వరల్డ్‌ ఆఫ్ డెబ్ట్‌ రిపోర్ట్‌- 2025 ని ఐక్యరాజ్యసమితి వాణిజ్యం, అభివృద్ధి కాన్ఫరెన్స్‌ (యుఎన్‌సిటిఎడి) ప్రచురించింది. 2024లో ప్రపంచ ప్రజారుణం రికార్డు స్థాయిలో 102 ట్రిలియన్లకు చేరుకుంది. ప్రపంచ జనాభా 820 కోట్లు. తలసరి సగటు అప్పు ఒక్కరికి రూ 11 లక్షలు ఉంటుంది. ప్రపంచ జిడిపి 110 ట్రిలియన్‌ డాలర్లు కాగా ప్రపంచ రుణం 102 ట్రిలియన్‌ డాలర్లు ఉంది. అంటే మొత్తం జిడిపిలో 93 శాతం వరకు రుణం ఉంటుంది.  అభివృద్ధి చెందుతున్న దేశాలు తీవ్ర‌మైన  రుణ భారాన్ని మోస్తున్నాయి. ఈ నివేదిక 2024 వరకు దృష్టి సారించినప్పటికీ, అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇవాళ ఆరోగ్యం, విద్య, నివాస‌గృహం కంటే వడ్డీపై ఎక్కువ ఖర్చు చేస్తున్నందున వారి అప్పు అభివృద్ధి చెందిన ఆర్థిక  వ్యవస్థల కంటే 2 రెట్లు వేగంగా పెరుగుతున్నది. కాబ‌ట్టి అత్యవసర ప్రపంచ ఆర్థిక సంస్కరణలు అవసరమని నొక్కి చెప్పింది. ఈ అప్పుల్లో అభివృద్ధి చెందుతున్న దేశాల వాటా 31 ట్రిలియన్ల డాలర్లుగా ఉంది. 2010 నుంచి  వారి అప్పు అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల కంటే రెట్టింపు రేటుతో పెరుగుతోంది. 

అభివృద్ధికి ప్రజా రుణం ముఖ్యమైనది. ప్రభుత్వాలు తమ ఖర్చులకు, ఆర్థిక సహాయం చేయడానికి, ప్రజలను రక్షించ డానికి, పెట్టుబడి పెట్టడానికి, మెరుగైన భవిష్యత్తుకు విద్య, వైద్యం అందించడానికి మార్గం సుగమం చేయడానికి దీనిని ఉపయోగిస్తాయి. అయితే, ప్రజా రుణం విపరీతంగా పెరిగినప్పుడు లేదా దాని ఖర్చులు దాని ప్రయోజనాల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు, అది భారంగా మారుతుంది. నేడు అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో ఇదే జరుగుతోంది. అంటే వడ్డీలు చెల్లించడానికి రుణాలు చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ప్రపంచ దేశాల ప్రజా రుణంలో ఆసియా ఓషియానియా 24 శాతం కలిగి ఉన్నాయి, తరువాత లాటిన్‌ అమెరికా కరేబియన్‌ (5 శాతం), ఆఫ్రికా (2 శాతం) ఉన్నాయి. ఈ రుణ భారం రుణ ఆర్థిక దేశాల ఆధారంగా గణనీయంగా మారుతుంది. అంతర్జాతీయ ఆర్థిక నిర్మాణంలో పొందుపరచబడిన అసమానత ద్వారా ఇది మరింత తీవ్రమవుతుంది.

అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇప్పుడు బాహ్య ప్రజా రుణంగా ప్రపంచ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌), ప్రపంచ బ్యాంక్‌, ఇతర ద్రవ్యసంస్థల నుండి తీసుకుంటున్నాయి. బాహ్య ప్రజా రుణంపై రుణ సేవ 2023లో 487 బిలియన్ల డాలర్లకు చేరుకుం ది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఎగుమతి ఆదాయంలో కనీసం 6.5 శాతం బాహ్య ప్రజా రుణాన్ని తీర్చడానికి చెల్లిస్తు న్నాము. ఇది ఎక్కువగా అధిక రుణ వ్యయాల ఫలితంగా ఏర్ప‌డింది. ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలకు పెట్టుబడులకు ఆర్థిక సహాయం చేయడం కష్టతరం చేస్తుంది. 2020 నుండి అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు యునైటెడ్‌ స్టేట్స్‌ కంటే రెండు నుండి నాలుగు రెట్లు ఎక్కువ వడ్డీ రేటుతో రుణాలు తీసుకుంటున్నాయి. మరోవైపు రుణాలు ఇచ్చే సంస్థలు సామ్రాజ్యవాద ద్రవ్య పెట్టుబడి అనుకూల షరతులు విధిస్తున్నాయి . 

అభివృద్ధి చెందుతున్న దేశాలు వరుసగా రెండవ సంవత్సరం నికర వనరుల ప్రవాహాన్ని చవిచూశాయి. 2023లో, వారు తాజా చెల్లింపుల కంటే రుణ సేవలలో తమ బాహ్య రుణదాతలకు 25 బిలియన్లు డాలర్లు ఎక్కువగా చెల్లించారు. ఫలితంగా ప్రతికూల నికర వనరుల బదిలీ జరిగింది. ఈ ధోరణుల ప్రభావం అభివృద్ధిపై ఆందోళన కలిగించే అంశం. ఎందుకంటే ప్రజలు దీనికి మూల్యం చెల్లిస్తారు. నిరంతరం అధిక వడ్డీ రేట్లు, బలహీనమైన ప్రపంచ ఆర్థిక అవకాశాలు, పెరిగిన అనిశ్చితి ప్రభుత్వ బడ్జెట్‌లపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రజా రుణంపై నికర వడ్డీ చెల్లింపులు 2024లో 921 బిలియన్ల డాలర్లకు చేరుకున్నాయి. ఇది 2023తో పోలిస్తే 10 శాతం పెరుగుదల. అదే విధంగా, రికార్డు స్థాయిలో 61 అభివృద్ధి చెందుతున్న దేశాలు ప్రభుత్వ ఆదాయంలో 10 శాతం లేదా అంతకంటే ఎక్కువ వడ్డీ చెల్లింపులకు కేటాయించాయి.

2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా రుణం గణనీయంగా పెరుగుతుందని 2020లోనే అంచనా వేయబడింది. ఐయంఎఫ్‌ ప్రకారం 2030 నాటికి జిడిపిలో 100 శాతంకి చేరుకోవచ్చని ఊహించారు. గ్లోబల్‌ సౌత్‌ దేశాలు తీవ్రమైన రుణ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. దీనికి రుణ ఉపశమనం అవసరం. ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణం, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు 2025 ఆర్థిక వాతావరణాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ప్రపంచ రుణం 2024లో గృహాలు, వ్యాపారాలు, ప్రభుత్వాల సంయుక్త ప్రపంచ రుణం 315 ట్రిలియన్ల డాలర్లకు పెరిగింది. ఆర్థిక అనిశ్చితి మధ్య 2030 నాటికి జిడిపిలో 100 శాతంకి చేరుకునేలా ప్రపంచ రుణం పెరుగుతుందని ఐయంఎఫ్‌ అంచనా వేసింది. ఈ నేప‌థ్యంలోనే అభివృద్ధి చెందుతున్న దేశాలు, ముఖ్యంగా గ్లోబల్‌ సౌత్‌ దేశాలు తీవ్రమైన రుణ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.

