ద‌శాబ్దాలుగా ఇజ్రాయెల్ సాగిస్తున్న దురాగ‌తాల‌కు అడ్డు క‌ట్ట  వేయాల‌ని, పాలస్తీనా భూభాగాల ఆక్రమణల‌కు చ‌ర‌మ‌గీతం పాడాల‌ని గాజాలోని హమాస్‌ అనే మిలిటెంట్‌ సంస్థ 2023 అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌ భూభాగాల‌లోకి చొర‌బ‌డి  251 మందిని బందీలుగా చేసుకొని అపహరించింది. దీనికి  ప్రతీకారంగా ఇజ్రాయెల్‌ హమాస్‌ను తుదముట్టించటానికి దాడులు మొద‌లు పెట్టింది.  అప్ప‌టినుంచి ఇజ్రాయెల్‌ మారణకాండ కొనసాగిస్తూనే ఉంది.  గాజా ప్రపంచంలోనే అత్యధిక జన సాంధ్రత గల ప్రదేశం. 22 మాసాలుగా గాజాలో ఇజ్రాయెల్ మాన‌వ హ‌న‌నానికి పాల్ప‌డుతున్న‌ది. ఇప్పటివరకు 85 వేల టన్నుల బాంబులతో ఆ ప్రాంతా న్ని శిథిలాల కుప్పగా మార్చింది. గాజాపై ఇజ్రాయెల్‌ జారవిడిచిన బాంబులు హిరోషిమా పై వేసిన అణు బాంబు శక్తి కంటే ఆరు రెట్లు ఎక్కువ. ఈ దాడుల్లో 60 వేల మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారని, లక్షలాది మందికి గాయాలయ్యాయని గాజా హెల్త్‌ మినిస్ట్రీ ప్రకటించింది.. గాజా జనాభాలో సగం మంది నిర్వాసితులయ్యారు. వెస్ట్‌ బ్యాంక్‌లో కూడా వెయ్యి మంది పాలస్తీనియన్లు మరణించారు. అక్రమ సెటిల్‌మెంట్‌ కార్యకలాపాలు పెరిగాయి.

అక్టోబర్‌ 2023 జూలై 2025 జూలై మధ్యకాలంలో వెస్ట్  బ్యాంక్‌ మీద 1800 దాడులు జరిగాయి. ఇజ్రాయెల్‌ గాజా మీద 85,000 టన్నుల బాంబులు కురింపించింది. 2025 జూలై 10 నాటికి గాజాలో 57,680 మంది మరణించారు. 1,37,409 మంది గాయాల పాలయ్యారు. మరో 14,000 మంది ఆచూకీ లేకుండా పోయారు. ప్రతి 20 నిమిషాలకు ఒక శిశుమరణం సంభవిస్తున్నది. యూనివర్సిటీ ప్రొఫెసర్ల బృందం చేపట్టిన క్షేత్ర స్థాయి అధ్యయనం ప్రకారం మరణించిన వారిలో 56.2 శాతం మంది మహిళలు, పిల్లలు, వృద్ధులున్నారు. ఇజ్రాయెల్‌ దాడులు మూలంగా గాజా ప్రాంతంలో నివసిస్తున్న 23 లక్షల మంది జనాభాలో 90 శాతం మంది అనేక మార్లుగా విస్థాపనకు గురయ్యారు. ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం గాజాలోని ప్రతి 10 ఇళ్ళలో తొమ్మిది ఇళ్ళు ధ్వంసమైపోయాయి. 92 శాతం ప్రధాన రహదార్లు ఎందుకూ కొరగాకుండా పోయాయి. ఆసుపత్రులను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్‌ చేసిన దాడులు మూలంగా గాజాలో 84 శాతం ఆరోగ్య సేవా కేంద్రాలు శిథిలాల కుప్పలుగా మారాయి. దాదాపుగా ప్రతి ఆసుపత్రి కూడా బాంబు దాడులకు గురికావడం వల్ల ప్రస్తుతం గాజాలో ఏ ఆసుపత్రీ పూర్తి స్థాయిలో వైద్యసేవలు అందించే పరిస్థితిలో లేదు. ఇంటెన్సివ్‌ కేర్‌, సర్జికల్‌, ఎమర్జెన్సీ కేంద్రాలకు కూడా తగినన్ని మందుల సరఫరా లేని మూలంగా కనాకష్టంగా నడుస్తున్నాయి.

