నిజమే వర్తమాన సమాజం నిలుచున్నదిక్కడే. అసమానతలు అన్యాయాలు రాజకీయ రాబందుల రాక్షస క్రీడలు నెత్తుటి మరకలు  సమాజ దేహానికి కొత్తేం కాదు. ఈ కవిత్వాన్ని ఇష్టంగా ప్రేమగానో రాయలేదు. కవిత వాక్యాలను కన్నీటి సరస్సులో ముంచి మరీ రాశారు. ఈ ప్రపంచం పట్ల బాధ్యతగా రాశారు. కవిత్వ మనోఫలకంపై ఏర్పడే కవితా వాక్యాల ప్రతిబింబాలు పాఠకున్ని ఆలోచింపజేస్తాయి. రాయలసీమలోని అనంతపురం జిల్లాకు చెందిన కవి చం ఆధునిక తెలుగు కవిత్వంలో అరుదైన కవి. అంతే ప్రాపంచిక దృక్పథంతో సమాజాన్ని వీక్షిస్తున్న కవి. వర్తమాన సమాజంలో సంక్లిష్టంగాను తీవ్రమైన  వైరుధ్యాలతో మన ముందు పరచుకొని వుంది. ఈ సంక్లిష్టతను అధిగమించేందుకు ఆయుధం కావాలి. సమాజపు చిక్కుముడిని విప్పి మానవుని చైతన్యపరచడానికి శాస్త్రం లాంటి అక్షరం కావాలి. అందుకే చంశాస్త్రి కవిత్వాన్ని ఆయుధంగా చేసుకున్నారు.  ఒక కత్తుల వంతెనవంతెన అనే ఈ కవిత్వం 2008లో చంశాస్త్రి  తీసుకొచ్చారు. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత  సినారె ఈ కవిత్వానికి ముందుమాట రాశారు. తొలి కవిత అవ్వతో ప్రారంభమవుతుంది. నోస్టాల్జియా తో రాసిన ఈ కవితలో  ప్రతి జీవనశకలంలోనూ అవ్వ నిత్యం దర్శనమిస్తూనే ఉంది, అవ్వను స్మరించడమంటే  ఒక సాంస్కృతిక శోభను అనుభవించడమే.. అంటూ ముగిస్తారు.

జీవితాన్ని ఉన్నతీకరించడమే సాహిత్యం యొక్క అత్యున్నత కార్యమని ఊరికే అనలేదు. అవును వస్తువుగా తీసుకొని అనుభవాల పొలిమేరలను దాటి జ్ఞాపకాల తీరం వైపు కవితను నడిపిస్తారు. ఎంత గాఢత మరి. సాహిత్యంలో మనిషి ముఖ్యం అనగానే  అంటే  అనే ప్రశ్నలు వస్తాయని అంటే మనిషి అనే విషయానికి స్థల కాల నిర్దిష్టత తప్పనిసరి అని పాపినేని శివశంకర్ అంటారు. మరి అవ్వ అనే ఆ మనిషిని అంత మానవీయ కోణంలో ఆవిష్కరించారు.

 1991 తర్వాత సరళీకృత ఆర్థిక విధానాలకు భారతదేశంలో బలైంది. ఈ ప్రపంచీకరణ విష సర్పం భారతీయ సమాజాన్ని కాటేసింది. అందుకే చెంశాస్త్రి ఎలా అనే కవితలో..

 వేయి పడగల బహుళ జాతి సత్యం ముసలి నింపుకున్న అప్పుల తూట్ల వేణువు పాడేది, ప్రియదర్శిని రాగమే. ఈ మట్టిలో మొలుస్తున్నవి విదేశీ విష బీజాలే. బహుళ జాతి గాలానికి చిక్కిన బంగారు చేపకి ప్రాప్త జ్ఞానం కలిగేదెలా ?!

భారతి అగ్రగామి అయ్యేదేలా?

