“పనిచేసే వాళ్లదే భూమి” – బస్తర్ అమ్మాయి చూసిన అసమానతల నుంచి పుట్టిన ప్రజాస్వామిక నినాదం.
2025 ఏప్రిల్, మే నెలల్లో బస్తర్‌లోని కర్రెగుట్ట ప్రాంతాలలో కేంద్ర, రాష్ట్ర పారామిలిటరీ బలగాలు “ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్” పేరుతో భారీ దాడులు నిర్వహించాయి . ప్రభుత్వం ముప్పై వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించింది. ఈ ఆపరేషన్లలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మందిని అరెస్టు చేశారు. ఎన్నో గ్రామాలు ధ్వంసం అయ్యాయి.
అరెస్టయిన వారిలో మడవి సీమ కూడా ఉంది. ఆమె వయస్సు పందొమ్మిదేళ్ళు. ఆమె ఇప్పుడు చంచల్‌గూడ జైలులో ఉంది. పోలీసులు ఆమెను మావోయిస్టుగా అనుమానించి అరెస్టు చేశారు. కొన్ని రోజులు కస్టడీలో ఉంచారు. ఆ సమయంలో, ఆమె ధైర్యమే కాదు; ఆమె ఆలోచనల స్పష్టత, పదును కూడా పోలీసులను ఆశ్చర్యపరిచింది.
పోలీసులు అడిగారు:
“గ్రామాల్లో ఎందుకు అంత చురుగ్గా పనిచేస్తున్నావు?”
సీమ సమాధానం పాఠ్యపుస్తకాల నుంచి వచ్చింది కాదు. రాజకీయ సిద్ధాంతకర్తల నుంచి వచ్చింది కాదు.
తన జీవిత అనుభవం నుండి పుట్టినది:
“కొంతమందికి భూమి లేదు. కొంతమందికి చాలా భూమి ఉంది. అది సమానంగా ఎందుకు ఉండకూడదు? మేము భూమిని పంచుకున్నాం. భూమి ఎవరికి స్వంతం కాదు; దాని పైన పనిచేసే వాళ్లది. భూమిని జాగ్రత్తగా ఉపయోగించాలి. తర్వాతి తరాలకు ఇవ్వాలి. భవిష్యత్తు తరాలు కూడా అదే విధంగా ఉపయోగించ గలగాలి. అందరికీ సమాన హక్కు ఉంది. ఎవరు పైన కాదు, ఎవరు కిందా కాదు. ఈ సమానత్వం నిజం కావాలని నేనూ గ్రామంలో ప్రజల హక్కుల కోసం పని చేసాను. భూమిని పంచడం, నీటి సమస్యలను పరిష్కరించడం, అడవులను రక్షించడం. ఇవన్నీ నా జీవిత పోరాటంలో భాగం.”
పోలీసులు ఆశ్చర్య పోయారు:
“ఈ బుడ్డదానికి ఇన్ని మాటలు ఎవరు నేర్పారు?”
సీమ ప్రశాంతంగా, స్పష్టంగా సమాధానం చెప్పింది:
“మన చేతుల్లో ఏమీ లేక, మన చుట్టూ వాళ్లకు ఏమీ లేనప్పుడు, పోరాటం తప్పని సరి అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో పోరాటం గురించి ఒకరు నేర్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు పోరాటం ద్వారా సంఘటితం అవుతారు. నేర్చుకుంటారు. అలాగే నేను తయారయ్యాను. ఆ పోరాటమే నన్ను ఇంతలా మాట్లాడించింది.”
పదాలు చిన్నవే! సత్యాలు గొప్పవి !
సీమ మార్క్సిస్టు గ్రంథాలు చదివి ఉండకపోవచ్చు, కానీ ఆమె మాటలు మార్క్సిస్ట్ రాజకీయాలను స్పష్టంగా తెలియజేస్తాయి అని సీనియర్ రాజకీయ ఖైదీలు అంటారు.
సీమ పోలీసులతో మాట్లాడిన విషయంపై సీనియర్ రాజకీయ ఖైదీలను అడిగితే, వారు ఎంతో ఆసక్తిగా విశ్లేషణ చేసి చెప్పారు. వారు సీమ అనుభవాలను లోతైన పరిశీలన చేస్తూ మిగతా ఖైదీలతో పంచుకున్నారు.
సమాజం రెండు వర్గాలుగా విభజించబడిందని సీమ అర్థం చేసుకుంది. భూమిని కలిగి ఉన్నవారు ఇంకా దానిపై పనిచేసేవారు.
లియొ హ్యూబర్మన్ చెప్పినట్టు:
“ఉత్పత్తి సాధనాలు: భూమి, యంత్రాలు, కర్మాగారాలు కొద్దిమంది చేతిలో ఉన్నప్పుడు, ఆ కొద్ది మంది వాటిని సొంతం చేసుకోవడం ద్వారా జీవిస్తారు. మనుగడ సాగించాలంటే, వాటి కోసం పనిచేసే పెద్ద సంఖ్యలో ప్రజలు శ్రమించాలి.”
