అక్రమ కేసులో జైల్లో ఉన్న కేరళకు చెందిన రాజకీయ ఖైదీ రూపేష్ నవల ఖైదీల జ్ఞాపకాలు చదువుతున్నప్పుడు నెల్సన్ మండేలా ఆత్మకథలోని ఒక జైలు జ్ఞాపకం గుర్తొచ్చింది. పాతికేళ్ళకు పైగా జైలులో బందీగా ఉన్న మండేలా, దాస్ కాపిటల్ గ్రంథాన్ని జైలులోనే చదివాడు. జైలుకి వెళ్ళక ముందు మండేలా కేవలం కమ్యూనిస్ట్ మేనిఫెస్టో మాత్రమే చదివాడు. దాస్ కాపిటల్ జైలుకు చేరడం అనేది ఆసక్తికరమైన విషయం.
జైలు సూపరింటెండెంట్ అశ్లీల రచనలను లేదా హాస్య కథలను మాత్రమే లోపలికి అనుమతించేవాడు. అయితే, ఈ మధ్యలో ఎవరో ఇతర పుస్తకాలతో పాటు దాస్ కాపిటల్‌ను కూడా సూపరింటెండెంట్ ముందు ఉంచారు. సూపరింటెండెంట్ పుస్తకాన్ని అటూ ఇటూ చూశాడు. “అది డబ్బు సంపాదించే పుస్తకం కదా, పిల్లలు చదివి బాగుపడతారు” అనే అభిప్రాయంతో, దాస్ కాపిటల్‌ను జైలులోకి అనుమతించాడు. వాస్తవానికి, దాస్ కాపిటల్ అనే శీర్షికను చూసినప్పుడు ఒక సాధారణ మనిషికి అలా అనిపించడంలో ఆశ్చర్యమేమీ లేదు.
రూపేష్ నవలలో ఒక చోట చెప్పినట్లుగా, ప్రపంచవ్యాప్తంగా జైళ్ళను నిజానికి తిరుగుబాటుదారుల కోసమే నిర్మిస్తున్నారు. తిరుగుబాటుదారుల అంటే అంగీకరించనివారు; భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసేవారు కదా.
భిన్నాభిప్రాయాలంటే ప్రభుత్వాలు ఎప్పుడూ భయపడుతూనే ఉంటాయి. నిర్బంధం లేదా చంపేయడం ద్వారా తిరుగుబాటుదారుల సమస్యను పరిష్కరిస్తాయి. మండేలాను జైల్లో పెట్టిన ప్రభుత్వం, సిఐఎ సహాయంతో ఆఫ్రికన్ కమ్యూనిస్ట్ నాయకుడు క్రిస్ హానీని రహస్యంగా హత్య చేసింది. నిజానికి, ప్రభుత్వాలను నియంత్రించేవారు పిరికివారు. అందుకే వారు వ్యతిరేకతలను సైద్ధాంతికంగా ఎదుర్కోకుండా చంపేస్తున్నారు; జైల్లో పెడుతున్నారు. ధర్మరాజ్యం అనే పుస్తకాన్ని రాసినందుకే మొహమ్మద్ బషీర్‌ను ట్రావన్‌కోర్ ప్రభుత్వం జైలులో పెట్టింది. నిజానికి, ఆ రచనలో బషీర్ ధర్మం గురించి మాత్రమే చెబుతాడు. న్యాయం అంటే భయపడేవారు బషీర్‌లాంటి ఒక అమాయక రచయితను కూడా చూసి భయపడతారు.
జైలు ఒక ప్రత్యేకమైన జీవన వ్యవస్థను కలిగి ఉంటుంది అని రూపేష్ నవల చెబుతుంది. అది ఒక ఫ్యూడల్ కాలం నాటి గ్రామంలా మూసుకుపోయిన జీవన వ్యవస్థ. బయటి ప్రపంచంలో ఉన్న అన్ని మంచి-చెడులు లోపల కూడా జరుగుతున్నాయని నవల చదివే వారెవరికైనా సులభంగా అర్థమవుతుంది.
