సురగాలి అలజడికి 
ఆకులు రాలిపోవచ్చు
పువ్వులూ నేలను ముద్దాడొచ్చు

తుఫాన్ దాటికి
కాండం విరిగిపడొచ్చు
రక్షకముళ్ళన్నీ కొట్టుకుపోవచ్చు

గుండె నిండా
విశ్వమంత విశ్వాసం
భూగర్భంలోని వేర్ల మీద
భూతల్లి సారం మీద

నీటి ఎద్దటిలోనే
కాగితం పూలు వికసించును
దీనస్థితి ఆత్మగౌరవములా

ఆకురాల్చు కాలంలోనే
మోదుగు పువ్వులొస్తాయి
ప్రసవవేదనలో ఆఖరి కన్నీటిచుక్కలా

నేలపగుళ్ళ గాయానికి
చిరుజల్లుల చికిత్సల కాలమొస్తుంది
ఆరుద్రల ఎరుపుర్యాలీ పిలుపుతో
విత్తనపు సాలు సాగుతుంది కొత్తగా

“ప్రకృతి, పంట” రెండు తారకలు
శ్రమజీవుల కంటిరెప్పల దిగువన!
గస్తీ కాస్తారు
ఎర్రపొద్దు పొడిచే వరకు.!

Leave a Reply