మంచికంటి మరో గ్రంథాలయ ఉద్యమకారుడుగా అందరికీ సుపరిచితుడు. ఆయన కవి కథకుడు, నవలాకారుడు ఉద్యమకారుడు. పుస్తకాల ప్రపంచం కోసం అందరికీ పుస్తకాలను చేరువ చేయడం కోసం గ్రంథాలయాలను బలోపేతం చేయడం కోసం ఒక గొప్ప ఉద్యమాన్ని నడుపుతున్న వ్యక్తి. స్కూటర్ పై అనేక ప్రాంతాలు పర్యటించి, విద్యార్థులతో పాటు రచయితలతో భాషాభిమానులతో గ్రంథాలయ నిర్వాహకులతో సాహిత్య సాంస్కృతిక సంస్థల నిర్వాహకులతో ముచ్చటించి యాత్రానుభవాలను  పుస్తకంగా మలచిన సృజనకారుడు. మంచి ఉపాధ్యాయుడు.

*

పుట్టిన ఊరు కలికివాయ, సింగరాయకొండ మండలం, ప్రకాశం జిల్లా, ఆంధ్ర ప్రదేశ్.

విద్యలో ప్రయోగాలు చేస్తున్న శాంతివనం ఫౌండేషన్ ఊరు: నాయుడుపాలెం, చీమకుర్తి మండలం.  

ఆయన కథా సంకలనాలు:

మిత్తవ , మారాజులు,

అంబేద్కర్ మనవాడు.

గబ్బ గీము– నవల.

కవిత్వం:

వసంతా ఊసెత్తకు, నీటి పొద్దు, మేం పావురాలను ప్రేమిస్తాం

జీవితము-యుద్ధము-శాంతి

ప్రకృతి కవిత్వం

నా సైకిల్ యాత్రాదర్శనం- సైకిల్ యాత్ర పుస్తకం

మోటార్ సైకిల్ యాత్ర దర్శనం

విద్యలో నా ప్రయోగాలు—

శాంతివనం -పిల్లల అనుభవాలు- ప్రయోగాలు

బడి ఎలా ఉంది, ఎవరికోసం

బడి మా మంచి బడి,

బాబోయ్ చీపురు కట్టలు, మంచికంటి పిల్లల కథలు,

అమెరికాలో ఆర్నెల్లు అమెరికా కథలు.

రెండు దశాబ్దాల నుండి  రచనలు,

యాభై కథలు వరకు రాశారు.

 *

మరో గ్రంథాలయ ఉద్యమాన్ని మొదలుపెట్టి మిత్రులతో కలిసి రెండు రాష్ట్రాలలో నిర్వహిస్తున్నారు.

మాట్లాడే పుస్తకాలు శీర్షికన మంచికంటి తన అనుభవాలను అభిప్రాయాలను తెలియజేశారు.

*

పుస్తకాల ప్రపంచమే లేకపోతే…

పుస్తకాల ప్రపంచంలో లేకపోతే

నేనొక సామాన్యమైన మనిషిగా ఉండేవాడిని.మామూలు ఉపాధ్యాయుడిగా పిల్లలకు ఎలాంటి ఉపయోగం లేకుండా ఉండేవాడిని.స్వార్థపరుడుగా సమాజాన్ని  పట్టించుకోని వ్యక్తిగా మారేవాడిని.డబ్బు సంపాదించే యంత్రంగా మారేవాడిని.

సంతోషానికి సంపాదనకి సంబంధం లేదనేవిషయం తెలియని మూర్ఖుడిగా మారేవాడిని.ఊహ తెలిసినప్పటి నుండి మూడవ తరగతి చదివిన మా అమ్మ కనిపించిన ప్రతి చిత్తు కాగితాన్ని తీసుకొని బిగ్గరగా చదవడం నా స్మృతిపథంలో ఇప్పటికీ కదులుతూనే ఉంటుంది.

మా గ్రామంలో యువజన సంఘం నిరంతరం చైతన్యవంతంగా అనేక కార్యక్రమాలను నిర్వహించేది. ఆ కార్యక్రమాలన్నింటిలో పాల్గొనేవాణ్ణి. ఆ యువత యువజన సంఘం తరఫున పంచాయితీ ఆఫీసులో గ్రంధాలయాన్ని నిర్వహించేవాళ్ళు. ఆ గ్రంథాలయానికి వెళ్లి పిల్లలం చదువుకునేవాళ్ళం.

