మావోయిస్టుల కాల్పుల విరమణ ప్రతిపాదన లక్ష్యం సాధారణ ప్రజల ప్రాణ రక్షణేనా? అంతకంటే విశాలమైన ఉద్దేశం మరేదైనా ఉన్నదా? హింస లేని సమాజం కావాలనే వాళ్ల కోరికను ఎలా అర్థం చేసుకోవాలి? అనే చర్చ జరుగుతున్నది. గతంలో మవోయిస్టులకు-ప్రభుత్వానికి మధ్య జరిగిన శాంతి చర్చల్లో అనుకూల, ప్రతికూల ఫలితాలను చూసిన సమాజం అలిసిపోకుండా, నిరాశకు గురికాకుండా మళ్లీ అట్లాంటి ప్రయత్నానికి మానసికంగా సిద్ధమవుతున్నది.

ఇది మన సమాజ స్థితిని ఎత్తిపట్టే బలమైన సూచిక. సమాజం చాలా చెడిపోయిందని, ఎవ్వరి గురించి ఎవ్వరికీ పట్టని చైతన్యరహిత దశకు చేరుకున్నదనీ కొందరు అంటూ ఉంటారు. ఇదేమీ దురభిప్రాయం కాదు. అవాస్తవం కానే కాదు. అలాంటి ధోరణి బలంగానే ఉన్నది.

అయితే సమాజాన్ని, ప్రజల మనోస్థితిని సరళరేఖలాగా చూడటానికి లేదు. చాలా సంక్లిష్టమైన, జటిలమైన క్రమాలు ఉన్నాయి. గతంలో రెండు విప్లవ పార్టీలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శాంతి చర్చలు  జరిపినప్పటి వాతావరణం ఇప్పుడు లేదు. కేవలం శాంతి చర్చల విషయంలోనే కాదు. అన్ని సామాజిక క్రమాలు తీవ్రమైన ప్రతికూల పరిస్థితుల్లో సాగుతున్నాయి. ఇరవై ఏళ్ల కిందటితో పోలికే కాదు. బహుశా అధికార మార్పిడీ జరిగినప్పటి నుంచి గడచిన చరిత్ర చూస్తే ఇంత ప్రమాదకర పోకడలు ఎన్నడూ లేవని చెప్పవచ్చు.

అయినప్పటికీ మన సమాజం  ఒట్టిపోలేదని, ఉన్నత ఆదర్శాలతో, భవిష్యత్తులో ఎన్నటికైనా నిజం కాగల స్వప్నాలతో కొనసాగుతున్నదనడానికి నిదర్శనంగా ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నది.  అందులో ఒకటి ఈ విడత శాంతి చర్చల పట్ల ఆసక్తి.

అట్లని దీనికి అతిశయాలను ఆపాదించలేం. చాలా పరిమితులు ఉన్నాయి. పరస్పర భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. మాటలకు, ఆలోచనలకు, ప్రజాస్వామిక విలువలకు కేంద్రంలోని బీజేపీ వ్యతిరేకమని ఇంత కాలం చెప్పిన వాళ్లే ఇప్పుడు శాంతి చర్చలకు సిద్ధం కావాలని కోరుకోవడంలో అత్యాశ లేదా? అనే ప్రశ్న కూడా సమాజం నుంచి వినిపిస్తోంది. ఈ స్పందన చాలు.. మన చుట్టూ ఆరోగ్యకమైన వాతావరణం ఉన్నదని నమ్మడానికి. ప్రభుత్వం ఎట్లా ఉన్నదో, ఎట్లా ఉండకూడదో ఎరుకను ప్రదర్శించడానికంటే ఏం కావాలి?

ఇదే శాంతి చర్చలకు బలమైన ప్రాతిపదిక. కాల్పుల విరమణపై జరుగుతున్న చర్చ మావోయిస్టులకు, ప్రభుత్వానికి సంబంధించింది మాత్రమే అనే వాళ్ల కొందరు ఉన్నారు. అదే నిజమైతే ఇతరులకు ఈ వ్యవహారంతో సంబంధం లేనట్లే. కానీ శాంతి ఒక జీవన విలువ. సమాజం చేరుకోవాల్సిన దశ. ప్రజాస్వామ్యానికి గీటురాయి.

