గీయ్యాల గాయమ్మ శోకం
కడుపుకోతకు తెలుస్తుంది
కన్నీళ్లతో భూతల్లి
పాదాలు తడుపుతూ మానవత్వం సిగ్గు పడిందంటూ
గుండెలు బాదుకుంది
కులం పేరుతో ఒకడు
మతం పేరుతో ఒకడు
అధికార ఆకలితో ఇంకొకడు
అందర్నీ ఆగం చేస్తుండ్రే గానీ..
ఆసరగా ఒక్కరు లేకపాయే
గా తల్లి బొడ్డు పేగు ఘోస
గాలకెందుకు దెలవకపాయే...
కులం పేరుతో కళ్లద్దాలు పెట్టుకున్న మీకు
తాగే నీరు పీల్చే గాలి నిలబడే నేల ఎపుడైనా
నువ్వు ఏ జాతివాడివని నిన్ను అడిగినాయా ?
నీ వర్ణం ఏదని నిన్ను ప్రశ్నిస్తాయా..!
అన్యం పుణ్యం తెలవని
గా బిడ్డా...
నీ కులానికి అడ్డయిందా
నీ వర్ణానికి వాదంగా మారిందా
అది బిడ్డారా... బిడ్డా..
అమ్మ తొమ్మిది మాసాలు మోస్తే
పుట్టింది కానీ
కులం పురిటి నొప్పులను తీసి కనలే
గీయ్యాల కుల వివక్ష
విషపు కోరలు చాచి
గాయమ్మ ముందే
పసికందును తొక్కి సంపిర్రు
కులం కసాయి కొడుకులు..




