(విప్లవ రచయిత్రి, విప్లవోద్యమ సీనియన్ కార్యకర్త కామ్రేడ్ విజయ లక్ష్మి @భూమిక కథల సంపుటి *ప్రజలు అజేయులు *కు రాసిన ముందు మాట ఇది . ఆమె ఈ ఏడాది మే 21 న ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం నారాయాణపూర్ గుండెకోట్ అటవీ ప్రాంతంలో జరిగిన బూటకపు ఎదురుకాల్పుల్లో అమరురాలైంది)
భారత విప్లవ ప్రజానీకానికి తీవ్రమైన గుండెకోత మిగిల్చిన గుండె కోట్ అమరులలో ఒకరు తెలంగాణ పోరు బిడ్డ వన్నాడ విజయలక్ష్మి. విప్లవోద్యమంలోని మిత్రులకు భూమిక. రచయితగా పాఠకులకు వసుధ. ఉస్మానియా యూనివర్సిటీలో తన చదువుకున్న వారికి బహుశా విజ్జి అయి ఉంటుంది. గత కొంతకాలంగా ‘ఇక విద్యార్థులు విప్లవోద్యమంలోకి పోవడం లేదు’ అని ‘విప్లవోద్యమం పని అయిపోయిందని’ పదేపదే అనే వాళ్లకి తమ రక్తసిక్తమైన త్యాగాలతో వివేక్, సాగర్, శృతి, విజయలక్ష్మి, రాకేష్ ఇలా ఒక పెద్ద అంతులేని జాబితా జవాబు చెబుతోంది.
విద్యార్థులు భర్తీ అవుతున్నారో లేదో తెలుసుకునే అవకాశం ఏమాత్రం లేని వాళ్లు కూడా విద్యార్థులు పోరుబాట ఎంచుకోవడంలేదని ఎందుకింత గట్టిగా నమ్ముతున్నారు అంటే అది వాళ్ళ తప్పు కాదు. సామ్రాజ్యవాద సంస్కృతి యూనివర్సిటీలోనూ కాలేజీల్లోనూ అల్లుకు పోయింది. మాదకద్రవ్యాలనో, మద్యాన్నో చాలామంది తప్పించుకోగలిగారేమో కానీ మొబైల్ ఫోను మాత్రం నేటి యువత తప్పించుకోలేని వ్యసనంగా మారిన ఒక సామాజిక స్థితి మన ముందుంది. అంతకుముందు చిన్నపిల్లలకి మొబైల్ ఫోన్లు ఇవ్వకండి అని పాఠశాలలకు తల్లిదండ్రులను పిలిచి చీవాట్లేసే ఉపాధ్యాయులే ఇప్పుడు మొబైల్ ఫోన్ లేని పిల్లలను ఇంటికి పంపేస్తున్నారు. మొబైల్ ఫోను యువతకు బయటపడలేని ఒక వ్యసనంగా మారిపోయింది. అది లేకుండా జీవించడం ఎలాగో అని గాభరా పడే తరం ఇప్పటిది. మొబైల్ ఫోన్ వదిలిపెట్టలేకనే విప్లవోద్యమంలో భర్తీ అయి కూడా తిరిగి వచ్చిన యువజనుల గురించి కూడా విన్నాం.
