1991లో, 40 మంది కశ్మీరీ మహిళలు సైనికాధికారులు తమపై అత్యాచారం చేశారని ఆరోపించారు. కేసు ఇంకా పెండింగ్‌లో ఉంది.

ఫిబ్రవరి 23తో కునన్ పోష్‌పోరా సామూహిక అత్యాచార ఘటన జరిగి 35 ఏళ్లు పూర్తయ్యాయి. కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఉన్న ఈ జంట గ్రామాల్లో సోదాలు నిర్వహిస్తున్న భారత సైన్యానికి చెందిన ఒక యూనిట్ తమపై ఈ దారుణానికి ఒడిగట్టిందని ఆ గ్రామ మహిళలు ఆరోపించారు.

ఈ నేపథ్యంలో, ‘లెస్ట్ వి ఫర్గెట్’ (మనం మర్చిపోకూడదు) అనే శీర్షికతో 2024 సెప్టెంబర్ సంచికలో ప్రచురితమైన కథనాన్ని ‘అవుట్‌లుక్’ పునఃసమీక్షించింది. కునన్ పోష్‌పోరా సామూహిక అత్యాచార ఆరోపణల కేసు ఇప్పటికీ పరిష్కారం కాలేదు; కాశ్మీర్ లోయలోని మారుమూల కుప్వారా ప్రాంత గ్రామస్థులకు సమయం అక్కడే ఆగిపోయినట్లుగా ఉంది. అక్కడి నివాసితులు ఈ కేసు గురించి చర్చించడానికి ఇష్టపడటం లేదు, అలాగే ప్రస్తుత కశ్మీర్ పరిస్థితుల దృష్ట్యా వారి న్యాయవాది కూడా దీనిపై మాట్లాడటానికి విముఖత చూపుతున్నారు. ఈ కేసు అటు జమ్మూ కశ్మీర్‌లోని రెండు కోర్టులలోనూ, ఇటు సుప్రీంకోర్టులోనూ విచారణలో ఉంది.

ఈ కేసు 2022 మార్చిలో క్లుప్తంగా మళ్లీ తెరపైకి వచ్చింది. శ్రీనగర్‌కు చెందిన 15వ కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ డి.పి. పాండే కునన్ గ్రామానికి వెళ్లినప్పుడు, అత్యాచారానికి గురయ్యామని చెప్పుకున్న మహిళలు ఆ “నెట్‌వర్క్” వల్ల తీవ్రంగా నష్టపోయారని అన్నారు. “1991లో కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లా కునన్-పోష్‌పోరా గ్రామాల్లో ఆర్మీ సిబ్బంది సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఒక ‘అబద్ధపు కథనాన్ని’ సృష్టించడానికి కొంతమంది మహిళలను ఒక నెట్‌వర్క్ ఉపయోగించుకుంది,” అని ఆయన అన్నాడు. 2021లో కునన్-పోష్‌పోరా నుండి ఒక ప్రతినిధి బృందం తనను కలిసి, 1991 ఫిబ్రవరి 23న జరిగిన సామూహిక అత్యాచారం గురించి ఒక కల్పిత కథను అల్లడానికి ఒక నెట్‌వర్క్ ఆ జంట గ్రామాల్లోని కొంతమంది మహిళలను ఎలా వాడుకుందో వివరించారని లెఫ్టినెంట్ జనరల్ పాండే చెప్పాడు.

