బాగా రాసే వారు కాదు, బాగా చదివేవారే బాగా లోతుగా విశ్లేషణాత్మకంగా మాట్లాడగలుగుతారు. బాగా చదివే వారే బాగా రాయగలుగుతారు. మంచి పుస్తకం మనిషి నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతుంది. కొత్త చూపునిస్తుంది కొత్త ఆలోచనలను ఇస్తుంది ,ఆచరణ దిశగా చైతన్యవంతంగా నడిపిస్తుంది. మంచి పుస్తకం మాట్లాడుతుంది. మాట్లాడనిస్తుంది. అక్షరానికి గొంతు నిస్తుంది.

*

తెలుగు సమాజాలకు అవసరమైన ఎన్నో విలువైన వ్యాసాలను తెలుగులో నేరుగాను ,అనువాదం ద్వారానూ అందిస్తున్న రాఘవ కొత్త పుస్తకం ‘ప్రశ్నించే గొంతులు’. ఈ పుస్తకం సోమవారం తిరుపతిలో ఆవిష్కరించబడుతుంది.

 ‘మాట్లాడే పుస్తకాలు శీర్షికన’  పుస్తకాల గురించి తన అభిప్రాయాలను వసంతమేఘం కోసం అందించారు రాఘవ.

*

‘ప్రశ్నించే గొంతులు’ రాఘవ కొత్త పుస్తకం గురించి వి.వి ఇలా అంటున్నారు.

“ఒక్క చోట మనకింత సమాచారమే కాదు, వివేకవంత విచక్షణనివ్వడం, మన ప్రాపంచిక దృక్పథాన్ని మెరుగు పెట్టుకోగల ఇంటర్వ్యూలు లభించగలగడం ఎంత అరుదైన అవకాశం. కొండను అద్దంలో చూపే కృషి. ముఖ్యంగా నాకు నిషేధ కాలంలోనూ, చర్చల కాలంలోను ప్రత్యక్ష ప్రమేయం ఉన్నందున రాఘవ గారు నన్ను దీనికి ముందు మాట రాయమని అడిగి ఉంటారు.

కౌశాంబి భగవద్గీతను వర్గపోరాట దృష్టితో చూశాడు. కె.మురళి తిలక్ గీతా రహస్యం క్రిటిక్ రాయడానికి మరాఠీ నేర్చుకుని మావోయిస్టు దృక్పథంతో రాశాడు. ఈ పుస్తకం ఇన్ని తీర్ల ఆలోచనలకు నాకు ప్రేరకమైనట్లే పాఠకులకూ అవుతుందని ఆశిస్తున్నా”.

*

‘ దిశ’ దినపత్రిక న్యూస్ ఎడిటర్ రాజశేఖర్ ఈ పుస్తకానికి ఆత్మీయ వచనాలు రాస్తూ.. “పాత కొత్తల సమాహారమైన ‘ప్రశ్నించే గొంతులు’ 70 సంవత్సరాల తెలుగు సామాజిక, రాజకీయ, ఆర్థిక, చిత్రరంగ విశేషాలను వివరించే అరుదైన సంకలనంగా చెప్పాలి. ఇందులోని ప్రతి ఒక్క ఇంటర్వ్యూ  ఒక్కో వెలుగును ప్రసరింప చేస్తుంది. అత్యంత సంయమనంతో, తటస్తతను పాటిస్తూనే, పాక్షికత వైపు కొట్టుకుపోకుండా, భిన్న భిన్న ప్రముఖుల ఇంటర్వ్యూలతో తీసుకొచ్చిన ఈ పుస్తకాన్ని చదవడం తెలుగు సమాజపు బాధ్యత.”.

