తెలంగాణ రాష్ట్రంలోని చెర్లపల్లి జైలు నుండి చంచల్‌గూడ జైలుకు బదిలీ చేసిన ఒక రాజకీయ ఖైదీ, పగటిపూట తన జైలు గది (సెల్) బయట గడిపే కనీస హక్కు — కాస్సేపు ఎండలో నిలబడే — అలాగే ఖైదీలకు చట్టపరంగా కల్పించిన హక్కులను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, తొమ్మిది రోజులపాటు నిరాహార దీక్ష చేపట్టాడు.
అదే సమయంలో, ఒడిశాలో ఉన్న మరో రాజకీయ ఖైదీ సుప్రీంకోర్టు సత్వర పరిష్కారం జరపమని ఆదేశమిచ్చినప్పటికీ తన కేసుల పరిష్కరణలో జరుగుతున్న జాప్యాన్ని గురించి రెండు రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించాడు. ఆసుపత్రి మంచం మీద నుంచే ఇరవై రోజులపాటు నిరాహార దీక్ష కొనసాగించాడు.
ఇవి ఖైదీల ప్రాథమిక (పౌర) హక్కుల కోసం సాగించిన పోరాటాలు.
22 గంటల లాకప్‌కి వ్యతిరేకంగా సంజయ్ దీపక్ రావు తొమ్మిది రోజుల నిరాహార దీక్ష 62 ఏళ్ల రాజకీయ ఖైదీ సంజయ్ దీపక్ రావు, మావోయిస్టు కేసులో చెర్లపల్లి సెంట్రల్ జైల్లోని మానస బ్లాక్ లో 2023 సెప్టెంబర్ 16 నుంచి విచారణా ఖైదీగా ఉన్నాడు. రోజుకు 22 గంటల పాటు తనను సెల్‌లో బంధించి బయటకు రానివ్వకపోవడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించాడు. ఈ అన్యాయానికి నిరసనగా అక్టోబర్ 28న ఆయన నిరాహార దీక్ష ప్రారంభించాడు.
సంజయ్ డిమాండ్ పూర్తిగా చట్టబద్ధమైనది. అతని పోరాటం ఎంతో ప్రజాస్వామికమైనది; ఎంతో సమానత్వ స్పూర్తితో ఉన్నది. తనకే కాకుండా చెర్లపల్లి జైలులోని సింగిల్ సెల్ బ్లాక్ లుగా ఉన్న (మానస,మంజీరా) లో ఉన్న మిగతా ఖైదీలకు కూడా తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు తమ బ్లాక్‌లో స్వేచ్ఛగా తిరిగే హక్కు ఇవ్వాలనేది అతని డిమాండ్.
అతని పోరాటం, జైలు ఖైదీలకు ఉన్న కనీస మానవ హక్కుల కోసం జరిగిన ఒక న్యాయమైన నిరసన. పగటిపూట సెల్ బయట ఉండే హక్కు – పూర్తిగా చట్టబద్ధమైన హక్కు.
తెలంగాణ ప్రిజన్ రూల్ నం. 738 చెబుతున్నదేమిటి?:
“ఖైదీలను పగటిపూట సెల్‌లలో బంధించి ఉంచకూడదు. అయితే, ఎవరైనా విచారణా ఖైదీ తన ఇష్టప్రకారం సెల్‌లోనే ఉండాలని కోరుకుంటే, అతనికి ఆ అనుమతి ఇవ్వాలి.”
01-11-2025 నవంబర్ 1 నాడు, అంటే నిరాహార దీక్ష ఐదో రోజున, జైలు అధికారులు సంజయ్ నిరసనను అడ్డుకోవడానికి ఆయనను చెర్లపల్లి జైలు నుంచి చెంచల్‌గూడ జైలుకు బదిలీ చేశారు. అక్కడ ఆయనను నర్మదా సెల్‌లో ఉంచారు. అది కూడా సింగిల్ సెల్ కావడంతో, సంజయ్ తన నిరాహార దీక్షను అక్కడ కూడా కొనసాగించారు.
