2026 ఫిబ్రవరిలో భారత ప్రభుత్వం అమెరికా, భారత దేశాల మధ్య ఒక వాణిజ్య ఒప్పందం కుదిరిందని ప్రకటించి దాన్ని “చరిత్రాత్మక మైలురాయి”గా ప్రచారం చేస్తోంది. ట్రంప్ విధించిన 50శాతం సుంకాలను 18 శాతానికి తగ్గించిందని, ఇది మోదీ వల్లనే సాధ్యమయిందని ప్రకటించి మోదీకి పెద్ద ఎత్తున సన్మానం చేసి ఆయన ఎట్లా అమెరికా ఒత్తిడికి దాసోహం అయ్యాడనే వాస్తవాన్ని మరుగుపరచాలని మోదీ ప్రచార టీం పెద్ద ఎత్తున ప్రచారానికి పూనుకున్నది. కానీ ఈ వాణిజ్య ఒప్పందం భారత వ్యవసాయ రంగాన్ని అమెరికా పెట్టుబడులకు దాసోహం చేసే ఒప్పందం.

భారత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలోని అన్ని విషయాలను ఇప్పటికీ స్పష్టంగా నిర్దిష్టంగా రూపొందించుకోలేదు. దానిపై సంప్రదింపులు జరుగుతున్నాయి. ముఖ్యమైన విషయాలను మాత్రమే ప్రకటించారు. వాటిని పరిశీలించినా భారత ప్రభుత్వం, అది ప్రాతినిధ్యం వహిస్తున్న దళారీ బ్యూరాక్రటిక్ పెట్టుబడిదారీ వర్గాలు ఇప్పటికీ ఎట్లా భారత ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టి సామ్రాజ్యవాద ఫైనాన్స్ పెట్టుబడి ముందు మోకరిల్లారో అర్థమవుతుంది.

1.            ఈ తాత్కాలిక ఒప్పందం ప్రకారం అమెరికా భారత మూల ఉత్పత్తులపై 18 శాతం పరస్పర సుంకం (reciprocal tariff) విధించనుంది. ఇందులో టెక్స్టైల్,దుస్తులు, తోళ్ళు, పాదరక్షలు, ప్లాస్టిక్,రబ్బర్ ఉత్పత్తులు, ఆర్గానిక్ కెమికల్స్, హోమ్ డెకార్ ఉత్పత్తులు, హస్తకళా ఉత్పత్తులు, కొన్ని యంత్రాలు ఉన్నాయి.

2.            ఈ ఒప్పందం ప్రకారం, వచ్చే ఐదు సంవత్సరాల్లో భారత్ అమెరికా నుంచి $500 బిలియన్ విలువైన ఎనర్జీ ఉత్పత్తులు, విమానాలు మరియు వాటి భాగాలు, విలువైన లోహాలు, సాంకేతిక ఉత్పత్తులు, కోకింగ్ కోల్ను కొనుగోలు చేస్తామనే ఉద్దేశాన్ని వ్యక్తం చేసింది.ఇది ప్రస్తుతం భారతదేశం అమెరికా నుండి దిగుమతి చేసుకుంటున్న దానికి ఎన్నో రెట్లు ఎక్కువ.

3.            భారత్, అమెరికాలు సాంకేతిక ఉత్పత్తుల వాణిజ్యాన్ని గణనీయంగా పెంచాలని నిర్ణయించాయి. ఇందులో ముఖ్యంగా గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లు (GPUs), డేటా సెంటర్లలో ఉపయోగించే ఇతర సాంకేతిక పరికరాలు ఉన్నాయి. అదేవిధంగా, సంయుక్త సాంకేతిక సహకారాన్ని కూడా విస్తరించనున్నట్లు పేర్కొన్నారు.

4.            భారతదేశం అమెరికా వ్యవసాయ ఉత్పాదనలపై టారీఫ్ ల రూపంలోనూ, నాన్-టారీఫ్ పద్ధతులలోనూ (ఉదాహరణకు జన్యు మార్పిడి పంటలపై, వాటి ఉత్పాదనలపై ఉన్న నిషేధం) విధించిన ఆంక్షలను తొలగించడానికి ఒప్పుకుంది.

1.            భారతదేశం తన వ్యవసాయ రంగాన్ని కూడా అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా పూర్తిగా తెరవాలనీ, అమెరికా వ్యవసాయ ఉత్పాదనలపై టారీఫ్ ల రూపంలోనూ, నాన్-టారీఫ్ పద్ధతులలోనూ విధించిన ఆంక్షలనన్నింటినీ తొలగించాలని ట్రంప్ హుకుం జారీ చేసాడు. అలా చేయనంతకాలం భారత ఉత్పాదనలన్నింటిపై 25 శాతం పన్ను , రష్యా నుండి చమురును దిగుమతి చేసుకున్నంతకాలం మరో 25 శాతం జరిమానా కలిపి 50 శాతం పన్ను విధించాడు.

