మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాకు చెందిన 33 ఏళ్ల ఆదివాసీ యువకుడు పాండు పోరా నరోటెని, నిషేధిత మావోయిస్ట్ పార్టీ, దాని అనుబంధ సంస్థ రివల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్‌తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపైన 2013 ఆగస్టులో అరెస్టు చేసారు. ఆ తరువాత ఈ కేసును ఢిల్లీ యూనివర్సిటీ పూర్వ ప్రొఫెసర్ జి.ఎన్. సాయిబాబా, మరికొంత మంది మీద పెట్టారు.

నరోటెను, ఇతర నిందితులను చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణా చట్టం (ఉపా)లోని పలు నిబంధనలు, భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 120-B కింద దోషులుగా నిర్ధారించి, 2017 మార్చిలో, గడ్చిరోలి సెషన్స్ కోర్టు వారిలో చాలా మందికి జీవిత ఖైదు విధించింది. వారు ఈ తీర్పును బాంబే హైకోర్టులో సవాలు చేశారు, అక్కడ ఆ అప్పీల్ ఐదేళ్లకు పైగా పెండింగ్‌లో ఉండిపోయింది.

కానీ ఆ తీర్పు ఫలితాన్ని చూడటానికి నరోటె ప్రాణాలతో లేరు. 2022 ఆగస్టు 25 నాడు, నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో ఉన్నప్పుడు ఆయనకు స్వైన్ ఫ్లూ సోకడంతో మరణించారు. ఆయనకు సకాలంలో వైద్యం అందలేదని నరోటె కుటుంబ సభ్యులు, న్యాయవాదులు ఆరోపించారు. ఆయన మరణించిన రెండు నెలల తర్వాత, 2022 అక్టోబర్‌లో, ఉపా కింద విచారణ చేయడానికి ఇచ్చిన అనుమతి చెల్లదని పేర్కొంటూ బాంబే హైకోర్టు నిందితులందరినీ నిర్దోషులుగా విడుదల చేసింది.

మహారాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని సవాలు చేయడంతో, సుప్రీంకోర్టు ఆ విడుదలను నిలిపివేసి, 2023 ఏప్రిల్‌లో కేసుకు ఉన్న అర్హతల (మెరిట్స్‌) పైన మళ్లీ విచారణ జరపాలని హైకోర్టుకు పంపింది. సాక్ష్యాధారాలను పునఃసమీక్షించిన తర్వాత, 2024 మార్చిలో బాంబే హైకోర్టు నరోటె, జి.ఎన్. సాయిబాబాను, మిగిలిన నిందితులు విజయ్ టిర్కే, ప్రశాంత్ రాహి, హేమ్ మిశ్రాలను నిర్దోషులుగా ప్రకటించింది. ప్రాసిక్యూషన్ తన కేసును సహేతుకమైన అనుమానానికి తావులేకుండా నిరూపించడంలో విఫలమైందని కోర్టు పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ తీర్పుపై మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది, ప్రస్తుతం ఆ వ్యవహారం ఇంకా పెండింగ్‌లో ఉంది.

పాండు నరోటె న్యాయవాది ఆకాష్ సోర్డే, ఆయనను ఎంతో ఉద్వేగంతో గుర్తుచేసుకున్నారు. “పాండు గురించి ఆలోచించినప్పుడల్లా నా గుండె బరువెక్కుతుంది. ఆయన నాకు కేవలం ఒక క్లయింట్ మాత్రమే కాదు,” అని ఆయన ‘అవుట్‌లుక్’ పత్రికతో చెప్పారు.

మహేష్ టిక్రి, జి.ఎన్. సాయిబాబాలతో కలిసి నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో ఉన్నప్పుడు సోర్డే ప్రతి వారం నరోటెను కలిసేవారు. నరోటె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ఫిర్యాదు చేయడంతో, జైలు అధికారులు ఆయనను జైలు ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన పరిస్థితి విషమించడంతో, 2022 ఆగస్టు 20న నాగ్‌పూర్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన ఆగస్టు 25న మరణించారు.

ఆసుపత్రిలో నరోటెను సందర్శించిన సోర్డే, ఆయనను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని చెప్పారు. “ఆయనను ఆసుపత్రి బెడ్‌కు సంకెళ్లతో కట్టివేశారు, వార్డులో ఒక మూలన వదిలేశారు, ఎవరూ పట్టించుకోలేదు. అది అమానవీయం.” నరోటె తన లాయర్‌తో, “దయచేసి నన్ను ఎక్కడికైనా మార్చండి. నేను కోలుకుని ఇంకా కొంత కాలం జీవించాలనుకుంటున్నాను” అని వేడుకున్నారు.

