మకాం ఖాళీ చేసి వెళ్తున్నపుడు ముందు టీములో బి.జి.ఎల్స్ తక్కువున్నాయని ఆ టీములోకి కా. సునీతను పంపించాడు కా. సురేష్ దాదా. కొంచెం ముందుకెళ్ళాక గుట్కా వాసన వచ్చింది. అది డిప్యూటీ కమాండర్ అర్జున్ కు చెప్పిన వెంటనే పోలీసులు కనిపించారు.

‘ష్…ష్…’కమాండర్ కా. నందు.

‘మాట్లాడకండి’ హెడ్ క్వార్టర్ ఎ సెక్షన్ నుండి జమిలి. వెనుక వస్తొన్న వారితో.

రెండడుగులు ముందుకేయగానే కవర్ లోకి దూకారు కా. నందు, పూలోలు. ట్రిగ్గర్ నొక్కాడు నందు. ‘ఢాం…’ అంటూ పేలింది. ఒకడు పడ్డాడు. షెల్ వేసింది పూలో. దద్దరిల్లింది. వెనక్కి ఉరికారు పోలీసులు.

నందు, అర్జన్, పూలో, జుగిని, జనీలా, అంజు ప్రతిఘటిస్తున్నారు. ప్రతిఘటిస్తూనే బలగాలను రిట్రీట్ చేయించాడు నందు. అక్కడి నుంచి ఇవతలికి ఐదు నిమిషాలు రిట్రీట్ అయ్యారు దిశ మార్చి. అంజు పైలట్ గా నడుస్తోంది. అలర్టుగా ఇన్ సాస్ తుపాకీ పట్టుకొని. అడుగు తీసి అడుగు వేస్తోంది మెల్లగా. ఇంకొంచెం ముందుకెళ్ళగానే రెండవసారి ఫైరింగు. ఈసారి వాడి నుండి మొదలైంది. చెట్టు చాటునున్నోడు అంజును గురి చూసి కొట్టాడు. అంజు కుడి మోచేతికి పడింది. ఎముక విరిగింది. చేతిలో ఉన్న తుపాకీ అల్లంత దూరంలో ఎగిరి పడింది. ఒక్క గెంతుతో దీపక్ వచ్చి దాన్నందుకొన్నాడు. వెనుకనున్న కామ్రేడ్స్ ప్రతిఘటిస్తున్నారు కవర్స్ తీసుకొని. అంజుకి గాయమైన వెంటనే అంజు ప్లేసులో కా. సుందర్ చేరాడు.

కవర్స్ తీసుకొని కామ్రేడ్స్ ప్రతిఘటించారు. సెక్షన్ తర్వాత సెక్షన్ రిట్రీట్ అవుతోంది. ‘ఎ’ సెక్షన్ కమాండర్ కా. అర్జున్ ‘రెండుసార్లు బతికించింది’ నవ్వుతూ జాకెట్ ను చూపిస్తూ.

‘ఫైరింగులో కూడా నవ్వుతున్నాడే అర్జున్’ నవ్వుతూ రిట్రీట్ అవుతున్న అర్జున్ ను చూసిన మాలతి మనసులో.

రక్తం కారుతున్న అంజు దగ్గరకు ఉరికొచ్చింది రీత. నరం తెగటంతో పైపులోని నీళ్ళలా చిమ్ముతోంది రక్తం. గబ, గబా జేబులో నుండి రుమాలు తీసింది. అంజుచేయికి గట్టిగా కట్టింది. రక్తం పొంగడం కొద్దిగా తగ్గింది. పక్కనే కవర్ లో నున్న రైనును పిలిచింది. రుమాలు అడిగింది. జేబులో నుండి రుమాలు తీసిచ్చాడు రైను. గాయం పైన కట్టింది. రెండు రుమాలు కట్టేటప్పటికి కొంచెం, కొంచెం కారుతోంది రక్తం.

వెనుకనున్న నీతి ఉరికి అంజు దగ్గరకు వచ్చింది. ‘గాయమైందని కుంగిపోవద్దు, ధైర్యంగా ఉండాలి’ అని చెప్పింది మోచేతిని చూస్తూ.

‘పదా!’ అంటూ తుపాకీ అందుకొంది రీత.

వేగంగా అడుగులు వేస్తున్నారందరు. ఐదు నిమిషాలు కూడా కాకముందే ఎక్కడి వారు అక్కడే ఆగిపోయారు. దొరికిన దాన్ని కవర్ తీసుకొని..

‘ఏంటి?’ అని వెనుకనున్న కామ్రేడ్స్ ముందున్న కామ్రేడ్స్ కు సైగ చేశారు.

‘పోలీసులు’ సైగతో ముందున్న వారు.

‘ఎల్’ ఆకారంలో కవర్లు తీసుకొన్న పోలీసులు. కమాండర్ నందుకి వాడి వలయం నుండి బయట పడడం సాధ్యం కాదనిపించింది. పైగా నాయకత్వం ఉంది. అందుకే నిలబడే గండి కొట్టే టీము (బ్రేకింగు ఫోర్సు) పేర్లు టక, టకా చెప్పేస్తున్నాడు. అర్జున్, జుగిని, బసంతి, సోమే, బుధురామ్, రోహన్, సోను, జనీలా, సీమ, దీపక్, పూలో, సునీత, మనోజ్, పూల్ మతి.

‘నేను కూడా….’అన్నట్టు నిలబడింది రీత. యుద్ధంలో పాల్గొనాలనే ఉత్సాహంతో.

‘రీతా…’అని నందు నోటి నుండి రాగానే ఎక్కడాలేని సంతోషమేసింది రీతకు. ఒక్క అంగలో ముందుకు దూకింది.

‘రెండు తుపాకులున్నాయ్, ఇన్ సాస్ ఇటివ్వు, సురక పట్టుకో’ అని ఇన్ సాస్ ను సుందర్ కిచ్చాడు నందు.

‘అడ్వాన్స్…’నందు కాషన్.

గండి కొట్టే టీము ముందుకడుగులు వేసింది. అడుగులు కాదు, పరుగెత్తింది. అప్పటి వరకు హెడ్ క్వార్టర్ లో ఉన్న బసంతి ‘నేను కూడా….’ అంటూ గండి కొట్టే టీములో కలిసిపోయింది. మిగతా కామ్రేడ్స్ వెనుక పరుగెత్తుకొంటూ. తుపాకులు అలర్టులో పట్టుకొని. కొట్టటానికి రడీగా. బి.జి.ఎల్ గ్రూఫు మొదటిగా.

రీత మూడు సురకలు వేసింది. కా. అర్జున్ కవర్ లోకి వెళ్లి ఒకటి వేసింది. దడ, దడ సౌండ్ వచ్చింది. ఆ వెంటనే సునీత, జనీలా, పూల్ మతి, మూరే, కములు, అనిల్ లు మూడేసి షెల్స్ వేశారు. ఐతే రెండు షెల్స్ వేసింది. పేలలేదు. తర్వాత కా.మూరే వేసింది. వాటి దెబ్బకు కవర్ లో ఉన్న పోలీసోడు పరుగెత్తుకొంటూ వెనక్కి వెళ్ళాడు. అర్జున్ కొంచెం ముందుకెళ్ళి కవర్ తీసుకొన్నాడు. జనీలా దగ్గరకెళ్ళింది రీత.

అర్జున్, నందు, జుగిని, సోమే, సోను, బుధరామ్ ముందుకెళ్ళి ఎస్.ఎల్.ఆర్.లను సెమి, ఆటోలో పెట్టి కొడుతున్నారు.

అపుడే నందు కాషన్….’రండి’ అంటూ.

నందు కేక విని కవర్ లలో ఉన్న కామ్రేడ్స్ ఒక ఫర్లాంగు ఇవతలికి వచ్చారు.పోలీసులువిపరీతంగా ఫైరింగు, షెల్లింగు చేస్తున్నారు. వర్షంలా టప, టప. కామ్రేడ్స్ ఏమాత్రం తగ్గటంలేదు. వర్గకసితో ట్రిగ్గర్ ని నొక్కుతున్నారు. సునీతకు వాడు కనిపించటం లేదు. అర్జున్ కవర్ దగ్గరకు వెళ్తుండగా….

‘ఇటు రాకు’ అర్జున్.

పూల్ మతి ఉన్న కవర్ లోకెళ్ళింది సునీత. బి.జి. ఎల్. వేసింది. రెండవది నింపి గురి పెట్టి చూస్తుండగా వాడు యు.జి.బి.ఎల్. వదిలాడు. అది తిన్నగా సునీత చేతికి పడింది. చెవులు వినిపించలేదు. ఏ శబ్దాలు కూడా వినపడడం లేదు. ముందు పోలీసులు, వెనుక కామ్రేడ్స్. కాషన్స్ ఇస్తున్నారు. కానీ ఏంటో అర్థం కావడంలేదు. అటు, ఇటు చూస్తూ ఇవతలికనొచ్చింది. కా. నీతి కలిసింది. నీతి ఏదో చెపుతోంది. కానీ సునీతకు వినిపించటం లేదు. ‘ఉన్న కవర్ ను వదిలి ఇక్కడ కూర్చో’ అని సైగ చేసింది నీతి. ముందున్న కవర్ లోకెళ్ళింది నీతి. అంజు తలకు, నడుముకు ఎడమ భాగంలో తూటా పడింది.

రెండవసారి నందు కాషన్….’రండ’ని.

