ఒక దశాబ్ద కాలంపాటు ప్రతి నిత్యం  ఏడాది పత్రికల్లో నిలిచిన మావోయిస్టు నాయకురాలిగా కామ్రేడ్ అరుణ పేరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చిరపరిచితమే. అయితే ఆమె రచయిత అనే విషయం చాలా మందికి తెలియదు. అజ్ఞాత మహిళా రచయితల కథలను సంకలనాలుగా వియ్యుక్క పేరుతో ప్రచురించినపుడు కూడా అందులో అరుణ కథలుగా తెలిసినవి రెండు కథలు మాత్రమే. ఇటీవలే తెలిసిన సమాచారం ప్రకారం కా.అరుణ ఆరు కథలు రాసింది. వాటిని ఈ చిన్న పుస్తకంలో పొందుపరుస్తున్నాం.

కా. అరుణకు తల్లిదండ్రులు లక్ష్మణరావుగారు, శాంతిగారు పెట్టుకున్న పేరు వెంకటరవివర్మ చైతన్య. అమరత్వం నాటికి ఆమె వయసు 45 యేళ్ళు. స్వస్థలం విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం కరకవాని పాలెం. తండ్రి ఉపాధ్యాయుడిగా పనిచేశారు. కమ్యూనిస్టు కుటుంబం కావడంతో నిత్యం వారిల్లు కమ్యూనిస్టు పార్టీల కార్యకర్తలతో కోలాహలంగా ఉండేది. మహిళా సంఘం కార్యకర్తలు వాళ్ళ ఇంట్లో తరచూ కలుసుకొనేవారు. ఎన్నో ప్రగతిశీల చర్చలు జరిగేవి. పాటలు సాగేవి. తల్లిదండ్రులు ఎంతో ఇష్టంగా పెట్టిన పేరును సార్థకం చేస్తూ చిన్న వయసులోనే చైతన్య తనను కూడా మీటింగ్ లకి తీసుకుపోవాలని ఇంటికి వచ్చిన మహిళా సంఘం అక్కల వెంటబడేది. 1980 జనవరి 23 న పుట్టిన చైతన్యకు తెలుగు రాష్ట్రాలలో సారా వ్యతిరేక పోరాటం ఉవ్వెత్తున సాగుతున్న కాలానికి కేవలం పన్నెండేళ్ళ వయసు. కానీ ఆమె చైతన్యానికి వయసు అడ్డం కాలేదు. స్త్రీ శక్తి నాయకురాలు రమ రాసిన “సారా మాను, సారా మాను…నా బంగారి మామయ్యా…” పాటకి చైతన్య చక్కగా అభినయం చేస్తూ క్యాంపెయిన్లలో పాల్గొంది.  ఈనాటికీ ఆ జ్ఞాపకాలను వాళ్ళు తలుచుకొని ఆ బంగారు పాపే ఇప్పుడు ఇందరి ఆదరాభిమానాలను పొందిన అరుణక్కగా ఎదిగిందా అని ఆశ్చర్యంగా అభిమానంగా ప్రేమగా తలచుకొని వలపోసుకుంటున్నారు.

పదహారేళ్ళ వయసు నాటికి అనేక మహిళా సమస్యల మీద పనిచేస్తున్న మహిళా సంఘంలో కార్యకర్తగా తన క్రియాశీలతను పెంచుకుంది. ఆ కాలంలోనే ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నించడం నేర్చుకుంది. ఈ సమాజంలో మనచుట్టూ నిత్యం జరుగుతున్న ఎన్నో అన్యాయాలను, చిన్నవైనా  పెద్దవైనా  సరే మనకెందుకులే అనుకోవడం కాదు ప్రశ్నించాలి అని దృఢంగా భావించింది. ఇతరులకు చెప్పింది. చేసి చూపించింది.  ప్రశ్నించడం మార్పుకోసం జరిగే ఆచరణకి తొలి అడుగు అని గుర్తించింది. ఆ అనుభవంతోనే 1999 లో “ప్రశ్నిస్తేనే…” అన్న కథ కూడా రాసింది. ఇది లక్ష్మీ దుర్గ పేరుతో మహిళామార్గం పత్రికలో అచ్చయ్యింది.

