హస్‌దేవ్ అరణ్య అటవీ ప్రాంతంలోని ఘట్‌బర్రా గ్రామ ప్రజలకు ఉన్న అటవీ హక్కులను రద్దు చేయడాన్ని సమర్థిస్తూ 2025 అక్టోబర్ 8న ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు నిజంగా ఒక న్యాయ అవహేళన. ఇది కేవలం ఒక తీర్పు కాదు; ఆదివాసులను మాట్లాడనీయకుండా చేసి, బొగ్గు మాఫియాలకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయం.

ఈ తీర్పు అటవీ హక్కుల చట్టం-2006 కింద ఇచ్చిన హక్కులను రద్దు చేయడమే కాకుండా, తరతరాలుగా ఈ అటవీ ప్రాంతాలను సంరక్షిస్తున్న ఆదివాసుల జీవనాధారాన్ని, గౌరవాన్ని కూడా ఆటపట్టిస్తోంది. అంతేకాదు, దీనివల్ల “అభివృద్ధి” అనే పేరుతో అడ్డూ అదుపూ లేకుండా  పరిశ్రమల విస్తరణకు అనుమతినిస్తోంది. భారతదేశ పాలకులు బొగ్గు గనుల తవ్వకాల పరిశ్రామాధిపతుల కోసం మానవ జీవితాలను, ప్రకృతి సంపదను త్యాగం చేస్తున్నారు అనే ఒక కఠినమైన జ్ఞాపకం.

ఆదివాసుల జీవితమూ, జీవనాధారంతో ఆటః

మీరు ప్రతిరోజూ ఆధారపడే మీ ఆహారం, మందులు, సంస్కృతి, గుర్తింపులకి ఆధారమూ అయిన మీ పూర్వీకుల భూమిమీద మీకున్న హక్కును అధికారులూ, న్యాయమూర్తులూ “ఇది తప్పుగా ఇచ్చిన హక్కు” అని ప్రకటిస్తే? ఒకసారి ఊహించండి. అదే పరిస్థితి ఇప్పుడు ఘట్‌బర్రా గ్రామ ఆదివాసులది. కేవలం బొగ్గు గనుల కోసం వారి అడవి, జీవనం, భవిష్యత్తు అన్నీ ఒక్కసారిగా సవాలుగా మారాయి.

వలస పాలన, ఆ తర్వాతి పాలకుల చేత దోపిడీకి గురైన భూములను తిరిగి పొందడానికి ఆదివాసీ సముదాయాల దీర్ఘకాల పోరాటాల ఫలితంగా రూపొందించిన చరిత్రాత్మక చట్టమైన  అటవీ హక్కుల చట్టం-2006 కింద 2013లో, ఘట్‌బర్రా గ్రామ ప్రజల సాముదాయిక అటవీ హక్కులను చట్టబద్ధంగా గుర్తించారు.. అయితే 2012లో అదానీ ఎంటర్‌ప్రైజెస్ కంపెనీకి చెందిన ఉపకంపెనీ నిర్వహిస్తున్న పార్సా ఈస్ట్- కేటే బాసెన్ బొగ్గు గనుల కోసం జరిగిన అటవీ మళ్లింపు జరిగిన తర్వాత ఆ హక్కులను ఇచ్చారు కాబట్టి వాటిని తీర్పు ఇచ్చిన మరునాటి నుంచి రద్దు చేస్తూ అవి “తప్పుగా మంజూరు అయ్యాయి” అని 2016లో జిల్లా స్థాయి కమిటీ చెప్పింది.

తరువాత, హైకోర్టు ఏకసభ్య న్యాయమూర్తి రాకేష్ మోహన్ పాండే ఇచ్చిన తీర్పు ఈ అన్యాయానికి ముద్ర వేసింది — “అసలు హక్కులను మంజూరు చేయడం ఆరంభం నుంచే చెల్లదు (“void ab initio”) అని ప్రకటిస్తూ, అమూల్యమైన వారసత్వానికి నగదు పరిహారం ఇవ్వమని సూచించింది. ఇది న్యాయం చేయడం కాదు — దోపిడీకి న్యాయరూపం ఇచ్చిన ఒక క్రీడ.

