ఈ ప్రపంచంలో అమ్మాయిగా జీవించడం అంటే భయంతో, జాగ్రత్తలతో, అనేక అడ్డంకులతో నడవడం అని చెప్పిన అతిశయోక్తి కాదు. అమ్మాయి ఎంత బలంగా ఉన్నా, ఎంత చదువుకున్నా, ఎంత ఆత్మవిశ్వాసం ఉన్నా ఆమె బయటికి వెళ్లే ప్రతిసారి, ఫోన్ పట్టుకునే ప్రతిసారి, రోడ్డు మీద నడిచే ప్రతిసారి ఒక చిన్న భయం ఆమె మనసులో ఉండక తప్పదు. ఎందుకంటే పబ్లిక్ ప్రదేశాల్లో జరుగుతున్న వేధింపులు ఏళ్ళుగా ఉన్న, ఇప్పుడు అది కాదు  ఫోన్లలో, సోషల్ మీడియాలో కూడా వేధింపుల రూపం పెరిగిపోయింది. అమ్మాయిలకు రెండు వైపులా ప్రమాదాలు పెరుగుతున్నాయి

పబ్లిక్ ప్రదేశాల్లో అమ్మాయిలపై వేధింపులు చాలా కాలంగా ఉన్నాయి. రోడ్డు మీద నడచినా, బస్సులో ప్రయాణించినా, కాలేజీకి వెళ్లినా, మార్కెట్‌కి వెళ్లినా  చాలా మంది అశ్లీల చూపులు వేయడం,  అనవసర కామెంట్లు చేయడం, వెంబడించడం, crowd పేరుతో దగ్గరగా తాకే ప్రయత్నం చేయడం నిత్యకృత్యంగా అయిపోయింది. ఇలాంటి ప్రవర్తనను చాలామంది నవ్వుతూ “సాధారణం” లేదా “చిన్న విషయం” అని చూస్తారు. కానీ అమ్మాయిలకు అది చిన్న విషయం కాదు. ఆమె మనసులో ఆ క్షణం భయం, అసహ్యం, దూరంగా ఉండాలి అనే భావన, మళ్లీ ఆ ప్రదేశానికి వెళ్లకూడదనే నిర్ణయం అన్నీ కలిసిపోతాయి. ఇది ఆమె జీవనశైలిని మార్చేస్తుంది.

పబ్లిక్ ప్రదేశాల్లో వేధింపులు జరిగినప్పుడు చాలా మంది అమ్మాయిల మొదటి ప్రతిస్పందన మౌనం. ఎందుకంటే ఎదురు మాట్లాడితే సమస్య పెరుగుతుంది అనే భయం, ఎవరూ సహాయం చేస్తారో లేదో తెలియదనే సందేహం, నింద అమ్మాయిపైనే పడుతుందన్న నిజం. కొన్నిసార్లు అమ్మాయి ఆ సందర్భంలో “stop” అని చెప్పినా, ఆమెను చూసే చూపులు “నువ్వే ఎందుకు రియాక్ట్ అవుతున్నావు?” అని ప్రశ్నిస్తాయి. కానీ వాస్తవం ఏమిటంటే, వేధింపులు చేస్తున్న వ్యక్తిది తప్పు, అమ్మాయిది కాదు. అయినా కూడా సమాజం ఈ విషయం అర్థం చేసుకోవడానికి ఇంకా ఎంతో దూరంలో ఉంది.

ఇప్పుడు కొత్తగా పెరిగిపోతున్న సమస్య , డిజిటల్ హరాస్‌మెంట్‌. ముందు పబ్లిక్ ప్రదేశాల్లో మాత్రమే జాగ్రత్తగా ఉండాల్సి వచ్చేది. కాని ఇప్పుడు అమ్మాయిలు తమ ఫోన్‌ను తెరిచినా కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. సోషల్ మీడియా అవకాశం ఇచ్చింది, అవును. కానీ అదే వేదికను కొంతమంది పురుషులు అశ్లీలంగా ప్రవర్తించడానికి వాడుతున్నారు. అమ్మాయి ఒక ఫోటో పెట్టినా, ఆమెకు తెలియని వ్యక్తుల నుంచి అశ్లీల వ్యాఖ్యలు రావడం చాలామందికి రోజువారీ అనుభవం అయిపోయింది. అనవసరంగా మెసేజ్‌లు పంపడం, అమ్మాయి స్పందించకపోతే కూడా మళ్లీ మళ్లీ మెసేజ్ చేస్తుండడం, వారు ఆమె ప్రొఫైల్‌ను గంటల తరబడి చూస్తుండటం, ఆమె ఫోటోలను save చేసి వేరే విధంగా ఉపయోగించడానికి ప్రయత్నించడం  ఇవన్నీ అమ్మాయిలను తీవ్రంగా అసౌకర్యానికి గురిచేస్తున్నాయి.

కొన్ని సందర్భాల్లో అమ్మాయిల ఫోటోలు తీసుకుని వాటిని zoom చేసి, శరీరాన్ని అశ్లీలంగా విశ్లేషించడం, ఆ ఫోటోలను మిస్యూస్ చేయడం, deepfake వంటి కొత్త టెక్నాలజీతో ఆమె ముఖాన్ని మళ్లీ వేరే దేహంపై పెట్టి అశ్లీల చిత్రాలు తయారు చేయడం కూడా జరుగుతోంది. ఇది కేవలం వేధింపులే కాదు , అమ్మాయిల జీవితాన్ని నాశనం చేస్తున్న నేరం. ఇలాంటి నేరాలు జరుగుతున్నా కూడా, చాలా మంది అమ్మాయిలు భయంతో మాట్లాడరు. ఎందుకంటే వేధింపుల విషయం బయట పెట్టగానే కొందరు మొదట అడిగేది , “ఏమి పెట్టింది ఫోటో?” “ఎవరితో మాట్లాడింది?” “ఎందుకు స్పందించింది?” అంటూ blame మార్చడానికి ప్రయత్నించడమే.

