పర్యావరణపరంగా, సాంస్కృతికపరంగా ముఖ్య ప్రాంఅనువాదం తమైన హస్‌దేవ్ అరండి అటవీ ప్రాంతం బొగ్గు తవ్వకం వల్ల ప్రమాదంలో పడింది. అటవీ భూములను గనుల తవ్వకాలకోసం మళ్ళించాలన్న సిఫారసుతో నిరసనలు ఉధృతమయ్యాయి.

ఆదివాసీ సముదాయాలకు చట్టపరమైన రక్షణలను దాటవేసి, పర్యావరణ కట్టుబాట్ల కంటే కార్పొరేట్ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు అటవీ శాఖపై ఆరోపణలు చేసారు.

ఛత్తీస్‌గఢ్‌లోని హస్‌దేవ్ అరండ అటవీ ప్రాంతాన్ని తరచుగా “మధ్య భారతదేశపు ఊపిరితిత్తులు” గా గౌరవిస్తారు; జీవవైవిధ్య , సాంస్కృతిక పరంగా ముఖ్యమైన ప్రాంతం; ఇప్పుడు ముట్టడిలో ఉంది.

2025 జులై 7నాడు ఛత్తీస్‌గఢ్ అటవీ విభాగం 1,742.6 హెక్టార్ల దట్టమైన అటవీ భూమిని కెంటే ఎక్స్టెన్షన్ బొగ్గు బ్లాక్ కోసం మంజూరు చేయాలని సిఫారసు చేసింది. ఆ భూమిని ఆదాని ఎంటర్‌ప్రైసెస్ గని నిర్వాహకుడిగా  రాజస్థాన్ రాజ్య విద్యుత్ ఉత్పాదన్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌ఆర్‌వియుఎన్‌ఎల్) కు కేటాయించింది.

కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (ఎంఒఇఎఫ్‌సిసి) వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన ఈ నిర్ణయంపట్ల ఆదివాసీ సముదాయాలు, పర్యావరణ కార్యకర్తలు, ప్రతిపక్ష నాయకులు తీవ్ర నిరసనలను వ్యక్తం చేసారు.

సర్గుజా డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ 2025 జూన్ 26న జరిపిన తనిఖీ ఆధారంగా రూపొందించిన ఈ సిఫారసులో గ్రామసభ అధికారాన్ని దాటవేయడం, పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించడం, లక్షలాది ఆదివాసీ, సాంప్రదాయ అటవీ నివాసుల జీవనోపాధి కంటే కార్పొరేట్ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి ఆరోపణలు ఉన్నాయి.

ఈ ప్రతిపాదనకు ఎం.ఇ.ఎఫ్.సి.సి. ఆమోదం కోసం ఎదురు చూస్తూండడం వల్ల, హస్‌దేవ్ కోసం జరుగుతున్న పోరు అభివృద్ధి, స్వదేశీ హక్కులకూ, భారతదేశ పర్యావరణ నిబద్ధతలకూ మధ్య జరుగుతున్న విస్తృత సంఘర్షణను నొక్కి చెబుతుంది.

అటవీ సంరక్షకులను మాట్లాడనీయడంలేదు:

భారతదేశంలోని అయిదవ షెడ్యూల్డ్ ప్రాంతాలలో ఆదివాసుల అభివృద్ధికి సంబంధించి మైలురాయిగా భావించే పంచాయతీల (షెడ్యూల్డ్ ఏరియాలకు పొడిగింపు) చట్టం-1996 (పెసా)ను నేరుగా తిరస్కరించడమే బొగ్గు గనుల తవ్వకం కోసం హస్‌దేవ్ అడవులను ఖాళీ చేయాలని అటవీ శాఖ చేస్తున్న ప్రయత్నం. ఆదివాసీ ప్రాంతాలలో సహజ వనరులపై గణనీయమైన అధికారం ఉండే స్వయంపాలనను నిర్ధారించడానికి గ్రామ సభలను (ఇందులో గ్రామ పెద్దలందరూ సభ్యులుగా ఉండేట్లు చూస్తారు) పెసా చట్టం మంజూరు చేస్తుంది.