గాజాలో 70 శాతం తాగునీరు, మురుగునీటి పారుదల సౌకర్యాలు దెబ్బతిని పోయాయి. 88.8 శాతం పాఠశాల లకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ ప్రాథమిక సౌకర్యాల నష్టానికి తోడు గాజా వెస్ట్‌ బ్యాంక్‌లో నివసిస్తున్న పాలస్తీనా ప్రజానీకం జీవనోపాధులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఒక్క ఉత్తర గాజా ప్రాంతంలోనే మొత్తం వ్యవసాయ యోగ్య భూమిలో మూడోవంతు సాగుకి లాయకీ అయిన భూమి ఉన్నది. ఆహార పంటలు, కూరగాయలు, పండ్లు, ఆలివ్‌ చెట్లు విస్తారంగా పండే భూములు ఇవి. ఇజ్రాయెల్‌ దాడుల మూలంగా రోజుకి 20 లక్షల డాలర్ల వ్యవసాయ నష్టం వాటిల్లుతున్న‌ది. ఐక్యరాజ్యసమితి అనుబంధ ఆహార, వ్యవసాయ సంస్థ నివేదిక ప్రకారం ఆహారానికి వినియోగించే పాడి పశువుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. గొర్రెలు 36 శాతం, మేకలు 39 శాతం తగ్గిపోయాయి. ఆవులు 3.8 శాతానికి పడిపోయాయి. ఇక కోళ్లు దారుణంగా 1.4 శాతానికి పడిపోయాయి. ఇజ్రాయెల్‌ దాడుల మూలంగా సాగునీటి వ్యవస్థ మూడింట ఒక వంతు దెబ్బతిని పోయింది. అటు ఆదాయ వనరు ఇటు పౌష్టికాహార వనరుగా ఉన్న చేపల వేట ఘోరంగా దెబ్బతిని పోయింది. 70 శాతం వేట పడవలు ధ్వంసమయ్యాయి. దీంతో ప్ర‌జ‌లంతా ఆక‌లితో అల‌మ‌టిస్తూ ఆక‌లి చావుల‌కు గుర‌వుతున్నారు.

పాలస్తీనా సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ అంచనాల ప్రకారం నిరుద్యోగం ఆందోళనకర స్థాయికి చేరింది. ఇజ్రాయెల్‌ చేసిన దాడుల ప్రభావంతో ప్రజల జీవనాధారాలు చిధ్రమయ్యాయి. ఆర్థిక వ్యవస్థ శిథిలమై పోయింది.  పాలస్తీనా ఆర్థిక వ్యవస్థ పేదరికం, నిరుద్యోగంతో పోరాడుతోంది. 2023 అక్టోబర్‌ నాటికి 45 శాతంగా ఉన్న నిరుద్యోగిత రేటు 2024 చివరి నాటికి 68 శాతానికి చేరుకుంది. ఇందులో 15-29 సంవత్సరాల వయసులో ఉన్నవారు 74 శాతం మంది. వీరంతా చదువులు, శిక్షణ పూర్తిచేసుకుని ఉద్యోగాల కోసం వేచి ఉన్నవారే. వెస్ట్‌బ్యాంక్‌లో కూడా ఇజ్రాయెల్‌ దాడులు నిర్బంధాల మూలంగా స్థానిక ఆర్థిక వ్యవస్థ దెబ్బతి ని కరువుతో విలవిలలాడుతోందని మానవ హక్కుల సంఘాలు చెబుతున్నాయి. 2023 చివరి నాటికి 1,83,000గా ఉన్న నిరుద్యోగుల సంఖ్య 2024 నాటికి 3,13,000కు చేరింది. 18 శాతం నిరుద్యోగం 31 శాతానికి పెరిగింది.

ఐక్యరాజ్యసమితి వరల్డ్‌ ఫుడ్‌ ప్రొగ్రాం (డబ్య్లూఎఫ్‌పి) ఆధ్వర్యాన ఆహార పంపిణీ చేస్తుండ గా పౌరులను చుట్టుముట్టి శతఘ్నులతో, స్నైపర్లతో విరుచుకుపడి ఇజ్రాయెల్‌ సైన్యాలు పొట్టన బెట్టుకుం టున్నాయి. అధికారిక లెక్క ప్రకారం ఇప్పటికి 60,000 మంది పౌరులు మరణించారు. కానీ అంతర్జాతీయ ప‌త్రిక లాన్సెట్‌ నిరుడు జూన్‌లో ప్రకటించిన నివేదిక ప్ర‌కారం దాదాపు రెండు లక్షల మంది చ‌నిపోయారు. ఇదంతా ఎందుకంటే.. మధ్యధరా సముద్ర తీరానవున్న గాజా స్ట్రిప్‌ అనే చిన్న ప్రాంతాన్ని వదిలి రావటానికి ససేమిరా అంటున్న స్థానికులను హతమార్చయినా ఖాళీ చేయించాలని ఇజ్రాయెల్‌ ప్రయత్ని స్తోంది. ఆ ప్రాంతాన్ని తమ దేశంలో విలీనం చేసుకోవాలన్నది దాని ఆంతర్యం.

