(ఇటీవల విడుదలైన డా. గీతాంజలి ‘అత్తరు మునక’ కథా సంపుటికి రాసిన ముందుమాట)
‘మన భావాలు వాడి పారేసినవి. మన ప్రేమ ముందే అనుకుని నిర్మించుకున్నది. మన నమ్మకాలు రంగులు అద్దినవి. మన స్వాభావికత కృత్రిమ కళతో మాత్రమే కొలవగలిగినది. గాయపడకుండా నిజంగా ప్రేమించడం చాలా కష్టం అయ్యింది.’
(రోహిత్ వేముల చివరి వుత్తరం నుంచి)
గీతాంజలి కథలు చదువుతుంటే నాకెందుకో రోహిత్ వేముల చివరి మాటలు గుర్తొచ్చాయి. గాయపడకుండా ప్రేమించడం కష్టమన్న పోలిక స్ఫురించింది. గాయపడకుండా ప్రేమించడమే కాదు; రచించడం కూడా కష్టమేనేమో! కాలం గాయాల్ని మాన్పుతుంది అంటారు; కానీ పాత గాయాలు మానకుండానే కాలమే కొత్త గాయాలు చేస్తుంది. గీతాంజలి మునుపు రాసిన కథలు చేసిన పాత గాయాలు యింకా సలుపుతూనే వున్నాయి. ఇప్పుడు మరికొన్ని కొత్త కథలు కొత్త గాయాలు. భరించరాని బాధ. అనేక వేదనల నడుమ మొద్దుబారకుండా సున్నితత్వాలని కాపాడుకుంటూ ముందుకు పోవడం తేలికైన విషయం కాదు.
మన సమాజం యింతకుముందు యింతగా విడిపోయిన సందర్భాలు చాలా తక్కువ. ఎప్పుడో దేశ విభజన సమయంలో మతం మనుషుల మధ్య ద్వేషపు గోడలు నిర్మించిందని విన్నాం. చదివాం. ఆ విద్వేషపు రోజులు మరింత క్రూరంగా పునరావృతమౌతున్నాయి. అప్పటి హింస స్వరూప స్వభావాలు వేరు. ఏ తెలియని తీవ్ర శక్తులో ఆవేశంలో నడిపితే నడిచిన మనుషులు, తాము మనుషులం అని మర్చిపోయి పాశవికంగా ప్రవర్తించిన కాలమది. కానీ యిప్పుడు ద్వేషం దేశభక్తిగా చెలామణి అయి సైద్ధాంతిక రూపం ధరిస్తోంది. అసహనం పునాదిపై హింస నిర్మితమౌతోంది. మూక హత్యలు ప్రణాళికాబద్ధంగా అమలౌతున్నాయి. జాతిహనన నేరవృత్తి వీరోచిత చర్యగా నమోదవుతోంది. మనుషుల్లో హింసాత్మక ప్రవృత్తి చాప కింద నీరులా కాకుండా బహిరంగంగానే విజృంభిస్తోంది. అది మన సమస్త వైయక్తిక సామాజిక జీవన పార్శ్వాల్లోకి చొచ్చుకువచ్చి సకల మానవీయ విలువల్నీ ధ్వంసం చేస్తోంది. ప్రజల మధ్య వెల్లివిరియాల్సిన సౌభ్రాతృత్వాన్నీ సామరస్య భావననీ సహజీవన విలువల్నీ నాశనం చేస్తోంది. ఇదంతా పాలకుల వత్తాసుతో వ్యూహాత్మకంగా ఆమోదం పొందుతుంది. చాలాసార్లు పాలకులే వ్యూహ నిర్మాతలూ నిర్వాహకులూ. ఇప్పుడు ప్రతిదీ రాజకీయ చర్యే. ప్రతి రాజకీయ చర్యా దేశానికి మానని గాయమై స్రవిస్తోంది.
అయితే దేశంలో యింతగా వూడలు తన్నుకుంటున్న పాసిజానికి కారణమవుతున్న అప్రజాస్వామిక ధోరణుల్ని సాహిత్యకారులుగా మనం యే మేరకు గుర్తించాం? గుర్తించినా వాటిని కాల్పనికేతర రచనల్లో చర్చించినంతగా సృజనాత్మక రచనల్లోకి తర్జుమా చేయడంలో యెందుకు వెనకబడి వున్నాం? వ్యక్తిగత విశ్వాసంగా వుండాల్సిన మతం రాజకీయ ఆధిపత్యానికి సాధనంగా మారిన వైనాన్ని ప్రజా సమూహాలకు తెలియజేయడంలో సాహిత్యకారులుగా మనం యెక్కడ యెందుకు విఫలమయ్యాం? మతవాదానికీ కార్పొరేట్ ఫాసిజానికీ మధ్య వున్న nexus (విడదీయరాని సంబంధం)ని అర్థంచేసుకుని బహిర్గతం చేయడానికి రచయితలు యెటువంటి వ్యూహాల్ని అమలు పరచాలి? ఫాసిజం పోకడల చేదు వాస్తవికత సమాజంలో అనుభవానికి వచ్చినా కథల్లోనో లేదా మరో ప్రక్రియలోనో బలంగా ప్రతిఫలింపచేయాల్సిన సందర్భంలో రచయితల అనాసక్తత/ వుదాసీనత దేనికి సంకేతం? ఇటువంటి ప్రశ్నలు యిటీవల బుర్రని బాగా తొలుస్తూ వున్నాయి.
