” సర్వే జనా సుఖినోభవంతు “

                ( సెప్టెంబర్, 2014 )

” మనం ఎన్నుకున్న సీమ ప్రజా ప్రతినిధుల చొక్కాలు పట్టుకుని..

ప్రజలు నిలదీసినప్పుడే..

సీమ సమస్యలు పరిష్కారమవుతాయి “

             ( సెప్టెంబర్, 2025 )

 ఈ రెండు మాటలు ఇంజనీర్ సుబ్బరాయుడు సార్ చెప్పిన మాటలే ! మొదటి మాట 2014 లో నేను మొట్టమొదటిసారి చూసినప్పుడు… కర్నూల్ సిల్వర్ జూబిలీ కళాశాలలో…సీమ కార్యకర్తల సమావేశం జరిగినప్పుడు ఆయన అప్పుడు ప్రత్యేక ఆహ్వానితులు.. ఆ సందర్భంగా ఆయన తన ఉపన్యాసాన్ని… ప్రారంభించడానికి చెప్పిన ముందుమాటలు !

బహుశా మేము ప్రత్యేక రాయలసీమ వాదుల మనే ఎరుక ఆయన మనస్సులో వుండి ఉండవచ్చు.  తర్వాత చెప్పిన మాటలు గత నెలలో నేను , మరో మిత్రుడు కర్నూల్ లో ఆయన తన మంచానికే పరిమితం అయ్యారని తెలిసి, ఇంటివద్దకు వెళ్ళి కలిసినప్పుడు చెప్పిన మాటలు…. అవే.. చివరి మాటలు అయ్యాయి… (నేను మళ్ళీ సుబ్బరాయుడు సార్ ను కలవలేక పోయాను.

                   ***

 మొదటి మాటలకు…. చివరి మాటలకు మధ్య… సార్ తో ఎన్ని కలయికలు… ఎన్ని అనుభవాలు…  ఎన్ని సంగతులు.. ఎన్ని ఉద్యమాలు…

ఎన్ని కలిసి, నడచిన అడుగులు…

సార్ లో ఎంత పరిణామక్రమం…

ఒక సాధారణ రిటైర్డ్ ఇంజనీర్ స్థాయి నుండి, ఒక అద్భుతమైన… ఆణిముత్యం గా తయారైన క్రమం… అనిర్వచనీయం !

సీమ నాలుగు జిల్లాల ప్రజలు, వెనుక బడ్డ తెలంగాణా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలన్నదే తన అభిమతం.. అని ప్రకటించిన ఈ మేధావి… పరిణామ క్రమం…. సీమ సమస్యలు పరిష్కారం కానిదే.. ఎవరి సమస్యలు పరిష్కారం కావని, అహరహం… తన ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా… చివరికి… సిద్ధేశ్వరం అలుగు ప్రాంతం పర్యటనలో … ఆయన కాలికి గాయమై, కాలు తీసివేసే పరిస్థితి వచ్చినా, సీమ ఉద్యమానికి మరింతగా అంకితమై పనిచేయడం తోనే ఆయన లోని పరిపూర్ణ మానవుడు అవతరించాడని చెప్పవచ్చు.

ఎన్ని ప్రాజెక్టులు…ఎన్ని నీటి పథకాలు… ఎంత మంది రాజకీయ నాయకుల, ప్రజా ప్రతినిధుల గడపలు తొక్కాడో లెక్కేలేదు.నీతి లేని పాలకుల నిర్లక్ష్యం వల్ల ఆయన నిర్లిప్తతకు, నిరాశకు గురయ్యారు. నిజానికి పాలకులలో సీమ ప్రజలపై, సీమ ప్రాంతంపై ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఆయన చూచించిన పథకాలు కార్యరూపం దాల్చేవే. రెండు దశాబ్దాల ఉద్యమ కాలంలో  రాయలసీమ సస్యశ్యామలం అయ్యేదే! కానీ అలా జరుగ లేదు…