మానవతా సాయంగా వివిధ సంస్థలు, దేశాలు పంపిన ఆహార పదార్థాల సరఫరాలను గాజా, వెస్ట్‌ బ్యాంక్ లలో ప్రవేశించకుండా ఇజ్రాయెల్‌ నిలిపివేస్తున్నది. 2025 ఫిబ్రవరి నుండి ఏప్రిల్‌ వరకూ రెండు నెలల పాటు గాజాలోకి ఎలాంటి ఆహార పదార్థాల సరఫరాలూ అందకుండా ఇజ్రాయెల్‌ నిలువరించింది. గాజా ప్రజానీకం క్షామం బారినపడే తీవ్ర ప్రమాదంలో ఉందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించినా ఇజ్రాయెల్‌ లెక్క చేయలేదు. ఆహారాన్ని ఆయుధంగా వాడుతున్న తీరు అమెరికా దన్నుతో గాజా హ్యుమానిటేరియన్‌ ఫౌండేషన్‌ (జి.హెచ్‌.ఎఫ్‌) పేరిట ఒక ప్రైవేటు ఎన్జీఓ సంస్థ 2025 మే 26న గాజాలో ఆహార పదార్థాల సరఫరా కార్యక్రమ నిర్వహణకు పూనుకున్నది. అయితే ఈ సంస్థ ఇజ్రాయెల్‌ పక్షపాత వైఖరిని అనుసరిస్తున్న కారణంగా ఐక్యరాజ్య సమితిగానీ, అపన్న దేశాలు గానీ జి.హెచ్‌.ఎఫ్‌తో సమన్వయం చేసుకుని పని చెయ్యడానికి నిరాకరించాయి. జి.హెచ్‌.ఎఫ్‌ సాకున ఇజ్రాయెల్‌ ఆహారాన్ని ఆయుధంగా వాడుతున్నదనీ, ఇది ‘యుద్ధ నేరం’ అని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. అంతర్జాతీయ కోర్ట్ ఆఫ్ జస్టిస్, అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు వంటి అంతర్జాతీయ ట్రిబ్యునల్స్ న్యాయచట్టాలు జనాభాను భౌతికంగా నిర్మూలించే చర్యలు అంతర్జాతీయ చట్టం నిషేధాల కిందకు వస్తాయని స్పష్టం చేశాయి. అయినా ఇజ్రాయెల్ దారుణాలకు పాల్పడుతూనే ఉంది. ఆహార సహాయాన్ని నియంత్రిస్తున్నది. ఆహార కేంద్రాల వద్దకు చేరిన అన్నార్తులను చంపుతోంది. ఇంతకుమించిన రాక్షసం ఉండబోదు.

ఇజ్రాయెల్‌ మాత్రం ఐక్యరాజ్యసమితికి అనుమతి నిరాకరిస్తూ జి.హెచ్‌.ఎఫ్‌ మాత్రమే ఆహార పదార్థాల సరఫరాను నిర్వహించడానికి అనుమతిస్తున్నది.  గాజా యుద్ధం మరింత తీవ్రమవుతుండగా, మానవతా పరిస్థితులు దిగజారుతున్నాయి. రాజకీయంగా ఒత్తిడుల మధ్య నెతన్యాహు ప్రభుత్వం ఒకవైపు పూర్తి సైనిక విజయం కోసం శపథం చేస్తుండగా, మరోవైపు అంతర్జాతీయ సమాజం ఆకలి, ఆక్రోశం మధ్య పరిష్కార మార్గాన్ని కోరుతోంది. కాల్పుల విరమణ చర్చలు కొనసాగుతున్నా, పరిష్కార సూచనలు కనిపించడం లేదు. యునైటెడ్ నేషన్స్ సహా పలు అంతర్జాతీయ సంస్థలు గాజాలో “కరువు ప్రమాదం”  ముంచుకు వస్తోందని హెచ్చరించాయి. జనాభాలో 22 శాతం మంది మానవతా విపత్తును ఎదుర్కొంటున్నారని ఇంటిగ్రేటెడ్ ఫుడం సెక్యూరిటీ ఫేజ్ క్లాసిఫికేషన్ తెలిపింది. ఇజ్రాయెల్ జాతీయ భద్రతా మంత్రి ఇటమార్ బెన్-గ్విర్ మానవతా సహాయాన్ని తిరిగి ప్రారంభించడాన్ని వ్యతిరేకిస్తూ, “హమాస్ మనుగడకు ఆక్సిజన్ అందించకూడదు” అని పేర్కొన్నారు.

ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల హైకమిషనర్‌ అధికారిక ప్రతినిధి థామీన్‌ అల్‌ ఖీతాన్‌ జి.హెచ్‌.ఎఫ్‌ కార్యకలాపాల గురించి వివరిస్తూ సాయం కోసం పంపిణీ కేంద్రాలకు వచ్చిన పాలస్తీనియన్ల మీద ఇజ్రాయెల్‌ సైనికులు జరిపిన కాల్పులలో 410 మంది చనిపోయినట్లు ప్రకటించారు. ఐక్యరాజ్య సమితి తదితర దాతలు పంపిన మానవతా సాయాన్ని అందుకోవడానికి వచ్చిన పాలస్తీనియన్ల మీద కూడా ఇజ్రాయెల్‌ సైనికులు జరిపిన కాల్పులలో మరో 93 మంది మరణించారని, మరో 3000 మంది తుపాకి కాల్పుల వల్ల తీవ్రంగా గాయపడ్డారని కూడా వివరించారు. పాలస్తీనా శరణార్థులకు సాయం అందించే ఐక్యరాజ్య సమితి విభాగం యు.ఎన్‌.ఆర్‌.డబ్య్లూ.ఎ అధిపతి ఫిలిప్పీ లాజ్జరినీ ఇజ్రాయెల్‌ సైన్యం దురాగతాలను తీవ్రంగా ఖండించారు. జి.హెచ్‌.ఎఫ్‌ నడుపుతున్న పంపిణీ కేంద్రాలు మృత్యు కుహరాలుగా మారాయనీ, అవి కాపాడిన ప్రాణాల కంటే తీసిన ప్రాణాలే ఎక్కువగా ఉన్నాయని ఘాటుగా విమర్శించారు.

ఇజ్రాయెల్ న‌ర‌మేధాన్ని అంతర్జాతీయ కోర్ట్‌ ఆఫ్‌ జస్టిస్‌, అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు వంటి అంతర్జాతీ య ట్రిబ్యునల్స్‌ న్యాయ చట్టాలు జనాభాను భౌతికంగా నిర్మూలించే చర్యలు అంతర్జాతీయ చట్టం నిషేధాల కిందకు వస్తాయని స్పష్టం చేశాయి. అయినా ఇజ్రాయెల్‌ దారుణాలకు పాల్పడుతూనే ఉంది. ఆహార సహాయాన్ని నియంత్రిస్తున్నది. ఆహార కేంద్రాల వద్దకు చేరిన అన్నార్తులను చంపుతోంది. ఇంతకుమించిన రాక్షసం మరొకటి ఉండబోదు. ఆకలితో అలమటి స్తూ.. దప్పిక తీరే దిక్కులేక సహాయక శిబిరాల వద్ద గుప్పెడు మెతుకుల కోసం మ‌హిళ‌లు, పిల్ల‌లు బారులు తీరుతున్నారు. వీరిపై కూడా ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న‌ది. ఇజ్రాయెల్‌ రక్తదాహానికి అంతులేదు. ముందెన్నడూ లేని క్రూరత్వం, అమానుషత్వం విచ్చలవిడిగా కొన‌సాగుతున్న‌ది.  గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు ఈ శతాబ్దంలోనే అత్యంత తీవ్రమైనది. డొనాల్డ్‌ ట్రంప్‌ సమక్షంలోనే నెతన్యాహు చేసిన ప్రకటనను బట్టి అమెరికా, ఇజ్రాయెల్‌ దేశాలు రెండూ పాలస్తీనా దేశాన్ని గుర్తించడానికి గానీ, రెండు రాజ్యాల పరిష్కారానికి గానీ సిద్ధంగా లేవని స్పష్టమవుతుంది. గ్రేటర్‌ ఇజ్రాయెల్‌ స్థాపన ద్వారా పాలస్తీనాను ఉనికిలో లేకుండా చెయ్యాలనేదే వాటి లక్ష్యంగా కనబడుతున్నది.

పౌర, రాజకీయ హక్కులపై అంతర్జాతీయ ఒడంబడిక అధ్యాయం 6 జీవించే హక్కుకు హామీ ఇచ్చింది. సాయుధ సంఘర్షణ పరిస్థితుల్లో కూడా ఇది వర్తిస్తుందని మానవ హక్కుల కమిటీ జనరల్ కామెంట్ నెం.36 నిర్ధేశించింది. బాధిత ప్రజల ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక హక్కలపై అంతర్జాతీయ చట్టాలకు కోర్టులు పలు భాష్యాలు చెప్పాయి. అవన్నీ కూడా మానవ హక్కులను బలపరిచేవే. ఆక్రమిత పాలస్తీనా భూభాగంలో ఇజ్రాయెల్ విధానాలు, చర్యలకు గల లీగల్ పర్యవసానాలపై ఐసిజె ఇటీవల ఇచ్చిన సలహాపూర్వక అభిప్రాయంలో, వ్యవస్థీకృతమైన ప్రభుత్వ వ్యవస్థలేకపోవటం అన్నది అంతర్జాతీయ చట్టం కింద రక్షణ బాధ్యతలు వర్తింపు నుంచి మినహాయింపు ఇవ్వదని చెప్పింది. జెనొసైడ్ కన్వెన్షన్ కింద నిషేధించబడిన ఎట్టి చర్యలకు పాల్పడవద్దని ఐసిజె ఇజ్రాయెల్ ను ఆదేశించింది కూడా.

అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) అండదండలతో, కార్పొరేట్‌ కంపెనీల చేయూతతో ఇజ్రాయెల్‌ యుద్ధోన్మాదంతో పెచ్చ‌రిల్లిపోతోంది. గాజాలో దాగున్న హమాస్‌ తిరుగుబాటు దారులను అణిచేసే పేరుతో మొదలైన ఇజ్రాయెల్‌ సైనిక దాడులు.. రూపం మారి జాత్యాంహకార దాడులుగా మారిపో యాయి. రక్తం రుచి మరిగిన పులిలా చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా ఊళ్లకు ఊళ్లనే మట్టుపెడుతోంది. నివాస ప్రాంతాలు, పాఠశాలలు, ప్రార్థన మందిరాలు, ఆస్పత్రులు, సహాయక శిబిరాలు అనే తేడా లేకుండా క్షిపణి దాడులు చేస్తూ నిత్యం వందలాది మందిని హత్య చేస్తోంది. నిరంతరం వైమానిక బాంబు దాడులకు పాల్పడుతూ గాజాలోని మూడింట రెండువంతుల నిర్మాణాలను ధ్వంసం చేసింది. ఈ క్ర‌మంలో గాజా ప్రజల బాధలు వర్ణింప వీలుకానివి, అధిగమించలేనివి.

ఇజ్రాయెల్ చేస్తున్న నరమేథానికి భారతదేశానికి చెందిన పలు కార్పొరేట్ కంపెనీల సహకారం ఉందనే తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఈ కంపెనీలు ఇజ్రాయెల్ కు గాజాలో నరమేథానికి వాహనాలు, డ్రోన్స్, డిఫెన్స్ పరికరాలు వంటి వాటిని సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా సాంకేతిక, సైబర్ సెక్యూరిటీ సేవలు సైతం అందిస్తున్నట్లు సైతం విమర్శలు ఉన్నాయి. జెఎన్ యూ, ఎఎంయు, హైదరాబాద్ యూనివర్సిటీలతో పాటు బెంగుళూరు, ముంబైలోని చాలా విద్యాసంస్థల్లో, అనేక ప్రధాన నగరాల్లో ఈ కంపెనీలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆయా కంపెనీల ఆఫీసుల ఎదుట సైతం ప్రొటెస్ట్స్ సైతం చేస్తున్నారు. ఆయా కంపెనీల ఉత్పత్తులను బాయ్ కాట్ చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే ఇలాంటి ఆరోపణలపై ఆయా కంపెనీలు స్పందించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. సైలెన్స్ దేనికి సంకేతం అనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. మౌనం అర్థాంగీకారమేనా? అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

 గతంలో పాలస్తీనాపై దాడి చేసినప్పుడల్లా ఐక్యరాజ్యసమితి చార్టర్‌లోని 51వ అధికరణాన్ని ఇజ్రాయె ల్‌ ప్రస్తావించేది. సాయుధ ముఠాలు దాడులకు దిగితే ఆత్మరక్షణ చేసుకునే హక్కు దేశాలకుంటుందని ఆ అధికరణ చెబుతోంది. పాలస్తీనాలో తనదికాని భూభాగాన్ని ఆక్రమించుకోవాల‌నుకున్నప్పుడల్లా ఇజ్రాయె ల్‌ ఈ అధికరణను సాకుగా చూపుతోంది. అమెరికా, యూరప్‌ దేశాలు ఇజ్రాయెల్‌ సాగిస్తున్న మారణకాండ ను చూడ నిరాక‌రిస్తూ, పరోక్షంగా మ‌ద్ద‌తుగా నిలుస్తున్న‌ తరుణంలో ఇటీవల 12 చిన్న దేశాలు కొలంబియా లోని బగోటాలో అత్యవసర శిఖరాగ్ర సదస్సు నిర్వహించి కార్యాచరణకు దిగబోతున్నట్టు ప్రకటించటం వూరటనిచ్చే అంశం. బొలీవియా, కొలంబియా, క్యూబా, ఇండోనేషియా, ఇరాక్‌, లిబియా, మలేసియా, నమీబియా, నికరాగువా, ఒమన్‌, సెయింట్‌ విన్సెంట్‌, దక్షిణాఫ్రికాలు వీటిలో ఉన్నాయి. ఈ సమావేశానికి హాజరైనా, అది విడుదల చేసిన సంయుక్త ప్రకటనపై సంతకం చేయాలా వద్దా అన్న మీమాంసలో పడిన మరో 20 దేశాలు సెప్టెంబర్‌కల్లా ఏ సంగతీ తేల్చాలని సదస్సు గడువు విధిం చింది. ఇజ్రాయెల్‌పై దక్షిణాఫ్రికా ఇప్పటికే అంతర్జాతీయ నేర న్యాయస్థానంలో ఫిర్యాదు చేసింది. తనదికాని ఒక ప్రాంతంపై దండెత్తి, అక్కడి పౌరులు ఎటువైపు కదలాలో హుకుం జారీ చేసే ఇజ్రాయెల్‌ ఆగడం నాగరిక ప్రపంచ ఉనికికే పెను సవాలు.

