సదస్సు
7, డిసెంబర్ 2025 ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 5.30 దాకా
సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్ లింగంపల్లి, హైదరాబాదు
నేల నెత్తుటి చిత్తడిగా మారుతున్నది. చరిత్ర విలపిస్తున్నది. తాను కన్న అత్యుత్తమ వీరుల మరణాలతో బెంగటిల్లుతున్న ది. విప్లవకారుల అమరత్వం మన కాలపు మహా విషాదంగా ఆవరించింది. దీన్ని తట్టుకొని నిలబడటం కష్టమే. కానీ తప్పదు. వందల వేల ఏళ్లుగా మానవాళి మోసుక తిరుగుతున్న స్వప్నం గాయపడిన వేళ చరిత్ర మీద తార్కిక విశ్వాసం నిల బెట్టుకోవాల్సిందే. దుఃఖంతో పూడుకపోతున్న మన కంఠస్వరాన్ని భవిష్యత్ నిర్మాణానికి తగినట్లు సవరించుకోవాల్సిందే. ఇంతటి ఆపద కాలంలో సాయుధ పోరాట విరమణ పేరుతో ప్రజా ఉద్యమాలన్నిటినీ అవమానపరుస్తూ ఇద్దరు అగ్ర నాయ కులు సాయుధంగా లొంగిపోయారు. భారత విప్లవ పంథా తప్పనీ, అతివాదమనీ, అందువల్ల అన్నీ తప్పులే జరిగాయనీ ప్రకటించారు.
వాస్తవానికి గత ఇరవై ఏళ్లలో సల్వాజుడుం దగ్గరి నుంచి ఎన్నో తీవ్రమైన దాడులను దాటుకుంటూ భౌగోళికంగానేగాక, సామాజికంగా, రాజకీయంగా కూడా దేశవ్యాప్తంగా విప్లవోద్యమం విస్తరించింది. కార్పొరేట్ వర్గాల ప్రయోజనం కోసం గత ప్రభుత్వాలు చేపట్టిన అణచివేత వల్ల, ఇప్పటి బీజేపీ నడుపుతున్న అంతిమ యుద్ధం వల్ల కుదింపుకు లోనైంది. తీవ్రంగా నష్టపోతున్నది. ఈ యుద్ధ కాలంలో విప్లవోద్యమం ముందున్న సవాళ్లను సవాళ్లను అభిమానులు వాస్తవ దృష్టితో పరిశీలించాలి. విప్లవోద్యమ పంథా ప్రజా ఆచరణలోకి, అనుభవంలోకి ఎట్లా వచ్చిందో మాట్లాడుకోవాలి. సంక్షోభంలో చిక్కుకపోయిన విప్లవోద్యమాన్ని కాపాడుకోడానికి సిద్దం కావాలి.
ఈ శతాబ్దపు ప్రపంచ విప్లవోద్యమాల్లో భారత మావోయిస్టు ఉద్యమానికి ఉన్న ప్రాధాన్యత వల్ల సహజంగానే పెద్ద
ఎత్తున ఉద్యమపంథా మీద చర్చ జరుగుతున్నది. సాయుధ పోరాటాన్ని ఎంచుకోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందనే వాదన దగ్గరి నుంచి, ఇప్పటికైనా దాన్ని వదిలేసుకోవడమే సరైన నిర్ణయం అనే దాకా మాట్లాడుతున్నారు. పెట్టుబడి పెరిగింది కాబట్టి ఈ పంథా నడపదనీ, ప్రజాస్వామ్యం విస్తరించింది కాబట్టి ఇక విప్లవమే అక్కర్లేదనీ కొందరు అంటున్నారు. సాయుధ పోరాటం ఒక రూపమేగాని, సర్వత్రా దాన్ని ఎంచుకోవాల్సిన పని లేదని చెబుతున్నారు. సారాంశంలో రాజ్యం బలపడింది కాబట్టి ఆయుధాలతో గెలవలేరనీ, విప్లవానుకూలంగా మారుతున్న పరిస్థితులను దీర్ఘ కాలిక ప్రజా యుద్ధ పంథా అందుకోలేదనీ తేల్చేశారు. అసలు ప్రపంచమే ఇరవై ఒకటో శతాబ్దంలో వర్గపోరాటం నుంచి ఎన్నికల్లోకి వచ్చిందనీ అన్నారు.