నవంబర్ 5 నాడు, సంజయ్ స్పృహ తప్పి పడిపోయాడు. తీవ్రమైన జ్వరం వచ్చింది. నిరాహార దీక్ష తొమ్మిదో రోజుకు చేరింది. వెంటనే, పరిస్థితి విషమించడంతో జైలు అధికారులు ఆయనకు ఈ కింద పేర్కొన్న హామీలు ఇచ్చి నచ్చజెప్పారు.
• ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సెల్ తెరిచి ఉంచుతారు.
• చదువుకోడానికి అవసరమైన పుస్తకాలు తెప్పించుకోవడంలో ఎటువంటి అడ్డంకి ఉండదని హామీ ఇచ్చారు. సంజయ్ చెంచలగూడా జైలుకు బదిలీ చేసారు కాబట్టి చర్లపల్లి జైలుకు సంబంధించిన అంశాల మీద ఇక్కడ నిరసన కొనసాగించడం సరైనది కాదని వివరించారు.
• చర్లపల్లి జైలులో 22 గంటలలాకప్ చేశారు. కానీ, చెంచల్‌గూడ జైలులో ఉదయం నుండి సాయంత్రం వరకు లాకప్ చేయమని స్పష్టమైన హామీ ఇచ్చారు.
ఈ హామీలతో సంజయ్ తన నిరాహార దీక్షను తాత్కాలికంగా విరమించారు.
హైకోర్టు జోక్యం:
మరుసటి రోజు ఉదయం, 2025 నవంబర్ 6 నాడు, సంజయ్ తరఫున దాఖలైన పిటిషన్ తెలంగాణ హైకోర్టు ముందు డబ్ల్యుపీ నం. 33783/2025 రూపంలో విచారణకు వచ్చింది. ఆ పిటిషన్‌లో ఈ క్రింది ప్రధాన ఆదేశాలను ఇవ్వాల్సిందిగా కోరారు.
• సంజయ్‌ను పగటిపూట, అంటే ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సెల్‌లో బంధించి ఉంచకూడదు.
• మహారాష్ట్ర ఇంకా ఇతర రాష్ట్రాల్లో ఉన్నకేసులలో హాజరు పరచడం లేదు కాబట్టి, సంబధిత కోర్టుల్లో క్రమం తప్పకుండా హాజరుపరచాలి.
హైకోర్టు ఈ క్రింది తాత్కాలిక ఆదేశాలను జారీ చేసింది
• సంజయ్‌కు తక్షణ వైద్య చికిత్స అందించాలి.
• ఆయన విషయంలో చట్ట ప్రకారం, నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలి.
• అదేవిధంగా, సోమవారం నాటికి ఈవిషయంలోఅన్నివివరాలుఅందజేయాలని చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌ను హై కోర్టు ఆదేశించింది.
జైలు అధికారుల హామీలు, మరుసటి రోజు హైకోర్టు ప్రతిస్పందనతో, సంజయ్ పోరాటం, తన డిమాండ్ల సాధన కోసం చట్టపరమైన పరిష్కారం వైపు అడుగుపెట్టింది.
రెండు రాష్ట్రాల్లో తన విచారణలను ప్రారంభించడంలో జరిగిన తీవ్రమైన ఆలస్యానికి వ్యతిరేకంగా ఆజాద్ @ దున్నా కేశవరావు పోరాటం
ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్‌లోని జర్పాడ హై సెక్యూరిటీ జైలులో రాజకీయ ఖైదీగా ఉన్న 52 ఏళ్ల దున్నా కేశవరావు (ఆజాద్) సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు.
గత 14 సంవత్సరాలుగా ఆయన విచారణ ఖైదీగా జైలులో ఉన్నారు.
2025 జూలై 21నాడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులో (డి. కేశవరావు వర్సెస్ ది స్టేట్ ఆఫ్ ఒడిశా & ఇతరులు, రిట్ పిటిషన్ (క్రిమినల్) నం. 511 ఆఫ్ 2024) ఈ క్రింది ఆదేశాలు జారీ చేసింది.
• ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లోఅజాద్ కేసులను విచారించడానికి ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలి.
• ఆజాద్‌పై పెండింగ్‌లో ఉన్న అన్ని కేసుల విచారణను ఒక సంవత్సరంలోపు .. అంటే 2025 సెప్టెంబర్ 1 నుండి 2026 ఆగస్టు 31లోగా పూర్తిచేయాలి.
అయితే, ఈ ఆదేశాలు అమలుకాకపోవడంతో ఆజాద్ 2025 అక్టోబర్ 15న నిరాహార దీక్ష ప్రారంభించి, నవంబర్ 4 వరకు, అంటే మొత్తం 21 రోజులపాటు, తన నిరసనను కొనసాగించారు.
నిరాహార దీక్ష, ఆసుపత్రిలో చేరిక , జైలు ఆసుపత్రికి తిరిగి వెళ్ళడం
ఒడిశా జైలులో ఆజాద్ పోరాటానికి సంబంధించిన వివరాలు.
• 15-10-2025: నిరాహార దీక్ష ప్రారంభం
• 21-10-2025: శారీరక పరిస్థితి క్షీణించడంతో క్యాపిటల్ హాస్పిటల్‌లో చేర్చారు.
• 27-10-2025: జైలు ఆసుపత్రికి తిరిగి బదిలీ చేశారు.
• 03-11-2025: మళ్లీ ఆరోగ్యం విషమించడంతో క్యాపిటల్ ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు.
• 04-11-2025: నిరాహార దీక్ష ముగిసింది
ఒడిశా మానవ హక్కుల కమిషన్ (OHRC) జోక్యం, కేసు నంబర్ 3714/2025
• 14-10-2025: OHRC కేసు నమోదు చేసి, హోం శాఖను నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
• 31-10-2025: నివేదిక ఆలస్యమైనందున రిమైండర్ నోటీసు జారీ చేసింది.
• 04-11-2025: నివేదిక అందింది.
OHRC ప్రత్యేక కోర్టుల ఏర్పాటు కోసం ఆర్థిక శాఖ నిధులు విడుదల చేయాలని సిఫార్సు చేసింది.
• 20-11-2025 తారీకు లోపల తదుపరి నివేదికను సమర్పించాలని ఆదేశించింది.
నిరాహారదీక్షతో అతని ప్రాణం ప్రమాదంలో పడుతుంది అని తెలిసికూడా, ఆసుపత్రి పడకపై చేరిన తర్వాతనే ఈ వ్యవస్థ ఆజాద్ విషయంలో స్పందించింది.
ఆజాద్ విషయంలో ఆంధ్రప్రదేశ్ & ఒడిశా రాష్ట్రాలలోజరిగిన పరిణామాలు
• 2025 అక్టోబర్ 25నాడు, దున్నా కేశవరావుపై ఉన్న కేసుల విచారణ కోసం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళంలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలి. ఇందుకు సంబంధించి అధికారిక నోటిఫికేషన్ జారీ చేయబడింది.
• ఒడిశా ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయడానికి అవసరమైన చర్యలు ప్రారంభించింది.
ఈ పోరాటాలు మనకు ఏమి చెబుతున్నాయి?
• భారతదేశంలోని అన్ని జైళ్లలోనూ కొన్ని సాధారణమైపోయిన, తీవ్రమైన సమస్యలు ఉన్నాయి .
• ఖైదీలు అనవసరంగా చాలా కాలం జైలులో ఉండిపోవడం
• సింగిల్ సెల్‌లలో ఒంటరితనానికి గురిచేయడం.
• ఖైదీలను కోర్టుల ముందు క్రమం తప్పకుండా హాజరుపరచడంలో వైఫల్యం.
• వైద్య చికిత్సలో నిర్లక్ష్యం, సరిపోని వైద్య సౌకర్యాలు.
చట్టాలు ఉన్నప్పటికీ, వాటిని అమలు చేయాలనే సంకల్పం జైలు గుమ్మం దగ్గరే ఆగిపోతుంది.