కథ చెప్పడం కోసం రూపేష్ ఒక ప్రసిద్ధ కవి జైలు జీవితాన్ని ఆవిష్కరిస్తాడు. జైలుకు వివిధ రకాలైన నేరస్థులు లేదా నిందితులు వస్తూంటారు. జీన్ జెనెట్ జైలులో ఉన్నప్పుడే రచయితగా మారాడు. షెనె ఫ్రాన్స్ ను గడగడలాడించిన దొంగ. జైలులో ఉండి జీన్ రాసిన రచనలను ప్రపంచం మొత్తం చదివింది. (ప్రఖ్యాత ఫ్రెంచ్ రచయిత జీన్ జెనెట్ (1910–1986), ఒకప్పుడు దొంగ, దేశదిమ్మరి, జైలులో తన రచనా జీవితాన్ని ప్రారంభించాడు. అతను 20వ శతాబ్దపు సాహిత్యంలో ప్రముఖ వ్యక్తి). ఆ రచనలను చదివే దార్శనికుడైన సార్త్రె ” షెనె” అనే లోతైన, సుదీర్ఘ పరిశోధనా గ్రంథాన్ని రాసాడు. ఆ గ్రంథంలో “నిజమైన దొంగ ఎవరు?” అనే ప్రశ్నను సార్త్రె ముందుకు తెస్తాడు.
రూపేష్ కూడా ఈ నవలలో నిజమైన దేశద్రోహి ఎవరు? అని ప్రశ్నిస్తున్నాడు.
ఒకవైపు రాజ్యమూ మరోవైపు ఇతరులూ నిలబడి ఉన్నారు. ఇతరులను ఎప్పుడైనా, ఎలాగైనా సృష్టించవచ్చు. పరాయి వ్యక్తిని/వ్యక్తులను శత్రువుల జాబితాలో చేర్చారు. అందువల్ల, ప్రభుత్వానికి అతన్ని/ఆమెను దొంగగా, దోపిడీదారుగా, దేశద్రోహిగా లేదా అపరిచితుడిగా మార్చి, ఒక వ్యక్తిత్వాన్ని ఏర్పరచడం కష్టమైన పనేమీ కాదు.
ముత్తంగ ఘటన తర్వాత జాను, గీతానందన్‌లను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించినట్లు వార్తలు వచ్చాయి. (2003 ఫిబ్రవరి 19నాడు కేరళలోని వయనాడ్ జిల్లాలోని ముతంగ అడవిలో ఆదివాసుల మీద తుపాకీ కాల్పుల జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం తమకు వాగ్దానం చేసిన భూమి కోసం పోరాడుతున్న ఆదివాసులు ఏర్పాటు చేసుకున్న గుడారాలు, గుడిసెలకు పోలీసులు నిప్పంటించారు. నేతృత్వం వహించిన జాను జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది; ఆమెపైన 75 కేసులను నమోదు చేసారు.) స్థానికులు అపరిచితులుగా మారుతున్నారనడానికి ఆ వార్తే చక్కటి నిదర్శనం. ఆ గడ్డలో పుట్టి పెరిగిన జాను పరాయిది, ప్రభుత్వానికి సాయపడే వాళ్ళు స్థానికులు! మండేలా ఆఫ్రికన్ దేశద్రోహి; ఆక్రమించిన శ్వేతజాతీయులు అక్కడి స్థానికులు!
రూపేష్ నవలలో, కవి, తత్వవేత్త మరియు సామాజిక విమర్శకుడు అయిన రచయితను ఉపా చట్టం కింద అరెస్టు చేసి జైలుకు తీసుకెళ్లడంతో కథ ప్రారంభమవుతుంది. సహజంగానే పేరున్న కవి జైలుకు వస్తే ఒకవైపు ఆదరణ మరోవైపు అపహాస్యం ఉంటుంది. పాఠకులు, అభిమానులు, స్నేహితులు ఆ కవికి అనేక రకాలుగా ఉత్తేజాన్ని కలిగిస్తారు. అదే సమయంలో, జైలు లోపల జరిగే సంఘటనలు ఎప్పటి లాగానే, వికారం కలిగిస్తాయి. రూసో చెప్పినట్లుగా, పుట్టినప్పుడు మనుషులందరూ మంచివాళ్ళే. అయినప్పటికీ, అనేక కారణాల వల్ల చెడు, హింసల వైపుకు నెట్టబడతారు. ఒక ప్రసిద్ధ రచయితకు అర్హమైన గుర్తింపు జైలు నుంచి, న్యాయమూర్తి నుంచి కూడా అనేక విధాలుగా లభిస్తుంది. ఇలాంటి పరిస్థితులలో తన రచనలకు లభించే గుర్తింపు ఒక రచయిత గర్వించదగిన సందర్భం.