పెసా చట్టంలోని సెక్షన్ 4 (ఇ) ప్రకారం గ్రామసభలకు అభివృద్ధి ప్రాజెక్టులను ఆమోదించడానికి లేదా తిరస్కరించడానికి, అడవులు వంటి సాముదాయక వనరులను నిర్వహించడానికి, సాంస్కృతిక గుర్తింపును కాపాడడానికి అధికారం ఉంటుంది. 2006లో జారీ చేసిన అటవీ హక్కుల చట్టంలో భాగంగా సాముదాయక అటవీ హక్కులను గుర్తించి, అడవులను సుస్థిరంగా నిర్వహించడానికి, వాటిని విధ్వంసక ప్రాజెక్టుల నుండి రక్షించడానికి ఆదివాసీ సముదాయాలకు అధికారాన్నిచ్చారు.

అయితే, హస్‌దేవ్‌లో, కెంటే ఎక్స్టెన్షన్ బొగ్గు బ్లాక్ కోసం అటవీ శాఖ చేసిన సిఫారసు ఈ చట్టపరమైన రక్షణలను లేకుండా చేస్తోంది. ఇటీవల పార్సా బొగ్గు బ్లాకును విస్తరించడానికి అనుమతినిచ్చే  ప్రక్రియలో జరిగిన బూటకపు గ్రామసభల సమ్మతులు తీసుకోవడం, ఆదివాసీ సముదాయ నాయకులపై ఒత్తిడిచేయడం మొదలైన అక్రమాలను ఛత్తీస్‌ఘఢ్ రాష్ట్ర షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమిషన్ (సిజిఎస్‌టిఎస్‌సి)వెలికితీసింది.

సాల్హి, హరిహర్ పూర్, ఫతేపూర్ వంటి గ్రామాలలో గ్రామసభలతో అటవీ శాఖ తప్పనిసరిగా జరపాల్సిన సంప్రదింపులను దాటవేసిందని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. “శాస్త్రీయ అటవీ నిర్వహణ” జరగాల్సిన అవసరం ఉన్నదని ఈ విభాగం చేస్తున్న సమర్థన వర్కింగ్ ప్లాన్ కోడ్- 2023లో ఉన్నది. పెసా, అటవీ హక్కుల చట్టాలను అమలుచేయకుండా ఉండేందుకు ఇది ఒక కారణమని, తమ అడవులను రక్షించుకునే అధికారాన్ని ఆదివాసీ సముదాయాలకు ఇచ్చే ప్రజాస్వామ్య ప్రక్రియను నిర్లక్ష్యం చేసారని విమర్శకులు అంటున్నారు.

“ఈ సిఫారసు గ్రామసభ సమ్మతిని తీసుకోవాల్సిన ప్రక్రియను పక్కన పెట్టి, పెసా, ఎఫ్ఆర్ఎ చట్టాలను ఉల్లంఘిస్తుంది. తరతరాల నుంచి హస్‌దేవ్‌ను నడిపించిన ఆదివాసీ సముదాయాలను మాట్లాడనీయకుండా చేస్తుంది” అని ఛత్తీస్‌గఢ్ బచావో ఆందోళన్ అటవీ శాఖ చర్యలను ఖండించింది.

అటవీ శాఖ చేబడుతున్న చర్యలు, ఆదివాసీ సంక్షేమం కోసం రాష్ట్రం ప్రకటించిన నిబద్ధతకూ మధ్య సంబంధం లేకపోవడాన్ని హస్‌దేవ్‌లోని అన్ని బొగ్గు బ్లాకులను రద్దు చేయాలని ఏకగ్రీవంగా కోరిన 2022 ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ తీర్మానం మరింతగా ఎత్తి చూపిస్తుంది.

గనుల తవ్వకాలకు అనుమతులనివ్వడానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా, ఆదివాసీ స్వయంప్రతిపత్తిని రక్షించడానికి రూపొందించిన చట్టపరమైన చట్రాన్ని ఈ విభాగం తుడిచిపెడుతున్నట్లు కనిపిస్తోంది;  దాని జవాబుదారీతనం, ఉద్దేశ్యాల గురించి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఎవరి అడవి? ఎవరి భవిష్యత్తు?

