మూతికి గుడ్డ నడుముకు తాటాకు కట్టుకుని అరిపాదాలతో నీ వీధిలో నడిపించిన సనాతన ధర్మం వద్దంటే నా తల తీస్తానంటావు మా ఆడవారినే జోగినిగా మార్చి నీ కోరికలు తీర్చుకునే ధర్మం మాకు వద్దంటే నా తల తీస్తానంటావు ఊరి బావిలోనూ చెరువు లోనూ నా దాహం తీర్చుకోనివ్వని ధర్మాన్ని వద్దంటే నా తల తీస్తానంటావు నీవు పలికే మంత్రాలేవో పొరపాటున విన్నందుకు మా చెవిలో సీసం పోయించిన నీ ధర్మాన్ని వద్దంటే నా తల తీస్తానంటావు తరగతి గదిలో నీ పక్కన కూచోనివ్వని ధర్మాన్ని వద్దంటే నా తల తీస్తానంటావు వేల ఏళ్ళుగా నీ పీతి తట్టను మోయించిన ధర్మాన్ని వద్దంటే నా తల తీస్తానంటావు నీ అధికారం నిలుపుకునేందుకు మాకు మంత్రి పదవిచ్చినా నీ పక్కన కూచోనివ్వని ధర్మాన్ని వద్దంటే నా తల తీస్తానంటావు నన్ను ప్రేమించి వచ్చిన నీ సంతానాన్ని నా తోడుగా వుండనివ్వని ధర్మాన్ని వద్దంటే నా తల తీస్తానంటావు నీతో పాటు నీ గుడి మెట్లెక్కనివ్వని నీ ధర్మాన్ని వద్దంటే నా తల తీస్తానంటావు మారుతున్న సమాజంలో నా వాటా కోసం నేను పోరాడుతూ తలెత్తితే చూడలేని ధర్మాన్ని వద్దంటే నా తల తీస్తానంటావు (సనాతన ధర్మాన్ని నిర్మూలించాలన్న ఉదయనిధికి మద్దతుగా)
