ముందే నిర్ణయమైన పరిస్థితుల మధ్య, నియంత్రించలేని పరిణామాల మధ్య, మనుషులు సొంత వ్యక్తిత్వాల్ని ఎట్లా తీర్చిదిద్దుకోగలరు? జీవితగమనాన్ని తామే నిర్దేశించుకునే ఇచ్ఛను ఎట్లా నెరవేర్చుకోగలరు? విధింపులను కాదని ఎంపికలను సాధన చేయడం ఎట్లా? యథాస్థితికీ మార్పుకూ మధ్యనే కాదు, అనేక కొత్తదారుల మధ్య, అనేక మంచిదారుల మధ్య దిక్కుతోచని తనాన్ని అధిగమించడం సాధ్యమా?
పై ప్రశ్నలను ఉదాహరణలతో సహా చర్చించుకుంటూ పోతే, అది శాంత జీవితం అవుతుంది. ఆమె ప్రయాణాన్ని దాని ముళ్ల దారుల నుంచి కాలిబాటల నుంచి సొంతంగా వేసుకున్నరహదారుల దాకా, ఆటుపోట్లు, జయాపజయాలు, రాజీలూ సర్దుబాట్ల తో సహా, బొమ్మకడితే అది ‘చుక్కపొడుపు’ నవల. శాంత జీవితంలో చుక్కపొడుపు చివర ఎక్కడో ఆశ్వాసాంతాన పలికే ఫలశ్రుతి కాదు, అడుగడుగునా, ప్రతి మూలమలుపునా, కనిపించే వేకువ. చేరుకున్న గమ్యాలలో కంటె గమనంలోనే ఆమె విజయం ఉంది.
నల్లూరి రుక్మిణి మునుపటి నవలల కంటె ‘చుక్కపొడుపు’ చాలా ప్రత్యేకమైనది. ‘ఒండ్రుమట్టి’ ‘నిషిధ’ మొదలైన నవలల్లో, అనేక కథలలో వ్యక్తమయిన రుక్మిణి కొనసాగింపు ‘చుక్కపొడుపు’లో కనిపిస్తున్నప్పటికీ, ఈ రచన స్వభావరీత్యా భిన్నమైనది. రచనాశిల్పం రీత్యా ఉన్నతమైనది. పాత్రలను, పరిసరాలను చదును చేయకుండా, జీవితపు గరుకు వర్తులపు సానువుల నుంచి, మానవ సహజాత, సామాజిక ఆకాంక్షలు ఆవేశాల నుంచి తన చూపును సమన్వయిస్తూ రచయిత కథ నడిపించారు. రుక్మిణి సాహిత్య జీవితంలో పతాక సృజన ఈ ‘చుక్కపొడుపు’.
పంజరం లాంటి కుటుంబాన్ని వదిలిన శాంతను అరవైల మధ్య నాటి గుంటూరు కొత్త గాలులతో ఉక్కిరిబిక్కిరి చేసింది. వ్యక్తిత్వాన్ని నిగ్గు తేల్చింది. ఉద్యమాల్లోకి, విద్యార్థి సంఘాల్లోకి, చివరకు విప్లవ రాజకీయాల్లోకి నడిపించింది. కుతూహలంతో, విశ్వాసంతో, సార్థకజీవన ఆకాంక్షతో శాంత సాహససీమల్లో సంచరించింది. స్వయం నిర్ణయాధికారంతో జీవితసహచరుడిని ఎంపిక చేసుకుంది. సొంత కలలకు, సమాజ ఆదర్శాలకు వంతెన వేసి అవిశ్రాంత మార్గంలో నడిచింది. మనుషులను ప్రేమిస్తూ, ప్రశ్నిస్తూ, సమాధానపడుతూ, మారుతూ, మారుస్తూ పరిసరాలను వెలిగించింది. పుట్టిన ప్రపంచం నోరునొక్కాలనుకుంటే, తనకో ప్రపంచాన్నినిర్మించుకుని పొలికేక పెట్టింది.
