ఇరాన్ అణ్వాయుధాలను,క్షిపణులను తయారు చేస్తుందని,అందుకు ఉపయోగపడే మూల పదార్థాలను నిల్వ చేస్తుందని దుష్ప్రచారం చేస్తూ,దాడులు చేస్తామని బెదిరిస్తూ,తన దేశ స్వయం రక్షణ వ్యవస్థను అమెరికా ఆదేశాలకు లోబడి ఉంచాలని దశాబ్దాలుగా వత్తిడి చేస్తుంది.ఇరాన్ తను అణ్వాయుధాలను తయారు చేయడం లేదని తన వద్ద ఉన్న యురేనియం నిల్వలను శాంతియుత ప్రయోజనాలకు ఉపయోగిస్తామని చెప్పినా ఇరాన్ వాదనలను పట్టించుకోకుండా ఇంతకు ముందు ఒకసారి దాడులు చేసింది.మళ్ళీ మరొకమారు ఇదే వాదనను తెరపైకి తెచ్చి ఈ సాకుతో దాడి చేస్తామని బెదిరిస్తూ ఇందన వనరులను,ఖనిజ సంపదను, మార్కెట్ ను అప్పజెప్పాలని ట్రంప్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇరాన్ పై వత్తిడి తెస్తున్నారు.ఇందుకోసం గత కొన్ని రోజులుగా ఓమన్ మధ్యవర్తిత్వంలో జెనీవాలో ఇరు దేశాల ప్రతినిధులు మూడు దఫాలుగా చర్చలు జరిపారు.అమెరికా షరతులకు అంగీకరించకపోవడంతో ఖోమైనీ ప్రభుత్వాన్ని కూలదోసి తమకు అనుకూలమైన తొత్తు ప్రభుత్వాన్ని గద్దె నెక్కించే ఎత్తుగడలతో అమెరికా – ఇజ్రాయెల్ కలిసి ఫిబ్రవరి 28 న (శనివారం) ఉదయం టెహ్రాన్ లోని ఖోమైనీ ప్రభుత్వ ప్రధాన కార్యాలయం పై ముప్పైకి పైగా క్షిపణులతో దాడులు చేసి ఇరాన్ సుఫ్రీం లీడర్ ఖోమైనీని హత్య చేసింది.ఆయనతో పాటు ఇరాన్ రక్షణ మంత్రి అమీర్ నసీర్ జాదే, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్ జిసి) కమాండర్ మహమ్మద్ పాక్ పౌర్,ఖమేనీ ప్రధాన సలహాదారు అలీ షంఖనీ,ఖమేనీ కుమార్తె,అల్లుడు, కోడలు, మనవడు, ఇంకా అనేక మిలటరీ అధికారులను హత్య చేశారు.ఒక పాఠశాల పై జరిగిన క్షిపణి దాడిలో 165 మంది విద్యార్థులు మరణించారు.అనేక వందల మంది హత్యకు గురయ్యారు.వేల మంది క్షతగాత్రులు అయ్యారు.
అంతర్జాతీయ న్యాయసూత్రాలను ఉల్లంఘించి పరాన్నభుక్కులు, దురాక్రమణదారులైన అమెరికన్ సామ్రాజ్యవాదులు చేస్తున్న ఈ యుద్ధోన్మాధ దాడిని శాంతికాముకులైన ప్రజలందరూ ఖండించాలి.తక్షణమే దాడులను ఆపివేయాలని డిమాండ్ చేయాలి.సార్వభౌమాధికారం గల ఇరాన్ తమ దేశాన్ని రక్షించుకోవడానికి అన్ని రకాల ఆయుధాలను సమకూర్చుకోవానికి, ప్రయోగించడానికి హక్కు కలిగి ఉంటుందని సామ్రాజ్యవాదులు గుర్తించాలని డిమాండ్ చేయాలి.