అటవీ శాఖ సిఫారసు ఒక కీలకమైన ప్రశ్నను లేవనెత్తుతుంది: ఎవరి ప్రయోజనాలను నెరవేరుస్తున్నారు – కార్పొరేషన్ల ప్రయోజనాలనా లేదా హస్‌దేవ్‌పై ఆధారపడే ఆదివాసీ సముదాయాల ప్రయోజనాలనా? కేంటే ఎక్స్టెన్షన్ బొగ్గు బ్లాక్ 1,879.6 చదరపు కిలోమీటర్ల హస్‌దేవ్ అరండ బొగ్గు క్షేత్రంలో భాగం; ఇక్కడ 5.179 బిలియన్ టన్నుల బొగ్గు  ఉంటుందని అంచనా.

అదానీ ఎంటర్‌ప్రైసెస్ గని నిర్వాహకుడిగా ఉన్న రాజస్థాన్ రాజ్య విద్యుత్ ఉత్పాదన్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌ఆర్‌వియుఎన్‌ఎల్)కు కేటాయించిన ఈ ప్రాజెక్టు చేపడుతున్న బ్లాక్ ప్రాంతంలో 99 శాతంగా ఉన్న 1,742 హెక్టార్ల దట్టమైన అడవిని నిర్మూలించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. నీటి భద్రతకు, జీవ వైవిధ్యానికి జీవనాధారమైన చొర్నాయ్ నదీ పరీవాహక ప్రాంతంలో ఈ బ్లాక్ ఉన్నది.

ప్రతిపక్ష కాంగ్రెస్‌కు నాయకత్వం వహిస్తున్న మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్, భారతీయ జనతా పార్టీ (బిజెపి) నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తన పర్యావరణ వాగ్దానాలకు ద్రోహం చేసిందని ఆరోపించాడు. కార్పొరేట్ ప్రయోజనాల కోసం 600 వేల చెట్లను నరికివేయాలని యోచిస్తున్న బిజెపి ప్రభుత్వం ‘ఒక చెట్టు అమ్మ పేరు మీద’ అని చేస్తున్న ప్రచారం ఒక పరిహాసం అని ల్ ప్రకటించాడు. ఒకప్పుడు అటవీ నిర్మూలనకు మద్దతు పలికిన ప్రభుత్వ కపటత్వాన్ని ఎత్తి చూపాడు.

హస్‌దేవ్‌లో ఇప్పటికే పనిచేస్తున్న పార్సా ఈస్ట్ అండ్ కెంటే బసాన్ (పిఇకెబి) గనిలో 350 మిలియన్ టన్నుల బొగ్గు ఉందని, ఇది ఇరవై సంవత్సరాల వరకు రాజస్థాన్ విద్యుత్ అవసరాలను తీర్చడానికి సరిపోతుందని బాఘెల్ అన్నాడు. కెంటే ఎక్స్టెన్షన్ ప్రాజెక్టు అవసరం లేదు. ప్రజా అవసరానికి కాకుండా కార్పొరేట్‌ల లాభం కోసం అడవిని  నిర్మూలిస్తున్నారు.

హస్‌దేవ్ అటవీ ప్రాంతానికి ఎంతో పర్యావరణ ప్రాముఖ్యత ఉన్నది. 640 పుష్ప సంబంధ జాతులు, 128 ఔషధ మొక్కలు, 92 రకాల పక్షి జాతులు, ఏనుగులు, ఎలుగుబంట్లు, చిరుతపులులు లాంటి అంతరించిపోతున్న వన్యప్రాణులకు మద్దతునిస్తుంది. ఇప్పటికే అధికమవుతున్న మానవ-ఏనుగుల ఘర్షణ సమస్యను హస్‌దేవ్‌లో గనుల తవ్వకాన్ని చేపట్టడం మరింత తీవ్రతరం చేస్తుందని, కీలకమైన వన్యప్రాణుల కారిడార్‌లను దెబ్బతీస్తుందని భారత వన్యప్రాణుల సంస్థ (డబ్ల్యూఐఐ) హెచ్చరించింది.

300,000 హెక్టార్ల వ్యవసాయ భూమికి నీటిపారుదలను కల్పిస్తున్నహస్‌దేవ్ నది, హస్దేయో బాంగో ఆనకట్టల ద్వారా  అడవికీ నీటికీ ఉండే సంబంధాన్ని భారతీయ అటవీ పరిశోధన-విద్యా మండలి (ఐసిఎఫ్ఆర్ఇ) నొక్కి చెబుతుంది.