అలాంటి పరిస్థితిని అధిగమించి విప్లవోద్యమంలోకి అడుగుపెట్టిన నేటి తరం యువతి విజయలక్ష్మి. అడుగుపెట్టడమే కాదు దశాబ్దానికి పైగా పనిచేసి చివరి వరకు దృఢంగా నిలబడింది. 1987లో జన్మించిన విజయలక్ష్మి ఎం.ఏ, బి.ఈ.డి, ఎల్.ఎల్.బి వంటి ఉన్నత చదువులు చదివింది. న్యాయ శాస్త్ర విద్య పూర్తి అవుతూనే విప్లవోద్యమంలోకి వెళ్ళింది. విద్యార్థిగా ఉన్న కాలంలో అనేక సామాజిక సమస్యల మీద ఉద్యమించింది. ‘‘బస్టాండ్ పక్కన, ఒ.యు క్యాంపస్ వెనకాల, రైల్వే బ్రిడ్జిల కింద అనేక బస్తీలలో పాలిథిన్ కవర్లతో తెలంగాణ జిల్లాలైన పాలమూరు, మెదక్, వరంగల్, నిజామాబాద్ నుండి వలస వచ్చినవారు నివాసముంటారు. రెండువేల పదమూడులో మున్సిపల్ అధికారులు వీళ్లు ఉండే స్థలాలను అకస్మాత్తుగా ఖాళీ చేయమని పెద్ద మొత్తంలో పోలీసు బలగాలతో అక్కడి ప్రజలను చాలా ఇబ్బందులకు గురి చేసారు. వీరి గురించి తెలుసుకున్న ఒక ఫ్రంట్ (సమాఖ్య) వివిధ విద్యార్థి, ప్రజా సంఘాలతో కలిసి వారి కోసం పెద్ద పోరాటమే చేసింది’’. దానిలో విద్యార్థి సంఘం నుండి విజయలక్ష్మి కూడా పాల్గొంది. ముఖ్యంగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసి అనేకసార్లు అరెస్ట్ అయింది.
తాను బయటి సమాజంలో ఉండగా దళజీవితం గురించి విన్నదీ సినిమాల్లో చూసిందీ వేరు. అక్కడ కనిపించిన జీవితం వేరు. బయటి వ్యక్తులకి వచ్చే సందేహాలన్నీ నివృత్తి అయ్యేలా తాను అక్కడి జీవితాన్ని ‘‘కొత్త బంగారు లోకం’’ అనే కథలో చాలా చక్కగా దృశ్యమానం చేస్తుంది. ఆ కథనంలో ఎన్నో విషయాలు పంచుకుంది. ఇల్లు వదిలి రావడం కరక్టే కానీ, ఇంట్లో చెప్పకుండా రావడం తప్పు అని బాధ పడుతుంది. కుటుంబ సభ్యులని ప్రేమగా తలుచుకుని కళ్ళనీళ్లు పెట్టుకుంటుంది.
తను ఎవరి దగ్గర పనిచేయాలో వాళ్ళు చాలా సీనియర్ అంటే కూడా ఆయన వయసు 35 కంటే ఎక్కువుండొచ్చు అని విజయలక్ష్మి ఏమాత్రం వూహించలేదు. తన తాత వయసులో ఉన్న ఆ కామ్రేడ్‌ను చూసి మనవలతో ఆడుకొనే వయసులో కూడా ఆయన అక్కడ నాయకత్వం వహిస్తుండడం చాలా గొప్ప విషయం అని ముచ్చట పడుతుంది. ఆయన ఆర్కేగా తెలుగు రాష్ట్రాల ప్రజలకి సుపరిచితం అయిన కామ్రేడ్ అక్కిరాజు హరగోపాల్. తాను ఆయన సిబ్బందిలో ఒకరిగా దశాబ్ద కాలం పనిచేసాకా దండకారణ్యానికి బదిలీ అయ్యింది. తన కథలలో ఆయన పాత్రగా మనకి కనిపిస్తారు. తనకి పని నేర్పించవలిసిన కామ్రేడ్ ది కూడా తన వయసే అని తెలుసుకొని ఉత్సాహంగా అక్కడికి చేరుకున్న తరవాత ఆ కామ్రేడ్ శిరీష తాను అక్కడికి చేరుకోకముందే అమరురాలయ్యిందని తెలిసి ఖిన్నురాలైంది. ఆ కామ్రేడ్‌ని తలచుకుంటూ ‘‘దేశంలోని పీడిత ప్రజలను, పీడకుల నుండి విముక్తి చేయాలి. ప్రజలందరికీ కూడు, గుడ్డ, గూడు ఉండే సమ సమాజం కోసం తన నిండు నూరేళ్ల జీవితాన్ని త్యాగం చేసింది. ఆ కామ్రేడ్ ఆశయాలను ఎత్తిపట్టి, వర్గ పోరాటాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం వుంది. అమరులు అందించిన ఆశయ సాధనలో అడుగులు వేయడానికి నేను ఓ.కె అన్నాను. ఇక ఆరోజు నుండి ప్రపంచాన్ని విముక్తి చేసే సోషలిస్టు సమాజం కోసం నా పోరాట ప్రస్థానం ప్రారంభమైంది’’ అంటుంది.