చట్టాలను అమలు చేయించుకోవడానికి ఖైదీలు నిరాహార దీక్షలు చేయాల్సిన పరిస్థితి రావడం, మన న్యాయవ్యవస్థలోని లోపాలను స్పష్టంగా చూపిస్తుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు కూడా అనేక సార్లు అమలు కాకపోవడం ఒక విడ్డూరం.
నెల్సన్ యుద్ధంలో తన చూపు లేని కంటికి టెలిస్కోప్ పెట్టి, “నాకు ఒక కన్ను మాత్రమే ఉంది, దానిని కూడా నేను కొన్నిసార్లు మూసుకోవచ్చు” అని అన్నట్లే,
జైలు అధికారులు కూడా సుప్రీంకోర్టు ఆదేశాలను చూడనట్టుగా, పట్టించుకోనట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఒకరకంగా చట్టాలపట్ల, కోర్టుతీర్పుల పట్ల అవగాహన ఉన్నప్పటికీ అవగాహన లేనట్లుగా నటిస్తారు.
ఒక సాధారణ వ్యక్తి సుప్రీంకోర్టు వరకు వెళ్లి ఒక ఉత్తర్వు పొందడం ఎంత కష్టమో మనందరికీ తెలుసు. కానీ ఆ ఉత్తర్వు వచ్చిన తర్వాత కూడా దానిని అమలు చేయించుకోవడానికి, ‘నెల్సన్ ఐ దృష్టితో ఉన్న అధికారిక వ్యవస్థపై’ ఖైదీలు మళ్లీ పోరాడాల్సి రావడం,మన ప్రజాస్వామ్య న్యాయ వ్యవస్థలో ఒక చేదు నిజం.
సంజయ్, ఆజాద్ పోరాటాలు మనకు చూపిస్తున్న సత్యాలు:
• జైళ్లలో చట్టం ఎలా అదృశ్యమవుతుందో, సంజయ్, aజాద్ ఇద్దరూ తమ ప్రాణాలను పణంగా పెట్టిచేసిన ఈ నిరాహార దీక్షలు చెపుతున్నాయి.
• జైల్లో ఉన్నవారికి కూడా హక్కులు ఉన్నాయని, కానీ ఆ హక్కులను పొందడానికి తమ ప్రాణాలతో పోరాడాల్సిన పరిస్థితి వస్తోందని వారు స్పష్టంగా తెలియజేశారు.
• జైలులో ఉండటం అంటే హక్కుల కోసం పోరాడే హక్కును కోల్పోవడం కాదని, ఈ పోరాటాలు మనకు గుర్తు చేశాయి.
దున్నా కేశవరావు 21 రోజుల పాటు నిరాహార దీక్ష కొనసాగించి, తన ప్రాణాలకు ముప్పు తెచ్చుకున్నాడు.
62 ఏళ్ల సంజయ్ దీపక్ రావు కూడా తొమ్మిది రోజులపాటు నిరాహార దీక్ష చేపట్టి, అదే రీతిగా తన ప్రాణాలను పణంగా పెట్టాడు.
వారి డిమాండ్లు కొత్తవి కావు . ఇప్పటికే ఉన్న చట్టాలను,జైలునిబంధనలను, సుప్రీంకోర్టు తీర్పుల్లో స్పష్టంగా పేర్కొన్న ఆదేశాలను అమలు చేయాలనే విన్నపం చేసారు.
ఈ సందర్భం ఒక గంభీరమైన ప్రశ్నను లేవనెత్తుతుంది .
రాజ్యాంగానికి విధేయత చూపుతామని, చట్టాన్నిగౌరవిస్తామని, అత్యున్నత న్యాయస్థాన ఆదేశాలను పాటిస్తామని ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించే జైలు అధికారులు, ప్రభుత్వ అధికారులు ఎందుకు వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యం చూపుతున్నారు?
PS: సంజయ్ దీపక్ రావు నిరహారదీక్ష ఫలితంగా చర్లపల్లి జైలులో(మహానది) నక్సలైట్ల కోసం ఉన్న ప్రత్యేక బ్లాక్‌ను తిరిగి తెరిచారు.