ముందుకెళ్ళి కవర్ తీసుకొంది రామశిల. దగ్గరున్న సింగిల్ షాట్ తో ఫైర్ చేసింది. ఫైర్ కాలేదు. అర్జున్ ఇంకొంచెం ముందుకెళ్ళి కవర్ తీసుకొన్నాడు. ఎస్.ఎల్.ఆర్.తో గురి చూస్తుండగా అర్జున్ కు పడింది.

‘నా తుపాకీ పట్టుకుపోండి’ అర్జున్ కేక.

ఎస్.ఎల్.ఆర్.ని సెమీలో పెట్టి కొడుతున్న జుగిని అర్జున్ దగ్గరకు ఉరుకుతుండగా దవడ పగిలి పోయింది. బోర్లా పడింది. తుపాకీ అవతల పడింది. పక్కనే కవర్ లో ఉన్న సుందర్ జుగిని తూటాల పోచ్ తీసి తను తగిలించుకొన్నాడు. జుగినిని తీసుకురావటానికి ప్రయత్నం చేశాడు. కానీ సాధ్యం కాలేదు. నెత్తుటి ముద్దైన జుగినిని చూస్తూ ఇవతలికి వచ్చాడు సుందర్.

షెల్స్ తో ప్రతిఘటిస్తున్న జనీలా తుపాకీ అలర్టులో పట్టుకొని అర్జున్ దగ్గరికి బెండ్ రన్ లో పరుగెత్తుతోంది. వాడు జనీలాను టార్గెట్ చేశాడు. జనీలా పడిపోయింది.

‘తుపాకీ పట్టుకోండి’ అన్నది జనీలా.

నందు మాత్రం కసితీరా కొడుతూనే ఉన్నాడు. అప్పటికే రెండు మ్యాగ్జిన్లు మార్చాడు. కళ్ళ ముందే పిట్టల్లా కామ్రేడ్స్ రాలిపోతున్నారు. ఇంకో పక్క గాయాలవుతున్నారు. అయినా ఏమాత్రం తగ్గని ధీరత్వం.

ఎందుకీ ధీరత్వం? ఎవరి కోసం?

సామ్రాజ్యవాదులు, కార్పొరేట్ కాషాయ పాలక వర్గాలు ఆదివాసీ ప్రజలకు ప్రకృతి పరంగా అందిన సంపదలపై కన్నేశారు. పేరు, ప్రఖ్యాతిగాంచిన ఆమ్ దాయి, తుల్లాడ్ ఇనుప గనులున్న కొండలతో పాటు బంగారం, వెండి, డైమండ్, ఇనుము, కంకర గనుల కోసం మరియు కిరోసిన్, పెట్రోలియం వెలికితీతకు బోద్ ఘాట్ లాంటి భారీ డ్యాముల నిర్మాణానికీ పూనుకొన్నాయి. వాటి కోసం పధ్నాలుగు చిన్న, మధ్య రకం కొండలను తవ్వి కోట్ల రూపాయల డబ్బు సొమ్ము చేసుకోవాలని కంకణం కట్టుకొన్నాయి. మొత్తంగానే కార్పొరేటీకరణ – సైనికీకరణ ఆక్టోపస్. ఈ ఆక్టోపస్ చేస్తున్నదే కగార్ యుద్ధం. ఆదివాసీ ప్రజలను అడవి నుండి తరిమికొట్టటానికి.

అడవితో ఆదివాసీ ప్రజలకు అవినాభావ సంబంధం. అడవే జీవనాధారం. స్వచ్ఛమైన గాలి, నీరు, లక్షలు ఖర్చు పెట్టిన నయం కాని రోగాలను తగ్గించిన రకరకాల మొక్కలు, వేర్లు, దుంపలు, అలసిపోయిన శరీరాలకు సేద తీర్చే ఆకాశాన్నంటే వృక్షాలు, లక్షల జంతువులకు, కోట్లాది పక్షులకు, క్రిమి, కీటకాలకు ఆవాసంగా ఉన్న అడవి. అలాంటి అడవిని నిలువునా నాశనం చేస్తుంటే ఎవరికీ చూడబుద్ధవుతోంది? మొగ్గలను పుష్పించనీయకుండా మొగ్గలోనే నలిపేస్తున్నపుడు ఆ మొగ్గ ప్రతీకారం కోసం ఎదురు చూస్తోంది. ఎర్ర మల్లై.

ఒక చెట్టు దగ్గర ముగ్గురు పోలీసులు కవర్ తీసుకొని ఉన్నారు. కా. సురేష్ దాదా చిన్న చెట్టు పట్టుకొని ఉన్నాడు. కవర్ లేకుండా.

‘అలా నిలబడ్డావ్ దాదా, పోలీసులున్నారు’ రామశిల.

‘నా తుపాకీ పట్టుకొని గురి చూసి మంచిగా కొట్టు’ రామశిలకు ఇన్ సాస్ ఇస్తూ సురేష్ దాదా.

దాదా ప్రౌన్ పొజిషన్ తీసుకొన్నాడు. గండి కొట్టే టీము ఒక్కొక్కరు అమరులవుతున్నారు. అమరుల సంఖ్య పెరుగుతోంది. గాయాలవుతున్న వారి సంఖ్య కూడా. నందు కొద్దిగా ఇవతలికి వచ్చాడు. కవర్ తీసుకొని పంజావిసిరాడు. వాడు మరొకసారి ఒక ఫర్లాంగు అవతల కవర్లో కెళ్ళాడు. గండి కొట్టే టీములో కొత్త కామ్రేడ్స్ సుందర్, ఫాతిమా, సోను, రోహన్ లు చేరారు. బి.జి.ఎల్, సురకలు ధనా ధన్ అంటూ మోగుతున్నాయి.

‘రండి’ మూడవసారి నందు కేక.

కేక పూర్తి కాకముందే నందు నడుముకు పడింది. కుడి వైపు నడుము లోపలి నుండి ఎడమ వైపుకు దూసుకు పోయిందితూటా. బెల్ట్ ని కూడా చీరేస్తూ. కింద పడుతూ నందు ‘తుపాకీ….’ అని కేకేశాడు. వెల్లకిలా పడ్డాడు. దగ్గరి కవర్ లో ఉన్న పూలో ఎగిరి నందు తుపాకీ అందుకోబోయింది. పూలోకి నుదుటి మీద పడింది. ‘టాయ్ మ’ని. ఊపిరి ఆగిపోయింది పూలోది.

నందు కింద పడిన వెంటనే జీత్రూ ఎస్.ఎల్.ఆర్.ఎల్.ఎమ్.జి. తో ఇవతలికొచ్చాడు. కవర్ తీసుకొన్నాడు. ఎల్.ఎమ్.జి.ని ఝళిపించాడు. భూమ్యాకాశాలు దద్దరిల్లే శబ్దం. ఆ శబ్దానికి వాడింకా ముందుకొచ్చాడు. కవర్ తీసుకోకుండా ఫైరింగు, ఒకేసారి మూడు షెల్స్….ఆర్టిల్లరీ ప్రయోగం. రివాల్వర్ లా. కామ్రేడ్స్ ఒకేచోట కుప్పయ్యారు. కవర్స్ లేవు. ఒక అడుగు ఎత్తున్న హరింగ మొక్కలు తప్ప. అక్కడక్కడ ఒకరికే సరిపోయే మడ్డి చెట్లు. ఆ చెట్ల దగ్గరే నలుగురైదుగురు కుప్పయ్యారు. అది కూడా లేని వాళ్ళు ప్రౌన్ పొజిషన్ తీసుకొని. ఎత్తులో కామ్రేడ్స్. కింద పోలీసులు. పోలీసులకు ఎవరు ఏ కవర్ దగ్గరున్నారో, నాయకత్వం ఎక్కడుందో స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే వాడు ఒక్కొక్క చెట్టు మీద రాపిడి ఫైరింగు, షెల్లింగు చేస్తున్నాడు.

కామ్రేడ్స్ అరుపులు. ఇటు, అటు అంటూ. అటు వెళ్తే అటూ రాపిడిలా దూసుకొచ్చే తూటాలు. ఇటు వెళ్తే ఇటు కూడా అంతే. రెండడుగులు అటు, రెండడుగులు ఇటు వేస్తూ అక్కడే తచ్చాడుతూ, పైకెక్కుతూ, కిందకు దిగుతూ…మనసు నిండా ‘ఛస్తామా? బతుకుతామా?’ అన్న ఆందోళనతో. నిండా మునిగిన ఆందోళనలో కూడా ఎవరూ వెనుకడుగు వేయలేదు. ఎవరికి వారు తమ శక్తి కొద్దీ ప్రతిఘటిస్తూ ఉన్నారు. అంతా ఒక యుద్ధ వాతావరణంలా ఉంది.

కవర్ తీసుకొన్న ఫాతిమా రైఫిల్ తో మూడు తూటాలు ఫైర్ చేసింది. ఫైర్ కాలేదు. నాలుగవసారి లోడు చేసింది. ఎయిమింగు చేస్తూ ఫైర్ చేసింది. అదీ కాలేదు. అప్పుడే వాడు కొట్టాడు. కుడి చేయి మణికట్టు దగ్గర పడింది. అది అరచేయిని రంధ్రం చేసుకొంటూ బయటికొచ్చింది. తుపాకీ అల్లంత దూరంలో పడింది. వెంటనే అందుకొంది. ఇవతలికొచ్చింది. శరత్ కు చెప్పి, చూపించింది. ‘ధైర్యంగా’ ఉండమన్నాడు. అక్కడి నుండి రెండడుగులు ముందుకు వేసింది. ఎత్తుగా ఉన్న పుట్టను కవర్ తీసుకొంది. కుడివైపున్నోడు షెల్ వేశాడు. అది కుడి పిరుదుకి పడింది. తగిలించుకొన్న తూటాల మాలలో ఉన్న ఇన్ స్ట్రుమెంట్స్ లోపలికి గుచ్చుకు పోయాయి.

