెన్నో భేదాలు, ఎన్నెన్నో దృక్పథాలు.
బూర్జువా వ్యవస్థ అభ్యుదయాత్మకంగా వుండిన రోజుల్లో వాస్తకవితా వాదం సమాజ స్థితిని గురించి ఆశామయ దృష్టితో చూసేది. దాని వైరుధ్యాలను పట్టించుకునేది కాదు. మనిషిని మనిషిగా మాత్రమే చూసేదిగాని, సమాజంతో మనిషికిగల సంబంధాలను చూసేదికాదు. జీవితాన్ని పరిణామాత్మకంగా వర్ణించలేదు. ఈ పని చేసింది విమర్శాత్మక వాస్తవికతా వాదమే. కాల్పనికతా వాదుల్లో విప్లవ వాదులు కూడా పెట్టుబడిదారీ అభివృద్ధిలోని వైరుధ్యాలను చూడగలిగారు. మొత్తం సామాజికాభివృద్ధికి సంబంధించిన వైరుధ్యాలను సాకల్యంగా గ్రహించి, బూర్జువా సామాజిక వ్యవస్థకూ అందులో మానవ చైతన్యానికీ గల ప్రముఖ లక్షణాలను బోధపరచుకుని తమ రచనలలో ప్రదర్శించింది విమర్శాత్మక వాస్తవికతా వాదులే. కాల్పనిక వాదుల్లా వీళ్ళు జ్ఞానాన్నీ, విజ్ఞానోదయాన్నీ (ఎన్‌లైటెన్‌మెంట్) తృణీకరించలేదు. జిజ్ఞాసను ఈసడించనూ లేదు. బూర్జువా వాస్తవికతా వాదుల్లా సామాజిక పరిస్థితిని యధాతథంగా చిత్రిస్తూ, అనుభవజ్ఞానవాదాన్ని (ఎంపిరిసిజం) అవలంబించనూ లేదు. బూర్జువా వ్యవస్థ ఎంత అమానుషంగా రూపొందిందో చూపెట్టారు. అప్పుడప్పుడే పైకి రాసాగిన కార్మికవర్గం కూడా కళాసాహిత్యాలలో ప్రవేశించింది. దాని పట్ల సానుభూతితో గూడిన భావవైఖరి ఎందరో రచయితలకు అలవడింది. విప్లవాత్మక కాల్పనిక వాదులు సరిగా ఈ సమయానికే రూపొంది యిలాంటి వైఖరినే అవలంబించారు. పెట్టుబడికీ కాయకష్టానికీ మధ్యగల వైరుధ్యాన్ని చూశారు. చిత్రించారు. అయితే దాని పరిష్కారం వాళ్ళకు అంతు జిక్కలేదు. తామింకా బూర్జువా ప్రజాస్వామిక భావాలనుంచి బైటపడలేదు గనక, ఈ వైరుధ్యాన్ని చూడవలసినంత లోతుగా చూడలేకపోయారు. దీనికి వీరిని తప్పుబట్టి లాభం లేదు. కార్మికోద్యమమే ఆనాటికింకా నిర్దిష్టమైన శాస్త్రీయ దృక్పథాన్ని అవలంబించడం జరగలేదుగదా!