వాస్తవానికి కష్టాల్లో వోదార్పుగా వుండే మతం విద్వేషానికి పర్యాయపదంగా మారినప్పుడు సాహిత్యమే మనుషుల్లో గుండె తడిని కాపాడుతుంది. అనేక అసహనాల మధ్య దూరాల్ని అధిగమించడానికి చేయూతనిస్తుంది. మండు వేసవి గాడ్పుల నడుమ చలివేంద్రమౌతుంది. విద్వేషాలకు వివేచనాత్మక సమాధానమిస్తుంది. విధ్వంసానికి విరుగుడు నిర్మిస్తుంది. గుడి, గుడిలో దేవుడూ పాలకుల వోట్ల రాజకీయ కిచిడీకి ప్రధానమైన దినుసుగా మారిన సంక్లిష్ట సందర్భంలో, అబద్ధాల దేవతా వస్త్రాలు అజ్ఞానానికి ఆధారభూతమౌతున్న సత్యానంతర కాలంలో, భిన్న జాతుల భిన్న ఆచార సంప్రదాయాలతో బహుళత్వంతో నిండిన దేశాన్ని జాతీయవాదం పేరున ప్రభుత్వమే కాలంచెల్లిన మధ్యయుగాల అంధ కుల మత విశ్వాసాల వైపు నడిపిస్తోన్న తరుణంలో … గత కొద్ది సంవత్సరాలుగా హిందూత్వ మతోన్మాదానికి వ్యతిరేకంగా గీతాంజలి రాసిన కథలు దేశం యెదుర్కొంటున్న కఠోర వాస్తవికతని మన కళ్ళ ముందు నిలబెడుతున్నాయి. పౌర సమాజాన్ని అప్రమత్తం చేస్తున్నాయి. అయితే అవి సాంత్వన కలిగించడం లేదు; మరింత కలవరపెడుతున్నాయి. వాటి మంచి చెడులు తేల్చిచెప్పే సాహసానికి నేను పూనుకోను; కానీ యీ కథలు చదువుతూండగా, చదివాకా అనుభవించిన వూపిరాడనితనాన్ని మీతో పంచుకొని భారాన్ని దించుకుంటాను.
***
ఈ కథలన్నిటిలో మతవాదమే తొలి విలన్ అని గీతాంజలి నిర్ద్వంద్వంగా నిరూపించారు. మెజారిటీ మతం రాజ్యం విడదీయలేనంతగా కలిసిపోయాయి కాబట్టి రాజ్యమే జరుగుతోన్న అమానవీయ ఘటనలకు స్వయంగా కారణమనీ ఆమె బలంగా ఆవిష్కరించగలిగింది. మత ఫాసిజం వెనుక వున్న ఆర్థిక కోణాన్ని ‘గుజరాత్ గాయం’ నాడే మన సాహిత్యకారులు గుర్తించారు. అయితే అది అప్పుడు కొన్ని ‘ముఖోటా’ల వెనక దాగి వుంది. ఇప్పుడు మరింత విచ్చలవిడిగా బాహాటమైంది. అంతకుముందు పాలకులు అవినీతిని వ్యవస్థాగతం చేస్తే యీ పదేళ్లలో మతవాద కార్పొరేట్ ఫాసిస్ట్ పాలకులు దాన్ని రాజ్యాంగబద్ధం చేశారు. దాన్ని తెలియబరచడానికే యీ కథల సంపుటిలో వొక కథకి రచయిత ‘రియల్ (ఎ) స్టేట్’ అని పేరు పెట్టారు. స్టేట్ ప్రయివేట్ వ్యాపారుల రియల్ ఎస్టేట్ అయ్యింది. ప్రభుత్వం అదానీ అంబానీల ఫ్రంట్ ఆఫీస్ అయింది. మీడియా కార్పొరేట్ కంపెనీల పెరట్లో పెంపుడు జంతువయింది. ఇక్కడ అంతా వ్యాపారమే. అది యే స్థాయికి చేరిందంటే .. పాలకులు కార్పొరేట్ మదగజాలకు అడుగులకు మడుగులు వొత్తుతున్న వైనాన్ని గురించి మాట్లాడటం కూడా దేశద్రోహ నేరమే. వేలెత్తి చూపేవాళ్ళందరూ పాకిస్తాన్ ఏజెంట్లు. చైనా బానిసలు. ఆ దిశలోనే పార్లమెంటరీ రాజకీయాలు నడుస్తాయి. సామాజిక మాధ్యమాల ప్రచారం సాగుతుంది. ఇతర మతస్తుల ఆర్థిక సామాజిక జీవితాన్ని ధ్వంసం చేయాలంటే వారి వుత్పత్తుల్ని కొనగూడదు అమ్మకూడదు. అసలు ముస్లింలు యీ దేశంలో వుండకూడదు. ఉంటే బతకకూడదు. వారి పౌరసత్వం ప్రశ్నార్థకం. వారి ఉనికి గిట్టదు. కట్టూ బట్టా భాషా అన్నీ అసహన హేతువులే. ఏదో వొక నెపంతో వీధిలోకి వచ్చి కాషాయం జండాలు పట్టుకొని జై శ్రీరామ్ అని అరుచుకుంటూ బైకుల మీద వూరేగింపులు తీసే అల్లరి మూకలే చట్టసభల్లో కూర్చుని బల్లలు చరుస్తూ అవే మతపరమైన నినాదాలు చేస్తూ రాజ్యాంగం సాక్షిగా అలౌకిక అసంగత అసందర్భ రాజకీయ లంపైన్ సంస్కృతికి పట్టం కడుతున్నారు.