అజ్ఞాతజీవితం మొదలైన తరవాత కొత్త పేరు పెట్టుకోవాలని సూచిస్తూ ప్రత్యేక తెలంగాణా ఉద్యమంలో చురుకుగా పనిచేసి వచ్చిన తాను ఆ ఉద్యమ నాయకుల్లో ఒకరై అప్పుడే అమరుడైన కామ్రేడ్ భూమయ్య సారు పేరు కలిసి వచ్చేటట్టుగా పెట్టుకో అన్న ఆర్కే సూచన తనకు నచ్చి భూమిక అని పెట్టుకొంది. తన అనుభవాలను నమోదు చేసే అలవాటు ఉన్న విజయలక్ష్మి విప్లవోద్యమంలోకి అడుగుపెడుతూనే తన అనుభవాలను రాసింది. ఆమెలోనూ ఒక రచయిత ఉన్న విషయాన్ని ఆమె గుర్తించలేదు. అందుకే దశాబ్ద కాలం పాటు తన రచనలను పత్రికలకు పంపే ప్రయత్నం కూడా చేయలేదు. అజ్ఞాత రచయితల కథలు సంకలనాలుగా వియ్యుక్క పేరుతో వెలువడుతూ మొదటి మూడు సంకలనాలు అచ్చయ్యి బయటికి వచ్చాక కానీ ఆమె తన రచనలను బయటికి తియ్యలేదు. 2014లో రాసిన వాటిని కూడా 2023 వరకు దాచి పెట్టింది. ప్రధానంగా కథనాలుగా చేసిన తన అనుభవాలు ప్రచురణార్హం అవునో కాదో అనే మీమాంసలో పడిపోయింది. యుద్ధ రంగాలను తలపించే లాగా విప్లవోద్యమ ప్రాంతాలు మారిన కాలంలో ఆమె రచనలు కథలుగానే కాదు చారిత్రక కథనాలుగా కూడా ఎంతో విలువైనవి. బహుశా ఈ విషయం ఆమె ఒక దశాబ్దం ముందుగా గుర్తించి ఉంటే మనకి ఎన్నో అద్భుత కథనాలు అంది ఉండేవి.
తాను అజ్ఞాత జీవితంలో అడుగుపెట్టిన కొంత కాలానికే జరిగిన ఒక ఎన్‌కౌంటర్‌ని తలుచుకుంటూ 2023 లో ‘‘ప్రజలదే విజయం’’ అనే కథనాన్ని రాసింది. అలాగే రామ్‌గూడా ఎన్‌కౌంటర్ సందర్భంలో కూడా అందులోనుండి తృటిలో తప్పించుకున్న ఆ ఘటన గురించి ఆ తరవాతి పరిస్థితి గురించి ‘‘ఎన్‌కౌంటర్’’ కథలో రాస్తుంది. ‘‘వాస్తవం కల్పన కంటే వింతైనది’’ అన్న నానుడిని నిజం చేస్తూ ఆ కథనం చదువుతుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ఆ దృశ్యాలు మన కళ్ళ ముందు జరుగుతున్నట్టనిపించి దు:ఖంతో గుండె బరువెక్కుతుంది. వెక్కి వెక్కి ఏడవాలనిపిస్తుంది. కళ్ళు తుడుచుకొని దృఢ నిశ్చయంతో వారి త్యాగాలని ఎత్తిపట్టాలనిపిస్తుంది. ఇదే కథలో ఎందరికో తన పాటలతో ప్రజాకళాకారుడిగా దగ్గరగా తెలిసిన కామ్రేడ్ ప్రభాకర్ అమరత్వం గురించి తలచుకుంటూ ‘‘అప్పటి వరకు రిట్రీట్ అయి ఎక్కడ్కెనా వున్నాడేమో అని ఆలోచిస్తున్న మాకు అప్పుడర్థమైంది బాబాయ్ అమరుడయ్యాడని. ఒక్కసారిగా నాన్న గుర్తొచ్చాడు. నేను ప్రాణంగా ప్రేమించే నాన్నకు దూరమయ్యాక, బాబాయ్‌లో నాన్నను చూసుకున్న. నాకు తెలియని విప్లవ జీవిత విషయాలు ఎన్నో అడిగి తెలుసుకున్న. గెరిల్లా జీవితం ఎలాంటిదో దానిలో మనం ఎలా ఇమిడిపోవాలో వివరించిన విప్లవ గురువు. ఘటన విషయాలన్ని తనతో పంచుకుందామనుకున్న నాకు తీరని దుఃఖాన్నే కలిగించింది రేడియో వార్త’’ అని రాస్తుంది. తనకు వాళ్ళ నాన్న అంటే ఎంత ప్రేమో కూడా దీనితో అర్థం చేసుకోవచ్చు.