సోర్డే ప్రకారం, నరోటెకు సోకిన స్వైన్ ఫ్లూను సకాలంలో గుర్తించలేదు. “ఆయనను వేరే చోటికి మార్చాలని మేము కోర్టును ఆశ్రయించేలోపే, జైలు అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆయన మరణించారు.”

పేద ఆదివాసీ యువకుడైన నరోటె పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది. ఆయనను ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించిన తర్వాతే ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆయన మరణానంతరం, గడ్చిరోలిలోని అహేరి-అల్లాపల్లి సమీపంలో ఉన్న ఆయన ఇంటికి మృతదేహాన్ని తీసుకెళ్లడానికి ఆసుపత్రి యాజమాన్యం మొదట అంబులెన్స్‌ ను ఇవ్వడానికి నిరాకరించింది. లాయర్లు జోక్యం చేసుకున్న తర్వాతే అంబులెన్స్‌ను ఏర్పాటు చేసారు.

నరోటె చివరి కోరికను గుర్తుచేసుకుంటూ న్యాయవాది ఆకాష్ సోర్డే ఎంతో ఆవేదన చెందారు. ఆసుపత్రిలో సోర్డే ఆయనను కలిసినప్పుడు, “దయచేసి నన్ను ఇక్కడి నుండి వేరే చోటికి మార్చండి. నేను కోలుకుని ఇంకా కొంతకాలం బ్రతకాలని ఉంది,” అని నరోటె వేడుకున్నారు.

నరోటె మరణించిన రెండు నెలల తర్వాత, బాంబే హైకోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది. అయినప్పటికీ, నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో ఉన్న అతని పత్రాలు, నగదును ఇప్పటికీ వారి కుటుంబ సభ్యులకు తిరిగి ఇవ్వలేదు. “పాండు సోదరుడి తరపున నేను దరఖాస్తు చేశాను, కానీ కేవలం ఆయన భార్య మాత్రమే వాటిని క్లెయిమ్ చేయగలదని జైలు అధికారులు నిరాకరించారు,” అని సోర్డే ‘అవుట్‌లుక్’తో చెప్పారు.

కంచన్ నానావరే

38 ఏళ్ల కంచన్ నానావరే, నిషేధిత మావోయిస్ట్ పార్టీతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో 2014 సెప్టెంబర్‌లో మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఎటిఎస్) ద్వారా తన భర్త అరుణ్ భెల్కేతో కలిసి అరెస్ట్ అయింది. ఆమెపైన ఉపా చట్టంలోని పలు నిబంధనల కింద కేసులు నమోదయ్యాయి. ఈ దంపతులు పూణే, ముంబై వంటి నగరాల్లో మద్దతును కూడగట్టడానికి నకిలీ గుర్తింపులతో ‘అర్బన్ ఆపరేటివ్స్’గా పనిచేశారని ప్రాసిక్యూషన్ వాదించింది.

నానావరే విచారణ ఖైదీగా ఆరేళ్లకు పైగా జైలులో గడిపారు. ఈ కాలంలో ఆమె ఆరోగ్యం వేగంగా క్షీణించింది. ఆమె తీవ్రమైన నరాల సంబంధిత, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడ్డారు. జైలులో ఆమెకు సరైన వైద్య సదుపాయాలు అందడం లేదని సామాజిక కార్యకర్తలు, న్యాయవాదులు పదేపదే ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె పరిస్థితి విషమించడంతో ప్రభుత్వ ఆధ్వర్యంలోని ససూన్ ఆసుపత్రికి తరలించారు, కానీ ఎరవాడ సెంట్రల్ జైలులో ఖైదీగా ఉన్న ఆమె  2021 జనవరి 22న తుదిశ్వాస విడిచారు.

పూణే సెషన్స్ కోర్టులో ఆమె తరపున వాదించిన సీనియర్ క్రిమినల్ లాయర్ రోహన్ నహర్ మాట్లాడుతూ, “కంచన్ నానావరే ఎప్పుడూ దోషిగా తేలలేదు. హింసాత్మక లేదా దేశ వ్యతిరేక కార్యకలాపాలతో ఆమెకు సంబంధం ఉన్నట్లు ఎటువంటి సాక్ష్యాధారాలను ప్రాసిక్యూషన్ చూపలేకపోయింది. ఆమెకు దీర్ఘకాలిక గుండె జబ్బులు ఉన్నప్పటికీ, ‘ఆరోపణల తీవ్రత’ను సాకుగా చూపి వైద్య కారణాలపై కూడా ఆమెకు బెయిల్ నిరాకరించారు,” అని పేర్కొన్నారు.

