సాగిపోతున్న కాలంలో
రాలిపోతున్న పువ్వులెన్నో
బతికినంత కాలం
సువాసనలు వెదజల్లాలని
ఎంత పరితపించేనో
అందుకే
నేలను తాకుతుంటే
దుఃఖం ఆగట్లేదు
ఎర్రని మోదుగుపూలంటేనే
ఎందుకిష్టమని ఎవరైనా అడిగితే
సమాధానం ఒక్క మాటతో ఆగదు
ప్రవాహమై సాగుతూ
అమరత్వం దగ్గర ఆగుతుంది
చీకటి అలుముకున్న ఈ అడవిలో
ఎంతోకొంత కాంతినిచ్చేది
ఆ మోదుగుపూలే
నాలాంటి బాటసారికి
దప్పిక తీర్చేవి కూడా అవే
అందుకే కాసింత ఎక్కువ ప్రేమ
నరికివేతలో ఒక్కో పువ్వు నేల రాలగానే
చాటుంగానైన ఏరి తెచ్చుకుంటా
ఆ పరిమళపు జ్ఞాపకాన్ని
పదిలంగా దాచుకుంటా.