ఇరాన్ నుండి చమురును దిగుమతి చేసుకోవడంపై అమెరికా విధించిన ఆంక్షల కారణంగా భారతదేశం గత కొన్ని ఏళ్లుగా రష్యా నుండి చౌకగా చమురును దిగుమతి చేసుకుంటూ వస్తున్నది. ఆ చౌక చమురును పబ్లిక్ రంగ కంపెనీలే కాక రిలయన్స్ కంపెనీ;నయారా ఎనర్జీ (ఇది రష్యన్ రాస్ నెఫ్ట్ కంపెనీ, కేసాని ఎంటర్ప్రైజెస్ కంపెనీ లిమిటెడ్ ల అనుబంధ కంపెనీ)దిగుమతి చేసుకొని యూరోప్ దేశాలకు, అమెరికాకు కూడా అమ్మి అంతులేని లాభాలు సంపాదించాయి. ఏ అమెరికా ఐతే రష్యన్ కొనుగోళ్లపై ఆంక్షలు విధించిందో అదే అమెరికా భారతదేశం గుండా రిలయన్స్, నయారా మార్గంలో శుద్ధి చేసిన చమురును కొనుగోలు చేయడం ఈ దివాలాకోరు విధానానికి, ఆత్మవంచనకు ఒక తార్కాణం.

ఇప్పుడు అమెరికా వెనిజువెలా పై దాడి చేసి ఆ దేశపు చమురును దొంగిలించి ఆ చమురును తమ కంపెనీల నుండి భారత ప్రభుత్వం కొనుగోలు చేసేటందుకు రష్యా నుండి చమురు దిగుమతిని ఆపేయాలని మోదీకి అల్టిమేటం ఇచ్చాడు. మా ప్రయోజనాలకు భంగకరమైనది మేము చేయము అని బీరాలు పలికిన మోదీ తోకముడిచి ట్రంప్ ఆదేశాలకు తల ఒగ్గాడు.

దానితో జరిమానాగా విధించిన 25 శాతాన్ని తీసివేశాడు. కానీ రష్యా నుండి చమురు దిగుమతిపై ఒక కన్నువేసి ఉంచుతామనీ, దిగుమతి చేసుకుంటే మళ్ళీ 25 శాతం పన్ను విధిస్తామన్న ట్రంప్ బెదిరింపులు మాత్రం యధావిధిగా కొనసాగుతున్నాయి. ఈ చమురు దిగుమతిపై అమెరికా కన్ను వేసి ఉంచడానికి భారతదేశం ఒప్పుకోవడం అంటే భారత సార్వభౌమత్వానికే సిగ్గుచేటు కలిగించే చర్య.

పన్నును 25 శాతం నుండి 18 శాతానికి తగ్గించాడు. కానీ పన్నులను 50 శాతానికి పెంచక ముందు 2024 లో చాలా భారతదేశ వస్తువులపై ఉన్న పన్ను రేటు 2 నుండి 10 శాతం. సగటున 3-4 శాతం ఉండేది. అంటే ఇప్పటికీ ట్రంప్ విధించిన పన్ను పోటు 2024 కంటే ఐదారు రెట్లు ఎక్కువే.

2.            ఈ నామమాత్రపు తగ్గింపుకు బదులుగా భారత ప్రభుత్వం అమెరికా నుంచి దిగుమతి అయ్యే ఎన్నో ఆహార, వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలను రద్దు చేయడానికి లేదా తగ్గించడానికి అంగీకరించింది. వీటిలో పశువుల మేతగా ఉపయోగించేడిస్టిలర్స్ డ్రైడ్ గ్రేన్స్ విత్ సోల్యూబుల్స్ (డి‌డి‌జి‌ఎస్) (ఎథనాల్ తయారీ సమయంలో మొక్కజొన్న లేదా ఇతర ధాన్యాల నుంచి ఉత్పత్తి అయ్యే ఉప ఉత్పత్తి-దీనిని పశువుల మేతగా,కోళ్ల ఫీడ్‌లో,కొన్ని సందర్భాల్లో పంది పెంపకంలో కూడాఉపయోగిస్తారు),ఎర్ర జొన్నలు,బాదం, అక్రోట్ ల వంటి నట్ లు, తాజా పండ్లు,ప్రాసెస్ చేసిన పండ్లు, సోయాబీన్ నూనె, వైన్, స్పిరిట్స్తదితర ఉత్పత్తులు ఉన్నాయి. దీనికి అదనంగా మరికొన్ని ఇతర ఉత్పత్తులపై కూడా సుంకాలను తగ్గిస్తారు, లేదా రద్దు చేస్తారు.అవి ఏమిటనేది తుది ఒప్పందంలో నిర్ణయిస్తారు.