కోర్టు విచారణలకు హాజరయ్యే సమయంలో నానావరే కనీసం కొద్ది దూరం కూడా నడవలేక ఇబ్బంది పడేవారని నహర్ గుర్తుచేసుకున్నారు. “ఆమె పరిస్థితి కోర్టుకు కళ్లముందే కనిపిస్తున్నప్పటికీ, ఆమెకు బెయిల్ నిరాకరించారు. ఆరేళ్ల పాటు ఆమె విచారణ ఖైదీగానే జైలులో ఉండాల్సి వచ్చింది. ఇది న్యాయ వ్యవస్థకు జరిగిన అపహాస్యం” అని ఆయన అన్నారు.

అసమ్మతిని అణచివేయడానికి తరచుగా ఉపయోగించే ఉపా చట్టాన్ని ఒక కఠినమైన చట్టం అని ఆయన విమర్శించారు. “నేడు యువ న్యాయవాదులు ఉపా కింద వామపక్ష భావజాలం ఉన్న రాజకీయ ఖైదీల తరపున వాదించడానికి భయపడుతున్నారు. ఒకవేళ వాదిస్తే తమపై కూడా ‘అర్బన్ నక్సల్ సానుభూతిపరులు’ అనే ముద్ర పడుతుందని వారు ఆందోళన చెందుతున్నారు,” అని ఆయన చెప్పారు.

నానావరేపై అనేక కేసులు ఉన్నప్పటికీ, ఆమె ఏ ఒక్క కేసులోనూ దోషిగా తేలలేదు. భవిష్యత్తులో ఆమె నిర్దోషిగా విడుదలైనప్పటికీ, అది ఆమెకు అర్థం లేనిది. పౌర హక్కుల సంఘాలు ఆమె మరణాన్ని ప్రభుత్వ వ్యవస్థల నిర్లక్ష్యంగానూ, సకాలంలో వైద్యం అందించని వైనంగానూ ఖండించాయి. కఠినమైన ఉగ్రవాద వ్యతిరేక చట్టాల కింద సుదీర్ఘకాలం జైలులో మగ్గడం వల్ల కలిగే మానవ నష్టాన్ని ఈ ఘటన ఎత్తిచూపుతోంది.

ఫాదర్ స్టాన్ స్వామి

84 ఏళ్ల స్టాన్ స్వామి ఒక జెసూట్ పాస్టర్, విద్యావేత్త. ఆదివాసుల హక్కుల కార్యకర్త. ఆయన జార్ఖండ్‌లోని ఆదివాసుల భూమి హక్కులు, నిర్వాసిత సమస్యలు, విచారణలో ఉన్న ఖైదీల దుస్థితిపై దశాబ్దాల పాటు పనిచేశారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో, భీమా కోరేగావ్ కేసులో 2020 అక్టోబర్‌లో ఉపా చట్టం కింద ఆయనను అరెస్టు చేశారు.

పార్కిన్సన్స్ వ్యాధి  తదితర తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న స్వామి ఆరోగ్యం, నవీ ముంబైలోని తలోజా జైలులో ఉన్నప్పుడు కోవిడ్-19 సోకడంతో మరింత క్షీణించింది. పదేపదే బెయిల్ దరఖాస్తులు చేసుకున్నప్పటికీ, ఆయనకు విడుదల లభించలేదు. కనీసం నీళ్లు తాగడానికి స్ట్రా, సిప్పర్ వంటి ప్రాథమిక అవసరాలను కూడా నిరాకరించారు. జైలు అధికారులు వాటిని చాలా కాలం తర్వాత అందించినట్లు సమాచారం.

2021 జూలై 5న స్వామి జ్యుడీషియల్ కస్టడీలో మరణించారు. విచారణలో ఉన్న ఖైదీగా ఆయన మరణించి ఐదేళ్లు గడుస్తున్నా, భీమా కోరేగావ్ కేసులో విచారణ ఇంకా ప్రారంభం కాలేదు. ఉపా కింద సుదీర్ఘకాలం జైలు శిక్షను అనుభవించిన పాండు నారోటే, కంచన్ నానావరే, స్టాన్ స్వామి వంటి వారికి ‘వేగవంతమైన విచారణలు’ అనే మాటకు అర్థమే లేదు.

2026 జనవరి 24

https://www.outlookindia.com/national/lives-lost-how-prolonged-incarceration-failed-pandu-narote-kanchan-nanaware-stan-swamy

తెలుగు: పద్మ కొండిపర్తి

Leave a Reply