కేంద్రంలోని ఎన్ డి ఏ కూటమి ప్రభుత్వం తీసుకొని వచ్చిన నాలుగు లేబర్ కోడ్లు 2026 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలులోనికి రావడం జరుగుతుంది. నాలుగు లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ దేశంలోని కార్మిక సంఘాలు 2026 ఫిబ్రవరి 12న ఒకరోజు జాతీయ సమ్మెను నిర్వహించడం జరిగింది. దేశంలో గల కార్మిక వర్గం నుంచి విశేష స్పందన వచ్చింది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం వెనకకు తగ్గలేదు సరి కదా మరింత పట్టుదలతో నాలుగు లేబరు కోడ్లను అమలు చేయడానికి ముందుకు వెళుతుంది. వీటికి ముందు చేసిన కొత్త న్యాయ చట్టాలు విషయంలో కూడా ఇదే జరిగింది. దేశంలో గల అన్ని బార్ కౌన్సిళ్లు మరియు న్యాయవాదులు నిరసనలు చేపట్టినప్పటికీ వాటిని అమలు చేయడం జరిగింది. అయితే గతంలో ఇదే మాదిరిగా చేసిన మూడు వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా దేశంలో గల రైతు సంఘాలు ఒక సమాఖ్యగా ఏర్పడి, ఒక ఏడాదికి పైగా ఢిల్లీలో చేపట్టిన రైతు ఉద్యమం ఎన్ డి ఏ కూటమి ప్రభుత్వ మెడలు వంచి,  వాటిని రద్దు చేయించుకోవడం జరిగింది. ఈ ఉద్యమంలో సుమారు 700 మంది రైతు ఉద్యమకారులు ఆత్మ బలిదానం చేసినప్పటికీ వారి అమరత్వం చివరకు విజయం సాధించింది. కావున పై నేపథ్యంలో 1991 తర్వాత దేశంలో సరళీకరణ, ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మెలను గూర్చి ఒకసారి పరిశీలన చేద్దాం.

1991 తర్వాత దేశంలోని ప్రధాన కార్మిక సంఘాలు ప్రైవేటీకరణకి వ్యతిరేకంగాను, కార్మిక చట్టాల మార్పుకి నిరసనగాను, కనీస వేతనాలు పెంపు కోసం,  ధరల పెరుగుదలకు నిరసనగాను 18 సార్లు ఒకరోజు జాతీయ సమ్మెలు,  మూడు సార్లు రెండు రోజుల జాతీయ సమ్మెలు వెరసి 21సార్లు జాతీయ స్థాయిలో సమ్మెలు చేయడం జరిగింది. యూపీఏ కూటమి గాని, ఎన్డీఏ కూటమి గాని ఎవరు అధికారంలో ఉన్న ప్రైవేటీకరణ, సరళీకరణ విధానాలను కొనసాగిస్తూనే, పెట్టుబడిదారీ అనుకూల, కార్మిక వర్గ వ్యతిరేక చర్యలను చేపట్టడం జరిగింది. ఇప్పుడు ఏకంగా 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లు గా కుదించి, మరింతగా కార్మిక వర్గ వ్యతిరేక చర్యలకు ఎన్ డి ఏ కూటమి ప్రభుత్వం పూను కొన్నది. ఫలితంగా కార్పొరేట్ కంపెనీలలో ఉద్యోగ భద్రత లేకుండా పోయి, ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ మరింత సులభతరం అవుతుంది. కార్మిక సంఘాల హక్కులు పరిమితం చేయబడి, కార్మికులు అసలు సమ్మె హక్కు కూడా ప్రశ్నార్ధకమై పోతుంది. కర్మాగారాలలో మూడు షిఫ్టుల పద్దతి  కి బదులుగా, రెండు షిఫ్ట్ ల పద్ధతి వచ్చి, ఎనిమిది గంటలకు బదులుగా 12 గంటల పని విధానం అమలులోనికి రాబడుతుంది. ఉద్యోగుల పెన్షన్, గ్రాడ్యుటీ ప్రశ్నార్ధక మవుతాయి. అసంఘటిత రంగ కార్మికులు దయనీయ పరిస్థితి లోనికి నెట్టబడతారు. కార్మికులకు కనీస వేతనాలు కూడా భవిష్యత్తులో నిరాకరించబడతాయి.

కాబ‌ట్టి గత రెండున్నర దశాబ్దాల ఒకరోజు, రెండు రోజుల కార్మిక వర్గ జాతీయ సమ్మెలు భారత పాలకవర్గాలను ప్రభావితం చేయబడలేదు. ఈ దేశ పాలకులు పెట్టుబడిదారీ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్నారు. కార్మిక వర్గాన్ని మరింత దోపిడీకి గురి చేస్తున్నారు. ఒక రోజు, రెండు రోజుల జాతీయ సమ్మెలకు కాలం చెల్లిందని చెప్పవచ్చు. ఈ దేశ కార్మిక వర్గ  నాయకత్వం గతంలో ఢిల్లీలో జరిగిన నిరవధిక భారత రైతాంగ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని, నాలుగు లేబర్ కోడ్లు రద్దుకి నిరవధిక జాతీయ సమ్మెకు సమాయత్తం కాబడినప్పుడే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వచ్చి, వాటిని రద్దు చేసుకోవడం జరుగుతుందని మనందరం ఆశిద్దాం.

Leave a Reply