ఇరాన్లో మత ఛాందసవాద ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2022లో మహిళలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి ఆందోళన చేశారు. మహ్సా అమిని అనే కుర్దిష్ మహిళ మరణం ఈ ఉద్యమాన్ని రగిలించింది. హిజాబ్ సరిగా ధరించలేదనే నేరానికి ఆమెను మోరల్ పోలీసులు అరెస్టు చేశారు. తర్వాత కస్టడీలో ఆమె మరణించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా సంచలనమైంది. ఇరాన్ ఆమ్మాయిలు బహిరంగంగా హిజాబ్‌లను మంటల్లో కాల్చేయడం, పొడవాటి జుట్టును కత్తిరించి పడెయ్యడం ప్రపంచమంతా చూసింది. నిరసన ప్రదర్శనల్లో వందలాది యువతీ యువకులు పోలీసు హింసకు బలయ్యారు. వేలాది మంది జైళ్లపాలయ్యారు. ఇరాన్ ప్రజలు, ముఖ్యంగా యువత తమ ప్రభుత్వం పట్ల తీవ్ర అసంతప్తితో ఉన్నారు.
అంత మాత్రాన వాళ్లు యుద్ధాన్ని కోరుకోలేదు. పరాయి దేశం సైనికులు వచ్చి బాంబులు వేసి తమను విముక్తి చేయాలని మహిళలు కోరుకోలేదు. కోరుకోరు కూడా. ఇరాన్ మాత్రమే కాదు, ఏ దేశమూ అలా కోరుకోదు. కానీ అమెరికా, ఇజ్రాయెల్ అనుకూల మీడియా ‘నియంత పోయాడు, పీడా పోయింది’ అని ప్రచారం చేశాయి. ఇరాన్ అధినేతను చంపిన అమెరికా, ఇజ్రాయెల్ బాంబులు ఆ తర్వాత బాలికల పాఠశాల మీద పడ్డాయి. 175 మంది సాధారణ ప్రజలు, ఎక్కువ మంది 7-12 ఏళ్ల వయసు అమ్మాయిలు శిథిలాల కింద సమాధి అయ్యారు. 15 రోజులు దాటింది. యుద్ధం కొనసాగుతోంది. మూడు వేలమందికి పైగా చనిపోయారు. లక్షల మంది ఇళ్లు వదిలిపోవాల్సి వస్తున్నది. యుద్ధంలో చిక్కుకున్న ఏ దేశానికైనా మిగిలేది రక్తపాతం, వినాశనం, ఆర్థిక సంక్షోభం. దీనిని విముక్తి అని ఎలా అనగలరు? అమెరికా తన సామ్రాజ్యవాద మార్కెట్ దాహంతో దురాక్రమణ దాడి చేసిన దేశం మీద తీవ్రవాద ముద్ర వేయడం, ఆ దేశాలలో ప్రజాస్వామ్యాన్ని తీసుకొస్తానని చెప్పడం దశాబ్దాలుగా చూస్తూనే ఉన్నాం. ఆ దేశాలన్నీ ఏ విధంగా నాశనమయ్యాయో కళ్ల ముందు ఉంది.
ఆఫ్ఘనిస్తాన్పై ప్రారంభించిన యుద్ధం తీవ్రవాదంపై యుద్ధం అని, అది అనాగరిక, ఛాందసవాద పాలన కింద నలిగిపోతున్న మహిళలకు విముక్తినిస్తుందని డబ్బాకొట్టింది. ఇరవై ఏళ్ల పాటు యుద్ధాన్ని నడిపి, ఆ దేశాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టి, వేలాది మంది సొంత సైనికులనూ బలిచేసి చివరికి దానిని తాలిబన్లకు అప్పగించారు. మహిళల పరిస్థితి మరింతగా క్షీణించింది. ఇరాక్‌లో రసాయన ఆయుధాలున్నాయని చెప్పి దాడికి దిగినప్పుడు కూడా ఇరాక్ మహిళలు విముక్తులవుతారని అన్నది. కానీ జరిగింది ఏమిటి? అమెరికా దురాక్రమణ దాడికి ముందు, ఇరాకీ మహిళలు ఉన్నత స్థాయి విద్య, ఉత్పత్తిలో భాగస్వామ్యం, కొంతవరకు రాజకీయ భాగస్వామ్యం పొందితే, యుద్ధం తర్వాత క్రమంగా వారి స్థాయి దిగజారింది, సాంప్రదాయవాదం మరింతగా బలపడింది.