ఈ సిఫారసు పర్యావరణ సంబంధమైన, చట్టపరమైన నిబంధనలను “బాహాటంగా ఉల్లంఘించింది”అని ఛత్తీస్‌గఢ్ బచావో ఆందోళన్, హస్‌దేవ్ అరానియా బచావో సంఘర్ష్ సమితి వంటి పర్యావరణ సంఘాలు పేర్కొన్నాయి. సుస్థిర అటవీ నిర్వహణను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన వర్కింగ్ ప్లాన్ కోడ్ 2023 పై అటవీ శాఖ ఆధారపడటం, ఆదివాసీ సమాజాల జీవనోపాధి కంటే బొగ్గు తవ్వకానికి ప్రాధాన్యతనిచ్చే దుర్వినియోగం అని వారు వాదిస్తున్నారు.

గోండి, ఒరాన్ తదితర తెగలకు హస్‌దేవ్ కేవలం ఒక అడవి మాత్రమే కాదు, ఆహారం, ఔషధం, సాంస్కృతిక గుర్తింపులకు మూలంగా ఉంది. 600,000 చెట్లను నరికివేయాలని ప్రతిపాదించడంతో వాటి మనుగడకు ముప్పు వాటిల్లింది. తరతరాలుగా వారు ఆధారపడిన వనరులను నాశనం చేస్తూ ప్రజలను నిర్వాసితులను చేస్తోంది.

భారతదేశపు పర్యావరణ, స్థానికప్రజల సంబంధిత నిబద్ధతలకు ప్రమాదం

అంతర్జాతీయ చట్టాల ప్రకారం జీవ వైవిధ్యం, స్వదేశీయుల హక్కులను పరిరక్షించేందుకు భారతదేశం పడుతున్న ప్రయాసను హస్‌దేవ్ వివాదం బయటపెడుతోంది.

జీవవైవిధ్యాన్ని, స్వదేశీయుల హక్కులను పరిరక్షించే అంతర్జాతీయ చట్టాల నిబంధనలకు కట్టుబడి ఉండే విషయంలో  భారతదేశం చేస్తున్న పోరాటాన్ని హస్‌దేవ్ వివాదం బహిర్గతం చేసింది.

జీవ వైవిధ్య (సిబిడి) ఒప్పందంపై సంతకం చేసిన దేశంగా, భారతదేశ ప్రభుత్వానికి పర్యావరణపరంగా సున్నితమైన ప్రాంతాలను, సుస్థిర వనరుల ఉపయోగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఉన్నది.

ప్రాంతీయ, ప్రపంచ పరిరక్షణ లక్ష్యాలకు కీలకమైన, సమృద్ధిగా ఉన్న పర్యావరణ వ్యవస్థను కలిగి ఉన్న హస్‌దేవ్ వంటి జీవవైవిధ్య హాట్‌స్పాట్ (స్థానిక జాతుల అధిక సాంద్రత కలిగిన ప్రాంతం)లను రక్షించాల్సిన ప్రాముఖ్యతను గురించి ‘ఐచి బయోడైవర్సిటీ టార్గెట్స్’ (‘ఐచి జీవవైవిధ్య లక్ష్యాలు’ – ప్రపంచ జీవవైవిధ్య సంక్షోభాన్ని పరిష్కరించడానికి 2010 లో జీవవైవిధ్యంపై కన్వెన్షన్ ఆమోదించిన 20 లక్ష్యాల సమితి), ‘కున్మింగ్-మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్‌వర్క్’లు (కున్మింగ్-మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్‌వర్క్ (జిబిఎఫ్) అనేది 2022 డిసెంబర్‌లో మాంట్రియల్‌లో జరిగిన యుఎన్ బయోడైవర్శిటీ కాన్ఫరెన్స్ (COP15)లో ఆమోదించిన ఒక మైలురాయి అంతర్జాతీయ ఒప్పందం.. 2030 నాటికి జీవవైవిధ్య నష్టాన్ని ఆపడం, తిప్పికొట్టడం, 2050 నాటికి ప్రకృతితో సామరస్యంగా జీవించే ప్రపంచాన్ని సాధించడం దీని లక్ష్యం. జిబిఎఫ్ ఐచి జీవవైవిధ్య లక్ష్యాలను భర్తీ చేస్తుంది; 2050నాటికికి నాలుగు లక్ష్యాలను, 2030నాటికి 23 లక్ష్యాలను కలిగి ఉంటుంది.)