3.            ఈ ఒప్పందం వల్ల మొక్కజొన్న, జొన్న, సోయాబీన్, పశువుల మేతగా ఉపయోగించే ఇతర పంటల ధరలపై ప్రతికూల ప్రభావం ఉండవచ్చు. ముఖ్యంగా సోయాబీన్ ఆయిల్ దిగుమతులపై సుంకాలు తగ్గించడం వల్ల దేశీయ సోయాబీన్ ధరలు మరింత పడిపోవచ్చు.గత ఏడాది నుంచి సోయాబీన్ రైతులు — ముఖ్యంగా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, రాజస్థాన్ రాష్ట్రాల్లో — దీర్ఘకాలిక ధర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు.“2025 అక్టోబర్‌లో దేశవ్యాప్తంగా సోయాబీన్  సగటు మార్కెట్ ధర రూ. 3,942. ఇది కనీస మద్దతు ధర రూ. 5,328తో పోలిస్తే దాదాపు 26 శాతం తక్కువ. అలాగే 2025 అక్టోబర్, నవంబర్ నెలల్లో మొక్కజొన్న సగటు ధర రూ. 1,821తో పోలిస్తే, అది కనీస మద్ధతు ధరరూ. 2,400 కంటే సుమారు 24 శాతం తక్కువ.సోయాబీన్ కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం హామీలు ఇచ్చినప్పటికీ, వాస్తవ కొనుగోలు చాలా తక్కువగా. దీనివల్ల రైతులు భారీగా నష్టపోయారు. ఇండియా–అమెరికా వాణిజ్య ఒప్పందం ఈ పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తుంది.

4.            అమెరికా నుండి దిగుమతి అయ్యే డి‌డి‌జి‌ఎస్ (అమెరికాలో డి‌డి‌జి‌ఎస్ను జన్యుమార్పిడి చేసిన (జి‌ఎం) మొక్కజొన్నతో తయారు చేస్తారు) ద్వారా జీఎం ఉత్పత్తులు పరోక్షంగా దేశంలోకి ప్రవేశిస్తాయి. దీనిపై వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ, పర్యావరణ మంత్రిత్వ శాఖ వద్ద ఇప్పటికే స్థిరమైన నియంత్రణ ప్రక్రియ ఉందని చెప్పారు. జీఎం ఉత్పత్తిని ఒకసారి ప్రాసెస్ చేసిన తర్వాత దాని ప్రభావాలు ఇక మిగలవని ఆయన వాదించారు.అయితే, భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏ‌ఐ) తమ దిగుమతుల మార్గదర్శకాల ప్రకారం, నిర్ధారిత 24 పంటలకు సంబంధించిన ఏ ఆహార ఉత్పత్తిని అయినా దిగుమతి చేసుకునేటప్పుడు అది జీఎం  మూలం నుండి రాలేదని, అలాగే జీఎం-రహితమని ధృవీకరించే సర్టిఫికేట్ తప్పనిసరిగా జత చేయాలి.కానీ ఇప్పుడు ప్రభుత్వమే తన నిబంధనలనే ఉల్లంఘించడానికి సిద్ధపడ్డది. ఈ నిబంధనను ఎత్తివేయాలని అమెరికా ఎప్పటి నుండో డిమాండ్ చేస్తూ వస్తున్నది. ఇప్పుడు ప్రభుత్వం అందుకు కూడా తల ఒగ్గింది.

5.            నట్స్ దిగుమతిపై సుంకాలు ఎత్తివేసినందున కాశ్మీర్‌,హిమాచల్ ప్రదేశ్ లో ఆపిల్ రైతులు, డ్రై ఫ్రూట్ ఉత్పత్తిదారుల నుండి దేశవ్యాప్తంగా పండ్లు, గింజలు పండించే రైతుల వరకు అందరూ దెబ్బతింటారు.విలువ ఆధారంగా చూస్తే, ఇది భారత వ్యవసాయ రంగంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన విభాగం  అయినప్పటికీ, ఈ వర్గం ప్రయోజనాలను భారత ప్రభుత్వం గాలికి వదిలేసింది.