భారతదేశంలో స్త్రీలు, దళితులు వేలాది సంవత్సరాలు బ్రాహ్మనిజం కింద నలిగిపోయారు. కానీ వారే బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా దేశ స్వాతంత్రం కోసం పోరాడారన్నది మర్చిపోకూడదు. సామ్రాజ్యవాద పీడన కింద ఇండియా నలిగిపోయింది కనకనే పాలస్తీనాపై ఇజ్రాయెల్ దురాక్రమణను వ్యతిరేకించింది. ప్రచ్ఛన్న యుద్ధకాలంలో అసలు యుద్ధాలనే వ్యతిరేకించి అలీన ఉద్యమం నడిపింది. కానీ ఇప్పుడు ఫాసిస్టుల పాలనలో దురాక్రమణదారుల్ని ఆరాధించే మానసికత వచ్చి చేరింది. ఇరాన్ సార్వభౌమత్వంపై దాడి చేసి ఆ దేశ అధ్యక్షుని హత్య చేయడం అంతర్జాతీయ యుద్ధనేరం. దానిని ‘నియంత మరణం’ అని అదేదో వేడుక చేసుకోవలసిన విషయమైనట్లు ప్రచారం జరిగింది. భారతదేశ చిరకాల మిత్రదేశం ఇరాన్. అయినా మన ప్రధాన మంత్రి ఈ దాడిని ఖండించలేదు. పైగా సామాజిక మాధ్యమాల్లో ముస్లిం వ్యతిరేకత కింద ఇరాన్ వినాశనాన్ని కోరుకుటూ, అమెరికా`ఇజ్రాయెల్ దుర్మార్గాలను సమర్థించే మూర్ఖత్వం ఏ నియంత్రణ లేకుండా పెచ్చరిల్లిపోతున్నది. అమెరికా ఆధిపత్యం కింద, ఆంక్షల కింద భారతదేశం ఎలా నష్టపోతున్నది, సామ్రాజ్యవాదం ఎలా ప్రపంచ ప్రజలకు శత్రువుగా ఉన్నది గుర్తించలేకపోతున్నారు. మన సమాజంలో తిరోగమన శక్తులు పైచేయి సాధించడం వల్ల ప్రజల చైతన్యం అణగారిపోతున్నది.
తమ దాడిని సమర్థించుకోడానికి ఇరాన్ దేశాధినేత చాలా క్రూరుడని అమెరికా-ఇజ్రాయెల్ ప్రచారం చేస్తున్నాయి. కానీ ఇరాన్ ప్రజలు తమను ‘విముక్తి’ చేయమని వీళ్లను కోరలేదే! చమరు నిల్వలు దండిగా ఉన్న దేశాల మీద దాడులు చేయడానికి ఆ దేశాల మహిళలను అడ్డం పెట్టుకుంటున్న సామ్రాజ్యవాద దేశాధినేతలను ఉద్దేశించి అక్కడి స్త్రీవాదులు మాకే రక్షకులు అవసరం లేదు, మమ్మల్ని, మా దేశాన్ని మేము రక్షించుకోగలము అంటున్నారు. స్త్రీల పట్ల మీ సానుభూతి ఎప్స్టీన్ ఫైల్స్ లో బహిరంగమైంది అని ప్రపంచవ్యాప్తంగా స్త్రీవాదులు వీళ్ల ‘స్త్రీ విముక్తి’ వాదనను అసహ్యించుకుంటున్నారు.
ఇరాన్ స్త్రీలు ఎంతటి సాహసవంతులో గడిచిన మూడేళ్ల పోరాటం నిరూపించింది. ఏ దేశ ప్రజలైనా తమ చైతన్యంతో, చొరవతో ఆ దేశ చరిత్రను నిర్మించుకుంటారు. వారిని ఎవరు పరిపాలించాలో వారే నిర్ణయించుకుంటారు. తమ దేశ వనరులను కబ్జా చేయడానికి వచ్చే దురాక్రమణదారుల్ని వారు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరు. ఇరాన్ ప్రతిఘటన దాడుల్లో అమెరికా-ఇజ్రాయెల్ ఊహించని దెబ్బలు తింటున్నది చూస్తూనే ఉన్నాం. ప్రజలుగా మనం ప్రపంచ పీడిత ప్రజల వెంట నిలవాలి. సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించాలి. భారత పాలకవర్గాల సామ్రాజ్యవాద అనుకూల విధానాలను నిరసించాలి.




