మోడెం బాలకృష్ణ అంటే జైలు పోరాటం గుర్తుకు వస్తుంది. ఆయన విద్యార్థి ఉద్యమం నుంచి మావోయిస్టు పార్టీ కేంద్ర నాయకత్వం దాకా ఎదిగే క్రమంలో ఎన్నెన్ని ప్రజా పోరాటాలు చేశాడో తెలియదుగాని ఖైదీల పోరాటానికి ఆయన సంకేతం. జాతీయోద్యమం కాలంలో జితేందాస్ తదితరుల జైలు పోరాటాల తర్వాత మళ్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో డిసెంబర్ 26, 1994 నుంచి 21 ఫిబ్రవరి 1995 దాకా జరిగిన రాజకీయ ఖైదీల, జీవిత ఖైదీల పోరాటమే గుర్తుకు వస్తుంది.
విప్లవమంటే స్వేచ్ఛా మానవుల నిర్మాణం. దాన్ని ఈ సమాజంలోని అన్ని వ్యవస్థల్లాగే జైలు తీవ్రంగా అడ్డుకోవాలని చూస్తుంది. మానవులంటే మానవ సంబంధాల సమాహారం. జైలంటే మనుషులను ఒంటరి వాళ్లను చేయడం. జైల్లో ఎన్నెన్ని చిత్రహింసలైనా ఉండనీగాక అన్నిటి సారం మనుషులను సమాజానికి, మానవ సంబంధాలకు దూరం చేయడం. విప్లవమంటే మానవ సంబంధాలను ఉన్నతీకరించే సమాజంలో స్వేచ్ఛా మానవులను తయారు చేయడం. అందుకే విప్లవానికీ, జైలుకూ బద్ధ వైరం.
ఆనాటి జితేంద్రనాథ్ దాస్ దగ్గరి నుంచి మొన్నటి మోడెం బాలకృష్ణ, శాకమూరి అప్పారావు, పటేల్ సుధాకర్‌రెడ్డి దాకా, నిన్నటి ఫాదర్ స్టాన్‌స్వామి దాకా స్వేచ్ఛా మానవుల కోసం కలగని, విప్లవానికి పర్యాయపదాలుగా మారారు.
ఈనెల 11న చత్తీస్‌ఘడ్‌లోని గరియాబంద్ అటవీ ప్రాంతంలో వేలాది సైనిక బలగాలు చుట్టుముట్టి మావోయిస్టు పార్టీ కేంద్ర నాయకుడు మోడెం బాలకృష్ణ, ఆంధ్రా ఒడిషా సరిహద్దు కమిటీ సభ్యుడు చంద్రవాస్ అలియాస్ పాండన్న, మరో నాయకుడు వెంకటి సహా పది మందిని చంపేశాయి. తెలంగాణకు చెందిన ఈ ముగ్గురైనా, మిగతా ఆదివాసీ కార్యకర్తలయినా ఆపరేషన్ కగార్‌ను ఎదిరిస్తూ అమరులయ్యారు. చంద్రవాస్ దండకారణ్యంలోని మాడ్ చిరునామా అయితే, మోడెం బాలకృష్ణ జైలు పోరాటాలకు ప్రతినిధి. సాధారణ ఖైదీల, జీవిత ఖైదీల సమస్యలపై రాజకీయ ఖైదీలుగా బాలకృష్ణ, అప్పారావు, సుధాకర్‌రెడ్డి చేసిన పోరాటం ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జైళ్లలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాయి.
ఈ ముగ్గరి విషయంలో తప్పక చెప్పుకోవాల్సిన మరో ముఖ్యమైన సందర్భం ఉంది. 1995 మార్చి 9`12 తేదీల్లో హైదరాబాదులో సీపీఐ ఎంఎల్ జనశక్తి ‘మార్క్సిజం లెనినిజం మావో ఆలోచనా విధానం` విప్లవోద్యమాలు’ అనే అంశంపై ఒక అంతర్జాతీయ సదస్సు నిర్వహించింది. దీనికి జైల్లో ఉన్న ఈ ముగ్గురు భారత విప్లవోద్యమం ప్రత్యేక లక్షణాలపై ఒక పత్రం పంపించారు. 1969 ఏప్రిల్ 22న సిసిఐ ఎంఎల్ ఏర్పడినప్పుడు విడుదల చేసిన ప్రణాళిక దగ్గరి నుంచి సుమారు నలభై ఏళ్లలో విప్లవోద్యమ అవగాహన విస్తృతికి ఈ సెమినార్ పత్రం దాఖలా.