గాజాపై ఇజ్రాయెల్ మారణహోమాన్ని ఆపాల్సిందేనని బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్, యూరోపియన్ యూనియన్ సహా 28 దేశాలు స్పష్టం చేశాయి. తాగునీరు, ఆహారం కోసం సహాయ కేంద్రాల వద్ద బారులు తీరిన చిన్నారులు సహా అమాయక ప్రజలను అమానుషంగా హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండించాయి. ఈ మేరకు అవి ఓ సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. ఇజ్రాయెల్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం చాలా ప్రమాదకరమైనది. ఇది అస్థిరతను పెంచుతోంది. ప్రజల గౌరవాన్ని హరిస్తోంది. ప్రజలకు అత్యవసర మానవతా సాయం అందకుండా నిరోధించడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఇజ్రాయెలం అంతర్జాతీయ మానవతా చట్టాలను గౌరవించి వాటికి అనుగుణంగా వ్యవహరించాలి అని ఆ ప్రకటన కోరింది. ఇజ్రాయెల్‌ ఇష్టారాజ్యంగా మానవ హననానికి పాల్పడుతుంటే చూస్తూ కూర్చున్న దేశాలకు కూడా రేపటి రోజు ఇదే గతి పట్టదన్న గ్యారెంటీ ఏం లేదు. అందుకే అంతర్జాతీయ చట్టాలకూ, ఐక్యరాజ్యసమితి చార్టర్లకూ, మానవ హక్కులకూ ఇజ్రాయెల్‌ పెనుముప్పుగా మారిందని 12 దేశాల సదస్సు వ్యాఖ్యానించింది.

ఇజ్రాయెల్‌ దురాక్రమణదారీ అణచివేతను ప్రపంచ దేశాల్లోని లక్షలాది మంది ప్రజానీకం తీవ్రంగా నిరసిస్తున్నారు. కానీ మితవాద పాల‌క ఫాసిస్టు శక్తులు ఇజ్రాయెల్‌ దురాక్రమణ వైఖరిని మరింతగా ప్రోత్సహిస్తున్నాయి. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కూడా లోపాయకారీగా ఇజ్రాయెల్‌తో కుమ్మక్క య్యింది. ఇజ్రాయెల్‌ దురాక్రమణ విధానాలకు కొమ్ము కాసే బహుళజాతి సంస్థల ప్రయోజనాల కోసం మితవాద శక్తులన్నీ దగ్గరవుతున్నాయి. ఐక్యరాజ్య సమితిలో పాలస్తీనా ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న ఫ్రాన్సెస్కా ఆల్బనీస్‌ ఇజ్రాయెల్‌ సాగిస్తున్న జాతి హత్యాకాండకు ఏయే బహుళజాతి కంపెనీలు తోడ్పడుతూ, అందుకు బదులుగా పొందుతున్న వ్యాపార ప్రయోజనాలను కళ్ళకు కట్టినట్లుగా వివరిస్తూ ఒక నివేదిక విడుదల చేశారు. పాలస్తీనాలో కొనసాగుతున్న దారుణ మానవ మారణకాండ, విస్థాపన, పునరావాస కల్పనలను లాభాలు దండుకునే వ్యాపారంగా ఎలా మార్చేశారో ఈ నివేదిక బట్టబయలు చేసింది.

గాజా స్ట్రిప్‌, లెబనాన్‌ యుద్ధంలో సైనిక సేవల్లో పాల్గొన్న డేనియల్ ఎడ్రీ అనే ఇజ్రాయెల్  సైనికుడు సఫేద్ నగరానికి సమీపంలోని బిరియా అడవిలో కారులో నిప్పంటించుకొని విషాదకరంగా తన ప్రాణాలను తీసుకున్నాడు. యుద్ధ భయానక పరిస్థితులతో ఆ సైనికుడు తీవ్రంగా కలత చెందాడని, “శవాలను వాసన చూడలేకపోతున్నానని” పదే పదే చెబుతూనే ఉన్నాడని అతని అనుభవాలు అతన్ని వెంటాడాయని అతని తల్లి వెల్లడించింది. అతని తల్లి తన కొడుకును సత్కరించి ఆయనకు సైనిక అంత్యక్రియలకు అభ్యర్థించినప్పటికీ అధికారిక విధానాన్ని ఉటంకిస్తూ ఐడిఎఫ్ దానిని తిరస్కరించింది.  తన సూసైడ్‌ నోట్‌లో రాసిన వ్యాఖ్యలివి. ”నేను ఎన్నో మృతదేహాల వాసనను భరించాను, ఇక భరించలేను.  ఒక ఏడాది పాటు ఆపరేషనల్‌ డ్రైవర్‌గా పనిచేసిన  అతను తీవ్రమైన మానసిక ఒత్తిడితో 2025లో జూలైలో ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇజ్రాయెల్ చ‌ర్య‌ల‌ను ఇంటర్నేషనల్‌ కోర్ట్‌ ఆఫ్‌ జస్టిస్‌ (ఐసిజె) ఆక్షేపించింది. దీన్ని జెనొసైడ్‌గా (మాన‌వ ఊచ‌కోత‌) నిర్ధారించేందుకు అన్ని ఆధారా లున్నాయని అంటున్న‌ది. గాజాలో జరుగుతున్న మార‌ణ హోమానికి, యుద్ధం దీర్ఘకాలం కొనసాగడానికి కారణాలను చెబుతూ ‘ఫ్రం ఎకానమీ ఆఫ్‌ ఆక్యుపే షన్‌ టు ఎకానమీ ఆఫ్‌ జెనొసైడ్‌’ పేరిట యూఎన్‌ స్పెషల్‌ రిపోర్టర్‌ ప్రాన్సెస్కా అల్బనీస్‌ యునైటెడ్‌ నేషన్స్‌ హ్యూమన్‌ రైట్స్‌ కౌన్సిల్‌కు నివేదిక సమర్పించింది. ఆ నివేదికలో..  లాభాల కోసం కార్పొరేట్‌ కంపెనీలు చేసే దురాగతాలను మరోసారి ప్రపంచానికి తెలియజేసింది. మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, అమెజాన్‌, ఐౖబిఎం వంటి ప్రసిద్ధ కంపెనీలు తమ ప్రయోజనాల కోసం గాజాలో జెనొసైడ్‌ కొనసాగేలా మద్దతుగా నిలుస్తున్నాయని అల్బనీస్‌ నివేదిక స్పష్టం చేసింది. ఈ సంస్థలు జెనొసైడ్‌, ఆక్యుపేషన్‌లో పాల్గొంటూ అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తున్నాయని పేర్కొంది.