ఫాతిమా కంపెనీ డాక్టరు. కాబట్టి మెడికల్ సామాను బాధ్యత తనదే. సహాయకులుగా ఉన్న లూసీ, విక్రమ్ దగ్గర కూడా ఉన్నాయి. అయితే ముఖ్యమైనవి ఫాతిమా దగ్గరే. ఆ రోజు శత్రువు వచ్చాడని సమాచారం వచ్చిన వెంటనే ఎమర్జెన్సీగా ఉన్న మెడిసిన్ ను తూటాల మాలలో పెట్టుకొంది. అలా గుచ్చుకు పోయాయి.

అప్పుడు చూసింది కుడి వైపునున్నోడిని. వాడి గురి తన వైపుకే ఉండడం గమనించింది. వాడి తూటా వచ్చేంత లోపే అక్కడి నుండి కదలాలనుకొంది. వెనుకకు క్రావెలింగు చేసింది. పెద్ద బండనానుకొంది. కాలు కదిపి చూసింది. విరగలేదు. లేచి నిలబడింది. అవతల నున్న కామ్రేడ్స్ ను కలిసింది.

రామశిల ముందున్నోడిని మూడుసార్లు ఫైర్ చేసింది. ఫైర్ అయింది. అక్కడి నుండి పైకొచ్చింది. కవర్ లేదు. ప్రౌన్ పొజిషన్ తీసుకొంది. తుపాకీని ఎయిమింగు చేస్తుండగా…ఎడమ పిరుదు నుండి కుడి పిరుదు లోపలి భాగాలను కోసుకొంటూ తూటా దూసుకొచ్చింది. బయటికొచ్చిన దగ్గర పెద్ద రంధ్రం. రక్తం పొంగుతోంది ఆగకుండా. అవతల కవర్ లో విజ్జాల్ కనిపించాడు. రామశిల, విజ్జాల్ లు సహచరులు.

‘నేను చచ్చిపోతాను’ విజ్జాల్ ను చూసిన రామశిల.

‘అలా అనకు, పోలీసులు వింటారు, శక్తి తీసుకొని రా’ విజ్జాల్.

బలవంతంగా పాక్కొంటూ విజ్జాల్ కవర్ దగ్గరకు వచ్చింది రామశిల. కమిలి ఇవతలికొచ్చింది. రామశిలను చూసి. అక్కడి నుండి కమిలి, విజ్జాల్ పట్టుకొన్నారు రామశిలను.

సీమకు పడింది. ముందు కుడి కాలుకి, ఆపై ఎడమ కాలికి. ఎముక విరిగింది. కదల్లేకుండా.

‘నా తుపాకీ…నన్ను పట్టుకుపోండి’ పిలిచింది సీమ.

సద్దాం కుడి కన్ను ఎగిరి కింద పడింది. అంత ఫైరింగులో ఏ కవర్ లేకుండా నిలబడ్డాడు. కంటి నుండి బొట, బొట కారుతున్న రక్తాన్ని తుడుచుకొంటూ.దీపక్ ఉరికి సద్దాం ఎ.కె. అందుకొన్నాడు. సద్దాంను కవర్ లోకి లాగాడు.

సీమకు వెనుకనున్న శరత్ ను టార్గెట్ చేశాడు వాడు. ఫైరింగు, షెల్లింగ్స్. వెంట్రుకవాసిలో తప్పుతున్నాయి. ఒక షెల్ వెనుక ప్రౌన్ పొజిషన్ లో ఉన్న సుఖరామ్ కి పడింది.

‘అయ్యో!’ అని వెల్లకిలా పడ్డాడు.

ఒక షెల్ ముందున్న మహిళా కామ్రేడ్ కు పడింది. మరొకటి చెట్టుకు పడింది.తోలు చీల్చుకు పోయింది. అక్కడి నుండి రెండంగల్లో అవతలికి ఉరికాడు శరత్.

రోహన్ కు నుదుటి మీద పడింది. రక్తం కారుతోంది. అయినా తుడుచుకొంటూ రామశిల దగ్గరకొచ్చాడు. తుపాకీ పట్టుకోవటానికి.

‘నీక్కూడా పడిందిగా, నా తుపాకీ ఎట్టా పట్టుకొంటావ్?’ రామశిల రోహన్ ను.

‘పట్టుకొంటాను’ రోహన్.

రెండు తుపాకులు పట్టుకొని కవర్ తీసుకొని రైఫిల్ తో కొట్టాడు. అంతే ఠపీ మని ముందుకు బోర్లా పడ్డాడు రోహన్. తుపాకులు తేవటానికి రీత ఉరికింది గానీ, వాడు అక్కడే టార్గెట్ చేస్తున్నాడు కుప్ప కుప్పగా.

అమరుల, గాయాలైన వారి సంఖ్యతో పాటు తూటాలు కూడా నిండుకొన్నాయి. గండి కొట్టే టీము మొత్తం చేతికందకుండా అయిపోయింది. కమాండర్ నందు గాయాలయ్యాడు. ఇక కష్టమని అందరూ రిట్రీట్ అవుతున్నారు.

‘నందు…నందు…’కామ్రేడ్స్.

‘నందు రావటంలేదు’ వెనుకనున్న వారు.

‘నందు పడిపోయాడు’.

‘ఆ…’నమ్మలేని ఆశ్చర్యంతో. నందు లేని యుద్ధం ఎలా ఉంటుందో తెలుసు గనుక.

ఇంకొంచెం రిట్రీట్ అయ్యారు. కానీ కళ్ళన్నీ నందు కోసమే. రెండడుగులు వేయటం, వెనక్కి తిరిగి చూడడం. నిరాశ. నిరాశతోనే పది నిమిషాలు నడిచారు. దారంటా నెత్తుటి మరకలు. కేమోఫ్లేజ్ చేసుకొంటూనే. రిట్రీట్ అవుతున్న కామ్రేడ్స్ ను ఫ్లాంక్ లో కొట్టటానికి ముందుకు ఉరికారు పోలీసులు.

ఆ ప్లేసంతా నెత్తురు, కామ్రేడ్స్ శవాలతో నిండిపోయింది.

***

శరీరమంతా రంగులేసుకొని చేతిలో ఎటువంటి ఆయుధాలు లేకుండా ‘డిష్యూం’, ‘డిష్యూం’ అంటూ డమ్మీ ఫైట్లతో వరుసబెట్టి అందరినీ ఒకేసారి తొక్కేసి, రెండు డ్యూయెట్లు పాడేసుకొన్న నకిలీ హీరోల, హీరోయిన్ల కథ కాదు ఇది. అసలు సిసలైన హీరోల, హీరోయిన్స్ కథ. వాళ్ళను చూడాలంటే విప్లవోద్యమంలోనే, వర్గ యుద్ధంలోనే. విప్లవోద్యమం పుట్టింది, పెరిగింది, పెరుగుతోంది ఆ అసలైన హీరోలను, హీరోయిన్లను సమాజానికి అందించటం కోసమే. స్వేచ్ఛగా ఎటువంటి ఆంక్షలు లేకుండా సహజంగా బతికే రోజుల కోసం.

***

మూలుగుతూ, కొన ఊపిరితో ఉన్న నందు, జుగిని, సీమలు. జుగిని బోర్లా పడిపోయి ఉంది. నందు వెల్లకిలా పడ్డాడు. పడి పోయిన చోట అడ్డాకుల పందిరి చిక్కగా ఉంది. సీమ పడిపోయిన దగ్గర హరింగ మొక్కలు. కదల్లేని పరిస్థితి నందుది. శరీరాన్ని రెండు ముక్కలు చేసిన యుద్ధం. నడుము, పొట్ట భాగం ఛిద్రమై పోయింది. రక్తం ఏరులా పారుతోంది. అయినా గుండె నిబ్బరం. తల పైకెత్తి చుట్టూ చూశాడు. ఎవరూ కనిపించలేదు. మరొకసారి తల పైకెత్తాడు. రెండడుగుల దూరంలో సూర్యకిరణాలకు తళుక్కుమని మెరిసిందొకటి. చేయి చాచాడు. అందలేదు. అటే తీక్షణంగా చూశాడు. ఇన్ సాస్. దాని దగ్గరకు వెల్లకిలా పాకాడు. దాన్నందుకొన్నాడు.

ముందు వైపు చిన్నగా మూలుగు వినిపించింది. ఎంతో దూరం కాదు. దగ్గరే, కానీ వెళ్ళలేని పరిస్థితి. మూలుగు వచ్చిన వైపే తల పైకెత్తాడు. బోర్లా పడిన జుగిని. తొడుక్కొన్న షర్టును గుర్తు పట్టి.