అమెరికన్ , ఇజ్రాయెల్ యుద్ధోన్మాదులు శాంతియుత, దౌత్య పద్ధతుల ద్వారా పరిష్కరించుకోవాల్సిన సమస్యను యుద్ధంలోకి నెట్టారు.ఇరాన్ ప్రతీకార చర్యలకు దిగి చుట్టుపక్కల దేశాలలోని అమెరికా మిలిటరీ స్థావరాలపై దాడులకు పాల్పడుతుండటంతో పశ్చిమ ఆసియా ప్రాంతం యుద్ధ రంగంగా మారి పోయింది.ఇంతకు ముందు అమెరికా – ఇరాన్ మధ్య 2015 లో రూపొందిన ఒప్పందాన్ని 2018 లో ఇదే ట్రంఫ్ మొదటిసారి నిర్వీర్యం చేశాడు.2025 లో రెండవసారి ఇరాన్ తో చర్చలు జరుపుతూనే ఇదే ట్రంఫ్ ఇజ్రాయెల్ ను ఉసిగొల్పి 12 రోజుల పాటు ఇరాన్ పై యుద్ధోన్మాధ దాడులు చేయించాడు.అధికారంలోకి వచ్చిన తరువాత అంతంలేని అమెరికా యుద్ధాలకు ముగింపు పలుకుతానని ప్రగల్భాలు పలికిన ట్రంప్ ప్రపంచ వ్యాప్తంగా ఏడు దేశాల పై బాంబులు వేశాడు.అనేక దేశాలలో యుద్ధాలను రాజేసే దుశ్చర్యలకు పాల్పడుతున్నాడు
వివిధ రంగాల్లో పీకల్లోతు సంక్షోభంలో కూరుకుపోయిన అంతర్జాతీయ పెట్టుబడిదారీ సామ్రాజ్యవాదానికి ప్రతినిధి అయిన అమెరికా ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయింది.ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్,లిబియా,
సిరియా మొదలగు దేశాలపై సాగించిన యుద్ధాలలో ట్రిలియన్ డాలర్ల సంపదను,వేలాది సైనికులను కోల్పోవడమే గాక ఘోరంగా ఓటమిపాలైంది.ప్రపంచీకరణ-ప్రైవేటీకరణ-సరళీకరణ పధకాలు ఘోరంగా విఫలం కావడంతో వీరి కష్టాలు ఎన్నో రెట్లు పెరిగాయి.ముప్పై ట్రిలియన్ డాలర్ల రుణ గ్రస్త దేశంగా దిగజారి,వడ్డీలు కూడా చెల్లించలేకపోతుంది.పరిశ్రమల మూసివేతను, నిరుద్యోగితను,ద్రవ్యోల్బణాన్ని,బహుళ ధ్రువ ప్రపంచానికై తోటి సామ్రాజ్యవాద రష్యా,చైనాల నుండి తీవ్ర పోటీని ఎదుర్కోంటుంది.సామ్రాజ్యవాద దేశాల మధ్య అసమాన ఆర్థిక, రాజకీయ, అభివృద్ధి తీవ్రం కావడంతో అనివార్యంగా వాటి మధ్య పారిశ్రామిక ఉత్పత్తి, పెట్టుబడి ఎగుమతి, సరుకుల ఎగుమతి,మార్గాల కోసం ఘర్షణలు తీవ్రమైయ్యాయి.వివిధ దేశాలలోని పాకృతిక వనరుల లూటీ,ప్రజల పై దోపిడీ మరింత తీవ్రమైంది.పశ్చిమాసియా ప్రాంతంలోని ఇంధన వనరులు, ఖనిజ సంపద, శ్రమశక్తి, రవాణా మార్గాల పై అమెరికా సామ్రాజ్యవాదులు గుత్తాధిపత్యాన్ని కోరుకుంటున్నారు.ఈ పరిణామాలే ఇరాన్ పై యుద్ధోన్మాధ దాడికి మూల కారణంగా ఉంది.అనేక దేశాలపై దాడులకు దిగేలా చేస్తుంది.ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో యుద్ధాలను రెచ్చగొట్టి,యుద్ధాలు చేయుంచడం, ఆయుధ వ్యాపారం చేసి లాభాలు గడించడం సామ్రాజ్యవాదుల ఆయుధ ఆర్ధిక విధానంలో భాగంగా జరుగుతుంది.గాజా పై దాడులను తీవ్రతరం చేసి ఉక్రెయిన్ – రష్యా యుద్ధంలో ఉక్రెయిన్ కు ఆయుధాలు అమ్మి సొమ్ము చేసుకుంటూనే ఉక్రెయిన్ ఖనిజ సంపదను కొల్లగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. చైనాకు వ్యతిరేకంగా తైవాన్ కు ఆయుధాలు అందజేస్తూ యుద్ధాన్ని రాజేసే ప్రయత్నం చేస్తున్నారు.
సామ్రాజ్యవాద అమెరికా తలపెట్టిన ఈ ఆధిపత్య అన్యాయ యుద్ధంలో తమ భాగస్వామ్య యూరప్ పెట్టుబడిదారీ సామ్రాజ్యవాదులు, ఇజ్రాయెల్ యుద్ధ నేరస్థుడు జియోనిస్టు నెతన్యాహుతో కలిసి భారత దేశంలోని బ్రాహ్మణీయ హిందూత్వ ఫాసిస్టు పాలకుల మద్ధతుతో సాగిస్తున్న ఈ మారణహోమం తక్షణమే ఇరాన్ ను,పశ్చిమాసియాను, దీర్ఘకాలంలో ప్రపంచాన్ని సంక్షోభంలోకి దిగజార్చనుంది.ఈ ప్రాంతంలో విలసిల్లిన అత్యంత ప్రాచీన నాగరికత,సంస్కృతి, అసంఖ్యాక ప్రజలు ఈ యుద్ధోన్మాధంలో బలయ్యే ప్రమాదం పొంచి ఉంది.అన్ని దేశాల ప్రజల సమస్యలు మరింత తీవ్రతరం కానున్నాయి.అందువల్ల సామ్రాజ్యవాదుల దాడుల నుండి రక్షణ కోసం తక్షణమే యుద్ధాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ పోరాడడం ప్రపంచ పీడిత ప్రజల బాధ్యత.
ఆనంద్.
తేదీ. 2-3-2026.