ప్రపంచ సంపద 455 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకున్నదని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ సంపదలో అత్యధిక శాతం సంపద సుమారు మూడు వేల మంది కుబేరుల ద‌గ్గ‌ర కేంద్రీకృతం  అయ్యింది. ప్రపంచం మొత్తంలో అమెరికా, చైనా, రష్యాలు 50 శాతం బిలియనీర్లను కలిగి ఉన్నాయి. అమెరికా అత్యధిక సంపద అంతా 902 మంది బిలియనీర్ల చేతుల్లో ఉంది. చైనాలో 1.7 ట్రిలియన్‌ డాలర్ల సంపద 450 మంది చేతుల్లో, ఇండియాలో 200 మంది కుబేరుల చేతుల్లో అత్యధిక సంపద కేంద్రీకృతమైంది. కొన్ని గణాంకాల ప్రకారం ప్రపంచంలోని మొత్తతం సంపదలో 43 శాతం సంపద కేవలం 1 శాతం మంది చేతుల్లో ఉంది. ప్రపంచంలోని టాప్‌ 1 శాతం మంది సంపద, మొత్తం సమాజంలోని 95 శాతం ప్రజల కంటే ఎక్కువ. అడ్డదారిలో డబ్బును సంపాదించడం, బినామీల పేరుతో కోట్ల కొలది సంపదను దాచడం, అందరికీ చెందవలసిన సంపద కేవలం కొద్ది మంది చేతిలో కేంద్రీకృతం కావడం వంటి చర్యల ద్వారా పేదలు మరింత పేదలుగా, కుబేరులు సంపదలో మరింత శక్తివంతులుగా తయారు కావడం ప్రపంచంలో జరుగుతున్నది. దీన్ని దుర్మార్గమైన అవినీతి తతంగంగా పేర్కొనవచ్చు. అందువల్లనే కుబేరుల  సంఖ్య పెరుగుతున్నా, ప్రపంచంలో పేదరికం తగ్గడం లేదు సరికదా ప్రభుత్వాల రుణాలు పెరుగుతున్నాయి.

2025 ఆగష్టు నాటికి అమెరికా ఆర్థిక వృద్ధి మధ్యస్థంగా ఉంది. ఈ ఏడాది కాలం నడుస్తున్న కొద్ది అమెరికా ఆర్థిక వ్యవస్థ సంక్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న‌ది. ద్రవ్యోల్బణం పెరుగుదల, ఫెడరల్‌ రిజర్వ్‌ సరళ విధానం, కార్మిక మార్కెట్‌ డైనమిక్స్‌, ప్రపంచ అనిశ్చితి వరకు.. ఆర్థిక స్థితిస్థాపకత, సవాళ్లు సమ్మెళనంగా ఉంది. ఆర్థిక వ్యవస్థ  ప్రస్తుత స్థితిని అర్థం చేసుకోవడానికి పెరుగుతున్న ద్రవ్యోల్బణం, తరిగిపోతున్న ఆర్థిక వృద్ధి, ఉపాధితో బాటు బాహ్య కారణాలను, కీలక సూచీలను మనం గమనంలో ఉంచుకోవాలి. అమెరికా ఆర్థిక వ్యవస్థకు కీలకమైన సవాళ్లలో పెద్దది, పెరుగుతున్న జాతీయ రుణం, ఆర్థిక లోటు. ఇవి అమెరికా ద్రవ్య విధానాన్ని క్లిష్టతరం చేస్తాయి. ఈ పూర్వ రంగంలో  అగ్ర రాజ్యమైన అమెరికా జాతీయ రుణం రికార్డు స్థాయిలో 37 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంది. కరోనా మహమ్మారి ముందు అంచనాల కంటే చాలా త్వరగా జాతీయ రుణం ఈ కొత్త మైలురాయిని చేరుకుంది. 2020 జనవరిలో బడ్జెట్‌ కార్యాలయం వేసిన అంచనాల ప్రకారం 2030 ఆర్థిక సంవత్సరం నాటికి అమెరికా జాతీయ రుణం ఈ స్థాయికి చేరుకుంటుందని భావించారు. కానీ, కరోనా వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ క్షీణించింది. దానికి తోడు, దేశ ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించేందుకు ట్రంప్‌, బైడెన్‌ ప్రభుత్వాలు భారీగా రుణాలు తీసుకోవడంతో జాతీయ రుణం ఊహించిన దానికన్నా చాలా త్వరగా పెరిగిపోయింది. ఐదేళ్లు ముందుగానే అంచనాలను దాటేసింది. ఈ భారీ రుణభారం అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోంది. తాజా నివేదికల ప్రకారం, జనవరి 2025లో అమెరికా జాతీయ ప్రభుత్వ రుణం 26,220 బిలియన్ల డాలర్లకు చేరుకుంది. మార్చి 2023లో దేశ జిడిపి 6,632 బిలియన్ల డాలర్లకు చేరుకుంది.

