మంచి సెల్ ఫోన్ కొనాలని గూగుల్‌లో చెక్ చేసి వదిలేశాను. ఆ తరువాత యే వెబ్‌కు వెళ్ళినా సెల్ ఫోన్ యాడ్సే వస్తున్నాయి. సజెషన్ వచ్చింది కదా అని యూట్యూబ్ వీడియో కూడా వోపెన్ చేసి చూసి నా పనుల్లో పడ్డాను. అంతే, యిక యెప్పుడు నెట్లోకి వెళ్ళినా సెల్లులే సెల్లులు.
సెకండ్ హ్యాండ్ యిల్లు కొనాలని గూగుల్‌లో చెక్ చేసి వదిలేశాను. ఆ తరువాత యే సైట్‌కు వెళ్ళినా రకరకాల యిల్లులు పాతవీ కొత్తవీ వస్తున్నాయి. సజెషన్ వచ్చింది కదా అని యూట్యూబ్ వీడియో కూడా వోపెన్ చేసి చూసి నా పనుల్లో పడ్డాను. అంతే, యిక యెప్పుడు నెట్లోకి వెళ్ళినా యిల్లులే యిల్లులు.
ఎవరో పంపితే లింక్ వోపెన్ చేసి పిల్లుల వీడియో చూసి దానికింద వున్న మరోటి కూడా చూశాను, యిక అంతే… పిల్లులే పిల్లులు.
యూట్యూబ్‌లో పాట చూశాను. ఆ హీరో పాటలు నన్ను వెంబడించాయి. పాతవి చూస్తే పాతవీ కొత్తవి చూస్తే కొత్తవీ. పాటలు కావవి, పాట్లు!
ఏది చూస్తే అదే. ఏది సెర్చ్ చేస్తే అదే. వైరస్‌లా అంటుకుంటోంది. వదిలించుకోవడం నావల్ల కాలేదు. నిజం చెప్పాలంటే మా ఆవిడకన్నా నన్ను యెక్కువ అర్థం చేసుకుంది. నా యిష్టాయిష్టాలు అడక్కుండానే తెలుసుకొని యిస్తోందని అనుకున్నా, కాని కాదని తనే నన్ను సజెస్ట్ చేసి తనవెంట- పాతాళభైరవి సినిమాలో మాంత్రికుడి వెంట హీరోలా రప్పించుకుంటోందని అర్థమయింది.
మిత్రులు చెప్పినట్టు మనం మంచికి వాడితే మంచి- చెడుకు వాడితే చెడు- అని నేనూ నమ్మాను. అందుకే ‘దేశమును ప్రేమించు’ అని సెర్చ్ చేశా. ‘దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా’ అని గురజాడ గేయాన్ని ఆడియోగా వీడియోగా పిల్లలకోసం కార్టూన్‌గా టెక్స్ట్‌గా అనేక రకాలుగా యిచ్చింది. కిందికి స్క్రోల్ చేస్తే ‘దేశాన్ని’ స్ట్రైక్ చేసి ‘ప్రేమించు’ సినిమా వచ్చింది. దానికి సంబంధించిన వికీపీడియా కూడా. ఆ కిందన మళ్ళీ ‘దేశాన్ని’ కొట్టేసి ‘ప్రేమించు పెళ్ళాడు’, ‘ప్రేమించి చూడు’ సినిమాలు కూడా. యూట్యూబ్ పాటల వీడియోలు కూడా. ఆ కిందన ‘ప్రేమించి మోసం చేసిన యువతి’ వార్త… యిక చూడలేకపోయాను. కిందకు వెళితే పదులకొద్దీ పేజీలూ చూపిస్తోంది.
లాభం లేదని మళ్ళీ ‘దేశాన్ని ప్రేమించాలని వుంది’ అని గూగుల్‌లో సెర్చ్ చేయబోతూ ఆగా. ఆలోచించా. ‘ప్రేమించు… నిన్నెవడు వద్దన్నాడు’ అని అంటుందని అనుకున్నాను. నా సమాధానం పక్కన పెట్టి సెర్చ్‌ని డిలిట్ చేసి ‘దైవభక్తికీ దేశభక్తికీ అనుమతి అవసరమా?’ అని సరదాగా కాదు పిచ్చిగా ప్రశ్న వేశా, యేమి సమాధానం యిస్తుందో అని చూశా. ఎంటర్ బటన్ కొట్టా. అంతే, ముందుగా ఏఐ సమాధానం జనరేట్ అయి టాప్‌లో యించ్చిది చదివి వులిక్కిపడ్డాను.