హస్‌దేవ్‌లో గనుల తవ్వకం జరపడం ఈ వాగ్దానాలకు ప్రత్యక్షంగా వ్యతిరేకించినట్లు అవుతుంది; అంతరించిపోతున్న జాతులు, ఆవాసాలను ప్రమాదంలోకి నెడుతుంది.

స్వదేశీ ప్రజల హక్కులపై ఐక్యరాజ్యసమితి ప్రకటన (ద యునైటెడ్ నేషన్స్ డిక్లరేషన్ ఆన్ ద రైట్స్ ఆఫ్ ద ఇండిజినస్ పీపుల్ –యుఎన్‌డిఆర్‌ఐపి) స్థానిక సముదాయాల నుంచి వారి భూములను ప్రభావితం చేసే ప్రాజెక్టులకు అవసరమైన ముందస్తు సమాచారాన్ని ఇచ్చి సమ్మతిని తీసుకోవాలని (ఎఫ్‌పిఐసి) నిర్దేశిస్తుంది. హస్‌దేవ్‌లో నకిలీ గ్రామసభ సమ్మతిని తయారు చేయడం, ఒత్తిడి చేసి సమ్మతిని తీసుకోవడం ఈ నియమాన్ని ఉల్లంఘిస్తుంది. శతాబ్దాలుగా అటవీ ప్రాంతాలతో సామరస్యంగా జీవిస్తున్న ఆదివాసీ సముదాయాల హక్కులను దెబ్బతీస్తోంది.

అదేవిధంగా, పారిస్ ఒప్పందం కింద భారతదేశం కట్టుబడి ఉన్న నిబద్ధతలలో కార్బన్ ఉద్గారాలను తగ్గించడం , అటవీకరణ ద్వారా 2.5-3 బిలియన్ టన్నుల కార్బన్ సింక్* సృష్టించడం ఉన్నాయి. గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలకు దోహదం చేసే, వాతావరణ మార్పులను మరింత తీవ్రతరం చేసే హస్‌దేవ్ ప్రతిపాదిత అటవీ నిర్మూలన కీలకమైన కార్బన్ సింక్ అయిన ఈ లక్ష్యాలకు వ్యతిరేకమైనది.

ది రామ్‌సర్ కన్వెన్షన్, హస్‌దేవ్‌కు నేరుగా వర్తించనప్పటికీ, నీటి భద్రత కోసం చిత్తడి నేలలను రక్షించాల్సిన ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. హస్‌దేవ్ నది , హస్‌దేవ్ బాంగో ఆనకట్టకు నీటిపారుదల ప్రాంతంగా హస్‌దేవ్ పాత్ర ఈ సూత్రాలకు అనుగుణంగా ఉంటుంది. అయితే గనుల తవ్వకం ఈ ప్రాంత జలసంతులనాన్ని భంగపరుస్తుంది; వ్యవసాయమూ, తాగునీటి కోసం దాని నీటిపై ఆధారపడిన లక్షలాది మందిని ప్రభావితం చేస్తుంది.

పారిస్ ఒప్పందం ప్రకారం భారతదేశపు నేషనల్లీ డిటర్మైన్డ్  కాంట్రిబ్యూషన్స్  (జాతీయంగా నిర్ణయించిన సహకారం -ఎన్‌డిసి) సుస్థిర అభివృద్ధికి మరింతగా కట్టుబడి ఉంది; అయితే అటవీ శాఖ చర్యలు దీర్ఘకాలిక పర్యావరణ, సామాజిక సుస్థిరత కంటే స్వల్పకాలిక ఆర్థిక లాభాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నాయి.

నిరసనలు;  హస్‌దేవ్ ఆత్మ కోసం పోరాటం:

అటవీ శాఖ చేసిన సిఫారసు హస్‌దేవ్ అంతటా ప్రతిఘటనా తరంగాన్ని తగుల్కొల్పింది. ప్రాజెక్టు వలన మానవాళికి జరిగే నష్టాన్ని ఎత్తిచూపుతూ 2024 అక్టోబరు 17న సాల్హి, హరిహరపూర్, ఫతేపూర్ వంటి గ్రామాల్లో జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. పోలీసులు లాఠీ ఛార్జీలు, అరెస్టు చేసినట్లు నివేదికలు వచ్చాయి. అటవీ నిర్మూలనలను తక్షణం రద్దు చేయాలని, పత్రాల తారుమారు, ఒత్తిడి చేయడంతో సహా అక్రమాలకు పాల్పడిన అధికారులు, కంపెనీలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని హస్‌దేవ్ అరణ్య బచావో సంఘర్ష్ సమితి డిమాండ్ చేసింది.