పదవులలో వున్న ఎందరో నీటి పారుదల ఇంజనీరింగ్ నిపుణులు… అవినీతి పరులై, అసలైన ప్రయోజనం గల సమస్యలను… తమ కెందుకులేలే..అని ఉదాసీనంగా వ్యవహరిస్తున్న… ఈ రోజులలో  కరువు కాటకాలు లేని, వలసలు లేని, రైతుల ఆత్మహత్యలు లేని సీమ ఎంతగానో పరితపించి ఆయన ఒక అరుదైన మేధావిగా, ఆర్గానిక్ ఇంటలెక్చువల్ గా ప్రజల ఇంజనీర్ గా రూపొందారు. ఎక్కడో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పుట్టి, ఉద్యోగ ప్రస్థానంలో కర్నూల్ లో పనిచేసి, పదవీ విరమణ చేసిన అనంతరం సీమ ఉద్యమ కారులకు ఒక దారి దీపం అయ్యారు… రాయలసీమ లో నీళ్ళెక్కడివి అని ప్రశ్నించే వారందరికీ… సీమ ప్రాంతం లో కురిసే ప్రతి నీటి బొట్టుకు లెక్కలు చెప్పి, సీమ కరువుకు కారణం ప్రకృతి కాదు పాలకుల నిర్లక్ష్యమే నని అందరి కళ్ళు తెరిపించాడు. సీమ ప్రాజెక్ట్ ఉద్యమాలకు ఒక చుక్కాని అయ్యాడు. సీమ లోని ప్రతి ఉద్యమ సంఘాలకు, రాజకీయ పార్టీలకు, ఇంజనీరింగ్ శాఖ వారికి ఒక నడిచే నీటి నిఘంటువు గా మారిపోయాడు.

జిల్లాలో సిద్ధేశ్వరం అలుగు, వేదవతి, అమృతసాగర్, RDS కుడి వరద కాలువ వంటి ఎన్నో పథకాలను, దాదాపు 10 వరకు చిన్న చిన్న నీటి పథకాల ను రూపొందించి, వాటి అమలు కొరకు  MLA మొదలుకొని, ముఖ్యమంత్రి వరకు, అధికారులలో స్థానికి AE మొదలు ఇంజనీర్స్ ఇన్ చీఫ్ వరకు ఎన్ని ప్రతినిత్యాలో ! వాటిల్లో ఏ కొన్నిటిని అధికారాలు, ప్రభుత్వం పట్టించుకున్నట్లయితే, రాయలసీమ సుభిక్షంగా ఉండేది. కృష్ణా, గోదావరి నదులు, వాటి ఉపనదులు, చిన్న వాగు, వంకల నీటిని సద్వినియోగం చేసుకోవడానికి తగిన పథకాలు రూపొందించాడు. అవి కూడా అన్నీ గ్రావిటీ తో సహజ సిద్ధంగా పారేవే! అదీ సుబ్బరాయుడు సార్ గారి కమిట్ మెంట్.!

                        **

78 సం. ల నిండైన జీవితంలో ఆయన మృతి ఆకస్మికం కాకపోయినా… రాయలసీమ ఉద్యమం ఒక అరుదైన మేధావిని, ఒక పెద్ద దిక్కును కోల్పోయింది. నిజాయితీ గల ఇంజనీరింగ్ నిపుణుణ్ణి రాష్ట్రం కోల్పోయింది.

అయినా సీమ ఉద్యమం కన్నీళ్లను దిగమింగు కోవాలి. కరుడుగట్టిన పాలకుల నిర్లక్ష్యాన్ని నిలదీయాలి. మరింత అంకిత భావంతో సీమ ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్లాలి. అదే మనం ఆయనకు ఇచ్చే ఘనమైన నివాళి.

అమర్ హై ! సుబ్బరాయుడు గారు!

Leave a Reply