ఈ క్రమం అంతా సునాయాసంగా, సరళరేఖలో సాగిపోలేదు. మనుషులు తమను తాము పాత నుంచి పెకిలించుకుని, కొత్తలోకి ప్రతిష్ఠించుకోవడం వెనుక- లోపలా, బయటా జరిగే యుద్ధం చాలా ఉంటుంది. తనదైన మంచిచెడ్డల విచక్షణతో ప్రతి అడుగునూ బేరీజు వేసుకుని, పరిమితులను, అవకాశాలను అంచనా వేసుకుని, ముందుకు సాగవలసి ఉంటుంది. ఈ క్రమంలో శాంత అనుసరించిన జీవిత వ్యూహాలు, వాటికి ప్రాతిపదికలుగా పనిచేసిన ఆలోచనలు ఆసక్తికరంగా ఉంటాయి.
కొత్త ప్రపంచపు ద్వారాలు మొదట తెరుచుకున్నప్పుడు, దిగ్భ్రమతో, బెరుకుతో అడుగులు వేసిన మనిషి, తరువాత తరువాత అడుగడుగునా తానే దారిని విశాలం చేసుకుంటూ వెళ్లింది. అనేక సందర్భాలలో సంశయంలో, తర్జనభర్జనలో, అయోమయంలో కొట్టుమిట్టాడి, ఒక్కోసారి బలహీనత నుంచి, మంచితనం నుంచి మరింత కష్టాన్ని తలకెత్తుకుని, క్రమంగా ఆత్మవిశ్వాసంతో, స్థైర్యంతో నిర్ణయాలు తీసుకునే దశకు శాంత చేరుకుంది.
ఇది ఒక కథానాయిక కథ మాత్రమే కాదు. వ్యక్తిగత ప్రయాణం సామూహిక ప్రస్థానంలో సంలీనమైన ఇతిహాసం. అశాంత, దందహ్యమాన దశాబ్దాల తీరాంధ్ర సమాజంలో సుడితిరిగిన ఉద్యమాల కథనం. . ఆత్మకథనాత్మక సాధికార చిత్రణ. రాజకీయ చరిత్ర. కాలనాళికలోకి నడిపించే అరుదైన, అవసరమైన పీరియడ్ నవల.
రుక్మిణి తన జీవితప్రయాణాన్ని మాత్రమే రాస్తే, అది స్వీయచరిత్ర అవుతుంది. కానీ, ‘చుక్కపొడుపు’ కాల్పనిక రచన. జీవితం కేవల సన్నివేశాల, ఘటనల క్రోడీకరణగా కాకుండా, విమర్శనాత్మకంగా, అంతస్సూత్ర వ్యాఖ్యానంగా చిత్రించినప్పుడు, కాల్పనిక రచనలో పదునైన వాస్తవికత పలుకుతుంది. ఆ కథాకాలంలో జీవించిన రుక్మిణి మాత్రమే ‘శాంత’లో లేదు. సింహావలోకనంలో, తనను తాను దర్శించుకుంటున్న చారిత్రక వ్యక్తిగా ఆమె ఉన్నారు. మానవ, సామాజిక సంబంధాల సంక్లిష్ట సమ్మర్దంలో, స్థలకాలాల చలనగతిలో ఒక ‘కథ’ను గుర్తించడం, అందులోనూ తన కథను తాను గుర్తించడం అంత తేలిక కాదు. రుక్మిణి ఆ పనిని ప్రతిభావంతంగా, నిపుణతతో నిర్వహించారు. ఇందులోని అనేకమంది చారిత్రక వ్యక్తులు పాత్రలుగా వారిపేర్లతోనే ఉన్నారు. మారుపేర్లతో కొందరు అన్నారు. అనేక వాస్తవ వ్యక్తిత్వాల జమిలి ప్రాతినిధ్య పాత్రలు కూడా ఉన్నాయి.