చట్టం ప్రకారం, ఏ హక్కులను రద్దు చేయాలన్నా స్థానిక గ్రామసభలతో సంప్రదించాలి; వాదనలు వినాలి. కానీ కమిటీ ఆ నియమాల్ని ఏ మాత్రం పట్టించుకోలేదు. హస్‌దేవ్ అరండ బచావ్ సంఘర్ష్ సమితి పిటిషన్ వేసి సరిగ్గా ఈ అంశాన్నే వాదించింది;  కమిటీకి తన స్వంత నిర్ణయాన్ని పునఃసమీక్షించడానికి అధికారం లేదు; గ్రామస్థులకి తమ వాదన చెప్పే అవకాశం ఇవ్వలేదు అని వాదించింది.

అయినా, కమిటీ వెనక్కు తగ్గిన తర్వాత, “సమాచారాన్ని దాచారు” అని ఆరోపిస్తూ వారి పిటిషన్ వేసే హక్కునే (లోకస్ స్టాండీ) కోర్టు తిరస్కరించింది. ఈ ఒక్క తీర్పుదెబ్బతో ఇప్పటికే పునరావాస భయంతో జీవిస్తున్న ఆదివాసీ సమాజం స్తబ్దమైపోయింది. ఈ ఆదివాసులు ఎవరూ కేవలం గణాంకాలు కాదు; తమ జీవనాధారమైన హస్‌దేవ్ అడవిలో తెందూ (బీడీ) ఆకులు ఏరుకునే వాళ్లు; మహువా పూలు సేకరించే వాళ్లు; అడవుల్లో సాంప్రదాయ పద్ధతిలో వ్యవసాయం చేసే కుటుంబాలు..

స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌కుండా హ‌క్కుల‌ను చేయడం అంటే ఆ జీవన బంధాన్ని తెంచేసినట్లే — వారిని పట్టణ పేదరికం లేదా దోపిడీకి గురయ్యే కూలి పనిలోకి నెట్టేయడమే. పవిత్రమైన అడవులను డబ్బుతో కొలవడం సవరణ కాదు — అది వలస పాలన కాలంనాటి దోపిడీకి న్యాయ వస్త్రం తొడిగిన కొత్త రూపం మాత్రమే; అక్కడ మనుషుల జీవితం కంటే లాభాల లెక్కలే పెద్దవిగా కనిపిస్తున్నాయి.

గతంలో 2012లో గని తవ్వకాల కోసం అటవీ ప్రాంత మళ్లింపు జరిగిందనే కారణంతో, ఘాట్‌బారా గ్రామస్తులకు 2013లో మంజూరు చేసిన సాముదాయిక అటవీ హక్కులను “మొదటి నుంచీ చెల్లనివి” గా 2025 అక్టోబర్ 8నాడు  ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు—ఒక ప్రమాదకరమైన పూర్వ-దృష్టాంత ఉదాహరణను (ప్రిసిడెంట్) నెలకొల్పింది. స్థానిక గ్రామసభల ద్వారా ఇప్పటికే పొందిన హక్కులను రద్దు చేస్తూ ఇచ్చిన ఈ తీర్పు చట్టానికి ఉన్న ముఖ్య ఉద్దేశాన్ని దెబ్బతీస్తుంది. వలసరాజ్యాల కాలం నాటి; తరువాతి విధానాల వల్ల జరిగిన చారిత్రక అన్యాయాలను సరిదిద్దడం; పిత్రార్జిత భూములు, అడవులపై ఆదివాసీ సముదాయాలకు రద్దు చేయలేని పట్టాలను ఇవ్వడం ఈ చట్టానికి ఉన్న ప్రధాన లక్ష్యం.

 “గనితవ్వకాల లేదా పారిశ్రామిక ప్రయోజనాలు సంఘర్షించినప్పుడు చట్టబద్ధమైన గుర్తింపులను మార్చడానికి వీలైన లోపాలుగా అర్థం చేసుకోవచ్చు” అని  “పొరపాటు” గురించి ఇచ్చిన  వివరణ స్థానికంగా ఉండే రక్షణ సదుపాయాల విస్తృత కోతకు దారితీయవచ్చు. స్థానిక ప్రజాస్వామిక గ్రామసభ ధృవీకరణ జరిగిన తరువాత జిల్లా కమిటీ ఆమోదం ద్వారా గుర్తింపును పొందాలని చట్టం నిర్దేశిస్తుంది. అంతకు ముందునుంచి ఉన్న గనుల తవ్వకం కోసం జరిగిన అటవీ మళ్లింపులు అటవీ హక్కుల చట్టం కల్పించిన హక్కులకన్నా మించినవని పేర్కొంటున్న ఈ తీర్పు అటవీ ప్రాంతంగా గుర్తింపు పొందిన తర్వాత కూడా తిరిగి పరిశీలించి రద్దు చేయడానికి అధికారాన్ని ఇస్తుంది. తరువాతి చట్టాల ఉద్దేశ్యం వలసకాలంనాటి అటవీ చట్టాలను రద్దు చేయడం కాబట్టి తార్కికంగా చూస్తే ఇది చట్టానికి ఉండే సర్వాధికారాన్ని తిరస్కరిస్తుంది.”