వీళ్ళు పల్లెల్లో సైతం సామరస్య వాతావరణం నాశనం చేశారు. కేవలం యెన్నికల్లో గెలుపు లక్ష్యంగానే యీ విద్వేష బీజాలు నాటారనీ విభజన రేఖలు గీశారనీ అనుకోలేం. వాళ్ళది ద్విజాతి సిద్ధాంతం. దాని పునాది మీద హిందూ రాష్ట్ర నిర్మాణం వాళ్ళ లక్ష్యం. వందేళ్లుగా విడవని ప్రయత్నాలు రాజ్యాధికారం లభించినప్పుడల్లా వూపందుకున్నాయి. అవి యిప్పుడు మోడీ రాజ్ లో హింసాత్మకంగా జాతి హననైక ధ్యేయంగా తయారయ్యాయి. వాళ్ళు ప్రచారం చేసే యేకాత్మ వాదం దేశ సమగ్రత దిశగా నడిపేది కాదు. మనుషుల మధ్య విభజన రేఖలు గీసేది మాత్రమే. సాంస్కృతిక జాతీయవాదం అంటే ఆధిపత్య మతవాదమే. దానికి అనుగుణంగా నెరేటివ్స్ నిర్మిస్తూ జనాన్ని రాజకీయంగా పోలరైజ్ చేయడమే వారి ప్రధానమైన ఎజండా. దాన్ని బద్దలుగొట్టడమే యివాళ సాహిత్యకారుల ముందున్న పెద్ద ఛాలెంజ్. మతానికీ మతతత్వ వాదానికి మధ్య వున్న తేడాని విప్పిచెప్పాల్సిన అవసరంలో భాగంగా వెలువడినవే గీతాంజలి కథలు.
మన నిత్య జీవితాల్లో సమాజంలో కళ్ళముందు జరుగుతోన్న ఘటనలే గీతాంజలి కథలకు ప్రధాన వనరు. గుజరాత్ గాయం దగ్గర్నుంచి రాముడి గుడి కట్టడం వరకూ రెండు దశాబ్దాల పాటు విధ్వంసమౌతోన్న మానవ సంబంధాల పట్ల ఆర్తి వీటికి ఆయువు. నిజానికి విధ్వంసం బాబరీ కూల్చివేతలోనో యింకా వెనక్కి వెళ్తే రథయాత్రతోనో శిలాన్యాస్ నాడో యెప్పుడో ప్రారంభమైంది. దశాబ్దాలుగా దేశంలో సమత్వ కాంక్షనీ సామరస్య భావననీ లౌకిక తత్వాన్నీ నాశనం చేసే ఘటనలు యెన్నో. ఆ ఘటనల చుట్టూ వున్న బాహ్య పరిస్థితులను చిత్రీకరించడానికి అనుగుణంగా గీతాంజలి పాత్రలను నిర్మిస్తుంది. చాలావరకు ఆ పాత్రలు మంచీ చెడూ వెలుగూ చీకటీ రాగద్వేషాలు వంటి ద్వంద్వాలకు ప్రతీకలుగా వుంటాయి. ఒక్కోసారి వాస్తవ సమాజంలోని వ్యక్తులే కథల్లో ప్రత్యక్షమౌతారు. కథలో నిర్దిష్టతని సాధించడానికి వాటిని ఆమె అలా రూపొందిస్తుంది. ఆ బైనరీలకు అనుగుణమైన స్వభావాన్ని వాటికి ఆపాదిస్తుంది. అందులో పీడితుల వైపు ఆమె నిలబడుతుంది. బాధిత స్వరం వినిపిస్తుంది. ఘటనల చుట్టూ అల్లుకుని వుండే బాహ్య పరిస్థితులతో పాటు భావజాల వైరుధ్యాలను కూడా ఆమె కథలో నమోదు చేస్తుంది. కథనాన్ని పరిపుష్టం చేయడానికి వాటికి వొక డాక్యుమెంటరీ రూపాన్ని అందిస్తుంది. ఇదంతా ప్రణాళికతో కూడిన వొక ప్రాసెస్. కథ ఆమెకు వొక నెపం మాత్రమే. తనదైన సామాజిక రాజకీయ దృక్పథాన్ని అందించటమే ప్రధానం. బాధిత వ్యక్తులవైపు, సమూహంవైపు నిలబడటం వల్ల కథనంలో వుద్వేగం చోటు చేసుకుంటుంది. బాధితుల స్వరాన్నీ వుద్వేగాన్నీ ఆమె సొంతం చేసుకోవడమే అందుకు కారణం. చాలా సార్లు ఆ వుద్వేగపు వెల్లువలో ఆమె కొట్టుకుపోతుంది. ఈ intensity యే ఆమె కథలకు బలం. బలహీనత కూడా. దాన్ని ఆమె గుర్తించిందనే అనుకుంటాను.