పియుసి చదవడానికి వచ్చి గుంటూరు హాస్టల్‌లో చేరిన శాంత జీవితం, సమాంతరంగా జరిగే సామాజిక, రాజకీయ సంచలనాలతో పెనవేసుకుని నడుస్తుంది. ఆ క్రమంలోనే ఆమె ప్రపంచం విస్తరిస్తుంది. ఈ నవలలోని ఏడెనిమిది సంవత్సరాల కాలం దేశంలోను, రాష్ట్రంలోనూ చాలా కీలకపరిణామాలు జరిగాయి. స్వాతంత్యపు ‘సంబరం’ ముగిసిపోయి, అసంతృప్తులు, ఆగ్రహాలు వెల్లువెత్తడం మొదలయిన కాలం. అరవైల తిరుగుబాటు దశాబ్దం ప్రపంచవ్యాప్తంగా అనేక జనసంచలనాలు రెక్కవిప్పాయి. మన దేశంలోను, అప్పటి ఉమ్మడి రాష్ట్రంలోను అనేక ఉద్యమాలు సమాజాన్ని కుదిపివేశాయి. ‘పాత సంస్కృతి తాలూకా చివరి దశ కొనసాగుతున్న’ కొత్తపాలెం వంటి మారుమూల గ్రామం నుంచి ప్రధానస్రవంతి సందడితో హడావుడిగా ఉండే గుంటూరులో వచ్చిపడిన శాంత- ఒక చారిత్రక అంతరాన్ని ఒక్క అంగలో దాటేసింది. అందులో బయటి శక్తుల పాత్ర ఎంతో, సొంత చొరవ, సంసిద్ధతల పాలు కూడా అంత. ఆ అంతర్, బాహ్య ప్రేరణల సంభాషణను చిత్రించగలగడం సున్నితమైన నైపుణ్యం.
విశాఖ ఉక్కు, త్రిభాషా సూత్రం, హోటల్ రేట్ల పెంపు- వంటి సాధారణ ప్రజా ఉద్యమాలలో కమ్యూనిస్టు విద్యార్థి సంఘాలు క్రియాశీలంగా పాల్గొన్నాయి. జై ఆంధ్ర ఉద్యమంలో సాధారణ ప్రజానీకం, విద్యార్థులు పెద్ద ఎత్తున పాలుపంచుకున్నారు. ఈ ఉద్యమాలన్నీ ‘చుక్కపొడుపు’లో కథానాయిక జీవితంలో భాగంగా తారసపడతాయి. కమ్యూనిస్టు విద్యార్థి సంఘంతో సాహచర్యం, ఆ రాజకీయాలతో పరిచయంగా పరిణమిస్తుంది. వివిధ కమ్యూనిస్టు పార్టీల మధ్య మార్గాల వైరుధ్యాలు, సాయుధ పోరాట మార్గంలో కూడా అనేక అంతర్గత విభేదాలు శాంత ఉద్యమజీవితాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. మనుషుల ప్రవర్తనలు, సానుకూలతలు ప్రతికూలతలు అన్నిటిని అవగతం చేసుకుంటూ, తాను ఒక దారిని ఎంచుకోవడం చాలా సహజక్రమంలో జరిగిపోతుంది.
మారుమూల గ్రామం, సంప్రదాయ పురుషాధిక్య కుటుంబం, నిలువ నీరు లాంటి జీవితం, ఒక ఆడపిల్లకు విధేయత తప్ప మరో అవకాశం ఉండదు. అక్కడి నుంచి మరొక స్థలానికి, సడలింపులు కలిగిన పట్టణ జీవితానికి తరలి వెళ్లినప్పుడు, ఒక చిన్న కిటికీ తెరుచుకున్నది. కుటుంబానికి పొడిగింపే హాస్టల్. బసవయ్య ధైర్యం చేయడానికి అది ఒక ముఖ్య కారణం. కానీ, హాస్టల్ లో భిన్నమైన మానవ, సామాజిక సంబంధాల వాతావరణం. పరిమితమైన ఆంక్షలు. దూరంగా ఉన్న కుటుంబానికి విధేయంగా ఉంటూనే, దొరికిన చిన్న వెసులుబాట్లు శాంత ప్రతిపత్తిని కొద్దికొద్దిగా విస్తరిస్తూ పోయాయి. తన మీద తన అధికారాన్ని పెంచుకోవడానికి ఆస్కారం ఇచ్చాయి. స్నేహితుల ఇళ్లకు, ఊళ్లకు వెళ్లడం, అక్కడ కఠినమైన కుటుంబ పరిధులు లేకపోవడం ఆమెకు కొత్త వెల్లడిని కలిగించాయి. ఒక విధేయ స్త్రీ, స్వయంనిర్ణయాధికార శక్తిని సమకూర్చుకోవడానికి, ఆ అధికారాన్ని వినియోగించుకునే ఎంపిక చేసుకోవడానికి చేసే ప్రయత్నాన్ని శాంత పెళ్లి దాకా జరిగిన కథలో రచయిత పూసగుచ్చారు. పెళ్లి విషయంలో కుటుంబ నిర్ణయాన్ని కాదని, సొంత ఎంపిక వైపు మొగ్గడం కేవలం వ్యక్తిత్వ విశేషం కాదు. అది ఒక రాజకీయ నిర్ణయం. తన అటానమీని ప్రకటించుకోవడం. కుటుంబ విలువలు, ప్రాధాన్యాలు కాకుండా, రాజకీయ, సామాజిక ఆచరణలు తనలోకి తెచ్చిన కొత్త విచక్షణల ఆధారంగా శాంత ఒక దశ విముక్తిని సాధించుకుంది. వ్యక్తిగతమంతా రాజకీయమే అన్న అవగాహనకు ఇది దగ్గర. కానీ, తనను నియంత్రించే సంప్రదాయాలు, మొత్తం సమాజంలో అన్యాయాలను అధికారికం చేస్తున్న వ్యవస్థ- ఒకే తానులో ముక్కలు అని శాంత ఆనాటికి గ్రహించిందో లేదో తెలియదు కానీ, ఆమె రాజకీయ ఆచరణే వ్యక్తిగత స్వేచ్ఛను వరించడానికి ప్రేరణ అయింది. చదువుకుని గౌరవనీయమైన వ్యక్తిగా ఎదగాలని ఆశించిన తండ్రి, తన ఊహకు కూడా అందని రాజకీయ, ప్రజారంగ వ్యక్తిగా శాంత రూపొందడం చూసి ఆశ్చర్యపోతాడు. అవ్యక్తంగా అయినా ఆనందపడతాడు.
స్వాతంత్ర్యానికి పూర్వం తెలుగు సామాజిక చరిత్రను, రాజకీయోద్యమాలను నేపథ్యంగా తీసుకున్న నవలలు, కథలు అనేకం కనిపిస్తాయి కానీ, ఆ తరువాత కాలంలో ఫిక్షన్ మానవ సంబంధాల, విలువల మీద దృష్టిపెట్టి, వ్యక్తిగత, కౌటుంబిక రంగాల మీద కేంద్రీకరించింది. అట్లాగని విస్తృతమైన సామాజిక, రాజకీయ సందర్భాన్నినేపథ్యంగా తీసుకుని రచనలు చేసే ప్రయత్నం అసలే జరగలేదని కాదు. సామాజిక చరిత్రను, ప్రజా ఉద్యమాలను క్షేత్రస్థాయిలో చిత్రించినవి, రాజకీయ నేపథ్యంలో కథనం చేసినవి కొన్ని రచనలు ఇతర ప్రాంతాలలో కనిపిస్తాయి కానీ, దక్షిణతీరాంధ్రలో ఆ 1970లకు అటూ ఇటూ తెలుగు రాజకీయ జీవితాన్ని చిత్రించిన నవలలు ఉన్నాయా అన్నది అనుమానమే. ఆ లోటును తీర్చే ప్రయత్నం చేసినందుకు కూడా ‘చుక్కపొడుపు’ ప్రత్యేకమైనది. అలాగే, శాంత రూపొందిన కాలం నేపథ్యంలో, పట్టణ ప్రాంతాలలో క్రియాశీలిగా మారిన ఒక విప్లవాభిమాని, ప్రజాస్వామికవాది, -అందులోనూ మహిళ – క్రమపరిణామాన్ని చిత్రించిన నవలలు కూడా లేవు. ఆత్మకథనాత్మక రీతిలో అసలే లేవు. ఇట్లా, అనేక అరుదైన ప్రత్యేకతలు, అపూర్వతలు ‘చుక్కపొడుపు’కు దక్కుతాయి. ప్రజా ఉద్యమాల, మిలిటెంట్ వామపక్ష రాజకీయాల గమనం నేపథ్యంలో ఒకనాటి ప్రకాశం, గుంటూరు జిల్లాల చరిత్రను, ఆ ప్రాంతాల్లో ప్రజారాజకీయాల చరిత్రను ఈ పుస్తకం నమోదు చేసింది. తెలుగువారి సామాజిక చరిత్రకు ఇది గొప్ప చేర్పు.
