యూత్ అసోషియేషన్ సభ్యులంతా జమయ్యిన్రు. బస్తీలో చెయ్యాల్సిన కార్యక్రమాన్ని గురించి చర్చోపచర్చలు చేసి తీర్మానం కూడా చేసిన్రు.

“ఒరేయ్… మీరంతా గుండు చేపించుకుంటారా?” అడిగిండు వో దోస్తు.

“మనమేం మాట్లాడినాం? వీడేమంటున్నాడ్రా?” యెవరికీ యేమీ అర్థంకాలే. మెంటలోన్ని చూసినట్టు చూసిన్రు.

“సరే, నేను పైసలిస్తాను, మీరంతా గుండు చేపించుకుంటారా?” దోస్తుగాడు అన్నమాట మీదే వున్నడు.

“ఒరే హవ్లే, యింట్లో యెవరు పోయిన్రని… గుండు చేపించుకుంటారు?” ఆ దోస్తుని తిరిగి అంతా అడిగిన్రు.

“మీ తాత పోయిండు. మీ జేజమ్మ పోయింది. ఊ… మీ చిన్నాయిన పోయిండు. ఆ… మీ పెద్దమ్మ కూడా పోయింది. ఒరే, మీ బావ కరోనా టైంల పోయిండు…” వొక్కొక్కన్నీ చూస్తూ దోస్తుగాని మాటలు పూర్తి కాలేదు.

“అప్పుడెప్పుడో సస్తే, యిప్పుడేందిరా దరువు?” పిచ్చెక్కినట్టు చూసిన్రు అంతా.

“మీ అందరికీ నేను పే చేస్తాను, ఓకేనారా?” మళ్ళీ దోస్తుగానిది అదేమాట.

“నీకు యేమైనా మెంటలెక్కిందాబే?” అందరూ వొక్క తీరుగ చూసిన్రు.

“మీకు మెంటలెక్కితే నాకూ మెంటలెక్కినట్టే…” నవ్విండు దోస్తు.

మిగతా దోస్తులంతా ముఖాముఖాలు చూసుకున్నరు. “యెన్నడో సస్తే, యిప్పుడు గుండు సేసుకొనుడు… యేమీ సమజైతలేదు” తలడ్డంగా వూపిండు వొకడు.

“ఔమల్ల… రావణుడు యెన్నడో చస్తే, యిప్పుడు మల్ల తగలబెట్టుడు మానేసినామా?” దోస్తుగాని మాటకు అందరూ నివ్వెరపోయి చూసిన్రు.

“రావణ దహనం చేస్తున్నాం కదరా?”

దోస్తుగాని మాట అందరికీ అర్థమయినట్టే వుంది. అందరూ మూగోళ్ళ లెక్క వుండిపోయిన్రు.

“యేందిరా, సప్పుడు చేస్త లేరు? మీ వాళ్ళు పోతే నేను పైసలిచ్చుడు యేందనా?” ఆ మాటకు అంతా కన్నార్పకుండా చూసిన్రు.

“మన పండగలకి మార్వాడీలు పైసలిస్తే చేసుకోవడం లేదారా?” దోస్తిగాని మాట గుచ్చినట్టుగుంది. అంతా చురచురా చూసిన్రు.

“హవ్లే… పైసలివ్వనీకి నువ్వెవడివిబే- అని మార్వాడీని అడిగిన్రా… లే, నే పైసలిస్తే అడుగుతున్రు…” దోస్తుగాడు అందర్నీ చూసి మరీ నిలదీసిండు.

హుషారుపోయి అంతా మన్నుతిన్న పాము లెక్కయిన్ర్రు.

“పైసలు యివ్వాలే గాని, మన యెంట్రుకలు మనమే గొరుక్కుంటం. గుండు గీసుకుంటం. మనోల్లని మనమే కాలబెడతాం. ఎన్నడో సచ్చినోనికి మల్ల మల్ల దహనం చేస్తాం. మనోడు అని చూడకుండా దహనం చేస్తాం…”దోస్తుగాని మాటల సెగకి ముఖాలు కాలిన కుండల్లెక్కయినాయి.

“ఏదైనా చేసుకుందాం. తప్పులేదు. మన పైసలతో మనం చేసుకుందాం. మార్వాడీవోని దగ్గర తీసుకొని మల్ల ‘మార్వాడీ గో బ్యాక్’ అంటే అంత మంచిగుండదు…”

దోస్తుగాని మాటే ఆఖరిదైంది.

ఆ బస్తీలో రావణ దహనంకంటే ముందల యేవో దహనమయినాయని ఆ పోరగాళ్ళ ముఖాలు చూస్తే తెలుస్తుంది!

Leave a Reply