2009లో ఈ అటవీ ప్రాంతాన్ని ‘నో గో ప్రాంతం’గా (ఎవరూ ప్రవేశించడానికి వీలులేని ప్రాంతం)గుర్తించగా, ఆ తర్వాత దాన్ని తిప్పికొట్టారు. ఈ అటవీ ప్రాంతంలో పర్యావరణ, సాంస్కృతిక పరిరక్షణ కంటే బొగ్గు తవ్వకానికి ప్రాధాన్యత ఇవ్వడం కొనసాగుతోంది.

ఆదివాసీ సముదాయాలకు హస్‌దేవ్ ఒక అడవి కన్నా మించి ఒక సాంస్కృతిక, ఆధ్యాత్మిక జీవన రేఖగా ఉంది. గోండి, ఒరాన్ తదితర తెగల గుర్తింపుకు ముప్పు కలిగించే విధంగా వారు పవిత్రంగా భావించే పొలాలు, సాంప్రదాయక పద్ధతులు, అటవీ వనరులతో ముడిపడి ఉన్న జీవనోపాధి ప్రమాదంలో ఉన్నాయి. అటవీ శాఖ కార్పొరేట్ ప్రయోజనాలకు, ముఖ్యంగా అదానీ ఎంటర్ప్రైజెస్‌కు అనుకూలంగా ఉండటం అనేది 2022 ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ తీర్మానానికి విరుద్ధమైనది. భారతదేశంలోని గనుల తవ్వకం, విద్యుత్ రంగాలలో కీలక పాత్ర పోషిస్తున్న అదానీ ప్రమేయం బంధుత్వానికి సంబంధించిన ఆరోపణలకు ఆజ్యం పోస్తోంది. ఆదివాసీ సముదాయాలు, పర్యావరణ స్థితిని పట్టించుకోకుండా అటవీ శాఖ కార్పొరేట్ ఎజెండాకు సేవలు అందిస్తోందని విమర్శకులు వాదిస్తున్నారు.

హస్‌దేవ్ సంక్షోభ సంబంధిత విస్తృతమైన చిక్కులు ఛత్తీస్‌గఢ్‌కు మించి విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతం జీవ వైవిధ్య కేంద్రంగా, కార్బన్ సింక్‌గా ఉండడం వల్ల ఇది భారతదేశ పర్యావరణ వ్యూహంలో కీలక పాత్ర పోషిస్తుంది. అటవీ శాఖ చర్యలు స్థానిక సముదాయాలకు నష్టాన్ని కలిగించడం మాత్రమే కాకుండా, వాతావరణపర చర్యలు తీసుకోవడంలో, స్థానిక హక్కుల పరిరక్షణలో నాయకత్వ స్థాయిలో ఉన్న భారతదేశానికి ఉన్న ప్రపంచ ఖ్యాతిని కూడా దెబ్బతీస్తాయి.

డబ్ల్యూఐఐ చేసిన సిఫారసులను, జలసంబంధాల ప్రభావాల గురించి ఐసిఎఫ్‌ఆర్‌ఇ చేసిన హెచ్చరికలను పరిగణించి అటువంటి కార్యకలాపాలను నిషేధించాలని హస్‌దేవ్‌లో గనుల తవ్వకాన్ని ఆపివేయాలని కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. జవాబుదారీతనాన్ని డిమాండ్ చేస్తూ ఆదివాసీ నాయకులు, పర్యావరణవేత్తలు , ప్రతిపక్ష నాయకులు సమైక్యంగా జరుపుతున్న నిరసనలు హస్‌దేవ్‌ను కాపాడటానికి ఉధృతమవుతున్న ఉద్యమాన్ని ప్రతిబింబిస్తున్నాయి.

హస్‌దేవ్‌  భవిష్యత్తు ఎలా ఉంటుంది?