6.            అమెరికా వ్యవసాయ కార్యదర్శి రోలిన్స్ మాట్లాడుతూ, ప్రపంచంలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ అయిన భారత మార్కెట్ అమెరికాఉత్పత్తుల కోసం తెరిస్తే గ్రామీణ అమెరికాకు ఆదాయం పెరుగుతుందని పేర్కొన్నాడు. మోదీ ప్రభుత్వం అమెరికాలో భారీ సబ్సిడీలతో ఉత్పత్తి అయ్యే వ్యవసాయ,పాల ఉత్పత్తులను భారత మార్కెట్‌పై బలవంతంగా మోపుతోంది. భారత వ్యవసాయం ఇప్పటికే ప్రతికూల ప్రభుత్వ సబ్సిడీ పరిస్థితిని ఎదుర్కొంటోంది. 17.2 కోట్ల గ్రామీణ కుటుంబాలు, అందులో 86% చిన్న మరియు సన్నకారు రైతులు, భారత ప్రభుత్వమే ప్రోత్సహిస్తున్న సామ్రాజ్యవాద దాడి కారణంగా తమ జీవనోపాధిపై తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటున్నారు.

దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించే ఇటువంటి అవమానకరమైన ఒప్పందానికి మోదీ ప్రభుత్వం ఎందుకు ఒప్పుకున్నట్టుఅనే ప్రశ్న కూడా ఉదయిస్తుంది. ఇదేమీ కొత్త కాదు. దశాబ్దాలుగా భారత దళారీ బ్యూరాక్రటిక్ పెట్టుబడిదారీ వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న భారత ప్రభుత్వం సామ్రాజ్యవాదుల, ముఖ్యంగా అమెరికా సామ్రాజ్యవాదుల ఆజ్ఞలను శిరసా వహిస్తూ వస్తున్నది. అయినా భారత ప్రయోజనాలను, ముఖ్యంగా రైతుల, చిన్న, మధ్య తరహా పెట్టుబడిదారుల ప్రయోజనాలను దెబ్బతీసేవిధంగా భారత మార్కెట్ ను, ముఖ్యంగా వ్యవసాయ మార్కెట్ ను మరింతగా ఏమాత్రం ఆంక్షలు లేకుండా తెరిపించడం కోసం ప్రభుత్వ మెడలు వంచడానికి అమెరికా మరిన్ని బ్లాక్ మెయిల్ పద్దతులకు పూనుకున్నది. అదానీ పై తన కంపెనీల ప్రయోజనాల కోసం, ముఖ్యంగా సౌరశక్తికి సంబంధించిన కంపెనీలకు లాభాలు చేకూర్చడం కోసం లంచాలు ఇచ్చాడని, అమెరికా పెట్టుబడిదారులకు అసంపూర్తి సమాచారం అందించాడనే ఆరోపణలపై విచారణ నడుస్తున్నది. మోదీకి అదానీకి ఉన్న సంబంధం జగద్వితమే. దీనిని ఉపయోగించుకొని మోదీ పై ఒత్తిడి తెచ్చి ఉండవచ్చు. అంతేకాక ఎప్ స్టీన్ ఫైల్స్ లో మోదీ పేరు కూడాఉందనే ఆరోపణలు వచ్చాయి. వీటికి ఇప్పటి ఒప్పందానికి ఏమైనా సంబంధం ఉందా మనకు తెలియదు కానీ ఏదేమైనా భారత పెట్టుబడిదారీ వర్గపు దళారీ స్వభావం మాత్రం మళ్ళీ ఒక సారి బహిర్గతమైంది. మోదీకి భారత రైతాంగపు ప్రయోజనాల కన్నా తన సన్నిహిత దళారీ పెట్టుబడిదారుల ప్రయోజనాలు, వారి వెనుక ఉండే సామ్రాజ్యవాదుల ప్రయోజనాలే ముఖ్యమని మరోసారి నిరూపితమైంది.

అమెరికా ఒత్తిడికి తల ఒగ్గి మొదట చిరకాల మిత్రదేశం అయిన ఇరాన్ తో, ఇప్పుడు రష్యాతో ఉన్న వాణిజ్య సంబంధాలను, ప్రయోజనాలను వదిలేసుకుంది. అందుకే ఈ ఒప్పందం వాణిజ్య ఒప్పందం మాత్రమే కాదు; ఇది ప్రపంచ సామ్రాజ్యవాద పునర్వ్యవస్థీకరణలో భారత దళారీ పెట్టుబడిదారులు తీసుకున్న ఒక రాజకీయ–ఆర్థిక వైఖరి.

Leave a Reply