పెరుగుతున్న జాతీయ రుణం వల్ల ప్రభుత్వం తన రుణాలపై వడ్డీ చెల్లింపులపై ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇది బడ్జెట్‌లను ప్రభావితం చేస్తుంది. ప్రజలకు వ్యయ భారాన్ని పెంచుతోంది. అదనంగా కార్మిక మార్కెట్‌ వంటి అంశాలు ఉపాధి ఆధారిత వృద్ధిని పరిమితం చేస్తాయి. పెరుగుతున్న వాణిజ్య ఘర్షణలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను పెంచు తాయి. సరఫరా గొలుసులకు అంతరాయాలు వంటివి ప్రపంచ ఆర్థిక సమస్యల అనిశ్చితిని సృష్టిస్తాయి. ఆర్థిక వ్యవస్థ పనితీరును మరింత దెబ్బతీస్తాయి. ఫలితంగా దేశంలో ఆదాయ అసమానత, అస్థిర రాజకీయాలు, ప్రజలపై, ఆర్థిక భారం ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తాయి. ఫెడరల్‌ బ్యూరోక్రసి పరిమాణాన్ని తగ్గించడానికి ట్రంప్‌ తీసుకున్న కఠినమైన విధానం ప్రజా సేవల పనితీరును ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.

ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అత్యధికంగా 36 ట్రిలియన్‌ డాలర్ల రుణాన్ని కలిగి ఉంది. ఇది మొత్తం జిడిపిలో 125 శాతం. విశేషమేమిటంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం అప్పులో అమెరికా వాటా 34.6 శాతం. మరోవైపు చైనా అప్పు కూడా తక్కువేమీ కాదు. ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గత ఏడాది 14.69 ట్రిలియన్ల డాలర్ల రుణాన్ని కలిగి ఉంది. అంటే ప్రపంచ రుణంలో చైనా వాటా 16.1 శాతం. మూడవ స్థానంలో జపాన్‌ ఉంది. ఇది 10.79 ట్రిలియన్‌ డాలర్ల రుణాన్ని కలిగి ఉంది. ప్రపంచ రుణంలో జ‌పాన్‌ వాటా 10శాతం. బ్రిటన్‌ అప్పు కుడా తక్కువేమీ కాదు. 2023లో బ్రిటన్‌ 3.46 ట్రిలియన్‌ డాలర్ల రుణాన్ని కలిగి ఉంది. ఇది ప్రపంచ రుణంలో 36 శాతం. రుణాల విషయంలో ఫ్రాన్స్‌ ఐదో స్థానంలో, ఇటలీ ఆరో స్థానంలో నిలిచాయి. ఫ్రాన్స్‌కు ప్రస్తుతం 3.35 లక్షల కోట్ల డాలర్ల అప్పు ఉంది. ఇటలీకి 3.14 లక్షల కోట్ల డాలర్ల అప్పు ఉంది.