*

రాఘవ:

                పుస్తకం నా ఊపిరి. పుస్తకం నా శ్వాస. పుస్తకం నా మస్తిష్కం. పుస్తకం నా ప్రియనేస్తం. పుస్తకం లేని సమాజాన్ని ఊహించలేను. పుస్తకం లేని జీవితాన్నీ ఊహించలేను. పుస్తకం నా జీవితాన్ని ఎంతగా పెనవేసుకుపోయిందో! ఇప్పటివరకు ఆరు పుస్తకాలు తెచ్చాను. ‘ప్రశ్నించే గొంతులు’  ఏడవ పుస్తకం.

 పుస్తకాలని ఒక్క సారి ఆవాహనం చేసుకుంటే..

1. నా బాల్యం, కౌమార్యం, తొలి యవ్వనపు రోజులు వనపర్తిలో జరిగిపోయాయి. మా వీధిబడి వేణుగోపాల స్వామి గుడిలో నేను తాకిన తొలి పుస్తకం ‘పెద్దబాల శిక్ష’.  నాకు తెలుగంటే మా అమ్మంత ఇష్టం. అందుకే తెలుగు వాచకాల్లోని పాఠాలు కంఠోపాటంగా వచ్చేవి. రెండవ తరగతి తెలుగు వాచకంలో ‘కలవారి కోడలు కలికి కామాక్షి’ లో ని ప్రతి చరణం ఇప్పటికీ నాకు గుర్తుంది.

                ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు నేను వనపర్తిలోనే చదువుకున్నాను. మా ఇంటికి   ఆంధ్రప్రభ వచ్చేది. అది దినపత్రిక. అప్పుడప్పుడూ మా నాన్న ‘చందమామ’ కూడా తెచ్చేవాడు. హైస్కూల్ చదివే రోజుల నుంచే ‘చందమామ’ చదవడం నాకు అలవాటైపోయింది. ‘పందిరి గుంజలు’ వంటి కొన్ని కథలు ఇప్పటికీ  జ్ఞాపకం. వనపర్తి ప్యాలెస్ ఆవరణలోని క్వార్టర్స్ లో ఉద్యోగుల్లో చాలా మంది ‘చందమామ’ను తెప్పించుకునే వారు. తెనాలిలో ఉండే ఆలూరు భుజంగరావు గారు మా నాన్నకు పెదనాన్న కొడుకు. నాకు బాబాయి అవుతాడు. మా నాన్న తెనాలి వెళ్ళినప్పుడు మా బాబాయి అనువాదం చేసిన ప్రేమ్ చంద్ ‘గబన్’ నవలను తీసుకొచ్చాడు. ‘గబన్’ను చూశానే కానీ, ఆ రోజుల్లో చదవలేదు. విశ్వనాథ సత్యనారాయణ రాసిన ‘మా బాబు’ నవల ఎలా వచ్చిందో మా ఇంటికి వచ్చింది. హైస్కూల్ చదివే రోజుల్లోనే ‘మా బాబు’ నవలను చదివాను. నేను చదివిన మొట్టమొదటి నవల అదే. ఆ తరువాత టంగుటూరి ప్రకాశం పంతులు ఆత్మకథ చదివాను. ఆ  ఆత్మకథ చివరి భాగాన్ని తెన్నేటి విశ్వనాథం పూర్తి చేశారు. ‘వీడు క్లాస్ పుస్తకాలకంటే వేరే పుస్తకాలు ఎక్కువగా చదువుతున్నాడు. ఏమైపోతాడో ఏమో!’ అని మానాన్న బాధపడిన రోజులూ గుర్తున్నాయి.

