అతడి మరణం పొద్దుకు తెలిసింది
కన్ను తెరిచే వేళన వేకువ గాయపడ్డది.
గుడిసెను తాకుతున్న తొలికాంతి
కన్నీరులా చల్లబారింది.
అతడి మరణం నేలను తాకింది.
వాలిపోతున్న సాహసానికి
ఒడిని చాపింది. మహా ప్రళయాలకు లొంగని పచ్చని గరిక నెత్తురుగా దుఃఖ పడ్డది.
అతడి మరణం గాలినీ తాకింది.
శూన్యం కాని శూన్యమంతా
వెక్కిళ్ళలో ధ్వనించింది.
అతడి మరణం ప్రాణాల
ఆశను ఛేదించింది
తత్వశాస్త్రం లయ తప్పినట్టుగా
నమ్మకాలన్నీ బూడిదకుప్పల్లా
తేలిపోయాయి.
అణచబడ్డ మానవుల శోకానికి
సమాధానమతడు.
అతడి మరణం పల్లవి తెగిన పాటలా
ఎదలో సంచరిస్తోంది.
అతడి మరణం అడవిని చేరింది.
భాషలేని బాధ దుఃఖమై తడిపింది.
సద్దుమణగని నినాదంలా
కొండకోనల్లో నిలిచింది.
అతడి మరణం నిశబ్దం కాదు.
కాగుతున్న డప్పులా
కాలానికి కంఠాన్ని పొదుగుతుంది.