మహిళా సమస్యలకి సమాజంలోని ఇతర ప్రజా సమస్యలకి ఉన్న గతితార్కిక సంబంధాన్ని చైతన్య అర్థం చేసుకుంది. స్త్రీ విముక్తి జరగాలంటే శ్రమ విముక్తి జరగాలి. శ్రమ విముక్తి జరగాలంటే ఉత్పత్తిలో స్త్రీల భాగస్వామ్యం పెరగాలి. స్త్రీలు ఉత్పత్తిలో పాల్గోవాలంటే పితృస్వామ్య బంధనాలు తెంచుకోవాలి. ఇవన్నీ ఒకదానికొకటి ఎలా ముడిపడి ఉన్నాయో అర్థం చేసుకున్న చైతన్య ఇంక తన పోరాట భాగస్వామ్యానికి పరిమితులు పెట్టుకోదలుచుకోలేదు.  ఓపెన్ యూనివర్సిటీలో బి‌ఏ మొదటి సంవత్సరం చదువుతుండగానేవిప్లవోద్యమంలో పూర్తికాలం పనిచేయడానికి నిర్ణయించుకుంది.

చైతన్యకు ఒక చెల్లి తమ్ముడూ ఉన్నారు. చెల్లెలు ఝాన్సీ విశాఖపట్నంలోని గంగవరం పోర్టు మత్స్యకారుల పోరాటంలో స్త్రీశక్తి మహిళా సంఘం తరుఫున చాలా క్రియాశీలంగా పాల్గొని అరెస్టు అయ్యింది. జైలులో ఉన్న సమయంలో అనారోగ్యంతో ఉన్న ఆమెను హాస్పిటల్ కి తీసుకుపోవడానికి నిరాకరించిన జైలు అధికారులతో గట్టిగా పోరాడింది. ఆ  సమయంలో ఆమెను కూడా ప్రమాదకరమైన మావోయిస్టు అంటూ  హాస్పిటల్ బెడ్ కి ఇనుప గొలుసులు వేసి కట్టి ఉంచారు. ఆ ఘటన పట్ల పెద్ద ఎత్తున నిరసన పెల్లుబికింది. ముగ్గురు పిల్లల్లో పెద్దదయిన చైతన్య ప్రభావం చెల్లెలి మీద తమ్ముడి మీదా కూడా ఉందని చెప్పొచ్చు.

చైతన్య అజ్ఞాత జీవితంలోకి వెళ్లి కామ్రేడ్ అరుణ అయ్యింది. రెండున్నర దశాబ్దాల పాటు మన్యం ప్రజలను విప్లవోద్యమంలోకి సమీకరించింది. శత్రువుకు కంటినిండా నిద్ర లేకుండా చేసిందనడానికి ఒక గొప్ప ఉదాహరణగా ఈ రోజు ఆంధ్రా ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలపై, విప్లవకారులపై ఎన్ని ఉపా కేసులు పెట్టారో అన్నిటిలోనూ అరుణ పేరు ఉండడాన్ని చెప్పుకోవచ్చు. వివిధ హోదాల్లో పనిచేస్తూ రాష్ట్ర స్థాయి నాయకురాలిగా ఎదిగింది.

