కవిత్వ రచనలో అనేక ప్రాపంచిక దృక్పథాలు ఉంటాయి. సృజనాత్మకత ఏదో ఒక దగ్గర స్థిరం కాదు. కవి చుట్టు పరిభ్రమిస్తున్న సామాజిక స్థితి యొక్క వ్యక్తీకరణ ప్రధానం. అనుసంధానం కూడా ప్రధానమైనదే. ప్రాంతం, సామాజికత లేదా ఇతర భిన్న రూపాలు కవిత్వంలో ఇమడవచ్చు. ఆ ఇమడిక లో సాంధ్రత ముఖ్యమైనది. ఒకానొక ప్రాంతానికి ప్రాతినిత్య కవి అనలేము. దృక్పథానికి సంబంధించిన భావజాలం. కవి పుట్టుక, కవిత్వ రచన ఏచలనం దగ్గర మొదలైంది. కేంద్ర స్థానాన్ని వెతకాలి. ఈ వెతకడంలో కవి అంత రంగం కనబడతుంది. కేవలం సంవేదన మాత్రమేనా? ఈ రసాయినిక ప్రక్రియ వెనుక దాగిన కల్లోలం ఏదో ఒక రూపంలో వ్యక్తమవుతుంది.

 సాధారణ మనుషులు తమ రోజు వారి జీవన శకలాలను సృజనాత్మకతలోకి తీసుకురాలేరు. కవితా హృదయం ఉన్నవారికి తన చుట్టూ ఉన్న ప్రపంచమంతా కవితామయంగా  కనబడుతుంది.పాయల మురళీ కృష్ణ వెతుకులాటకు ఈ కారణాలు ఉన్నాయి? పుట్టుక కారణంగా తన ప్రాంతపు ఉనికి ఉన్నదా.  కవి అయిన తండ్రి వారసత్వం వున్నదా. ఏ మార్గం కవిత్వ దారి చూపించింది..

 కవిత్వ రచనలలో అనేక దశలు ఉన్నాయి.సాధన  ద్వారా కవిత్వ నిర్మాణం అలవడదు. సాధారణ కవిత్వ నిర్మాణం నుండి పొందికైన కవిత్వ రచనలోకి వెళ్లేందుకు నిరంతర సాధన, అధ్యయనం తప్పనిసరి.  ప్రారంభానికి ముగింపుకు మధ్య కవి ఎంత మధనం కలిగి ఉన్నాడనేది కవి  కరణకు పునాది. ఆతలం దగ్గరే పాయల మురళీ కృష్ణ నలుదిక్కులా చూస్తున్నాడు.విశాలమైన  నయినపు వెలుగు ఎంత దూరం పోగలదు.

కవిత్వం ఊహాత్మక స్థితి కాదు. ఆనందకరమైన  వస్తువు కాదు. భావోద్వేగ, మానసికత నుండి స్పష్టమైన కార్యాచరణ వైపు మళ్లించే సాహిత్య ప్రక్రియ.అందుకనే కవిత్వ రచన, కవిత చదువుతున్న వ్యక్తుల భావోద్వేగ స్థితి  ఒకేలా ఉంటుంది.కవి ఏం చెబుతున్నాడు? అనే దానితో  శ్రోత మమేకం కావాలి. 

పరిభాషను కవి రూపొందించు కోవాలి. కేవలం అధ్యయనం ద్వారా కవులు తయారు కాలేరు. పరిశీలన,అనుభవం దగ్గర కవి నిలబడాలి.

పాయల మురళీకృష్ణ తాజా కవితా సంపుటి  ‘గచ్చెం సెట్టుకు అటు ఇటు’ ఒక కాలాన్ని, రెక్కల విరుగుతున్న చప్పుడును మనుషుల ఆర్తనాదాల వైపు నుండి కవిత్వం చేయాలనే నిపుణతను కవిత్వం ద్వారా సాధించాడు. ఎంచుకున్న కవిత్వ వస్తువు పట్ల ఉన్న అసంతృప్తి వెంటాడుతుంది. అలాగని కవిలో బాల్య స్మృతుల పరివేదన లేదు. మారుతున్న ప్రపంచాన్ని తానున్న రేఖనుండి అన్వేషిస్తున్న కవికి సాంస్కృతిక, రాజకీయ ప్రతిఫలనాలే అతని కవిత్వం. కేవలం దుఃఖము, నిరాశ,ధిక్కారము మాత్రమే కాదు. కవి పుట్టకముందు దిగంబర కవిత  బిచ్చగాళ్ళతో జరిగిన ఆవిష్కరణను వర్తమానం చేస్తున్నాడు. ఇక్కడ కవి గతంలో జీవిస్తున్నాడా అనే సందేహం రావచ్చు. గతం, వర్తమానం, భవిష్యత్తు కలగలసిన ఆవరణలో ఒక దేశం నడుస్తుంది. అలాంటి

భావన కలిగినప్పుడు ఆనాటి దిగంబరకవిత్వం ఇప్పటికి జీవించివుంది.సమాజావిష్కరణ ఇంకా అదే స్థితిలో కొనసాగుతుందని అర్థం.