రాజ్యానికి ఖనిజ సంపదపైన ఉండే హక్కులకు ప్రాధాన్యతనిస్తూ, అటవీ హక్కులను రద్దు చేయడానికి ముందు తప్పనిసరిగా జరపాల్సిన  విచారణను చేయకపోవడంలాంటి విధానపరమైన లోపాలను పక్కకు పెట్టేయడం ద్వారా ఈ తీర్పు స్థానిక గ్రామసభలకు ఉండే అధికారాన్ని కూడా దెబ్బతీస్తుంది. పంచాయతీల (షెడ్యూల్డ్ ఏరియాలకు విస్తరణ) చట్టం- 1996; అటవీ హక్కుల చట్టాల కింద మంజూరు చేసిన అధికారాలను ఇది బలహీనపరుస్తుంది.

భవిష్యత్తులో హక్కుల గుర్తింపులు కూడా ఇదే విధమైన న్యాయపరమైన రద్దుకు గురయ్యే ప్రమాదం ఉంది. ఇది కార్పొరేట్‌తో ప్రభుత్వాలు చేసుకునే లాలూచీల మధ్యన హక్కుల గురించి మాట్లాడకపోవడం వల్ల సముదాయాలను నిరుత్సాహపరుస్తుంది. అంతర్జాతీయ స్థానిక హక్కుల ప్రమాణాలను ఉల్లంఘిస్తూ, వారి సమ్మతి లేకుండా సామూహిక నిర్వాసిత్వానికి దారితీయవచ్చు.

అంతేకాకుండా, ‘సున్నితమైన’ ప్రాంతాల్లో న్యాయపరంగా ‘తిరగవేసే’ ప్రమాదం ఉందని భయపడి అధికారులు పట్టాలను మంజూరు చేయడంలో వెనుకాడవచ్చు. ఇది చివరికి పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం చేకూరుస్తుంది; అదానీకి చెందిన పార్సా గనులలో చూసినట్లుగా, 2015 తర్వాత పున:కేటాయింపులు పరిశీలనను దాటవేసాయి. జాతీయ స్థాయిలో, ఈ తీర్పు భారతదేశంలోని పర్యావరణ లక్ష్యాలను విస్మరించి, పర్యావరణ పతనాన్ని వేగవంతం చేస్తూ జీవవైవిధ్య హాట్‌స్పాట్‌లలో బొగ్గు విస్తరణకు పచ్చ జెండా ఊపుతుంది.

హస్‌దేవ్ ఊపిరితిత్తుల బలి ః

హస్‌దేవ్ ఆరండ అనేది కేవలం ఒక అడవి మాత్రమే కాదు; ఇది భారతదేశంలో మిగిలి ఉన్న ప్రాచీన సాల్-ఆధిపత్య పర్యావరణ వ్యవస్థలలో ఒకటి. ఇది చిరుతపులులు, ఏనుగులు, హార్న్‌బిల్ పక్షులు, 200 కంటే ఎక్కువ ఔషధ మొక్కల జాతులతో నిండిన ఒక జీవవైవిధ్య హాట్‌స్పాట్. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ అంతటా 1.7 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ అడవి  కార్బన్‌ను నిల్వ చేస్తుంది; వర్షపాతాన్ని నియంత్రిస్తుంది; దిగువన ఉన్న లక్షలాది మందికి నీటిని శుద్ధి చేస్తుంది. అయినప్పటికీ, ఒక దశాబ్దానికి పైగా, బొగ్గు తవ్వకం ఈ పచ్చని కోటను కొంచెం కొంచెంగా కొల్లగొడుతోంది—పర్సా ప్రాజెక్ట్ మొదటి దశలోనే వేలాది హెక్టార్లను మళ్ళిస్తే, రెండవ దశకు 2022లోనే అనుమతి లభించింది.