నవలలో జైలులో ఉన్న రచయిత సచ్చిదానందన్ అని భావించడానికి చాలా అవకాశం ఉంది. కానీ ఈ కథ టెక్నో-పెట్టుబడిదారీ విధానం పరిపూర్ణతకు చేరుకున్న వర్తమాన కాలంలో జరుగుతోంది. ఏదేమైనా, నేడు భారతదేశంలో సచ్చిదానందన్ వంటి చాలా మంది వ్యక్తులు బలి అవుతున్నారు అనేది వాస్తవం. ఒక వ్యక్తిని ద్రోహిగా, దొంగగా లేదా దోపిడీదారుడిగా చిత్రీకరించి, అపఖ్యాతి పాలు చేయడం ప్రభుత్వానికి పెద్ద కష్టం కాదు. అయినప్పటికీ, కవి విచారణ ఎదుర్కొంటున్న పరిస్థితులు, అతనికి లభించిన బెయిల్ దృష్ట్యా చూస్తే, భారతదేశంలాంటి ప్రజాస్వామిక దేశంలో న్యాయ వ్యవస్థలోనే తప్పించుకోవడానికి అవకాశాలు ఉన్నాయని అర్థమవుతోంది.
ఒక వ్యక్తి బందీగా లేనప్పుడు, జైలు అనేది కేవలం ఒక రూపకం, ఒక కథనం మాత్రమే. కానీ అతను బందీగా ఉన్నప్పుడు, అది అతనికి ఒక నైతికతాకు సంబంధించిన విషయంగా మారుతుంది. అది అతని ఆత్మను తాకుతుంది. బషీర్ సెల్‌లోకి ప్రవేశించినప్పుడు, “ఇక నేను, అంతులేని ఒంటరితనమూ మాత్రమే మిగులుతాం” అని అంటాడు.
మార్క్సిస్ట్ ఆలోచనాపరుడు అయిన డగ్లస్ కెల్నర్ టెక్నో-కాపిటలిజాన్ని గురించి వివరించి కొన్ని దశాబ్దాలు గడిచాయి. అప్పుడు అది అర్థం చేసుకోలేని వారికి కూడా ఇప్పుడు సులభంగా అర్థమవుతుంది. కృత్రిమ జ్ఞానాన్ని (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఉపయోగించి ఏ పుస్తకాన్ని, ఏ సిద్ధాంత వ్యాసాన్ని అయినా చదివి వివరించగలిగే కాలం మన కళ్ళ ముందు ఉంది. ఇప్పుడు ఏ కంప్యూటర్‌లోకి అయినా చొచ్చుకుపోయి పదాలను నకలు చేయడానికి సాంకేతికత సహాయపడుతుంది.
ప్రభుత్వానికి మద్దతుదారులు అవసరం లేనంతగా సాంకేతిక పెట్టుబడిదారీ వ్యవస్థ పెరిగింది. ఒక వ్యక్తి రాసిన రాత మొత్తాన్ని చదివి, మీరు అడిగిన ప్రశ్నకు అనుగుణంగా అందులో హింస, కలహం, విప్లవం లేదా ప్రేమల గురించి వ్యాఖ్యానించగలిగే సామర్థ్యం కృత్రిమ జ్ఞానానికి ఉన్నది. అలాంటి యాప్‌లు ప్రతి చోటా అందుబాటులో ఉన్నాయి.
కృత్రిమ జ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి ఎలోన్ మస్క్ , జూకర్‌బర్గ్ , లారీ ఎల్లిసన్ వంటి వారంతా ఈ రోజుల్లో వందల కోట్ల డాలర్లు పెట్టుబడి పెడుతున్నారు. అమెరికాలో లేదా మరెక్కడైనా నివసించే మనుషుల ఆకలి, చికిత్స, పేదరికం, నిరాశ్రయత లేదా నిరుద్యోగం వంటివి వారిని కలవరపెట్టడం లేదు.
నేటి జాతి-రాజ్యాలు తమతో పాటు జాతీయ, జాతి ఆధారిత తీవ్ర మితవాద ఫాసిజం వైపుకు కదులుతున్నాయి. సాంకేతిక అభివృద్ధి ఫలితంగా లాభోత్పత్తి పదింతలు పెరిగినా, ఆ వ్యవస్థ ఇప్పటికీ కార్పొరేట్లు లాభపడటానికే తప్ప, శ్రమించే ప్రజలకు ఆ లాభంలో వాటాను పంపిణీ చేసే దిశగా మారలేదు.