ఈ ప్రయాణాన్నిచిత్రిస్తున్నప్పుడు, కొత్తపాలెం గురించి, దాని సమీపంలోని చీమకుర్తి గురించి, తమ బంధువుల గురించి, అక్కడి వ్యవసాయం గురించి, తమకుటుంబం చేసే చిల్లర వ్యాపారం గురించి నవలలో అనేక వివరాలుంటాయి. ఎక్కడా కథనంతో, కథతో పొసగని సమాచారం ఉండదు. ప్రథమపురుషలో కథనం ఉన్నప్పటికీ, శాంత వైపు నుంచి రచన సాగుతుంది కాబట్టి, ఆమె అనుభవంగా, అభిప్రాయంగా, మనోభావంగా విషయాల వర్ణన ఉంటుంది. మనుషుల మంచి తనం నుంచి వారి మీద, వారి అభిప్రాయాల మీద అంచనా ఉంటుంది. అరకొర అక్షరాస్యత కలిగిన తనకే పదిమందిలో గౌరవం లభిస్తున్నది కాబట్టి, పిల్లలకు చదువు చెప్పించి వారిని గౌరవనీయులు చేయాలని బసవయ్య అనుకుంటాడు. స్టూడెంట్ ఫెడరేషన్ వాళ్లు తనతో సంబంధంలోకి వచ్చారు కాబట్టి, సాటి విద్యార్థులలో తనకు గౌరవం పెరిగిందని శాంత గుర్తిస్తుంది. హాస్టల్ కార్మికుల మీద తాను ఆదరణ చూపించాను కాబట్టి, వారు తన విషయంలో సహాయకారులుగా ఉన్నారని ఆమెకు అర్థమవుతుంది. తాను చేపట్టిన ప్రతి ఆచరణకు, ప్రతిఫలాన్ని తనకు లభించే గౌరవాభిమానాలలో చూస్తుంది శాంత. ఎక్కడా ప్రత్యేకంగా వ్యక్తం చేయదు కానీ, ఆత్మగౌరవం అన్నది శాంతకు అతి ముఖ్యమైన ప్రాతిపదిక. వెనుకబడిన ప్రాంతాల, దిగువ మధ్యతరగతి గ్రామీణ జీవికల నేపథ్య లక్షణం ఇది. కొత్తపాలెం ను పూర్తిగా వదిలివస్తున్నప్పుడైనా, కొందరు స్నేహీతులను వదులుకోవలసి వచ్చినా, అత్తగారింటి విషయంలో ఒక వైఖరి తీసుకోవలసి వచ్చినా, శాంత తన సహనగుణాన్ని, ఆత్మగౌరవాన్ని నిత్యం బేరీజు వేసుకుంటూ ఉంటుంది.
సృజనాత్మక వచన రచయితగా రుక్మిణి ఈ నవలలో సాధించిన పెద్ద విజయం, పాత్రలు రక్తమాంసాలతో వెలుగు నీడలతో సజీవంగా ఉండడం., జీవితంలోకి ప్రవేశించే ప్రభావాలను, మార్పులను అతి సూక్ష్మగతిలో పట్టుకోవడం. నవలలో అతిథులుగా వచ్చే ప్రసిద్ధ వ్యక్తులను మినహాయిస్తే, అన్ని పాత్రలను రచయిత వారి స్వభావ విశేషాలతో సహా వర్ణిస్తారు. తండ్రి బసవయ్య, తల్లి అనంతమ్మ-ఈ ఇద్దరూ ఎంత ముతకగా ఉంటారంటే, వారిలో మనం పుస్తకాల్లో చదవడానికి అలవాటుపడిన తల్లిదండ్రులు కనిపించరు. వాళ్లు చెడ్డవాళ్లు కారు. జీవితభారాల కింద కుంగిపోయిన మనుషులు. కన్నప్రేమలను కూడా వ్యక్తం చేయలేరు. అటువంటి పాత్రల్లో ఒక్కోసారి ఉన్నట్టుండి తడి తళుకుమంటుంది. చిన్నతనం నుంచి తనలో ఉన్న చొరవను, ధైర్యాన్ని ప్రోత్సహించకపోగా, ఆడపిల్లగా అణచిపెట్టాలని కుటుంబం చూస్తే, శాంత ధిక్కారాన్ని అలవాటు చేసుకుంది. బాల్యంలో జరిగిన ఒక అప్రియమైన సంఘటన అల్లరిపాలు చేయగా, చదువు ఆపేయవలసి వస్తుంది. కూతురు మీద బసవయ్యకు అప్పుడే ఒక నిర్లిప్తమైన ముభావం ఏర్పడుతుంది. అయితే, తనని చదవించాలన్న పట్టుదలను మాత్రం అతను వదులుకోలేదు. దయలేని మనిషిగా కనిపించే తండ్రిలో ప్రగతి శీల రాజకీయ నేపథ్యం ఉంటుంది. అతని జీవన పోరాటాన్ని, కుటుంబానికి ఆధారస్తంభంగా నిలుచున్న బాధ్యతాయుత వ్యక్తిత్వాన్ని తెలుసుకున్న శాంతకు తండ్రి మీద అపారమైన ప్రేమ కలుగుతుంది. పెళ్లి విషయంలో మౌలికమయిన దూరం ఏర్పడినప్పుడు తప్ప, శాంతకు కుటుంబంతో తెగదెంపుల ఆలోచనే ఉండదు.