ప్రపంచీకరణపై రాయలసీమ నుండి కూడా బలమైన కవిత్వం వినిపించారు. అందులో చెంశాస్త్రి కూడా ఒకరు. ఆధునికతగా ఆలోచించి ప్రపంచీకరణ పర్యావసానాలు, మనిషి జీవితంపై ఎక్కడెక్కడ ప్రభావితం చూపిస్తున్నాయో సవివరంగా రాసిన కవుల్లో చెంశాస్త్రి ఉన్నారు. దీనిపై ప్రత్యేకంగా ఒక సంపుటి తీసుకురానప్పటికీ తన వంతు పాత్రను మాత్రం పోషించారు. ఈ కవిత్వంలో కల కాదు, ఖల నిజం అనే కవిత రాజకీయ వ్యతిరేక తను తెలియజేస్తుంది. ఇందులో…

బీడు భూమి జీవితాలు మావి, వెన్నెముకలు పిక్కలు దాకా జార్చుకుని కాంక్రీట్ నింపిన గోలాల్ని కొయ్య మెట్లేక్కిస్తుంటాం స్తుంటామంటారు. ఓట్ల కురుక్షేత్ర యుద్ధంలో ప్రజాస్వామ్యం అపహాస్యమయ్యే తీరుని ఈ కవితలు వివరిస్తారు. ఎన్నికల ఓట్ల కొనుగోలు సిద్ధాంతాన్ని ఈ కవిత తూర్పారపడుతుంది. ఏ కవి అయినా  తన కవిత్వ కాలంలో కవిత్వానికి నిర్వచనం ఇవ్వడం పరిపాటి. ప్రతీకవి అలా ఈ కవి ఒక కవి నిర్వచనం ఇచ్చారు.తన కవిత్వం ఇలా..

ఉవ్వెత్తున ఎగిసిపడే సముద్ర ఘోష

ఒక నిరసన గీతిక

ప్రాతినిధ్య గొంతుక

పోరాట నినాదం

తీరని ఆశల ప్రకోపం

అంతరంగ ఉద్వేగం

ఒక అంతర్ముఖీనత

ఒక అనుభవ విస్తృతి

ఒక క్రియాశీలక సూత్రం’ అంటారు. కవిత్వం జీవిత తర్కాన్ని ప్రజలకు కళాత్మకంగా అందించడమే కాకుండా విప్లవీకరించాలి అనే సిద్ధాంతాన్ని ఈ కవి త్రికాల శుద్ధిగా పాటిస్తున్నారు. ప్రజల నుంచి ప్రజలకు అనే సూత్రాన్ని పాటిస్తూ విప్లవ సాధనలో ప్రజల సామూహిక చైతన్యాన్ని మలిచే ఈ కవి  ఈ కవిత్వాన్ని ఆశ్రయించారు.

ఈ కవిత్వంలో గబ్బిలం పాట అనే శీర్షికతో ఒక కవిత ఉంది.

‘గబ్బిలాలు పోట్లాడుకుంటే గుడ్లగూబలు విందు చేసుకుంటాయి. బ్రతుకు తెల్లారకముందే అర్ధరాత్రి వేగుచుక్క మొలవాలి కలిసికట్టుగ గబ్బిలాలు రెక్క విదల్చాలి.

నల్లచెరువులో అరుణకిరణాలు ప్రసరించాలి.’ కవిత రాజమండ్రిలో మాల మాదిగలు ఘర్షణ పడ్డ సందర్భంలో రాశారు.. ఇందులో రెండు విషయాలు స్పష్టంగా చెప్పవచ్చు మొదటిది మాల మాదిగల ఐక్యత కోరుకుంటాడు. రెండోది దళిత  ఉద్యమాలు శృతి తప్పకూడదు అని అంటారు. రాజకీయ విజయ గీతికలు పాడాలి నల్లపావులు గెలవాలి అనే సత్యాన్ని కవి కోరుకుంటారు.  అసమానతల సమాజంలో  సమానత్వాన్ని కోరుకోవడం కవి ప్రగతిశీల భావజాలానికి నిదర్శనం. ఉద్యమం పల్లవి లేని పాట కాదు, తోక తెగిన గాలిపటం కాదు అనే కవితా వాక్యాల ఆశావాద దృక్పథం దళిత ఉద్యమాలకు ఊపిరి పోస్తుంది.    సీమ కవిగా రాయలసీమపై కాసింత ప్రేమా ఉంది.

నిండుకుండలాంటి బాధ ఉంది. తరతరాలుగా సీమకు జరిగిన అన్యాయం కవిని బాధించింది. రక్తపు మడుగు  ఎండిన చెరువు, సీమకు ముఖపత్ర చిత్రం అంటాడు. ఇంతకంటే ఇంకేం చెప్తాం. విషాదాన్ని చెప్పడం కూడా కవిత్వంలో గొప్ప శిల్పాన్ని ఇస్తుంది. రాయలసీమ బతుకు విషాదం. హృదయానికి తాకేలా చెప్పడం కూడా  కవివిజయం సాధించారు. జీవితంలోనూ సాహిత్యంలోనూ కొన్ని ప్రత్యేక విషయాల్ని, ఆ విషయాల సారాన్ని అర్థం చేసుకోవడానికి విషాదం కూడా తోడ్పడుతుంది.