                ఇంటర్ లో నాది సైన్స్ గ్రూప్ . దాని వల్ల ఇంటర్ లో క్లాస్ పుస్తకాలు తప్ప వేరే పుస్తకాలేవీ  చదివే అవకాశం ఏర్పడలేదు. బాపట్లలో డిగ్రీ చదివే రోజుల్లో సామాజిక విషయాల పైన ఆసక్తి పెరిగింది. రాజకీయార్థిక సామాజిక విషయాల గురించి ఆలోచించడం, చర్చించడం మొదలైంది. కాలేజీ అయిపోగానే లైబ్రరీకి వెళ్ళి, పుస్తకాలు తిరగేసేవాణ్ణి. గాంధీజీ ఆత్మకథ ‘మై ఎక్స్ పర్ మెంట్స్ విత్ ట్రూత్’ చాలి ఇష్టంగా, ఆసక్తిగా చదివాను. లైబ్రరీ  అటెండర్ వచ్చి టైమైపోయిందని  చెప్పే వరకు కాలం తెలిసేది కాదు. ఆ రోజుల్లో పుస్తకాలు చదవడం, చర్చించడం దినచర్యలో అలా భాగమైపోయింది.

                అది ఎమర్జెన్సీ విధించిన కాలం. మా కుటుంబం తిరుపతి నుంచి నెల్లూరుకు మారింది. పడుగుపాడులో ఉండే వాళ్ళం. పడుగుపాడు, కోవూరు కలిసిపోయి ఉండేవి. పొద్దున్నే కోవూరు లైబ్రరీ ముందు నిలుచుని ఎప్పుడెప్పుడు తెరుస్తారా అని ఎదురుచూసే వాణ్ణి. లైబ్రరీలో పడి చలం సాహిత్యాన్ని చాలా ఇష్టంగా చదివాను. అప్పుడే రంగనాయకమ్మ గారి ‘రామాయణ విష వృక్షం’  మూడు భాగాలూ చదివేశాను. చలం పుస్తకాలు, రంగనాయకమ్మ గారి పుస్తకాలు; ముఖ్యంగా రామాయణ విష వృక్షం ముందు మాట  నా ఆలోచనలను సమూలంగా మార్చేశాయి. నా జీవిత గమనానికి ఒక మార్గాన్ని చూపించాయి.

                2. తిరుపతి తిరిగి వచ్చాక విశాలాంధ్ర పుస్తకాల షాప్ కు అలవాటుపడిపోయాను. మహాప్రస్థానం నుంచి ఒకటొకటి కొనడం మొదలైంది. సృజనాత్మక సాహిత్యంతో పాటు వామపక్ష సాహిత్యం చదవడం మొదలు పెట్టాను. తిరుపతి శివార్లలో మాది పెంకుటిల్లు.  ఇటుకల మధ్య మట్టితో కట్టిన పెంకుటింటికి ఆనుకుని రేకులు దించిన గదిలో తలుపులు లేని షెల్ఫులు కట్టుకున్నాం. షెల్ఫులనిండా పుస్తకాలు వచ్చి చేరుతున్నాయి.

                పుస్తకాలతోపాటు వాటి మధ్యకు  చెదలు కూడా వచ్చి చేరాయి, మట్టిగోడలు కదా ! రెండు మూడు నెలలకొకసారి పుస్తకాలన్నిటినీ దులిపి, మళ్ళీ భద్రపరిచేవాణ్ణి. చెదలుపట్టకుండా గెమాక్సిన్ వేసేవాణ్ణి. పుస్తకాలకు అసలు చెదలెందుకు పడుతున్నాయి? చెదలు పట్టకుండా ఏం చేయాలి? అని ఎస్వీయూనివర్సిటీ లైబ్రరీలో పనిచేసే నామిత్రుడు షణ్ముఖంను అడిగాను. ‘‘చెమ్మ వల్ల, దుమ్ము వల్ల చెదలు పడతాయి. పుస్తకాలకు పట్టిన దుమ్మును తరుచూ తుడుస్తుంటే, చెదలు పట్టవు’’ అని సలహా ఇచ్చారు షణ్ముఖం.