ఇన్ని వాదనలు చేసినా, చివరికి ఏం చేయాలో ఎవ్వరూ చెప్పలేదు. చెప్పాలని కూడా అనుకోలేదు. తెలియక చెప్పలేదని అనుకోవాలా? మరి దీర్ఘకాలిక ప్రజాయుద్ధం తప్పని ఎట్లా తెలిసింది? కంటికి కనిపిస్తున్న వాటి మీద ఆధారపడి నిర్ధారణలకు వచ్చారన్నమాట. ప్రియమైన వైఖరులకు తగిన వాదనలు చేశారన్నమాట. తమ వాదనలకు తగినట్లు వాస్త వాలను కుదించారన్న మాట. సారంలోకి వెళ్లకుండా సుభాషితాలు చెప్పారన్నమాట. మేధావులు ఇట్లా వ్యవహరించవచ్చునా? అనే ప్రశ్న తలెత్తుతుంది. అంటే వీళ్లెవరూ విప్లవాన్ని సమగ్రంగా, సిద్ధాంత ఆచరణల కలయికగా చూడటం లేదు. ప్రజల్లోకి వచ్చి విప్లవం చేయాలని పైపై మాటలు చెప్పారు. ప్రజలను వదిలేసి ఎత్తుగడల పేరుతో కసరత్తు చేశారు. అటు తిరిగి, ఇటు తిరిగి చివరికి ఓట్ల రాజకీయాలతో విప్లవం సాధించమని చెప్పదల్చుకున్నారా? దానికి ఇంత కసరత్తు దేనికి? ఇన్ని మాటలు ఎందుకు? అంతకంటే సులభ మార్గం ఏముంది? అదెట్లా విప్లవం అవుతుంది? లొంగిపోయిన వాళ్లదీ ఇదే భాష, అటూ ఇటూ మాటలు ఎట్లా కలుస్తున్నాయో చూడండి. అందరూ ఒకటి కానేకాదు. వర్గపోరాటాన్ని వదిలేసుకున్నా, అర్థం చేసుకోలేకపోయినా ఒకే తీరం చేరుతారనేది మాత్రం నిష్టుర సత్యం.
నిజానికి మారుతున్న పరిస్థితులన్నీ విప్లవాన్ని కోరుతున్నాయి. దీర్ఘకాలిక ప్రజాయుద్ద అనివార్యతను సూచిస్తున్నాయి. చట్టబద్ధ, సాయుధ పోరాటాల మేలు కలయికను గతంకంటే బలంగా ముందుకు తెస్తున్నాయి. అన్ని రంగాల్లో జరుగుతున్న మార్పులు విప్లవ పంథాను మార్చుకోమని సూచించడం లేదు. ఇప్పుడున్న వ్యూహాన్ని వదిలేసుకోమని చెప్పడం లేదు. పైగా దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంథాను బలపరుస్తున్నాయి. నిజానికి జరగవలసింది పోరాట రూపాల చర్చ. చట్టబద్ద పాలన ఎంత కుంచించికపోయినా సరే, ఆ పరిధిలో ప్రజా పోరాటాలు నిర్మించాల్సిందే. రాజ్యం ఎంత బలవత్తరశక్తిగా మారినా సరే, సాయుధ పోరాట మార్గంలో ప్రజల క్రియాశీలత పెంచాల్సిందే. ప్రజలే నిజమైన విప్లవశక్తి అనే చారిత్రక సత్యాన్ని రుజువు చేయాల్సిందే. ఈ పనులకు ఎన్ని ఆటంకాలైనా ఉండవచ్చు. వాటిని అధిగమించేందుకు పోరాట మార్గాన్ని వదిలేస్తే ప్రజలను వంచించినట్లే. ద్రోహం చేసినట్లే. విప్లవ కర్తవ్యాన్ని వదిలేసినట్లే. మారుతున్న పరిస్థితులకు తగినట్లు సృజనాత్మకంగా పని చేయాల్సిందే.
విప్లవమంటేనే అననుకూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకొని అంతిమ విజయం సాధించడం. ఫాసిస్టు కగార్ యుద్ధం, అంతర్గత విద్రోహం భారత విప్లవోద్యమ చరిత్రలో అతి పెద్ద అననుకూల సందర్భం. కానీ దీన్ని అధిగమించే అనుకూల అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. కుట్రలను, అన్ని వాదనలను, అన్ని విమర్శలను దాటుకొని, అన్నిటి నుంచి నేర్చుకుంటూ ముందుకుపోవడానికి ఇంత కంటే విషాదకర, ఉద్విగ్న, ఆలోచనాత్మక సందర్భం ఏముంటుంది?
భారత విప్లవోద్యమాన్ని నిర్మూలించడానికి రాజ్యం బరితెగించి దాడి చేస్తున్నది. విప్లవోద్యమ పంథా తప్పనే చర్చ
ముమ్మరంగా సాగుతున్నది. మూడు తరాలుగా, లక్షలాది మంది భాగస్వామ్యంతో, వేలాది మంది బలిదానాలతో
సాగుతున్న విప్లవోద్యమాన్ని ప్రభుత్వం నిర్మూలించగలదా? భౌతికంగా ఒక నిర్మాణం ఎంత దెబ్బతినిపోయినా ఇంత కాలం అది అనుసరించిన పంథా తప్పయిపోతుందా? ఇదీ ఇవాళ విప్లవాభిమానుల తేల్చుకోవాల్సిన విషయం. చారిత్రకంగా, తాత్వికంగా విప్లవోద్యమ పంథా ఎందుకు సరైనదో గతంకంటే లోతుగా, అన్ని వైపుల నుంచి వివరించాల్సిన సందర్భమిది.