గ్రామంలో చదువుకున్న వాళ్ళ దగ్గర చందమామలు బాలమిత్రలు బొమ్మరిల్లు ఈ మూడు రకాల కొత్త పాత పుస్తకాలు తిరుగుతా ఉండేవి. ఈ పుస్తకాలు చదువుతున్న నేపథ్యంలో డిటెక్టివ్ పుస్తకాలు చదవడం పరిచయమయ్యాయి. డిటెక్టివ్ పుస్తకాల నుండి యండమూరి మల్లాది వరకు ప్రయాణం సాగింది. ఈ ప్రయాణంలో హైస్కూల్ గ్రంథాలయము, సింగరాయకొండ గ్రంధాలయము, డిగ్రీ కాలేజ్ కందుకూరు గ్రంథాలయము, ఏలూరు గ్రంథాలయము సందర్శిస్తూ పుస్తకాలు తెచ్చుకుంటూ చదువుతూ ఉన్న క్రమంలో ఒక ప్రగతిశీల ఆలోచనా దృక్పథం ఏర్పడడం మొదలైంది.

చదువుకునే రోజుల్లో శ్రీశ్రీమహాప్రస్థానం చదవడం మాట్లాడడం పెద్ద క్రేజ్. మహాప్రస్థానం దగ్గర నా సాహిత్య జీవితం పెద్ద మలుపు తీసుకుంది. అప్పటినుండి సీరియస్ సాహిత్యం వైపు విప్లవ సాహిత్యం వైపు మనసు మళ్లింది. విప్లవోద్యమం వైపుకు వెళ్లాలనే ఆలోచన ఉండేది. కానీ ఆ మార్గాన ప్రయాణించే మిత్రులు దగ్గర కాకపోవడం వల్ల విప్లవోద్యమంలోకి అడుగు పెట్టలేకపోయాను. కందుకూరులో డిగ్రీ చదివేటప్పుడు ఎస్ఎఫ్ఐ లో ఉన్నప్పటికీ నన్ను ప్రభావితం చేసే వ్యక్తులు తారసపడలేదు.

సోవియట్ ల్యాండ్ రష్యాలో జరిగే అనేక విషయాలను రంగురంగుల పత్రికలో చూసి ఎంతో ఉత్తేజితుడను అయ్యేవాడిని. సోవియట్ వ్యాన్ లో అతి తక్కువ ధరకు ఎన్నో మంచి పుస్తకాలు దొరికేవి. అలా పుస్తకాలు సేకరణ మొదలైంది.

కానీ ఎక్కడ నుండి చదవాలి ఎలా చదవాలి ఎలా రాయాలి అనేది చాలా కాలం వరకు నన్ను వెంటాడుతూ ఉండేది.

ఆనాటి సాహిత్య సాంస్కృతిక వాతావరణం కూడా నేను రచయిత కాకముందు ఒక సృజన కారుడిగా కళలను ఆస్వాదించే వ్యక్తిగా మలిచింది. పౌరాణిక నాటకాలు సాంఘిక నాటకాలు జానపద కళారూపాలు స్వాతంత్ర ఉద్యమ పోరాట గాథలు సామాజిక నేపథ్యం మెండుగా ఉండే ఆర్ట్ సినిమాలు మామూలు మనిషిని సాహిత్య పిపాసిగా పాఠకుడిగా ఎదుగుదలకు దోహదం చేశాయి.

మా ఊరికి వచ్చే ఒకే ఒక ఆంధ్రజ్యోతి పత్రిక నన్ను రచనలలోకి మళ్లించింది.

మొదట కథలు రాయడం మొదలు పెట్టినా ఏ రచయితా పరిచయం లేకపోవడం వల్ల కథారచనా వ్యాసంగం ఆలస్యమైంది.