ఆమె రచనా నైపుణ్యాలను ముందే గుర్తించిన పార్టీ ఆమెకు ‘‘బోల్షివిక్’’ పత్రిక నడిపే బాధ్యతను కూడా కేటాయించింది. ఆ పత్రిక కోసం ఆమె తప్పక రచనలు చేసి ఉంటుంది. అవి మనకి ఇంకా దొరకవలసి ఉంది. ఆమె ‘‘బోల్షివిక్’’ పత్రిక కోసమే చేసిన రచనలలో ముఖ్యమైనది ‘‘నేను గెరిల్లాని ఎందుకయ్యానంటే..’’ అనే శీర్షిక. ఆ శీర్షిక కోసం ఐదుగురు వేరువేరు ప్రాంతాల నుండి వచ్చి పార్టీలో పని చేస్తున్న ఆదివాసీ మహిళా గెరిల్లాలను ఇంటర్వ్యూ చేసి వారు తమ భాషలో చెప్పిన తమ జీవిత కథలను తెలుగులో అక్షరీకరించింది. ఈ ఐదు కథనాలు ‘‘బోల్షివిక్’’ ప్రచురణగా ఒక సంకలనంగా కూడా తీసుకువచ్చింది. వాటిని ఆ రూపంలో తీసుకురావడానికి రాయడం దగ్గర నుండి వాటిని టైప్ చేసి మేకప్ చేసి పుస్తక రూపంలో తెచ్చే వరకు ప్రతి పనిని శ్రద్ధగా తానే చేసింది. పత్రిక కూర్పుని కూడా తానే చేసేది.
విజయలక్ష్మి కేవలం కథలు, కథనాలే కాక కవితలు, పాటలు కూడా రాసింది. ముఖ్యంగా ప్రజా కళాకారుడు అమరుడు కామ్రేడ్ ప్రభాకర్ అంటే ఆమెకు ఎంతో అభిమానం. ఆయనను ఆత్మీయంగా బాబాయి అని పిలుచుకునేది ప్రభాకర్ గురించి ఒక కవిత, ఒక పాట రాసింది. కామ్రేడ్ మున్నా గురించి కామ్రేడ్ జానకి గురించి రామ్‌గూడా అమరుల గురించి పాటలు రాసింది. ఆమె రాసిన చివరి పాట అమరుడు కామ్రేడ్ చలపతి గురించి. పార్టీ కార్యదర్శితో సహా 28 మంది అమరులైన గుండె కోట్ ఎన్‌కౌంటర్ ఘటన జరిగినప్పుడు, తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వార్తలను తెలియజేసే బస్తర్ టాకీస్ విలేఖరి వికాస్ తివారీ ఆ ఘటనాస్థలికి వెళ్లి అక్కడ నుండి ఆ ప్రాంతాల్లో దొరికిన వస్తువులను వీడియోలో చూపిస్తూ ఎవరిదో డైరీ అంటూ ఒక చిన్న పుస్తకాన్ని చూపించాడు. ‘వర్షానికి తడిసిపోయి కాగితాలు అంటుకుపోయి ఉన్నాయి’ అంటూ ఆయన చూపించిన వీడియోలో/ పెట్టిన ఫొటోల్లో ఇదేదో తెలుగులో ఉంది అంటూ చూపించిన రెండు పేజీలలో కామ్రేడ్ భూమిక చలపతి గురించి రాసిన పాట ఉంది. అదే పుస్తకంలో ఒక పేజీలో తాను పుట్టినప్పటి నుండి తాను విప్లవోద్యమంలోకి అడుగుపెట్టే వరకు ఒకటి రెండు అంటూ అంకెలు వేసి యే ఏడాదిలో ఏం చదివిందో రాసుకుంది. దాని ప్రకారం 1987లో జన్మించిన తాను 2003-5 మధ్య ఇంటర్ చదివి 2006-9 మధ్య డిగ్రీ పూర్తి చేసి 2009లో బీఈడీ చేసి 2010- 11 వరకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి 2012 నుంచి 2014 వరకు ఎల్.ఎల్.బి చదువుకున్నట్టు వివరాలు రాసి ఉన్నాయి. అలాగే మరో రెండు పేజీల్లో కామ్రేడ్ రామచంద్రారెడ్డి అలియాస్ చలపతి గురించి రాసిన పాట ఉంది. కామ్రేడ్ చలపతి ఒడిశా-చత్తీస్‌గఢ్ సరిహద్దు గరియాబంద్ జిల్లా కుల్హాడీఘాట్ అటవీ ప్రాంతంలో కేంద్ర భద్రతా బలగాలతో 2025 జనవరి 21 న జరిగిన ఎన్‌కౌంటర్‌లో అమరుడయ్యాడు.