శాంతి గురించి మాట్లాడటమంటే హింస వద్దని గట్టిగా కోరుకోవడమే. హింస సాధారణ జీవన తలాలన్నిటినీ ధ్వంసం చేస్తుంది. మానవ సహజ ఉద్వేగాలను, ఆకాంక్షలను, వాటి వ్యక్తీకరణను కాలరాస్తుంది. హింస కొనసాగినంత కాలం శాంతి ప్రజల జీవితానుభవంగా మారదు. ఈ రెంటి తులాభారాన్ని తేల్చగలిగేది న్యాయం. మనం ఒక మాటగా న్యాయం అని అంటాం. కానీ న్యాయం అమూర్త భావన కానేకాదు. పీడితులకు, మెజారిటీ ప్రజలకు, ఈ వ్యవస్థను తమ రెండు రెక్కల శ్రమ మీద మోస్తున్న కష్టజీవులకు, సామాజికంగా అంచుల్లో బతుకుతున్నవాళ్లకు, అడుగడుగునా సామాజిక సాంస్కృతిక వివక్షలకు బలైపోతున్న వాళ్లకు న్యాయం దక్కకపోవడం కంటే హింస ఏముంటుంది? అశాంతి ఏముంటుంది? న్యాయ రాహిత్యమే అతి పెద్ద హింస.  దానికి గురయ్యేవాళ్లు మాత్రమే శాంతిని కోరుకుంటారు. వీళ్లు..శాంతి కనుచూపు మేరలో ఉన్నప్పుడు దాన్ని ఆహ్వానించేవారు కాదు. శాంతి సాధన దుర్భరమని తెలిసినా, దానికి లెక్కలేనన్న సవాళ్లు ఉన్నాయిని తెలిసినా, అశాంతిలో బతుకుతున్న వాళ్లుగా శాంతి గురించి తెలుసు కాబట్టి దాని కోసం నిరీక్షిస్తూనే ఉంటారు. అలాంటి వాళ్ల జీవితానుభవం పట్ల గౌరవం ఉన్న వాళ్ల మాత్రమే హింస లేని సమాజం కావాలనుకుంటారు.

అసమానతల మధ్య న్యాయ భావనకు ఉండదు.  అసలు సమానత్వం మొదలు కావాల్సింది న్యాయం దగ్గరే. చట్టంలో న్యాయ భావన ఉన్నా జీవన వాస్తవికతలోని అన్ని పొరల్లో మనుషుల మధ్య సమానత్వం ఉన్నదా? అనేది అతి పెద్ద సామాజిక ప్రశ్న. మాట వరసకు మనం సమానత్వం అంటాంగాని సమానత్వాలు అనాలి. అదే సరైనది. సమగ్రమైనది. ఇద్దరు వ్యక్తుల మధ్య, రెండు సమూహాల మధ్య, రెండు జీవితాల మధ్య  సర్వ సమగ్రమైన సమానత్వం ఎట్లా ఉంటుందో మనం ఇంకా అన్వేషించాల్సే ఉన్నది. తెలుసుకోవలసే ఉన్నది. అసలు అన్ని రకాల అసమానతలపై మన చూపు ప్రసరిస్తున్నా? సమ దృష్టి ప్రదర్శించగలుగుతున్నామా? మన  వివేకాన్ని, దృక్పథాలను, ఆచరణ రూపాలను కఠినంగా, సునిశితంగా పరీక్షించుకోవాల్సిందే. 

