తెలంగాణ ప్రజాకవి అందెశ్రీ (అందె ఎల్లయ్య) హైదరాబాద్‌లో సోమవారం (2025 నవంబర్ 10 న) హఠార్మరణం పొందారు. తెలంగాణ గుండె కనీసం మూడు దశాబ్దాలపాటు ఆయన గొంతుకలో కొట్లాడింది. 1960వ దశకం తొలి రోజుల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా జనగామ సమీపంలోని రేబర్తి అనే గ్రామంలో నిరుపేద కుటుంబంలో అందె ఎల్లయ్య జన్మించారు. బాల్యంలోనే కుటుంబమంతా చెల్లాచెదురైంది. దీంతో అనాథగా బతికారు. బడికివెళ్లి చదువుకొనే అవకాశం లేదు. అదే ఊరిలో మల్లారెడ్డి, సూరమ్మ దంపతులు ఆయనను చేరదీశారు. వాళ్ల దగ్గరే ఉంటూ పశువులు కాస్తూ, పనుల్లో సాయపడేవారు. మల్లారెడ్డి దగ్గరే భారతం, భాగవతాలు కంఠతా పట్టారు. బాల్యం నుంచే ఆధ్యాత్మిక చింతన పెరిగింది. పేదరికం, ఆకలి, అంటరానితనం వెంటబడి పీడిస్తుంటే అందె ఎల్లయ్య పాటలతో సాంత్వన పొందేవారు. యక్షగానం, భజన పాటలకు దగ్గరయ్యారు. వాగులు, వంకలు, సెలయేళ్లు, అడవులు ఆయనలోని పాటల పల్లవికి సారవంతమైన చరణాలను రూపుగట్టాయి. ఆయన ఉన్న గ్రామానికి సమీపంలోని విప్లవోద్యమం, జననాట్యమండలి పాటలు ఆయన ఆలోచనా స్రవంతిని విశాలం చేశాయి. పాట అందె ఎల్లయ్య జీవితంలో అవిభాజ్యమయింది. బతుకుదెరువు కోసం పుట్టిన ఊరును వదిలి అందె ఎల్లయ్య హైదరాబాద్ నగరానికి వచ్చారు. జీవిక కోసం కూలీగా, తాపీ మేస్త్రీగా పనిచేశారు. కడుపు నింపని రోజువారి కూలి, కుటుంబ బాధ్యత రెండింటి మధ్య వైరుధ్యం ఏర్పడి జీవితాన్ని విరమించాలనే నైరాశ్యంలోకి ఆయన కూరుకుపోయారు. ఆ క్రమంలో మరింతగా ఆధ్యాత్మికతకు దగ్గరయ్యారు. ఆ రోజుల్లోనే కవిత్వ నిర్మాణానికి అవసరమైన ఛందస్సు, ఇతర మౌలిక విషయాలను గురువుల వద్ద నేర్చుకున్నారు. శృంగేరి పీఠాధిపతి శంకర మహరాజ్ సూచనతో తన పేరును అందెశ్రీగా మార్చుకున్నారు. చాలాకాలం పాటు తన కుటుంబంతో సహా ప్రొఫెసర్ బిరుదురాజు రామరాజు సంరక్షణలో ఉన్నారు. ఆయన దగ్గర ఆధ్యాత్మిక తత్వ చింతనలో గడిపారు. అక్కడ ఉండగానే జానపదాన్ని ప్రాణపదంగా చేసుకుని పద్యశైలిలో, గ్రాంధిక సరళిలో అనేక పాటలు కైగట్టారు. అందెల సవ్వడి వినిపించారు. 1993లో తాను రాసిన మొదటి గేయంతో ప్రపంచానికి అందెశ్రీ పరిచయం అయ్యారు.
1990ల దశకంలో ప్రారంభమైన ప్రపంచీకరణ మానవ జీవితాన్ని కుదుపులకు గురిచేసింది. విలువలన్నీ తారుమారైన ఒక కాలం మనిషిని, మానవత్వాన్ని, ఆత్మీయతను ప్రశ్నార్థకం చేసింది. ఆ నేపథ్యంలోనే “మాయమైపోతున్నడమ్మో మనిషన్నవాడు..మచ్చుకైన లేడు చూడు మనవత్వం ఉన్నవాడు” అనే పాటను అందెశ్రీ రాశారు. మనిషిని కేంద్రంగా చేసుకుని ఆయన పాట రచన కొనసాగింది. అలాగే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఎజెండా మీదకు వచ్చిన కాలంలో “చూడు తెలంగాణ.. చుక్కనీరు లేనిదాన” అనే పాటతో తెలంగాణ ముఖచిత్రం ఆవిష్కరించారు.
తెలంగాణ ప్రబోధగీతంగా అందెశ్రీ రాసిన “జయజయహే తెలంగాణ” పాట తెలంగాణ ప్రాంత ప్రశస్తిని లోతుగా ఆవిష్కరించింది. అనధికారిక అధికార గీతంగా ఈ పాట కోట్లాది మంది ప్రజల నోళ్లలో పల్లవిగా మారింది. యుద్ధగీతంగా మారి తెలంగాణ సమాజాన్ని పోరాటానికి సన్నద్ధం చేసింది. విద్యాలయాల్లో, సభల ప్రారంభంలో ఈ గీతం లేకుండా కార్యక్రమాలు నడిచేవి కావంటే అతిశయోక్తి కాదు. ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందే ఈ పాట అధికార గీతంగా మారుమ్రోగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దీనిని అధికారికంగా ప్రకటించింది. “జై బోలో తెలంగాణా..గళ గర్జనల జడివాన” పాటతో తెలంగాణలోని పల్లెపల్లెనూ, గుండె గుండెనూ అందెశ్రీ మీటారు. అందెశ్రీ తెలంగాణ సమాజం అనుభవించిన పురిటినొప్పుల్లో భాగమయ్యారు. ప్రజల పక్షాన నిలబడి పాటలను వినిపించారు. గంభీరమైన తన గొంతులో పాట నిప్పుల వాగులా ప్రవహించేది. ధిక్కార లక్షణాన్ని కోల్పోకుండా మూడు దశాబ్దాలకు పైగా పాట వెంటే నడిచారు. పాలకులు తన పాటకు దగ్గరవ్వాలని చేసిన ప్రయత్నాల్లో అందె శ్రీ కాస్త తడబడినా నిటారుగా నిలబడటానికి చివరికంటా ప్రయత్నించారు. అందెశ్రీ అనేక దేశాలు తిరుగుతూ అక్కడి నదులపై గొప్ప కావ్యం రాశారు. తెలంగాణ ఉద్యమ పాటల్ని “నిప్పుల వాగు” పేరిట సంకలనంగా కూర్చారు..
అందెశ్రీ ఏ అస్తిత్వవాద శిబిరంలోనూ చేరలేదు. కవులెప్పుడూ ఎక్కుపెట్టిన ప్రశ్నల్లా ఉండాలన్నారు. విప్లవ రచయితల సంఘాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిషేధించిన సందర్భంలో విరసానికి అండగా నిలబడి 2006లో నిషేధానంతర సభలో పాల్గొని మద్దతు ఇచ్చారు. ఆయనకు విరసం జోహార్లు అర్పిస్తోంది.
ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతోంది.
– అరసవిల్లి కృష్ణ, అధ్యక్షుడు
– రివేరా, కార్యదర్శి
విప్లవ రచయితల సంఘం
12 నవంబర్ 2025