గుంటూరులో తనను ఉద్యమప్రపంచంలోకి నడిపించిన కొత్తమిత్రులు శాంతకు ఎంతో ఆశ్చర్యం కలిగిస్తారు, ప్రజలకోసం వారికి ఉన్నపట్టింపును చూసి ఆమెకు ఎంతో ఆరాధనా భావం కలుగుతుంది. అదే సమయంలో వారందరిలోనూ తనకు పొసగని ఏవో వ్యక్తిత్వ విశేషాలో, రాజకీయ ఆత్రుతలో ఉంటాయి. ఉన్నతాదర్శాలతో రాజకీయ ఆచరణలో ఉన్నవారు తనను ఒక స్థావరంగా, ఆశ్రయంగా, మెసెంజర్ గా ఉపయోగించుకోవడం, తన చైతన్యాన్ని ఉన్నతీకరించడానికి ప్రయత్నించకపోవడం, తన చదువు లెక్కలోకి తీసుకోకపోవడం శాంతకు బాధ కలిగిస్తుంది. ఆ రాజకీయవాదుల సాహసత్యాగాల ఆచరణ, ఆ పని మంచికోసమే అన్నవిశ్వాసంతో వాటిని ఆమె భరిస్తుంటుంది. రాజకీయాలతో నిమిత్తం లేకుండా, తనను ఆదరించే, పట్టించుకునే స్నేహితులను ఇష్టపడుతుంది. పార్టీ విభేదాలతో మనుషులను దూరం పెట్టడానికి అంగీకరించదు. ఇస్కస్ సాంబయ్యలో, సుభాష్‌లో, విప్లవ వాదులలోని రమేశ్ లో కనిపించే అవ్యాజమైన ఆప్యాయత ఆమెలో కృతజ్ఞతతో కూడిన ఇష్టాన్ని కలిగిస్తాయి. సాహిత్యంతో, సిద్ధాంత విషయాలలో మునిగితేలే కొందరు తమ ప్రవర్తనతో తనలో న్యూనభావాన్ని కలిగించడం ఆమెకు నొప్పికలిగిస్తుంది. కొత్త ప్రపంచానికీ తనకూ మధ్య ఉన్నగోడలలో ఇంగ్లీషు ఒకటి. పియుసిలో, డిగ్రీలో ఇంగ్లీషులో తప్పుతుంది. చదువు మీద దృష్టిపెట్టకుండా రాజకీయాలు అడ్డుపడుతుంటాయి. తన ఆత్మవిశ్వాసానికి అడ్డుపడుతున్న ఒక సాంస్కృతికమయిన అవరోధంగా కూడా శాంత దాన్ని గుర్తిస్తుంది.
జీవిత సహచరుడిగా ఎంచుకున్న శ్రీకాంత్‌ను కూడా శాంత ఎంతో విమర్శనాత్మకంగా చూస్తుంది. అతని కుటుంబం తనను పరాయిగా చూడడం, దాన్ని అతను ఆశించనంతగా కట్టడి చేయలేకపోవడం ఆమెకు బాధ కలిగిస్తాయి. శ్రీకాంత్ సాహచర్యంలో ఉద్యమజీవితం ఉత్సాహంగా గడుస్తుంది. అనేకమంది ప్రముఖ రచయితలతో, ఉద్యమప్రముఖులతో పరిచయాలను పెంచుతుంది. విద్యార్థిదశ లోని కుతూహలాన్ని, చొరవను కొనసాగించగలిగేట్టు ఉంటుంది. అదేసమయంలో, కుటుంబ బాధ్యతల మధ్య తనదైన సొంత కార్యాచరణ ఏర్పడకపోవడం మీద శాంతికి వెలితి ఉంటుంది.
