కవితే…కవిత్వమై పుస్తకమంతా పరిమళించారు, పరిణమించారు. స్పందించే హృదయాల్ని సంకెళ్లతోనే కాదు, కవిత్వాలతో కూడా బంధించగలరని ఈ పుస్తకాన్ని చదివాకే అర్ధమైంది.
సమస్త గాయాలకి లేపనంగా లోపలెక్కడో చివురంత ప్రేమ తనమీద తనకే కాదు, తన అక్షరాలపై మనకీ ప్రేమని పుట్టిస్తాయి. కలవరపెడుతూనే, కలబడేలాచేస్తాయి. కవిత కుందుర్తి గారు కేవలం తనకోసమే కాదు, “జస్ట్ ఎ హౌజ్ వైఫ్” అని అనిపించుకుంటున్న ఆడవాళ్లనీ, ఉద్యోగాలు చేస్తూ కూడా తగినంత గౌరవం, స్వాతంత్రం లేని ఆడపిల్లలందరిని తనలో కలుపుకొని జస్ట్ ఎ హౌజ్ వైఫ్ అనే కవిత్వ సంపుటిని ప్రచురించారు .
తనని తానే ఒత్తిగిల్లుకొని మెరిసే నక్షత్రమవుతారు. ఒంటరితనం మనిషిది కాదు, జ్ఞాపకాలతో గుచ్చే కాలనిదని ఎక్కడో ముసుగేసుకొను ఓ మూలన మూలుగుతున్న నిజాన్ని మన ముందు లాక్కొచ్చి మరీ కూర్చోబెడతారు. దేశం కాని దేశంలో… స్వదేశంపై ఒలకబోసుకున్న ప్రేమలు ఇందులో కనబడతాయి. “నువ్వు గీయలేదుగానీ, నేనెన్నో గీతలు దాటాను” అంటూ తనపై తండ్రికున్న ప్రేమను వెల్లిబుచ్చుతూ, తండ్రిపై తనకున్న ప్రేమను వెల్లడించారు. ఒక నిర్బంధ కనుల జత కత్తిపడవలా మారి, కన్నీటినదిలో, స్వేఛ్చాప్రవాహమావడానికి గాయాల రుతువవుతుందని కొత్త శిల్పంగా మలచి వర్ణిస్తారు. అవమానాల వానల్లో తడిచి వణికినపుడు జాలి గొడుగైనా పట్టనివారికి ప్రశ్నల వర్షం కురిపించే హక్కేక్కడిదని నిలదీసారు. ఆకాశాన్ని తలపాపిటలా తీసి, దాచిన వెలుగుల్ని దారంతా చుక్కల్లా పరిచిందని నాగరికత తెరచాటు నుండి తొంగి చూస్తున్న రూపంలోని దట్టమైన అడవుల్ని, అందులో రేగిన అలజడుల్ని ఏ కెమెరా కన్ను బంధించగలదని హృదయ విదారకంగా ప్రశ్నిస్తారు. మంచు బిందువులకి ‘చల్లని’ ముద్ర ఎలాగైతే అనవసరమో, ఒక స్త్రీ తనని తాను నిరూపించుకోవాల్సిన అవసరం కూడా లేదని నిర్మొహమాటంగా చెప్పారు. “నిన్ను రాయిలా మేమెంత మార్చినా, మెత్తదనాన్ని మిఠాయిలా కొంగున దాచావంటూ” అమ్మలోని కమ్మదనాన్ని, సున్నితత్వాన్ని తీయగా తెలిపారు. చంపుకునేవాళ్లే విలన్లయితే నువ్వే లోకంలో అతిపెద్ద విలన్ వి మాకోసం నువ్వెన్ని కోరికల్ని చంపుకున్నావో? అంటూ తల్లి తన పిల్లల కోసం చేసే త్యాగాల్ని వివరిస్తూ ఓ పక్కా అమ్మనయ్యా గానీ, ఆ మృదుత్వం ఇంకా నాకు అబ్బనేలేదంటూ, మరోపక్కా మాతృత్వాన్ని మురిపెంగా మనసుకి ముడేస్తారు. ప్రతీకూతురికి తండ్రే హీరో కానీ, తల్లి పక్కన లేనిదే తండ్రి కాఫీ కప్పులో పంచదార అయినా కరగదని తల్లి గొప్పదనాన్ని కాదు కాదు తల్లులందరి గొప్పతనాన్ని వివరించారు. నీ పెదాలపై నవ్వు కాలేని ముచ్చట్లన్నీ అలిగి కూర్చున్నాయని కదిలించే వాక్యాన్ని మనసుని మెదిలించే విధంగా మలిచారు. ఒక్కమాటలో చెప్పాలంటే, “ఈ పుస్తక పరిమాణం చిన్నదే కావచ్చు కానీ, దాని పరిణామం మాత్రం చాలా పెద్దది” అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.