వాస్తవానికి తప్పు అమ్మాయిలో లేదు.

సమస్య పురుషుల ప్రవర్తనలో ఉంది.

అమ్మాయి ఫోన్ వాడకూడదని, బయటకి వెళ్లకూడదని కాదు.

వేధించే వాళ్లు మార్చుకోవాలి, శిక్షకు భయపడాలి.

డిజిటల్ హరాస్‌మెంట్ మరో సమస్య ఏమిటంటే, ఇది అమ్మాయి మనసుపైనే చాలా ప్రభావం చూపుతుంది. బయట జరిగే వేధింపులో కనీసం ఎవరో కలిసి ఉన్నారు. కానీ మెసేజ్‌లలో జరిగే వేధింపులు అమ్మాయి ఒంటరిగానే భరిస్తుంది. ఆమె ఫోన్ తెరిచిన ప్రతిసారి ఏదో ఒక అసభ్యకరమైన మెసేజ్ కనిపిస్తే ఆమె ఆత్మవిశ్వాసం తగ్గుతుంది, అసౌకర్యంగా ఉంటుంది, ఎవరి ముందు మాట్లాడడానికైనా భయపడుతుంది. ఇది ఆమె సోషియల్ లైఫ్‌ను కూడా ప్రభావితం చేస్తుంది. కొంతమంది అమ్మాయిలు భయంతో సోషల్ మీడియా వాడటం పూర్తిగా మానేస్తారు. కొంతమంది depression‌కి గురవుతారు. మరి కొందరు ఎవరికీ చెప్పకుండానే ఆ బాధను లోపల దాచుకుంటారు.

ఈ పరిస్థితిలో అమ్మాయిలకు చేయాల్సినవి కొన్ని ఉన్నాయి కానీ ఇవి తప్పు వాళ్లదని కాదు. భద్రత కోసం, తమ మనసు కోసం, తమ ఆత్మగౌరవం కోసం అయిపోతుంది. అమ్మాయిలు తమ ప్రైవసీ సెట్టింగులను బాగా వాడుకోవాలి. ఎవరికీ వ్యక్తిగత సమాచారం ఇవ్వకూడదు. వేధింపులు వచ్చినప్పుడు స్క్రీన్‌షాట్ తీసుకుని evidenceగా ఉంచుకోవాలి. బ్లాక్ చేయడం, రిపోర్ట్ చేయడం అవసరం. పబ్లిక్ ప్రదేశాల్లో కూడా తాము unsafe అనిపిస్తే గట్టిగా stop చెప్పడం, అక్కడినుంచి దూరం కావడం, అవసరమైతే పోలీసులకు చెప్పడం చేయాలి

అయితే, ఈ బాధ్యత అంతా అమ్మాయిలపైనే ఉండకూడదు. ప్రభుత్వం కూడా తన భాగం పూర్తిగా చేయాలి. పబ్లిక్ ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఉండాలి. మహిళల కోసం ప్రత్యేకంగా హెల్ప్‌లైన్లు పనిచేయాలి. డిజిటల్ హరాస్‌మెంట్‌కి కఠినమైన శిక్షలు ఉండాలి. సైబర్ టీమ్‌లు వెంటనే రెస్పాండ్ చేయాలి. deepfake, image misuse లాంటి నేరాలకు ప్రత్యేక చట్టాలు ఉండాలి. అలాగే పాఠశాల స్థాయిలోనే పిల్లలకు ఇతరుల గౌరవం గురించి, లింగ సమానత్వం గురించి, consent గురించి నేర్పాలి. అబ్బాయిలకు అమ్మాయిలను objectలా కాకుండా మనిషిలా చూడడం నేర్పాలి.

సమాజం కూడా మారాలి. అమ్మాయి వేధింపుల గురించి చెబితే ఆమెను blame చేయకూడదు. ఆమెకు మద్దతు ఇవ్వాలి. ఆమె experienced చేసిన విషయం చిన్నది కాదు అని అర్థం చేసుకోవాలి. “సర్దుకో” అనే మాట ఒక అమ్మాయి జీవితాన్ని మరింత నాశనం చేస్తుంది. మనం వినాలి, అర్థం చేసుకోవాలి, ఆమెకు తోడుగా నిలవాలి.

పబ్లిక్ వేధింపులతోనూ, డిజిటల్ వేధింపులతోనూ అమ్మాయిలు ఎంత బాధపడుతున్నారో నిజంగా సమాజం అర్థం చేసుకునే రోజు ఎప్పుడొస్తుందో తెలియదు. కానీ అమ్మాయిలకు కావలసింది పెద్దది కాదు — కొంచెం గౌరవం, కొంచెం భద్రత, కొంచెం స్వేచ్ఛ. వాళ్లు బయటికెళ్లడానికి భయపడని ప్రపంచం కావాలి. వాళ్లు ఫోటో పెట్టడానికి భయపడని సోషల్ మీడియా కావాలి. వాళ్లను objectలా కాకుండా మనిషిలా చూసే సమాజం కావాలి.

ఈ ప్రపంచం అమ్మాయిలకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఒక్కటే ..భయంలేని జీవితం.

ఎం.ఎస్ సి  కంప్యూటర్ సైన్స్,
ఉస్మానియా విశ్వవిద్యాలయం,హైద్రాబాద్.

Leave a Reply