తనకన్నా ఎనిమిదేళ్ళ చిన్నవాడైన తమ్ముడు గోపాలరావు కూడా అరుణ బాటలో నడిచి విప్లవోద్యమంలో చేరాడు. పదహారేళ్ళ వయసులో కుటుంబ ఆర్థిక పరిస్థితి చదువుకి అనుకూలించకపోతే ఒకవైపు చిన్న కాఫీ హోటల్లో పనిచేస్తూనే చదువుకోడానికి ప్రయత్నించాడు. కానీ మరోవైపు దేశాన్ని కొనెయ్యగలిగినంత సంపదలు కొందరి దగ్గర పోగుపడడంలోని మతలబుని కూడా అర్థం చేసుకొని పోరుబాట పట్టాడు. సాయుధపోరు జెండాలెగరేశాడు. గోపాల రావు ఆజాద్ గా పరిణామం చెందాడు. ఒకసారి అరెస్టు అయ్యి చిత్రహింసలకి గురయినప్పటికీ మళ్ళీ పుంజుకుని 2009 లో విప్లవోద్యమంలోకి తిరిగి వెళ్లిపోయాడు. గాలికొండ ఏరియా దళ కమాండర్‌గా పనిచేస్తున్న సమయంలో 2016లో అప్పటి విశాఖ జిల్లా కొయ్యూరు–జీకేవీధి అటవీ ప్రాంతం మర్రిపాకల వద్ద జరిగిన ఎన్‌కౌంటర్లో ఆజాద్‌ అమరుడయ్యాడు.

ఉద్యమ సహచరుడైన కామ్రేడ్ చలపతిని వివాహం చేసుకుంది. రాష్ట్ర నాయకుడుగా పనిచేస్తున్న కామ్రేడ్ రామచంద్రారెడ్డి @ చలపతి ఒడిశా–చత్తీస్‌గఢ్‌ సరిహద్దు గరియాబంద్‌ జిల్లా కుల్హాడీఘాట్‌ అటవీ ప్రాంతంలో కేంద్ర భద్రతా బలగాలతో 2025 జనవరి 21 న జరిగిన ఎన్‌కౌంటర్‌లో అమరుడయ్యాడు.

ఆరు నెలల తరవాత 2025 జూన్ 18 వ తేదీ తెల్లవారుఝామున కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి@ గణేష్, కామ్రేడ్ అంజు లతో పాటు కామ్రేడ్ అరుణ మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అమరురాలయింది. అప్పటికి ఆమె ఆంధ్ర ఒడిశా బోర్డర్ జోన్ కమిటీ సభ్యురాలిగా పనిచేస్తోంది.

                                                                                ***

అరుణ విప్లవోద్యమానికి సంబంధించిన అనుభవాలను ఐదు కథలుగా రాసింది. ఈ ఐదు కథలలో కూడా ప్రధానంగా విప్లవోద్యమంలో ప్రజల భాగస్వామ్యాన్ని చిత్రిస్తుంది. ప్రజలకు విప్లవోద్యమంపైనా, విప్లవ పార్టీ పైన ఉన్న అపారమైన భరోసా గురించి, వారు ఏం కోరుకుంటున్నారనేదాన్ని గురించి అద్భుతంగా చిత్రించింది. తాను విప్లవోద్యమం గురించి రాసిన మొదటి కథ “కరవుదాడి”. ఈ కథ 2002 లో తూర్పు కనుమలో అచ్చయ్యింది. ఉత్తరాంధ్రలో నెలకొన్న కరువు పరిస్థితుల్లో ప్రజలు ఎదుర్కొన్న తీవ్రమైన కడగండ్లను వారి మాటల్లోనే వర్ణిస్తుంది. తినడానికి ఏమీ దొరకక మామిడి టెంకలతోనూ జీలుగు పిక్కలతోనూ అంబలి చేసుకొని తాగి బతుకులు వెళ్లమారుస్తున్న ప్రజలను “ఆకలితో చచ్చిపోదామా? పోరాడి చచ్చిపోదామా?” అని అడుగుతుంది. చివరకు  పది పన్నెండు గ్రామాల ప్రజలను సమీకరించి గెరిల్లా దళం నాయకత్వంలో 200 మంది ప్రజలు చేసిన కరవుదాడి విజయవంతమైన సందర్భంలో భావోద్వేగాలతో వాళ్ళ కళ్ల నుండి జాలు వారిన కన్నీళ్లను గురించి, ఎంత కష్టమైనా సరే సాధించుకున్న ఫలితాన్ని నిలబెట్టుకోడం అంటే తమ పసిపిల్లల ప్రాణాలు నిలబెట్టుకోవడమే అని భావించిన ప్రజల భావాలను చిత్రిస్తుంది. ఆ సందర్భంలో ఏడు పదులు మీద పడిన ఒక వృద్ధుడు చెప్పిన సుద్దుల గురించి కూడా నమ్రతగా గౌరవంగా నమోదు చేస్తుంది. ఆ నాటి శ్రీకాకుళ పోరాటంలో అమరులు సత్యం,కైలాసాలతో భుజం కలిపి పోరాడి, తూటా దెబ్బ తిని ఇప్పటికీ ఆ గాయాన్ని గర్వంగా చూపించుకొనే ఆ పెద్దాయన నుండి స్పూర్తి పొందుతుంది. ఆ పెద్దాయన మాటలు మనకీ స్పూర్తి కలిగిస్తాయి.