పై వేపున ‘పానీ….పానీ….’అనే మూలుగు. తల తిప్పాడు అటు. ఎవరైందీ కనిపించలేదు. గొంతును గుర్తు పట్టాడు. సీమ. మూలుగుతూ. ముగ్గురు ఒకరికి ఇంకొకరు కనపడే దూరమే. కానీ ఒకరి దగ్గరకు ఇంకొకరు కదల్లేని శరీరాన్ని తూట్లు పొడిచిన కగార్ యుద్ధం. అంతులేని నిస్సహాయత. గొంతెండి పోయింది. ఎవరూ కనిపించడం గానీ, మాటలు వినిపించడం గానీ లేదు. అయినప్పటికీ ధైర్యం వీడలేదు ముగ్గురు.

ముగ్గురూ పాక్కొంటూ సామాను డంపు చేసిన చోటుకు వెళ్ళారు. నందు ఇన్ సాస్ వదల్లేదు. తనతో పాటు దాన్ని లాక్కొంటూనే. జుగిని మొఖం మొఖంలా లేదు. నెత్తురు పులుముకొని కళ్ళు తెరవలేక పోతోంది. నందు పాకుతున్న చప్పుడు దిశను బట్టి పాకుతోంది. సీమ కూడా. తన సింగల్ షాట్ ను వదిలి పెట్టలేదు. రెండు కాళ్ళకు పడి కూడా కాళ్ళను ఈడ్చుకొంటూ. ఒకేసారి వారికి సాధ్యం కాలేదు. రెండు, మూడు సెకన్లు పాకటం, అలసిపోవటం, ఆగటం. ఇంకొన్ని క్షణాల్లో అనంత వాయువుల్లో కలిసిపోతామని తెలిసి కూడా. నందు దిటవు గుండె జుగిని, సీమలను కూడా దిటవు గుండెగా చేస్తూ….రెండు గంటల సమయం పట్టింది వారికి. అసలు వారున్న చోటు నుండి సామాను పెట్టిన చోటుకు ఐదు నిమిషాలు కూడా పట్టదు. అటువంటిది రెండు గంటలు పాకి చేరుకొన్నారు. మొక్కవోని ధైర్యంతో.

బాగా అలసిపోయారు ముగ్గురు. మసక, మసకగా కనిపిస్తున్న సామాను. ఎండిన మొద్దుకు ఆనుకొని నందు. ఇన్ సాస్ ను పక్కనున్న చెట్టుకు ఆనించాడు. జేబులోని రుమాలు తీసి మొఖం తుడుచుకొన్నాడు. అలా ఎంత సేపు కూర్చున్నాడో? కూర్చోన్నోడు కూర్చున్నట్టే ఊపిరి ఆగిపోయింది. పట్టులేని చేతి నుండి రుమాలు కింద పడింది. చనిపోతూ కూడా ఆయుధాన్ని ప్రాణం కన్నా మిన్నగా చూశాడు.

సీమ దాహంతో బాగా తన్నుకులాడింది. గట్టిగా మూలిగింది కూడా. పానీ…పానీ అంటూ. గొంతెండి పోయి నాలుక పిడచకట్టుకు పోయింది. అటు, ఇటు పొర్లింది. ప్రాణం పోయింది. బోర్లా పడుకొనే. పక్కనే తుపాకీతో. జుగిని పాకి, పాకి సొమ్మసిల్లి పడిపోయింది. శ్వాస ఆగిపోయింది.

ఆఖరి శ్వాస వరకు ఎంచుకొన్న లక్ష్యం పట్ల ఉన్న దృఢ సంకల్పం. అందుకే కా. నందు ప్రజల, కేడర్ల మనసులో హీరోగా నిలిచి పోయాడు. కగార్ కాలపు వీరుడుగా. వీర పుత్రికలుగా, మరీ ముఖ్యంగా కమ్యూనిస్టు హీరోయిన్స్ గా నిలబడ్డారు జుగిని, సీమలు.

గండి కొట్టిన దగ్గరి నుంచి రిట్రీట్ అయ్యాక మంచిగా ఉన్నోళ్ళు ముందు పోవాలని కమల కాషన్ ఇచ్చింది. కాషన్ విన్న రీత ముందుకు అడుగులు వేసింది. పది నిమిషాలు నడిచారంతే. అది కూడా ఆకాశమంతా ఆందోళనతో. అంతలోనే నాలుగవ ఫైరింగు. కామ్రేడ్స్ విజయ్, సుందర్ గట్టిగా ప్రతిఘటించారు. ఎ.కె. మ్యాగ్జిన్ అయ్యే వరకు. కా. మురళికి గాయమైంది. అక్కడి నుండి సన్నాయ్, జానకి రెండు చేతులు పట్టుకొని కిల్లింగు జోన్ నుండి బయటికి తీసుకు వచ్చారు. ఇరవై నిమిషాలు రిట్రీట్ అయ్యారు.

చిన్న కొండ ఎక్కుతూ ‘బయట పడ్డాం’ అని ఊపిరి పీల్చుకోవటం పూర్తి కాకముందే ఐదవ ఫైరింగు. ఆటోలో వాడు. అందరి దగ్గర ఎ.కె.లే. డౌన్ అయిపోయారు కామ్రేడ్స్ అందరూ. పోలీసులు ఇవతలికి రాకుండా విజయ్, సుందర్ లు ఎక్కు పెట్టారు ఎ.కె.లు.

ఘమాసాన్ యుద్ధం. బయట పడలేమనిపించిన కమల రిట్రీట్ కాషన్ ఇచ్చింది. అందరూ శక్తిని కూడదీసుకొని పరుగెత్తుతున్నారు. పరుగెత్తే శక్తి లేని అంజు అక్కడే ఉంది. వదిలిపెట్టి వెళ్లి పోతారనుకొంది. దీపక్ దగ్గరికొచ్చాడు.

‘పదా! దీపక్.

‘రాలేను’ అంజు.

‘ధైర్యం చేయి’

‘గుక్కెడు నీళ్ళివ్వు’

‘లేవు’

‘గొంతు తడిస్తేనే నడవగలుగుతాను’.

భుజం పట్టి లాగుతున్నాడు అంజుని దీపక్. అంజు కదలటం లేదు. శీతబాబుశరత్ ను కవర్ లో కూర్చోబెట్టాడు. అంజు దగ్గరకు వచ్చి బిస్కట్ ఇచ్చాడు. తిన్నది. లోపలికి పోలేదు. గొంతెండి పోవటంతో. దీపక్ అంజు భుజం పట్టుకొని గుంజుకొంటూ ముందుకు లాక్కెళ్ళాడు.

కమల కాషన్ ఇచ్చినపుడు అందరూ పరుగెత్తారు. మనుకు కూడా పరుగెత్తాడు. శరత్ ను వదిలిపెట్టి.

‘ఇందాక ముందు పోండి అంటే శరత్ ను పట్టుకోవాలన్నావ్, ఇప్పుడు ఉరికొస్తున్నావ్’ అని మనుకును కోప్పడ్డాడు దీపక్. అక్కడి నుండి శరత్ దగ్గర కెళ్ళాడు మనుకు.

‘నన్ను వదిలేయండి, మీరైనా బతకండి’ కమిలి, విజ్జాల్ తో రామశిల. చుట్టూ వస్తున్న ఫైరింగుతో. కమిలి వదిలి ముందుకెళ్ళింది. విజ్జాల్ వదల్లేదు. కోప్పడింది రామశిల. అప్పుడు వదిలాడు. కొంచెం ముందుకెళ్ళి వెనక్కి తిరిగి చూశాడు విజ్జాల్.

‘పోఁ… ‘రామశిల.

అక్కడి నుండి కాళ్ళు ఈడ్చుకొంటూ ఈత మొక్కల గుబురు దగ్గరకెళ్ళింది రామశిల. పడుకొంది. తల కనపడుతుందని అడ్డాకుల తీగను మీదకు వంచుకొంది.

ఆ ఐదవ ఫైరింగులోనే మొత్తం కామ్రేడ్స్ రెండు టీములుగా విడిపోయారు.

కమలతో పాటు ఒక్కొక్కరు కిల్లింగు జోన్ నుండి వేగంగా రిట్రీట్ అయ్యారు. మరొక దాడికి గురి కాకుండా. అసలు వారిక్కూడా దారి దొరికేది కాదు. అప్పటి వరకు అక్కడే పొంచి ఉన్న పోలీసోడు కొన్ని క్షణాల ముందు ఖాళీ చేశాడు. పైన ఫైరింగు అవటంతో అక్కడికి ఉరికాడు.

ఈత చెట్ల గుబురు. గాయాలైన కామ్రేడ్స్ కు ప్రాథమిక చికిత్స జరిగింది. వర్షమొచ్చింది. పది నిమిషాలు. అందరూ తడిచారు. అందరికి వర్షంలో తడవటంతో తెప్పరిల్లినట్టయింది. గాయాలైన కామ్రేడ్స్ మురళి, సునీత, అంజు, ఫాతిమాలకు శరీరమంతా బరువెక్కింది. అక్కడి నుండి ఒక్క ఇంచ్ కూడా కదల్లేనంత. అయినప్పటికీ కామ్రేడ్స్ సహాయంతో అడుగులో అడుగు వేసుకొంటూ పట్టుదలగా ముందుకు కదిలారు. చిన్న వాగు. నెమ్మదిగా వాగు దాటుతున్నారు. మురళి షడన్ గా కూర్చున్నాడు.

‘పదా దాదా’! సన్నాయ్, జానకి.

‘నా వల్ల కాదు, పొట్ట నొప్పి వస్తోంది’ మురళి.

‘ధైర్యం చేయి మురళి’ మాలతి.