కవిత్వంలో లాగా కథలో సైతం గీతాంజలి క్యారీ చేసే వుద్వేగ స్వరం సాధారణంగా సామాజిక స్వరం. కానీ అనేక సందర్భాల్లో అది సమకాలీన మత రాజకీయాల్ని మిళితం చేసుకోవడమే యీ కథల ప్రత్యేకత. ఒక అభద్ర వాతావరణంలో రాజ్యాంగం పౌరసమాజానికి హామీ చేసిన స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం దేశమంతటా వెల్లి విరియాలన్న తపన వీటిలో సహజంగానే చోటు చేసుకుంది. ‘గాయాబీ లద్దాఫ్’ ‘బిఛ్ డా చమన్’ ‘పహెచాన్’ వంటి పాత కథల్లో అది కొంత గూఢంగా వుంటే ‘డా. జహంగీర్’, ‘రియల్ (ఎ)స్టేట్’, ‘లబ్ పే ఆతీ హై దువా’ ‘రాళ్లు రువ్వే పిల్లాడు’, ‘కలల రాజ్యం’ వంటి యిప్పటి కథల్లో దాపరికం లేకుండా అది బాహాటమైంది. ‘పహెచాన్’ కాలం నాటి నుంచి ‘అత్తరు మునక’ వరకు వచ్చేసరికి రాజకీయ విద్వేషం గుజరాత్ నుంచి దేశమంతటికీ పరివ్యాప్తమయిందన్న అంశాన్ని ఆమె యీ సంపుటిలోని సుదీర్ఘ కథనాల్లో చాలా బలంగా ఆవిష్కరించింది.
గాయబీ లద్దాఫ్, బిచ్ డా చమన్, పహెచాన్ కథలు గుజరాత్ గాయం దరిమిలా అనేక అభద్రతల నడుమ జీవితం అగమ్యగోచరంగా తయారైన ముస్లిం సమాజపు మానసిక స్థితికి దర్పణం పడితే రాళ్లు రువ్వే పిల్లాడు, కలల రాజ్యం యీ రెండు కథలు కశ్మీర్ నేపథ్యంలో వచ్చినవి. ఆర్టికల్ 370 రద్దయిన వెంటనే వచ్చిన కథలివి. అటు పాకిస్తాన్ యిటు ఇండియా రెండు దేశాల ప్రమేయం లేని ఆజాదీని కోరుకునే స్థితి నుంచి స్వయంప్రతిపత్తి మాటేమో గానీ కనీసం ప్రార్థన చేసుకోడానికి కూడా ఆరడుగుల శుభ్రమైన జాగా దొరకని వొకానొక దయనీయ పరిస్థితికి దిగజారిపోయిన జాతి ఆవేదనని గీతాంజలి యీ కథల్లో బలంగా వినిపించారు. కశ్మీర్ విషయంలో వుదార పార్లమెంటరీ బూర్జువా పార్టీలన్నీ వామపక్షాలతో సహా మానవ హక్కుల కోణం విస్మరిస్తాయి. కశ్మీరీ ప్రజల స్వయం ప్రతిపత్తిని గుర్తించ నిరాకరిస్తాయి. వారి ప్రతి నిరసననీ వుగ్రవాద చర్యగానే పరిగణిస్తాయి. దేశభక్తితో వూగిపొతాయి. ప్రతినిత్యం అక్కడ జరిగే అమాయకుల ఎన్ కౌంటర్లు సైతం ఆమోదం పొందుతాయి. ఆర్టికల్ 370 రద్దు, దాని దరిమిలా అక్కడ చోటు చేసుకున్న పరిణామాలు యివేవీ వార్తలకెక్కవు. పాలకుల సబ్ ఠీక్ హై ప్రచారం హోరులో డుఃఖితుల ఆర్తనాదాలు కొట్టుకుపోతాయి. హిందుస్తాన్ పాకిస్తాన్ ల రాజకీయ కుట్రల్లో మిలటరీ క్రీడల్లో కశ్మీరీల స్వేచ్ఛా స్వాతంత్ర్య కాంక్ష హరించుకుపోవడం కనపడదు. బిడ్డల భర్తల జాడ తెలీని స్త్రీల దుఃఖం వినపడదు. బుల్లెట్ల పిల్లెట్ల వర్షంలో తడిసిన దేహాల ఆనవాళ్లు పట్టవు. భరించలేని బాధలో యెక్కడో యెవరో వొక రాయి రువ్వితే వుగ్రవాది అవుతారు.
ఈ నేపథ్యంలో శ్రీనివాసమూర్తి ‘ఖబర్ కె సాత్’ (మార్చి 2021, అరుణతారలో ప్రచురితం, అదే పేరుతో కథల సంపుటి: డిసెంబర్ 2021), హరిత (రాధిక) ‘శిశిర’ (కొలిమి July, 2020) వంటి వొకట్రెండు కథలే నా దృష్టికి వచ్చాయి. గీతాంజలి రాసిన కథలు వాటికంటే ముందే వచ్చాయన్నది గమనించినప్పుడు ఆ యా ఘటనలు రచయితని యెంతగా కలవరపరిచాయో అర్థమౌతుంది. తనదైన సమ్యగ్ దృక్పథం నుంచి సమకాలీన రాజకీయ చలనాన్ని వ్యాఖ్యానించి పాఠకుల్ని సెన్సిటైజ్ చేయడంలో గీతాంజలి ముందుంటారనడానికి యీ కథలు సాక్ష్యం.