ఇందులో వాళ్లు 1. అఖిల భారత స్థాయిలో ఏకీకృత విప్లవ పార్టీ లేకపోవడం, 2. సుసంపన్నమైన, సుశిక్షితమైన సాయుధ దళాలు, అధునాతన రవాణా, టెలికమ్యూనికేషన్ వ్యవస్థతో కూడిన అత్యంత కేంద్రీకృత రాజ్య యంత్రాంగం ఉండటం, 3.అణచివేతకు గురవుతున్న వివిధ జాతుల ప్రజలు, వారి పోరాటాలు, 4. కుల సమస్య, 5. మత సమస్య, 6. అర్ధ భూస్వామ్య, అర్ధ వలస ఆర్థిక వ్యవస్థ మీద, సామాజిక నిర్మితి మీద నిలబడి ఉన్న పార్లమెంటరీ వ్యవస్థ… అనేవి భారత విప్లవోద్యమానికి ఉన్న అనేక ప్రత్యేకతల్లో ముఖ్యమైనవి అని పేర్కొన్నారు.
ఈ పత్రానికి ముప్పై ఏళ్లు. ఆ రోజుల్లో జైల్లో దారుణ నిర్బంధ పరిస్థితులపై పోరాడి, సుదీర్ఘ నిర్బంధాన్ని అధిగమించి ఖైదు నుంచి బైటికి రాగానే తిరిగి అజ్ఞాత విప్లవోద్యమంలోకి వెళ్లడం ఈ ముగ్గురి విప్లవ వ్యక్తిత్వానికి నిదర్శనం. ముగ్గురూ విప్లవోద్యమ కేంద్ర నాయకులుగా ప్రాణ త్యాగం చేశారు. ఖైదీల ప్రజాస్వామిక పోరాటానికి నాయకత్వం వహించడమేగాక విప్లవోద్యమానికి దిశా నిర్దేశం చేసే సమష్టి నాయకత్వంలో భాగమయ్యారు. ఆ రోజు విప్లవోద్యమం ప్రత్యేక లక్షణాలు లేదా సవాళ్లుగా తాము గుర్తించినవాటిని పరిష్కరించడానికి ప్రయత్నించారు. మొదటి అంశం.. నాలుగు విప్లవ స్రవంతుల కలయికతో అఖిల భారత విప్లవ పార్టీ ఏర్పడటం. కమ్యూనిస్టు ఉద్యమంలో చీలికలకు ఉన్న కారణాలను పట్టించుకోకుండా, వాటి పట్ల విమర్శనాత్మక, నిర్మాణాత్మక వైఖరి లేకుండా వాపోయేవాళ్లు చాల మంది ఉన్నారు. ఒక ఆదర్శంగా కూడా ఐక్యత ఆకాంక్షించవలసిందే. అయితే వీళ్లకు చీలికలే కనిస్తుంటాయి. ఐక్యతకు ఎలాంటి ప్రాతిపదికలు ఉండాలో తెలియదు. కానీ విప్లవమే లక్ష్యంగాగల నాలుగు సాయుధ పోరాట పార్టీలు కలిసి దేశవ్యాప్త విప్లవ పార్టీ ఏర్పడిరది. ఐక్యత ఎట్లా ఉండాలో నిరూపించింది.
రెండో అంశం.. భారతదేశంల నానాటికీ బలపడుతున్న రాజ్య వ్యవస్థ. దీని గురించి విప్లవకారులకు మొదటి నుంచీ అవగాహన ఉన్నది. కానీ విప్లవోద్యమానికి భారత రాజ్యం గురించి అవగాహన లేదనే వాదన ఇటీవల వినిపిస్తోంది. ఆపరేషన్ కగార్ మొదలయ్యాక జరుగుతున్న తీవ్ర నష్టాలను చూసి సానుభూతితోనే కావచ్చు.. ఈ మాట కొందరు అంటున్నారు. శక్తివంతమైన భారత రాజ్యంతో సాయుధ పోరాటం చేయడం అయ్యేపని కాదు కాబట్టి విరమించండని చెబుతున్నారు. ఈ చుట్టుముట్టు యుద్ధాన్ని విప్లవోద్యమం ఎట్లా ఎదుర్కొంటుందో వేచి చూడాల్సిందే. కానీ భారత రాజ్యం పని తీరు గురించి విప్లవకారులకు తెలియదనడం పొరబాటని కనీసం ఈ పత్రం చదివినా అర్థమవుతుంది.