మురళీకృష్ణ నిరంతర యాత్రికుడు. ఒక్కోసారి తన లోపలికి దారిచేసుకుంటారు. మరొకసారి భౌగోళికతవైపు యాత్ర సాగిస్తాడు.ఈ రెండు యాత్రల మధ్య ఆలోచన స్థిరంగా ఉంటుంది.కరచాలనంలో మనుషుల నిత్య సంఘర్షణ  వుంది.కవిత్వలో  మనుషులు మాత్రమే ఉండరు. మనిషిని జీవింపజేసే పకృతి పరచుకొని ఉంటుంది.గర  ‘గచ్చెం సెట్టుకు అటు ఇటు’  కవి సంవేదనలో కలగల్సిపోతుంది. ఈ సన్నివేశంలో నుండి తన చుట్టూ ఉన్న పరిసరాలను అంచనా వేస్తాడు.

పోస్ట్ మార్టం కట్టర్ చేతి వేళ్ళు. నగరాన్ని అద్దం చేసే  చేతులు. తుఫాను రాత్రి తాటాకు గుడిసె జీవన సమస్య. సల్లందు వేళకి కన్నీళ్లు దాటి పచ్చిమానికి వెళ్లిన మనిషి తిరిగి రాలేదు- మరణించిన సన్నివేశంలో మరోసారి సూర్యోదయం అయ్యింది. జాలరి, చేపలు పరాయి  రాష్ట్రంలో విగత జీవులుగా మారారు. ఈ దుఃఖం, పరివేదన కేవలం జాలరి కుటుంబానిదా! మురళీకృష్ణ మనుషుల జీవన చట్రం నుండి దూరం జరగలేదు. అనేకులు రంగుల రాట్నం లోని మనుషులలా మన ముందు క్షణకాలం ఉండి అదృశ్యం అవుతారు. మళ్లీ నూతన మనుషులు ఆవిర్భవిస్తారు

వలసదారులు, కార్మికులు మొత్తంగా శ్రామిక జీవితాన్ని స్థానీయత నుండి మురళి అన్వేషించారు. కవిత్వం అలవోకగా రాసే ప్రక్రియ కాదు. కవి అనేకుల దుఃఖ భారాన్ని భాగం చేసుకోవాలి. కేవలం కవి కృత్రిమంగా ఉన్నాడా లేదా అనేది అతని కవిత్వమే విడమర్చి చెబుతుంది. భిన్న సాంస్కృతిక పాయలలో భాగమైనాడు.మొట్టమొదటిది జీవన సంస్కృతి. తన బొడ్డుపేగుకు దూరం కాలేదు. ఒకానొక సంతలా మారుతున్న క్రమంలో, ప్రపంచం సంతగా మారిన సన్నివేశాన్ని సోమవారపు సంతలో కవి వెతుకుతున్నాడు.

కవిత్వం ఇంతకంటే ఏం చెబుతుంది? వస్తువు, శైలి శిల్పము ఏ తీరం దగ్గర దొరుకుతాయి. ముడి సరుకు జీవితమే. ‘గచ్చెం సెట్టుకు అటు ఇటు’ మనుషులు కూర్చుంటారా?

ఆడపిల్లలు శారీరక నిర్మాణంలో ప్రతి నెలసరిలోనూ ఒకటో రోజు నెత్తుటి మయిమయ్యే శరీరం  వాస్తవం. శరీర నిర్మాణంలో జరిగే సున్నితత్వాల మేళవింపులో కరుణ ప్రవహిస్తుంది. కరుణ ఒక్కోసారి భావోద్వేగమవుతుంది. ధిక్కారంతో పిడికెడు అక్షరాలతో బాధపడే ప్రపంచాన్ని కవి పరిచయం చేస్తున్నాడు. గచ్చెం సెట్టుపై చిలకలు, పావురాలు లేవు. స్మశాన నిశ్శబ్దం వంటి దేశం ఉంది. ఈ పరివేదన నుండి నూతన మానవుడు ఆకాంక్షల వైపు మురళీకృష్ణ నిలబడ్డాడు.

తనదైన కవిత్వ పరిభాష ఉత్తరాంధ్ర నుడికారం నుండి కొన్ని కవితలు రాసారు. భాష, శైలిలో నూతన అభి వ్యక్తి వుంది.గ్రామీణ జీవన సౌందర్యం సరే సరి. కవిగా రూపొందే క్రమంలో తన మార్గం తానే నిర్మించుకున్న పాయల మురళీ కృష్ణకు స్పష్టమైన రాజకీయ అవగాహన వుంది.

Leave a Reply