భారతదేశం గత ద‌శాబ్ద కాలంలో అనేక ఆర్థిక సంస్కరణలు, సామాజిక పథకాలు, రాజకీయ మార్పులను చవిచూసింది. కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి దేశ ఆర్థికవృద్ధి, ఉపాధి కల్పన, సామాజిక సంక్షేమం వంటి అంశాలపై ఎన్నో వాగ్దానాలు చేసింది. అయితే, ఇటీవలి ఆర్థిక నివేదికలు,  సామాజిక వాస్తవాలు సామాన్య పౌరుడి జీవితంలో పెరిగిన అప్పుల భారాన్ని, ఆర్థిక సంక్షోభాన్ని స్పష్టంగా వెల్లడిస్తున్నాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) ఇటీవల విడుదల చేసిన ఫైనాన్షియల్‌ స్టెబిలిటీ రిపోర్ట్‌-2025 ప్రకారం, దేశంలోని ప్రతి పౌరుడిపై సగటున రూ.4.8 లక్షల అప్పు ఉంది. ఇది గత రెండేళ్లలో రూ.90,000 మేర పెరిగింది. ఈ గణాంకాలు సామాన్యుడి జీవన పరిస్థితులు ఎంత దిగజారాయో చాటుతున్నాయి. ఆర్‌బిఐ నివేదిక ప్రకారం, 2023 మార్చిలో ఒక్కో పౌరుడిపై అప్పు రూ. 3.9 లక్షలుగా ఉండగా, 2025 మార్చి నాటికి ఇది రూ.4.8 లక్షలకు చేరింది. ఈ రూ.90,000 పెరుగుదల సామాన్యుడిపై ఆర్థిక ఒత్తిడిని సూచిస్తుంది.

దేశ జిడిపిలో అప్పుల వాటా 41.9 శాతంగా ఉంది. ఇందులో గృహ రుణాలు 29 శాతం. క్రెడిట్‌ కార్డులు, వ్యక్తిగత రుణాలు, మొబైల్‌ ఇఎంఐలు 54.9 శాతం వాటాను కలిగి ఉన్నాయి. మరో ఆందోళనకర అంశం ఏమంటే, లోన్‌-టు-వాల్యూ (ఎల్‌టివి) రేషియో 70 శాతానికి పైగా ఉండటం. ఇది రుణాల రికవరీని కష్టతరం చేస్తుంది. అంతేకాక, 25శాతం రిటైల్‌ రుణాలు సురక్షి తం కానివిగా గుర్తించారు. ఇది ఆర్థిక వ్యవస్థలో అస్థిరతను సూచిస్తుంది. ఫోర్బ్‌ నివేదిక ప్రకారం, దేశంలో సగటు తలసరి ఆదాయం రూ.2.16 లక్షలు మాత్రమే. అంటే, సామాన్యుడి అప్పు అతని ఆదాయం కంటే రెండింతలకు పైగా ఉంది. ఈ అసమతుల్యత సామాన్య పౌరుడు తన రోజువారీ జీవన అవసరాల కోసం అప్పులపై ఆధారపడుతున్నాడని స్పష్టం చేస్తుం ది. ఆర్‌బిఐ గణాంకాలు చెప్పేది ఏమిటంటే- 55 శాతం అప్పులు, ఆస్తుల సృష్టికి కాకుండా, కేవలం జీవన ఖర్చుల కోసమే తీసుకోబడుతున్నాయి. క్రెడిట్‌ కార్డుల వాడకం, వ్యక్తిగత రుణాలు, ఇఎంఐలు ఈ ధోరణికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి.

సామాన్యుడు అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి అనేక కారణాలున్నాయి. మొదటిది- నిత్యావసర వస్తువుల ధరలు గత 11 ఏళ్లలో దాదాపు 300 శాతం పెరిగాయి. ఆహారం, ఇంధనం, గృహ ఖర్చులు, విద్య, వైద్యం వంటి అంశాలు సామాన్యుడికి భారంగా మారాయి. రెండవది- ద్రవ్యోల్బణం పెరిగినా, వేతనాలు దానికి అనుగుణంగా పెరగలేదు. చాలీచాలని జీతాలతో కుటుంబ ఖర్చులను భరించలేక, ప్రజలు అప్పులపై ఆధారపడుతున్నారు. మూడవది- నైపుణ్యానికి తగిన ఉపాధి అవకా శాలు తగ్గాయి. యువతలో నిరుద్యోగం రేటు గత కొన్నేళ్లలో గణనీయంగా పెరిగింది, ఇది ఆర్థిక అస్థిరతకి దారితీస్తోంది. మోడి ప్రభుత్వం గత 11 ఏళ్లలో సామాన్యుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో విఫలమైందని ఈ గ‌ణాంకాలు చెప్తున్నాయి. అచ్చేదిన్‌ నినాదంతో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తామని వాగ్దానం చేసిన ప్రభుత్వం, వాస్తవానికి ప్రజలను అప్పుల ఊబిలోకి నెట్టిందని తెలిసిపోతున్న‌ది. ఒకవైపు సామాన్యులు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుంటే, ప్రభుత్వానికి సన్నిహిత వ్యాపారవేత్తలు మాత్రం అపార సంపదను సృష్టించుకుంటున్న తీరు క‌నిపిస్తున్న‌ది. 