ఆ క్రమంలోనే కాషాయీకరణకి గురైన విద్యారంగాన్ని వస్తువుగా స్వీకరించి రాసిన కథ ‘లబ్ పే ఆతీ హై దువా’. ఒకప్పుడు సరస్వతీ శిశు మందిరాలే మత భావజాలాన్ని పసి మెదళ్లలోకి యెక్కించేవి. ఇప్పుడు ప్రాథమిక పాఠశాలల దగ్గర్నుంచి విశ్వవిద్యాలయాల వరకూ చదువులు అశాస్త్రీయ భావనలకు ఆలవాలాలయ్యాయి. విద్యార్థుల నోట్ బుక్స్ రామకోటి రాసుకునే పుస్తకాలు అయ్యాయి. తరగతి గదుల్లోకి పాఠ్య పుస్తకాల్లోకీ నేరుగా ఆధిపత్య మత సంస్కృతి చొచ్చుకు వచ్చేసింది. కాదన్న చోట వెలివాడలు వెలుస్తున్నాయి. అధ్యాపకులపై సైతం దాడులు జరుగుతోన్నాయి. కొన్ని సెక్షన్లని విద్యకి దూరం చేసే యెత్తుగడల్లో భాగమే యిది. విద్యాలయాల్లో ముస్లిం బాలికల దుస్తుల మీద చెలరేగిన వివాదాన్ని ఆ కమ్యూనిటీకి చెందిన అమ్మాయిల్ని జ్ఞానదూరుల్ని చేయడంలో భాగంగానే చూడాలి.
బుర్ఖా గానీ హిజాబ్ గానీ ధరించే విషయంలో ముస్లిం స్త్రీలు తమ కమ్యూనిటీ లోపల ఘర్షణ యెదుర్కొంటూ వుంటారు, అయితే దాన్ని యిప్పుడు ఆధిపత్య మతవాదులు దేశ సమస్యగా మార్చివేశారు. మనుషుల్ని రెచ్చగొట్టడానికి వాళ్లెప్పుడూ సత్యాభాసమైన వొక అసత్య కథనాన్ని తయారుచేస్తారు. దాంతో యితర సామాజిక సమస్యలు పక్కకుపోతాయి. మనోభావాలు ముందుకువస్తాయి. మనుషుల్ని వున్మాద స్థితికి నెట్టివేస్తాయి. నిజాలు మరుగునపడిపోతాయి. వస్త్ర ధారణ విషయమై ముస్లిం స్త్రీలు యేకకాలంలో సొంత కమ్యూనిటీ లోపలి నుంచి యెదుర్కొనే వొత్తిడి బయటి నుంచి వచ్చే యీ కొత్త సమస్య రెండూ హింసాత్మకంగానే తయారయ్యాయి. . ఈ సమస్యని కథీకరించడం కత్తిమీద సామే. దాన్ని గీతాంజలి యెంతో సంయమనంతో నిర్వహిచారు (ఉజ్మా).
‘ఖత్నా’ వంటి వస్తువు సాహిత్యంలో ఎవరూ స్పృశించనిది. ముస్లిం కమ్యూనిటీ లోపలి జెండర్ ఆధిపత్యం గురించి గీతాంజలి యింతకు ముందు చాలా కథల్లో ప్రస్తావించినప్పటికీ దావూద్ బోహ్రా ముస్లింలలో అమలయ్యే ఖత్నా స్త్రీల లైంగికతపై అదుపు యెంత హింసాత్మకంగా వుంటుందో హృదయ విదారకంగా వర్ణించింది. దాన్నొక అనివార్య పవిత్ర క్రతువుగా నిర్వహించే బీభత్స విషాదాన్ని మూడు తరాల స్త్రీలు విప్పి చెబుతారు. స్త్రీత్వంపై అమలయ్యే కుట్లు కోతలు కుట్లు .. యెడతెగని యీ హింసనాదం హిందూ మతానికి చెందిన ‘సంస్కృతి’ లాంటి వాళ్ళ గొంతులోనూ ప్రతిధ్వనిస్తుందని చెప్పడం యీ కథకి అదనపు బలం. మతం యేదైనా పవిత్రత పేరున పసి వయస్సు నుంచే కనపడని కంచెలు కట్టి యినపకచ్చడాలు తొడిగి విధించే ఆంక్షలు నిర్బంధాలు కావచ్చు; పెళ్లికి ముందు జరిపే కన్యాత్వ పరీక్షలు కావొచ్చు; ప్రసవానంతరం వేసే హస్బెండ్ స్టిచ్ అనే ఎక్స్ట్రా నాట్ కావొచ్చు లైంగిక తృప్తిని పురుష కేంద్రంగా డిజైన్ చేయడంలో భాగంగా జరిగేవే అని రచయిత యింతకు మునుపు అనేక సందర్భాల్లో చెప్పిన విషయమే అయినప్పటికీ వాటి నుంచి బయటపడి స్త్రీలు స్వేచ్ఛగా యెదిగే ఆలోచనలు వైపు దృష్టి సారించేలా చేయడం మరింత దృఢతరమైందని రచయితగా గీతాంజలి ప్రయాణాన్ని గమనిస్తే అర్థమవుతుంది.