ఆరోపణల ప్రకారం, 1991 ఫిబ్రవరి 23/24 రాత్రి, 68వ బ్రిగేడ్‌కు చెందిన ఫోర్త్ రాజ్‌పుతానా రైఫిల్స్ బెటాలియన్ కునన్-పోష్‌పోరా గ్రామాల్లో కార్డన్-అండ్-సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది. సైన్యం పురుషులను విచారిస్తున్నప్పుడు, తమ ఇళ్లలో ఉన్న మహిళలపైన సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారని గ్రామస్థులు ఆరోపించారు. ఈ సామూహిక అత్యాచార ఆరోపణలు అంతర్జాతీయ, జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించడంతో, 1991 మార్చి 5న అప్పటి డిప్యూటీ కమిషనర్ ఎస్.ఎం. యాసీన్ ఆండ్రబీ గ్రామస్థుల స్టేట్‌మెంట్‌లను రికార్డు చేశారు. అనంతరం, ఈ అంశం పాలనాయంత్రాంగంపైన “ప్రతికూల” ప్రభావాన్ని చూపుతుందని భావించి, విచారణ కోరుతూ అప్పటి కశ్మీర్ డివిజనల్ కమిషనర్ వజహత్ హబీబుల్లాకు నివేదికను పంపారు. 1991 మార్చి 8న త్రెహ్‌గామ్ పోలీస్ స్టేషన్‌లో రణబీర్ పీనల్ కోడ్‌లోని సెక్షన్లు 376, 452, 342 కింద ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

1991 మార్చి 10నాడు బ్రిగేడియర్ స్థాయి అధికారి గ్రామాన్ని సందర్శించడంతో సైన్యం తన స్వంత విచారణను చేపట్టింది. ఆ విచారణ నివేదిక, “(అత్యాచార) ఆరోపణలు… నిరాధారమైనవి, దురుద్దేశపూరితమైనవి” అని, అలాగే “సైన్యాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి” మోపినవని తేల్చి చెప్పింది.

1991 మార్చి 18నాడు అప్పటి డివిజనల్ కమిషనర్ వజహత్ హబీబుల్లా గ్రామానికి వెళ్లారు. హబీబుల్లా తయారుచేసిన బయటకు పొక్కిన నివేదిక ప్రకారం, “భారత సైన్యం వంటి బలగాల అధికారులు, కేవలం మహిళలపై దారుణాలకు ఒడిగట్టే లక్ష్యంతో తమ మనుషులను గ్రామంలోకి నడిపిస్తారని నమ్మడం అసాధ్యం” అని పేర్కొన్నాడు. ఆ తర్వాత ఈ ఆరోపణలపై విచారణ జరిపేందుకు బి.జి. వర్గీస్ నేతృత్వంలోని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బృందాన్ని ప్రభుత్వం నియమించింది.

వర్గీస్ 1991 జూన్ 8- 9 తేదీలలో ఆ గ్రామాలకు వెళ్ళాడు. ఆయన బృందం ఈ ఆరోపణలను తోసిపుచ్చుతూ, ఈ ఘటనను తీవ్రవాద గ్రూపులు పన్నిన ఒక “భారీ మోసం” గా అభివర్ణించింది. అయితే, తమ విచారణలో అత్యాచారాలు జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయని ఒక పోలీసు నివేదికలో నమోదైనట్లు మానవ హక్కుల సంఘాలు వెల్లడించాయి.

1991 మార్చి 22న డిజిపి మరొక విచారణను నిర్వహించాడు. ఒక మానవ హక్కుల నివేదిక ప్రకారం, విచారణ బృందం 1991 మార్చి 15, మార్చి 21 తేదీలలో 33 మంది మహిళలను పరీక్షించింది. ఇది అత్యాచార ఆరోపణలను ధృవీకరించింది. మహిళల శరీరాలపై “యోని గోడలపై చీలిన గాయాలు, హింసకు సంబంధించిన గుర్తులు, కమిలిన గాయాలు, అలాగే రాపిడి గాయాలు” ఉన్నట్లు వైద్య నివేదిక పేర్కొంది. వైద్య బృందం పరీక్షించిన మహిళలందరూ ఆర్మీ అధికారులు తమపై పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టారని తెలిపినట్లు మానవ హక్కుల సంఘాలు పేర్కొన్నాయి.

అయితే, 1991 సెప్టెంబర్ 23న, ప్రాసిక్యూషన్ డైరెక్టర్ ఈ కేసు విచారణకు పనికిరాదని కుప్వారా పోలీస్ సూపరింటెండెంట్‌కు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు ఈ కేసును “ఆధారాలు లభించనిది”గా మూసివేశారు.