వ్యక్తులకు ఈ అంతర్‌ దృష్టికి ఇవ్వడమేగాక, మన సమాజాన్నే ఈ దిశగా నడిపిస్తున్న అనేక ఉద్యమాల్లో మావోయిస్టు ఉద్యమం ఒకటి. సమానత్వం అనేది బహు దూరంలో ఎన్నడో సాధించాల్సిన లక్ష్యం అనుకోకుండా దాన్ని ఇప్పటి నుంచే జీవితంలో భాగం చేయడానికి ఆ ఉద్యమం ప్రయత్నిస్తోంది. దీని కోసం మావోయిస్టులు వ్యక్తులుగా తమ నేపథ్యాల వల్ల సంక్రమించిన అన్ని అసమ భావనలను ఆచరణలో రద్దు చేసుకోగలుగుతున్నారు. ఆధిక్య, ఆధీన స్థానాలను విసర్జించి, సమానతా విలువల ప్రాతిపదిక మీద ఉద్యమాన్ని నిర్మిస్తున్నారు. తమకు అనుకూలించినప్పుడు లెక్కలేనన్ని సమూహాల ప్రజల్లో, అసంఖ్యాక పోరాట రూపాలను ఎంచుకున్నాÑ నిర్బంధం వల్ల ఈ సంఖ్య తగ్గిపోయినా విలువల రీత్యా ఈ సమాజంలో సమానత్వ సాధన అనే లక్ష్యం కోసం పని చేస్తున్నారు. దాని పట్ల వాళ్ల గురి ఎట్లాంటిదంటే సమానత్వ సాధనలో ప్రాణాలు ధారపోయడానికి సిద్ధమయ్యేంత నైతికశక్తి వాళ్లకు పుష్కలంగా ఉన్నదని ఎన్నడో రుజువైంది. సిద్ధాంత పటిష్టతకంటే, రాజకీయ లక్ష్యాలకంటే బహుశా సమానత్వ విలువ పట్ల ఉండే నిబద్ధతే వాళ్లను నడిపిస్తున్నదని చెప్పవచ్చు.

సమానత్వ కాంక్ష ఎంత బలీయమైనదంటేÑ అసమానతే సహజమని, విధి లిఖితమని, మార్చలేమని భావించే పాత రోజుల్లో కూడా మనుషులు సమానత్వాన్ని కోరుకున్నారు.  దాని కోసం వ్యక్తులు, ప్రజా సమూహాలు బలిదానాలు చేశారు. అందువల్ల ఆధునిక యుగంలో సమానత ఒక విలువగా నిలదొక్కుకుంది. ఎన్నటికైనా సాధించాల్సిన కర్తవ్యమైంది. దానికి ఊతమిస్తూ రాజ్యాంగంలో అక్షర బద్ధమైంది. ఆ పక్క పేజీల్లోనే అసమానతలు పెరగడానికి ఎన్నో రాసుకున్నా, అసమానతలకు  దారులు తెరిచి చూపించినా,  సమానత్వమనే ఆధునిక విలువను రాజ్యాంగంలో లిఖించకతప్పలేదు. అసమానతలు కోరుకొనే ఆధిపత్య వర్గం రాజ్యాంగ యంత్రం మీద ఉడుంపట్టు కొనసాగిస్తున్నా.. ప్రభుత్వం సమానత్వాన్ని సాధించాలని రాజ్యాంగం ఆదేశించింది.

మన వ్యవస్థ ఎంత విచిత్రమైనదంటే అసమానతల మధ్యేగాక సమానత సాధించాలనే రెండు ఆశయాల మధ్య, భావజాలాల మధ్య, ప్రక్రియల మధ్య తుపాకీని నిలబెట్టింది. దాని అసమాన పునాదులు అంత బలీయమైనవి. అసమానత మీద ఆధారపడిన ఈ వ్యవస్థ ప్రాణం హింసలో దాగి ఉంటుంది. తుపాకులతోనే ఈ హింసా రాజ్యం బతుకుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని గట్టిగా ప్రశ్నించేవాళ్లెవరైనా తుపాకీ ధరించకుంటే సమానత్వ కాంక్ష వినిపించని సాయుధ దుర్గమారణ్యంలో వ్యవస్థ జీవిస్తూ ఉంటుంది. సమానత సాధించమనే రాజ్యాంగ ఆదేశాన్ని పాటించాల్సిన రాజ్యం అసమానతల వైపు మొగ్గడంతో, మరిన్ని అసమానతలను లేవదీయడంతో, వాటిని వ్యవస్థీకృతం చేయడంతో  ప్రజలు సమానత్వ సాధన  కోసం తుపాకీ పట్టుకోక తప్పని స్థితి కల్పించింది.

సమానత, అహింస, శాంతి, న్యాయం.. అనే భావనలు కాగితాల మీది నుంచి నేల మీదికి రావాలంటే అతి ముఖ్యమైన షరతు దోపిడీ రద్దు కావాలి. అది జరిగినంత మాత్రాన మిగతావి యథాతధంగా జీవితంలోకి వచ్చేస్తాయని చెప్పలేం. అలాంటి అవకాశాలు ఉండవు.  దేనికంటే  దోపిడీ రద్దుకాగల దశకు సమాజం ఎదగడమంటేనే సమానత్వాన్ని సాధించినట్లు. న్యాయం జరిగినట్లు, శాంతి వర్థిల్లినట్లు. 