‘గుడ్డివాని చేతి కర్ర’ కథ నాటి గీతాంజలి కథన శైలి ఆవు అంతరంగ మథనంగా చెప్పిన ‘కౌ కోబ్లర్ హంజా’ వరకు వచ్చేసరికి చాలా మార్పులకు గురైంది. ఏకాంశ ప్రతిపాదన నుంచి అనేక సామాజిక అంశాల్ని వొకే కథలో చొప్పించే ప్రయత్నం యెక్కువైంది. అందువల్ల కథ విస్తృతమైంది. పరిధి పెరిగింది. సరిగ్గా యిటువంటి సందర్భాల్లో కథ సామాజిక వ్యాఖ్యానంగా పరిణమించే అవకాశం వుంది. సామాజిక వ్యాఖ్యానం తప్పు కాదు; కానీ అది కళాత్మకంగా వుండాలి. అలాగే కేవలం సమాచారం కథ కాదు. అది కథకి ముడిసరుకు మాత్రమే. శిలని యెంత చెక్కితే శిల్పామౌతుందో రచయితకు తెలిసి వుండాలి. ఆ యెరుకతో రూపపరంగా కొత్త ప్రయోగాలు చేయాల్సి వుంటుంది. ఒక్కోసారి ప్రయోగాలు బెడిసికొట్టవచ్చు. అప్రమత్తత అవసరం. వస్త్వైక్యత దెబ్బతినకుండా రచయిత దృక్పథం పాఠకులకు బరువు కాకుండా నిర్దిష్టంగా కళాత్మకంగా చేరవేసే శిల్పసాధన కత్తిమీద సామే. ఈ ప్రమాదాల నుంచి బయటపడటానికి రచయిత నిరంతరం జాగరూకత వహించాలి. ఈ అవసరాన్ని గీతాంజలి కథల్ని అధ్యయనం చేసినప్పుడు అర్థం చేసుకోగలం. చూడండి: బిఛడా చమన్ లో ఫైమీనా పహెచాన్ లో జహీరా మొ. ప్రతీకాత్మక ప్రాతినిధ్య పాత్రలు ‘డా. జహంగీర్ MD’ వరకు వచ్చేసరికి ‘ఆమె’ సర్వనామ తలం నుంచి బిల్కిస్ బానోగా నిర్దిష్టమైంది. గుజరాత్ గాయం దేశవ్యాప్తంగా పచ్చి పుండైన దరిమిలా గాయం చేసినవాళ్లనే దండలేసి గౌరవిస్తున్న దశలో వచ్చిన మార్పు యిది. ఈ మార్పు సాహిత్యానికి చెందింది మాత్రమే కాదు; రాజకీయ పరమైంది కూడా. ఈ మార్పుని సాహిత్య మాధ్యమంగా గుర్తించే క్రమంలో మనం యింకా వెనకబడే వున్నాం అని గీతాంజలి కథలు చదువుతున్నప్పుడు చాలా సార్లు అనిపించింది. ఎందుకంటే మతతత్వ భావజాలం అనేక వ్యవస్థల ద్వారా యీ రోజున మన జీవితాల్లోకి చొచ్చుకొస్తోంది. బ్రాహ్మలకి కరోనా రాదు(దూరం .. దూరం ..), హిందువుల్ని ఆవు పొడవదు (అత్తరు మునక) వంటి ఆలోచనల్ని కేవలం మౌఢ్యంగా మాత్రమే భావించలేం (ముస్లింలకు కరోనా సోకదు వంటి అహేతుక భావనలు కొందరు డాక్టర్లు సైతం ప్రచారం చేశారు). ప్రతి నెరేటీవ్ వెనక రాజకీయ ప్రయోజనాలున్నాయ్. దేశాన్ని మధ్య యుగాల మనువాద సంస్కృతిలోకి నడిపించడమే వుద్దేశ్యం వుంది. సామాజిక ఆర్థిక అసమానతలు మనుషుల మధ్య సహజం అన్న భావనని సుస్థిరం చేసే క్రమంలోనే యిదంతా ప్రణాళికాబద్ధంగా జరుగుతోంది. కోవిడ్ టైంలో సామాజిక దూరం పాటించడాన్ని యుగాలుగా కులం పేరున మనుషుల్ని దూరం వుంచే అంటరానితనంతో ముడిపెట్టి దాన్ని జస్టిఫైచేయడం వంటివి యిందులో భాగమే. నగరాల్లో గేటెడ్ కమ్యూనిటీల్లోకి మాత్రమే కాదు; పల్లెల్లో సైతం వాట్సాప్ యూనివర్సిటీల ద్వారా మతోన్మాదం తీవ్ర స్థాయిలో ప్రచారమౌతోంది. రాజ్యాంగ విలువల్ని తుంగలో తొక్కి రాజ్యమే దాన్ని వ్యవస్థీకృతం చేస్తోంది. ఆ క్రమంలోనే గుడిసె అపార్ట్ మెంట్ గుడి బడి గని వని తేడా లేకుండా భజనలు, కీర్తనలతో పాటు అయోధ్య నుంచి అక్షింతలు కూడా వొకానొక బలవంతపు ఆమోదంతో చొరబడ్డాయి. చివరికి యీ మతవాద ఫాసిస్ట్ భావజాలాన్ని భారతీయ సంస్కృతి పేరున విదేశాలకు మోసుకుపోతున్నారు. ఎన్నికల ముందు అయోధ్యకు రైలు ప్రయాణాలు పాఠశాలల్లో భగవద్గీతా పఠనాలు .. కాదేదీ రాజ్యాధికార సాధనకు అనర్హం. ఎన్నికల ప్రకటనలు వెలువడితే యెక్కడ యే వుగ్ర దాడులకు దారులు తెరుచుకుంటాయోనని భయపడే పరిస్థితి వచ్చింది. దేశంలో ప్రతి మారుమూల పల్లెకూ సంఘీయులు పరచిన వ్యూహాత్మక రాదారి యిది. కాదన్నవాళ్ళందరూ దేశద్రోహులే. అర్బన్ నక్సలైట్లే. నిర్మూలనకు అర్హులే.