‘దేశాన్నీ దేవున్నీ ప్రేమించడానికి నీకు అనుమతి లేదు. అవి రెండూ…’ పైకి చదవడానికి నోరు రాలేదు, కళ్ళు మూగగా చదివాయి. దైవభక్తికీ దేశభక్తికీ సంబంధించిన పేటెంట్ హక్కులు యెవరికి వున్నాయో మొదలుపెట్టి అన్నీ యిచ్చింది. దేశభక్తులూ దైవభక్తులూ బత్తాయిలుగా యెదుర్కొంటున్న విమర్శని కూడా జతచేసింది. అంతే కాదు దేశమైనా దైవమైనా అది బత్తాయిల సొత్తని తేల్చేసింది.
నాలో కచ్చా పెరిగింది. ఏఐలోకే నేరుగావెళదామని అనిపించింది. అంతలోనే అన్ని రకాల సమాధానాలు చూడొచ్చు కదా ఏఐ కూడా తన సమాధానాలు యిస్తోంది కదా అని తిరిగి గూగుల్‌లో ‘నేను నా దేశాన్ని నాయకుల నుండి మతం నుండి భక్తుల నుండి కుల జాడ్యాల నుండి యీవీయంల నుండి కాపాడుకోవాలని వుంది. ఆడవాళ్ళ పై అత్యాచారాలని ఆపాలని వుంది. అవినీతిని నిర్మూలించాలని వుంది. పేదరికం పోగొట్టాలనివుంది…’ యిలా రాసి అలా సెర్చ్ చేశా, యేమిస్తుందో చూద్దామని. వెంటనే ఏఐ సమాధానం కూడా జనరేట్ అయింది.
‘నువ్వు టెర్రరిస్టువయ్యే అవకాశం వుంది. దేశద్రోహిగా ముద్రపడే అవకాశం వుంది. అధికారిక అనధికారిక నిషేధిత విషయాలు తెలుసుకొని ప్రశ్నించండి. మీ మీద యేయే సెక్షన్లక్రింద కేసులు పెట్టొచ్చో తెలుసుకోవాలని వుందా? కావాలంటే చెప్పండి మరింత సమాచారం యిస్తాను’
చదివి వులిక్కిపడ్డాను.
‘గమనిక’ చదివాను. ఏఐ సమాధానాలలో తప్పులు ఉండవచ్చు. మరింత తెలుసుకోండి- అని కూడా.
ఎందుకో మతమూ భక్తీ అత్యాచారాలూ అవినీతీ పేదరికమూ వీటి వేటి గురించి యే వీడియోలూ రాలేదు. వార్తలూ రాలేదు. ఏదీ సజెషన్లో చూపించేలేదు. వెంటపడలేదు?!
ఊపిరి ఆగినట్టు అయిపోయాను. కాసేపటి తర్వాత తేరుకోవడానికి డైవర్ట్ కావడానికి స్క్రోల్ చేశాను.
‘మీ ఐడియాను మార్కెట్ చేయడం యెలా?’ వీడియో. ప్లే చేశాను. యాడ్స్ వొకదాని తర్వాత వొకటి నడుస్తున్నాయి. స్కిప్ కొట్టాను. వెళ్ళలేదు. యాభైయ్యారు సెకన్లు నా టైమ్ పే చేశాకే తీసుకున్నాకనే ప్లే అయ్యింది.
‘నమస్తే, మనం యెక్కడున్నాం? మార్కెట్లో! యస్… మీరు విన్నది కరెక్టే. మీ ఐడియా యేదైనా మార్కెట్ కాకపోతే అది మాయమైపోతుంది. ఇట్ విల్ బి డెడ్ అండ్ అరైజ్డ్. చెరిగిపోతుంది. మార్కెట్ లేకుండా మనిషి లేడు…’
చెపుతున్నవాడి గొంతు నొక్కాను, రిమోట్‌తో మ్యూట్చేసి.
నన్నూ యెవరో రిమోట్ లేకుండా మ్యూట్ చేశారు?!