అడవులను కేవలం స్థిరాస్తిగా పరిగణించే పూర్వ-ఉదాహరణలను ప్రతిధ్వనిస్తూ, అటవీ హక్కుల చట్టం కింద లభించిన హక్కులు “గనులు- ఖనిజాలపైన రాజ్యానికి ఉండే హక్కులను” అధిగమించలేవు అని కోర్టు చేస్తున్న తర్కం ఏమిటి. ఈ సంకుచితమైన దృష్టి తీవ్రమైన విధ్వంసాన్ని విస్మరిస్తోంది: యాసిడ్ గనుల నుండి వచ్చే కాలుష్యం నదులను విషపూరితం చేస్తుంది; ఆవాసాలను విచ్ఛిన్నం చేయడం జాతులను అంతరించిపోయేలా చేస్తుంది; అటవీ నిర్మూలన వల్ల ఇప్పటికే వరదలు, కరువులతో సతమతమవుతున్న ప్రాంతంలో వాతావరణ వినాశనాన్ని వేగవంతం చేస్తుంది.

ఇటువంటి దోపిడీని నిలిపివేయడమే 2014లో సుప్రీంకోర్టు చేసిన బొగ్గు కుంభకోణం రద్దుల ఉద్దేశ్యం.  కానీ 2015 బొగ్గు గనుల చట్టం దానిని తిరిగి బ్రతికించింది; పర్సా వంటి బ్లాకులను మళ్ళీ వారికే తిరిగి కేటాయించింది. హక్కుల రద్దును సమర్థించడం ద్వారా, హైకోర్టు తదుపరి చొరబాట్లకు పచ్చజెండాను చూపింది, తద్వారా హస్‌దేవ్ నాజూకైన జీవ వలయాన్ని వినాశనం చేసింది. ఈ రక్తపాతం లేకుండా పరిశుభ్రమైన శక్తిని, ఉద్యోగాలను పునరుత్పాదక ఇంధనాలు అందించగలిగేటప్పుడు, పాత తరం థర్మల్ ప్లాంట్‌లకు శక్తినిచ్చే బొగ్గు కోసం జీవవైవిధ్యాన్ని దహనం చేయడంలో “జాతీయ ప్రయోజనం” ఎక్కడ ఉంది?

అసలు విజేతలుః

ఉన్నది ఉన్నట్లుగా చూద్దాం. బొగ్గుకోసం నైతిక హద్దులను మరుగుపరిచే లక్ష్యాలు ఉన్న అదానీ గ్రూప్ వంటి పారిశ్రామికవేత్తలకు రాసిన ప్రేమలేఖ ఈ తీర్పు. న్యాయస్థానంలో జరిగిన ఆదివాసుల పోరాటం వృథా అవడంతో 2015 తర్వాత తిరిగి కేటాయించిన, ఒక దశాబ్దంగా మింగేస్తున్న పర్సా ప్రాజెక్ట్ మొదటి దశ పూర్తయింది. “బహుశా నష్ట పరిహారం ఇస్తామనే వాగ్దానాన్ని గుడ్డిగా నమ్మడం వల్ల అర్జీదారులు 2011–2012 అటవీమళ్లింపులకు ఇచ్చిన అనుమతులను అసలు సవాలు చేసి ఉండకపోవచ్చు” అని కోర్టు అన్నది.

ఇప్పుడు, రెండవ దశ జరుగుతున్న తరుణంలో, అటవీ హక్కుల నుండి వచ్చే ఏ అడ్డంకిని అయినా నగదుగా మార్చగలిగే ఒక “పొరపాటు”గా పరిగణించి పక్కన పెట్టారు. ఇది పర్యవేక్షణ లోపం కాదు; ఇది వ్యవస్థీకృత పక్షపాతం. కార్పొరేట్లకు ఎటువంటి శిక్ష లేకుండానే గనుల తవ్వకాల కోసం  అటవీ ప్రాంతాన్ని మళ్లింపు చేయించుకోవడానికి వ్యవహారాలు నడిపే వీలును కల్పిస్తూ కోల్ బేరింగ్ ఏరియాస్ చట్టం; గనులు- ఖనిజాల చట్టాలు  చాలా కాలంగా స్థానిక సముదాయాల రక్షణలను వెనుకకు నెట్టేసాయి. పర్యావరణ అనుమతులు మొదలుకొని రాజకీయ నిధుల వరకు అదానీ ముద్రలు ప్రతిచోటా కనిపిస్తాయి. అయినప్పటికీ న్యాయవ్యవస్థ తటస్థతను నటిస్తూ, వ్యాజ్యం దాఖలు చేసే హక్కు (లోకస్ స్టాండీ) లేదా సమయపాలన వంటి సాంకేతిక కారణాలు చూపించి సవాళ్లను కొట్టివేస్తోంది. నిజమైన పురోగతికి జవాబుదారీతనం అవసరం;  ఈ నాటకం కాదు. పారిశ్రామిక అభివృద్ధి దోపిడీకి మారుపేరు కాకూడదు; సముదాయాల అభివృద్ధికి తోడ్పడాలి తప్ప వారిని నాశనం చేయడానికి కాదు.