“కామ్రేడ్‌, నాకు మళ్లీ పూర్వం పోరాటకం గుర్తుకొస్తోంది. అప్పుడు భూస్వాములపై మేము చేసిన దాడులు గుర్తొస్తున్నాయి. కొండబారిడి మేష్ట్రు అప్పుడే చెప్పాడు – యిప్పుడు మనం చచ్చిపోయినా, మళ్లీ తప్పకుండా మన పార్టీ వస్తాది – అని. ఇదిగో, యిదే నిజమైన సత్యం (వెంపటాపు సత్యం) పార్టీ. మనం పోరాడితేనే మన కష్టాలు తీరతాయి. మాకు వయసైపోయింది. మేము ముసలి అయిపోయాం. పోరాటానికి సాల్లేము (చాలలేను) కానీ, కుర్రాళ్లందరూ పోరాటం చేయాలి. ప్రజా సైన్యంలో కలవాలి. పోరాడితేనే మన రాజ్యం వస్తుంది. అప్పుడే మన బతుకులు మారతాయి. మీరంతా ధైర్యంగా ఎల్లండి…”

బహుశా  ఇరవై రెండేళ్ల వయసులో రాసిన ఈ కథ లోని కరువుదాడిఅరుణకీ మొదటి అనుభవమే అయివుండొచ్చు.

దేశాన్ని కుదిపేసిన ఎర్రదాడుల్లో ఒకటి కోరాపుట్ దాడి. శత్రువు నుండే ప్రజాయుద్ధానికి కావల్సిన వనరులను సంపాదించుకుంటాం అనే ప్రజాయుద్ధ పంథాని అమలుచేస్తూ సాగిన కోరాపుట్ దాడికి ముందు జరిగిన ఏర్పాట్లు, ప్రజల భాగస్వామ్యం, రెయిడ్ నుండి తిరిగి వెళ్తున్న క్రమంలో అమరులైన కామ్రేడ్స్ ..వీటన్నిటి గురించి ఎంతో హృద్యంగా చిత్రిస్తుంది అరుణ. ఈ కథకు పెట్టిన పేరు సైతం ప్రజాయుద్ధం పట్ల ఒక ఆశ్వాసాన్ని కలిగిస్తుంది. అరుణ చెప్పినట్టు ప్రజాయుద్ధం అప్రతిహతం.