గత రెండు దశాబ్దాలుగా నడుస్తోన్న యీ చరిత్ర క్రమం అంతా గీతాంజలి కథలకు వస్తువైంది. రియల్ ఎస్టేట్ కథలో కేవలం హిందువుల కోసమే కట్టే సవర్ణ సువర్ణ భూముల అలిఖిత నిబంధనలు గురించి ఆమె స్వీయ జీవితానుభవం నుంచే చెప్పినట్టు అనిపించినప్పటికీ యిటీవలి కాలంలో అవి లిఖితరూపం ధరించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేనంతగా స్థిరపడుతున్నాయి. విభజన రేఖలు బలపడుతున్నాయి. ఆమోదం పొందుతున్నాయి. నగరాల్లో ముస్లింలకు చోటులేని గేటెడ్ కమ్యూనిటీలు విద్వేషాల పునాదులపైనే తయారౌతున్నాయి. అయితే ఆ భవన నిర్మాణాల్లో ప్రాణాలకు తెగించి పనిచేసే ముస్లిం వర్కర్స్ ద్వితీయ శ్రేణి పౌరులుగా అణగిమణగి వొదిగి వుండాలి. భిన్న సముదాయాలకు చెందిన ప్రజల మధ్య వుండాల్సిన inclusive సంబంధాల్ని ధ్వంసంచేసే నేరపూరిత ఆలోచన యిది. ఉదాహరణకు: ఊళ్ళల్లో పీర్ల పండగ ఊరందరికీ పండగే. దానిలో అన్ని కులాల వాళ్ళకీ సమభాగస్వామ్యం వుండేది. ఒకప్పుడు ముస్లింలూ దళితులూ బిసిలూ కలిసి ధూలా ఆడేవారు. ఇప్పుడు అదికూడా మతవాదుల రాజకీయాల్లో భాగమైంది. బిసిలను దళిత మైనారిటీలకు దూరం చేసే పన్నాగాలు అమలౌతున్నాయి. అలాగే వూరి మధ్య బొడ్రాయి నిలపడం వూళ్ళో సబ్బండ వర్ణాల్నీ కలుపుకుపోయే వొక సామాజిక క్రతువుగా వుండేది. కానీ అది కూడా ఆధిపత్య కులాల చేతిలోకి వెళ్ళిపోయి బ్రాహ్మణీకరణకి గురైంది. దాని చుట్టూ కింది కులాలను సాంస్కృతికంగా వూరి నుంచి దూరం చేసే కుట్ర వుంది. లేదా బహు దేవతారాధన వున్న బహుజన సంస్కృతిని నాశనం చేసి యేకధ్రువ మెజారిటీ ఆధిపత్య మత సంస్కృతిని నిలబెట్టే వ్యూహం దాగి వుంది. విద్వేషం పునాదిపై నిర్మితమౌతున్న యీ రాజకీయ సమీకరణాల పట్ల బహుజన సమాజం అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని తెలుపుతూ రాసిన ‘పిలగా .. పక్కకి జరుగు’ కుల మత ఆధిపత్యాల స్వరూపంలో వస్తోన్న మార్పుల్ని చక్కగా యెత్తిపట్టింది.
ఈ సంపుటిలోని కథల్నీ వొక యెత్తు చివర్లో రాసిన ‘చుక్ చుక్ బండి’ కవిత వొక్కటే మరో యెత్తు. అది యీ కథలన్నిటి సారంలా కనపడుతుంది. మతాన్నీ దేవుడినీ రాజకీయావసరాలకు వుపయోగించుకొంటున్న పాలకుల దుర్నీతిపై ఫోకస్ చేసిన ఫ్లడ్ లైట్ అది. అలాగే యిటీవలే వచ్చిన ‘అత్తరు మునక’ కథని ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి. కథలో రచయిత లేవనెత్తిన అంశాలెన్నో ఆమె మతవర్గవాద రాజకీయ దృక్పథానికి అద్దంపడతాయి. పహెల్గాం దాడి తర్వాత ఆపరేషన్ సిందూర్ పేరిట జరిగిన సరిహద్దు యుద్ధం దేశవ్యాప్తంగా కల్గించిన ప్రకంపనలు సికింద్రాబాద్ జనరల్ బజార్ వరకు యెలా వ్యాపించాయో తెలిపిన ఆ కథలో మానవత్వ పరిమళాన్ని పంచిపెట్టే నిలువెత్తు అత్తరు సీసాలాంటి సాహిల్ జీవితం అభద్రతకు నెలవై యెలా పగిలిపోతుందో చూస్తే బెంగ కలుగుతుంది. దానికి కొనసాగింపుగా కథలో ప్రయాగ రాజ్ కుంభమేళాలో పవిత్ర స్నానాల్నీ తొక్కిసలాటనీ సమాంతరంగా ప్రస్తావించి రెండిటినీ పోల్చడం చూస్తాం. ఈ పోలికల్లో వొకమేరకు అన్వయం కుదురుతుంది కానీ ట్రైబల్ కమ్యూనిటీకి చెందిన బిక్కు నాయక్ వంటి వారి ద్వారా ప్రచారమయ్యే ఆవు రాజకీయాల్ని నిరసించే మరో అంశాన్ని కథలో ఆనుషంగికంగా చొప్పించడం ద్యారా వస్త్వైక్యత దెబ్బతింది. కానీ బిక్కు నాయక్ లు బ్రాహ్మణీయ హిందూ ఫాసిస్ట్ పాలకులకు పంచమాంగదళంగా మారిన వైనం ఆమెను తీవ్రంగా కలచివేయడం వల్ల కథలోకి అది వొక ఫోర్స్ తో చొచ్చుకువచ్చింది. మతాన్ని మార్కెట్ అవసరాలకు వుపయోగించుకునే ఆర్ధిక కోణాన్ని యెత్తిపట్టడం యీ కథలో కొసమెరుపు. ఈ దిశగా ఆలోచింపచేయడానికి రచయిత బిక్కూ నాయక్ కథని యిక్కడ జోడించినట్టు తెలుస్తుంది. దేశంలో అమలౌతోన్న మతవాద రాజకీయాల పట్ల రచయిత్రికున్న క్రోధం యిలా ప్రతికథలోనూ యేదో వొక రూపంలో కథాంశంగా పరిణమించడం చూస్తాం.