ఉత్పత్తి, ఆర్థిక సంబంధాల ప్రాథమ్యాన్ని అనేక సందర్భాలలో నొక్కిచెప్పిన రుక్మిణి, కాల్పనిక రచనల నిర్వహణలో రాజకీయ అవగాహనతో పాటు తన పరిశీలనాశక్తిని, పూర్వతరాల అనుభవ జ్ఞానాన్ని కూడా ఉపయోగించుకున్నారు. దృక్పథమొక్కటే రచనకు గాఢత కలిగించలేదని, సామాజిక సంఘర్షణ, మానవ సంబంధాల సంఘర్షణ, వ్యక్తుల ఆంతరంగిక సంఘర్షణ ఈ మూడింటిని కలగలపి చిత్రించగలిగే శక్తి ఉంటే అది గొప్ప విషయమని ఆమె ఒక ఇంటర్వ్యూలో అన్నారు. ‘చుక్కపొడుపు’ నవలారచనలో ఆమె ఆ శక్తిని సాధన చేశారనే చెప్పాలి. ఏక కాలంలో అనేక తలాలలో జరిగే ప్రక్రియలను, వేర్వేరు మంచితనాలను, వేర్వేరు అవగాహనాస్థాయిలను, వాటి వాటి వాస్తవికతలతో చిత్రించడం కేవలం రాజకీయ అవగాహననుంచి సంక్రమించే విద్య కాదు. విమర్శనాత్మక, తార్కిక దృష్టిని జీర్ణం చేసుకుని, సృజనాత్మక స్ఫురణలను, అన్వయాలను పరికరాలుగా రచయిత ఉపయోగించాలి. మునుపటి నవలలో కనిపించిన ప్రస్ఫుట రాజకీయ వైఖరులను ఈ నవలలో రుక్మిణి కొంత లోపలి పొరల్లో సర్దుబాటు చేశారు. అట్లాగని, ఆమె రాజకీయ ప్రాధాన్యాలను ఎక్కడా వదలలేదు, చెప్పకుండా ఊరుకోలేదు, రచనలో విస్తరించకుండా కూడా ఆపలేదు. కానీ, నవలలో అత్యధిక భాగం శాంత రూపొందుతున్నక్రమం కాబట్టి, అక్కడ రచయిత ఎంచుకున్న సంవిధానం భిన్నం కాబట్టి, రాజకీయాలు కథలో ఒదిగిపోయాయి. ఎక్కడైతే శాంతకు పరిసరాలతో, పరిసర వ్యక్తులతో సమస్యాత్మకత ఉన్నదో, ఎక్కడ ఆమె సాహసం, నిబద్ధత, చొరవ కొట్టొచ్చినట్టు కనిపిస్తాయో అక్కడ రచయిత వ్యక్తిగత కేంద్రితంగానే సన్నివేశరచన చే శారు. రహస్యలేఖలు చేరవేసే పనిలో కానీ, జైఆంధ్ర ఉద్రిక్తతల మధ్య వీధుల్లో సంచరించవలసి రావడం కానీ, శాంత వ్యక్తిత్వాన్ని, ఆ చర్యల రాజకీయ తీవ్రతను చెబుతాయి. ఇస్కస్ సమావేశాలకు ఒడిశా వెళ్లడం కానీ, అక్కడ శ్రీశ్రీ సమావేశంలో పాల్గొనడం కానీ, తరువాత విరసం, పౌరహక్కుల సంఘం, విద్యార్థి సంఘం సభలకు పనిచేయడం కానీ, శాంత అన్వేషణను, ఆసక్తులను మరింత పోషించాయి. నిశితపరిశీలనతోనే వాటి నుంచి తాను నేర్చుకున్నది. ప్రతి ఒక్క కొత్తదనానికి ముగ్ధురాలయ్యే సజీవగుణం ఆమె వదులుకోలేదు. ఆయా కొత్తదనాలను తనకు బాల్యం నుంచి తెలిసిన గ్రామీణ విలువల నుంచి, తరువాత అలవరుచుకున్న ఆధునిక పట్టణ విలువల నుంచి అంచనావేయడం శాంత అలవరచుకున్నది. ఈ నవల అంతా, శాంత విచక్షణ, ఆ విచక్షణను మెరుగుపరుచుకునే విశాలత్వం మీదనే కథనం నడుస్తుంటుంది.