అందుకే పూర్వ విప్లవ విద్యార్థుల వేదిక భారత దీర్ఘకాలిక ప్రజా యుద్ధ పంథా- సమకాలీన సందర్భం అనే
పుస్తకావిష్కరణతో పాటు ఈ సదస్సు ఏర్పాటు చేస్తున్నది. మన ఆశను, ధ్యాసను విప్లవాత్మకంగా నిలబెట్టుకోవలసిన సమయం ఇది. విప్లవం ముందున్న సవాళ్లన ఆవేశకావేశాలతోకాక లోతైన అంతర్మథనంతో అర్థం చేసుకోవలసిన తరుణమిది. గతాన్నీ, వర్తమానాన్నీ హేతబద్దంగా మదింపు వేయవలసి ఉన్నది. భవిష్యత్తు కోసం వ్యూహాత్మకంగా ఆలోచించాల్సి ఉన్నది. అప్పుడే విప్లవాభిమానులుగా, విద్యావంతులుగా ఈ దేశ ప్రజల మహత్తర చారిత్రక కర్తవ్యానికి దోహదం చేసినట్లు.
విప్లవం గురించి మాట్లాడాలంటే ముందు దాన్ని అర్థం చేసుకోవాలి. ఇది తొలి షరతు. ఆచరణలో విప్లవోద్యమాన్ని
తెలుసుకున్నవారే దాని సిద్దాంత బలాన్ని పెంచగలరు. యుద్ధకాలంలో ప్రజాయుద్దాన్ని తెలుసుకోగలరు. మంద్రస్థాయి యుద్ధానికి దీర్ఘకాలిక యుద్ధమే ప్రత్యామ్నాయ గ్రహించగలరు. యుద్ధమంటే సైనిక రంగమే కాదని, అది సువిశాల మానవ జీవితాన్ని విప్లవాత్మకంగా తీర్చిదిద్దే శాస్త్రీయ మార్గమని చాట చెప్పగలరు. ఈ వ్యవస్థను మార్చి కొత్త చరిత్రను నిర్మించే సృజనాత్మక ప్రజా ఆచరణ అని నిరూపించగలరు. ఈ విషయాల్లో సాయుధ ప్రతీఘాతుకత్వం అనేక సందేహాలను లేవదీసి ఉండవచ్చు. చుట్టూ జరుగుతున్న చర్చల్లోంచి చాలా ప్రశ్నలు తలెత్తి ఉండవచ్చు. వాటన్ని గురించి మాట్లాడుకోవాల్సిందే. అన్నిటికీ సమాధానాల కీ సమాధానాలు వెతకవలసిందే. ఈ సదస్సుకు రండి. విజయవంతం చేయండి. ఇదే సాదర ఆహ్వానం
ఉ. 10 గంటలకు: ప్రారంభోపన్యాసం
వక్త: అజిత్ (రచయిత, విప్లవోద్యమ మేధావి, కేరళ)
అధ్యక్షత: ఎం. సాంబమూర్తి(కన్వీనర్, పూర్వ విప్లవ విద్యార్థి వేదిక)
‘భారత విప్లవ పంథా-సమకాలీన సందర్భం పుస్తకావిష్కరణ
అమరురాలు మిడ్కో తండ్రి సోమయ్య
11.00 గంటలకు: భారత సమాజం- ఉత్పత్తి సంబంధాలు
వక్తలు: వై, రాజశేఖర్, ఎన్. వేణుగోపాల్
అధ్యక్ష వర్గం:యాకయ్య, జయ
12.30 గంటలకుః దేశ ప్రజలపై కగార్ దాడి
వక్త: ప్రొ. లక్ష్మణ్
అధ్యక్షవర్గం: అయూబ్, విజయరామరాజు
1.00 గంటకు భోజన విరామం
2.00 గంటలకుః దీర్ఘకాలిక సాయుధ పోరాట పంథా
వక్తలుః మహ్మద్ హుస్సేన్, ఎన్. రవి
అధ్యక్ష వర్గం: బిజిగిరి శ్రీనివాస్, ఝాన్సీ
4.00 గంటలకు: విద్రోహాలు, త్యాగాలు, ఫాసిస్టు సందర్భంలో విప్లవోద్యమం
వక్తలు: ప్రవీణ్‌కుమార్, పాణి
అధ్యక్షవర్గంః నవజ్యోతి, లక్ష్మారెడ్డి
ప్రతి సెషన్ తర్వాత ప్రశ్నలు జవాబులు ఉంటాయి.
పూర్వ విప్లవ విద్యార్థుల వేదిక
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్