ఈ కేసు 2004లో మళ్లీ తెరపైకి వచ్చింది. జమ్మూ కశ్మీర్ కోయలిషన్ ఆఫ్ సివిల్ సొసైటీ (జెకెసిఎస్) 2004 నివేదిక ప్రకారం, ఒక బాధితురాలు మరొక వ్యక్తితో కలిసి సరైన విచారణ కోసం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించింది. కమిషన్ దీనిపైన డిజిపి నుండి నివేదిక కోరింది. 2010లో, జెకెసిఎస్ నివేదిక ప్రకారం, పోలీసులు బాధితుల వైద్య నివేదికలను ధృవీకరించారు, కానీ ఆర్మీ సిబ్బందికి సంబంధించి ఎలాంటి గుర్తింపు ప్రక్రియ జరగకపోవడం వల్ల కేసును మూసినట్లు పేర్కొన్నారు. ఆ రాత్రి ఒక్క “దేశ వ్యతిరేక శక్తిని” కూడా పట్టుకోలేదని, కానీ 40 మంది మహిళలపై అత్యాచారం జరిగిందని కమిషన్ తర్వాత వ్యాఖ్యానించింది. ఎస్‌ఎస్‌పి లేదా అంతకంటే పై స్థాయి అధికారి నేతృత్వంలో సమయ పరిమితితో కూడిన ప్రత్యేక విచారణ బృందం ద్వారా కేసును తిరిగి విచారించాలని, అలాగే ఒక్కో బాధితురాలికి రెండు లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని కమిషన్ సిఫార్సు చేసింది.

2013లో నిర్భయ అత్యాచార ఘటన తర్వాత, ఆ గ్రామానికి చెందిన అనేకమంది మహిళలు జమ్మూ కశ్మీర్ హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. అదే సమయంలో, జమ్మూ కశ్మీర్ పోలీసులు కుప్వారా సబ్-జడ్జి ముందు కేసు ముగింపు నివేదికను సమర్పించారు. అయితే, సబ్-జడ్జి మరింత లోతైన విచారణకు ఆదేశించారు. సైన్యం అభ్యంతరం వ్యక్తం చేయడంతో 2015లో హైకోర్టు ఈ ఆదేశంపై స్టే విధించింది. బాధితులకు పరిహారం చెల్లించాలన్న కమిషన్ ఆదేశాన్ని ప్రభుత్వం 2014లో సుప్రీంకోర్టులో సవాలు చేసింది.

“సైనిక సిబ్బంది చేసిన సామూహిక నేరాన్ని కప్పిపుచ్చడానికి డిజిపి ప్రయత్నించాడు” అని కమిషన్ ఆదేశంలో చెబితే, వైద్య పరీక్షలు “సామూహిక అత్యాచారం” వైపు మొగ్గు చూపాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ని తొలగించారు. ప్రస్తుతం ఈ కేసు అటు హైకోర్టులో గానీ, కుప్వారాలోని సబ్-జడ్జి వద్ద గానీ లేదా సుప్రీంకోర్టులో గానీ ఎటువంటి విచారణ లేకుండా పెండింగ్‌లోనే ఉండిపోయింది.

2024 సెప్టెంబర్ అవుట్‌లుక్ పత్రికలో “మనం మరిచిపోవద్దు” అనే శీర్షికతో ప్రధాన కథనంగా వచ్చింది.

https://www.outlookindia.com/national/in-kashmirs-kunan-poshpora-an-allegation-against-the-army-that-refuses-to-be-swept-away?fbclid=IwY2xjawQMEEpleHRuA2FlbQIxMABicmlkETI0OFN5bTd4M3FqcGFDU2xOc3J0YwZhcHBfaWQQMjIyMDM5MTc4ODIwMDg5MgABHmJbKD9QLe9d5trQeTTfRZOSwkfDHz9p9KXjxU8bEuDaC9KBuT8rM1Le2NcU_aem_wUSOCbrSDZtOf-X1tBpI1g

తెలుగు: పద్మ కొండిపర్తి

Leave a Reply