గాజాలో
మండుతున్న ఆకాశం కింద
నేను రాస్తూనే ఉంటా

యుద్ధపు కోరలు
నా మాతృభూమిని
నా కుటుంబాన్ని
నా ఇల్లును
గోడకు మెరిసే నా మెడల్స్ ని
నా హృదయంలో మెరిసి
నా గదిని చేరని ఉజ్వల వైభవాలను
నా నుండి లాగేసుకుంటేనేం
నేను రాస్తూనే ఉంటా

రచన
నాకొక వినోదం కాదు
అది నా మనుగడ

నా రక్తాన్ని పంచుకుపుట్టే
ప్రతి పద్యం
ఒక ధిక్కార గీతం
దురాక్రమణకు ఎదురీదే
హృదయ స్పందన

దయచేసి
ఈ పెన్నునూ
ఒకప్పటి నా మాతృభూమినీ
నా నుంచి లాక్కోవద్దు

నేన నా పద్యాన్ని
ప్రపంచంలోకి విసిరేస్తాను

ఒక్క వాక్యమైనా
మీ గుండెల్లోకి చొచ్చుకొని
నిద్రాణమైన మీ అంతరాత్మల్ని
మేలుకొలుపుతుందనీ
అనంత మౌనపు చీకట్లో
ఒక్క కొవ్వొత్తి అయినా వెలిగిస్తుందనీ
నా చిన్న ఆశ

నా ప్రతి పదమొకసందేశం
చుట్టేయబడ్డ శ్వాసల పాఠం

అది నిజాల అగాధంలోకి దుమికి
కప్పబడ్డ విషాద గాధలను
మౌనంగా సలుపుతున్న భావోద్వేగాలను
శిథిలాల్లో నుంచి చీల్చుకొస్తున్న
ఆశల మొలకల్ని పట్టి చూపుతుంది ..

నా పదాలతో
మిమ్మల్ని ఉత్తేజితుల్ని చేస్తా
పాఠకుడికీ
తన చుట్టూ తనకే తెలియని
అగాధ జీవన గాధలకూ
వంతెన లేస్తా

మీ హృదయాల్లో నడయాడే
ప్రతి వాక్యం లో
మొదటి పదం నాదే అయి ఉండాలి

నా ప్రతి పదమూ
హృదయాన్ని ప్రతిబింబిస్తుందని
ప్రతి హృదయానికి
చెప్పాల్సిన గాథలేవో
మిగిలే ఉంటాయని
నా ప్రగాఢ విశ్వాసం

Rouba-al-Shareef

రూ బా-అల్ -షరీఫ్ .. లెబనాన్ క‌వి.  మానవ హక్కుల గురించి సాంఘిక న్యాయం గురించి కృషి చేస్తున్నారు. అంతర్జాతీయ శరణార్థుల శిబిరానికి   international refugee assistance project (IRAP)వైస్ ప్రెసిడెంట్ గా పని చేస్తున్నారు.

Leave a Reply