న్యాయాన్ని తిరిగి పొందడం ః

అక్టోబర్ 8న వచ్చిన ఈ తీర్పు చివరి ఓటమి కాదు, స్థానిక హక్కులు, పర్యావరణ పవిత్రతపైన జరిగిన ఈ క్రూరమైన దాడికి వ్యతిరేకంగా ఉన్నతమైన చర్యను చేపట్టడానికి ఒక  స్పష్టమైన పిలుపు .

ధృఢమైన ఘాట్‌బారా ప్రజలకు, హస్‌దేవ్ అరణ్య బచావో సంఘర్ష్ సమితికి, ఆదివాసీ సంరక్షకులందరికీ: ఈ పవిత్ర భూభాగాన్ని పరిరక్షించడంకోసం గతంలోనూ భారీ ఒత్తిళ్లను మీరు సుధృఢంగా ఎదుర్కొన్నారు. సాముదాయిక సమ్మతి, సమానత్వం అనే చట్టం ఇచ్చే ప్రధాన ఆదేశాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టుకు అప్పీల్ చేయాల్సిన సమయం వచ్చేసింది.

సుప్రీంకోర్టులో చేసే అప్పీల్‌లో ఆదివాసుల భూములను బదిలీ చేయలేని హక్కు  కోసం సమత (1997) కేసును ఉదహరించవచ్చు; నిబంధనల పాటింపును సమీక్షచేయాల్సిందిగా డిమాండ్ చేయవచ్చు. సమత కేసును ఉదహరిస్తూ ఆర్టికల్స్ 14, 21, 244 కింద రాజ్యాంగ విరుద్ధమని నొక్కి చెప్పాలి. రద్దులపైన తక్షణం తాత్కాలిక నిలిపివేతను (మరటోరియం) విధించాలని కోరాలి.

రద్దు చేయలేని హక్కులు, న్యాయ పరిరక్షణలు ఉండేలా పాలసీని రూపొందించే వాళ్ళు నిబంధనలను సవరించాలి. ప్రపంచ స్థాయిలో సంస్కరణ కోసం ప్రయత్నించేవాళ్లు కూడా ఒత్తిడి తీసుకురావచ్చు. ఒకవేళ అలా పర్యవేక్షణ లేకుండా ఈ “పొరపాటు” అనే అర్థాన్ని తీసుకుంటే, న్యాయం జరుగుతుందన్న ఆశే పోతుంది — సమానత్వం కంటే లాభాన్ని ముందుకు పెడుతుంది. కానీ ఇది ఇప్పుడు సవాలు చేస్తే సరిచేయగలిగే పొరపాటు.

ఈ అన్యాయాన్ని ప్రతిఘటించడం కోసం తప్పనిసరి సంప్రదింపులు, విచారణలు నిర్వహించడంలో విఫలమవడం వంటి ఉల్లంఘనలను బహిర్గతం చేస్తూ, ప్రజా ప్రయోజన పిటిషన్లను దాఖలు చేయడం ద్వారా సముదాయాలు, వారికి మద్దతునిచ్చేవారు జవాబుదారీతనం కోసం డిమాండ్ చేయాలి.

ఎందుకంటే పూర్వపు తీర్పులు ఆదివాసీ సమూహాలకు ఉన్న తిరస్కరణ హక్కును స్పష్టంగా గుర్తిస్తూ ఇంతకు ముందు వచ్చిన తీర్పులను ఉదహరిస్తూ “ఆరంభం నుంచే చెల్లదు” (వాయిడ్ యాబ్ ఇనీషియో) అనే వాదనపైన కోర్టు విచారణ జరిగేలా చూడాలి.

అదే సమయంలో, గ్రామస్థాయిలో ప్రజల సమీకరణ చేయడం చాలా ముఖ్యం —క్యాంపెయిన్ ఫర్ సర్వైవల్ అండ్ డిగ్నిటిలాంటి జాతీయ స్థాయి నెట్‌వర్క్‌‌లతో కలసి పనిచేయడం ద్వారా సత్యాగ్రహాలు, ‘చెట్లను కాపాడే ఉద్యమాలు’, అలాగే ‘మానవ హక్కుల ఉల్లంఘనల ఆధారాలు సేకరించడం’ వంటి కార్యక్రమాలు చేయవచ్చు. ఈ ఆధారాలను అంతర్జాతీయ సంస్థలకు ఇవ్వవచ్చు.