కేంట్ విస్తరణ సిఫారసు ఎంఒఇఎఫ్‌సి ఆమోదం కోసం ఎదురుచూస్తున్నది కాబట్టి, హస్‌దేవ్ అడవిని కాపాడడానికి  జరుగుతున్న యుద్ధం భారతదేశ పర్యావరణ, సామాజిక న్యాయ చిత్రపటానికి కీలకమైన క్షణాన్ని సూచిస్తుంది. తమ అడవులను నిర్వహించుకోవడానికి ఆదివాసీ సముదాయాలకున్న హక్కులను గౌరవిస్తూ పెసా, అటవీహక్కుల చట్టంలాంటి చట్టపరమైన రక్షణలను ప్రభుత్వం సమర్థిస్తుందా? లేదా కార్పొరేట్ ప్రయోజనాలు, జీవ వైవిధ్యమైన పర్యావరణ వ్యవస్థను, కోట్లాది మంది జీవనోపాధిని బొగ్గు కోసం త్యాగం చేస్తుందా?

“శాస్త్రీయ అటవీ నిర్వహణ” భాషలో దాగి ఉన్న అటవీ శాఖ చర్యలు, పర్యావరణ, సాంస్కృతిక పరిరక్షణలకంటే ఆర్థిక ప్రయోజనాలకే ప్రాధాన్యతనిచ్చి వ్యవస్థాగత వైఫల్యాన్ని బహిర్గతం చేసింది.

అభివృద్ధికి, సుస్థిరతకు మధ్య జరుగుతున్న ప్రపంచవ్యాప్త పోరాట సూక్ష్మ రూపం హస్‌దేవ్ సంక్షోభం. సిబిడి, యుఎన్ డిఆర్ఐపి, పారిస్ ఒప్పందం, రామ్‌సార్ ఒప్పందాలకు భారతదేశం కట్టుబడి ఉన్నది కాబట్టి , కెంటే ఎక్స్టెన్షన్ వంటి ప్రాజెక్టులను తిరిగి అంచనా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. హస్‌దేవ్‌లను కాపాడాలంటే అటవీ నిర్మూలనలను ఆపడమే కాదు, గ్రామసభల అధికారాన్ని బలోపేతం చేయడం, పర్యావరణ ఆమోదాలలో పారదర్శకతను నిర్ధారించడం, ఉల్లంఘనలకు కార్పొరేషన్లను జవాబుదారీగా చేయడం కూడా అవసరం.

ఆదివాసీ సముదాయాలకు  హస్‌దేవ్ కేవలం ఒక వనరు కాదు – ఇది వారి ఇల్లు, వారి వారసత్వం, వారి భవిష్యత్తు. హస్‌దేవ్‌ను కాపాడాలన్న పోరాటం న్యాయంకోసం, సుస్థిరత కోసం, భారతదేశ అటవీ ప్రాణాల కోసం జరుగుతున్న పోరాటం.

అంతిమ  సారాంశం: ‘మధ్య భారతదేశపు ఊపిరితిత్తులు’ అని పిలువబడే ఛత్తీస్‌గఢ్‌లోని హస్‌దేవ్ అరండ అడవి, ప్రతిపాదిత బొగ్గు గనుల నుండి తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటోంది;  గనుల తవ్వకం కోసం 1,742.6 హెక్టార్ల విస్తీర్ణంలో భూమిని కేటాయించాలన్న అటవీ శాఖ సిఫారసు చట్టపరమైన రక్షణ, పర్యావరణ, సాంస్కృతిక పరిరక్షణల కంటే కార్పొరేట్ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని ఆదివాసీ సముదాయాలు, పర్యావరణ కార్యకర్తలు నిరసనలను వ్యక్తం చేస్తున్నారు.

* కార్బన్ సింక్ అంటేవాతావరణం నుండి విడుదల చేసే దానికంటే ఎక్కువ కార్బన్‌ను గ్రహించే సహజ లేదా కృత్రిమ జలాశయం.. ముఖ్యంగా, ఇది గాలి నుండి ప్రధాన గ్రీన్‌హౌస్ వాయువు అయిన కార్బన్ డయాక్సైడ్ (సిఒ2) ను తొలగించే వ్యవస్థ. సహజ కార్బన్ సింక్‌లలో అడవులు, మహాసముద్రాలు, నేల. ఇవి మానవ-కారణమైన సిఒ 2 ఉద్గారాలను తగ్గించడం ద్వారా వాతావరణ మార్పులను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

2025 ఆగస్టు 6

https://www.downtoearth.org.in/forests/hasdeo-under-siege-forests-tribes-and-the-fight-against-corporate-coal?utm_source=website&utm_medium=related-stories

Leave a Reply