సన్నాయ్, జానకి సహాయంతో లేచి నిలబడ్డాడు మురళి. నిదానంగా అడుగులు వేశాడు.

రెండవ టీము పోలీసులకు అతి సమీపంగా వెళ్ళింది. ఆ టీములో కా. నీతితో పాటు సురేష్ దాదా, మహేష్, అజిత, సుక్కు, విజయ్, జగిని, జమిలి, మనోజ్, సుశీల్, సోను, మంగ్లి, జనబత్తి, సుమన్, సుందర్, కములు, బుధురు, జిల్లాల్, కొల్లి, సుఖదాయ్, ఐతే, నర్సింగ్, అనిల్, సోమారు, పూల్ సింహ్, నరేష్, దశమతిలున్నారు. పోలీసులు రాపిడి ఫైరింగు చేశారు. సుందర్ ఎయిమింగు చేసి కొట్టాడు. ఒకడు పడ్డాడు. సుశీల్, మనోజ్, విజయ్, సుందర్, రీత బాగా ప్రతిఘటించారు. టీము వెనక్కి రిట్రీట్ అయింది. అక్కడ ఎవరికీ ఏం కాలేదు. అక్కడి నుండి కొద్దిగా కిందకు వచ్చి కుడి వైపుకు దూరంగా రిట్రీట్ అయ్యాడు కా. సురేష్ దాదా. అక్కడ మరొక పోలీసు బ్యాచీ ఉంది. దాదాని అతి సమీపంగా రానిచ్చిన ఆ బ్యాచీ విచ్చలవిడిగా ఆటోలో పెట్టింది. కా. సురేష్ దాదాని బలి తీసుకొంది. అది ఆరవ దాడి.

అక్కడి నుండి ఐదు వందల గజాలు ఇవతలికొచ్చి ఆగారు. చిన్న లోయ.

‘లోయలో నుండి వెళదాం’ జమిలి.

అందరూ లోయలోకి దిగారు. లోయ అంచున సుశీల్ ఇటు, అటు చూస్తూ. అటు పక్కనున్న పోలీసులను చూశాడు.

‘అటెళ్ళకండి పోలీసులున్నారు’ సుశీల్.

లోయలోంచి పైకెక్కారు. వర్షంలో తడిచారు. ఉదయం నుండి పచ్చి నీళ్ళు కూడా ముట్టక పోవటంతో ఊరటనిపించింది అందరికీ. ఒక గంట ఉన్నారక్కడ. అవతల చెట్ల గుబురు.

‘ఆ గుబురులోకి పోదాం’ నీతి.

అందులోకి దూరి ఒక గంట కూర్చున్నారు మాట్లాడకుండా. అయితే గుబురులోకి వెళ్ళేటప్పుడు పైనున్న పోలీసులు చూశారు. అక్కడి నుండి ఎటెళ్తారనేది గమనిస్తూనే ఉన్నారు. గంట తర్వాత ‘దరస్… దరస్’ అని ఆకుల చప్పుడు, పెద్ద, పెద్ద అంగల బూట్ల శబ్దం. ఒక వైపు నుంచి కాదు, చుట్టుతా.

‘పోలీసులొస్తున్నారు. బయటికి పోదాం’ నీతి నర్సింగుతో.

అందరూ ఒక్క ఉదుటున లేచి బయటికొస్తుండగా ఏడవసారి ఫైరింగు. ఎటూ కదలనీయకుండా. కా. మనోజ్, సుశీల్ ప్రతిగా కాల్పులు జరుపుతున్నారు. బుధురు, నర్సింగుకు గాయాలయ్యాయి. కములు ఎడమ కాలికి షెల్ ముక్క పడింది. బుధురు, జిల్లాల్ ఫైరింగు మధ్యలో నుండే విడిపోయారు. ఇంకోపక్కనుండి మనోజ్, సుశీల్, సుందర్, రామ్ ధేర్, అనిల్, సోమారు, పూల్ సింహ్, కొల్లి, కములు, ఐతే, సుఖదాయ్, దశమతిలు పైకి పరుగెత్తారు. అక్కడ ఫైరింగు అయింది ఎనిమిదోసారి. ఐతే ఎడమ చేతికి గాయమైంది.

నీతి టీము మొత్తం పోలీసుల చుట్టివేతలో ఇరుక్కొంది. కొద్దిగా కూడా సందు దొరకటం లేదు. సందు కోసం కామ్రేడ్స్ ప్రతిఘటిస్తున్నారు. కా. అజిత దగ్గర ఇన్ సాస్ తుపాకీ ఉంది. దాంతో రిట్రీట్ కష్టమవటంతో తుపాకీని రీత పట్టుకొంది. అప్పుడు రీత దగ్గర రెండు తుపాకులయ్యాయి. ఒకటి సురక, రెండోది ఇన్ సాస్. ముందు సురక వేసింది. సురక నేల మీద పెట్టింది. ఇన్ సాస్ తో ఫైర్ చేస్తున్నపుడు కాలికి పడింది. పట్టుకొన్న తుపాకీ అవతల పడింది. ఒక్క అంగలో దూకి దాన్ని పట్టుకొంది. నీతికి ఎడమ చేయికి గాయమైంది. భుజానికి తగిలించుకొన్న ఫ్లాస్క్ పగిలింది. నీతికి అయిన గాయాన్ని చూసిన సుమన్ కన్నీళ్ళు పెట్టింది. జగినికి గండి కొట్టిన దగ్గర పొట్ట ఎడమ భాగంలో గాయమైంది. ఇబ్బంది పడుతూనే రిట్రీట్ అవుతోంది. తుపాకీ వదలకుండా.

నీతి, అజిత, మహేష్, జగిని, సోను, జమిలి, సుక్కు, రీత, జనబత్తి, సుమన్, నరేష్, మంగ్లి, లోకేష్ లు ఒక చోట కుప్పయ్యారు. విజయ్ కొంచెం అవతల కవర్ తీసుకొని పోలీసులపై ఎయిమింగు చేస్తూ….పోలీసులు దగ్గరకొస్తున్నారు. అప్పుడే నర్సింగు, రీత, అజిత పరుగెత్తారు. నర్సింగు స్పీడుగా రిట్రీట్ కావటంతో నర్సింగును కలవలేక పోయారు. ‘ఏం చేయాలను’కొంటూ వెనక్కి తిరిగి చూసింది రీత. పోలీసులు ఉరికొస్తున్న శబ్దం దగ్గరికొస్తోంది. అక్కడే ఉన్న పొదలోకి దూరింది. అజిత ఒర్రెలోకి వెళ్ళింది. చేతులు ఆనించుకొంటూ (ఫ్రాగ్ జంప్ లో). కనపడననుకొని. కానీ పైనున్నోడు చూశాడు. అక్కడే ఒర్రెలో పట్టుకొని చంపారు.

ఏడవ ఫైరింగు నుండి విడిపోయిన సుశీల్, మనోజ్ ల వెంట సుందర్, రామధేర్, అనిల్, సోమారు, పూల్ సింహ్, కములు, ఐతే, కొల్లి, సుఖదాయ్, దశమతిలు కొండ పైకే పరుగెత్తారు. పోలీసులు పైన ఉన్నారు. పైనున్నోడు ఫైర్ చేశాడు. ఐతే చేతికి తగిలింది. కిందకు దిగుతుండగా కిందా వాడున్నాడు. ఈ ఎనిమిదోసారి ఫైరింగులో బయటడడం కష్టమనిపించింది.

‘ఫైరింగు మధ్యలో నుండే బయట పడదాం’ మనోజ్.

కాల్పుల మధ్యలో నుండే వేగంగా పరుగెత్తాలని దానర్థం. మనోజ్ ఒక వైపు, సుశీల్ మరో వైపు కవర్ తీసుకొని వాడి మీదకు విసురుతున్నారు. పైన ఉన్నాడని కింద ఉన్నోడు ఫైర్ చేయలేదు. యాభై గజాలు అవతలికెళ్ళారు. ఎవరికీ ఏమీ కాకుండా. కుడి వైపు నుండి అంధధుంధ పైరింగు. తొమ్మిదోసారి. ఎడమ వైపుకు రిట్రీట్ అయ్యారు. సుశీల్ కు గాయమైంది. కింద పడ్డాడు.

‘తుపాకీ పట్టుకుపోండి’ సుశీల్.

సోమారు ఒక్క దూకు దూకాడు. తుపాకీని పట్టుకొంటుండగా గాయమైంది. పూల్ సింహ్ షెల్ వేశాడు. ఎలాగైనా తుపాకీ పోలీసోడికి దొరకొద్దని. వాడు ఖంగు తిన్నాడు. రెప్పపాటు కాలంలో తుపాకీ దొరకబుచ్చుకొన్నాడు పూల్ సింహ్.

సుశీల్ అమరుడయ్యాడు. సుఖదాయ్ ఎడమ కాలి పాదానికి పడింది. దశమతి ఛాతీకి పడింది. ‘దీదీ…’ అంటూనే కళ్ళు మూసింది. సుందర్ అప్పటి వరకు తన దగ్గరున్న ఎస్.ఎల్.ఆర్. ని సుఖదాయ్ కిచ్చాడు. సద్దాం ఎ.కె. పట్టుకొన్నాడు. ఆటోలో పెట్టాడు.