                నెలకొకసారైనా పుస్తకాలను దులిపే వాణ్ణి. పుస్తకాలను స్పర్శించడం వల్ల ఒక అనుభూతి పొందే వాణ్ణి. అలా చాలా కాలం పుస్తకాలను కాపాడాను. ఒకసారి విడవకుండ భారీ వర్షాలు వచ్చాయి. నేలంతా చెమ్మెక్కింది. గోడలన్నీ చెమ్మబారిపోయాయి. బీరువాల్లో ఉండే బట్టలు కూడా  చల్లబడి పోయాయి. పాపం పుస్తకాలెలా ఉంటాయి !?  అవి చలికి వణికి పోయాయి. చెమ్మకు మెత్తబడిపోయాయి.

                3. వర్షాలు తగ్గాక శుభ్రం చేద్దామనుకునే సరికి పుస్తకాల నిండా చెదలు.  కొన్ని విలువైన పుస్తకాలను చెదలు  తినేశాయి. దాదాపు 500 పుస్తకాలను పారేయాల్సి వచ్చింది. మనసు  ఉస్సూరు మనిపించింది. ఎంత విలువైన పుస్తకాలో ! ఎన్నేళ్ళ నుంచి ఎంత కష్టపడి సేకరించి, దాచుకున్నవో! ఏదైనా రాయడానికి రిఫరెన్స్ కు ఎంత ఉపయోగపడ్డాయో! వాటిని మళ్ళీ కొందామన్నా దొరకవు. అలా దొరకని పుస్తకాల్లో ల్యియెన్ తెవ్ రాసిన ‘అర్థశాస్త్రం’ కూడా ఉంది. ఆ పుస్తకం కోసం చాలా చోట్ల వెతికాను. కానీ దొరకలేదు. అనేక రెఫరెన్స్ గ్రంథాలను, సాహిత్య గ్రంథాలను, ముఖ్యంగా కవితా సంకలనాలను చెదలు తినేశాయి. పుస్తకాలను ఎలా భద్రపరచాలో నాకు అర్థం కావడం లేదు.

                4. చెదలు పట్టి పారేయాల్సి వచ్చిన పుస్తకాల్లో మార్క్స్ కాపిటల్ కూడా ఉంది.  క్యాపిటల్ నా దగ్గరకు ఎలా వచ్చింది !? మా ఇంటికి దగ్గరలో వైకుంఠ పురం దేవస్థానం కాలనీ ఉండేది. అక్కడ ఒక ఇంట్లో ఇరాన్ నుంచి వచ్చిన ముగ్గురు యువకులు, ఒక యువతి ఉండే వారు. ఎస్వీ యూనివర్సిటీలో చదువుకునే వారు. చదువు అయిపోయాక వాళ్ళు తిరిగి ఇరాన్ వెళ్ళిపోయారు. సామానంతా తీసుకెళ్ళినా, కొన్ని పుస్తకాలు అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళు ఒదిలిపెట్టి వెళ్ళిపోయిన పుస్తకా ల్లో మార్క్స్ కాపిటల్, మావో రచనలు కూడా ఉన్నాయి. వాళ్ళక్కడ ఉన్నంత కాలం వారి ఆలోచనలివి అని నాకే కాదు, ఆ చుట్టుపక్కల ఎవరికీ తెలియదు. నాగురించి తెలిసిన ఆ ఇంటి యజమాని ఆ పుస్తకాలను తీసుకొచ్చి నాకిచ్చాడు.  వాటిలో నేను కొన్ని అట్టిపెట్టుకున్నాను. కొన్ని నా మిత్రుడు పీకాక్ క్లాసిక్ ఎడిటర్ గాంధీ గారికి ఇచ్చాను.