మూడో అంశం.. జాతుల బందీఖానా గురించిన వివరణ. ముఖ్యంగా కశ్మీర్, ఈశాన్యభారతదేశంలోని జాతుల సమస్యలను, ఆ ప్రజల పోరాటాలను ఈ పత్రం వివరిస్తుంది. భారత విప్లవంలో జాతుల సమస్య ఒక ముఖ్యమైన సమస్యగా భావించింది. నాలుగో అంశం..కుల వ్యవస్థ. భారత విప్లవానికి కులం ఎంత తీవ్రమైన సమస్యనో ఈ పత్రంలో చాలా స్పష్టంగా వివరించారు. ఆ తర్వాత ఈ అవగాహన మరింతగా అభివృద్ధి చెందినట్లు కూడా తెలుస్తోంది. కులం ఉత్పత్తి సంబంధాల్లో, సామాజిక సాంస్కృతిక సంబంధాల్లో, రాజ్య వ్యవస్థలో కొనసాగుతున్నదని చెప్పడానికి ఈ పత్రంలో ప్రయత్నించారు. సరిగ్గా మతాన్ని కూడా ఇంతే లోతుగా పరిశీలించారు. మత రాజకీయాలు ఫాసిస్టు స్వభావంతో సమాజంలో, రాజ్య యంత్రాంగంలో పట్టు సంపాదిస్తున్నాయని గుర్తించారు. అగ్రకుల తత్వానికి, హిందుత్వ ఫాసిస్టు ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడాలని ఈ పత్రం చెబుతుంది.
చివరిది.. పార్లమెంటరీ వ్యవస్థ. అర్ధ భూస్వామ్య, అర్ధ వలస ఉత్పత్త సంబంధాల మీద, దానికి సంబంధించిన సామాజిక నిర్మితి మీద భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యమనే రాజ్య రూపం నిర్మాణమైంది. చట్టబద్ధ ప్రజాస్వామ్యమని, ఉదారవాద ప్రజాస్వామ్యమని, రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యమనీ గుర్తింపు ఉన్న భారత పార్లమెంటరీ రూపంలోని పాలనా వ్యవస్థలు భారత విప్లవోద్యమానికి ప్రత్యేక లక్షణాలను తీసుకొచ్చాయని వివరించారు. ఇటీవల విప్లవోద్యమం సాయుధ పోరాటం వదిలేసి పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలోకి రావాలని చాలా మంది సూచిస్తున్నారు. ప్రభుత్వం తాను చెప్పుకున్న ప్రజాస్వామ్యబద్ధంగా పాలించేలా మారాలని చెప్పడం కంటే మావోయిస్టులు మారాలని చెబుతున్నారు. దీని అర్థం ఏమంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం లోకి రమ్మని చెప్పడం. విప్లవోద్యమానికి పార్లమెంటరీ వ్యవస్థలపట్ల ఉన్న స్పష్టత ఈ పత్రంలో చూడవచ్చు. అమరులు అప్పారావుతో, సుధాకర్‌రెడ్డితో కలిసి మోడెం బాలకృష్ణ రాసిన ఈ పత్రంలో ఆ ముగ్గురి రాజకీయ, సిద్ధాంత స్పష్టతను తెలుస్తుంది. గతంలో ఆ ఇద్దరు, ఇప్పుడు బాలకృష్ణ దూరం కావడం విప్లవోద్యమానికి తీరని నష్టం. ఆయన స్మ్మతిలో ఇప్పుడు ఈ పత్రం చదివితే ముప్పై ఏళ్లలో కా. బాలకృష్ణ విప్లవ జీవితంలోని ఆచరణ అడుగుజాడలు కనిపిస్తాయి