శాంతకు మొదట విద్యార్థి కార్యకర్తల సాహసం, అంకిత భావం గొప్పగా అనిపించాయి. పోలీసులు నిర్విచక్షణగా అటువంటి వారి మీద లాఠీ ప్రయోగం చేయడం, కాల్పులు జరిపి ప్రాణాలు తీయడం బాధ కలిగించింది. కమ్యూనిస్టు పార్టీ కార్యక్రమాల్లో పొగాకు వ్యాపారం ముడిపడి ఉండడం నచ్చలేదు. విప్లవరాజకీయాల్లో హింస గురించి ఆమె సమాధానపడలేదు. పోలీసులు వారిని ఎన్‌కౌంటర్ చేయడం ఆమెకు వేదన కలిగించింది. చారుమజుందార్, నాగిరెడ్డి రాజకీయ ధోరణుల మధ్య సంవాదం ఆమె పరిసరాలలోకి అనివార్యంగా ప్రవేశించింది. అన్ని పాయల మీద, అన్ని కోవల మీదా ఆమెకు వ్యక్తుల నుంచి, విధానాల నుంచి ఏవో ప్రశ్నలు ఉంటూనే ఉన్నాయి. అనేక దారులలో సంచరించి, చివరకు, శాంత చారుమజుందార్-కొండపల్లి మార్గం మీద ఇష్టాన్ని నిలుపుకుంటుంది. బయట జరిగే సీరియస్ రాజకీయ చర్చ, ఒక ఆరంభదశలోని విప్లవాభిమాని మీద ఎటువంటి ప్రభావాన్ని, అంతర్మథనాన్ని కలిగిస్తాయో ఈ క్రమం చెబుతుంది. ఒక మార్గానికి తనను తాను స్థిరపరచుకున్న తరువాత కూడా శాంత కు కొత్త ప్రశ్నలు, సందేహలు రాకుండా లేవు, ఫిర్యాదులేవీ లేకుండా పోలేదు. శ్రీకాంత్ ఉద్యోగం కోసం తిరిగి గుంటూరు చేరిన శాంత తనలో తాను వేసుకున్న ప్రశ్న- పెళ్లయిన రెండేళ్లలోను తాను చేసిందేమిటి? పెళ్లి కోసమే పెళ్లి కాదు కదా, ఇద్దరూ కలిసి సమాజానికి ఏదైనా మేలు చేయాలి కదా, ఆ విషయం సమాజానికి, తన ఊరు కొత్తపాలేనికీ నిరూపించాలి కదా? యాభైఏళ్ల కిందటి కాలంలో ముగిసిన ఈ నవలకు, అనంతర శాంత జీవిత ప్రయాణం మీద మరొక కొనసాగింపు ఉండాలి. అందులో కొత్త ఘర్షణలు, కొత్త తపనలు, కొత్త విజయాలు ఉండి ఉండాలి!
నూతన ప్రపంచ నిర్మాణం కోసం తపనపడి, తప్పొప్పులు చేసి, సాహసత్యాగాలు చేసి, జీవితాలతో సతమతమయిన మునుపటి తరాల మీద గొప్ప గౌరవం కలిగించడం ఈ నవల సాధించే మరొక విజయం. నూతన మానవుల అవతరణ ఒక తరంలోనో, వ్యక్తుల సాధనతోనో జరిగేది కాదు. పాదుకుపోయిన పాషాణ వ్యవస్థలను అంగుళమంగుళం కరిగించడానికో బద్దలు కొట్టడానికో మనుషులు ప్రయత్నిస్తూనే ఉంటారు. తమ జీవితంతో తాము చేసే యుద్ధం కూడా అందులో భాగమే. శాంత – ఒకరికో ఇద్దరికో సర్వనామం కాదు. ‘చుక్కపొడుపు’ ఏ ఒక్కరి ఆత్మకథో మాత్రమే కాదు. ఆ మాటకు వస్తే ఒక చారిత్రక దశకే పరిమితమైనదీ కాదు. ఇందులో అనేక కాలాల, అనేక వ్యక్తుల, అనేక ఆదర్శాల, ఆచరణల ప్రతిబింబాలను చూడవచ్చు.