ఈ గోదాలోకి వెళ్లవద్దని మనం ఎంత అనుకున్నా తప్పదు.

మావోయిస్టులైతే ఉద్దేశపూర్వకంగానే ఈ గోదాలోకి దిగి దశాబ్దాలుగా పోరాడుతున్నారు. దోపిడీతో ముడిపడిన అశాంతిని తొలగించాలని, హింసను నివారించాలని. అంతిమంగా సకల సమానత జీవన సహజాతంగా మారే సమాజాన్ని సాధించాలని ఉద్యమిస్తున్నారు. దోపిడీని రద్దు చేయడానికి ఆయుధాలు తప్పనిసరై ధరించినవారే, ఇంకోపక్క నుంచి  సమానత్వ సాధనకు, న్యాయ పరిరక్షణకు శాంతిని ఆయుధంగా స్వీకరించారు.

దోపిడీ సంగతి తాత్కాలికంగా పక్కన పెడితే హింసలేని సమాజం, న్యాయం వర్థిల్లే జీవితం కోసం శాంతికి సిద్ధమయ్యారు. దాని కోసం ముందస్తుగా తామే కాల్పుల విరమణ పాటిస్తున్నారు. ఏప్రిల్‌ 2వ తేదీ నుంచి ప్రభుత్వం ఎంత మందిని హత్య చేసింది? ఎన్ని ఏరుల నెత్తురు పారించింది? ఎంత కన్నీరు ప్రవహింపజేసింది? ఎన్ని శవాలను, ఎంత చితాభస్మాన్ని మాయం చేసింది? కానీ శాంతిని సువిశాల జీవితార్థంగా నిర్వచించుకున్న విప్లవకారులు కవ్వింపులకు లోనుకాలేదు. తూటా పేల్చలేదు.

దేనికంటే వాళ్లకు తక్షణ ఫలితాల మోజు లేదు.  చర్యకు ప్రతిచర్యను ప్రతిష్టగా భావించరు. చివరికి చర్చకు  ప్రతిచర్చ చేయాలని కూడా అనుకోరు. ఒక నిండైన, అర్థవంతమైన, సమగ్రమైన చర్చ కోరుకుంటారు. అందుకే గతంలో శాంతి చర్చలకు వచ్చినప్పుడు కూడా సమానత్వ సాధన కోసం అసమాన భూ సంబంధాలను రాజ్యాంగ ఆదేశాల మేరకైనా మార్చాలని ప్రతిపాదించారు. శాంతి స్థాపనలో

భాగంగా రాజ్యాంగంలోని పౌర ప్రజాస్వామిక హక్కులను పునరుద్ధరించాలని కోరుకున్నారు. మానవ ప్రాణానికి భద్రత దక్కడమే హింస లేదని చెప్పడానికి నిదర్శనం అన్నారు. ఈ విడత అయినా ఏం కోరుకుంటున్నారు? ఆదివాసులకు, మనుషులకు, పౌరులకు రాజ్యాంగం ఇచ్చిన రక్షణ చట్టాలు అమలు కావాలని అడుగుతారు. చర్చల ఎజెండా అంతే ఇంతకంటే ఇంకేముంటుంది? ఇంతకంటే నిర్దిష్టత ఏముంటుంది? ఈ చివర విప్లవం కోరుకొనేవారి నుంచి ఆ చివర రాజ్యాంగ ఆదర్శాలను కోరుకొనే వారి దాకా ఇంతకంటే సమ్మతమైన ఎజెండా మరేముంటుంది? అంతిమంగా మనుషుల గురించి ఆలోచించేవాళ్లందరికీ ఇంతకంటే కావాల్సిందేముంటుంది? ప్రభుత్వమే కాల్పుల విరమణ ప్రకటించి శాంతి చర్చలకు సిద్ధం కావాలేగాని..

అప్పుడైనా ఇంతే. ఇప్పుడైనా ఇంతే.

శాంతి, సమానతలే చర్చల లక్ష్యం.

Leave a Reply