అమరుడయ్యే వరకు విడిపోయిన టీమును సుశీల్ లీడ్ చేశాడు. తర్వాత మనోజ్. సుందర్, మనోజ్ చెరో పక్క ఉండి ప్రతిఘటిస్తున్నారు. ఇద్దరి టార్గెట్స్ కలిశాయి. అవతలున్నోళ్ళు ఇద్దరూ పడ్డారు. పోలీసులు దగ్గరే ఉన్నారు. సురకను తుపాకీతో కాకుండా నేలకు పిన్ కొట్టి విసిరాడు అనిల్. పేలింది. ఐతే కూడా అట్టాగే విసిరింది. అది కూడా పేలింది. రామధేర్ మూడు వేశాడు. అసలు రామధేర్ కు సురక వేసిన అనుభవం లేదు. కానీ ఐతే, అనిల్ లు విసిరేది చూసి తను గట్టిగా విసిరాడు. అవి పోలీసుల మధ్యలో పేలాయి. మొత్తం దుమ్ముతో కూడిన పొగ. మందు వాసన, వాంతయ్యేటట్టు. ఊపిరి తీసుకోవటం కష్టంగా ఉంది. ఆ పొగలో పోలీసులు ఎక్కడున్నది అర్థం కావటం లేదు. మనోజ్ ఎయిమింగు చేస్తూ ట్రిగ్గర్ మీద వేలు పెట్టాడు. క్లాక్ వైజ్ లో కళ్ళను తిప్పుతూ. పోలీసోడు మొదటున్న కవర్ లో లేడు. మనోజ్ అటు, ఇటు చూస్తుండగా….

‘ఇక్కడున్నాడు దాదా’ పూల్ సింహ్ మనోజ్ కు చూపించాడు పోలీసులను.

ట్రిగ్గర్ నొక్కాడు మనోజ్. పడ్డాడు ఒకడు. దాంతో అడ్వాన్స్ అయ్యాడు. ముందున్న కవర్ లోకి క్రావెలింగులో వెళుతున్నాడు. అప్పుడు పడింది మనోజ్ కు బుగ్గ మీద. అయినా వేగంగా క్రావెలింగు చేశాడు. కవర్ ను సమీపిస్తుండగా తల మీదిచ్చాడు కుడి వైపునున్నోడు. నేల కొరిగాడు మనోజ్. కోపం కట్టలు తెంచుకొంది అందరికీ. కళ్ళముందే సుశీల్, మనోజ్, దశమతిలు అమరులవటాన్ని తట్టుకోలేక పోయారు. మరింత వర్గకసిని ప్రదర్శించారు. ఎందుకంటే, కామ్రేడ్స్ ఒక ఖచ్చితమైన లక్ష్యం కోసం వచ్చారు. ఆ లక్ష్యం కోసం యుద్ధం చేస్తున్నారు గాబట్టి.

ఆ వర్గకసి వలనే అమరుడైన సుశీల్ తుపాకీ పూల్ సింహ్ చేతిలోకొచ్చింది. ఎప్పుడూ ఎస్.ఎల్.ఆర్. ని ఉపయోగించిన అనుభవం లేక పోయినప్పటికీ సెమీలో పెట్టాడు. వాడిపై గుళ్ళ వర్షం కురిపించాడు. సుందర్ కూడా. కమాండర్స్ ఇద్దరూ అమరులవటంతో ఆ బాధ్యతను సుందర్ తీసుకొన్నాడు. ఎ.కె. మ్యాగ్జిన్ అయ్యేంత వరకు ఆగలేదు. పూల్ సింహ్ పట్టుకొన్న సుశీల్ ఎస్.ఎల్.ఆర్. తోకూడా మ్యాగ్జిన్ అయ్యేంత వరకు ఆగలేదు. కొడుతూనే ఉన్నాడు.

గండి కొట్టినపుడుసుందర్ అమరులైన కామ్రేడ్స్ నందు ఎ.కె. తూటాల పోచ్, బ్యాక్ పోచ్, జుగిని తూటాల పోచ్ ను తీసుకొచ్చాడు. ఆ తుపాకుల మ్యాగ్జిన్లు అయ్యేంత వరకు మార్చి, మార్చి కొడుతున్నాడు. ప్రౌన్ పొజిషన్ లో ఉండి. ఒకటి కాకపోతే మరొక తుపాకీతో. మ్యాగ్జిన్స్ ఖాళీ. తను తూటాల పోచ్ నుండి మ్యాగ్జిన్ తీయాలంటే లేవాలి. లేస్తే గనుక బతకటం కష్టం. వాడు పొంచి ఉన్నాడు. అందుకే పక్కనున్న ఐతేని మ్యాగ్జిన్ తీసివ్వమన్నాడు. ఐతే తీసిచ్చింది. దాన్ని కొట్టేశాడు. ముప్పై తూటాలను మూడు సెకనుల్లో. మరల అడిగాడు. మరల తీసిచ్చింది. దాన్ని తుపాకీకి బిగించి ‘ఇక్కడ కనపడడం లేదు’ అన్నాడు. క్రావెలింగులో కవర్ మారుస్తుండగా ఛాతిలో పడింది. ‘ఐగోఁ… ‘అన్నాడు. అమరుడయ్యాడు.

‘అమ్మా’!పూల్ సింహ్.

‘అందరూ అమరులవుతున్నారు. ఇక వాడిపై నుండి ఉరుకుదాం’ అన్నాడు సోమారు. లీడింగు బాధ్యతను మీదేసుకొన్నాడు సోమారు.

క్షణాల్లో రాపిడి ఫైరింగు. పదవసారి. సోమారు గొంతు వినపడలేదు. రామధేర్ గొంతు కూడా.

గాయాలైన ఐతే సుందర్ శవం దగ్గరే కూర్చుంది. కాసేపు ఎటు వెళ్ళాలో అర్థం కాలేదు. ఎవడు ఎక్కడ నక్కి కూర్చున్నాడోనని. ఉదయం నుండి జరుగుతున్న దాడి. అందుకే ఎటు కదలలేక అక్కడే కూర్చుంది. వాడు ఐతే మీద విచ్చలవిడిగా కాల్పులు జరుపుతున్నాడు. ఎడమ కాలికి పడింది. క్రావెలింగు చేసుకొంటూ కొద్దిగా అవతలకెళ్ళింది. అక్కడా వాడు ఉన్నాడు. మరింత దగ్గరగా. పదకొండవసారి ఫైరింగు. వేల కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్నాయ్ తూటాలు. రెండు చేతుల, కాళ్ళల్లోంచి దూసుకు పోతున్నాయి. రక్తం చిమ్ముతోంది. కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. ఏం కనిపించటం లేదు. వాడు కూడా. అక్కడి నుండి బయటపడాలని మనసు తొందర పెట్టింది. కానీ ఎలా? ‘ఢాం… ఢాం…’ అన్న శబ్దాలే, చుట్టూతా పోలీసులే. ‘ఎటు తప్పించుకోవాలా? అనుకొంది. భూమంతా గిర్రున తిరుగుతోంది. రెండు క్షణాలు కళ్ళు మూతలు పడ్డాయి. బలవంతంగా తెరుచుకొన్నాయి. అవతల గోల వినపడింది. కములు వాళ్ళనుకొంది మనసులో. అడ్డాకుల తీగ. అది అలా పైకే పోయింది. దాన్ని పట్టుకొని నిదానంగా పైకెళ్ళింది. అనిల్ కలిశాడు.

‘హామ్మయ్య!’ ఊపిరి పీల్చుకొంది.

‘షెల్ ఇచ్చాను, వేశావా? ఐతే.

‘వేశాను. పేలింది. ఒకడు గాయాలయ్యాడు’ అనిల్.

‘నేఁఁ… కూడా పిన్ను కొట్టి వేశాను మొత్తం’ ఐతే.

చుట్టూ ఉన్న పోలీసుల వలయంలోనే వారిద్దరి సంభాషణ. అనిల్ దగ్గర బి.జి.ఎల్. ఉంది. ఐతే దగ్గర ఏం లేదు. గాయమైనప్పుడు అవతల పడింది. దాన్ని తెద్దామని ప్రయత్నించింది, గానీ వాడు దాని దగ్గరికీ వెళ్ళనీయలేదు. అక్కడి నుండి వంద గజాల దూరం వెళ్ళారు. ముందు కొల్లి, కములు, ఐతే, సుఖదాయ్, అనిల్ లు. పన్నెండవసారి ఫైరింగు అప్పుడే. అనిల్ అమరుడయ్యాడు.

ఎవరి గొంతు వినపడితే వారినే టార్గెట్ చేస్తున్నాడు. దాడి మొదలైన దగ్గరి నుండి. పన్నెండు మందిగా విడిపోయిన ఆ టీములో మిగిలింది నలుగురే. కొల్లి, కములు, ఐతే, సుఖదాయ్ లు. కళ్ళముందే సహచర కామ్రేడ్స్ నేల కొరుగుతున్నారు. కానీ కించిత్తు కన్నీరు కార్చలేదు. జంకలేదు. సరెండర్ అవుతామనలేదు. అంతకు మించి మరింత ఉన్నతంగా ఆలోచించారు. అమరుల త్యాగాన్ని ధైర్యంగా మలచుకొన్నారు. ‘చంపుతూ ఛద్దామని’.