‘‘ప్రజాపోరు ప్రభంజనం చలపతి
ప్రజాయుద్ధ ప్రజ్వలనం దళపతి’’ అనే ఈ పాటను ఆ తడిసిన కాగితాలను ఆయన తీసిన వీడియోని ఫొటోలని చూస్తూ రాయడానికి చేసిన ప్రయత్నంలో కొన్ని పదాలు స్పష్టంగా కనపడలేదు. మనకు దొరికినదే కాకుండా ఈ పాటలో ఇంకా కొన్ని చరణాలు ఉండి ఉండొచ్చు. విలేఖరి చేయి ఫోటోకి అడ్డుగా ఉండడం వల్ల కూడా కొన్ని భాగాలు పోయాయి. అయినా ఈ అసంపూర్తి గీతం కూడా ఎంతో ఉత్తేజకరంగా ఉంది.
భూమిక మంచి గాయకురాలు. ఆమె పాటలు రాయడమే కాదు వాటిని స్వరపరిచి రికార్డు కూడా చేయడం వల్ల మనకి ఈ ఐదు పాటలు దొరికాయి. ఇంకా దొరకకుండా పోయినవెన్నో తెలీదు. చివరగా రాసిన ఈ పాట 2025 జనవరి తర్వాత అనేది స్పష్టమే. అందులోని చివరి చరణం ఎంతో స్ఫూర్తిదాయకం.
‘‘నీ లక్ష్యపు పయనాన్ని చలపతీ
మునుముందుకు పోనిస్తాం దళపతి
ఖగార్ ఈడే ఖతమంటూ చలపతులను చంపినా
దోపిడి ఉన్న వరకు పోరు ఆపలేరు నిజం ఇదీ!’’
దండకారణ్యానికి బదిలీ అయ్యాక అక్కడ కామ్రేడ్ భూమిక పార్టీ కార్యదర్శి కామ్రేడ్ నంబళ్ళ కేశవరావు గారి సిబ్బందిలో ఉందని అర్థం అవుతోంది. ఆమె అంతకు ముందు దశాబ్దకాలం పనిచేసిన ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతం భౌగోళికంగా చాలా కఠినతరమైన ప్రదేశం. నిత్యం ఎక్కే కొండలూ దిగే కొండలూ. చాలా పట్టుదల ఉంటే తప్ప అక్కడ మనగలగడం కష్టం. పైగా తాను పనిచేసిన కాలంలో అత్యంత తీవ్రమైన నిర్బంధం అమలవుతున్న కాలం. తిండి దొరకని పరిస్థితిలో, దొరికింది దొరికినప్పుడు మాత్రమే తింటూ గుండె జారిపోకుండా దృఢంగా పనిచేయడం ఇప్పటి తరాలకే కాదు రాబోయే తరాలకు కూడా ఎంతో ఆదర్శం. విజయలక్ష్మి యువతరం గర్వించదగ్గ విప్లవకారిణి.
ఆమెకు లాల్ సలాం!
లాల్ సలాం
BUCHIREDDY GANGULA
—————————————
BHUMIKA —LAL SALAM
MISS. YOU