ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు న్యూఢిల్లీలో కృత్రిమ మేధ ప్రభావం పై అంతర్జాతీయ శిఖరాగ్ర సభ జరిగింది. ఈ సభలో 20 దేశాలకు చెందిన అగ్ర నేతలు, 60 దేశాలకు చెందిన మంత్రులు, వందమంది కంపెనీ సీఈఓ లు పాల్గొన్నారు. ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, “ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ అభివృద్ది, నైపుణ్యాల పెంపుదల, ఉద్యోగ కల్పన, నైతికత, విధాన రూపకల్పనలు చేయడంగా ప్రకటించబడింది”. కృత్రిమ మేధ అన్నది ఇప్పుడే పుట్టినది కాదు. 1950 లలోనే “డాక్ మౌత్” కంప్యూటర్ల తయారీ, వినియోగము, స్టోరేజీ, భాషల అనువాదం,హేతుబద్ద సమాధానాల రూపకల్పనలలో ఇంటర్నెట్ వాడకం నుంచే ఇది ప్రారంభం కాబడి నేడు అది విద్య, వైద్యం, వ్యవసాయం, సైనిక, పరిశోధన మొదలగు రంగాలలో విస్తరించడం జరిగింది. ఇప్పటికే అమెరికా, రష్యా, చైనా, ఇజ్రాయిల్ వంటి దేశాలు కృత్రిమ మేధతో లబ్ది పొందుతూనే, దానిని దుర్వినియోగం చేసి, వాటి బహుళ జాతి సంస్థలకు పెట్టుబడి లాభాలను, ఇతర దేశాలపై ఆక్రమణ చర్యలను చేపట్టడం జరిగింది. ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశాలు, చెందుతున్న దేశాలు ఒకవైపు కృత్రిమ మేధను పెట్టుబడి లాభాల కోసం రాజకీయ, సైనిక దురాక్రమణల కోసం వాడుకొంటూనే, మరోవైపు ఇటువంటి అంతర్జాతీయ శిఖరాగ్ర సభలలో చిలక పలుకులు పలకడం వారి ద్వంద్వనీతికి నిదర్శనంగా చెప్పవచ్చు.
ఇప్పటికే అమెరికా, రష్యా వంటి సామ్రాజవాద దేశాలు ప్రపంచంలోని ఇతర దేశాలను దోచుకోవడం కోసం ద్వైపాక్షిక యుద్దాలను ప్రోత్సహిస్తూ, ఆయుధ వ్యాపారం చేసుకోవడం, వాటి బహుళ జాతి సంస్థల ద్వారా లాభాలు సంపాదించడం కోసం కృత్రిమ మేధను ఉపయోగించుకోవడం జరుగుతున్నది. ఉదాహరణకి అమెరికా, రష్యాలు గతంలో ఆఫ్ఘనిస్తాన్ పై దాడి చేయడం, ఇప్పుడు పాలస్తీనా పై ఇజ్రాయిల్ దాడి చేయడం, ఉక్రేన్ పై రష్యా యుద్ధం చేయడం మొదలగునవి చెప్పుకోవచ్చు. వీటన్నింటిలో డ్రోన్ల, రోబోటిక్ ట్యాంకుల వినియోగము, రహస్య గూఢచర్యం, మాట వినని దేశాల అధినేతలను హత్యలు చేయడం జరిగింది. భారతదేశ పాలకులు దండకారణ్యంలోనూ, మధ్యభారతంలోనూ ఖనిజ సంపదను దేశ, విదేశ పెట్టుబడిదారులకు కట్టబెట్టడానికి గాను మావోయిస్టులను సాకుగా చూపించి, అక్కడ గల ఆదివాసులపై డ్రోన్ల సహాయంతో బాంబులను వేస్తూ, సైనిక దాడులను నిర్వహిస్తూ అమాయక ఆదివాసులపై మారణకాండను సాగిస్తున్నారు. పై దేశాల చర్యలు జెనీవా ఒప్పందానికి, అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు భిన్నంగా మానవ హక్కుల ఉల్లంఘనగా చెప్పుకోవచ్చు. అమెరికా సైనికులు వెనిజులా దేశ అధ్యక్షుని, అతని భార్యను కృత్రిమ మేధ సహాయంతో రహస్య గూడచర్యంతో అతని నివాసంపై సైనిక దాడి చేసి, ఆ ఇద్దరినీ అపహరించుకు పోయారు. ఇంతకన్నా కృత్రిమ మేధ దుర్వినియోగం ఉంటుందా? వీటన్నింటినీ చూసిన తర్వాత ఐక్యరాజ్యసమితి కృత్రిమ మేధ పై సరైన నియంత్రణ కావాలని బలంగా కోరుతుంది. లేదంటే భవిష్యత్తు యుద్ధాలు అమానవీయంగా మారి, అవి రోబోటిక్ యుద్దాలుగా మారిపోయి, అమాయక ప్రజల హననానికి దారి తీయవచ్చని హెచ్చరికలు జారీ చేస్తున్నది.