ప్రపంచం మొత్తం సంపద పెరుగుతున్న‌ది అంటే..  కుబేరుల సంఖ్య పెరుగుతున్నది. కానీ  ప్రపంచంలో పేదరికం మాత్రం పోవడం లేదు. ఈనాటికీ ప్రపంచంలో అత్యధిక శాతం మంది అత్యల్ప ఆదాయంతో జీవిస్తూ, జీవించడానికి కనీస మౌలిక సదుపాయాలు లేక చెట్ల క్రింద, ఫుట్‌పాత్‌ల మీద, మురికివాడల్లోను అత్యంత దుర్భర జీవితం గడుపుతున్నారు.  మ‌రో వైపు  అందరికీ చెందవలసిన సంపద కేవలం కొద్దిమంది చేతిలో కేంద్రీకృతం కావడం వంటి చర్యల ద్వారా పేదలు మరింత పేదలుగా మారుతున్నారు. 

ఎక్కడైతే సంపద సమానంగా పంచబడుతుందో అక్కడ అభివృద్ధి జరుగుతుంది. ప్రజల జీవన ప్రమాణాలు పెరుగు తాయి. పెరుగుతున్న జనాభాకు తగిన మౌలిక సదుపాయాలు ఏర్పాటవుతాయి. సంప‌ద అంద‌రికీ పంచ‌బ‌డిన‌ప్పుడు విద్య, వైద్య, ఆరోగ్య రంగాలు అందరికీ అందుబాటులో ఉండాలి. ప్రజల తలసరి ఆదాయం పెరగాలి. అప్పుడే ప్రజల జీవన ప్రమాణాల స్థాయి మెరుగుపడుతుంది. కానీ అలా జ‌ర‌గ‌టం లేదు. ఇలాంటి పరిణామాలకు మూలకారణం అవినీతి, ఆర్థిక దోపిడీ. ఆర్థిక అవినీతి పెరిగిపోయి సమాజాన్ని శాసిస్తున్నది. ధనార్జన కోసం సాగే వేటలో సామాన్యులు సమిధలుగా మారిపోతున్నారు. అవినీతి విషవృక్షమై, శాఖోపశాఖలుగా విస్తరించి సామాన్యుల బతుకు ముఖచిత్రాలను తలక్రిందులు చేస్తున్నది. ఇకనైనా ప్రపంచ ఆర్థిక నీతి మారాలి. అభివృద్ధి అంటే అందరికీ కనీస అవసరాలు అందుబాటులోకి రావాలి.  సంపద కేవలం కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం కాకూడదు. విలువల విధ్వంస ఫలితంగా ఏర్పడిన ఒక వ్యవస్థీకత నేరం అవినీతి. ఈ అవినీతితోనే మొత్తం ప్ర‌పంచ‌మంతా త‌ల్ల‌డిల్లుతున్న‌ది. అంద‌రూ సుఖ సంతోషాల‌తో స‌మాన అవ‌కాశాల‌తో  జీవించే స‌మాజం కోసం స‌మాజం ముందుకు సాగాలి. దోపిడీ పీడ‌న‌ల‌ను ర‌ద్దు చేసి స‌మ‌స‌మాజం స్థాపించుకోవాలి.

Leave a Reply