అడుగులో అడుగు వేసుకొంటూనే చుట్టూ చూశారు ఆ నలుగురు. పోలీసులు కనిపించటం లేదు. ఇంకా అవతలికెళ్ళారు. అల్లినట్టున్న పెద్ద గుబురు. కొల్లి, ఐతే, కములు లకు అందులో దాక్కోవాలనిపించింది. ఇక వేరే దారి లేకపోవటంతో. ఒకరికొకరు సైగ చేసుకొన్నారు. ఏమాత్రం చప్పుడు చేయకుండా అడుగు వేస్తూ వెనక్కి తిరిగి చూశారు. సుఖదాయ్ రావటం లేదు. సుందర్ ఇచ్చిన ఎస్.ఎల్.ఆర్. పట్టుకొని కవర్ లోనే ఉంది. ఆగి….’రా… సుఖదాయ్’ అని పిలిచారు.

‘వెళ్ళకండి’ అన్నది. అక్కడే నిలబడింది.

చీకటి పడుతోంది. దూరటానికి సందు కూడా లేని ఆ గుబురులోకి దూరారు ముగ్గురు. ఏమాత్రం అనుమానం రాకుండా. ఉలుకు, పలుకు లేకుండా కూర్చున్నారు. వాళ్ళు కూర్చున్న పది నిమిషాలకు నలుగురు పోలీసులు వారి దగ్గరి నుంచే వెళ్ళారు. ‘బుధరామ్’, ‘రాజేష్’ అని పిలుచుకొంటూ.

‘ఇక్కడ నెత్తురుంది.మంచిగా చూడండి’.

‘నీ పేరే రాజు?’ ఒకడు హుంకరిస్తున్నాడు.

మహేషుని ప్రాణంతో ఉండగా పట్టుకొన్నారు. సుఖదాయ్ ని పట్టుకొన్నారు. బాగా చిత్రహింసలు పెడుతున్నారు.

‘చంపకండి, బతికించండి’ అన్న మహిళా కామ్రేడ్ అరుపు. సుఖదాయ్ దే. ఆపై ఆటో ఫైరింగు. సుఖదాయ్ మీద. పదమూడవసారి జరిగిన ఫైరింగు అదే.

రీత దాక్కొన్న పొద రెండు గజాల దగ్గరి వరకు మూడు బ్యాచీలుగా పోలీసులు వచ్చారు. గాయాలైన ఒక మహిళా, పురుష కామ్రేడ్ ను తెచ్చి చిత్రహింసలు పెట్టిచంపారు. నీతిని పట్టుకొని కర్రలతో కొట్టి, కొట్టి చంపారు. జుట్టు కోశారు. ఆపై నినాదాలిచ్చారు.

మొదట ‘పి.ఎల్.జి.ఎ. జిందాబాద్’

‘దంతేశ్వరి’

‘బస్తర్ ఫైటర్స్’

‘నారాయణపూర్ డి.ఆర్.జి. హు….హా….’

‘బహార్ పేసట్, మావ సంగే వాటు’ (బయటికి రండి, మాతో పాటు రాండి)

‘డి.ఆర్.జి. గుండా హత్యాచార్ జిందాబాద్’

‘నారాయణపూర్ హత్యాచార్ జిందాబాద్’

‘నీతి జిందాబాద్’ (నీతి వర్థిల్లాలి) కా. నీతిని చంపేటప్పుడు.

‘నీతి మురదాబాద్’ (నీతి నశించాలి) చంపేసి.

‘లోప్ప మందనా లేయస్కు బహార్ పేసట్, బేస్ మందనా నానొస్కును పొయ్యట్. గాయాలాగొరికున్ పూజిసియ్యకాల్’ (లోపలున్న యువతులు బయటికి రాండి, మంచిగా ఉన్న మహిళలను పట్టుకొందాం. గాయాలైనోరిని బలి ఇద్దాం).

‘సరెండర్ హో జావో, కడ హో జావో’ గట్టిగా అరిచారు పోలీసులు. వెంటనే ఆటో ఫైరింగు చేశారు. గాయమైన సుక్కు దొరికాడు. జనబత్తి ఒక పక్క నుండి రిట్రీట్ అవుతోంది. వాడి కళ్ళు పడ్డాయి. ‘ఏ లఢకీ భాగ్ రహే, ఉన్కే బులావో’ అన్నారు. మరుక్షణంలో ఆటో ఫైరింగు చేశారు.

కా. సురేష్ దాదా, విజయ్, అర్జున్, జుగిని, బసంతి, రోహన్, పూలో, బుధరామ్, జనీలా, సోమే, మనోజ్, సుశీల్, సుందర్, రామధేర్, అనిల్, సోమారు, నరేష్, దశమతి, పూల్ సింహ్, లోకేష్ మొత్తం ఇరవై మంది కామ్రేడ్స్ భీషణ యుద్ధంలో యుద్ధం చేస్తూ అమరులయ్యారు.

గాయాలైన కామ్రేడ్స్ నీతి, మహేష్, అజిత, జగిని, సుక్కు, జమిలి, సోను, జనబత్తి, మంగ్లి, సుమన్, నరేష్, మోహన్, సుఖదాయ్ లను వెతికి, వెతికి పట్టుకొన్నారు. మైదానంలోకి ఈడ్చుకొచ్చారు. చెప్పనలవి కాని చిత్రహింసలు పెట్టారు. ఆపై కాల్చి చంపారు. కర్కశంగా. అందరినీ చంపేసి పైనున్నోడిన పిలిచాడు వాకీలో. పై వాడు కిందకు రావటానికి రాత్రి 8.30 అయింది.

తమ, తమ టీముల నుండి విడిపోయి గుబురులో దాక్కొన్న కములు, ఐతే, కొల్లి, రీత, రామశిల లకు దొరికిన కామ్రేడ్స్ ను వాడు పెట్టే చిత్రహింసలు, కొట్టేదెబ్బలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. కటిక చీకటి. క్షణాలు లెక్క పెట్టుకొంటూ ఆ రాత్రిని గడిపారు రీత, రామశిలలు.

కములు, ఐతే, కొల్లి దాక్కొన్న గుబురు వెతుకుతారేమోనని ఆందోళనతో కూర్చున్నారు. చీమ చిటుక్కుమన్న వినిపించేంత నిశ్శబ్దంగా. రాత్రి రెండు గంటలయ్యింది. చుట్టూ ఎటువంటి శబ్దాలు లేవు. అప్పుడే అక్కడి నుండి బయట పడాలనుకొన్నారు. అడుగులో అడుగు వేసుకొంటూ బయటికొచ్చారు. కామ్రేడ్స్ ను చంపిన ప్లేసుకి. అక్కడి నుండి పైకెక్కారు. ఐతే నడవలేక పోతోంది. తూటాలు చేసిన రంధ్రాలతో శరీరమంతా నుజ్జు, నుజ్జయ్యి. మొత్తం పన్నెండు రంధ్రాలు. అయితే ఐతేకు అర్థమైంది రెండే. శరీరమంతా రక్తం. కారి, కారి ఓపిక నశించింది. నీరసం, కళ్ళు తిరగటం, తడబడే అడుగులు. ఎక్కడా కాలు వేస్తుందో అర్థం కాని స్థితి. గట్టిగా ఊపిరి బిగబట్టుకొని బలవంతంగా కాళ్ళను కదిలించింది. కములు, కొల్లిల సహాయంతో. వారు వెళ్ళే వైపుకి అటు, ఇటు పోలీసుల మాటలు వినిపించాయి. అటు, ఇటు వెళ్ళకుండా తిన్నగా పైకెక్కారు.

తెల్లవారుజాము నాలుగు గంటలయ్యింది. అల్లుకొన్న అడ్డాకుల తీగలు. ఆరుగంటల వరకు అక్కడే పడుకొన్నారు. తెల్లారింది. కనిపిస్తున్న పోడు పొలం (పెంద ఖేతి) దగ్గర కెళ్ళారు. తొమ్మిది గంటల వరకు అక్కడే ఉన్నారు. బాగా దాహమేసింది. పది గంటలకు నీళ్ళ కోసం కొల్లిని పంపించారు ఊరిలోకి. దారి తప్పింది. వేరే ఊరు వెళ్ళింది. తిరిగొచ్చింది. మరల వెళ్ళింది. దారి తప్పింది. అలా రెండు సార్లూ దారి తప్పింది. ఐతేకు గొంతు పిడచ కట్టుకు పోతోంది. మూడవసారి తన దగ్గరున్న కవర్ (దొడ్డికి వెళ్ళేటప్పుడు నీళ్ళు నింపుకొనే కవర్) ఇచ్చింది. నీళ్ళు తెమ్మని. రెండు గంటల తర్వాత తెచ్చింది నీళ్ళు. అవి తాగాక కొంచెం తెప్పరిల్లింది ఐతేకు. ఉదయం తొమ్మిది గంటల నుండి నీళ్ళ కోసం వెతికితే సాయంత్రం ఐదు గంటలకు దొరికాయి. నీళ్ళు తాగి కొల్లి ఊరిలోకెళ్ళింది. చీకటి పడింది. రాత్రి ఏడు గంటల సమయంలో ఊరి నుంచి మహిళలు, పురుషులతో తిరిగొచ్చింది. వారితో వెళ్ళారు ఆ ముగ్గురు.