పాలస్తీనాలో జరుగుతున్న ఈ దారుణ మానవ మారణకాండను నిలవరించడానికి ఇజ్రాయెల్‌ను అదుపు చెయ్యాల్సింది పోయి మితవాద దేశాధినేతలు బహుళజాతి కార్పొరేషన్‌ల దన్నుతో ‘గ్రేటర్‌ ఇజ్రాయెల్‌’ లక్ష్యాన్ని సాకారం చేసుకోమని ప్రోత్సహిస్తున్నాయి. ఇజ్రాయెల్‌ దురాక్రమణ పూరిత విస్తరణ కాంక్షకు కళ్ళెం వెయ్యాల్సిన అమెరికా ఒక వైపున తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం జరగాలంటూ ప్రకటనలు ఇస్తూ రెండో వైపు నుండి ఇజ్రాయెల్‌కు భారీగా ఆయుధ, ఆర్థిక సాయాన్ని అందిస్తూ రెండు నాల్కల వైఖరి ప్రదర్శిస్తున్నది. అమెరికా ఇస్తున్న ఊతంతో ఇజ్రాయెల్‌ మరింత పేట్రేగిపోతున్నది. పాలస్తీనా ప్రజానీకాన్ని ఆకలితో మాడ్చి చంపాలనే అమానవీయ, అనాగరిక దిగజారుడు వ్యూహం పన్నుతున్నది. పాలస్తీనా భూభాగాన్ని పూర్తిగా తన స్వాధీనంలోకి తీసుకోవాలన్న ఏకైక లక్ష్యంతో ఇజ్రాయెల్‌ దూకుడుగా పనిచేస్తున్నది. రాబోయే రెండు నెలల్లో (2025 జూలై చివరి నాటికి) గాజాలో 75 శాతం భూభాగాన్ని స్వాధీనం చేసుకుంటామని ఇజ్రాయెల్‌ సైనిక వర్గాలు చెబుతున్నట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ 2025 మే 25 సంచికలో ఒక వార్తను ఇచ్చింది. గాజాలో 40 శాతం భూభాగం ఇప్పటికే తమ ఆధీనంలో ఉన్నదని ఇజ్రాయెల్‌ సైన్యం ప్రకటించింది. మరోవైపు ట్రంప్‌ తాత్కాలికంగా గాజా నుండి పాలస్తీనియన్లను తరలించాలని పిలుపు ఇచ్చాడు.