రూపేష్ నవల వాస్తవికత, కల్పనల కలయికతో ఏర్పడిన ఒక కథనం. అందులో ప్రత్యేకంగా ముందుకు తెచ్చిన ఒక విషయం – ఒక వ్యక్తి స్వయంగా అనుభవించినప్పుడు మాత్రమే తెలుసుకోగలిగే మానసిక స్థితి. కుల వ్యవస్థను ప్రశ్నించే సందర్భంలో, కంచా ఐలయ్య) చాలా సంవత్సరాల క్రితమే ఇలా అన్నారు. అయితే, శాస్త్రీయ హేతుబద్ధతతో ‘అనుభవవాదం ‘ సరిపోదని ఆ సమయంలో ఒక వర్గం విమర్శ చేసింది. మార్క్సిజాన్ని అది ఆవిర్భవించిన దశలో సంకోచ దృష్టితో చదవడం వల్ల వచ్చిన విమర్శలు అవి. ఒంటరితనం, చిన్నచూపు, దూరం పెట్టడం వంటివి అనుభవించేవారికి మాత్రమే తెలుస్తుంది. స్త్రీలు, ట్రాన్స్ జెండర్లు మాట్లాడేది పురుషుడికి సులభంగా అర్థం కాకపోవచ్చు. స్త్రీలకు, ట్రాన్స్‌జెండర్‌లకు మధ్య తేడాను సులభంగా గుర్తించాల్సిన అవసరం పురుషులకు లేదు.
వ్యక్తి సారంశమూ, అతని అనుభవాలు కలిసిపోయే సందర్భాన్ని ఇందులో ప్రధానంగా ఆవిష్కరిస్తున్నారు.
జైలులో ఉన్న ఖైదీలు వాస్తవానికి వివిధ నేపథ్యాలు, తరగతులు, వృత్తులు, సమాజంలోని వివిధ సెక్షన్ల నుండి వచ్చినవారే. అందులో జైలు సిబ్బంది కూడా ఉంటారు. జైలులో బందీగా ఉన్న వ్యక్తి తన సామాజిక, ఆర్థిక స్థాయిని బట్టి అక్కడ ప్రతి సందర్భాన్ని అనుభవిస్తాడు.
ఈ నవలలోని కవి ఒక మధ్యతరగతికి చెందిన ప్రసిద్ధ వ్యక్తి. అతని రూప వివరణ, అతని మేధో, కవితా జీవితం పాఠకులను సచ్చిదానందన్ వైపు నడిపిస్తాయి. సచ్చిదానందన్ మాత్రమే కాదు, అలాంటి మరే ఇతర గౌరవనీయ వ్యక్తి అయినా ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకుంటే ఎలా ఉండచ్చు అనే వర్ణనను ఈ నవల ముందుకు తెస్తుంది.
ఏ చీకటిని అయినా వెలుగుగా మార్చేది రాయటం, చదవటం. జైలులో కూడా ఎప్పుడూ రచన, పఠనం జరిగాయి.
ప్రస్తుతం ఉన్న ప్రజాస్వామిక వ్యవస్థలో ఉన్న సాధ్యతలను కూడా చూపించే ఒక రచనగా నాకు ‘బందీల జ్ఞాపకాలు’ చదివినప్పుడు అనిపించింది.
రాయడాన్ని, చదవడాన్ని వదిలేసినప్పుడు మనం మన సామాజిక మార్పిడిని రద్దు కూడా చేస్తున్నామని గుర్తించాలి. ఎన్. గూగీ వా తియాంగో నుండి అంటోనియో గ్రామ్షి వరకు జైలులో కూర్చుని రాసిన రచనలు నేడు ప్రపంచవ్యాప్త పాఠక సమాజానికి అందుబాటులో ఉన్నాయి.
రూపేష్ నవల కూడా పీడీఎఫ్ రూపంలో ఇప్పుడు పాఠకులకు అందుబాటులో ఉంది. చదవడానికి, విమర్శించడానికి, స్థానం కల్పించడానికి ఈ నవలను ముద్రించి పంపిణీ చేయడానికి అధికారులు అంగీకరిస్తారనే ఆశతో ఈ నోట్‌ను ఇక్కడితో ముగిస్తున్నాను.
—-