                క్యాపిటల్ చదవాలని ప్రయత్నం చేసినా, నాకు అర్థం కాలేదు. రంగనాయకమ్మ గారి క్యాపిటల్ పరిచయం చదివాక, దానికి మూలమైన మార్క్స్  క్యాపిటల్ చదువుదామనుకుంటే, అది కాస్తా చెదలపరమైపోయింది. చెదల వల్ల నేను పోగొట్టుకున్న పుస్తకాల్లో అనేక రిఫరెన్స్ గ్రంథాలున్నాయి. అవి మళ్ళీ దొరకవు. పోగొట్టుకున్న పుస్తకాల్లో మహాప్రస్థానం, కరుణశ్రీ రచనలతో పాటు సోవియట్ యూనియన్ ప్రచురించిన అనేక విలువైన పుస్తకాలున్నాయి. మహాప్రస్థానం దొరికింది కానీ, సోవియట్ యూనియన్ ప్రచురించిన విలువైన పుస్తకాలు మళ్ళీ సంపాదించలేను కదా !

                5.  జీవితంలో నేను సంపాదించిన ఆస్తి ఏదైనా ఉందంటే అవి పుస్తకాలే.  ఎందుకంటే పుస్తకాలు, వాటి నుంచి వచ్చిన నవీన ఆలోచనలు నా జీవితాన్ని మార్చేశాయి. ఈ పుస్తక జ్ఞానమే లేకపోతే,  కపిల తీర్థమో, మరేదో శివాలయంలోనో తీర్థ ప్రసాదాలు ఇచ్చుకుంటూ, పరిచారికగా బతుకీడ్చే వాణ్ణి. టీటీడీలో ఏదో ఒకస్థాయి ఉద్యోగినయ్యే వాణ్ణి. చాలా మంది ఎదురుచూసినా రాని, నాకాళ్ళ దగ్గరకు వచ్చిన ఆ అవకాశం పుస్తకాల వల్ల కాలదన్నుకున్నానని నేనెప్పుడూ చింతించలేదు.  నా ఆలోచనల ప్రకారం నా జీవితాన్ని మలుచుకున్నందుకు సంతృప్తిగానే ఉన్నాను. నా జీవిత గమనాన్ని పుస్తకాలే నిర్దేశించాయి.

6.  ఆంధ్రజ్యోతి ఎడిషన్ 1987లో తిరుపతిలో పెట్టిన కొత్తల్లో నేను రిపోర్టర్ గా చేరాను. ఎక్కువగా విద్యారంగ వార్తలు, సాంస్కృతిక రంగ వార్తలు రాసేవాణ్ణి.  ఒక సారి క్రైమ్ వార్తలు రాయాల్సి వచ్చింది. నేను రాసిన ఒక క్రైమ్ వార్తను ఎడిట్ చేస్తూ, అప్పటి మా న్యూస్ ఎడిటర్ కృష్ణ మూర్తి గారు ‘క్రైం వార్తల్లో కూడా కవిత్వం రాస్తే ఎలాగండి?’ అన్నారు నవ్వుతూ. ఈ కవిత్వమేదో నా కొంప ముంచేలా ఉందని, పత్రికల్లో నిలదొక్కుకునే వరకు కవిత్వం జోలికి పోలేదు. మానవీయ కథనాల్లో తప్ప ఎక్కడా కవిత్వాన్ని రానీయకుండా జాగ్రత్త పడ్డాను.