గాజాను స్వాధీనం చేసుకోవాలనే ప్రణాళికకు ఇజ్రాయెల్ సెక్యూరిటీ క్యాబినెట్ ఆగష్టు 8న ఆమోదం తెలిపింది. అయితే ఇజ్రాయెల్ ఇప్పటికే గాజా సరిహద్దుకు భారీగా సైనికులను తరలించినట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలుస్తోందనే కథనాలు వస్తున్నాయి. హమాస్ ను అంతం చేయడం, బందీలను విడిపించుకోవడం, గాజాను సైనిక రహిత ప్రాంతంగా మార్చడం, గాజాకు ఇజ్రాయెల్ భద్రత కల్పించడం, గాజాను తాత్కాలిక ప్రభుత్వానికి అప్పగించడమనే 5 అంశాలతో తాజా ప్రణాళిక రూపొందించారు. గాజా స్ట్రిప్ స్వాధీనం దిశగా వేసే అడుగులను ఇజ్రాయెల్ తక్షణమే ఉపసంహరించుకోవాలని ఐక్యరాజ్యసమితి (ఐరాసం) తేల్చి చెప్పింది.  అంతర్జాతీయ న్యాయ వ్యవస్థ (ఐసిజె) ఆదేశాలకు విరుద్ధంగా ఇజ్రాయెల్ యోచన ఉన్నదని, దురాక్రమణను ఇజ్రాయెల్ తక్షణమే ఆపేయాలని, టూ స్టేట్ పరిష్కారానికి అంగీకరించాలని పాలస్తీనా సార్వభౌమత్వాన్ని గుర్తించాలని ఐరాస మానవ హక్కుల నేత వోల్కర్ టర్క్ ఆగష్టు 8న వెల్లడించారు.

గాజా స్వాధీనం దిశగా ఇజ్రాయెల్ అడుగులపై ప్రపంచ దేశాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. గాజా పాలస్తీనా ప్రజలకు చెందుతుందని, దానిని మీరెలా స్వాధీనం చేసుకుంటారని చైనా ప్రశ్నించింది. ఇజ్రాయెల్ తక్షణమే తమ ప్రణాళికను ఉపసంహరించుకొనేలా ప్రపంచ దేశాలు ఒత్తిడి తేవాలని టర్కీ పిలుపునిచ్చింది. ఈ నిర్ణయం అమల్లోకి రాకుండా బాధ్యతాయుతంగా అంతర్జాతీయ సమాజం వ్యవహరించాలని కోరుతున్నామంటూ టర్కీ విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘిస్తూ, గాజా ఆక్రమణ దిశగా ముందుకెళ్లే ఇజ్రాయెల్ ప్రయత్నం అక్షేపణీయమని స్వీడెన్ విదేశాంగ శాఖ మంత్రి మారియా మల్మార్ స్టీనెగార్డ్ అన్నారు.

గాజాలో ఇజ్రాయెల్‌ 22 మాసాలుగా సామూహిక నరమేధానికి పాల్పడుతున్నది. ఒకజాతి మొత్తాన్ని సంహరించేలా చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా రోజుకు వందలాది మందిని హత్య చేస్తున్నది. మానవతా సహాయం, ఆహారం, వైద్యం కోసం ఎదురుచూస్తున్న వారిపై సైతం బుల్లెట్లు, బాంబుల వర్షం కురిపిస్తున్నది. ఇజ్రాయెల్‌కు ఆయుధ బదిలీలు ఆపాలని యుఎన్‌ నిపుణుల సైతం హెచ్చరించారు. యుకె, మరికొన్ని దేశాలు సాయుధ లైసెన్సులను కొంతవరకు నిలిపివేశాయి. యుకె ఇప్పటికే ఇజ్రాయెల్‌తో వాణిజ్య చర్చలను నిలిపివేసింది. టెలిజ్‌ ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలను నిలిపివేసింది. ఐర్లాండ్‌, స్లోవేనియా, స్పెయిన్‌ 2024లో పాలస్తీనాను దేశంగా గుర్తించాయి. యుఎస్‌ జనరల్‌ అసెంబ్లీలో పాలస్తీనాను ఒక దేశంగా గుర్తిస్తామని ఫ్రాన్స్‌ అధ్యకక్షుడు ఇమ్మాన్యుయెల్‌  మాక్రోస్‌ కూడా ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. గాజాలో యుద్ధాన్ని ఆపడానికి, మానవతా సంక్షోభాన్ని నివారించడానికి ఇది చాలా అవసరమని ఆయన పేర్కొన్నారు. అంటే ఫ్రాన్స్‌ జి7 దేశాల్లో పాలస్తీనాను దేశంగా గుర్తించే మొట్టమొదటి రాజ్యంగా నిలవనుంది. గాజాలో నరమేధాన్ని నిరోధించేలా చర్యలు తీసుకోవాలని ఇంటర్నేషనల్‌ కోర్ట్‌ ఆఫ్‌ జస్టిస్‌ ఇప్పటికే ఇజ్రాయెల్‌ను ఆదేశించింది. ఇజ్రాయెల్‌పై తీవ్ర ఒత్తిడి తెచ్చేందుకు ఆ దేశాన్ని ఒంటరిచేసేలా కఠిన ఆంక్షలు విధించాల్సిన అవసరమున్నది. పాలస్తీనా మీద ఇజ్రాయెల్‌ చేస్తున్న యుద్ధాన్ని నిలవరించడానికి జరిగే ఉద్యమాలకు అండగా నిలవడం కేవలం పాలస్తీనా ప్రజా ప్రయోజనాల కోసం కాదు, మానవాళి భవిష్యత్తు నిలుపుకోవడం కోసం అవసరం. ఇది మానవత్వానికి పరీక్షా కాలం.

Leave a Reply