రీత పొదలో పడుకొన్నది. మధ్య రాత్రి మెలకువ వచ్చింది. చేతికున్న వాచీ చూసింది. పన్నెండు గంటలు. వాంతయ్యింది. కళ్ళు తిరిగాయి. ఇంకేం తెలియలేదు. మళ్ళీ 2.30కి మెలకువ వచ్చింది. వెంటనే కళ్ళు మూతలు పడ్డాయి. నాలుగు గంటలకు మెలకువ వచ్చింది. ఆరు గంటల వరకు అలానే కూర్చుంది. కొండపై నుండి నెమళ్ళు, కోతులు, పిట్టలు అరుస్తూ కిందకు దిగుతున్నాయి. పోలీసులు వస్తున్నారనుకొంది. సమయం 6.30 నిమిషాలు. అక్కడుండడం క్షేమం కాదని నిదానంగా కదిలింది. గాయమైన ఎడమ కాలిని సాపి కుడి కాలిని మడత చేసుకొంటూ చేతుల సాయంతో. కామ్రేడ్స్ ను చంపిన దగ్గరకెళ్ళింది. అక్కడి నుండి దిశ మార్చి వాగు దగ్గరకెళ్ళింది. నీళ్ళు తాగింది. చీపురు పొదలో దూరింది. నెత్తురు వాసనకు తేనేటీగలు ‘జూయ్’ అంటూ వచ్చేశాయి. క్షణమాలస్యంచేయకుండా కదిలింది అక్కడి నుండి. చాలా సేపు పాకి సమయం చూసింది. మధ్యాహ్నం పన్నెండు గంటలు. అసలు అక్కడికి రావటానికి అర గంటే పడుతోంది. కానీ రీతకు ఆరు గంటలు పట్టింది.

బండ్ల బాట మీదకొచ్చింది. గొంతెండి పోతోంది. బాటకు ఒక పక్క చిన్న గుంత. దగ్గరకెళ్ళింది. నీళ్ళు. తేటగా ఉన్నాయి. దోసిటితో నింపుకొని తాగింది. మొఖం తడుపుకొంది. చల్లగా అనిపించింది. అక్కడి నుండి పది గజాల అవతలికెళ్ళింది. అక్కడే ఉంటే బాట మీదకు కనిపిస్తానని. చెట్టు మొదల్లో ఒదిగి కూర్చుంది. దూరం నుంచి మాటలు వినిపించాయి. పోలీసులనుకొంది. మరింతగా ముడుచుకు పోయింది. మాటలు ఇంకా దగ్గరగా, తిన్నగా ఉన్న బాట దగ్గరకు వస్తున్నాయి. చెట్టు చాటు నుంచే వారిని గమనించింది. తెలిసిన వారే. పిలిచింది వారిని. పోలీసులనుకొని భయపడ్డారు. బాట మీదనే నిలబడ్డారు. పేర్లు పెట్టి పిలిచింది.

‘ఎవరూ?’ అంటూ దగ్గరికొచ్చారు.

‘నన్ను ఇక్కడి నుండి తీసుకెళ్ళండి’ రీత.

‘మేం పని మీద వెళ్తున్నాం, తర్వతొస్తాం’ అని చెప్పారు.

సాయంత్రం ఐదు గంటల సమయంలో ఊరి నుండి మహిళలు, పురుషులు వచ్చారు. అంబలి, బట్టలు, మంచం పట్టుకొని. అంబలి తాగించారు. నెత్తుటితో అట్ట కట్టిన బట్టలను తీసి మూట కట్టారు. వాళ్ళు తెచ్చినవి తొడిగించారు. మంచం మీద పడుకోబెట్టి ఊరిలోకి మోసుకుపోయారు. అప్పటికీ చీకటి పడిపోయింది. అంబలి తాగటంతో నిద్ర ముంచుకొచ్చింది. అలా యుద్ధం జరిగిన తెల్లారి ఐదవ తారీఖున సాయంత్రం ఆరు గంటలకు ప్రజల మధ్యకు చేరుకొంది రీత.

తెల, తెలవారుతుండగా లేచింది. అడవంతా తిరిగి, తిరిగి తెచ్చారు మందును దాదాలు. గాయాన్ని గోరువచ్చటి నీటితో కడిగారు. తయారు చేసిన మందును కట్టారు. యుద్ధం జరిగిన రెండు రోజులకు. మరుసటి రోజు కూడా గాయాన్ని శుభ్రం చేసి కట్టారు.

నాలుగవ ఫైరింగులో కా. మురళి నడుము నుండి పొట్టలోకి దూరింది తూటా. అక్కడి నుండి బయటికి రాలేదు. యూరిన్ ఆగిపోయింది. పొట్ట ఉబ్బింది. రెండవ రోజుకి ఇంకా ఉబ్బింది. ఊపిరి ఆడ లేదు. తినటం, తాగటం ఆగిపోయింది. దాడి జరిగిన రెండవ రోజు అంటే అక్టోబర్ ఆరవ తారీఖున ఉదయం తొమ్మిది గంటలకు అందరినీ శోకసముద్రంలో ముంచి వెళ్ళిపోయాడు మురళి.

రెండు పిరుదులకు గాయమైన కా. రామశిల ఈత చెట్ల గుబురులో. తెల్లారింది. రక్తస్రావం దారి కట్టింది. వాసన. గొంతెండి పోతోంది. పడుకున్నది నిదానంగా లేచింది. పోలీసులు వెళ్ళిపోయాక. ఉదయం తొమ్మిది గంటలకు. దాహమేస్తోంది.నీళ్ళ కోసం ఎండిన వాగును పట్టుకొని ముందుకెళ్ళింది. రెండు అడుగులు వేయటం, ఆగటం. అట్టా వాగు దగ్గరకెళ్ళేటప్పటికీ పది నిమిషాల దూరం రెండు గంటలు పట్టింది. అంత కష్టపడి వెళ్తే వాగులో నీళ్ళు లేవు. హరింగ పుల్ల తుంచుకొని నమిలింది. కొద్దిగాంత లాలాజలం ఊరింది. తునికి చెట్టు పుల్లను తెంపింది. నమిలింది. ఇంకొద్దిగా ఊరింది. ఇవతలికొచ్చి వెదురు పొదల్లో దాక్కొంది.

సాయంత్రం 4.30 నిమిషాలు. అడవిలో జనం మాటలు వినిపించాయి. ఆ మాటలు ఇంకా దగ్గరగా వస్తున్నాయి. లచ్చును గొంతు గుర్తు పట్టింది రామశిల.

‘లచ్చునూ….’పిలిచింది. లచ్చును పరుగెత్తుకొచ్చాడు. రామశిలను చూసి ఏడ్చాడు. అంబలి ఇచ్చాడు. అక్కడి నుండి తీసుకెళ్ళటానికి చీకటి పడింది. ఏడు గంటలకు ఊరిలోకి చేరుకొన్నారు. వెంటనే గాయాన్ని శుభ్రం చేసింది డాక్టర్ హైమ. పిరుదు నుండి షెల్ ముక్క తీసింది.

గంభీరమైన గాయమయ్యి కూర్చోలేక, నుంచోలేక, తినలేక, తాగలేక ఇబ్బంది పడుతూ కా. రామశిల నవంబరు పదకొండవ తారీఖున అందరినీ చూస్తూనే కళ్ళుమూసింది. అంటే అక్టోబర్ 4 కగార్ యుద్ధం జరిగిన ముప్పై ఆరు రోజులకు. బతకాలనే ఒకే ఒక్క ఆకాంక్షను తెలియజేస్తూ…

ఏకధాటిగా ఇరవై రెండు గంటలు జరిగిన కాషాయ కార్పొరేట్ యుద్ధంలో మట్టిని, మట్టి మనుషులను ప్రేమించే కామ్రేడ్స్ శత్రువుతో ‘ఢీ’ అంటే ‘ఢీ’ కొట్టారు. యుద్ధాన్ని యుద్ధంతోనే అన్నట్టు. ముప్పై ఆరు మంది కామ్రేడ్స్. మహిళా కామ్రేడ్స్ పదహారు, పురుష కామ్రేడ్స్- ఇరవై. ముప్పై ఆరు మంది పట్టుదల ఏమాత్రం సడలకుండా ప్రాణాన్ని పణంగా పెట్టారు. కించిత్తు స్వార్థం లేకుండా. అందుకే వారు మట్టిని, మనిషిని కాపాడే అసలైన కమ్యూనిస్టు హీరోయిన్, హీరోలయ్యారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా. అది గోబెల్ – బట్ వేడ (2024, జూన్ 7), గోవ్వాడి – తుల్ తులి (2024, అక్టోబర్ 4) కగార్ యుద్ధాల్లో. సింహంలా గర్జిస్తూ వాడి మీద పంజా విసిరారు. ఎరుపెక్కిన ఎర్రమల్లెలయ్యారు. ఇంకా చెప్పాలంటే ఈ కగార్ యుద్ధ కాలపు ఎర్రమల్లెలయ్యారు.

యుద్ధం రక్తపాతాన్ని కోరుకొంటోంది. రక్తపాతంతో కూడుకొన్న రాజకీయాలే ప్రజలకు అంతిమ పరిష్కారం చూపిస్తుంది. ఈ పరిష్కారం విప్లవోద్యమమే చేయగలుగుతోంది. ఈ రోజు ప్రకటించిన కగార్ యుద్ధంతో విప్లవోద్యమం, విప్లవ కార్యకర్తలు నష్టపోయినా రాబోయే రోజులన్నీ విప్లవోద్యమానివే, విప్లవ ప్రజలవే.

(2024 అక్టోబర్ 4 న జరిగిన గోవ్వాడి తుల్ తులి కగార్ యుద్ధ వాస్తవ చిత్రం ఇది)

Leave a Reply