ఆ క్రమంలోనే కనీసం మూడు కథల్లో రాముడి పేరున జరుగుతోన్న రాజకీయాల్ని రచయిత్రి ప్రస్తావించింది. మతాన్ని పాటించేవారు విశ్వసించి పూజించే రాముడు వేరు, మతవాదులు రాజకీయ ప్రయోజనాల కోసం తయారుచేసి యెన్నికల ప్రచార సామాగ్రిగా వినియోగిస్తున్న రాముడు వేరు. ఇళ్లలో పూజ గదుల్లో వుండాల్సిన రాముడు పోలింగ్ బూతులో నిలబడి దేశ పాలకుల్ని నిర్ణయిస్తున్నాడు. దయగా చిరునవ్వు మొఖంతో వుండే రాముడు కండలు తిరిగి సిక్స్ పాక్ శరీరంతో ‘సినిమా విలన్’ లా వీథుల్లో క్రూర దృక్కులతో నిజమైన భక్తుల్ని భయపెడుతున్నాడు. ఫాసిస్టు పాలకులు తమ రాజకీయ అవసరాలకు రాముణ్ణి పావుగా వినియోగించడంపై విమర్శ యిది. చాలా సందర్భాల్లో పాలకులపై విమర్శని రాముడిపై విమర్శగా భావించి వున్మాదపు దాడులు చేస్తున్నవారు నిజానికి రామభక్తులు కారు, రాజభక్తులు. వీళ్ళు తాము రాజ్యాంగానికి అతీతులం అనుకుంటారు. ప్రపంచ సాహిత్యంలో వర్ణించిన భిన్న రామాయణాల్లోని అనేక రాముళ్ల సంగతేమో గానీ కనీసం వాల్మీకి రాముడి గురించి కూడా వారికి తెలీదు. పై పెచ్చు సహేతుకమైన విద్యాత్మక సంవాదానికీ సంభాషణకూ వారెప్పుడో దూరమైపోయారు. బౌద్ధిక చర్చలో పాల్గొనే సహనం లేక సౌమనస్యం లేక భౌతిక దాడులకు తెగబడుతున్నారు. సాహిత్యావరణంలో రాముడిపై రామరాజ్యంపై జరగాల్సిన పునర్వ్యాఖ్యానాలకు గీతాంజలి యీ ప్రస్తావనల ద్వారా కొత్త తలుపులు తెరుస్తోంది. ఆమె కలం నుంచి యీ అంశంపై ప్రత్యేకంగా కథ రావాల్సి వుంది.
***
చివరిగా వొక మాట –
‘మన స్వాభావికత కృత్రిమ కళతో మాత్రమే కొలవగలిగినది.’ చివరి వుత్తరంలో రోహిత్ అన్న యీ మాటలు కూడా ఫాసిజానికి వ్యతిరేకంగా మనం సృజించుకోవాల్సిన సాహిత్యం కళలు యెలా వుండాలో ఆలోచించడానికి పురిగొల్పుతాయి. కృత్రిమత్వానికి తావులేని స్వాభావికమైన కళ మాత్రమే మానవీయంగా వెలుగుతుందనీ మనుషుల మధ్య సహజమైన ప్రేమ మాత్రమే విద్వేష భావనని తొలగిస్తుందనీ మతతత్వ ఫాసిజానికి వ్యతిరేకంగా రచయిత్రి గీతాంజలి రాస్తోన్న యీ కథలు అందుకు దారి చూపుతాయనీ మరోసారి విశ్వసిస్తూ .. సెలవ్.
హైదరాబాద్
జూన్ 15, 2025





Buchireddy Gangula
———————————-
Prabhakar Garu -nice article sir-truth -facts are there
Most of the telugu writers -they honor pay attention to or interest about present
Situation of the country —must open eyes look BIG PICTURE
GEETANJALI. Garu. Gerät writer