 చం ‘ నీ వొక్కడివి బతికుంటే చాలు ‘ అనే ఒక్క కవితలో రైతు బతుకు ముఖచిత్రాన్ని  దృశ్యంగా చూపిస్తారు. ఈ కవితలో కవిత్వ నిర్మాణ రహస్యాలన్నీ ఉన్నాయి.

‘ప్రకృతి చిన్న చూపు చూచినా రాజకీయసర్పం అడుగడుగుగా కాటేసినా నాగలిమోస్తూ నీవు కనిపిస్తే శిలువమోస్తున్న రక్షకుడు మా వెంట ఉన్నాడని మురిసిపోయాం.

ఎంత వొరుపు వచ్చినా చినుకొస్తుందనే ఆశతో మన్ను తినైనా కరువు నెదుర్కొందాం ఒకరి కొకరు ఉన్నామన్న మొండి ధైర్యంతో

మేంతినే అన్నం నీవు మమ్మల్ని నిలుపుతున్న శ్వాస నీవు నిశ్శబ్దంగా నీప్రాణాలు తీసుకొని మమ్మల్ని ఆదిమానవుల బాటలో వదిలి వెళ్ళిపోతుంటే ఎలా బతకాలంటావ్ ‘ ఈ కవిత చదివినప్పుడు కన్నీళ్లు ఆగవు. రైతు మీద మనం చూపించాల్సింది సానుభూతి కాదు. ఈ ప్రపంచం మీద రైతును బతికించడానికి కార్యాచరణ నిర్దేశించేలా కవిత ఉంది. నిజమే ఈ ప్రపంచం మీద రైతు లేని బతుకు శూన్యం. వస్తువుని శిల్పాన్ని రూపాన్ని సమన్వయ పరుస్తూ కవిత రాశారు. ఈ కవిత్వాన్ని చదివిన నలుగురు ప్రముఖులు నాలుగు మాటలు రాశారా అవి పరిశీలిద్దాం.

ఈ కవితల్లో సూటిగా, ధాటిగా చెప్పే గుణం అధికంగా ఉంది. విభిన్న సమకాలీన సామా జికాంశాల పైన చం. రాసిన కవితలు ఆలో చింపజేసేవే కాదు, ఆవేశింపజేస్తాయి కూడా.

-డా. సి. నారాయణరెడ్డి

వర్తమాన సామాజిక విషాదాన్ని ఎత్తి చూపుతూ, తను చూసిన సందర్భాన్ని, వ్యక్తిని, ఘటనని అదే గాఢతతో అందించడమేకాక ఒక వస్తువు కవిత అయ్యే క్రమంలో కవి ఊహాశక్తి ప్రధాన పాత్ర వహిస్తుంది….. చం.కి దృశ్యమానం చేసే ఒక గొప్ప నైపుణ్యం వుంది.

 -కె. శివారెడ్డి

ఏముందీ సంపుటిలో? వర్తమాన జీవన చిత్రముంది కవిత్వపాదాలై సాంద్రంగా వుంది. ఒకసారి కాదు, పలుమార్లు దర్శించాలనిపించే దృశ్యసంపద వుంది. పదాలకు రూపాన్నివడంలో ఈ కవి మంచి శిల్పిలాగా కనపడుతున్నాడు.

-దర్భశయనం శ్రీనివాసాచార్య

నీవున్నంత నిండుగా, తృప్తిగా నీ కవిత్వం ఉండదు. తాకితే వెచ్చగా తగుల్తుంది. ముట్టుకుంటే గట్టిగా గుచ్చుకుంటోంది. అసంతృప్తిని రగిలించి వదిలి పెడ్తోంది. నీలో యింత అగ్నిస్పర్శవుందా అన్పిస్తుంది.

-డా. ఎస్. షమీవుల్లా

ఆధునిక తెలుగు కవిత్వానికి వైవిద్యమైన శిల్పంతో, రూప సారాల మేళవింపుతో కవిత్వం రాస్తున్న చంశాస్త్రి మరిన్ని కవితా సంపుటాలు తీసుకురావాలని ఆశిద్దాం.

Leave a Reply