సీమ తన బస్తర్ గ్రామ జీవితంలో ఈ సత్యాన్ని చూసింది: కొంతమందికి భూమి ఉంది, మరికొందరు ఆకలితో అలమటించారు. ఆమె తన అవగాహనను క్లుప్తంగా ఇలా వ్యక్తం చేసింది:
“ఈ వ్యవస్థలో ఒక వైపు ఆస్తి (దోపిడీ), మరోవైపు శ్రమ (అణచివేత) ఉంది”
“పనిచేసే వాళ్లదే భూమి” కేవలం నినాదం కాదు. ఇది ఆర్థిక, సామాజిక సత్యాన్ని ప్రతిబింబించేది. భూమిని జాగ్రత్తగా ఉపయోగించాలి. తర్వాతి తరాలకు ఇవ్వాలి. ఈ దృక్పథంలో శ్రమ, పర్యావరణ పరిరక్షణ, సమానత్వ భావనలు నిండుగా ఉనాయి.
పోలీసులకు సీమ మాటలు రాజకీయ జవాబులుగా అనిపించాయి. నిజాననికి అవి వాళ్ళ అనుభవం నుండి పుట్టిన సత్యం: “పోరాటమే నేర్పిస్తుంది.”
‘సమానత్వపు ఆకాంక్ష’ పుస్తకాల నుంచి పుట్టదు. అది అన్యాయాన్ని ఎదుర్కొంటూ పుడుతుంది. ‘ఎవరూ పైన కాదు, ఎవరూ క్రింద కాదు’ అనే ఆమె మాటలు వాస్తవంలో రాజ్యాంగం ఎలా పనిచేస్తుందో ప్రశ్నించే ప్రజాస్వామ్య నీతిని ప్రతిబింబించాయి.
బస్తర్ నుండి ఒక నూతన ప్రజాస్వామిక దృక్పథం
బస్తర్‌లోని గ్రామ ఉద్యమాలు వనరులను సమానంగా పంపిణీ చేయడం ద్వారా, ఒకరికొకరు సహాయం చేసుకోవడం ద్వారా, అసమానతలను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నాయని సీమ చెపుతుంది. ఆమె కార్యచరణ జల్, జంగల్, జమీన్ కోసం జరిగిన పోరాటంలో పునాదులు వేసుకున్న ఒక ప్రజాస్వామ్య పాఠశాలగా మారింది.
మార్క్సిస్టులు చెప్పినట్టు, “రాజ్యం యజమానుల అధికారాన్ని రక్షించడానికి ఒక సాధనం.”
డిమాండ్లు లేవనెత్తడం, హక్కుల కోసం పోరాడడం వల్ల విధించబడే శిక్షే రాజ్య హింస అని సీమ కథ వెల్లడిస్తుంది.
అయినప్పటికీ ఆమె మాటలు ఆ రాజ్య హింసను కూడా ప్రతిఘటిస్తాయి. ‘భూమి’ ప్రైవేట్ ఆస్తి కాదు ఉమ్మడి వనరు అనే ఆలోచన ప్రత్యామ్నాయ దృష్టిని అందిస్తుంది.
భూమిని బాధ్యతాయుతంగా ఉపయోగించుకుని భవిష్యత్ తరాలకు అందించాలి.
ఈ నమ్మకం, మైనింగ్ కంపెనీలు ఆదివాసుల భూములను ఆక్రమించుకోవడాన్ని, మొత్తం సమూహాలను వారి ఇళ్ళు నుండి తరిమేయడాన్ని, గూడెంల నుండి తరలించడాన్ని వ్యతిరేకిస్తూ పోరాడవలసిన ప్రజల బాధ్యతను ప్రతిబింబిస్తుంది.
ఇది సామ్యవాద సిద్ధాంతాలల్లో భాగమైన సమానత్వ భావన. సహజ వనరులు అందరివి, అందరి భవిష్యత్తుకి కావాలి అనే భావం.
మార్క్సిస్టులు చాలాకాలంగా చెబుతున్నారు – వ్యవస్థలోనే అసమానత ఉండటం వల్ల, వ్యవస్థ అన్యాయంగా ఉంది అని.
సీమ అదే సత్యాన్ని నిక్కచ్చిగా వ్యక్తం చేసింది:
“కొంతమందికి భూమి లేదు, కొంతమందికి చాలా ఉంది. అందరికీ సమానంగా ఎందుకు ఉండకూడదు?”
ఇది కేవలం సైద్ధాంతిక ప్రశ్నకాదు. సామాజిక వాస్తవికతను మార్చాలనే మానవ ఆకాంక్ష నుండి తొలుచుకొచ్చిన ప్రశ్న. అన్యాయాన్ని అనుభవించిన ప్రతి మనస్సులో సమానత్వ భావన మేల్కొంటుందని సీమ కథ మనకు గుర్తు చేస్తుంది.