సైనిక, ఆర్థిక రంగాలలో కృత్రిమ మేధ దుర్వినియోగం ఇంత భయానకంగా ఒకవైపు ఉంటే, మరోవైపు విద్య, వైద్య రంగాలలో కూడా కృత్రిమ మేధ ఉపయోగం ఎంత ఉన్నదో, దుర్వినియోగం, దగా,మోసం అంతే జరుగుతున్నది. విద్యారంగంలో విద్యార్థుల, ఉపాధ్యాయుల డేటా సేకరణ దగ్గర నుంచి కృత్రిమ మేధ తప్పుడు, అసంపూర్ణ సమాచారం ద్వారా తీవ్ర సైబర్ నేరాలు జరుగుతున్నాయి. వైద్య రంగంలో డేటా లోపాలతో అనవసర వైద్య పరీక్షలు, చికిత్సలు మొదలగునవి కార్పొరేట్ మోసాలకు దారి తీస్తున్నాయి. ఇప్పుడు జరిగిన కృత్రిమ మేధ అంతర్జాతీయ శిఖరాగ్ర సభలో ఒక స్టాల్ నందు గల్గోటియస్ యూనివర్సిటీ కాపీ పేస్ట్ తో రోబో డాగ్ ప్రాజెక్ట్ ప్రదర్శన ఒక తాజా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా గతంలో బిల్ గేట్స్ ఫౌండేషన్ సంస్థ ఖమ్మంలోని గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల విద్యార్థులపై చేసిన ప్రయోగాలు వాటి విషమ ఫలితంగా ఆ పాఠశాల విద్యార్థినిల మరణాలు మరో ఉదాహరణగా చెప్పవచ్చు. ఇక భారత దేశంలోనే చాలా ప్రైవేటు విదేశీ విశ్వ విద్యాలయాలు కాపీ పేస్ట్ తో ఇంటర్నెట్ సమాచారాన్ని దొంగిలించి, ప్రాజెక్టులు తయారు చేసి, విద్యార్థులలో సృజనాత్మకత పెంపొందించడం పేరుతో అధిక ఫీజులు వసూలు చేసి, విద్యా వ్యాపారం చేసుకుంటున్నారు. వీటన్నింటిలో నైపుణ్యం పెంపుదల లేకపోగా నైతిక విలువలు ధ్వంసం కాబడుతున్నాయి. ఈ శిఖరాగ్ర సభలో కృత్రిమ మేధ అభివృద్ధి కోసం లక్షల కోట్లు పెట్టుబడులు ప్రకటించిన మైక్రోసాఫ్ట్, రిలయన్స్, ఆదాని కంపెనీలు అప్పుడే లాభాల వేటలో వ్యాపారాన్ని ప్రారంభించాయి.
అయితే పై విషయాలన్నీ కొత్తవి కావు, పాతవి కావు. భారతదేశ పాలకవర్గాలతో సహా ప్రపంచ పెట్టుబడి దారి దేశాల పాలకవర్గాలకు ఇవన్నీ తెలిసినవే. కానీ వారి అక్రమ సంపాదనలకు, అక్రమ సైనిక చర్యలకు, ఆయుధ వ్యాపారానికి ఒక మానవ ముఖం వారికి కావాలి. అలా కావాలంటే ఇటువంటి అంతర్జాతీయ శిఖరాగ్ర సభలు నిర్వహించి, ప్రచారం చేసి, ప్రజలను మభ్యపెట్టాలి. అంతే తప్ప ఇంతవరకు జరుగుతున్న, జరిగిన, కృత్రిమ మేధ దుర్వినియోగాన్ని అరికట్టడం కోసం వీరంతా కృషి చేస్తారని మనం భ్రమపడితే, అంతకన్నా తెలివి తక్కువతనం మరొకటి ఉండదు. అంతేగాకుండా భవిష్యత్తులో వీరు కృత్రిమ మేధను దుర్వినియోగం చేయరన్న గ్యారెంటీ కూడా ఏమీ ఉండదు. కావున ఈ కృత్రిమ మేధను ప్రజలు, ప్రజాస్వామికవాదులు ఉపయోగించుకుంటూనే, జరిగిన, జరుగుతున్న, జరగబోయే మోసాలను ప్రచారం చేస్తూ, కృత్రిమ మేధ పేరుతో పాలకవర్గాలు చేస్తున్న అక్రమ చర్యలకు వ్యతిరేకంగా పోరాడినప్పుడే, అది సరైన దారిలో సమాజ అభివృద్ధికి దోహదపడుతుందని ఆశిద్దాం.