ఒడిశా రాష్ట్రం లోని అడవుల్లో ఎన్ని సంపదలున్నా అత్యంత దారుణమైన దోపిడీ పీడనల ఫలితంగా కరువు కూడా ప్రజల బతుకులను అతలాకుతలం చేస్తోంది. కరువుదాడులు తక్షణ ఉపశమనాలే కానీ పరిష్కారాలు కావు కదా. అందుకే తాము పోగొట్టుకొన్న భూములను తిరిగి సాధించుకోడానికి కోరాపుట్ జిల్లాలోని నారాయణ పట్నా బ్లాకులోని ప్రజలు భూపోరాటం చేపట్టారు. పోరాటం సందర్భంగా గ్రామాలకు గ్రామాలను నేలమట్టం చేసింది రాజ్యం. ప్రజలు వెరవలేదు. అడవిలోని లోతట్టు ప్రాంతాలకు పోయి చిన్న గుడిసెలు వేసుకొని కలో గంజో తాగుతూ విప్లవ పార్టీ అండతో పోరాటం కొనసాగించారు. నాశనమయి పోయిన తమ ఇళ్లనుండి తెచ్చుకోడానికి ఏమీ మిగలలేదు ఆ ఒక్కటి తప్ప…. దానినే గుండెల్లో దాచుకొని భద్రంగా తెచ్చుకున్నారు. దేనిని చూస్తే ఈనాటికీ పాలకుల కాళ్ళు భయంతో ఒణుకుతాయో, దేనిని చూస్తే ప్రజల గుండెలు ధైర్యంతో ఉప్పొంగుతాయో… అదే…ఎర్రజెండా! శ్వేత పేరుతో రాసిన అద్భుతమైన కథ.

ఇంక మావోయిస్టుల పని అయిపోయిందనీ, ప్రజలు వాళ్ళని రానివ్వడం లేదనీ పాలక వర్గాల మీడియా విష ప్రచారం చేస్తున్నపుడు అసలు క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏంటి? నిర్బంధాన్ని ప్రజలు ఏవిధంగా చూస్తున్నారు అనే విషయాలను తడుముతూ “చరిత్ర ఎప్పుడూ మునుముందుకే” పోతుందని అరుణ సాధికారంగా తేల్చి చెప్తుంది.

“అమావాస్య చీకట్లో మిణుగురులు మిలమిలా మెరుస్తున్నాయి. ఆకాశంలో నక్షత్రాలు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. పున్నమి నాటి వెన్నెల్లో అవి వెలవెలబోతాయి. అంటే అవి లేనట్టు కాదుకదా! ప్రజలు కూడా అంతే. అణచివేత మరింత తిరుగుబాటుకే దారితీస్తుంది. ప్రజలే తమ ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకుంటారు. కమ్యూనిస్టు పార్టీ చేయాల్సినదల్లా ఎంఎల్‌ఎం సిద్ధాంతంతో ప్రజలను చైతన్య పరచి రాజుకుంటున్న నిప్పును మరింత ఎగదోయడమే!” అంటూ నిర్బంధ ప్రాంతాల్లో మౌనం నివురు గప్పిన నిప్పు మాత్రమే అని మనకు హామీ ఇస్తుంది.

చివరగా రాసిన కథ వేగుచుక్క. తమ బిడ్డల్ని కోల్పోయిన తలిదండ్రుల కోసం ఈ కథ రాసింది. “ఇది మా అమ్మానాన్నల కోసం, బిడ్డల్ని కోల్పోయిన తల్లిదండ్రులందరి కోసం” అని చెప్తూ రాసిన ఈ కథ ఎంతో భావోద్వేగంతో రాసింది. తమ కొడుకుని పోగొట్టుకున్న అరుణ తల్లిదండ్రులు ఇందులో పాత్రలు. ఆ అంతులేని దుఖాన్ని తన తల్లిదండ్రులు ఎలా భరించారో అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తూ అమరుల బంధు మిత్రుల సంఘంలో పని చేయడం ద్వారా వారి దుఖం ఇంక ఎంత మాత్రం వ్యక్తిగతం కాదని,అది ఒక సామూహిక దుఖంగా మారినపుడే ఒక బలమైన ఆయుధంగా మారుతుందనీ తన తల్లిదండ్రులు అలా ఉండాలని ఆకాంక్షించడమే కాదు అలా ఉన్నందుకు గర్వపడుతూ రాసిన కథ వేగుచుక్క. అంకిత పేరుతో రాసిన ఈ కథే అరుణ చివరి కథ. ఆ కథలోని తన తండ్రి పాత్రతో పలికించిన మాటలు తమ కొడుకుని మాత్రమే కాదు ఇప్పుడు కూతుర్ని కోల్పోయిన సందర్భంలో కూడా అంతే వర్తిస్తాయి. తన తల్లితండ్రులకే కాక తన ఆత్మీయులని కోల్పోయినఅందరికీ అరుణ ఇచ్చిన చివరి పిలుపు ఇదే.