ఎవరో వస్తారని లేదా ఎవరో వెళ్ళిపోయారని ప్రజలు అనుకోవచ్చు. కానీ పోరాటాలు కొనసాగుతూనే ఉంటాయి. కొందరు చనిపోవచ్చు, కొందరు లొంగిపోవచ్చు. అయినప్పటికీ అణచివేత ఆగిపోతుందా? అణచివేతను వ్యతిరేకించే వారు పోరాడటం మానేస్తారా?
కొనసాగుతున్న పోరాట పరంపర..
జైలులో మరణించిన బిర్సా ముండా బ్రిటిష్ పాలనను ఎదురిస్తూ చేసిన నినాదం – అబువా రాజ్ ఏతే జానా, మహారాణి రాజ్ తుండు జానా (“రాణి రాజ్యం అంతం కావాలి. మా రాజ్యం స్థాపించబడాలి”). ఇప్పటికీ మధ్యభారత అడవుల్లో ప్రతిధ్వనిస్తుంది.
ఆదివాసీ ప్రాంతాలలో జల్, జంగల్, జమీన్ (నీరు, అడవి, భూమి) కోసం కొమరం భీమ్ చేసిన పోరాటాలు ఆగలేదు. అల్లూరి సీతారామరాజు నేతృత్వంలోని పిథూరి (తిరుగుబాటు) చరిత్రలో ఒక మర్చిపోలేని అధ్యాయం. బిర్సా మండా, కొమరం భీం, అల్లూరి సీతారామరాజు వంటి యోధులు నడిపిన పోరాటాలు సమానత్వం, ఆత్మగౌరవం పొందే వరకు ఆగవు అనటానికి చక్కటి ఉదాహరణలు. ఆ అనుభవాలు సమాజంలో ఇంకా నిలిచి ఉన్నాయి.
“పోరాటమే నేర్పిస్తుంది”. అనే సీమ మాటలు మనకు అదే సత్యాన్ని గుర్తు చేస్తాయి.
సీమ ఇంకా ఇతర ఆదివాసీ మహిళలు జైలును కూడా పోరాట క్షేత్రంగా భావిస్తున్నారు. “జైలు జీవితం కారణంగా మేము మా పోరాటాన్ని ఆపేస్తాము” అని వారు ఒక్కసారి కూడా చెప్పలేదు. వారు తమ ప్రతిఘటన స్ఫూర్తిని వదులుకోలేదు.
భూమి, నీరు, అడవుల కోసం పోరాడుతున్న ప్రతి బస్తర్ గ్రామ ఉద్యమంలో పోరాడే స్త్రీ, పురుషులు నిజమైన ప్రజాస్వామ్యాన్ని స్థాపించడానికి ప్రయత్నిస్తున్నారు. వారిలో ఒక్కరు సీమ, మరొకరు మాంఝీ, ఇంకొకరు కోసా లేదా ఉసేండి.. ఇలా ఎవరైనా కావచ్చు. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, జార్ఖండ్ జైళ్లలో మగ్గుతున్న వందలాది ఆదివాసీ రాజకీయ ఖైదీలు సీమ లాగే సమానత్వం, మానవ గౌరవాన్ని కోరుతూ ప్రతిధ్వనిస్తున్నారు.
గాజా దిగ్బంధనంలో బాధపడుతున్న పాలస్తీనియన్లకు మానవతా సహాయం అందించడానికి, అటు వైపు ప్రపంచ దృష్టిని ఆకర్షించడానికి, అడ్డగింత, నిర్బంధానికి గురయ్యే ప్రమాదాన్ని లెక్కచేయకుండా, పడవలతో కూడిన చిన్న నౌకాసమూహాలకు 22 ఏళ్ల గ్రెటా థన్‌బర్గ్ నాయకత్వం వహించింది. పాలస్తీనియన్లకు సంఘీభావంగా నిలబడటానికి అంతర్జాతీయంగా చాలా మందికి ఆమె నైతిక సంకల్పం ప్రేరణనిచ్చింది. ధైర్యగల గొంతుకలు- యువ స్వరాలైనా సరే- అంతర్జాతీయ న్యాయానికి మద్దతు కూడగట్టే కేంద్రాలుగా మారగలవని నిరూపించింది.
ప్రపంచం కేవలం దూరం నుంచి హర్షధ్వానాలతో ప్రశంసించకూడదు. ఎవరి భూమి దొంగిలించబడిందో, ఎవరి గొంతును మూసివేశారో, ఎవరి ధైర్యాన్ని నిర్బంధించారో అలాంటి ప్రతి సీమ తో సంఘీభావంగా నిలబడాలి. న్యాయం కేవలం మాటలతో సరిపోదు. అది కింది స్థాయి నుండి పోరాడే వారితో ప్రపంచమంతా సంఘీభావంగా నిలబడాలని డిమాండ్ చేస్తోంది.
రచయిత హక్కుల కార్యకర్త.