ఒంగోలులో పద్యాలు అవధానాలు కవి సమ్మేళనాలు నాటకాలు ఉధృతంగా సాగుతున్న క్రమంలో నాగభైరవ కోటేశ్వరరావు గారు కవిత్వం వైపు ప్రోత్సహించడంతో కవిత్వం రాయడం మొదలుపెట్టాను.

శ్రీరామకవచం సాగర్ ఒంగోలు ప్రవేశంతో నిజమైన ఆధునిక సాహిత్యం వైపు ప్రయాణం మొదలైంది.కాట్రగడ్డ దయానంద్ ఒంగోలు రావడంతో  మిత్తవ కథతో అసలైన కథా రచన ప్రారంభమైంది. అప్పటినుండి కవిత్వం నుండి కథలలోకి ప్రయాణించాను.

ప్రైవేట్ టీచర్ గా ఉద్యోగం మొదలైనప్పటి నుండి చైతన్య విద్యావనం స్కూల్ ప్రిన్సిపాల్ ప్రతి సంవత్సరం విజయవాడ బుక్ ఫెయిర్ కు తీసుకువెళ్లి పుస్తకాలు కొనిపించేవారు.విజయవాడ పోరంకిలో వికాస విద్యావనంలో మా అబ్బాయి క్రాంతి చదువు మొదలు పెట్టినప్పటి నుండి లెనిన్ సెంటర్లో ప్రాచీనాంధ్ర గ్రంథమాల ఓల్డ్ బుక్ షాప్ లో డజన్ల కొద్ది పుస్తకాలు కొనుక్కొచ్చేవాడిని.

రచయితగా ప్రారంభమైన తర్వాత నన్ను అత్యంత ప్రభావితం చేసిన పుస్తకాలు రష్యన్ సాహిత్యమే. ఎన్నో రష్యన్ కథలు నవలలు ఇతర పుస్తకాలు చదువుతుంటే ఎంతో గొప్పగా అనిపించేది. రచయితగా నన్ను ఆ పుస్తకాలు ఒక భావనా ప్రపంచంలోకి నడిపించేవి. ఏ రచన చేయడానికైనా ముందు ఒక రష్యన్ కథనో పుస్తకాన్నో చదవడం అలవాటుగా ఉండేది.

అన్నా కెరీనా రెండు భాగాలు కొత్తగూడెం నుండి డాక్టర్ నరేంద్ర గారి వద్ద నుండి తీసుకొని వచ్చాను. శాంతివనం క్రియాశీల కార్యక్రమాలలో మునిగి తేలుతూ ఉండడం వల్ల అన్నా కెరీనా చదవలేకపోయాను. అయితే యూట్యూబర్స్ వల్ల ఆ నవలను వినగలిగాను. ఇంకా యుద్ధము శాంతి నవలను చదవాల్సి ఉంది. ఇంకా చాలా పుస్తకాలు చదవాల్సే ఉంది.

మరో గ్రంథాలయ ఉద్యమం లో క్రియాశీలక పాత్ర పోషిస్తూ పుస్తకాలు చదవడానికి సమయం లేకపోవడం వల్ల ఆడియో బుక్స్ వినడం బాగా సౌకర్యంగాను చదవలేకపోయిన ఖాళీని భర్తీ చేసే విధంగాను మంచి మంచి కథలు నవలలు ఆడియో బుక్స్ రూపంలో అందుబాటులో ఉన్నాయి.

నా స్వభావం ప్రత్యేకమైన స్వభావం. ఒక పని ప్రారంభిస్తే వెనకడుగు వేయడం ఉండదు. ఆరు నూరైనా ముందుకు సాగడమే తెలుసు. ఈ స్వభావం వలన జీవితంలో ఎన్నో సంతోషాలను పోగొట్టుకున్నాను. అయినా సరే ముందుకే సాగిపోయాను. అలా నా జీవితంలో ప్రారంభించిన ముఖ్యమైన పని పుస్తకాలు చదవడం రాయడం సమావేశాలు నిర్వహించడం వర్క్ షాపులు నిర్వహించడం. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకొని సాహిత్యం వైపు ప్రయాణించానే  గాని వెన్ను చూపలేదు.

నానాటికి తెలుగు నేలపై పాఠకులు తగ్గిపోతూ ఉండడం కొంత బాధ కలిగించింది.కొంతమంది మిత్రులలో ఒక ఆలోచనను రేకెత్తించింది. అలా ప్రారంభమైందే వారధి రచయితల సహకార వేదిక.నేను, పెద్దింటి అశోక్ కుమార్ మల్లేశ్వరి, పలమనేరు బాలాజి, జి.వెంకటకృష్ణ, సుంకోజి దేవేంద్రాచారి కలిసి పుస్తకాల సహకార వ్యవస్థ ఏర్పరుద్దామని వారధిని ప్రారంభించాము.

24 మంది రచయితలతో కలిసి మొదటి పుస్తకం వేశాము. ఆ తర్వాత అది ముందుకు సాగలేదు. అయితే నేను మాత్రం ప్రయాణం ఆపలేదు ఒంగోలులో రీడర్స్ క్లబ్ ఏర్పాటు చేశాము. శాంతి వనం ఫౌండేషన్ ఏర్పాటు చేసి పది సంవత్సరాలు పాటు సాహిత్యాన్ని వదిలేసి గ్రామంలో పిల్లలతో అనేక ప్రయోగాలు చేసాము. గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేశాము. గ్రంథాలయాలు ఏర్పాటు చేశాము సంచార గ్రంథాలయాలు నడిపాము. పిల్లలతో కథలు కవిత్వం వ్రాయించాము. ఆర్టిస్టులను తయారు చేశాము.

వీటన్నింటి ఫలితంగా పుస్తకం పిల్లలను పిల్లల జీవితాలను మలుపు తిప్పుతాయి అనే సందేశం గ్రంథాలయం ఇచ్చింది. అప్పటినుండి ప్రయోగ వేదిక గ్రంథాలయ ఉద్యమం అయింది. అప్పటినుండే మరో గ్రంథాలయ ఉద్యమం మొదలైంది.

విద్యా విధానంలో ఉండే అనేక లోపాలు విద్యార్థులను ఎలాంటి సృజనశీలురుగా మారటానికి వీలులేని విద్య మాతృభాషపై పట్టులేని విద్య చదవడం తప్ప ఎలాంటి భావన ప్రక్రియలు తెలియని విద్యార్థి లోకం నన్ను మరో గ్రంథాలయ ఉద్యమానికి పురికొలిపాయి.

ఆంధ్రప్రదేశ్ లో ఈ ఉద్యమం రెండు మూడు సంవత్సరాలు నిర్వహించిన అనంతరం విద్యావ్యవస్థలోనూ గ్రంధాలయ వ్యవస్థలోను రావాల్సిన మార్పులను జరగాల్సిన సంస్కరణలను నిరంతరం మాట్లాడుతూ ప్రచారం చేస్తూ పౌర సమాజాన్ని మేల్కొల్పుతూ వారి సహకారంతోనే ఎన్నో కార్యక్రమాలను రూపొందించి నిర్వహిస్తూ తెలంగాణ మిత్రులతో కలిసి రెండు తెలుగు రాష్ట్రాలలోనూ మరో గ్రంథాలయ ఉద్యమ వ్యాప్తికి నిరంతరం పనిచేస్తూ ఉన్నాము.ఈ క్రమంలోనే దాదాపు పదిమంది బాల కవులను కథకులను పుస్తకాలు రాసే స్థాయికి తీసుకు రాగలిగాము. ఇటు ప్రభుత్వము అటు సమాజం రెండు వైపుల నుండి విద్యాలయాలలో గ్రంథాలయాలను ఏర్పాటు చేయడం ఒక నిరంతర ప్రక్రియగా ముందుకు సాగుతున్నాము.

నేను రాయడం చదవడం తగ్గినా నా విద్యార్థులు రాయడం నాకెంతో ఆనందాన్ని సంతృప్తిని కలిగించే విషయం.

ఇప్పుడు నా పుస్తకాలతో పాటు మా పిల్లలు రాసిన పుస్తకాలు కూడా ఆవిష్కరణకు సంసిద్ధమవుతున్నాయి. శిష్యులు ఎదిగినప్పుడు కలిగే ఆనందం గురువులకు వెలకట్టలేనిది.

Leave a Reply