“అమరవీరుల త్యాగాల స్ఫూర్తిగా, వారి కలలను సాకారం చేసేందుకు మనకు చేతనైనంత చేద్దాం. బిడ్డల్ని కోల్పోయిన తల్లిదండ్రులకు మనమే బిడ్డలమవుదాం. తల్లులను, తండ్రులను కోల్పోయిన బిడ్డలకు మనమే తల్లిదండ్రులమవుదాం. అమరవీరుల కుటుంబాలకు బంధుమిత్రులమవుదాం’…..”

అంతే కాదు తమ్ముడి పాత్రతో ఎంతో ఉద్వేగంతో తల్లిదండ్రులకు ఇచ్చిన ఆ చివరి సందేశం ఈరోజు యావద్భారతంలోని ప్రజలందరికోసం కూడా.

“లక్షలాది పోలీసు బలగాల మధ్య మన పార్టీ, ఉద్యమం ఎలా మనగలుగుతుందనిమీకు ఆశ్చర్యమనిపించవచ్చు. సుఖమెరుగని కష్ట జీవులు మా చుట్టూ వున్నారు. తమ బ్రతుకులు మారాలనీ, దోపిడీ రాజ్యాన్ని అంతం చేయాలనీ, అందుకు యుద్ధమే ఏకైక మార్గమనీ, ప్రజా సైన్యం లేకుంటే తమకేమీ లేదని నమ్మి తమ సైన్యాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. శత్రువు పెట్టే చిత్రహింసలను నిత్యం భరిస్తూ ఎంతో కసితో, సాహసంతో వాడి లోపాలను, బలహీనతలనూ అధ్యయనం చేసి మాతో కలిసి అదును చూసి వాడిని దెబ్బ కొడుతున్నారు. వారు ఆకలితో అలమటిస్తూ మాకు అన్నం పెడుతున్నారు. అందుకు వారు అనేక అత్యాచారాలకు గురవుతున్నారు. అయినప్పటికీ వారు మమ్మల్ని ఆదేశిస్తున్నారు. యుద్ధం ఆపవద్దనీ, శత్రువును పూర్తిగా నిర్మూలించాలని అంటున్నారు. చరిత్రలో ప్రజా యుద్ధాలన్నీ గెలుపు ఓటముల గూండా పయనించి చివరకు గెలిచాయి. మనమూ గెలుస్తాం. దేశంలో శతృసైన్యం లక్షల్లో వుంది. అయితేనేం! మన పీడిత ప్రజలు కోట్లలో వున్నారు. న్యాయమైన ప్రజా యుద్ధంలో అంతిమ విజయం ప్రజలదే”.

రెండున్నర దశాబ్దాల విప్లవ జీవితంలో రాష్ట్ర స్థాయి నాయకత్వంలో అత్యంత కఠోరమైన భౌగోళిక ప్రాంతంలో అత్యంత కఠినమైన రాజకీయ పరిస్థితుల్లో తడబడకుండా శత్రువుతో తలబడి చివరివరకూ పాలక వర్గాల గుండెల్లో ప్రకంపనలు సృష్టించి చివారిదాకా దృఢంగా నిలబడిన వీరయోధ అరుణకు లాల్ సలాం. ఆమె స్మృతుల లాగానే ఈ కథలు కూడా అజరామరం.

Leave a Reply