కొత్తగా ఏర్పడి శీఘ్రంగా కరుడుగట్టిన సామాజిక వ్యవస్థ సారాన్ని తెలుసుకుని, దాని స్వభావాన్ని రచ్చకెక్కిస్తూ సామాజిక, వైయక్తిక జీవిత విశేషాలను కళాత్మకంగా చిత్రించడమేగాక, చారిత్రక క్రమం పురోగమన శీలమనికూడా స్పష్టంగానైనా సూచించారు. పెట్టుబడీదారీ అభివృద్ధి వల్ల సమకాలిక సమాజంలో ఎలాంటి ఫలితాలు కలిగాయో చూపినంతగా, ఆ సమాజంలోపటే క్రమంగా బలాన్నీ సమైక్యాన్నీ సంతరించుకుంటున్న శక్తులను చూపలేదు. ఆ పని దానికి మించిన పని. సోషలిస్టు భావజాలం, అప్పటికి శైశవ దశలోనే వుండిపోవడం దీనికి కారణం. సంస్కరణల వలన సమాజం మారవచ్చునని కొందరు, విద్యా విజ్ఞానాల మూలంగా భావ పరివర్తన ద్వారా మారవచ్చునని మరికొందరు భావిస్తూ వచ్చారు. ఊహాజనిత సోషలిజం ప్రభావానికి ఇది నిదర్శనం కావచ్చుగాని శాస్త్రీయ సోషలిజానికి కాదు. మనిషి జీవించే భౌతిక, భావ పారిసర్యాన్ని మార్చడం వల్ల అతనికి తన గురించి తెలిసివస్తే చాలు. తన స్థితిని తాను బాగుజేసుకుంటాడనేది, అప్పటి భౌతిక వాదానికే లక్ష్యమైనప్పుడు కళాకారులు ఇంకా ముందుకి పోలేదనడం సవ్యమైన విమర్శ కాదు. 19వ శతాబ్దం ద్వితీయార్థ భాగంలో వాస్తవికతావాద సాహిత్యం వ్యక్తి మనస్తత్వాన్ని గానీ, కుటుంబ గాధలనుగానీ ఎక్కువ పట్టించుకుంది. నైతిక విషయాలకు ప్రాముఖ్యం ఇచ్చింది. చిత్త సంస్కారాన్ని ఆశించింది. ఇది కేవలం భ్రమేనని గ్రహించలేదు. సమాజ జీవుల భావాలను సంస్కరించడం మూలాన్నే సామాజిక వ్యవస్థ మారదు. తమకు అతీతమైన ఆర్థిక శక్తులను గుర్తించి చైతన్యవంతంగానూ సంఘటిత విప్లవ కార్యాచరణతోనూ అది మారవలసిందే. ఈ అవగాహన ఆనాటి వాస్తవికతావాదులకు లేకపోవడం ఆశ్చర్యకరంకాదు. ఎందుకంటే, అప్పట్లో బూర్జువా సమాజం మొత్తం మీద నిలకడగా వుపద్రవరహితంగా వుండేది. తీవ్రమైన వర్గ సంఘర్షణలు ఎక్కువగా వుండేవికావు. మీదు మిక్కిలి, వర్గ సామరస్య భావాలకు హెచ్చు చలామణీ వుంటూ వచ్చింది. అందుచేత విమర్శాత్మక వాస్తవికతావాద సాహిత్యం గత శతాబ్ది చివరి నాటికి, కథానాయకులను వారి పారిసర్యం నుంచి విడిగా చూపుతూ, అతని గుణశీలాలమీదనూ ప్రవర్తన మీదనూ తప్పనిసరిగా పడే సామాజిక ప్రభావం నుంచి వేర్పరిచింది. ఆ రెంటికీగల సమైక్యాన్ని ప్రముఖంగా చూపెట్టలేదు. చారిత్రక వైరుధ్యాలతో నిండిన సమాజ జీవిత పరిధిలోపట వ్యక్తిచిత్రణకు ప్రావఖ్యం ఇవ్వలేదు.
ఈ శతాబ్దంలో టాల్ స్టాయిగానీ, చెహవ్‌గానీ, గోర్కీగానీ సమాజ భవితవ్యం గురించి ఎక్కువగా పట్టించుకునే రచనలు చేస్తూ, విమర్శాత్మక వాస్తవికతావాద ధోరణిని మారాకు వేయించారు. అప్పటికే పెట్టుబడిదారీ వ్యవస్థ పునాదులు కదలసాగాయి . సామ్రాజ్యవాదంగా ముదిరిన పెట్టుబడిదారీ విధానం తన అత్యున్నత దశను చేరుకుంది. విప్లవాల యుగానికి ఇది నాంది.
అరుణతార, జూన్ 1982