                7. శ్రీ శ్రీ అన్నట్టు కవిత్వం ఒక తీరని దాహం. నిజమే కదా! నేను రాసిన కవితలు వేళ్ళ పైన లెక్కపెట్టదగినవే! మంచి కవిత్వం ఇప్పటికీ చదువుతూ ఆస్వాదిస్తాను. మంచి వచనం రాయాలంటే, మంచి కవిత్వం చదవాలంటాను. ఈ మధ్య  కదిలించే మంచి కవిత్వం వస్తోంది. కొన్ని మంచి కవితలను అనువాదం కూడా చేశాను.  ఇప్పటివరకు ఆరు పుస్తకాలొచ్చాయని చెప్పాను కదా!  చిత్తూరు జిల్లా తొలితరం సాహితీవేత్తల గురించి ‘సాహితీ సౌగంధం’ తెచ్చాను.  చైనా పర్యటనానుభవాలతో ‘ఓ కొత్తబంగారు లోకం’ వచ్చింది.  పద్నాలుగేళ్ళ వనపర్తి జీవితం గురించి ‘వనపర్తి ఒడిలో’ వచ్చింది.  ఒక శతాబ్దపు మధ్యతరగతి తెలుగింటి  ఇల్లాళ్ళ జీవితాలకు అద్దం పట్టే ‘అమ్మముచ్చట్లు’ తెచ్చాను. మూడు దశాబ్దాల శేషాచలం కొండల్లో ట్రెక్కింగ్ అనుభవాలతో ‘తిరుమలదృశ్య కావ్యం’ , ‘శేషాచలం కొండల్లో’ తెచ్చాను. నా పాత్రికేయ వృత్తిలో భాగంగా నేను చేసిన పదిహేడు మంది ప్రముఖుల అరుదైన ఇంటర్వ్యూలతో ‘ప్రశ్నించే గొంతులు’ ఈ ఫిబ్రవరి 2వ తేదీ సోమవారం మీ ముందుకు వస్తోంది.

న‌న‌న‌పత్రికల్లో నేను రాసే రాజకీయ, సామాజిక కథనాలు, ఇప్పటి వరకు వచ్చిన నా పుస్తకాలు  చదివిన చాలా మంది  పాఠకులు ‘మీ వచనం పాఠకుణ్ణి చదివిస్తుంది.’ అని సర్టిఫై చేశారు. నేను చెప్పదలుచుకున్న విషయాన్ని సాధారణ పాఠకులకు తేలిగ్గా అర్థమయ్యేరీతిలో రాయడానిక ప్రయత్నించానే తప్ప, శైలి కోసం ఎప్పుడూ శ్రద్ధ చూపలేదు. నా శైలి పాఠకుల చేత చదివించడానికి నేను వచన కవిత్వం చదవడమే కారణమని అనుకుంటున్నాను.

                అయిదేళ్ళ క్రితం పెంకుటిల్లు తీసేసి పక్కా ఇల్లు కట్టుకునే టప్పుడు, హాలులో పుస్తకాల కోసం షెల్ఫులు పెట్టించాను. షణ్ముఖం సలహామేరకు ఆ షెల్ఫ్ లకు అద్దాలు పెట్టించాను. అందం కోసమో, ప్రదర్శన కోసమో కాదు, పుస్తకాలపై దుమ్ము ధూళి చేరకుండా ఉండడం కోసం. వాటిని  మాటి మాటికీ తుడవవలసిన అవసరం లేకుండా ఉండడం కోసం.

                 పుస్తకాలను చరిత్రలు, జీవిత చరిత్రలుగా, సాహిత్య వ్యాసాలుగా, కవితా సంకలనాలుగా, కథలు, నవలుగా సిద్ధాంత గ్రంథాలుగా, భాషకు సంబంధించి, పత్రికా రంగానికి చెందిన పుస్తకాలుగా, షెల్ఫుల్లో ఆరు విభాగాలుగా విభజించి, వాటికి నెంబర్లేసి, క్యాటలాగ్ తయారు చేశాను. క్యాటలాగ్ చూస్తే చాలు, ఏ పుస్తకం ఎక్కడ ఉందో  తేలిగ్గా తెలుసుకోగలుగుతాను.

                పుస్తకాలను తరుచూ తుడవకపోయినా, వాటిని తిరగేస్తూనే ఉంటాను. తిరగేసినప్పుడల్లా పుస్తకాలను స్పర్శిస్తూనే ఉంటాను. అలా పుస్తకాలను స్పర్శిస్తున్నప్పుడు ఒక అనిర్వచనీయమైన అనుభూతిని పొందుతూనే ఉంటాను.  ఎందుకంటే అవి నా జీవిత గమానానికి దారి దీపాలు కనుక.

Leave a Reply