ఇదే విధంగా, అదానీ కంపెనీ కార్యకలాపాలపైన నిజ నిర్ధారణ బృందాలను పంపి, కార్పొరేట్ సహకారంతో జరిగే ఉల్లంఘనలను బయటపెట్టడం కూడా చాలా ముఖ్యం. ఆ నివేదికలను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు, పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖకు పంపించి, చట్టానికి విరుద్ధంగా గనుల తవ్వకాల కోసం ఇచ్చిన అనుమతులను రద్దు చేయమని కోరాలి. పాలసీ మార్పు గురించి పోరాడటం తర్వాతి లక్ష్యం. మైనింగ్ చట్టాలను సవరించి, చట్టం సర్వోన్నతం అని గుర్తించాలి; జీవ వైవిధ్య ప్రాంతాల్లో కొత్త బొగ్గు బ్లాకుల ఏర్పాటును ఆపాలి; స్థానిక ప్రజల అనుమతి లేకుండా ఏ ప్రాజెక్ట్ కూడా ప్రారంభం కాకుండా ఉండేలా చూడాలి.

పాలసీ నిర్ణయాలు చేసేవాళ్లు చట్టం ఇచ్చిన అసలు వాగ్దానాన్ని గౌరవించాలి — అంటే ఆదివాసుల హక్కులు, ప్రకృతి సమతూల్యతలను బొగ్గు తవ్వకాలవల్ల వచ్చే లాభాల కంటే ముందు ఉంచాలి. బొగ్గు నుంచి న్యాయమైన మార్పు సాధ్యమైనదే; అవసరమూ ఉంది; అందుకోసం పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టాలి; ఆదివాసుల అనుభవం, పరిజ్ఞానాన్ని వినియోగించాలి; అలాగే వారి జీవితాలను నాశనం చేయకుండా, మెరుగుపరచే స్థిరమైన ఉపాధి అవకాశాలను సృష్టించాలి. అదే విధంగా, స్వతంత్ర పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేసి, అటవీ హక్కుల అమలు సరిగ్గా జరుగుతోందా లేదా అని చూడాలి; చట్టానికి విరుద్ధంగా జరుగుతున్న అటవీ మార్పులను పూర్తిగా ఆపాలి; అన్ని నిబంధనలు పాటిస్తున్నట్టు నిర్ధారించిన తర్వాత మాత్రమే అవి కొనసాగాలి.

ప్రపంచ సమాజానికి ఒక స్పష్టమైన సందేశం — మానవ హక్కులను దెబ్బతీసే ప్రాజెక్టుల్లో పెట్టుబడులను ఉపసంహరించుకోవడం నైతికంగా చాలా అవసరం.

 “హస్‌దేవ్‌ను రక్షించుకుందాం”ఉద్యమాన్ని మరింత బలంగా వినిపించాలి; అలాగే భారత ప్రభుత్వం పర్యావరణ సంబంధిత సమావేశాల్లో పారదర్శకంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలి అని కోరాలి.

హస్దేవో ఒక అమూల్యమైన వారసత్వం, అది అమ్మకానికి ఉన్న వస్తువు కాదు.

దాన్ని కాపాడుతున్న ఆదివాసీ సమూహాలు మన భూమిని సంరక్షించే యోధులు — వారిని అడ్డంకులుగా కాకుండా మిత్రులుగా గుర్తించాలి. వారు న్యాయం కోసం చేస్తున్న పోరాటం కేవలం తమ కోసం కాదు —లాభాలకంటే మానవ గౌరవం, జీవ వైవిధ్యం,గొప్పవని చూపించే ప్రపంచం కోసం అవసరమైన పోరాటం.

https://www.downtoearth.org.in/governance/upholding-injustice-in-hasdeo-a-blow-to-tribal-survival-biodiversity-and-the-greater-good?fbclid=IwVERTSANjOOlleHRuA2FlbQIxMAABHgIA0S-PpR6CLDyWrs1f2IhPwsL-GQJp54nJiTTQSboC62qAEsoanxpBZ9cG_aem_nMYh6sGXGVdOkNJgHWdyQg&sfnsn=wiwspwa

Leave a Reply